April 30, 2024

అంతిమం 4

రచన: రామా చంద్రమౌళి

ఏమీ అర్థం కాలేదు. అందరూ అమ్మా నాన్న ఇద్దరూ చచ్చిపోయారన్నారు.
ఎందుకు. . అనడిగింది. ఒక్కొక్కరిని. . అందరినీ. ఎక్కెక్కిపడి ఏడుస్తూ,
జవాబెవ్వరిస్తారు.
తర్వాత మిగిలింది ఒట్టి నిశ్శబ్దం. చుట్టూ అడవి.
అప్పుడొచ్చాడు భగత్ సన్యాల్ సార్ ఒక రాత్రి. వచ్చి నిద్రపోతున్న తనను తట్టి లేపి ఇక ‘నువ్వు నా వెంట రావమ్మా. నిన్ను నడిపించుకుని తీసుకుపోతా వెలుగులోకి ‘అని అన్నాడు.
ఏమీ అర్థం కాలేదు తనకు. కాని అతని వెనుక నడుస్తూ. . నడుస్తూ,
అప్పుడు సన్యాల్ సార్ తో మొదలైన నడక. . ఇక ఆగలేదు. . నడచి నడచి. . మనుషులు అందరూ ఒకటి కారనీ. . మనుషుల్లోనే పశువులూ, రాక్షసులూ ఉంటాయనీ. . ఈ ప్రపంచం బయటికి కనిపిస్తున్నట్టుగాక లోలోపల చాలా వికృతంగా ఉన్నదనీ. . ప్రపంచాన్ని తెలుసుకోడానికి చదువు అనేది ఒక్కటే ఏకైక సాధనమనీ గ్రహించి. ,
పుస్తక పుటలను సన్యాల్ సార్ నీడలో తెరుస్తూ వెళ్తున్నకొద్దీ. ,
స్పృహ. . ఎరుక. . మిథ్య. . నిజం. . భ్రమ. . వాస్తవం. . వ్యూహం. . నీతి. . నిజాయితి. . ధర్మం. . న్యాయం. . అంతిమంగా జీవితం.
తెలుసుకుంటున్నకొద్దీ భయం. . దాహం. . ధైర్యం. తెగింపు.
చివరికి వేటాడడమా. . వేటాడబడడమా. . అన్న అర్థ మీమాంస.
నా దేశం. . నా ప్రజలు. . అద్భుతమైన ప్రకృతి సంపదనూ, వనరులనూ, మానవ శక్తినీ ప్రసాదించి భగవంతుడు హాయిగా బ్రతకండని అప్పజెప్పితే. . ఈ దుర్మార్గులైనా మానవాధములు నా దేశాన్నీ. నా ప్రజలనూ ఎందుకిలా ‘హావ్స్ అండ్ హావ్ నాట్స్ ‘ గా విభజించి. . ఇంత వికృతంగా. ఇంత వినాశనకరంగా నిస్సిగ్గుగా ప్రవర్తిస్తున్నారు.
ఈ తరాన్ని నిప్పుతో కడిగి. . అగ్ని చికిత్సతో పునర్నిర్మాణం చేయడం తప్పితే వేరే ఏ మార్గమూ కనిపించడం లేదు.
చూపు విస్తృతమౌతున్న కొద్దీ దర్శనం విశాలమై. . నడక సాగుతున్నకొద్దీ బాటలు విశాలమై. . మనిషి మనిషి కలిసి నడిచి అడుగులేస్తున్న కొద్దీ ఉద్యమాలు మొగ్గతొడిగి. . అడవులు వికసించి. . మనుషులు ఆలోచనలతో సాయుధులై.
ఎవడు సాయుధుడు. . ఎవడు నిరాయుధుడు.
జీవించడానికి మరణించేవాడు. . మరణించి కూడా జీవించేవాడు.
ఆయుధం మనిషిని బ్రతికించేందుకా. . బ్రతుకులను హరిస్తున్న మనిషిని నిర్మూలించేందుకా.
ఏది హత్య. ఏది నిర్మూలన.
ఏది చంపుట. ఏది సంహరించుట.
మీమాంస. . విశ్లేషణ. . ధర్మ సూక్ష్మత. నిర్ణాయకత.
లోతులు. . ఇంకా ఇంకా లోలోతులు.
చుట్టూ ఉన్న సమాజం. . చుట్టూ కనబడకుండా అదృశ్యంగా ఉంటూ మనల్ని నియంత్రిస్తున్న. . వర్చువల్. . ఉండీ లేనట్టనిపించె సమాజం. . ప్రపంచం. . ఖండ ఖండాంతరాల పర్యంతం విస్తరించే వ్యాపార బాహువులు. ఎక్కడో మీట. . ఎక్కడో వెలిగే బల్బు. అన్నీ ఇన్విజిబుల్ మాయలు.
కనబడేవి మాత్రమే సత్యం కాదనీ. . కనబడనివే చాలా వరకు నిజాలనీ. . కనబడకుండా కబళిస్తున్న శక్తులను పసిగడ్తూ. ,
పదేళ్ళు. . సన్యాల్ సార్ ఒడిలో. తుపాకితో పరిచయం.
భయపడడం. . భయపెట్టడం గురించిన మీమాంస.
ఈ మానవ మృగాలు బీభత్సకరంగా విహారం చేస్తున్న వర్తమానంలో. . ప్రేమించడంకంటే భయపెట్టి సాధించేదే ఎక్కువని తెలుసుకుని. ,
దాడి. . ప్రతి దాడి. వ్యూహం. . ప్రతి వ్యూహం.
రాజకీయాలకు ప్రతిగా ప్రజాసంఘాల నిర్మాణం. దోపిడీకి ప్రతిగా ప్రతిఘటన. అణచివేతకు ప్రతిగా తిరుగుబాటు. . ప్రశ్న.
రాజ్య హింసకు బదులు ప్రతిహింస.
రెడ్ కారిడార్లు. . గ్రీన్ హంట్లు.
సల్వా జుడుంలు. . మహేంద్ర కర్మలు. . రమణ్ సింగులు. . విల్లమ్ములు. . ఎ కె ఫార్టీ సెవెన్ లు. జల్లెడపట్టే ఆదివాసీ డేగ కళ్ళూ. బైనాక్యులర్లకు కనిపించని చక్కున వచ్చి దిగే విషపు బాణం.
కన్నీళ్ళకు జవాబు తుపాకి గుండు కాదు. . అనునయించి తలనిమిరే తల్లి చేయి.
వెదుకులాట. వెదుకులాట.
దళం. . అడవి దారుల్లో, వెన్నెల రాత్రుల్లో. . చెట్లతో మాట్లాడుతూ. . పక్షులను పలకరిస్తూ.
నిరంతర యానం. రక్తాలోడే పాదాలు. నెత్తురు చిమ్మే చాచిన చేతులు.
అమరుల స్మృతి గీతాలు. రగిల్చే అగ్ని నినాదాలు.
కార్యకర్త. . ఉప దళపతి. . డిప్యుటీ కమాండర్. సైనికుడు సైన్యాధిపతై. . బాధ్యత. . నాయకత్వం. మండలం. . జిల్లా. . ప్రాంతం.
వకుళ అంటే ఆడ పులి. గురికి తిరుగులేదు. వ్యూహానికి ఓటమి లేదు.
వకుళ దళం అంటే హడల్. . పోలీస్ లకు. కోవర్ట్ లకు. ఇంటి దొంగలకు. ద్రోహులకు.
కాని. , ఎక్కడో ఒక రిట్రీట్.
రెండడుగులు వెనక్కి. . పదడుగులు మున్ముందుకు అని పైనుండి జవాబు.
అసలు వెనుకడుగెందుకు. . అని ప్రశ్న.
చెప్పింది చెయ్. . ప్రశ్నలొద్దు. . అని జవాబు.
సిద్దాంతపరమైన విభేదాలు.
వ్యుహాల్లో విభేదాలు. పంథాలో విభేదాలు. ఆలోచనల్లో విభేదాలు.
నిధుల సమీకరణలో విభేదాలు.
సన్యాల్ సార్ నిర్యాణం.
ఒంటరి. . ఒంటరి గమనం. ఒంటరి మథనం. ఏదో వెలితి.
అంతర్గత దాడులు. లోపలకూడా పతనమైపోతున్న విలువలు. చిన్నా పెద్దా క్రమశిక్షణలేని అరాచకత్వం. . అత్యాచారాలు. . ఎవరు కోవర్ట్ లో ఎవరు సిన్సియరో తోచని, పసిగట్టలేని దుస్థితి.
ఆదివాసీ పైకి ఆదివాసితోనే దాడి చేయించే నీచ వ్యూహాలు.
గుప్తత. . బాహ్యత.
అడవులనుండి ప్రజల్లోకి వెళ్తే. . అని ఒక పునరాలోచన.
ఆయుధాన్ని వదిలి ఆలోచనలనే ఆయుధాలను చేసి ఈ యువతరాన్ని సాయుధుల్ని చేస్తే. . అని ఒక పునర్విమర్శ. ఆత్మసమీక్ష.
ప్రజలలో. . ప్రజలతో. . అని ఒక క్రొంగొత్త భావన.
ఇన్నేళ్ళ అతి దీర్ఘకాలిక పోరాటం తర్వాతకూడా ఇంకా ఫలితాలు అందడంలేదంటే. . పంథాలోనే ఏదైనా లోపముందా అన్న ఆత్మావలోకన.
అకౌంటబిలిటీ. . ఆధిపత్యాలు. . అంతర్ఘర్షణలు. నాయకత్వ లోపాలు. లోపిస్తున్న ఉన్నతస్థాయి నియంత్రణ. . మార్గదర్శనం చేయగల చేవలేనితనం.
చీకట్లు ముసురుతున్నాయా.
ముఖ్యులలో పునఃసమీక్ష జరుగుతోందా.
ముందుకు దూసుకుపోలేనప్పుడు. . ఆగి తనలోకి తాను చూచుకోవాలా, ?
ఆ ఆత్మానుశీలనలోనే,
బావిలో పడ్డ పాతవస్తువులను వెదుక్కుంటున్నట్టు,
లోపల ఓ పాతాళగరిగే. లోతుల్లో అడుగును దేవుతూ, గాలిస్తూ, ఒంటినిండా కొక్కేలతో శోధిస్తూ,
అడవుల్లో డంప్ లు. . రహస్య నిక్షిప్తాలు. . నిధుల దాచివేతలు. ఒకరిద్దరికి మాత్రమే తెలిసిన స్థావరాలు. అక్కడ పెద్ద మొత్తాల్లో నిధులు. . ఆయుధాలు. . కీలక పత్రాలు. డాక్యుమెంట్లు.
చాలా సందర్భాల్లో తనుకూడా డంప్ ల స్థల ఎంపిక. . వాటి నిర్వహణ. . కాపలా. . సరియైన సమయంలో వెలికితీత. డంప్ ను మరిచిపోయినపుడు. . ఒక్కోసారి పొరపాటున స్థలాన్ని మరిచిపోయి గుర్తించలేనపుడు. . లేదా కోవర్ట్ లు శతృవుతో కుమ్మక్కయి డంప్ లను కోల్పోయినపుడు. . తెలుసు తనకు అన్ని రకాల ద్రోహ విద్రోహ చర్యలు. అజ్ఞాత ఉద్యమ నిర్మాణ నిర్వహణల్లోని సాధక బాధకాలన్నింటినీ స్వయంగా చూచి, అనుభవించి. . కాని,
వకుళకు ఎందుకో దుఃఖం ముంచుకొచ్చింది.
పుట్టినప్పటినుండి ఇప్పటిదాకా అడవినే తల్లికంటే ఎక్కువ ప్రేమించిన తను. . ఎనిమిదేండ్ల వరకే తనకు తల్లి తెలుసు. కాని అడవి మాత్రం ఈ తన ఇరవై నాలుగేళ్ళూ తెలుసు.
అటువంటి తనను అగ్ర నాయకత్వం ఈరోజు తప్పుబట్టి, దోషిగా నిలబెట్టి, గాయపర్చి. ,
వెళ్ళిపోవడమా. ? అసత్య ఆరోపణలపై అవమానాలను భరిస్తూ కొనసాగడమా. ?
తన తలపై పదిహేను లక్షల రూపాయల రివార్డ్.
పైన పన్నెండు కేసులు. . మూడు రాష్ట్రాల్లో.
బయట గొళ్ళెం చప్పుడయింది.
వకుళ లేచి తలుపిలు తెరిచింది.
కమలమ్మ.
ఆమె వస్తూ వస్తూనే “లోకం పూర్తిగా చెడిపోయిందమ్మా. పాపం బుచ్చమ్మ చచ్చిపోయే ముందు తన దగ్గరున్న రెండు తులాల బంగారాన్ని ఇద్దరు బిడ్డలకిచ్చిందట. ఐతే దాన్ని చెరి సమానంగా ఇవ్వలేదని ఒక బిడ్డ అలిగి తల్లి చచ్చిపోయినా చూడ్డానికి రాలేదు. ఇంత కర్కశమా. ఛీ ఛీ”
లోపలికి వెళ్ళిపోతూ,
మళ్ళీ వెనక్కి వచ్చి ముందున్న బుక్స్ ర్యాక్ లోనుండి ఒక పుస్తకాన్ని తీసి వకుళ చేతిలో పెట్టి” దీన్ని చూస్తూండు ఈ లోపల. నేను స్నానం చేసొస్తా”అని వెళ్ళిపోయింది.
వకుళ జాగ్రత్తగా పుస్తకాన్ని చూచింది.
‘మనకు తెలియని మన చరిత్ర-తెలంగాణా రైతాంగ పోరాటంలో స్త్రీలు-ఒక సజీవ చరిత్ర ‘
కె. లలిత, వసంత కణ్ణబిరాన్, రమా మేల్కోటే, ఉమామహేశ్వరి, సూసీతారూ, వీణా శత్రుఘ్న, ఎం. రత్నమాల.
వీళ్ళందరూ 1886 లో తెలంగాణా ప్రాంతమంతా విస్తృతంగా పర్యటించి అనేకమంది వీర వనితలతో ముఖాముఖి ముచ్చటించి సమీకరించిన ఒక డాక్యుమెంట్. అనేకమంది చదువు కూడా రాని స్త్రీ ఉద్యమకారులతో సంభాషించి టేప్ చేసిన మాటలను అక్షరబద్ధం చేసిన అద్భుత గ్రంథమది. స్త్రీ శక్తి సంఘటన ఈ చారిత్రాత్మక కార్యాన్ని నిర్వహించి ఒక సజీవ పోరాట నేపథ్యాన్ని భావి తరాలకోసం క్షిప్తం చేసింది.
పేజీలను తిరగేస్తోంది వకుళ. . ఆసక్తిగా.
చాకలి ఐలమ్మ, నానబాల సోమక్క, కూనూరు అచ్చమాంబ, ప్రమీలా తాయి, కమలమ్మ, మోటూరి ఉదయం, ఆరుట్ల కమల, కాట్రగడ్డ హనుమాయమ్మ, మల్లు స్వరాజ్యం, కొండపల్లి కోటేశ్వరమ్మ, నామాల లక్ష్మమ్మ, పొన్నవ సాలమ్మ. ఇలా ఎందరో.
చకచకా. . ‘కమలమ్మ ‘అని ఉన్న 14వ పేజీని తీసింది వకుళ.
కమలమ్మ ఫోటో.
పులకించిపోయింది. ఇప్పుడీ మనిషి లోపలుంది. లోపల స్నానం చేస్తోంది. వస్తుందిప్పుడు తన ముందుకు. ఒకప్పటి చారిత్రాత్మక తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న వీర వనిత ఇప్పుడు తనతో. . తనామె ఇంట్లో. ,
ఉక్కిరిబిక్కిరైపోతోందామె.
చదవడం ప్రారంభించింది. అక్షరాల వెంట చూపులు సూర్యుని వెంట కిరణాలవలె.
తనది. . ఒక అతి సాధారణ బీద కట్టుబానిస కుటుంబం. మానుకోత తాలుకా మైనాల గ్రామం. చిన్న పిల్లప్పుడే తుపాకి పట్టుకుని భర్త అప్పన్న తోపాటు కమ్యూనిస్ట్ సాయుధ పోరాటంలో పాల్గొని. . పిల్లలు. ,
ఒక ఘటన చెప్పింది ఒకచోట. . హృదయ విదారకమైంది.
మద్దికాయల ఓంకార్ దళ నాయకత్వం. కమలమ్మ భర్త అప్పన్న మరో దళ నాయకత్వంలో వేరే ఎక్కడో. కమలమ్మ అజ్ఞాతం లోపలే కొడుకును ప్రసవించి. . అసలు నిండు గర్భవతి తుపాకి మోస్తూ సాయుధ పోరాటంలో పాల్గొనడమే ఒళ్ళు గగుర్పొడిచే ఘటన. పసిపిల్లవాడి ప్రసవం. పిల్లాడిని తీసుకుని దళ సంచారం. అడవిలో. . చెట్లలో. . తుప్పల్లో తుమ్మల్లో. చంకలో ఇటు తుపాకి అటు బాబు. దృశ్యం ఎంత విదారకమో.
ఒకరోజు ఏరియా కమిటీ సమావేశమైన తర్వాత దళ నాయకుడన్నాడట. . “కమలమ్మా. . ఆరునెల్ల పిల్లగాడు ఏడ్వకుంట ఉండడు. మన దళంల అసలే పెద్ద పెద్ద నాయకులంత ఉన్నరు. ఎక్కడన్న పోలీస్ ఎంకౌంటరైనప్పుడు గనుక వీడేడిస్తే అందరం చచ్చిపోతం. అందుకని ఈ పిల్లగాణ్ణి ఎవలకన్న ఇచ్చెయ్. లేదా నువ్వన్న సివిల్ లైఫ్ లకుపోయి పిల్లగాన్ని సాదుకో. కాని బయట పోలీస్ నిఘా ఎక్కువుంది. . నీ ఇష్టం”అన్నరట.
రోషం గల కమలమ్మ మరునాడు ఒక కామ్రేడ్ ను వెంటపట్టుకుని దగ్గర్లో ఉన్న గార్ల అన్న గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక బొగ్గు బాయిలో పనిచేసే ఒక కార్మికుడికి తన ఆరు నెలల పిల్లాడిని గుండెలు పగులుతున్న దుఃఖంతో అప్పగించి తిరిగి తుపాకి పట్టి ఉద్యమంలోకెళ్ళి తన దళ కామ్రేడ్స్ ను కలుసుకుంది.
వకుళకు ఎందుకో దుఃఖం పొంగి వచ్చింది. వింటానికి ఓ కథలా అనిపించే ఈ డాక్యుమెంటెడ్ చరిత్ర. . ఏమిటిది. ఎలా సాధ్యమైందిది.
తర్వాత కమలమ్మ తన ఇంటర్వ్యూ ను కొనసాగిస్తూ అంది”ఈ రోజుకు ముప్పయ్యారు సంవత్సరాలైంది నా కొడుకును కోల్పోయి. . మళ్ళీ దొరుకలే. కడుపుల సముద్రమంత దుఃఖాన్ని దాచుకుని బతుకుతాన. . అమ్మా. . ”
తన ఉద్యమ జీవితం జ్ఞప్తికొచ్చింది వకుళకు.
అడవుల్లో కొత్తగా ఆయుధ శిక్షణ పొందుతున్నపుడు. . ట్రైనర్ బూటుకాళ్ళతో తొక్కినపుడు, మోచేతులపై ఒక ఫర్లాంగ్ దూరం ప్రాక్కుంటూ వెళ్తూంటే మోకాళ్ళు రక్కుకుపోయి రక్తాలు కారి రాత్రంతా సలిపినపుడు, ఎంకౌంటర్ జరిగితే. . మాక్ శిక్షణలో. . ఎక్కడివాళ్ళక్కడ కకావికలై చెల్లాచెదరై పరుగెత్తే క్రమంలో ఏ బొందలోనో జారిపడి గాయాలపాలైనపుడు. . సాటి గాయపడ్డ కామ్రేడ్స్ ను రక్షించే శిక్షణలో మనిషిని అమాంతం మోయడం. . పరుగు, చెట్లెక్కడం. . ఊడలు పట్టుకుని జారడం. . ఇవన్నీ తలుచుకుంటే. . కన్నీళ్ళే.
అజ్ఞాతంలో ఇంతవరకు కనీసం ఓ పదిసార్లయినా పోలీసులకు చిక్కి ఉండి ఉంటది తను. దొరికిన ప్రతిసారీ. . ఒక చిత్ర హింస.
చాలా మందికి తెలియని విషయమేమిటంటే. . ప్రతి పొలీస్ స్టేషన్ లోనూ, లేక యాంటీ నక్సలైట్ల స్క్వాడ్ లోనూ సహజంగానే షాడిస్ట్ లైన వ్యక్తులుంటారు. వాళ్ళు ఎదుటి మనిషిని కౄరంగా హింసిస్తూ పొందే పైశాచికానండం ఘోరంగా ఉంటుంది.
గోళ్ళలో గుండుసూదులు గుచ్చడం. . ముడ్డిలో రూళ్ళ కర్రలను గుచ్చడం. . రెండు చేతులను తాళ్ళతో కట్టి వ్రేలాడదీసి విపరీతంగా తమ కుతిదీరా కొట్టడం. . ఎవని ఉచ్చను వానితోనే తాగించడం. . ఇలా ఎన్ని హేయమైన వికృత చర్యలో. ఆడవాళ్ళనైతే ఏ కాస్త అందంగా ఉన్నా రాక్షసంగా అనుభవించడమే ఒకరి తర్వాత ఒకడు.
తను పట్టుబడ్డ ప్రతిసారీ బ్రూటల్గా రేప్ చేయబడ్డది అనేకసార్లు. ఒక్కోసారి వరుసగా ఇద్దరు ముగ్గురు.
ఒక్కోసారి అనిపించేది. . ఇంతకూ ఎందుకిదంతా. . అని.
కాని లోపల. . ఉద్యమం. . ఉద్యమం. . దళ నాయకుడు తరగతుల్లో బోధించే అగ్నిస్పర్శ వంటి సిద్దంతాలు. . దేశం. . పీడితులు. . ఉద్ధరణ. . దీనజన సంరక్షణ. ఇవీ.
కాలం మారుతోంది. . 1940 లలో నిజాం ఫ్యూడల్ హింసను ప్రతిఘటిస్తూ మొదలై, లక్షల ఎకరాల భూములను నిజాం తాబేదారుల కబంధ హస్తాలనుండి విడిపించడం కోసం. . ఒక్క మాటలో భూమికోసం. . భుక్తి కోసం. . పీడిత జన విముక్తి కోసం సాగిన చారిత్రాత్మక తెలంగాణా రైతాంగ సాయుధపోరాటం లో అప్పుడు కమలమ్మ. . 1952 తర్వాత స్వాతంత్ర్య సంప్రాప్తి అంతా ఒట్టి బూటకమని తేలిపోయిన తర్వాత సూడో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాగుతూ నక్సల్బరీ నుండి మొదలై తూర్పు, దక్షిన మధ్య భారతమంతా వ్యాపించిన రెడ్ కారిడార్లో జల్ జంగల్ జమీన్ పోరాటాలన్నీ మళ్ళీ మరో స్వతంత్ర ఉద్యమాలే. ఈ ఉద్యమంలో ఆధునిక విప్లవకారిణిగా తను. . వకుళ.
అప్పుడు కమలమ్మ. ఇప్పుడు వకుళ.
ఇద్దరూ రెండు పీడిత తరాలకు ప్రతినిధులు.
గుణాత్మకంగా ఈ భారత సమాజంలో అధిక సంఖ్యాకులైన పేద గ్రామీణ ప్రజల జీవితాల్లో వచ్చిన శ్లాఘనీయమైన మార్పేమిటి.
మార్పే లేదు.
బహుముఖ దిశల్లో క్షీణిస్తూ భ్రష్టుపట్టి పోయిన వ్యవస్థకు ఒక మేజర్ ఆపరేషన్ ద్వారా శస్త్ర చికిత్సను జరిపితే తప్ప ఈ దేశ పరిస్థితి బాగుపడేట్టు లేదు.
ఐతే ఎవరు జరపాలి ఈ మేజర్ ఆపరేషన్ ను. ఎప్పుడు. . ఎక్కడ. ఎలా. ?
ఇదే ప్రశ్న. జవాబు లేని, జవాబు తెలియని ప్రశ్న.
వ్యాసం చదవడం ఐపోయింది. మొత్తం పన్నెండు పేజీల వ్యాసమది. దాంతో కమలమ్మ గారి స్థూల రూపం, వ్యక్తిత్వం అవగతమైపోయింది. ఆమెపట్ల ఆమెకే అర్థంకాని సమున్నతమైన గౌరవ భావం స్థిరపడిపోయింది.
అలికిడై. . కమలమ్మ నడుచుకుంటూ వచ్చి వకుళ ఎదుట ఫేము కుర్చీలో కూర్చుండిపోయింది. అప్పుడే స్నానం చేయడం వల్ల ఆమె అప్పుడే తుడిచిన అద్దంలా శుభ్రంగా ఉంది. వయసు తెచ్చిన నిండుతనంకు హృదయ నిర్మలత్వంకూడా తోడై ఆమెలో ఒక అవ్యక్త కాంతి విరజిమ్ముతోంది.
వకుళ కాస్సేపు అవాక్కయి ఆమె దిక్కే పారవశ్యంతో చూస్తూ ఉండిపోయి తనను తాను మరచిపోయింది. ఈమేనా అరవై ఏళ్ళక్రితం వీరోచితంగా ఒక చేతిలో తుపాకీని అటు చంకలో ఆరునెళ్ళ పిల్లాడిని ధరించి రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న ధీర వనిత. ?
“బిడ్డా. “అంది కమలమ్మ.
ఏమైందో ఏమోగాని అకస్మాత్తుగా వకుళ ఎక్కెక్కిపడి ఏడుస్తూ లేచివచ్చి కమలమ్మ పాదాలపై పడి. . కన్నీరై. ,
“ఏమైందమ్మా. . లే. . బిడ్డా. వకుళా. . కంట్రోల్ యువర్ సెల్ఫ్. ”
“నేను అదృష్టవంతురాలినమ్మా. . చాలా యాదృచ్ఛికంగా నేను మీకు ఈరోజు ఇలా కలుసుకోవడం నా సుకృతం. ఈ మీ బయోగ్రాఫికల్ ఇంటర్వ్యూ చదివి మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఒకటే తేడా , అనాడు దోపిడీ చేసిన వాళ్ళు పరాయిలు. ఇప్పుడు దోపిడీ చేస్తున్నవాళ్ళు మాత్రం మనవాళ్ళే. ”
“లే బిడ్డా. . “అని వకుళను భుజాలు పట్టుకుని లేబట్టి,
“నిన్ను విందామనుకుంటున్నాను వకుళా నేను. చెబుతావా సంక్షిప్తంగా నీ కభ్యంతరం లేకపోతే. ” అంది కమలమ్మ.
“నాది చత్తీస్ గడ్ రాష్ట్రమమ్మా. దంతేవార జిల్లా. కుమ్మరి కులం మాది. చాలా వెనుకబడ్డ ప్రాంతం. చుట్టూ సున్నపురాయి గుట్టలుండేవి. అందువల్ల మా ఊరంతా ఒక పెట్టుబడిదారుడైన వ్యక్తి నడుపుతున్న సున్నపు భట్టీలలోనే పనిచేస్తూ బతికేది. . . ” చెప్పుకుపోతోంది వకుళ.
అదొక హృదయ వినిమయ కార్యం.
కొద్దిసేపైన తర్వాత ఇద్దరూ తమను తాము ఒకేజాతి బాధితవర్గ స్త్రీలుగా తెలుసుకున్నారు. ఇక మిగిలిన సామ్యాలన్నీ ఒకేరకమైనవి. మూలాలు ఒకటే. కష్టాలూ కన్నీళ్ళూ ఒకటే. అందువల్ల ప్రతిఘటనా ఒకటే.
అడవీ ఒకటే. . అది బస్తర్ కావచ్చు. . సూర్యపేట కావచ్చు. ఆయుధమూ ఒకటే. అది . 303 కావచ్చు. . ఎ కె 47 కావచ్చు. శతృవూ ఒకడే. వాడు నైజాం కావచ్చు, బస్తర్ లో పవర్ ప్లాంట్ నిర్మించే కాంట్రాక్టర్ కావచ్చు.
రాత్రి పది దాటింది.
బయట గొళ్ళెం చప్పుడైతే అంతరాయం కలిగి ధ్యాన భంగమైనట్టు. ,
“ఎవరూ”అంది కమలమ్మ.
“నేనమ్మా. . గోపాల్ ను”
“దా నాయనా. నెట్టు. తీసే ఉంది. ”
లోపలికొచ్చారు ఇద్దరూ.
“ఏమిటీ చాలా సీరియస్ గా ఉన్నారిద్దరూ”అంటూ తన చేతిలోని రెండు ప్యాకెట్లను ప్రక్కనున్న టేబుల్ పై పెట్టాడు గోపాల్.
గాంధీ మౌనంగానే వచ్చి ఓ కుర్చీలో కూర్చున్నాడు.
“వకుళా మన గాంధీ లో ఎంత మార్పొచ్చిందంటే. . తెలుగు మనకంటే అతనే తొందరగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు”
వకుళ అప్పుడుగానీ గాంధీ దిక్కు చూడలేదు. కొత్త బట్టల్లో గాంధీ నిండుగా, హుందాగా ఉన్నాడు. మనిషిలో తన సహజమైన అంతర్ముఖత్వం కూడా అతనిలో ద్యోతకమౌతోంది.
“గాంధీ. . వరంగల్ ఎట్లా ఉంది నీకు”
“ఇటీజ్ సింప్లీ ఎ బ్యూటిఫుల్ సిటీ. నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకో ఇక్కడి జనం కూడా నాకు బాగా నచ్చారు. దె ఆర్ సింపుల్ అండ్ లవ్వబుల్”
“ఉహు”
“వరంగల్లంతా చూపించావా ఈయనకు గోపాల్”అంది కమలమ్మ కల్పించుకుంటూ.
కమలమ్మ గాంధీ గురించి ఇప్పటిదాకా వకుళ ద్వారా విన్నది కాబట్టీ ఆ పరిశీలనాత్మక కోణంలో గమనిస్తోందతన్ని.
ఆమెకు గాంధీ ఏ లోపమూలేని సాధారణ వ్యక్తి వలెనే కనిపిస్తున్నాడు చురుగ్గా, హుషారుగా. అతని ముఖంలో ఒక గుప్తమైన వర్చస్సు తొణికిసలాడుతూండడం గమనించిందామె.
“నేను ముఖం కడుక్కోవాలి. . బాత్ రూం. . “అని గోపాల్ దిక్కు చూశాడు గాంధీ.
“రా. . ఇటు. . “అని గోపాల్ గాంధీని అటుదిక్కు తీసుకుపోయి. ,
గాంధీ వెళ్ళగానే వకుళ చాలా ఆతురతగా గోపాల్ ను అడిగింది. “సాయంత్రానికీ ఇప్పటికీ ఏమైనా గణనీయమైన మార్పొచ్చిందా గోపాల్. . గాంధీలో”అని.
“నేనుకూడా అదే కోణంలో తన గతానికి సంబంధించిన ఐదారు ప్రశ్నలనడిగాను. కాని. . తనకుతాను ఏదో తన్నుకులాడుతూ ఇబ్బంది పడుతున్నాడు. మొత్తంమీద చాలా వేగవంతమైన రెకవరీ మాత్రం జరుగుతోంది. ”
“ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టం వకుళా. ఈ భార్గవ గాంధీ ఒక అసాధారణ ప్రజ్ఞాశాలి. డాక్టర్ నారాయణ చెప్పినట్టు గాంధీ ఈ రెండుమూడు రోజుల్లో పూర్తిగా తన మెమొరీని తిరిగిపొంది తనను తాను కొత్త వ్యక్తిగా ఆవిష్కరించుకుంటాడు. మనం అస్సలే వర్రీ కావలసిన అవసరం లేదు. ”
“అన్నా. . ఒక విషయం చెప్పాలి నేను నీకు గాంధీ రాక ముందే. కమలమ్మ గారికి అంతా స్పష్టంగా చెప్పానిప్పుడే. రేపు నాకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తో గారితో అపాయింట్మెంట్ ఉంది. వెళ్ళాలి. అక్కడి పరిస్థితిని బట్టి నేను వెంటనే రావడమో. . ఒకటి రెండు రోజులు డిటైన్ కావడమో జరుగొచ్చు. చెప్పలేం. నేను లేనప్పుడు గాంధీని నువ్వే జాగ్రత్తగా చూసుకో. డబ్బు కావలిస్తే ఇస్తాను రేపుదయం. ”
“ఎస్ పి గారితో అపాయింట్మెంట్ ఏమిటి నీకు. ఎందుకు. ఎనీ ప్రాబ్లం” అన్నాడు గోపాల్ ఖంగారుగా.
“సమస్య ఏమీ లేదు గోపాల్. నేను చెపుతా అన్నీ రేపు వివరంగా. నువ్వయితే రేపు గాంధీని ఎంగేజ్ చెయ్యి. అంతే”అంది కమలమ్మ ఒక మతలబు ఉందన్న ధ్వనితో.
అర్థమైంది గోపాల్ కు.
“ఇప్పుడు మనం భోజనం చేద్దాం. మొన్ననే కొత్తగా మన పోచమ్మ మైదాన్ లో పడ్డ గ్రీన్ పార్క్ బిర్యానీ హౌజ్ లో తెచ్చిన చికెన్ బిర్యానీ”
“నీకు నేను చాలా ఋణపడి ఉంటాను గోపాల్. ఈ ఊరికి రాగానే దేవుడు స్వంత అన్నకంటే ఎక్కువగా చూసుకునే నిన్ను పంపించాడు నాకోసం”అంది వకుళ ఆర్ద్రంగా. ఆమెకా క్షణం ఒకవేళ ఈ గోపాలే తటస్థ పడకుండా ఉంటే ఎలా ఉండేదో అని ఆలోచించి హడలిపోయింది.
“ఐనా ఇట్ల జరుగవలసి ఉంటే అట్లెందుకు జరుగుతది. ఇట్సాల్ రైట్. “అని నవ్వుతూ గోపాల్ టేబుల్ పై అన్నీ సర్దడంలో మునిగి పోయాడు. కమలమ్మ లేచి వంటగదిలోనుండి పళ్ళేలు తెస్తోంది.
గాంధీ వచ్చి మౌనంగానే కూర్చున్నాడు.
“ఔను గోపాల్. . తిరువనంతపురం ఇక్కడినుండి ఎంత దూరం” అనడిగాడు గాంధీ బిర్యానీ కలుపుకుంటూ.
“తిరువనంతపురమా. . ఎందుకు”
“అదేకదా మా ఊరు. వెళ్ళాలి. ఎంతదూరం”
“మీ ఊరు తిరువనంతపురమా”
“ఔను”
“కేరళ స్టేట్ గదా”
“ఔను కేరళే”
ఈ సంభాషణను వింటున్న వకుళకు మతిపోతోంది.
బాత్ రూంకు వెళ్ళొచ్చిన గాంధీ సడెన్ గా ఈ మంచి మార్పుతో రావదం అందరినీ ఆశ్చర్యపరిచింది.
“గాంధీ. . “అని ఎదో అనబోయింది వకుళ. ఇంతలోనే సున్నితంగానే అడ్డుకుంటూ,
“నాట్ గాంధీ. . మిస్టర్ భార్గవ గాంధీ”అన్నాడు సవరిస్తూ.
“ఓ. . మిస్టర్ భార్గవ గాంధీ. . మీది తిరువనంతపురమా”అంది వకుళ నెమ్మదిగా.
“ఔను. . తిరువనంతపురమే. ది కాపిటల్ సిటీ ఆఫ్ కేరళ”
అతనిలో ఏదో మార్పు చాలా స్పష్టంగా కనబడుతోంది. గతం తాలూకు జ్ఞాపకాల ఛాయలు ముఖంపై నీడల్లా కదలాడుతున్నాయి. మస్తిష్కంలో ఏదో ఒక తీవ్రమైన అలజడీ, కల్లోలం తీవ్రంగా ఉధృతమౌతున్న కవళికలు అతని కళ్ళలో. ,
“మీరక్కడ ఏం చేస్తూంటారు”
“ఐయాం ఎ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అండ్ ఆల్సో ఎ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ”
“ఎక్కడ”
“ఎట్ తిరుచురాపల్లి . . అండ్ ఆల్సో ఎట్ న్యుయార్క్”
“మీరు ఇండియాకు ఎప్పుడొచ్చారు”
“జస్ట్. . ఫైవ్ డేస్ బ్యాక్. ఇక్కడ ఒక సీక్రెట్ డీల్ మీద నేను ఇండియా వచ్చాను”
వకుళ ఖంగు తిన్నది.
సీక్రెట్ అంటున్నాడు. కొంపతీసి మనం అన్నీ అడుగుతూ పోతే అవి ఏమన్నా చెబుతాడేమో. అసలే మానసిక స్థితి నిలకడగా లేదు.
“మీరిప్పుడెక్కడున్నారు మిస్టర్ భార్గవ గాంధీ. . ”
“ఐ నొ. దిసీజ్ వరంగల్”
“ఎందుకొచ్చారు మీరిక్కడికి”
“నాకు జ్ఞాపకం రావడం లేదు. . ఎందుకు. . వై. . “కాస్త ఇబ్బందిగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు.
వకుళకు ఇబ్బందనిపించింది. బాగా స్ట్రెయిన్ చేస్తే మళ్ళీ ఏమైనా సమస్యలొస్తాయో ఏమో.
గోపాల్ అడిగాడు”తిరువనంతపురం తో మీకేమిటి సంబంధం. “అని.
“తిరువనంతపురం మా నేటివ్ ప్లేస్. నేను అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే చదువుకున్నాను. మా తండ్రిగారు తిరువనంతపురం అనంతశయన పద్మనాభస్వామి దివ్య దేవాలయం ప్రధాన అర్చకులు”
“ఓ” అని వకుళ గోపాల్ దిక్కు ఇక ప్రశ్నలను ఆపమని సైగ చేసింది.
వకుళకు చాలా సంతోషం కలిగింది గాంధీ జ్ఞాపక శక్తికూడా వచ్చి మామూలు మనిషై తన దారిన తను వెళ్ళిపోగల స్థితికి వస్తున్నందుకు.
అందరూ ఒక పావుగంటసేపు దాదాపు నిశ్శబ్దంగానే ఉండి. . ఎవరి ఆలోచనల్లో వారు,
సరిగ్గా అప్పుడు మ్రోగింది వకుళ మొబైల్ ఫోన్.
వకుళకు ఎవరు ఫోన్ చేస్తారబ్బా. . అని గోపాల్ అనుకుంటూండగా. ,
వకుళకు మాత్రం అర్థమైంది ఆ ఫోన్ ఎవరిదో. డి ఎస్ పీ ఇంటెలిజెన్స్. . ఆనందరావ్ అయ్యుంటాడు అనుకుంది.
“హలో”అంది హుందాగా.
ఆమె అనుకున్నట్టు ఆనందరావే.
“మీరు రేపెప్పుడు వస్తున్నారు. . ఎక్కడికొస్తారు”
“ఆల్రెడీ ఐ టోల్డ్ ఎస్పీ. ఐ విల్ డైరెక్ట్ లీ కం టు ఎస్పీస్ ఆఫీస్ టుమారో షార్ప్ ఎట్ టెన్ ఎ ఎం. ”
“థాంక్యూ మేడం”
“సర్. మీరు రేపు నేను లొంగిపోతున్నపుడు ప్రెస్ అండ్ మీడియాను పిలుస్తున్నారుగదా. ”
“యస్ మేడం”
“థాంక్యూ”
అవతలినుండి ఫోన్ కట్ ఐపోయింది.
మళ్ళీ నిశ్శబ్దం.
ఈ లొంగిపోవడమేమిటి. . ఎస్పి ఎందుకు. . అసలు ఈ వకుళ ఎవరు.
నిజానికి ఈ గాంధీ ఎవరు.
. . ఆలోచిస్తున్నాడు గోపాల్.
బయట వర్షం ప్రారంభమైంది.
అద్భుతమైన మట్టి పరిమళం.

* * *

కమలమ్మ చాలా చింతాక్రాంతయైచూస్తోంది.
అమె మనసు పొయ్యిమీదున్న గిన్నెలో మరుగుతున్న నీళ్ళలా ఉంది.
మనిషి తను విశ్వసించిన ఒక నిర్మాణాత్మక కార్యక్రమం నుండి విరమించుకోవలసిరావడం నిజంగా ఎంతో దుఃఖదాయక సందర్భమే. అప్పటి అంతర్గత క్షోభ ఎలా ఉంటుందో తెలుసామెకు.
ఆమెకు అక్టోబర్ 21, 1951 జ్ఞాపకమొచ్చింది.
తన భర్త అప్పన్న, మద్దికాయల ఓంకార్, ముత్రాసి ఈరమ్మ, కోయ వెంకటమ్మ. . ఇంకో పదిమందిదాక ఉన్నరేమో డెన్ల.
ఒకదిక్కు యూనియన్ సైన్యాలు గల్లీ గల్లీ గాలించి రజాకర్లనూ, కమ్యూనిస్ట్ లనూ వేటాడి పట్టుకుంటోంది. జైళ్ళు నిండుతానై. అటు పార్టీల చర్చ జరుగుతాంది. పోరాటం కొనసాగించాలా. . విరమించాలా. . అని.
మాలాంటి ఆడోళ్ళకుగాని, బాటం లెవెల్ యోధులకుగానీ పోరాటం కొనసాగించాలనే ఉన్నది.
అప్పటికే నల్లగొండ, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్. . జిల్లాలల్ల మొత్తం దాదాపు లక్ష ఎకరాల భూమి విముక్తమైంది.
కాని. . సెంట్రల్ నాయకత్వం బొంబాయిల సమావేశమై. . ‘తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట విరమణ ‘కే నిర్ణయించింది.
వార్త వినగానే బోరున ఏడ్చింది తను ఓ పావుగంటసేపు.
కామ్రేడ్సందరూ తమ ఇండ్లల్ల ఎవరో చచ్చిపోయినంత దుఃఖపడ్డరు.
విరమణ. . అన్న పదం వింటేనే కమలమ్మకు అసహ్యం.
మనిషికి ఒక బృహత్ కార్యక్రమ నిర్వహణలో విరామమేగాని విరమణ ఉండొద్దని ఆమె నిశ్చితాభిప్రాయం.
బయట వేపచేట్టు గాలి చల్లగా వీస్తూ. ,
గంటక్రితమే వకుళ వెళ్ళిపోయింది ఒక్కతే. . సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ కు.
వకుళది కూడా తన అప్పటి యుద్ధ విరమణ సందర్భమే. అందుకే ఆమెకు చాలా దుఃఖంగా ఉంది.
ఎదురుగా అటు గాంధీ ఇటు గోపాల్ కూర్చున్నారు.
వాళ్ళకు వకుళ ఎందుకు వెళ్ళిందో చెప్పలేదు కమలమ్మ.
గాంధీ చెప్పుకు వెళ్తున్నాడు యధాలాపంగా.
“నా బాల్యమంతా మా తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయ ప్రాంగణం లోపలే గడిచింది. ఉదయం లేవగానే నాన్నగారితో కోనేటిలోకి వెళ్ళి స్నానం. మంత్రోచ్ఛారణతో ఒక పవిత్రానుభూతి. నాన్నవెంట ఆలయంలోకి నడక. . గర్భగుడిలో దేవుడికి అలంకరణ. . పాత ఆచ్ఛాదనను తొలగించి మళ్ళీ నూతన వస్త్రాలంకరణ. హారతి. . కర్పూరం. . జేగంటలు. . సాంబ్రాణి పొగల పరిమళం.
స్కూల్ టైం కాగానే పరుగు. ,
గోపాల్ వింటున్నాడు. . ఈ రెండురోజుల్లో ఎంత మార్పొచ్చింది గాంధీలో అని ఆశ్చర్యపోతూ. . గాంధీ ముఖంలోకి చూస్తూ.
“ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పాలె గోపాల్. . అనంతశయన పద్మనాభస్వామి ఆలయం అనేది ప్రపంచంలో ఉన్న 108 విష్ణు దివ్య దేవాలయాలలో ఒకటి. 1556 లో మహారాజా ఆఫ్ ట్రావెన్ కోర్ ట్రస్ట్ దీని నిర్మాణాన్ని ద్రవెడియన్ ఆర్కిటెక్చర్ సంప్రదాయంలో పాండ్య శిల్ప శైలితో వంద ఫీట్ల ఎత్తూ, ఏడు అంతస్తులుగల గాలిగోపురంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడింది.
శేషతల్పంపై సుఖశయన భంగిమలో ఉన్న విష్ణుమూర్తి పూర్ణస్వర్ణ ఫీట్ల విగ్రహం ప్రపంచంలో ఎక్కడాలేని మహాద్భుత వర్చస్సుతో నిరంతరం విరాజిళ్ళుతుంటుందిక్కడ. ఆ దివ్య మంగళ దేవతామూర్తి శోభను చూస్తూ ఎన్నిసార్లు, ఎన్నెన్ని గంటలు నేను అలా అప్రతిభున్నై ఉండిపోయానో నాకే తెలియదు.
పూర్వీకులు దీంట్లో మొత్తం ఆరు విశాలమైన గదుల్లో. . అంటే వాల్ట్ లు అన్నమాట. . వాటిలో అపారమైన సంపదను బంగారు ఆభరణాలు, నాణేలు, వజ్రాలు, వైడూర్యాలు. . ఈ రూపంలో దాచి ఉంచారు. ఈ శతాబ్దాల చరిత్రలో ఎందరెందరో ట్రావెన్ కోర్ రాజులు మారినా ఎవ్వరూ ఈ రహస్య నిధుల దిక్కు కన్నెత్తి చూచిన దాఖలాలే లేవు. ఐతే టి. పి. సౌందర రాజన్ అనే ఒక న్యాయవాది ఈ రహస్య సంపద దుర్వినియోగమౌతున్నదని సుప్రీం కోర్ట్ లో ఒక పిటిషన్ వేయడం ద్వారా. . ప్రపంచదృష్టి ఈ సంపదపై పడింది.
మనిషి జీవితంలో తర్కానికీ, విశ్వాసానికీ పొంతన కుదరని కొన్ని చిత్రమైన పరిస్థితులెదురౌతాయి అప్పుడప్పుడు. ఇప్పుడదే జరుగుతోంది అక్కడ. న్యాయస్థాన పర్యవేక్షణలో ఈ రహస్య నిధుల వెలికితీత జరిగి. ,
ఇప్పటికి ప్రపంచం లోనే అతి ధనవంతమైన దేవునిగా. . అంటే ఇప్పటిదాకా లెక్క దొరికినంతవరకు దాదాపు 32000 కోట్ల రూపాయల సంపదతో అనంతశయనుడు అగ్రభాగంలో ఉన్నట్టు చెబుతున్నారు. ఇంకా ఆరవ గదిని తెరవాల్సి ఉంది.
ఐతే ఇక్కడ ఒక విశేషముంది. ఈ సంపదనంతా విష్ణుమూర్తియొక్క ఒక అంగమైన శేషువే స్వయంగా రక్షిస్తుంటాడని ప్రతీతి. అతి పురాతన భారతీయ తంత్ర శాస్త్ర ప్రకారం దుర్భేధ్యమైన నాగబంధ రక్షణలో ఈ సంపదంతా శాశ్వతంగా ఉంటుందని చాలా మంది విద్యావంతులుకూడా నమ్ముతారు. . “చెప్పుకుపోతున్నాడు గాంధీ. అతనొక ట్రాన్స్ లో ఉన్న మనిషిలా అతీత స్థితిలో మగ్నమై ఉన్నాడు.
కమలమ్మకు కూడా గాంధీ చెబుతున్నది ఆసక్తికరంగానే ఉంది. కాని ఆమెకు మాత్రమే తెలిసిన వకుళ యుక్క ‘పోలీసులకు లొంగుబాటు ‘సంగతి ఆమెను కలవర పరుస్తోంది. వార్తకోసం ఎదురుచూస్తోంది. . ఏం జరుగుతుందా అని. అందుకే టి వి ని ఆన్ చేసి ఎన్ టివి చానెల్ ను పరిశీలనగా గమనిస్తోంది. మీడియా సమక్షం లోనె ఈ లొంగుబాటు జరగాలని వకుళ భావించింది. ఎందుకంటే ‘పోలీస్ ‘అనే జీవిని ఈ సమాజంలో ఎవరూ నమ్మే పరిస్థితి లేదు.
‘ఇక గాంధీ దాదాపు పూర్తిగా కోలుకున్నట్టే’ అని అనుకున్నాడు గోపాల్ అతను చెబుతున్న గొప్ప చారిత్రాత్మక విశేషాల పరంపర వింటూ.

antimam

సరిగ్గా. . ఆ క్షణం. . ఆన్ని న్యూస్ చానెళ్ళలో ఒక స్క్రోలింగ్ ప్రారంభమైంది.
‘చత్తీస్ ఘడ్ రాష్ట్రం లో పోలీస్ లను ముప్పుతిప్పలు పెట్టిన కావేరి దళ మావోయిస్ట్ నాయకురాలు వకుళ అలియాస్ అరుణక్క అలియాస్ రమ అలియాస్ పూర్ణ వరంగల్ ఎస్పీ ముందు లొంగుబాటు. ఆమెపై పదిహేను లక్షల రూపాయల రివార్డ్ ఉంది. ‘
కమలమ్మ మొట్టమొదట దాన్ని గమనించి “గోపాల్ ఈ స్క్రోలింగ్ ను చూడు “అంది.
గోపాల్. . గాంధీ కూడా చటుక్కున టివి దిక్కు చూపులను మరల్చారు.
‘చత్తీస్ ఘడ్. . . ‘మళ్ళీ రి పీటవుతోంది న్యూస్. ఈసారి విజువల్ కూడా వస్తోంది వరంగల్ ఎస్పీ ప్రక్కన వకుళ. . చుట్టూ చాలా మంది పోలీసులు. వకుళ పైపైకి దూకుతూ. . మైక్ లను మూతి దగ్గర పెడుతూ. . మీడియా పర్సన్స్.
ముందు ఎస్పీ మాట్లాడుతున్నాడు”మేము ఎన్నాళ్ళనుండో చేస్తున్న మా ప్రయత్నం ఇప్పుడు సఫలమైంది. జాతి సమగ్రతకే ముప్పుగా పరిణమించిన మావోయిస్ట్ సమస్యను రూపుమాపడంలో మేము వేస్తున్న వ్యూహాత్మక అడుగుల్లో వకుళ లొంగుబాటు ఒక కీలక విజయం. ఆమెపై రెండు రాష్ట్రాల్లోనూ పలు కేస్ లు పెండింగ్ లో ఉన్నాయి. ప్రస్తుతం తన ఆయుధంతోపాటు లోంగిపోతున్న వకుళను అభినందిస్తూ మున్ముందు మిగిలిన ఇతర నాయకులుకూడా వకుళ బాటనే అనుసరించి జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిస్తున్నాను. ఆమెపై ఉన్న పదిహేను లక్షల రూపాయల రివార్డ్ ను డైరెక్ట్ గా ఆమెకే చెల్లిస్తామని తెలియజేస్తున్నాను. . . . ” ఇంకా చెబుతూనే ఉన్నాడు ఎస్పీ ఉద్వేగంగా.
“కమలమ్మత్తా ఏమిటిది. . వకుళ ఇంత పెద్ద విప్లవకారిణని అస్సలే ఊహించలేదు. నిజమా ఇది అని నా మైండ్ బ్లాంకై పోయింది. ఈమె ఆయుధమెక్కడుంది. ఎక్కడ దాచింది. ఎక్కడినుండొచ్చింది. ఎప్పుడొచ్చింది. మనకేం చెప్పింది. అంతా మాయగా ఉంది నాకైతే. “అంటున్నాడు గోపాల్. మనిషి ఒంటి నిండా ఆశ్చర్యం పొంగిపొర్లుతోంది.
“అరే గోపాల్ వకుళ ఏమీ దాయలేదురా. నాకంతా చెప్పింది నిన్ననే. నాలెక్కనే జీవితమంతా పాపం బిడ్డ ముండ్ల బాటల నడుచుకుంట యమయాతన బడ్డది. అండర్ గ్రౌండ్ బతుకు ఎంత దుర్భరంగా ఉంటుందో నాకు తెలుసు బిడ్డా. పోనీ ఇకనైనా బాగుపడుద్దో లేదో. కాని పార్టీనుంచి పెను ముప్పు పొంచి ఉంటది నాయనా. జాగ్రత్తగుండాలె, లేకుంటే లేపేస్తరు. ”
ఝల్లుమన్నది గోపాల్ ఒళ్ళు. ‘లేపేస్తరు ‘అన్న పదం వినగానే.
గాంధీకి కూడా కొంచెం కొంచెం అర్థమైంది.
‘వకుళ ఇంత పెద్ద రెవెల్యూషనరీ నా’ అని అశ్చర్యపోతూనే ఆమెవల్లనే తను రైల్వే పోలీస్ లనుండి రక్షించబడ్డ విషయం జ్ఞప్తికొచ్చి కృతజ్ఞతతో కరిగిపోయాడు.
‘ఇదే సరియైన సమయం. . వకుళతో కొన్ని విషయాలను తను చర్చించాలి. . తమ భవిష్యత్తు కోసం. వకుళలో ఒక రకమైన ప్రజ్ఞ, స్థైర్యం, చొచ్చుకుపోయే గుణం పుష్కలంగా ఉన్నాయి. వాటిని వేరే సామాజిక ఉన్నతీకరణలో ఉపయోగించుకోవచ్చేమో’అనుకున్నాడు గాంధీ స్థిరంగా.
టివి తెరమీదికి వకుళ వచ్చింది.
చుట్టూ పైపైకి దూకుతూ మీడియా. దాదాపు అన్ని చానెళ్ళ మైకులు.
ఎంతో ప్రముఖమైన వ్యక్తి కాకుంటే వకుళకు అంత ప్రాధాన్యత ఉండదని కమలమ్మకూడా అనుకుంది.
“ఎందుకు లొంగిపోతున్నారు మేడం. కారణమేమిటి”
“చాలా మంది ఉద్యమంలోనుండి బయటకు వస్తూ. . భయంతో అనారోగ్య కారణాలవల్ల అని చెబుతారు. కాని నా విషయంగా అలా కాదు. ఎనిమిదేండ్ల పిల్లగా ఉన్నప్పటి నుండి అజ్ఞాత ఉద్యమంలో ఉన్నదాన్ని నేను. చెప్పాలంటే నా జీవితమంతా ఉద్యమమే. ఐతే వెనుకటివలె ఉద్యమమే ఊపిరిగా బతుకుతున్న కామ్రేడ్స్ ఎక్కువమంది లేరు లోపల. వ్యక్తిగత కక్షలతో, ఇతరేతరమైన ఉద్యమేతర కారణాలతో, పరిస్థితులపై సమగ్రమైన అవగాహన లేని నిరక్షరాస్య కిందిస్థాయి క్యాడర్ తోనే ఇప్పుడు నిర్మాణమంతా నిండిపోయి ఉంది. సరియైన దిశానిర్దేశం చేయగల, సైద్ధాంతికమైన ఆధునీకీకరణతో వ్యూహాలను రచిస్తూ ఉద్యమాన్ని క్షేత్ర స్థాయిలో నడిపీంచగల నాయకత్వం రోజురోజుకూ లోపిస్తోంది. ఇది ఒక అత్యంత సంక్లిష్ట దశ. ఇప్పుడు అజ్ఞాతంలో ఉండి చేయగల విప్లవాలకంటే ప్రజలతో కలిసి మమేకమై వాళ్ళను వివేకవంతులను చేస్తూ స్పృహను పాదుకొల్పి సాధించవలసిందే ఎక్కువగా ఉంది. ఇదివరకు ఒక్క శతృవే ఫ్యూడల్. ప్రజలు అమాయకులు. గోవుల్లాంటివాళ్ళు. బూర్జువాల దోపిడీకి గురై బాధపడేవాళ్ళు. కాని ఇప్పుడలా కాదు. ఈ అరవై ఏడేండ్ల స్వాతంత్ర్యానంతర కాలంలో ఈ ప్రభుత్వాలు చేసిన ఘనకార్యమేమిటంటే ప్రజలనుకూడా కలుషితుల్ని చేసి వాళ్ళను తాగుబోతులుగా, పనిదొంగలుగా, సోమరిపోతులుగా, అవకాశవాదులుగా, ఎవ్వడు ఏది ఉచితంగా ఇచ్చినా బిచ్చగాడిలా తీసుకునే రోషమే లేని పరాన్న భుక్కులుగా మార్చి నిర్వీర్యులను చేయడం. ఇందువల్ల ఒక జాతికి జాతే ఆత్మగౌరవమనే మాటనే మరిచిపోయి శవాలపై పేలాలేరుకు తినే దుర్బల తరంగా మిగిలిపోతోంది. ఈ మారిన సంక్షుభిత పరిస్థితుల్లో ఏ ఉద్యమకారులైనా తమతమ పంథాను పునఃసమీక్షించుకోవాలి. తమను తాము పునర్నిర్మించుకోవాలి. ప్రస్తుత మా అగ్ర నాయకత్వం ఈ నూతన ప్రతిపాదనలను అంగీకరిస్తూ, అర్థం చేసుకుని స్వీకరించే స్థితిలో లేదు. . అందుకే ఈ లొంగుబాటు. నేనిప్పుడు నా దిశను మార్చుకుంటున్నానే గాని ప్రజా చైతన్య ఉద్దీప్త మార్గంనుండి తప్పుకోవడంలేదు. ఇది తాత్కాలిక విరామమేగాని విరమణ కాదు. . “వకుళ మాటలు తుపాకీ గుండ్లలా దూసుకుపోతున్నాయి.
ఎందుకో కమలమ్మ ఒళ్ళంతా పట్టరాని ఆనందంతో పులకించిపోయింది.

*****

రమణ చాంగి ఇంటర్నేషనల్ ఏర్ పోర్ట్, సింగపూర్ టెరిమినల్ 4 దగ్గర నిరీక్షిస్తున్నాడు.
సుమ వెళ్ళిపోయిన తర్వాత. . ఐదు గంటల విరామం.
ఆలోచిస్తున్నాడు.
ఢిల్లీ నుండి రావలసిన జెట్ ఏర్ లైన్స్ విమానం రావాలిక పది నిముషాల్లో.
అనురాధ వస్తుంది. ఆన్ లైన్లో చాటింగ్ చేస్తూ గత పది రోజుల్లో ఆమెతో చాలా సాన్నిహిత్యాన్ని డెవలప్ చేసుకున్నాడు ముందుచూపుతో. మాటల్లో పెట్టి అనేకానేక వివరాలను తెలుసుకున్నాడు ఆమె గురించి. ఆమె కొన్ని రోజులు ఫారిన్ సర్వీసుల్లో పని చేసింది. దుబాయ్ లో, టాంజానియాలో, కొద్ది రోజులు జర్మనీలో.
కొద్దిరోజులు ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్. . కేంద్ర కార్యాలయంలో పనిచేసింది. వయసులో తనకంటే రెండున్నర సంవత్సరాలు పెద్ద. చాలా మంది హైలీ ప్లేస్డ్ పీపుల్ తో విస్తృతమైన సంబంధాలున్నాయి.
అనురాధకు ఇదివరకే రెండు పెళ్ళిళ్లయ్యాయి. ఒకటి తను అమెరికాలో చదువుకుంటున్నప్పటి స్నేహితుడు జార్జ్ లూసన్ తో. లూసన్ ఒక వ్యాపారవేత్త. అతనికి పద్దెనిమిది దేశాల్లో నూట అరవైరెండు ‘మెక్ డొనాల్డ్’ ఫ్రాంచైస్ ఔట్లెట్స్ ఉన్నాయి.
అతనితో రెండేళ్ళు కాపురం చేసిన తర్వాత విడాకులు తీసుకుంది.
“ఎందుకు” అనడిగాడు తను అనురాధ ఈ విషయాలను ఒకసారి ఫోన్లో తనతో ముచ్చటిస్తున్నపుడు.
“జస్ట్ లైక్ దట్”అంది.
“అంటే”అని తన ప్రశ్న. ఏమైనా వివరాలను కూపీ లాగుదామని.
“మొహం మొత్తి . . ”
“ఓహో. . ”
అని ఒక ఆశ్చర్యార్థక కొయ్యబారిపోయే వ్యక్తీకరణ.
తర్వాత ఆమె ఇండియాకు వచ్చింది స్వదేశీ సర్వీసులపై.
మొదట కేంద్ర ప్రభుత్వ సెక్రెటేరియట్ లో డిప్యుటీ సెక్రెటరీ టు గవర్న్ మెంట్. . ఇండస్ట్రీస్.
“ఎన్నాళ్ళు అక్కడ”
“జస్ట్ త్రీ ఇయర్స్. ఈ దేశ స్థితిగతులను అధ్యయనం చేయడానికి”
“ఏమర్థమైంది”
“నథింగ్. అందరూ వెధవలని. తెలివిగలవాడు ఈ దేశంలో దేన్నయినా కొళ్ళగొట్టుకుపోవచ్చు. అసలు తలుపులే లేని దర్వాజలున్న ఇల్లువంటిది ఈ దేశం. దొంగలు ఎప్పుడైనా, ఏ దిక్కునుండైనా, ఎంత విచ్చలవిడిగానైనా. ఎంతసేపైనా దొంగతనం యధేచ్చగా చేసుకోవచ్చు. దొంగలను పట్టుకోడానికి పోలీసులుగానీ, వ్యవస్థగానీ, నిఘా విభాగంగానీ, కనీసం కుక్కలుగానీ ఈ దేశంలో లేవు. అదీ నేను సునిశితంగా పరిశీలించి కనుక్కున్నది”
“తర్వాత. . ”
“మనిషికి కేవలం శరీరంతో మాత్రమే జీవించడంలో ఆనందం లేదు రమణా. శరీరంకంటే అతీతమైందీ, భౌతికేతరమైనదీ, ఏ వ్యక్తీకరణకూ లొంగనిదీ, కేవలం అనుభూతితోమాత్రమే తెలుసుకోగలిగేదీ ఐన ఒక తురీయ అనుభవం ఒకటుంది. ఆ స్థాయినీ, స్థితినీ అన్వేషిస్తూ మెటాఫిజికల్ ప్రావస్థలో సంచరిస్తూ. . అదీ జీవించడమంటే. “అని నవ్వింది ఓ పదినిముషాలసేపు. . ఆగకుండా. గలగలా. ఏకధాటీగా.
ఆమె చెప్పిన ఆ మూడు నాలుగు వాక్యాల్లో ఒక్క ముక్కకూడా రమణకు అర్థం కాలేదు.
ఆమెతో మాట్లాడ్డం మొదలుపెట్టినప్పటినుండి జరిపిన నాలుగైదు సంభాషణల్లో అతనికి అర్థమైన విషయాలకంటే అర్థంకాకుంటే వెకిలినవ్వులు నవ్వి తప్పుకున్న సందర్భాలే ఎక్కువ. ఎంత తల బాదుకున్నా ఎదుటిమనిషికి అర్థంకాకుండా ఎంతసేపైనా మాట్లాడ్డంలో దిట్ట అనురాధ.
“వింటున్నారా” అంది మళ్ళీ రెట్టించి.
“ఔను”అని తత్తరపాటు.
తర్వాత అనురాధ తను ప్రధానంగా తెలుగమ్మాయి కాబట్టి కొంతకాలం ఆంధ్రప్రదేశ్ లో పనిచేయాలని సంకల్పించి పోస్టింగ్స్ వేయించుకుని వచ్చింది. ప్రస్తుతం ఆమె ఏ పి ఐ ఐ డి సి కి మేనేజింగ్ డైరెక్టర్.
ఎదురుగా ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డ్ పై చూశాదు రమణ.
జె-234 జెట్. . . సింగపూర్. . అరైవల్. . రాత్రి 20. 15
ల్యాండెడ్ ఎట్ టరిమినల్-4.
ఎదురుచూపు.
రమణ మనసు ప్రశ్నించింది. . ‘రమణా అసలు నీకేమి కావాలి. స్త్రీ. . డబ్బు. . అధికారం. . సుఖ నంతోషాల సౌఖ్యాలు. . ఏమిటి కావాలి నీకు. ‘అని లోపల కుక్కపిల్ల గుండెలను గీకుతున్నట్టు.
కాని జవాబేది.
ఎందుకు.
ఎందుకంటే. . నీకేం కావాలో నీకు తెలియదు. అందుకు.
‘పోనీ రమణా. . ఇప్పటికైనా తెలుసుకో నీకేమి కావాలో. ‘
చూస్తూనే ఉన్నాడు. . అలా డిపార్చర్స్ గేట్ దిక్కు.
ఇంతకూ అనురాధ ఎవరో తనకు తెలియదు. ఎలా ఉంటుందో తెలియదు. రూపురేఖలు. . వ్చ్. . తెలియవు.
చటుక్కున జానకి జ్ఞాపకమొచ్చింది. హారతి కర్పూరపు జ్వాలలో ఉండే పరిశుద్ధత. ‘యూజ్ అండ్ ప్రిజర్వ్’
సుమ. . వెంట ఉన్నంతసేపు. . దేహం మీది అంగీ. స్వర్గ సుఖం. ‘వాడుకో. . వదిలెయ్యి ‘. . ‘యూజ్ అండ్ త్రో. ‘
కాని ఈ రెండే కాకుండా జీవితం ఇంకా ఉంది కదా. మననే ఎవరైనా’యూజ్ అండ్ త్రో’చేస్తే ఎట్లా. . తెలుసుకో నిన్ను నువ్వు.
అనురాధ రెండవ భర్త పేరు డాక్టర్ ప్రసాద్ గంటా. ఓపెన్ హార్ట్ సర్జన్.
‘గుండెలను కోయుట. . రోగకారక లోపాల్న సవరించి మళ్ళీ కుట్లు వేయుట. కాని ఆ గుండెలోపల ఏముందో ఏ ఒక్కనాడూ తెలుసుకోలేకపోవుట. ‘
ఏ శాస్త్రమిది. తెలుసుకో.
అనుభవాల్లోనుండి శాస్త్రాలు. అంతేగాని శాస్త్రాల్లోనుండి అనుభవాలు కాదు. గుర్తించు.
రెండేళ్ళ కాపురం. . ఢిల్లీ. . హైదరాబాద్. . మధ్య మధ్య విదేశీ ట్రిప్స్.
“ప్రొఫెషన్ ఈజ్ గాడ్”అని అతడు.
“గాడ్ ను తిరగేస్తే డాగ్”అని అనురాధ.
మనుషుల్లో దేవుడు అని ఒకరు. . దేవుడనే భావనే మిథ్య. . అని ఇంకొకరు.
మధ్య గీత చిన్నది. . సన్నది.
దాన్ని చెరిపెయ్యాలెవరో. కాని ఎవరూ చెరిపెయ్యలేదు.
“పిల్లలు”అని డాక్టర్ ప్రశ్న.
“తొందరెందుకు”అని జవాబు.
కాలమాగదు. వయసు క్షీనత ఆగదు. శరీర శిథిలత ఆగదు.
“లెటజ్ ఎంజాయ్”
ఎంజాయ్. . నిర్వచనాలు వేరు.
పొత్తు పొసగనపుడు. . పోరుకన్న వేరు మేలు. . అని భీష్ముడి సూక్తి.
తిర్యగ్రేఖలు ఒకదానినొకటి ఖండించుకొనును.
కలియుట విడిపోవుట కొరకే అని ఉవాచ.
‘మీరిప్పుడు క్యూలో ఉన్నారు. దయచేసి వేచిఉండండి ‘అని చెవుల్లో నిరంతర గోల.
రమణ అసహనంగా చూస్తూనే ఉన్నాడు. , గేట్ దిక్కు.
సింగపూర్ ఒక 5-స్టార్ ఏర్ పోర్ట్. ప్రతి సంవత్సరం 54. 5 మిలియన్ల ప్రయాణీకుల్ని సురక్షితంగా తమతమ గమ్యాలకు చేరుస్తున్న రికార్డ్ దానిది.
అన్నీ. . అంటే మోనో రైల్. . పీపుల్ మూవర్స్. . స్కై ట్రెయిన్ సదుపాయాలున్న ఏకైక ఏర్ పోర్ట్ కూడ ఇదే.
చూస్తూండగానే ఒక బంగారు రంగు చీర కట్టుకుని విద్యుత్ తీగవలె సన్నగా ఒళ్ళంతా మెరుపుతో జిగేల్ మనే తళుకుతో ప్రత్యక్షమైన ఆ స్త్రీమూర్తి అనురాధే అనుకున్నాడు రమణ.
అనురాధ ఇంకా ఇంకా దగ్గరవుతున్నకొద్దీ రమణ అమెనుండి చూపును మరల్చుకోలేక. ,
వెంట ఒక చిన్న ట్రాలీ బ్యాగ్ తో వచ్చిన అనురాధ విజిటర్స్ రైల్ దగ్గర ఆగి. . చుట్టూ చూస్తూ,
రమణ పరుగు పరుగున దగ్గరగా వెళ్ళి. . “ఎక్స్క్యూజ్ మీ”అంటూండగానే,
“మిస్టర్ రమణా. . “అంది సుతారంగా, నాజూగ్గా.
“ఎస్”
ఆ జవాబు తెలుసు ఆమెకు.
ఏ ఆడదానికైనా మగవాడు తన ముందు బొచ్చు కుక్కలా కాళ్ళ దగ్గర చీర కుచ్చెళ్ళను పట్టుకుని అటుఇటూ తిరుగుతూంటే తెగ ముచ్చటేస్తుంది.
“షల్ వీ గో”అంది వంకర్లు తిరిగిపోతూ.
ఎస్-అని అతననలేదు. కాని అంతకు వందరెట్లు ఆ ఎక్స్ ప్రెషన్ ను ఇచ్చి ఆమె చేతిలోని ట్రాలి బ్యాగ్ ను తీసుకుని ప్రక్కనే నడక సాగించాడు.
పీపుల్ మూవర్. . వెంటనే స్కై ట్రెయిన్ .
ఐదు నిముషాల తర్వాత టొయొటొ క్యామ్రీ టాక్సీ.
టాక్సీ హోటల్ చేరేంతవరకు అనురాధ అస్సలు మాట్లాడలేదు రమణతో.
ఇంకో ఐదు నిముషాల్లో హోటల్ను చేరుదామనగా అనురాధ అంది”మిస్టర్ రమణా ప్రతి గేంలోగానీ, వ్యుహంలోగానీ గెలుపూ ఓటమీ ఉంటాయిగదా. స్త్రీ పురుషుల దాంపత్యంలో ఏముంటుంది. గెలుపు ఓటములుంటాయా”అని.
“దాంపత్యాన్ని ఒక క్రీఢగా భావించడం సరియైంది కాదేమో అనురాధా”
“మరి”
“అది స్త్రీ పురుషులిద్దరూ కలిసి పంచుకోవలసిన ఒక జీవితానుభవమేమో”
“అనుభవాలు గెలుపోటములను నిర్ధారించవా”
“అనుభవాలన్నీ అనుభూతులను అంత్య శేషాలుగా మిగిల్చేవేకాని లాభనష్టాలను చేకూర్చేవుండవు”
“ఊ. . ”
“రమణా. . ఒక లక్ష్యాన్ని నిర్వచించుకుని దాన్ని సాధించే క్రమంలో గెలిచేవాడెప్పుడూ. . ఆ పని కష్టమే కాని. . వీలవుతుంది అనే చెబుతాడు”
“కాని ఓడిపోయేవాడు ఆ పని వీలవుతుంది. . కాని చాలా కష్టం అని చెబుతాడు”
“గెలుపు ఓటముల మధ్య వ్యత్యాసం చాలా చిన్నది. కాని చాలా ముఖ్యమైంది. ఔనా”
టాక్సీ ఫుల్లర్టన్ బే హోటెల్ ముందాగింది. సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ లొకేషన్ లో ఉందది. చాలా ఖరీదైన హోటెల్. రోజుకు ఆరువందల యాభై అమెరికన్ డాలర్లు.
రెసిప్షన్. . ఫార్మాలిటీస్. . పైకి లిఫ్ట్ లో. . ఐదవ ఫ్లోర్ . . 525 నంబర్ సూట్.
“మన భవిష్యత్తును నిర్ణయించుకోవాలిగదా మనమిప్పుడు”అంది అనురాధ బాత్ రూంలోకి వెళ్తూ.
ఒక పావుగంట తర్వాత అనురాధ ఫ్రెష్ గా. . అప్పుడే పూచిన పువ్వువలె తయారై బైటికొచ్చింది.
చెట్టు చిగుళ్ళు వేస్తున్నపుడు లేత పత్రాలతో ఒకరకమైన అందాన్ని కలిగిఉంటుంది. ఆకులన్నీ పెరిగి పూతకొచ్చినపుడు అదే చెట్టు మరో రకమైన శోభతో అలరారుతుంది. పూలు కాయలై, పళ్ళయి చెట్టు భారగా మారినప్పుడు ఆ అందం పరిపూర్ణమై సంపన్నమౌతుంది. దశలు వేర్వేరైనా అందం ఏ దశ అందం ఆ దశదే.
స్నానించి వచ్చిన అనురాధ ప్రౌఢ వయసులో విరగపూసిన మల్లె తీగలా నిండుగా, పూర్ణగా అనిపించింది రమణకు.
చిత్రమైన విషయమేమిటంటే ఆ ఇద్దరిలో ఏ ఒక్కరికికూడా. . తామిద్దరూ అప్పటిదాకా పూర్తిగా ఒకరికొకరు పరాయి వ్యక్తనీ, ఆ విధంగా ఒక గదిలో కలిసి ఉండడం అనైతికమనిగానీ, కూడని పననిగానీ అనిపించలేదు. కనీసం ఆ స్పృహ కూడా కలుగలేదు వాళ్ళకు.
“చెప్పు రమణా. . నీ బయోడాటా షీట్ చూశా నిన్న. నువ్వు నాకన్నా దాదాపు రెండున్నర సంవత్సరాలు చిన్న. ఐ డోంట్ మైండ్. నీక్కూడ ఏమీ అభ్యంతరం లేదనుకుంటా. ”
“లేదు”
“ఓకే. నీ మ్యారేజ్ ఫెయిల్యూర్ గురించి చెప్పు”
“అది కేవలం ఐడియలాజికల్ డిఫరెన్స్. . నేను అతివేగంగా చొచ్చుకుపోయి తొందరగా వృద్ధి చెందాలని ఆలోచిస్తాను. జానకి అలాకాదు. నీతి, నియమాలు, నైతికత, ధర్మం. సమాజం. . ఈ దిశలో ఆలోచిస్తుంది. ఇద్దరివీ ఎన్నటికైనా కలువని భిన్న మార్గాలు. నాకర్థమైందేమిటంటే మా దాంపత్యం నాకంటే ఆమెకే చాలా అసౌకర్యంగా ఉండేది. మేము విడిపోయేకంటే ముందు దాదాపు ఏడాదికంటే ఎక్కువ కాలం మా మధ్య సెక్స్ సంబంధాలే లేవు. మానసికంగా ఎప్పుడో విడిపోయాము మేము. నేను చాలా సార్లు తీవ్రంగా ఆలోచించాను. . ఆమె కోరుకుంటున్నట్టు నేను మారగలనా. . లేక ఆమెను నేను కోరుకున్న విధంగా మార్చుకోగలనా. . అని. ఆ రెండూ సాధ్యం కావని అర్థమైంది స్పష్టంగా. ఇక ఒక నిర్ణయం తీసుకున్నాను. దానికి తోడు ఒక దురదృష్టకర సంఘటన జరిగి కొంత రసాభాస జరిగింది. అంతా ఠాం ఠాం ఐపోయి కొంత బ్యాడ్. జానకి విడిపోయింది శాశ్వతంగా. ఆమెతో పాటు ఎనిమిదేండ్ల నా కూతురు నిర్మల కూడా నాకు దూరమైపోయింది. ”
“నేను కాస్త ఓవర్ డైనమిక్ మిస్టర్ రమణా. సంబోధనలో మిమ్మల్ని నిన్ను అనే అంటున్నాను మొదటినుండి. నాకు మొదటినుండి కసిగా జీవించడం అలవాటు. నేను కొంచం అనార్కిక్ కూడా”
ఆగిపోయింది అనురాధ.
ఆగి. . లేచి వెళ్ళి ఫ్రిజ్ తెరచి చూచి తిరిగొచ్చి”మన డిన్నర్. . తదితర విషయాల గురించి ఏమిటి నీ ప్లాన్. వాడు ఢిల్లీలో ఎండీస్ మీటింగ్ అని పెట్టి ఒట్టి గడ్డి తినిపించాడు వెధవ. . చెప్పు ఏం తిందాం. . నాకు ఆకలిగా ఉంది”ఆమె గడగడా.
“నాక్కుడా చాలా ఆకలిగా ఉంది. బై ది బై నేను కూడా మిమ్మల్ని నిన్ను అనే పిలుస్తా. లేకుంటే ఏదో దూరం మధ్య నిలబడి దగ్గర కాలేకపోతున్నట్టు. . ”
“ఓకె ఓకె. కాల్ మి నువ్వు. నో ప్రాబ్లం. చెప్పు మెనూ. . కొంత నాన్ వెజ్. . చికెన్. . పిజ్జా. నడుస్తదా. ఎనీ డ్రింక్. బీ ఓపెన్. ”
అనురాధ సుడిగాలివలె. . విడిచిన బాణం వలె దూసుకు వస్తోంది.
రమణ ఇంటర్ కాంలో చెబుతూండగా. . చేతిలోనుండి ఫోన్ ను తీసుకుని తను కొన్ని కలిపి ఆర్డర్ చేసి. . “నౌ టెల్ మి. నేనొక డ్రింక్ చేయనా నీక్కూడా. ”
లేచి ఫ్రిజ్ దగ్గరికి వెళ్ళి “విస్కీ. . సోడా. . “అంది రమణ వైపు అభావంగా చూస్తూ.
రమణ చాలా పరిశీలనగా గమనిస్తున్నాడు ఆమెను. సాధారణంగా అతనెవరినీ నమ్మడు. అతిప్రవర్తన గల అనురాధ వ్యక్తిగత పోకడ ఎలా ఉంటుందా. . అని అంచనా వేస్తున్నాడు. ఒకవేళ ఆమెను పెళ్ళి చేసుకుంటే ఏర్పడబోయే పరస్పర వ్యక్తిగత సంబంధాలెలా ఉంటాయో ఊహిస్తున్నాడు. అతనిది నిశితమైన విశ్లేషణ. . వ్యక్తిత్వం గురించిన అవగాహన. . ఆ దృష్టితో చూస్తున్నాడు.
కాని అనురాధ కొంచెం భోళాగా, కొంచెం సూటిగా. . కనిపిస్తోందికాని మత్ లబీ లాగా. . డిప్లమాటిగ్గా కనిపించడం లేదు.
ఆడవాళ్ళలో కొందరుంటారు ప్రత్యేకంగా. . భోళాభాళా. . ప్రతి పనిలోనూ తమకుతామే కల్పించుకుని అన్ని పనులూ. . ముఖ్యంగా పెళ్ళిళ్ళలో ముందుండి అన్నీ తామే ఐ చేస్తూంటారు. అనురాధది ఆ టైపా.
ఐ ఎ ఎస్ గా తనకంటే మూడేండ్లు సీనియర్ ఆమె.
వ్యక్తిగతమైన ఆమె కుటుంబ చరిత్ర ఏమిటో. తల్లీ తండ్రీ. . అన్నాతమ్ములూ. . చెల్లెలూ అక్కలూ. . వాళ్ళతో సంబంధాలు. . వాళ్ళతో ఆర్థిక. . ఆర్థికేతర లావాదేవీలు. . వగైరా.
రమణ దృష్టిలో జీవించడం రెండు రకాలు.
ఒకటి. . చెస్ ఆడినట్టు. ప్రత్యర్థి వేసే ఎత్తుకు ప్రతిగా తగిన ఎత్తును వేసుకుంటూ ఆడుతూ పోవడం. అంటే మనుషులతో వ్యవహరిస్తున్నపుడు వాళ్ళెలా స్పందిస్తారో దాన్నిబట్టి తను ప్రతిచర్యిస్తూ ముందుకు పోవడం.
రెండు. . ఒక పథకం ప్రకారం ముందే ఒక వ్యూహాన్ని రచించుకుని దానిప్రకారం అంతా అమలుచేసుకుంటూ వెళ్ళి చివరికి అనుకున్నదాన్ని సాధించడం.
రమణది రెండో టైపు.
మొత్తంమీద జీవితం మనిషి తప్పనిసరిగా ప్రతివాడూ ఆడవలసిన ఆటే. . అని అతని నిశ్చితమైన భావన.
అనురాధ ఒక బ్లాక్ లేబుల్ విస్కీ సీసా, సోడా బాటిల్స్ రెండు, ఒక ఐస్ బాక్స్ తీసుకుని ముందున్న గాజు టీపాయ్ పై పెట్టి. . చుట్టూ చూచింది గదినంతా. అప్పటినుండి పరిసరాలను నిశితంగా చూడాలనే ఆలోచనే రాలేదామెకు. చూచి ప్రసన్న వదనయై. . “ఈ హోటెల్ చాలా బాగుంది రమణా”అంది ప్రశంసాపూర్వకంగా. బాగా అంటే అందంగా, విశాలంగా, సౌకర్యవంతంగా అని.
“నీ బ్రాండేమిటి. . బ్లాక్ లేబుల్ నడుస్తదా”
“మనం ఆల్ రౌండర్”అన్నాడు రమణ ఇక తనే విస్కీని గ్లాసుల్లోకి వంచడం, సోడా కలుపడం, ఐస్ క్యూబ్స్ వేయడం. . మొదలుపెట్టి.
చాలామంది ఆడవాళ్ళు బాహాటంగా తాగరు. ఈ అలవాటు లేబర్ వంటి అతి తక్కువ వర్గాల్లో ఉంది. మళ్ళీ చాలా గుప్తంగా బయటికి కనబడని అత్యున్నత వర్గాల్లోనూ ఉంది. ఐతే వర్గమేదైనా ఆడది తాగడం మొదలు పెట్టిందంటే మాత్రం దాన్నిక ఆపడం ఎవరితరమూ కాదు.
ఏదో మాట్లాడుతున్న అనురాధ చటుక్కున మాట్లాడడం ఆపేసి. . లేచి చేతిలో విస్కీ గ్లాస్ ను తీసుకుని అటు విశాలమైన కిటికీ దగ్గరకు వెళ్ళి నిలబడి,
“ఇట్రా రమణా. . చూడు దూరంగా సముద్రం ఎంత సుందరంగా ఉందో. చీకట్లో లంగర్ వేసిన అన్ని షిప్స్, పడవలు, సీ వెహికిల్స్. . తమ తమ లైట్లతో. . నక్షత్రాలను కుప్పబోసినట్టు. . హౌ బ్యూటిఫుల్. ”
అటు చూస్తూ విస్కీని సిప్ చేస్తూ లోకాన్ని మరచిపోతోందామె. పూర్తిగా ఎక్స్ ట్రావర్ట్.
ఒక్కోసారి ఆమె వింతగా. . కొత్తగా అనిపిస్తొంది.
ఐతే ఏ కోణంలో చూచినా అటు సన్నగా ఇటు లావూ కాని అనురాధ మధ్యస్థ శరీరాకృతి మగవాణ్ణి కసిగా కవ్వించేట్టుగా ఉంది. తెల్లని దేహ ఛాయ. . అందమైన కోల ముఖం. . చిక్కని పొడుగాటి జుట్టును వదులుగా ముడేసుకోవడం వల్ల చెవులపైకి జారుతూ. . నుదుటిపై ముంగురులు అటుఇటూ కదులుతూ,
‘పిచ్చి లేపుతోందీమె అందం’అనుకుంటూ రమణ కూడా తన విస్కీ గ్లాస్ ను పట్టుకుని ఆమె దగ్గరగా వెళ్ళి, ప్రక్కన నిలబడి. ,
“సింగపూర్ తో ఏమిటి నీకు”అంది గోముగా.
“నాకో అలవాటుంది. జీవితం గురించిన చాలా కీలకమైన నిర్ణయాన్ని తీసుకోవలసి వచ్చినపుడు ఒక స్కిప్ కావాలి నాకు. ఆ ఏకాగ్రత ఈ సింగపూర్ లో లభిస్తుంది. ఇక్కడికి రావడం నాకిది ఏ ఇరవయ్యోసారో కావచ్చు. ”
“అరే. . సేం. . నాక్కుడా. ఒక క్రిటికల్ డెసిషన్ తీసుకోవాలంటే నేను కూడా. . సింగపూర్. . ఇప్పుడు నువ్వు నీ జీవితం గురించి. . నేను నా జీవితం గురించి. . చాలా కీలకమైన నిర్ణయాలేకదా మనం తీసుకోవాల్సింది”
“అందుకే సింగపూర్ ను ప్రపోజ్ చేసిన”
“థాంక్యూ. నౌ కం టు ద పాయింట్. ఏం చేద్దాం మనం. నువ్వేమనుకుంటున్నావ్”అంది అనురాధ చదరంగాన్ని విప్పుతూ.
అప్పటికే ఆమె గ్లాస్ లోని విస్కీ ఐపోయింది.
రమణ ప్రక్కనున్న గాజు టీపాయ్ ని ఆమె దగ్గరకు జరిపి. . అటు ప్రక్కనున్న సరంజామానంతా తెచ్చి. . ఆమె గ్లాస్ లోకి ఇంకో రౌండ్ డ్రింక్ పోసి. . సోడా కలిపి. . చేతికందించి,
గడగడా కొట్టేసి. . కుర్చీలో కూర్చుని. . వెనక్కి వాలి. . కళ్ళు మూసుకుని,
పైనుండి పడుతున్న బంగారు రంగు కాంతి ఆమె ముఖంపై ప్రతిఫలిస్తూండగా. ,
‘పిచ్చి లేస్తోంది ‘అనుకున్నాడు రమణ.
అనుకుని. . “ఏదో చెప్పబోతున్నావు”అన్నాడు.
“మనం పెళ్ళి చేసుకోవడం వల్ల ఎవరికి లాభం. నీకా? నాకా ?చెప్పు సూటిగా”అంది నిలకడగానే.
ఈమె సామాన్యురాలు కాదు అనుకున్నాడు రమణ.
“ఇద్దరికీ”అన్నాడు.
“హౌ ఇట్ కుడ్ బి. . ఎవరికో ఒక్కరికే లాభం. చెప్పు”
“ఐతే. . నాకే”అన్నాడు రమణ.
“కరెక్ట్. . ఎందుకో చెప్పు”
రమణకు అర్థం కాలేదు.
“నేను చెబుతా ఇప్పుడు. . నీ నెట్ వ్యాల్యూ ఎంత బై దిస్ డే”
“మొత్తం ఎనభై ఐదు కోట్లు. . దాదాపు”
“మరి నా వ్యాల్యూ ఎంతనుకుంటున్నావు. . చెప్పుకో. . నూటా నలభై కోట్లు”
రమణకు పిచ్చి ఆనందం కలిగింది ఆ ఫిగర్ వినగానే. కాని పైకి అమాయకంగా ముఖం పెట్టి. ,
“మరి నన్ను పెళ్ళి చేసుకుంటే నీకేగదా లాభం” అన్నాడు.
“డబ్బు ముఖ్యం కాదు. . మనుషుల మధ్య విలువలు కదా ప్రధానం”అని.
“బొచ్చులే. అంతా హంబగ్. ఐతే నా డబ్బును విడిచిపెట్టి ఒక్క పైసాకూడా లేని నన్ను పెళ్ళి చేసుకో దమ్ముంటే చూస్తా.” అంది ఫట ఫటా.
“చేసుకోవు. తెలుసు నాకు. రమణా డబ్బు. . డబ్బు నాయనా డబ్బు. పైపై మాటలన్నీ ఒట్టి బక్వాస్. ఐతే ఒక్క విషయం చెబుతా. మంచిగిను. రహస్యమిది. . డబ్బువల్ల సంతోషమొస్తుంది. . కాని అన్ని సంతోషాలు డబ్బువల్ల మాత్రమే రావు. . అర్థమైందా”అని ఆగింది అనురాధ.
నిజానికి ఆ క్షణంలో రమణకు ఆమె చెప్పింది పూర్తిగా అర్థంకాలేదు. కాని పైకి ఒక వెకిలి నవ్వు నవ్వి. ,
“ఔను”అన్నడు రమణ వెనుకనుండి ఎవరో తరుముతున్నట్టు.
“మరి మనకు పుట్టవలసిన పిల్లల గురించేమిటి”
“చెప్పు నువ్వు”
“చాలా అర్జంట్ గా ఇద్దరు పిల్లలను కనాలె మనం. ”
“ఎందుకు”
“ఎందుకంటే నాకు ఏజ్ బారై పోతాంది కాబట్టి. ఇంకో రెండేళ్ళయితే ఇక పిల్లలు పుట్టరు. ”
“భర్త. . అంటే ఏమిటో చెప్పు రమణా. భరించేవాడనికదా అర్థం. మనం పెళ్ళి చేసుకున్నామనుకో. . ఏమిటి నువ్వు నన్ను భరించేది”
రమణకు తెలుస్తోంది. . విస్కీ ఎక్కుతోందని ఎండు అడవిలోకి అగ్నిలా. . తనకూ, అనురాధకూ. అన్నాడు “భరించడమంటే ఒక్క పోషించడమని మాత్రమే కాదుకదా. . నీ అందాన్నీ, నీ దూకుడునూ, నీ డామినేషన్ నూ, నీ ఆధిపత్యాన్నీ”
ఉన్నట్టుండి కొట్టిన గోళీ సోడాలా నవ్విందామె. నవ్వుతూనే “ఉందిరా నీకు రమణా. . సెన్స్ ఉంది. . ఏమో అనుకున్నా చతురునివే. . అర్థం చేసుకుంటున్నావు నన్ను. గుడ్. అనురాధను భరించడం అంత సుళువైన సంగతి కాదు. . “అంది. మాట కొంచెం ముద్ద ముద్దగా. . ముద్దు ముద్దుగా వస్తూ,
అనురాధ కళ్ళు ఆమె లోపలి నుండి విరజిమ్ముతున్న కల్లోల పారవశ్యాన్నీ, మోహవిమోహ దగ్ధతనూ ప్రతిఫలిస్తున్నాయి. వెనక్కి వ్రాలి. రెండు చేతులనూ గాలిలోకి స్ట్రెచ్ చేసి విరుచుకుని. . ఒంటిని విసనకర్రను విప్పినట్టు పరచుకుని,
“చాలా అలసిపోయాను రమణా. . ఎండమావుల వెంట పరుగెత్తీ పరుగెత్తీ చాలా అలసిపోయాను. నీకో విషయం చెప్పనా. . ఎవడో ఓ కవి చెప్పాడు. . మనిషే ఒక మహారహస్యం అని. కరక్ట్. ఏ మనిషీ తన గురించి మరో మనిషికి పూర్తిగా విప్పి చెప్పడు. దాచుకుంటాడు తనకు తాను. . తనలో తాను. అంతా సర్రియలిస్టిక్ బతుకు. . “చెప్పుకు పోతోంది మాటలు ఆగి ఆగి దొర్లుతూ,
“అసలు మనిషి ఎవడికి వాడు ప్రశ్నించుకోవాలి. . తనకు అంతిమంగా ఏమి కావాలి. . అని. జవాబు చప్పున స్పష్టంగా రాదు. వెదుక్కోవాలి. . లోపల. . లోలోపల. వస్తుందిగదా ఆన్సర్. . పరమ వికారంగా ఉంటుంది. బీభత్సంగా ఉంటుంది. అప్పుడుగాని ఎవడికి వాడు ఎంత వికారంగా ఆలోచిస్తాడో అర్థంకాదు. చాలా మందికి కావసినవి మూడు విషయాలు. ఒకటి. . డబ్బు. . రెండు. . శరీరం చల్లబడేవరకు సెక్స్. . మూడు. . దిక్కుమాలిన పేరు. పాప్యులారిటీ. వీటికోసం ఒకటే పరుగు. కాని ప్రశ్నేమిటంటే. . ఎంత డబ్బు. . ఎంత, ఎంతమందితో సెక్స్. . ఎంత పేరు, ఎటువంటి పేరు. జవాబేమిటంటే అనంతం అని. అనంతమైన డబ్బు. విశృంఖలమైన సెక్స్. అంతులేని పేరు. . ఔనా. . చెప్పు. . ఔనుగదా”
“పూర్తిగా ఔను. ఐతే విషాదమేమిటంటే అందరూ ఈ మూడు విషయాల వెంటె పరుగెడుతూ. . పరుగెడుతున్నామనే సంగతిని మరిచిపోవడం. “రమణలో ఎక్కడో ఏదో దహించడం మొదలైంది.
“మనకు ఈ ఐ ఏ ఎస్ హోదాలూ, కనబడగానే ముందు నిలబడి ఖడక్ గా సెల్యూట్ చేసే అధికారిక వందిమాగదులు. . మన మన డొమైన్స్ లో తిరుగులేని అధికారాలతో చిన్న సామంత రాజుల్లా నిరంకుశంగా శాసించే స్థాయి. . ఇవన్నీ లేకుంటే మనం ఒట్టిదే రమణా. . ఒడ్డుమీదేసిన చేపలం. గిల గిలా తన్నుకోవడమే. నిజానికి మనం మన గతాన్ని మరిచి మనం ‘పాలకులం’అనే అహంకార పూరిత భ్రాంతిలోకి జారిపోయాం ఎప్పుడో. ”
“ఔను. . ఐ ఫుల్లీ అగ్రీ విత్ యు. అధికారం లేకుంటే ఒట్టి గాలితీసిన బుడగలం. ”
“సో”
మనుషుల్లో బయటికి కనబడని కాలుతున్న అడవులు దాగిఉంటాయి. . చాలా గుప్తంగా.
చాలా రోజులైంది బుద్దితీరా తాగక.
చాలా రోజులైంది కుతిదీరా సెక్స్ చేయక.
చాలా రోజులైంది కసిదీరేదాకా మందికొంపలు ఆర్పక.
. . . ఇలా.
ఈ చాలా రోజుల నుండి చేయకపోవడం వల్ల ఆ లోపల కాలుస్తూ వస్తున్న కోరికలను తీర్చుకునేందుకు ఒకటే తీట. ముల ముల. గుల గుల.
అప్పుడు. . ఆ క్షణం. . రమణలో. . అనురాధలో కూడా ఆ చాలా రోజులనుండి ఆ’చేయని ‘దాహార్తి’ ఏదో ఇద్దరినీ దహించడం మొదలై. ,
దేహం ఎప్పుడూ ఒక అంటించని పెట్రోల్ బావి. మోహభాండం. పెట్రోల్ బావి దగ్గరికి అగ్గిపుల్లను తీసుకుపోవద్దు. తీసుకుపోతే పరమ ప్రమాదం. మన ప్రమేయం లేకుండానే చప్పున నిప్పంటుకుని భళ్ళున మంటలెగసి. . అంతా దహనం. . విస్ఫోటనం. పేలిపోతుంది.
పేలిపోతున్న ప్రతిదానికీ తర్వాత బూడిద మిగుల్తుందని తెలియదు.
మనసు చెబుతోంది. . పిచ్చి ముండా. . వీడితో ఏవేవో శరీర సుఖాలను పొందాలనే తీట లేనిది. . ఇలా ఒంటరిగా ఖండాంతరవై ఈ హోటల్ గదిలోకి ఎందుకొచ్చినట్టే. . ఒరే రమణా. . ఆన్ లైన్లో చూచి ఇది మహా అందంగా ఉంది. . దీన్నీ, దీని అందాన్నీ ఆక్రమించాలనే వ్యూహాత్మక దుర్బుద్ధి లేనిది ఇక్కడికి
ఈ సింగపూరొచ్చి. . ఒంటరి గదిలో ఈ వెర్రి వేషాలేమిట్రా. ,
ఆత్మ. . . లోపల కణకణలాడుతున్న నిప్పుకణికవలె అగ్ని ఆత్మ . . ప్రతి మనిషిలోనూ.
అగ్ని ఐన ఆత్మ నిరంతరం జ్వలిస్తూ నిన్ను దహిస్తుంది. దహిస్తూ దహిస్తూ అంతిమంగా నిన్ను నిశ్శేషం చేస్తుంది.
“ఎప్పుడు. . ఎక్కడ పెళ్ళి చేసుకుందాం రమణా మనం. ”
అనురాధ మెల్లగా కుర్చీలోనుండి లేచి. . అడుగులో అడుగేసుకుంటూ. . పాల నురగవలె కళ్ళముందు కవ్విస్తున్న బెడ్ దాకా నడిచి. ,
గమనిస్తోంది రమణ తన వెనుక పిచ్చి కుక్కలా వస్తున్నాడా లేడా అని క్రీగంటితో.
లేస్తున్నాడు. . మెల్లగా. . వస్తాడు. . వెనుకపడి. . రాకేం చేస్తాడు మగవాడు.
బలహీనతల పెనుగాలిలో. . మగవాణ్ణి వెంట తిప్పుకోవడం ఆడదాని బలం. ఇంగితాన్ని మరచి పిచ్చితో కవ్వించే ఆడదాని వెనుక తోకలా తిరుగడం మగవాడి పుట్టు బలహీనత.
చేతిలోని ఐఫోన్ లో. . ఒక్క క్షణంలో సార్ట్ చేసి. . తెరను తాకింది అనురాధ మృదువైన కుడి చేతి నడిమి వ్రేలుతో.
టచ్ స్క్రీన్. . టచ్ స్కిన్.
ఒక్క తాకిడితో. . ఒక్క స్పర్శతో. . తాకడం స్పర్శించడం ఒకటేనా.
‘లౌట్ కే ఆ. . లౌట్ కే ఆ. . ‘
ముఖేష్. . ఒక దీనమైన, సంవేదన. . వేదన. . ఆర్ద్రత నిండిన మధుర స్వరంతో. . పిలుస్తున్నాడు. . తిరిగి రమ్మని.
తిరిగిరావాలి. ఎక్కడికి తిరిగిరావాలి. ఒక జన్మనుండి మరో జన్మలోకి. . ఒక మరణంలో నుండి ఇంకో మరణంలోకి. . ఎక్కడికి తిరిగిరాను. ఎప్పుడు తిరిగిరాను. ఎన్ని యుగాల తర్వాత తిరిగిరాను.
అసలు తిరిగొస్తాయా అన్నీ. . కోల్పోయిన వసంతాలు. . కోల్పోయిన కన్నీళ్ళు. . కోల్పోయిన శిథిల గుప్తానుభూతులు. . కోల్పోయిన ఏదైనా తిరిగొస్తుందా.
మనుషులు జీవిస్తారుగదా. . శరీరంతో. . మనసుతో. . అప్పుడప్పుడు హృదయంతో.
హృదయం ద్రవించి. . కరిగి. . ప్రవహించి. . ఆకాశంలోకి పిచ్చుకవలె ఎగురుతూ,
ముఖేష్ అంటున్నాడు. . ‘ఎక్ పల్ హై మిల్ నా, ఎక్ పల్ బిచడ్ నా. . దునియ హై దో దిన్ కా మేళా’
కలువడం. . విడిపోవడం. . పునః సమాగమ వియోగాలు. . అనంత భమణ విభ్రమాలా.
బోర్లా పడుకునిపోయిందామె. మెత్తని దిండుపై తల. పైన విచ్చుకుని పరుచుకున్న కురులు. . సిల్క్ దారాలవలె.
పాట గాలిలో పక్షివలె లేలిపోతోంది అలలా.
మనిషిలో. . యుగ యుగాల దాహం. . నిరీక్షణ. . అన్వేషణ. . దేనికోసమో స్పష్టంగా తెలియని ఒక నిరాకార నిసర్గ రిక్తానుభవం కోసం. . ఎప్పటికప్పుడి అతీతమైపోతూ. ,
ఇప్పుడా మార్మిక జ్వలనలో మనిషి దహించుకు పోతూ నిశ్శేషమైపోతూనే పునః పునః జన్మిస్తున్నది.
మహాభారత కాలంలో. . మత్స్యగంధి. . శంతనుడు. . ఆ అకస్మాత్ పరస్పర దర్శనంలో ఏమిటి. . మోహమా. . దాహమా. . కామమా.
సముద్ర మథన సందర్భంలో. . మోహిని ఏమిటి. . వెర్రి. పిచ్చి. . దహనం. . ఉన్మత్తత.
సర్వజ్ఞుడైన విశ్వామిత్రుని ముందు. . మేనక. . ఒక రసాధి దేవతై నర్తించినపుడు జాలువారిన నిగ్రహాతీత శృంగారోద్ధీప్తత. . ఏమిటి.
తెలియదు. . తెలియదు.
అన్నింటికీ కారణాలు తెలియవు. ప్రతిదానికీ కారణమూ, హేతువూ ఉండదు.
వర్షమెందుకు కురుస్తుంది. . గాలి ఎందుకు వీస్తుంది. . పూలెందుకు వికసిస్తాయి. పరిమళమెందుకు మనిషిని రసోద్విగ్నతతో వివశుణ్ణి చేస్తుంది.
వ్చ్. . తెలియదు.
అప్పుడు. . ఆ లిప్తలో. . ఆ తప్తతలో,
గమనించింది అనురాధ. . తనపై గాలిలా సోకుతూ. . ప్రాకుతూ. . స్పర్శిస్తూ విస్తరిస్తున్న రమణ చేతి వ్రేళ్ళ కదలికలను.
పురుష స్పర్శ లేక ఎన్నాళ్ళయిందో. వెన్నెలలను కురిపిస్తూనే నిప్పులు వర్షిస్తున్నట్టు, దహించుకుపోతోంది అరణ్యం లోపల. ఒక్క అగ్గిపుల్ల. . అడవిని దహించివేయడం ఎంత చిత్రం.
‘లౌట్ కే ఆ’పాట ఐపోయింది.
తిరిగిరాని వసంతాలు. . తిరిగిరాని వర్షాలు. . తిరిగి ఎన్నడూ రాని ‘వర్షాలు’.
జీవితమంతా వసంతాలు కావాలని అనుకుంటూ. . కాని జీవితమంతా వర్షాలే ఔతూ. ,
రమణ దగ్గరకు. . ఇంకా దగ్గరకు. . కౌగిలిలోకి. . హత్తుకుంటూ. . ఉక్కిరిబిక్కిరి చేస్తూ. . వ్యాపిస్తూ. . పెదవులపై పెదవులను అదుముతూ. .
తడి. . తడి.
లోపల యుగయుగాలుగా విస్తరించిఉన్న ఎడారులన్నీ తడిచి ముద్దవుతూ. . తడి తడి. . చిత్తడి.
అనురాధ తనకు తెలియకుండానే అతని తలను ఒడిలోకి. . స్తనద్వయ పరిష్వంగంలోకి. . దేహాగ్ని వలయంలోకి. . స్వీకరిస్తూ,
అంతా నిశ్శబ్ద దాహ దహనం. . నీరు మండుతున్నట్టు. . నిప్పులు నీరై ద్రవిస్తున్నట్టు. . ఆవిరి. . చెమట పొటమరింపు. హిమాగ్ని శోషణ.
ఆమె రెండు చేతుల్లో రమణ పృధ్వీ క్షేత్రంలో ఓ కోనిఫర్ వృక్షం వలె. ,
అతని బలమైన బాహువుల్లో నలిగిపోతూ, చితికిపోతూ, ఓడి గెలుస్తూ, గెలిచికూడా ఓడుతూ. . ఆమె.
కాలం స్తంభించి అప్పుడప్పుడు ఈ మనుషులమీద దయతో కొన్ని అమృత క్షణాక్షితల్ని చల్లి వెళ్తుంది.
కాలం జీవవాహిని. . ఆగకుండా. . ఆగి ఎవరికోసమూ ఎదురు చూడకుండా. . సకల చరాచర సృష్టినంతా వెంట పెట్టుకుని సమధర్మ అనుగ్రహణతో. . ఒకటే నడక. . ఒకటే గమనం. . ఒకటే పరుగు.
“రమణా. . . ”
“ఊ. . ”
“నిన్న లేదీ బంధం. ఈ రోజు. . చిత్రం కదా”
“ఔను. . ఋణానుబంధాలుంటాయా. . ”
“ఉంటాయనే అనిపిస్తోంది. . లేకుంటే కొద్ది రోజులక్రితం వరకు నువ్వెవరు. . నేనెవరు”
“ఈ రోజు ఇలా జరుగుతుందని నువ్వనుకున్నావా”
“అనుకున్నాను నేను. . నేనూహించాను ముందే”అంది అనురాధ ఖచ్చితంగా.
“ఎలా. ?”
“నిన్నడిగాను నేను ఢిల్లీ నుండి బయల్దేరడానికి ముందే మన స్టే ఎక్కడని. నువ్వు ఈ ఫుల్లర్టన్ బే హోటల్ గురించి చెప్పావు. అప్పుడే అనుకున్నాను మన మధ్య ఇలా జరుగుతుందని. ఎందుకంటే ఒక సౌకర్యవంతమైన హోటల్ గదిలో పెళ్ళి చేసుకోవాలనుకునే ఇద్దరు స్త్రీ పురుషులు ఇలా ఒంటరిగా ఉండేందుకు ఏర్పాట్లు చేసుకున్నారంటే అర్థమేమిటి. ఇదేగదా. ”
చాలా సూటిగా ఉంది మాట.
అప్పుడు చూచింది రమణ కళ్ళలోకి సూటిగా. . నిలకడగా. . లోతుగా. . నిశ్శబ్దంగా.
చూస్తూనే ఉంది. . ఇంకా ఇంకా.
రమణ అలా ఉండిపోయాడు అతనికి తెలియకుండానే. . వశుడైపోయినట్టు.
ఆమె కళ్ళలో నీళ్ళు. . పొటమరించి. . పొంగి. . స్రవిస్తూ. . ధారగా కారుతూ.
చలించిపోయాడు రమణకూడా. ఆశ్చర్యంగా అతని కళ్ళలోకూడా కన్నీళ్ళు చిప్పిల్లాయి. సాధారణంగా అతనికి కన్నీళ్ళు రావు. అందుకే కంపించిపోయాడు.
“అనురాధా. . ఎందుకో కలిశాం. ఈ బంధాన్ని పదిలంగా కాపాడుకుందాం”అని అన్నాడు
“వయసు అనేది మంచు వంటిది రమణా. కరిగిపోతూంటుంది. ఆపలేము. ఒకసారి కరిగిన తర్వాత మళ్ళీ దాన్ని ఘనీభవింపజేయడం కష్టం. ఐతే ప్రతిదినమూ ఉదయానంతర కాలమంతా గడుస్తూనే పోతూంటుంది. మనం పనులను చేస్తున్నా చేయకుండా చేతులను ముడుచుక్కూర్చున్నా కాలగమనం మాత్రం ఆగదు. వయసుకూడా అంతే. శిథిలమౌతూనే ఉంటుంది. ఇతే ఇప్పటికే మనం మనమన కారణాలవల్ల చాలా విలువైన కాలాన్ని, వయసునూ వృధా చేసుకున్నాం. ఇక ఒక్క క్షణం కూడా వృధా చేయొద్దు. “అనురాధ బెడ్ పైనుండి లేచి జుట్టును సవరించుకుంటూ. . అతని వైపు చిలిపిగా చూస్తూనే. ,
“ఔను”
“ఇంతకు ముందన్నానుగదా. . మన పెళ్ళి గురించి. . “అని అర్థోక్తిలో ఆగింది.
“చెప్పు. ఏం చేద్దాం. నువ్వెట్ల చెబుతే అట్లనే చేద్దాం. ”
“రమణా నాకైతే ఈ విధానాలకంటే మనిషిమీదే ఎక్కువ నమ్మకం. కాని ఒక స్త్రీగా నేను మన కొన్ని సంప్రదాయాలను గౌరవిస్తా, , అందుకని. . “అని మెల్లగా నడుస్తూ వెళ్ళి. . తన అందమైన హ్యాండ్ బ్యాగ్ ను తెరిచి ఒక బంగారు రంగు పొట్లాన్ని తెచ్చి విప్పింది. దాంట్లో ధగ ధగా మెరుస్తూ పసుపు దారంతో కట్టి ఉన్న మంగళసూత్రాలున్నై. వాటిని చేతిలోకి తీసుకుంటూ,
“వీటిని నా మెడలో కడుతావా. . ఇది కేవలం ఒక విశ్వాసం మాత్రమే. . ఇక ముహూర్తమా. మన మనసు బాగుంటే ప్రతి క్షణమూ మంగళకరమే నా దృష్టిలో. “అంది.
రమణ మాట్లాడలేదేమీ. మౌనంగా అనురాధ కళ్ళలోకి చూశాడు. అప్పుడా క్షణం ఆమె కేవలం ఒక అతి మామూలు స్త్రీ గా మాత్రమే కనిపించిందతనికి. అర్థింపుగానూ, అమాయకంగానూ, ఆశగానూ ఉన్నాయామె చూపులు.
రమణ లేచి నిలబడి అనురాధ రెండు భుజాలనూ పట్టుకుని ప్రక్కనున్న సోఫాపై కూర్చోబెట్టి. . ఆమె చేతిలోని మంగళ సూత్రాలను తీసుకుని మెడలో వెనుకనున్న దట్టమైన జుట్టును పైకి జరుపుతూ శ్రద్ధగా మూడు ముళ్ళూ వేశాడు.
అప్పుడెందుకో అతని గుండెలు కొద్దిగా దడదడలాడాయి. తడబడ్డాడు.
ఆమె లేచి నిలబడి రమణ కళ్ళలోకి చూచి,
అతను ఆమెను సుతారంగా హృదయానికి హత్తుకుని. . తలను నిమురుతూ,
ఓ ఐదు నిముషాలు గడిచిన తర్వాత. . “నేనొక ఏర్పాటు చేశాను అనురాధా ఎందుకైనా మంచిదని. . “అని సోఫాలో మళ్ళీ కూర్చుంటూనే. . టీపాయ్ పైనున్న తన బ్రీఫ్ కేస్ ను తెరిచి. ,
ఒక కాగితాల కట్ట. . ప్రింటెడ్ డాక్యుమెంట్.
“చదువు దీన్ని. ఒక అడ్వకేట్ తో రాయించాను హైదరాబాద్ లో. . ఎందుకైనా మంచిది ఒక ఋజువు ఉండనీ మన మధ్య. “అని కాగితాలను ఆమె చేతిలో ఉంచాడు.
చదువుకుంది ఐదు నిముషాల్లో.
వెంటనే హ్యాండ్ బ్యాగ్ లోనుండి పెన్నును తీసుకుని కింద తన పేరు ప్రింట్ చేసి ఉన్న ప్రతిచోటా సంతకం చేసింది. రెండు ప్రతులవి. రెండింటి మీదా చేసింది.
తర్వాత రమణ ఒక కాపీని ఆమెకిచ్చాడు ఒక కవర్లో పెట్టి.
అనురాధ నవ్వింది చిన్నగా.
ఆ క్షణం రమణ మదిలో అనురాధకు చెందిన ఆస్తి. . నూటా నలభై కోట్ల సంఖ్య మెదిలింది.
కాని అనురాధ మనస్సులో అతని ఎనభై ఐదు కోట్ల ఆస్తి విషయాలేవీ స్ఫురించలేదు.
కేవలం ఆమెకా క్షణం. . అతి త్వరలో రమణతో తను కనవలసిన ఒకరిద్దరు పిల్లల మీదికి మనసు పోయింది. ఈ వయసులో కూడా పిల్లలను కనకుంటే ఒక స్త్రీగా తనేమి కోల్పోతుందో జ్ఞాపకమొచ్చి కంపించిపోయిందామె.
కొద్ది నిముషాలు నిశ్శబ్దమే నిండిపోయిందక్కడ.
అంది అనురాధ. . “రమణా నేను చదువుకున్నప్పుడు. . డెసిషన్ మేకింగ్ . . అని ఒక చాప్టర్ ఉండేది. అందులో ఏమంటాడంటే. . జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా భవిష్యత్తులో ఆ నిర్ణయం తీసుకున్నందుకు తను ఎన్నడూ పశ్చాత్తాప పడకూడదు. . అని. . కరక్టేనా. ”
ఎందుకో రమణకు ఎవరో చెంపమీద చరిచినట్టనిపించింది.
తలెత్తి ఆమె కళ్ళలోకి చూశాడు.
ఐతే. . అలా ఎక్కువసేపు చూడలేకపోయాడు. . ఎందుకో.

*****

పరాశర్ చనిపోయిన రాత్రి చాలా దుఃఖంతో ఆందోళనతో. . అశాంతితో గడిపాడు జయరాజ్.
అతను వెంటనే చిత్రను కలుసుకున్నాడు. చిత్ర పరాశర్ ఆత్మహత్య విషయం విని కొయ్యబారిపోయింది.
మరునాడు పరాశర్ శవ సంస్కారానికి ఏర్పాట్లు చేస్తూండగా తెలిసిన విషయమేమిటంటే. . చిత్రకూడా ఆత్మ త్యాగం చేసుకుందని. ఏదో భారతీయ యోగవిద్యలో ఉన్న ఆత్మార్పణ విద్య గురించి చిత్ర అప్పుడపుడు చెబుతూండేది. బహుశా ఆమె ఆ విద్యను ఉపయోగించే ఈ లోకం నుండి అతి మౌనంగా నిష్క్రమించింది.
మనిషిలో జీవేచ్ఛ లేకుంటే ఫరవాలేదు. కాని మరణకాంక్ష ఉండకూడదు.
పరాశర్ దంపతుల మరణం తర్వాత సర్కస్ కంపనీ మేనేజర్ రాంలాల్ గుప్తా ఒకరోజు ఒక సీల్ కవర్ ను తన దగ్గరకు తెచ్చి”సర్. . తన తర్వాత పరాశర్ జీ ఈ కవర్ ను మీకిమ్మని చెప్పేవాడు పదేపదే. దీంట్లో ఏముందో తెలియదు. చూడాలి మీరే” అన్నాడు.
“విప్పండి మీరే”అన్నాడు జయరాజ్.
అప్పుడు ప్రక్కన శైల, అనిమల్స్ మాస్టర్ డేవిడ్, బఫూన్ హరి ఉన్నారు. జంతువుల ఆహారంకోసం కావలసిన ఆరోజు ఖర్చు ఆరు వేల రూపాయల ఏర్పాటు గురించి డేవిడ్ అడుగుతున్నాడు అప్పుడు.
మనుషులకు వేళకు ఆహారం పెట్టకుంటే ముఖం మాడ్చుకుని అలుగుతారు. కాని జంతువులు ఆహారం ఆలస్యమైతే బిగ్గరగా అరిచి నానా బీభత్సం చేస్తాయి.
అలుగుతూ ముఖాలు మాడ్చుకుని కుట్రలు చేసే మనుషులకంటే అరిచి గోల చేసే జంతువులే నయమని చాలాసార్లు ఋజువైంది జయరాజ్కు సర్కస్ జీవితంలో.
గుప్తా పరాశర్ కవర్ ను విప్పాడు.
అది ఒక రకమైన వీలునామా.
పరాశర్ ముందే ఊహించాడు. . తన తర్వాత తన భార్య చిత్ర కూడా ఇక జీవించి ఉండదని.
అందుకే ఇకముందు తమ ‘గ్లోబల్ సర్కస్ ‘కు పరాశర్ తదనంతరం జయరాజ్ అనబడే తనే వారసుడు. . యజమాని. . స్వంతదారు. . ఓనర్. . అన్నీ అని. . ఆ లేఖలోని సారాంశం.
ఆ విషయం ఒక రకంగా పరాశర్ కు తన మీద ఉన్న నిఖార్సయిన ప్రేమ, సోదర వాత్సల్యానికి ప్రతీకగా భావించినపుడు ఎంతో గర్వంగా అనిపిస్తుందిగాని. . ప్రస్తుతం ఆ సర్కస్ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయి ఉన్న దివాళా తీసిన సంస్థ. సందేహం లేదు. . ఒకప్పుడు ‘గ్లోబల్ సర్కస్ ‘అంటే బంగారం. వినోద ప్రపంచంలో ధృవతార. పరాశర్జీ తండ్రి భీం సింగ్ కాలం లో ప్రారంభమైన ఆ సర్కస్ ఒక బంగారు బాతు ఒకప్పుడు.
కాలం మారి, సినిమాలు, వీడియోలు, కంప్యూటర్లు వచ్చిన తర్వాత సర్కస్ పాతచింతకాయ పచ్చడైపోయింది.
ఇప్పుడు పరాశర్ తర్వాత ఈ సర్కస్ కు ఓనర్ ఎవరనే విషయం ప్రక్కనపెడ్తే. ,
అప్పులుకట్టి దాన్ని బతికించవలసిందెవరు.
ఈ దేశద్రిమ్మరి వ్యాపార ఆస్తులు దాదాపు మృగ్యమైతే. . జంతువులపైనా, ఇతర ఎక్విప్ మెంట్ పైనా ఉన్న బ్యాంక్ ఋణాల సంగతేమిటి.
ఆర్థిక పరిస్థితి బాగా లేదని తెలిసిన మరుక్షణమే ఉడాయించే కొద్దిమంది సర్కస్ కళల నిపుణులు పోయిన తర్వాత ఈ ‘గ్లోబల్ సర్కస్ ‘మూతపడినట్టేనా. ?
ఈ దివాళా తీస్తున్న కంపనీని ఇప్పుడేమి చేయాలి.
ఈ సంక్షోభం లో కొట్టుమిట్టాడుతున్నప్పుడే. . వచ్చిన కోలుకోలేని ఇంకో దుర్వార్త. . తన కూతురు పదేళ్ళ జయ ముంబాయి టాటా కేన్సర్ ఆస్పత్రిలో బాగుచేయలేని బోన్ మారో కేన్సర్తో అకస్మాత్తుగా చనిపోవుట.
మనిషి ఒక్కడు. దెబ్బలు అనేకం. ఒకదాని వెంట మరొకటి. ఒకదాని తర్వాత ఇంకొకటి.
ఎంత సంక్లిష్ట పరిస్థితులేర్పడినా వెంట నీడలా ఉండే శైల కూడా చితికి పోయింది.
అంది ‘నా వశం కాదు జయరాజ్. . తట్టుకోలేను ఈ దుఃఖాన్ని. వ్రేళ్ళూ పెకిలించబడ్డాయి. కొమ్మలూ కొట్టేయబడ్డాయి. ఒట్టి మొండెమై మిగిలాము. బతకడం కష్టమనిపిస్తోంది. జీవితంలో మొట్టమొదటిసారి భయపడుతున్నాను నేను ‘అని శైల అన్నరోజు. ,
ఆ రాత్రి ఒంటరిగా ఒక గుడారంలో కూర్చున్నాడు జయరాజ్. వెంట శైలను కూడా ఉండమన్నాడు తోడుగా.
చుట్టూ సమస్యలు తుఫాన్ లా చుట్టుముట్టినపుడు గడ్డిపరకై తలెత్తుకుని నిలబడడం నేర్చుకోవాలి.
ప్రతిమనిషికీ ఒక్కసారైనా కట్టకట్టుకుని కష్టాలన్నీ మూకుమ్మడిగా దాడి చేసే సందర్భం వస్తుంది. అప్పుడే నిలకడగా మనిషి ప్రశాంతంగా ఆలోచించాలి.
జయరాజ్ ఒక్కో సమస్యను విడమర్చి పరిష్కరించడం ప్రారంభించాడు.
ఒకటి. . చిన్నప్పటి నుండి తెలిసిన ఈ సర్కస్, తత్సంబంధ విద్యతోనే బతుకు కొనసాగించడమా. లేక దిశ మార్చుకుని వేరే రంగంలోకి వెళ్ళడమా.
శైలను చెప్పమన్నాడు జవాబులను.
శైల చెప్పింది. . ఇప్పుడు మన వయసు ముప్పై పైననే. కొత్త విద్యలను నేర్చుకోవడం కష్టం. కాగా మనకు వచ్చిన ‘ కత్తులు విసిరే విద్య ‘ అసాధారణ మైనది. సాహసోపేత మైనదికూడా. ఐతే దాన్ని రోడ్డుపైన ప్రదర్శిస్తే అది గారడి విద్య. సర్కస్ లాంటి వేదికపైన ప్రదర్శిస్తే అదొక సెలెబ్రిటీ ఐటం. కాబట్టి మనం మనలోని ఈ వచ్చిన విద్యలనే క్రోడీకరించుకుని ఆధునీకరించుకుని ముందుకు పోవడం మంచిది.
రెండు. . మరి. . ఈ సర్కస్ ఆర్థిక పరిస్థితులేమిటి. వీటిని తట్టుకుని నిలబడి మళ్ళీ కోలుకోగలమా.
శైల చెప్పింది. . నాకైతే వ్యక్తిగతంగా జయ, పరాశర్, చిత్ర. . వీళ్ళ మరణాలు క్షోభ కలిగిస్తున్నాయి గాని. . ఆర్థిక పరమైన ఒడుదొడుకులు కృంగదీయడం లేదు. నువ్వన్నట్టు సర్కస్ ఆర్థికంగా కొద్ది నష్టాల్లో ఉండిఉంటుంది. కాని మనం కొద్ది తెలివితో పునర్నిర్మిస్తే మళ్ళీ పుంజుకోవచ్చేమో.
మూడు. . సర్కస్ ను మూసేస్తే.
శైల. . మనుషులతోపాటు మనతో ఇరవై ఎనిమిది జంతువులున్నైగదా. వాటి సంగతి. పాపం నోరులేని జంతువులు. వాటినేంజేద్దాం. నాకైతే ఎలాగైనా వీటిని కాపాడుతూ మనను మనం రక్షించుకునే ఉపాయం చేయాలని ఉంది.
నాలుగు. . ఇతరేతరమైన ఆధునిక వినోద సాధనాలు సినిమాలు, టివి లు, కంప్యూటర్లు, ఐఫోన్లు
అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంకా ఈ పురాతన ‘సర్కస్ ‘ను జనం ఆదరిస్తారా.

ఇంకా ఉంది….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *