April 30, 2024

ఆరాధ్య 10

రచన: అంగులూరి అంజనీదేవి

ఆరాధ్య నేరుగా ఇంటికెళ్లలేదు. సరయు దగ్గరకి వెళ్లింది. సరయు ఒడిలో తలపెట్టుకొని ఏడ్చింది. ఏడ్చేవాళ్లను ఎలా ఓదార్చాలో సరయుకి బాగా తెలుసు. ఎలా మాట్లాడితే ఆరాధ్య కోలుకుంటుందో, ఎనర్జిటిక్‌గా ఫీలవుతుందో అలా మాట్లాడింది.
మాట్లాడుతూనే వంట చేసింది సరయు. ఆరాధ్య సరిగా తినకపోతే బ్రతిమాలి తినిపించింది. తను కూడా తిన్నది.
తిన్న ప్లేట్ల ముందు నుండి లేవకుండానే హేమంత్‌కి, తనకి మధ్యన జరిగిన సంభాషణ చెప్పింది ఆరాధ్య.
వినగానే బిత్తరపోయింది సరయు.
”సరయూ! ఇప్పుడు చెప్పు! నేను హేమంత్‌ దగ్గరకి వెళ్లటం అవసరం అంటావా?” నెమ్మదిగా అడిగింది ఆరాధ్య.
”నన్నడిగితే వేస్ట్‌!” టక్కున అంది సరయు.
”మరిప్పుడు నన్నేం చేయమంటావు?”
”నేనున్నాను కదా! నా దగ్గర వుండు”
”హేమంత్‌తో చెబితే ఏమంటాడో?”
”నాకు తెలిసి అతను ఏమీ అనకపోవచ్చు. నీతో అవసరం లేదు కదా!”
”నాకెందుకో నువ్వలా అంటుంటే షేమ్‌గా వుంది”
”అనకపోయినా అదే! మీనింగ్‌లో ఏమైనా తేడా ఉందా?
”లేదు”
”మరి ఎందుకు డౌట్‌?”
”డౌటేమీ లేదు”
”మీ మమ్మీ ఏమైనా అంటుందనా?”
”అలాంటిదేం లేదు. నాకు ఎక్కడ కంఫర్ట్‌గా వుంటే అక్కడ వుండమంటుంది. మా మమ్మీతో ఎలాంటి ప్రాబ్లమ్స్‌ రావు”
”సరే! ఆలోచించుకో! నీకు ఎక్కడ వుంటే మెంటల్‌ పీస్‌ వుంటుందో అక్కడ వుండు. వర్క్‌లోడ్‌ పెరిగినట్లు మానసిక వత్తిడి పెరగడం అంత మంచిది కాదు. నిద్ర లేచినప్పటి నుండి మనం ఖాళీగా వుండేవాళ్లం కాము. జాబ్‌ చేసుకునేవాళ్లం” అంది సరయు.
సరయు మాటలు కరక్ట్‌ అన్పించాయి.
హేమంత్‌ దగ్గరకి వెళ్లి, అతను అవాయిడ్‌ చేస్తుంటే ఫీలవుతూ బాధపడేకన్నా ఇక్కడ వుండటమే బెటర్‌ అనుకుంది.
”సరే! సరయు! ఇక్కడే వుంటాను” అంది ఆరాధ్య.
”ఓ.కే.” అంది సరయు.
*****

టీమ్‌ అవుటింగ్‌కెళ్లిన హేమంత్‌ ఇంటికొచ్చాడు.
డోర్‌ లాక్‌ చేసి వుండటంతో ఆరాధ్యకు కాల్‌ చేద్దామని మొబైల్‌ చేతిలోకి తీసుకోగానే ఆ మొబైల్‌లో ‘మనం ఎప్పుడూ పెట్టే సీక్రెట్‌ ప్లేస్‌లో ‘కీ’ వుంది.’ అని ఆరాధ్య పంపిన మెసేజ్‌ కన్పించింది. అది చూసిన వెంటనే ‘కీ’ తీసుకొని డోర్‌ లాక్‌ తీస్తూ ఆరాధ్యకు కాల్‌ చేశాడు హేమంత్‌.
ఆరాధ్య అతని కాల్‌ లిఫ్ట్‌చేసి ‘హలో’ అనగానే ”నువ్విప్పుడెక్కడున్నావ్‌ ఆరాధ్యా?” అన్నాడు.
”సరయు దగ్గర వున్నాను హేమంత్‌!”
”అక్కడెందుకున్నావు?”
”నువ్వు లేవు కదా! వున్నా నైట్‌ పదకొండువరకు ఇంటికి రావు. వచ్చినా నన్ను టచ్‌ చెయ్యవు. అందుకే సరయు దగ్గర వున్నాను”
”నీకేమైనా పిచ్చిపట్టిందా?”
”మన ఇద్దరి మధ్యన ఏ సంబంధం లేకుండా లేట్‌ నైట్స్‌ ఇంటికొచ్చే నీ దగ్గర వున్నా, ఈ సరయు దగ్గర వున్నా ఒకటే అనుకున్నాను హేమంత్‌! అందుకే ఇక్కడ వున్నాను. అంతేకాని నాకు పిచ్చి పట్టలేదు. పిచ్చిపడితే సరయు దగ్గర వుంటానా? ఎర్రగడ్డకెళ్లనా?”
”ఓ… షిట్‌!” అన్నాడు.
”షిట్‌ కాదు. మాట్లాడు హేమంత్‌! ఫోన్లో ఎంతసేపు మాట్లాడినా ఏం కాదు. నో ప్రాబ్లమ్‌! వాంటింగ్స్‌ కావు. లాబ్‌లో వున్నట్లు వుండదు. రియల్‌గానే వుంటుంది. ఎదురెదురుగా వుండి మాట్లాడుకుంటున్న ఫీలింగ్‌ కూడా వస్తుంది”
”నువ్విలా ఏ పుట్టింటికో అత్తింటికో వెళ్లినట్లు సరయు దగ్గరకి వెళ్లటం నాకు నచ్చడం లేదు ఆరాధ్యా! నువ్వు వెంటనే ఇంటికొచ్చెయ్‌! ఏదైనా వుంటే ఫేస్‌ టు ఫేస్‌ మాట్లాడుకుందాం!”
నవ్వి ”సరయు దగ్గరకి వచ్చేముందు అత్తింటికి వెళ్లే వచ్చాను హేమంత్‌!” అంది ఆరాధ్య.
ఆమె ఎందుకలా నవ్విందో అర్థంకాక ”నిజంగా వెళ్లావా?” అన్నాడు.
”వెళ్లాను. అక్కడ వుండే ఉపేంద్ర అంకుల్‌ అదే మీ నాన్నగారు నన్ను గుమ్మంలోంచే వెళ్లగొట్టాడు. అంతవరకు అత్తింటి మీద వుండే ఇంప్రెషన్‌ కాస్తా పోయింది. ఇంకెప్పుడూ అత్తింటి గురించి నా దగ్గర మాట్లాడకండి!”
”నువ్విప్పుడు ఇంటికొస్తావా? రావా?”
”రాను”
హేమంత్‌ మాట్లాడలేదు.
”మాట్లాడు హేమంత్‌!”
”నువ్వు నాకు నచ్చడం లేదు”
”కావచ్చు. కానీ హేమంత్‌! నిన్ను మీ బంధువుల్లో చనిపోయాడని చెప్పుకున్నాడట మీ నాన్న! అలా ఎందుకు చెప్పారో అడిగావా?”
ఆమె అలా అడుగుతుంటే నరాలు తెగిపోయేంత నొప్పి కలిగింది హేమంత్‌ బాడీలో! బాడీకన్నా మనసుకే ఎక్కువ బాధగా వుంది.
”నువ్వు అడిగి తెలుసుకున్నాకనే నేను నీ దగ్గరకి వస్తాను. ఏ రీజన్‌ లేకుండా కొడుకు చనిపోయాడని కన్నవాళ్లు చెప్పుకోరు. ఆ రీజన్‌ ఏమిటో నాకు తెలియాలి. ఇప్పుడు నేనున్నాను. నా లైఫ్‌కో క్లారిటీ వుంది. అది నీ లైఫ్‌కి లేదు. అందుకే మీ నాన్నగారు నన్ను తన కోడలిగా యాక్సెప్ట్‌ చెయ్యలేకపోయారు. నువ్వు అనాధవైనా నాకింత బాధ వుండేది కాదు. అమ్మా, నాన్న వుండి అనాదలా వుండటం, అదీ బంధువుల దృష్టిలో చనిపోయి ఉండటం ఏమిటిదంతా? నాకు తెలియాలి హేమంత్‌!! నువ్వేంటో, నీ లైఫ్‌లో వుండే ఆ సీక్రెట్‌ ఏమిటో నాకు తెలియాలి” అంది.
హేమంత్‌ కాల్‌ కట్‌ చేశాడు.
*****

ఆరాధ్య హేమంత్‌ దగ్గర నుండి మళ్లీ వెళ్లిపోయిందని కాశిరెడ్డి చెప్పగానే విజయం ఏమిటో తెలుసుకోవాలని శార్వాణికి ఫోన్‌ చేసింది కళ్యాణమ్మ.
”శార్వాణి గారు! నాకేదో అనుమానంగా వుంది. ఒకసారి హేమంత్‌ జాతకం వుంటే ఇవ్వండి! మాకు తెలిసిన రామశాస్త్రి గారికి చూపిద్దాం! ఏమైనా దోషాలుంటే వెంటనే టెంపుల్‌కెళ్లి శాంతిపూజలు చేపిద్దాం! వాళ్లిద్దరు బాగుంటమేగా మనకు కావలసింది” అంది.
”హేమంత్‌ జాతకం రాయించలేదు కళ్యాణి గారు!” అంది శార్వాణి.
”పోనీ హేమంత్‌ పుట్టిన టైం ఎలాంటిదో అడిగి తెలుసుకున్నారా?”
”లేదు. అడగలేదు”
”ఎందుకు అడగలేదు? అలాంటి నమ్మకాలు లేవా మీకు?”
”నమ్మకాలు వున్నాయి. కానీ మావారు అలాంటి నమ్మకాలను పట్టించుకోరు. ఆయన ఆదో టైప్‌ మనిషి!”
”అదో టైప్‌ అంటే?” అని కళ్యాణమ్మ అడగలేదు. అలాంటి విషయాలను వాళ్లంతట వాళ్లు చెబుతుంటే వినాలి కాని కొశ్చన్స్‌ వెయ్యటం సంస్కారం కాదని మౌనంగా వుంది.
శార్వాణికి మౌనంగా వుండాలనిపించలేదు. ఈ మధ్యన కళ్యాణమ్మతో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడు తున్నందువల్లనో ఏమో కొంత దగ్గరతనాన్ని, ఆత్మీయతను పెంచుకుంది. మనసులో మాటను పంచుకునేంత చనువు కూడా పెరిగింది. ఇప్పుడామెతో ఏది మాట్లాడినా రహస్యంగా వుంటుందన్న నమ్మకం కుదిరింది.
అందుకే శార్వాణి నోరువిప్పి ఉపేంద్ర గురించి చెప్పాలనుకుంది.
”ఆయనకు డబ్బు అంటే చాలా ఇష్టం కళ్యాణిగారు! ఈ ప్రపంచంలో దేన్నీ ఇష్టపడనంతగా డబ్బును ఇష్టపడతారు. ఆయనకు డబ్బు తర్వాతనే అన్నీ…” అంది.
”డబ్బు అంటే ఇష్టం లేనిది ఎవరికి శార్వాణిగారు! డబ్బు వుంటేనే కదా ఏదైనా చెయ్యగలుగుతారు. ఉదాహరణకి మీ బాబు పుట్టినప్పుడు ఒక బ్రాహ్మణుడి దగ్గరకి వెళ్లాలన్నా, ఆ బాబు ఏ టైంలో పుట్టాడో ఎలాంటి టైంలో పుట్టాడో తెలుసుకోవాలన్నా డబ్బు కావాలి. డబ్బుల్లేకుంటే ఏ పని జరుగుతుంది?”
”డబ్బులు వుండి కూడా ఏ పనీ జరగనప్పుడు బ్యాంకులో ఎంత డబ్బు వుండి ఏం లాభం కళ్యాణిగారు? డబ్బుల్ని సంపాయించుకునేది అకౌంట్‌బుక్‌లో అంకెల్ని పెంచుకోటానికా? అవసరాలను తీర్చుకోటానికా? ఆయన థియరీలో డబ్బులెప్పుడూ అకౌంట్‌బుక్‌లోనే వుండాలి. వాటిని కదిలించటానికి లేదు. అవసరాలదేముంది ఇవాళ వస్తుంటాయి రేపు పోతుంటాయి అంటారు. ఇంకా ఏమంటారో చెబితే మీరు ఆశ్చర్యపోతారు” అంది.
”ఏమంటారు?” అడిగింది కళ్యాణమ్మ.
”గాలి పీల్చుకునైనా కొద్దిసేపు బ్రతకొచ్చు కదా! ఆ మాత్రం బ్రతకటం కోసం అన్నన్నిసార్లు తిండి తినాలా? ఎంత ఖర్చు! ఎంత ఖర్చు! అంటారు. ఆయన అలా అంటున్నప్పుడు మా అమ్మ నన్ను ఎందుకు కన్నది? ఇలాంటి ఆయన చేతిలో ఎందుకు పెట్టింది అన్న బాధ కలిగేది” అంది.
కళ్యాణమ్మకు నిజమే అన్పించింది. ఇలాంటి మాటలు వింటుంటే ఏమీ అనిపించదు కాని తనదాకా వస్తే మాత్రం ఎవరికైనా నరకమే!
”హేమంత్‌ పుట్టినప్పుడు మా అమ్మ బ్రతికే వున్నది. ఆమె చదువుకోలేదు. బయట పనులు చూడటానికి మా నాన్న లేడు. అందుకే హేమంత్‌ పుట్టగానే మావారితో ‘ఉపేందర్‌! బాబు ఏ టైంలో పుట్టాడో కొంచెం చూపించయ్యా!’ అంది.
ఆయన చూపించలేదు. ‘డబ్బులకోసం వాళ్లు ఏవేవో అనుమానాలు చెబుతారు. శాంతులంటారు. జపాలంటారు. తపాలంటారు. అవన్నీ అవసరమా? పుట్టినవాడు మళ్లీ పుడతాడా? పుట్టిన డేట్‌ మళ్లీ మారుతుందా? వాళ్లకెందుకు చూపించడం’ అంటూ ఎవరికీ చూపించలేదు. చూపించి వుంటే బావుండేదేమోనని నాకు చాలాసార్లు అన్పించింది. వాడి జాతకంలో ఏం దోషాలున్నాయో ఏమో ఇరవై సంవత్సరాలు వాడూ-నేనూ దూరమైపోయాము” అంది బాధగా.
”మీరు సరే! అది జరిగిపోయిన చరిత్ర. ఇప్పుడు వాళ్లిద్దరు కూడా విడిగా వుంటున్నారు కదా! ఏమైనా దోషాలు వుంటే రెమెడీ చేపిద్దాం! డేటాఫ్‌ బర్త్‌ చెప్పండి చాలు. మా శాస్త్రిగారికి చూపిస్తాను” అంది కళ్యాణమ్మ.
”హేమంత్‌ డేటాఫ్‌ బర్త్‌ నా దగ్గర లేదు. అదో పీడకలలా దాన్ని అప్పుడే మరచిపోయాను. అలా మరచిపోకుంటే నేను బ్రతకలేను కళ్యాణిగారు! ఆ పాతరోజులు ఆ జ్ఞాపకాలు చెదలు తొలచినట్లు నా మనసును తొలిచేస్తాయి. కావాలంటే హేమంత్‌ దగ్గరేమైనా వుందేమో అడుగుదాం!” అంది శార్వాణి. హేమంత్‌ దగ్గర కూడా వుండకపోవచ్చు అన్న అనుమానం ఆమెలో లేకపోలేదు.
ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రహస్యం వుంటుంది. అది విషాదం కావచ్చు. ఆనందం కావచ్చు. కారణాలు పైకి కన్పించవు. కానీ శార్వాణి ఒక చదువుకున్న మహిళ అయివుండి కూడా కొడుకు డేటాఫ్‌బర్త్‌ గుర్తుంచుకో లేకపోయిందా? అయినా శార్వాణిలో మనసును తొలిచేంతటి బాధ వుందా? నమ్మలేకపోతోంది కళ్యాణమ్మ.
”సరే! శార్వాణి! నేను మళ్లీ కాల్‌ చేస్తాను. హేమంత్‌ పుట్టినరోజు మాత్రం అడిగి తెలుసుకొని వుండండి! మాకు తెలిసిన రామశాస్త్రి గారి దగ్గర అపాయింట్‌మెంట్‌ తీసి పెడతాను. ప్రతి దోషానికి ఓ రెమిడీ వుంటుంది. వాటిని చేయించుకోటానికి చాలా శక్తివంతమైన టెంపుల్స్‌కూడా వున్నాయి. మనం భయపడాల్సిందేమీ లేదు. వాళ్లిద్దరు తప్పకుండా కలిసి వుంటారన్న నమ్మకం నాకుంది” అంటూ కాల్‌ కట్‌ చేసింది.

*****

కళ్యాణమ్మ ఫోన్లో ధైర్యం చెప్పినప్పటి నుండి ప్రశాంతంగా వుంది శార్వాణి. ఆఫీసుకెళ్లాలని రెడీ అవుతున్న భర్తతో ”నేను హేమంత్‌ దగ్గరకి వెళ్తున్నాను. వాడిని చూసి చాలా రోజులైంది” అంది.
ఆయన ఆఫీసుకెళ్తూ ”వెళ్లి అటే వుండకుండా త్వరగా ఇంటికిరా!” అన్నాడు. ఆయన హేమంత్‌ గురించి వేరేవాళ్లు వినేటట్లు ఏమీ చెప్పొద్దంటాడు. అంతేకాని ఆమెను కొడుకు దగ్గరకి వెళ్లొద్దని మాత్రం చెప్పడు. అదొక్క ఆనందమే మిగిలింది శార్వాణికి. అత్యంత విషాదం ఏమిటంటే హేమంత్‌ బ్రతికివున్నాడని బంధువుల్లో ఇంతవరకు చెప్పలేదు. చెబుదామని ఆమె భర్తను బ్రతిమాలింది. వినకపోతే కోప్పడింది. ”అలా చెప్పటం అంటూ జరిగితే నువ్వు నన్ను మరచిపోవాలి” అన్నాడు. ”బంధువులతో చెప్పకపోయినా పర్వాలేదు కనీసం మీరైనా హేమంత్‌ని చూడండి! మాట్లాడండి!” అంది. అతను చూడలేదు. మాట్లాడలేదు. హేమంత్‌కి తండ్రిని చూడాలని వున్నా తల్లి చెప్పింది విని షాకయ్యాడు. ఇక అప్పటి నుండి హేమంత్‌ తండ్రిని కలుస్తానని ఎప్పుడూ అడగలేదు.
ఉపేంద్ర ఆఫీసుకి వెళ్లాక శార్వాణి ఆఫీసుకి లీవ్‌ పెట్టింది.
అప్పుడు టైం 10 గంటలు దాటింది.
ఒకసారి కాశిరెడ్డి ”ఆంటీ! హేమంత్‌కి నెయ్యితో తయారుచేసే జీడిపప్పు హల్వా అంటే చాలా ఇష్టం. వీకెండ్‌లో నేనూ, హేమంత్‌ మా ఊరువెళ్తే మా మమ్మీ కంపల్‌సరిగా ఆ స్వీట్‌ చేసి పెడుతుంది” అనటం గుర్తొచ్చి హేమంత్‌ కోసం జీడిపప్పు హల్వా తయారుచేసుకుంది. దాన్ని రోజూ తను ఆఫీసుకి తీసికెళ్లే లంచ్‌బాక్స్‌లో పెట్టుకొని హేమంత్‌ దగ్గరకి వెళ్లింది.
అతను ఇంట్లో లేడు. డోర్‌ లాక్‌ చేసివుంది. ఎక్కడికెళ్లి వుంటాడు? మొన్న ఫోన్‌ చేసినప్పుడు ఆఫీసులో తన షిఫ్ట్‌ మారిందని, ఇప్పుడు మధ్యాహ్నం రెండు గంటలకి వెళ్తున్నానని చెప్పాడు. ఆమె ఇంట్లో వున్నప్పుడు హేమంత్‌కి ఎక్కువసార్లు ఫోన్‌ చేసినా, ఎక్కువసేపు మాట్లాడినా భర్త వూరుకోడు. అందుకే ఎప్పుడైనా ఆమెకు హేమంత్‌తో మాట్లాడాలనిపించినప్పుడు ఆఫీసుకెళ్లి ఫోన్‌ చేసి మాట్లాడుతుంది. ఎలాగూ ఈ టైంలో ఇంట్లోనే వుంటాడు కదా అని ఫోన్‌ చెయ్యకుండానే వచ్చింది.
అక్కడే నిలబడి ఆమె మొబైల్‌లోంచి హేమంత్‌కి కాల్‌ చేసింది. వెంటనే హేమంత్‌ ఆమె కాల్‌ని లిఫ్ట్‌చేసి ”హలో! అమ్మా!” అన్నాడు. ”ఎక్కడున్నావ్‌ హేమంత్‌?” ఆత్రుతగా అడిగింది శార్వాణి.
”ఇప్పుడే ఇంటికెళ్తున్నానమ్మా! ఇవాళ నేను అనాధాశ్రమానికి వెళ్లాను”
”అక్కడికెందుకెళ్లావ్‌?”
”నేనొచ్చాక చెబుతాను”
”నేను నీ దగ్గరికే వచ్చాను హేమంత్‌! నువ్వు లేవు. రావటానికి లేటవుతుందేమో! ఇంటికెళ్లనా?”
”వద్దమ్మా! వుండు. నేను గేటు దగ్గరే వున్నాను. లోపలికి వస్తున్నాను” అంటూ ఫోన్లో మాట్లాడుతూనే తల్లి దగ్గరకి వచ్చాడు.
హేమంత్‌ లాక్‌ తీయగానే శార్వాణి లోపలకెళ్లి కూర్చుని ”రా! హేమంత్‌! కూర్చో!” అంది.
అతను లోపలకి వెళ్లి షూష్‌ విప్పుకొని ఓ పక్కన పెట్టి తల్లికి ఎదురుగా కూర్చున్నాడు.
ఆమె తెచ్చిన జీడిపప్పు హల్వా వున్న బాక్స్‌ ఓపెన్‌ చేసి, స్పూన్‌తో కొంచెం, కొంచెం తీసి కొడుకు నోట్లో పెట్టింది. హేమంత్‌ తింటూ ఏదో ఆలోచిస్తున్నాడు.
సడన్‌గా ”అమ్మా! స్వీట్‌ చాలా బావుంది. నాన్న తిన్నాడా?” అన్నాడు.
ఆమె చిత్రంగా చూసి ”మీ నాన్న అంటే ఎందుకురా నీకింత ప్రేమ? సందర్భం కాకపోయినా కల్పించుకొని మరీ అడుగుతావు. నువ్వు ఈ కాలంలో పుట్టాల్సినవాడివి కాదు. రోషావేశాలకు, కోపతాపాలకి అతీతంగా పుట్టావు” అంది. కొడుకువైపు సంతృప్తిగా చూసింది.
”తండ్రి అంటే ఎవరికైనా వుంటుంది కదమ్మా ప్రేమ? నీకు లేదా మీ నాన్నంటే! తాతయ్య లేకపోయినా తాతయ్య గురించి కథలు, కథలుగా చెప్పేదానివి. ఆ కథలు నాకు సరిగా గుర్తు లేవనుకో! అప్పట్లో బాగా చిన్నవాడిని కదా!” అన్నాడు.
”చిన్నవాడివైనా నీకన్నీ గుర్తున్నాయి హేమంత్‌! నీకు వున్నన్ని జ్ఞాపకాలు నాకు లేవు. నేను అన్నీ మరచిపోయాను… అయినా నువ్వు నా పెంపకంలో పెరగలేదు కదా! ఎలా వుంటావో ఏమో అని భయపడ్డాను. కానీ నేను అనుకున్నదానికి ఇప్పుడు నువ్వు కన్పిస్తున్న దానికి చాలా తేడా వుందిరా!” అంటూ సంతోషంగా లేచి ఫ్రిజ్‌ దగ్గరకి వెళ్లి గ్లాసునిండా కూల్‌ వాటర్‌ తెచ్చి కొడుక్కి ఇచ్చింది శార్వాణి.
”ఎక్కడ పెరిగినా ఎక్కడ వున్నా నా ఒంట్లో వుండేది నీ బ్లెడ్డే కదమ్మా!” అంటూ మళ్లీ ఆలోచనలో పడ్డాడు హేమంత్‌.
హేమంత్‌ వైపు నిశితంగా చూసి ”ఏంటి! హేమంత్‌! ఆలోచిస్తున్నావ్‌? అనాధాశ్రమానికి ఎందుకెళ్లావ్‌?”
”సాగర్‌ రెడ్డి హైదరాబాదు వచ్చాడని తెలిసి వెళ్లానమ్మా!”
”సాగర్‌ రెడ్డి ఎవరు హేమంత్‌?”
”సాగర్‌రెడ్డి, నేను ఒకే అనాధాశ్రమంలో వుండి పెరిగాం! అందులో వున్నప్పుడు కాని, అందులోంచి బయటకొచ్చాక కాని ఇద్దరం క్లోజ్‌గానే వున్నాం! అప్పుడప్పుడు కలుసుకుంటూనే వుంటాం!” అన్నాడు.
అది వింటుంటే సిగ్గుతో చిన్నబుచ్చుకుంది. భీతితో లోలోన తల్లడిల్లింది శార్వాణి. ఆమె అలా అవుతుందని అతను చెప్పటం లేదు. జరిగింది చెబుతున్నాడు. అతను చాలా నార్మల్‌గా వున్నాడు. కానీ ఆమె తన కొడుకు అనాధాశ్రమంలో వుండి పెరిగాడన్నది భరించలేకపోతోంది. అలాంటి పరిస్థితులు ఎందుకొచ్చాయి అనేదానికన్నా వాటిని అదిగమించలేకపోయానే అన్న బాధే ఆమెలో ఎక్కువగా వుంది.
”సాగర్‌రెడ్డి చాలా గొప్పవాడు. అతను చేస్తున్న పనులు వింటే నువ్వు ఆశ్చర్యపోవు. అభినందిస్తావు. ఇప్పుడే అతన్ని చూడాలంటావు. అలాంటి పనులు చేస్తున్నాడు. ఎవరూ చెయ్యని పనులు చేస్తున్నాడు”
”ఏంటి నాన్నా ఆ పనులు?” ఆమె మామూలు మూడ్‌లోకి వచ్చి ఆసక్తిగా అడిగింది.
”అమ్మా! నీకు తెలిసిన ప్రపంచం వేరు. నేను చూసిన ప్రపంచం వేరు. అది నీకు కొంత తెలిస్తేనే సాగర్‌రెడ్డి చేసే పనులు ఎంత ఉదాత్తమైనవో తెలుస్తాయి”
”చెప్పు! హేమంత్‌! నాక్కూడా తెలుసుకోవాలని వుంది” అంది.
”సాగర్‌రెడ్డి తల్లిదండ్రులు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న నేరానికి కుటుంబ గొడవల్లో చనిపోయారమ్మా! సాగర్‌రెడ్డిని రెండు సంవత్సరాల వయసు వున్నప్పుడు ఎవరో తీసికెళ్లి అనాధాశ్రమంలో చేర్పించారు. నన్ను కూడా నాకు వైద్యం చేయించిన దాత దయార్ధహృదయంతో నాకు ఆరు సంవత్సరాల వయసు వున్నప్పుడు అదే ఆశ్రమంలో చేర్పించాడు. సాగర్‌రెడ్డి, నేను ఆ ఆశ్రమంలో చేరింది ఒకే టైంలో కాకపోయినా ఇద్దరిది ఒకే వయసు. ఇద్దరం కలిసి మెలిసి వుండేవాళ్లం. ఆడినా, చదివినా, తిన్నా, పడుకున్నా, ఏదైనా పని చేసినా ఇద్దరం విడివిడిగా వుండేవాళ్లం కాదు. మాకు మరో వాతావరణం వుందని తెలియక పోవటం వల్లనో ఏమో ఆ ఆశ్రమం బాగా నచ్చేది.
అలా మాకు పద్దెనిమిది ఏళ్లు వచ్చేవరకు అక్కడే వున్నాం. తర్వాత అక్కడ వుండటానికి లేదు. ఎవరైనా పద్దెనిమిదేళ్లకు ఆ ఆశ్రమంలోంచి బయటకు వెళ్లాల్సిందే! అది అక్కడి నియమం. మేము కూడా అందరిలాగే అందులోంచి బయటకొచ్చాము.
బయటకొచ్చాక మాకంతా అయోమయం. ఏదారీ కన్పించలేదు. ఎలా బ్రతకాలో తెలియలేదు. చనిపోవాలనుకున్నాం” అంటూ ఆగాడు ఆరోజుల్ని గుర్తుచేసుకుంటూ హేమంత్‌.
ఆఖర్లో హేమంత్‌ అన్నమాట విని వణికింది శార్వాణి. ఎంతయినా తల్లిమనసు. దేన్ని తట్టుకున్నా కన్నబిడ్డ చావును తట్టుకోలేదు. చావును వూహించలేదు.
”తరువాత ఏం జరిగిందో చెప్పు హేమంత్‌!” అడిగింది శార్వాణి. ఆమెకు చాలా యాంగ్జయిటీగా వుంది.
”ఇద్దరం ఒకరికి ఒకరం కౌన్సిలింగ్‌ ఇచ్చుకొని, ధైర్యం తెచ్చుకున్నాం. చనిపోవటానికి చెయ్యాల్సిన ప్రయత్నాలేమీ చెయ్యలేదు. ముంబై వెళ్లాం. టెలిఫోన్‌ కేబుళ్లకి గోతులు తీసే పనిలో కుదిరాం. గుళ్లో నిద్రపోయేవాళ్లం. ఆ పని చేస్తూనే సాగర్‌రెడ్డి సివిల్‌ ఇంజనీరింగ్‌ చేస్తే నేను కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ చేశాను. కాశిరెడ్డి నా బ్యాచ్‌మేట్‌. సాగర్‌రెడ్డిలాగే తను కూడా నాకూ బాగా క్లోజయ్యాడు. అయితే నేను, సాగర్‌రెడ్డి కార్పొరేట్‌ కాలేజీలో చేరటానికి నాకు వైద్యం చేయించిన దాతనే ముందుకొచ్చాడు.
బి.టెక్‌ పూర్తి కాగానే, సాగర్‌రెడ్డికి ఎల్‌అండ్‌టి సంస్థలో ప్లానింగ్‌ ఇంజనీర్‌గా జాబ్‌ వస్తే నాకు, కాశిరెడ్డికి సాఫ్ట్‌వేర్‌ జాబ్స్‌ వచ్చాయి.
జాబ్స్‌ వచ్చాక మా దారులు, గమ్యాలు, లక్ష్యాలు, ఆలోచనలు, అభిరుచులు వేరయిపోయాయి.
సాగర్‌రెడ్డి ఎందుకో తెలియదు అనాధలకు దారిచూపించే పనిలో పడ్డాడు. తను జాబ్‌ చేసి కూడపెట్టిన రెండు లక్షల రూపాయలతో అనాధలకోసం ఓ సంస్థను ప్రారంభించాడు. ఈ మూడేళ్లలో అతని సేవలు విస్తృతంగా విస్తరించాయి. వందలమంది అబ్బాయిలు, అమ్మాయిలు చేరిపోతున్నారు. వాళ్లందరికి మల్టీమీడియా, వెబ్‌ డిజైనింగ్‌, ఆటోక్యాడ్‌, ప్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులలో శిక్షణ ఇప్పిస్తున్నాడు. ఆ సంస్థ మొదలైనప్పుడు సాగర్‌రెడ్డి ఒక్కడే! ఇప్పుడు అతనికి ఎనిమిది వందల జతల చేతులు అండగా వున్నాయి. అతని సేవలు నచ్చి చాలామంది ఆర్ధిక సహాయం అందిస్తున్నారట. సంస్థ నడపటానికి కోర్‌ కమిటీ కూడా మొదలైందట…” అన్నాడు హేమంత్‌.
”గ్రేట్‌ హేమంత్‌! అతను నిజంగానే గ్రేట్‌!” అంది శార్వాణి.
”అంతే కాదమ్మా! సాగర్‌రెడ్డి అనాధలకోసం ఇంకా చాలా చెయ్యాలనుకుంటున్నాడు. వాళ్లకు కూడా సమాజంలో గుర్తింపు వుండాలనుకుంటున్నాడు”
ఆమెకు అర్థంకాక ”గుర్తింపు అంటే?” అంది.
”అనాధలకి తప్పనిసరిగా రేషన్‌, ఆధార్‌, ఓటింగ్‌ కార్డులు ఇవ్వాలని… క్యాస్ట్‌ సర్టిఫికేట్లు సమకూర్చాలని… అమ్మాయిలకు, అబ్బాయిలకు వేర్వేరు అనాధ యూత్‌ హాస్టల్స్‌ కట్టించాలని… అనాధలకి పెళ్లిళ్లు జరిపించే బాధ్యత ప్రభుత్వాలే తీసుకోవాలని… ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని అతనుండే మహారాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలందరినీ కలుస్తువున్నాడు. ఎవరైనా దాతలు ముందుకొస్తే వాళ్ల పేరు మీదనే అనాధాశ్రమాలు నడిపిస్తానంటున్నాడు. ఇదీ నా ఫ్రెండ్‌ సాగర్‌రెడ్డి ప్రొఫైల్‌! ఎలా వుందమ్మా?” అన్నాడు.
”సాగర్‌రెడ్డి అరుదైన వ్యక్తిరా! అలాంటి వ్యక్తి నీకు స్నేహితుడంటే చెప్పుకోటానికి కూడా గర్వంగానే వుంటుంది. అతని గురించి ఎంత మాట్లాడినా తక్కువే! కానీ మాట్లాడుకోవాలి. అక్కడక్కడ అతని గురించి చెప్పుకోవాలి. ఎవరైనా దాతలు అవి వింటే సాయం చెయ్యటానికి ముందుకొస్తారు. నేను కూడా మా ఆఫీసులో నాకు తెలిసిన వాళ్లకి చెబుతాను” అంది.
హేమంత్‌ ఒక్క నిముషం మౌనంగా వుండి ఆ తర్వాత ”సాగర్‌రెడ్డి చేస్తున్న పనులలో ఒక్కటి కూడా నేను చెయ్యలేకపోతున్నానమ్మా! అతనిలాగే నేనూ సంపాయించాను. కానీ నేను సంపాయించిన ప్రతి రూపాయను నా పెళ్లి రిసెప్షన్‌ కోసం, ఆరాధ్య నగల కోసం వాడాను. ఇంకా సరిపోక బయటకూడా కొంత డబ్బు తెచ్చాను. ఇదంతా ఆరాధ్య కోసం, ఆరాధ్య మీద వున్న ప్రేమకోసం చేశాను. అతనూ, నేనూ ఇద్దరం పెట్టింది ఖర్చే! కానీ అతను పెట్టిన ఖర్చులో తృప్తి వుంది. ఎందరో అనాధలకు రక్షవుంది. నేను పెట్టిన ఖర్చులో ఏదీలేదు” అన్నాడు.
ఆమె ఎటూ మాట్లాడలేక మౌనంగా వుంది.
”సాగర్‌రెడ్డి నన్ను రిజిష్టర్‌ మ్యారేజ్‌ చేసుకోమని అడ్వయిజ్‌ ఇచ్చాడు కానీ ‘పెళ్లి అంటే ఇలా వుంటుంది. ఇలాగే వుండాలి. అనాధల్లా రిజిష్టర్‌ మేరేజ్‌ వద్దు’ అని ఆరాధ్య అన్నప్పుడు నేను నిజంగానే అనాధలాగ అనాధాశ్రమంలో పెరిగానన్నది కూడా ఆ క్షణంలో నాకు గుర్తు రాలేదు. ఆడంబరాలకు పోయాను. ఆరాధ్య చెప్పే ప్రతిదీ ఫాలో అయ్యాను. అనాధలకోసం ఏమీ చెయ్యలేకపోయాను. సాగర్‌రెడ్డి ఎక్కడ? నేనెక్కడ? అతనేమో అనాధ పిల్లలకోసం ఖర్చుపెట్టి అన్నగా ఎదిగితే నేనేమో ప్రేమించిన అమ్మాయి కోసం అప్పులు చేసి ఏ సుఖం లేకుండా మనశ్శాంతి పోగొట్టుకున్నాను” అన్నాడు.
”నువ్విలాగే ఆలోచిస్తుంటే నీకు ఇప్పుడున్న మనశ్శాంతి కూడా వుండదు. సాగర్‌రెడ్డిని మెచ్చుకో! తప్పు లేదు. అతను మెచ్చుకోదగిన వ్యక్తే! కానీ అతనితో నిన్నెందుకు నువ్వు పోల్చుకొని చూసుకుంటావ్‌! అతను దైవాంశలో పుట్టిన వ్యక్తి అయివుంటాడు. అందుకే అలాంటి పనులు చేస్తున్నాడు. నువ్వేమైనా దైవాంశలో పుట్టావా? నేనిలా అంటున్నానని బాధపడకు హేమంత్‌! మనం అందరం కూడా మానవమాత్రులం. మనం చెయ్యాల్సిన పనులన్నీ ముందే దేవుడు రాసిపెట్టి భూమ్మీదకు వదులుతాడు. ఆ పనులు మాత్రమే మనం చేస్తాం. కాని మనం చేసే పనుల్లో ధార్మికత ఎంతవుంది? చేతకాని తనం ఎంతవుంది? అధర్మం ఎంతవుంది? అన్నది చూసుకోవాలి. అంతేకాని సరదాలను, కుటుంబాన్ని వదులుకొని అక్కడక్కడ వెలుగురేఖల్లా కన్పించే వ్యక్తులతో కంపేర్‌ చేసుకొని బాధపడవద్దు. నువ్వు చేసిన పనులు కూడా మంచివే! ఫలితాలు ఏ రూపంలో వచ్చాయి అన్నది మన కర్మ సిద్ధాంతాన్ని బట్టి వుంటుంది. అందుకే నీ జాతకం ఎలా వుందో ఒకసారి చూపిస్తాను. నువ్వు పుట్టిన తేదీ నీ దగ్గరేమైనా వుంటే ఇవ్వు”
హేమంత్‌ స్వల్పంగా నవ్వి ”చదువుకున్న దానివి, నీ కొడుకు పుట్టినరోజు నీ దగ్గర లేదా అమ్మా!” అన్నాడు.
ఆమె మామూలుగానే ”లేదురా! అందుకే అడుగుతున్నాను. వుంటే ఇవ్వు” అంది.
”వుందేమో చూస్తాను” అంటూ అతను లేచి గోడకి వుండే ర్యాక్‌ దగ్గరకి వెళ్లాడు.
కొడుకు అటు తిరిగి ర్యాక్‌ ముందు నిలబడివుంటే అతన్నే చూస్తూ ‘వీడికి అంతా వాళ్ల తాతయ్య ఠీవినే వచ్చింది’ అని మనసులో అనుకుంది.
హేమంత్‌ ఆ ర్యాక్‌లో కొద్దిసేపు వెదికి ఓ ఫైల్‌ పట్టుకొని వచ్చాడు-
– తల్లికి ఎదురుగా కూర్చుని ఆ ఫైల్లోంచి ఓ ల్యాబ్‌ రిపోర్ట్‌ను బయటకి తీశాడు. దాన్ని ఆమెకు చూపిస్తూ ”ఇందులో నా రియల్‌ డేటాఫ్‌బర్త్‌ వుందమ్మా! స్కూల్లో ఇది రాయలేదు. మేమున్న అనాధాశ్రమంలో వాళ్లకి తోచిన డేట్‌ వాళ్లు వేసుకున్నారు” అంటూ దాన్ని ఆమె చేతికి ఇచ్చాడు.
ఆమె దాన్ని అందుకొని అలాగే చూసింది. ఆ రిపోర్ట్‌ బాగా నలిగి మాసిపోతే ఈమధ్యనే దాన్ని ఫైల్లో పెట్టినట్లున్నాడు. ఇరవై ఏళ్ల నాటి రిపోర్ట్‌ అది. దాన్ని చూడగానే రెండు చేతుల్లో ముఖాన్ని దాచుకొని మనిషంతా కదులుతూ ఏడ్చింది శార్వాణి.
హేమంత్‌ లేచి ఆమె పక్కన కూర్చుని, భుజాలు పట్టుకొని ”అమ్మా! ఏడవకు. నువ్విలా ఏడిస్తే నేను చూడలేను. నీ ఏడుపుకు కారణం ఏదైనా కానీ నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. కన్నకొడుకును కదా! నువ్వు నాముందే ఏడుస్తుంటే చూస్తూ వుండగలనా?” అన్నాడు బాధగా.
ఆమె నెమ్మదిగా సర్దుకొని కళ్లను కొంగుతో అద్దుకొని ”ఏడవను హేమంత్‌! నువ్వు బాధపడకు” అంది.
హేమంత్‌ తల్లివైపు చూస్తుంటే- ఆమె ఏడుపు గొంతుతో ”ఆ రిపోర్ట్స్‌ని నీ నడుముకి కట్టి ‘ఎవరైనా ఈ బాబుని తీసుకొని వైద్యం చేయించండి!’ అన్న స్లిప్‌ను రాసి నీ మెడలో వేలాడదీసి నిన్ను ప్రతిరోజు ఉదయాన్నే కొన్ని అపార్ట్‌మెంట్స్‌ దగ్గర, గొప్పగొప్ప పేరున్న టవర్స్‌ దగ్గర వదిలేదాన్ని హేమంత్‌! నువ్వు చిన్నవాడివి కాబట్టి అవన్నీ నీకు గుర్తున్నాయో లేదో!” అంది.
”కొంచెం కొంచెం గుర్తున్నాయమ్మా! నువ్విప్పుడు చెబుతుంటే బాగా గుర్తొస్తున్నాయి”
”ఒక్కరు కూడా నిన్ను తీసికెళ్లేవాళ్లు కాదు. సహాయం చేసేవాళ్లు కాదు. సాయంత్రం వరకు కొన్ని పదిరూపాయల నోట్లు, కొన్ని వందరూపాయల నోట్లు నీ చేతిలో కన్పించేవి. బంగారు తల్లులు ఎవరో ఒకరు నీకు అన్నం పెట్టేవాళ్లు. నువ్వు మాత్రం నేను వదిలి వెళ్లిన చోట కూర్చుని నాకోసం ఎదురుచూస్తుండే వాడివి. సాయంత్రం నేను రాగానే నన్ను చూసి ‘అమ్మా!’ అంటూ అల్లుకుపోయేవాడివి… నిన్ను ఇంటికి తీసికెళ్లేదాన్ని. ఇంటికెళ్లాక మీ నాన్న నిన్ను చూసి గొడవ పెట్టుకునేవాడు.
”వాడిని వదిలేసి రమ్మంటే మళ్లీ తీసుకొచ్చావా? నేను తీసికెళ్లి వదిలేస్తానంటే వద్దంటావు? వద్దని నువ్వు చేస్తున్న పని ఇదా? ఇలా వాడిని రోజూ ఇంటికి తీసుకొచ్చి వాడిని నువ్వేం చేసుకుంటావే! చచ్చేవాడి మీద ఇంత పిచ్చిప్రేమ ఎందుకు? దానివల్ల ఏమొస్తుంది?” అన్నాడు ఉపేంద్ర.
”ఏమండీ! మరొక్కసారి ఆలోచించండి! బాబుకి ఆపరేషన్‌ చేపిస్తే తప్పకుండా బ్రతుకుతాడు. నేను పేపర్‌ ప్రకటన ఇస్తే కొన్ని డబ్బులు వచ్చాయి. మీరు కొంత డబ్బు అప్పుగా తీసుకురండి! నేను కూడా కొంత తెస్తాను. అన్నీ కలిపి వాడికి మనమే ఆపరేషన్‌ చేయించుకుందాం! మనమే బ్రతికించుకుందాం! అంతేకాని వాడిని తీసికెళ్లి బయట వదిలేస్తే వాడు మళ్లీ మనకి దొరుకుతాడా? వాడిని వదిలి నేను బ్రతకలేను” అన్నాను.
”నువ్వు బ్రతకలేవని నేను బయట అప్పులు చేయలేను. మనకి ఏం వయసైపోయిందని ఆ రోగిష్టోడ్ని పట్టుకొని వేలాడుతున్నావ్‌! వాడుపోతే ఇంకొకడు పుట్టడా? వాడే కొడుకా? ఇంకొకడు పుడితే వాడు కొడుకు కాడా?” అన్నాడు.
”మీరసలు తండ్రా! తండ్రి రూపంలో వుండే మృగమా? కొడుక్కి జబ్బు చేస్తే నయం చేయించుకుంటారు కాని ఎటైనా తీసికెళ్లి వదిలెయ్యాలనుకుంటారా? నోరులేని జంతువుకైనా వ్యాధి వస్తే బాగు చేయించుకుంటారే నోరున్న మనిషిని ఎలా వదిలెయ్యాలనుకుంటున్నారండీ?” అన్నాను కోపంగా.
”నీకు నోరెక్కువైంది. నా సంగతి తెలిసే మాట్లాడుతున్నావా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు. లక్షలు అప్పుచేస్తే అది తీర్చటానికి నా జీతం మొత్తం సరిపోతుందని… ఇప్పటి నుండి నెలనెల డబ్బులు మిగిలితేనే కదా రేపు వృద్ధాప్యంలో పనికొస్తాయి. అది పోగొట్టి ఇప్పుడు ఈ రోగిష్టోడి కోసం అప్పులు చేసి అప్పుడు చిప్పపట్టుకొని ఏ అపార్ట్‌మెంట్‌ ముందో కూర్చుని అడుక్కోమంటావా?”
”అడుక్కునైనా పిల్లల్ని పెంచుకునేవాళ్లున్నారు కాని అప్పుడెప్పుడో అడుక్కోవాలా అంటూ ఇప్పటి నుండే డబ్బును పోగేసుకునేవాడ్ని నిన్నే చూస్తున్నాను. ఎప్పటికైనా బిడ్డలు కావాలి కాని డబ్బెందుకండీ!”
”ఇప్పుడిలాగే మాట్లాడతావ్‌! అది లేనప్పుడు కదా దాని విలువ నీకు తెలిసొచ్చేది”
”నాకు అన్ని విలువలు తెలిసే మాట్లాడుతున్నాను. వీడికి మాత్రం మనమే వైద్యం చేయించుకుందాం!”
”చెంప పగిలిపోద్ది” అంటూ చెంపల మీద కొట్టటం డొక్కలో పొడవటం చేశాడు. నువ్వు నన్నే చూస్తూ ‘అమ్మా! అమ్మా!’ అంటూ భయంతో వణుకుతున్నావ్‌. నిన్నలా చూస్తుంటే నాకేం చేయాలో తోచలేదు. మీ నాన్న కొట్టే దెబ్బలకి తట్టుకోలేక కడుపు పట్టుకుని అలాగే కూలబడిపోయాను. నువ్వు కూడా ఏడుస్తూ నా చుట్టే వున్నావు.
ఆ రాత్రంతా నేను నిద్రపోలేదు.
తెల్లవారుజాము నాలుగు గంటలకి నాకో ఆలోచన వచ్చింది. సూర్యునితో పాటే వాకర్లు నిద్రలేస్తారు. నిద్ర లేవగానే వాకింగ్‌ చేసుకోవటానికి గ్రౌండ్‌కెళ్తారు. వాళ్లంతా కార్లలో వచ్చేవాళ్లు, రిటైరయినవాళ్లే అయివుంటారు కాబట్టి డబ్బు గురించి ఆలోచించరు. పైగా అలాంటివాళ్ల పిల్లలు స్టేట్స్‌లోనే వుంటారు. డబ్బు బాగా సంపాయిస్తుంటారు. నిన్ను అలాంటి వాళ్లయితేనే జాలితో అక్కున చేర్చుకుంటారనిపించింది. వెంటనే నిన్ను నిద్రలేపి నీకు స్నానం చేయించాను. వున్నవాటిల్లోనే మంచి డ్రస్‌ తీసి నీకు వేశాను. డాక్టర్‌ గారిచ్చిన ఈ రిపోర్ట్స్‌ని, అంతవరకు నీకోసం కలక్ట్‌ చేసివుంచిన డబ్బుల్ని ఓ గుడ్డలో చుట్టి నీ నడుంకి కట్టాను. ‘ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఈ బాబుకి వైద్యం చేయించండి’ అని ఓ స్లిప్‌ మీద రాసి నీ మెడలో వేలాడతీశాను. మీ నాన్న నిద్రలేవక ముందే నిన్ను తీసికెళ్లి వాకర్లు ఆపుకున్న కార్ల మధ్యలో వదిలేసి కావాలనే ఇంటికి ఆలస్యంగా వెళ్లాను. మీ నాన్నతో బాబును పక్క ఊరి జాతరలో వదిలేసి వచ్చానని అబద్దం చెప్పాను. ఆయన అది నిజమనుకున్నాడు. ఆ క్షణం నుండే నువ్వు చనిపోయావని బంధువుల్లో, స్నేహితుల్లో ప్రచారం చేసుకున్నారు.
ఆరోజు నిన్ను వదిలి ఇంటికెళ్తున్నప్పుడు ఏడ్చుకుంటూ వెళ్లానే కాని నువ్వింతటి వాడివవుతావనుకోలేదు. ఆ దాత ఎవరో ఇప్పుడు నాకు కన్పిస్తే నా రక్తంతో అభిషేకం చేసినా ఆయన ఋణం తీరదేమో హేమంత్‌!” అంది.
హేమంత్‌ కళ్లలో నీటి పొర కదిలింది.
”నాలాగా ఏ తల్లీ తన బిడ్డను వదులుకోదేమో! భర్తతో పోరాడేదేమో! బిడ్డ కోసం భర్తను వదిలేసేదేమో! కానీ నేను మీ నాన్నను వదిలేస్తే ఒంటరిదాన్నవుతానే కాని నీకు వైద్యం చేయించలేను హేమంత్‌! అందుకే దాతల్ని ఆశ్రయించాను. నేనిలా చేయకుంటే మీ నాన్న నిన్నేం చేసేవాడో వూహించలేను. నిన్ను నేను వదిలేశాక నువ్వెన్ని కష్టాలు పడ్డావో నాకు తెలియదు కాని నేను నిన్ను తలచుకొని మౌనంగా ఏడవని రోజులేదు. దేవుడు నా మొర ఆలకించాడు. నువ్వు నాకు కన్పించావు” అంది.
హేమంత్‌కి ఇప్పుడు అర్థమైంది తండ్రి తనని ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడో!!
శార్వాణి వెంటనే ఆ లాబ్‌ రిపోర్ట్స్‌లో వున్న హేమంత్‌ పుట్టిన తేదీని తన మొబైల్‌ల్లో ఫీడ్‌ చేసుకుంది. హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టుకుంది. జాతకం రాయిస్తానని చెప్పింది. కొద్దిసేపు కొడుకు దగ్గర కూర్చుని ఇంటికెళ్లింది.

*****

ఆరాధ్య ఆఫీసు నుండి ఇంటికొచ్చేటప్పటికి రాత్రి పది గంటలయింది. ఏడు గంటలకే రావలసింది. క్లయింట్‌ మీటింగ్‌ వల్ల ట్రాఫిక్‌జామ్‌ వల్ల ఆలస్యమైంది.
ఇంటిముందు కాలింగ్‌ బెల్‌ నొక్కగానే సరయు వచ్చి డోర్‌ తీసింది. సరయును చూడగానే ఆరాధ్య ఎప్పటిలాగే నవ్వుతూ లోపలికి నడిచింది.
సరయు నవ్వలేదు. సీరియస్‌గా తన గదిలోకి వెళ్లింది. ఆమె రిసీవింగ్‌లో ఏదో మార్పు కన్పించి ఆశ్చర్యపోయింది ఆరాధ్య.
కొద్దిక్షణాలు గడవగానే సరయు గదిలో ఎవరో వున్నట్లనిపించి తొంగిచూసి షాకైంది ఆరాధ్య.
విష్ణుమూర్తి భంగిమలో పడుకొని లాప్‌టాప్‌ పక్కన మౌస్‌ని కదిలిస్తూ ఏదో చూస్తున్నాడు.
తన చూపులు పొరపాటు పడుతున్నాయేమోనని రెప్పల్ని టపటప ఆర్పి కళ్లను క్లియర్‌ చేసుకొని మరీ చూసింది ఆరాధ్య. అతను రాకేష్‌! స్పష్టంగా రాకేష్‌! రాకేషేంటి ఇక్కడున్నాడు? సరయుకి, అతను ఎలా పరిచయం? బెడ్‌రూంలో అంత చనువుగా పడుకొని వున్నాడూ అంటే అది ఎలాంటి పరిచయం?
”ఆరాధ్యా! లోపలికి రా!” పిలిచింది సరయు.
కాస్త ఇబ్బందిగానే ఒక అడుగు లోపలకి పెట్టి
”సరయు! ఏంటి?” అంది ఆరాధ్య.
”ఇతను నా ఫ్రెండ్‌ రాకేష్‌! రాకేష్‌ తను ఆరాధ్య! నా రూంమేట్‌!” అంటూ వాళ్లను ఒకరికి ఒకరిని పరిచయం చేసింది సరయు.
ఆరాధ్య నవ్వుతూ ‘నమస్తే’ చెప్పి ”బాగా అలసిపోయాను సరయు! పక్కగదిలో రిలాక్సవుతాను” అంటూ క్షణం కూడా అక్కడ వుండకుండా వెళ్లిపోయింది.
….వెళ్లిపోయాక ఓ చోట కూర్చుని సరయు గురించి ఆలోచించింది ఆరాధ్య. సరయును చూస్తుంటే ఇవాళ ఆఫీసుకి వెళ్లినట్లు లేదు. రేపటి నుండి షిఫ్ట్‌ మార్చుకుంటానంది. నైట్‌ 9కి వెళ్లి మార్నింగ్‌ వస్తానంది. తనేమో మార్నింగ్‌ 9కి వెళ్లి నైట్‌ 7కి వస్తోంది. ఇన్ని రోజులు సరయు కూడా తనలాగే వెళ్లేది. ఇప్పుడింత సడన్‌గా షిఫ్ట్‌ను ఎందుకు మార్చుకుంది? రాకేష్‌ కోసమా? తను ఇంట్లో లేనప్పుడు ఆమె ఒంటరిగా రాకేష్‌తో గడపటం కోసమా? ఇది ఇలాగే జరిగితే చుట్టుపక్కల ఫ్లాట్స్‌లో వాళ్లు తన గురించి ఏమనుకుంటారు?
శబ్దం చెయ్యకపోయినా, వేగంగా వచ్చి ఆరాధ్య ముందు నిలబడి, నడుం మీద చేతులు పెట్టుకుంది సరయు. సరయుకి బాగా కోపం వస్తేనే అలా నడుం మీద చేతులు పెట్టుకుంటుందని ఆరాధ్యకు తెలుసు. అందుకే ఏమిటన్నట్లు సరయు వైపు ప్రశ్నార్ధకంగా చూసింది ఆరాధ్య.
”ఎందుకలా వచ్చేశావ్‌? అతనేమనుకుంటాడు? నువ్విలా రాగానే వెళ్లిపోయాడు తెలుసా! నీకేదో అతను రావడం ఇష్టం లేనట్లు ఫీలయ్యాడు. నా రూంమేట్‌వి అయివుండి అలాగేనా ప్రవర్తించేది? చ…ఛ… నేనింకా ఏమేమో అనుకున్నాను నీ గురించి… అతన్ని నీకు పరిచయం చెయ్యగానే అతన్ని చూసి నువ్వు హ్యాపీ అవుతావనుకున్నాను. నా సెలక్షన్‌ బాగుందని నన్ను మెచ్చుకుంటావనుకున్నాను. అంతా ట్రాష్‌!” అంది సరయు.
”ఏం మాట్లాడుతున్నావ్‌ సరయు? అతన్ని చూసి నేనెందుకు హ్యాపీ కావాలి. నేనెందుకు మెచ్చుకోవాలి?”
”ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్‌వి. నేను చేస్తున్న పనిని నువ్వు నచ్చితే నేనెంత సంతోషిస్తాను. ఆమాత్రం అర్థం కాలేదా నీకు?”
”అర్థమైంది. కానీ అతను నువ్వు ఆనందపడేంత మంచివాడేం కాదు. అదిచూసి నేను హ్యాపీ కావటానికి… అతను నాకు ముందే తెలుసు. బి.టెక్‌ చదువుతున్నప్పటి నుండే తెలుసు…”
”అతను నీకు తెలుసా? తెలుసూ అంటే నీ లవరా? డౌట్‌ వచ్చి అడిగానంతే!”
”ఏది వచ్చి అడిగినా నాకేంటి! అతను నా లవర్‌ కాదు. జస్ట్‌ ఫ్రెండ్‌! అంతే!” అంటూ రాకేష్‌ గురించి జరిగింది మొత్తం చెప్పింది.
”నువ్వొకసారి సైకాలజిస్ట్‌ దగ్గరకి వెళ్తే మంచిది. ఎందుకంటే నీకు ఫ్రెండ్స్‌ నచ్చటం లేదు. భర్త నచ్చటం లేదు. భర్తను కన్నవాళ్లు నచ్చటం లేదు. రేపు నీకు నువ్వు చేస్తున్న జాబ్‌ కూడా నచ్చకపోవచ్చు”
”ఏంటి సరయు! ఇలా భయపెడుతున్నావ్‌? తప్పంతా నాలోనే వుందన్నట్లు మాట్లాడుతున్నావ్‌? అసలు నువ్వేనా నా ముందున్నది? రాకేష్‌ పరిచయం కాకముందు ఎంత బాగుండే దానివి? రోజూ నా మీద చెయ్యి వెయ్యకుండా నిద్రపోయే దానివే కాదు. ఈ మధ్యన అలా లేవు. నీపాటికి నువ్వు సపరేటుగా దుప్పటి కప్పుకొని పడుకుంటున్నావు. నిద్ర మధ్యలో లేచి ఫోన్లో మాట్లాడుకుంటున్నావు. మొన్నటి వరకు నేనే ప్రపంచంగా వున్న నీలో ఇంతలోనే ఇంత మార్పా? ఆశ్చర్యంగా వుంది తెలుసా!”
”ఇలాంటి మార్పు నీలోకూడా వస్తుంది. తొందరపడకు. మరీ అంత ఎక్కువగా ఆశ్చర్యపోకు”
”లేదు సరయు! నువ్వు చాలా మారావు. ఇంత మార్పును నీలో నేను ఎక్స్‌పెక్ట్‌ చెయ్యలేదు. నాకు నువ్వు ఎప్పటికీ ఇలాగే తోడుగా వుంటావనుకున్నాను. ఇంకో తోడును చూసుకొని నన్ను సైకాలజిస్ట్‌ దగ్గరకి వెళ్లమంటావనుకోలేదు. నాకు ఇక్కడ కూడా మనశ్శాంతి లేకుండాపోతోంది”
”మనశ్శాంతి లేకుండా ఇక్కడ వుండాల్సిన అవసరం నీకు లేదు. వేరే చూసుకో!”
”మరి నువ్వు ఒక్కదానివే వుంటావా?”
”అంత ఖర్మ నాకు లేదు. రాకేష్‌ వున్నాడుగా!”
”రాకేష్‌ని చూసుకునేగా నువ్విలా మాట్లాడుతున్నావ్‌?”
”నువ్వు మాత్రం చూసుకోవా? ఇలాగే వుంటావా?”
”నేను చూసుకుంటానా??”
”చూసుకోవన్న గ్యారంటీ అయితే లేదుకదా!”
”ఏం మాట్లాడుతున్నావు సరయు! నేనెందుకు చూసుకుంటాను? నీకంటే హజ్బెండ్‌ లేడు…”
”నీకు మాత్రం వున్నాడా? నువ్వు కూడా నాలాగే వున్నావుగా! హజ్బెండ్‌ దగ్గరైతే లేవు కదా!”
”లేకున్నా హేమంత్‌ నీ హజ్బెండ్‌లాగా అన్‌ఫిట్‌ కాదుగా! అతను అలా అని తెలిసే కదా నువ్వు అతన్ని వదిలేశావు…?”
”అతను అలా అని తెలిసే వదిలేశాను. నువ్వెందుకు వదిలేశావు హేమంత్‌ని? నిన్ను తాకనన్నాడనేగా? నీ దగ్గర ఏ తప్పు లేకపోతే అతనలా ఎందుకన్నాడు?”
”చెప్పాను కదా! నా తప్పేంటో!”
”చెప్పావు. ఇవాళ, రేపు ఎవరు నమ్ముతారు నువ్వు చెప్పే షార్ట్‌ స్టోరీస్‌? నేనంటే ఏదో నీమీద వున్న కర్టసీతో నమ్మినట్లు నటించాను. ఇదేకాదు, నువ్వు ఏం చెప్పినా నేను నమ్ముతాను. ఫర్‌ ఎగ్జాంపుల్‌ పెళ్లికి ముందు నిన్ను హేమంత్‌ బైక్‌మీద చూసి రాకేష్‌ బైక్‌ మీద వెళ్తున్నావేమోనని శార్వాణి ఆంటీ అనుమానించి నిన్ను ఇంట్లోంచి వెళ్లగొట్టిందని చెప్పినా నమ్మాను. అవునా! కాదా! ‘నువ్వు రాకేష్‌ బైక్‌ మీదనే వెళ్లివుంటావు’ అని నేనన్నానా? అంటే నువ్వు నన్ను నీ ఫ్రెండ్‌గా అనుకుంటావా? నువ్వలా అనుకోకపోతే నిన్ను నేను యూజ్‌ చేసుకోగలనా? ఎవరైనా యూజ్‌ కోసమే నమ్ముతారు. ఎవరి సంగతో నాకెందుకు. నేనైతే అందుకే నమ్ముతాను. ఇప్పటి నుండి నీతో ఎవరికి యూజ్‌ వుంటుందో వాళ్ల దగ్గర వుండు. వాళ్లు నిన్ను సేఫ్‌గా చూస్తారు. నాకు ఇక నీ అవసరం లేదు. రాకేష్‌ వున్నాడు” అంది.
”నువ్వు ఇలా కూడా మాట్లాడగలవా?”
”మాట్లాడగలను కాబట్టే ఇన్నిరోజులు నీకు సపోర్ట్‌గా వున్నాను. ఏరోజైనా నీకు బాధ కలిగేలా చేశానా? బాధపెట్టానా? నువ్వు బాధలో వుంటే ఎంత ఓదార్చలేదు. మరచిపోయావా? వాత్సల్య కన్నా నేనే నిన్ను ఎక్కువగా చూసుకున్నాను. నువ్వే ఇప్పుడు నాతో అనవసరంగా గొడవ పెట్టుకున్నావు”
”గొడవ పెట్టుకున్నానా?” ప్రశ్నార్ధకంగా చూసింది ఆరాధ్య.
”రాకేష్‌ దీనికి కారణమని మాత్రం అనకు. అతన్ని నువ్వేమన్నా నువ్విక్కడ వుండలేవు. అతనితో నాకు చాలా అవసరాలున్నాయి. అతను నా దగ్గరకి నువ్వున్నప్పుడు కూడా వస్తాడు. అది నీకు ఇష్టమైతేనే నువ్విక్కడ వుండు. నాకేం అభ్యంతరం వుండదు. రాకేష్‌తో కూడా చెబుతాను. ‘ఆరాధ్య ఏమీ అనుకోదు. ఇలాంటివి తను బాగా అర్థం చేసుకోగలదు. నువ్వు నా దగ్గరకి ఎప్పుడు రావాలనుకున్నా రావచ్చు’ అని… నేనిలా చెబితేనే అతను నా దగ్గరకి ఫ్రీగా రాగలుగుతాడు. లేకుంటే రాడు”
”నేనున్నప్పుడు అతన్నెలా రమ్మని చెబుతావు? అతను నీకు అవసరం కావచ్చు. నాకు లేదు కదా!”
భుజాలు కదిలించి ”నీ ఇష్టం! నేను చెప్పేదయితే చెప్పాను” అంది సరయు.
”అంటే! ఇప్పుడు నన్ను వెళ్లమంటున్నావా?”
”వద్దు. నువ్విక్కడే వుండు. నేనే వెళ్తాను. రాకేష్‌ నాకు వేరే అకామిడేషన్‌ చూస్తానన్నాడు”
”ముందుగానే ప్రిపేరయ్యావన్నమాట. మరి నువ్వెళ్తే నేను ఒక్కదాన్నే ఈ ఇంట్లో వుండగలనా?”
”వుండగలవు. నీకేం! నువ్వు బి.టెక్‌ చదివావు. హైటెక్‌ సిటీలో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేస్తున్నావు. నీకు భయమా? ఈ లోపల ఎవరో ఒకరు షేరింగ్‌కి వస్తారు”
”నాకు నిజంగానే భయం సరయు! చీకట్లో వుండలేను. పవర్‌ పోయిందంటే భయంతో చచ్చిపోతాను. అందుకేగా రోజూ నీ పక్కన పడుకునేది”
”నువ్వు చెప్పేది నిజమే ఆరాధ్యా! మరి రాకేష్‌నేం చెయ్యాలి? ముగ్గురం కలిసే పడుకుందామా?”
ఈసారి మాట్లాడలేదు ఆరాధ్య.
వెంటనే లేచి బ్యాగ్‌ సర్దుకుంది.
”బ్యాగ్‌ సర్దుకుంటున్నావ్‌! ఎక్కడికి వెళ్లాలని…?”
”ఇప్పుడు వెళ్లను. రేపు మార్నింగ్‌ వెళ్తాను. అప్పటివరకు రాకేష్‌ రాడుగా!”
”రాడు. రేపయినా ఎక్కడికెళ్తావ్‌?”
”వాత్సల్య దగ్గరకి…”
”అక్కడ ఫుల్‌ప్యాక్‌డ్‌!”
”అవన్నీ నువ్వెందుకు ఆలోచిస్తావ్‌! నేనుకదా ఆలోచించుకోవాలి… ప్యాక్‌డ్‌ అయితే దాన్నెత్తిన పడుకుంటాను. సరేనా?” అంటూ బ్యాగ్‌ సర్దుకోవటంలో పడిపోయింది.
సరయు మౌనంగా చూసి పక్కకెళ్లింది.
*****

తెల్లవారి బ్యాగ్‌ తగిలించుకొని బయటపడింది ఆరాధ్య.
తల వంచుకొని నడుస్తున్న ఆరాధ్యలో బరువైన ఆలోచనలు బయలుదేరాయి.
ఇప్పుడు తనేంటి? ఈ సింగిల్‌ జర్నీ ఏంటి? తన లైఫ్‌ ఎందుకిలా అయింది? తనలాగే పెళ్లి చేసుకున్న సాఫ్ట్‌వేర్‌ అమ్మాయిలంతా ఇలాగే సింగిల్‌ జర్నీ చేస్తున్నారా? ఇప్పుడు తనకంటూ ఓ పర్మినెంట్‌ ప్లేస్‌ లేదు. అందరమ్మాయిలకి వున్నట్లే ఫ్యామిలీ లైఫ్‌ లేదు. పట్టుచీరలు లేవు, ఫ్యాన్సీ చీరలు లేవు. ఒక్క మంగళసూత్రాలు వున్న చైన్‌ తప్ప నగలు కూడా లేవు. ఆ చైయిన్‌ కూడా 17 క్యారెట్లదే. కనీసం నల్లపూసల చెయిన్‌ కూడా లేదు. అది కూడా తగిన క్వాలిటీ లేకనో ఏమో పెళ్లిలోనే తెగిపోయింది. దాన్నెవరూ పట్టించుకోలేదు. ఎవరి హడావుడిలో వాళ్లుండిపోయారు. చెప్పినా వినలేదు. ఇప్పుడు తనకేం మిగిలింది?
బ్యాగ్‌ బరువుకన్నా మనసు బరువే ఎక్కువగా వుంది ఆరాధ్యకు.
బ్యాగ్‌లో ఏమున్నాయి? గట్టిగా పది డ్రెస్‌లు కూడా లేవు. అన్నీ లైట్‌ వెయిట్‌వే! అవి పెట్టుకోటానికి కూడా తనకంటూ ఓ బీరువా లేదు. బీరువా అంటే గుర్తొచ్చింది. చిన్నప్పటి నుండి తన డ్రస్‌లు బీరువాలో పెట్టకుండా మూతవుండే ప్లాస్టిక్‌ బక్కెట్లో పెట్టేది. ఆ తర్వాత కాలేజీ చదువుకి వచ్చాక షాపు నుండి తెచ్చిన వెంటనే తన తల్లి ఆ డ్రస్‌లని బీరువాలో పెట్టేదికాదు. బీరువాలో సునీల్‌వి, తల్లివి, తండ్రివి సరిపోక గోడలకి వుండే ర్యాక్‌లలో పెట్టేది. తనవేమో వాడకుండా పైన పెట్టిన ఇత్తడి బిందెల్లో, రాగి బిందెల్లో జాగ్రత్త చేసేది. ‘దిష్టి తగులుతుంది నీ డ్రస్‌లు మొత్తం ఒకేసారి ఎవరికి చూపించకు నీకు వున్నన్ని డ్రెస్‌లు మీ అక్కయ్యలెవరికీ లేవు’ అనేది తల్లి. ఇంటికొచ్చిన వాళ్లతో కూడా ‘మా ఆరాధ్యకు చూడండి ఎన్ని డ్రెస్‌లు వున్నాయో! అన్ని డ్రస్‌లు వున్నాయి. ఇన్ని డ్రస్‌లు వున్నాయి. ఇన్నిన్ని డ్రస్‌లు ఏ తల్లిదండ్రులు తెస్తున్నారు అమ్మాయిలకు…’ అంటూ నవ్వి, నవ్వి మురిసిపోయేది. అది విని తను కూడా కొద్దిగా తలవంచుకొని తృప్తిగా నవ్వుకునేది. ఆ తృప్తి ఇప్పుడు లేదు. ఎందుకని?
రోడ్డు మీద నడుస్తున్న ఆరాధ్యను చూడగానే ఆటోలో వస్తున్న రమాదేవి, శాంతారాం ”ఆటో! ఆపు, ఆపు” అంటూ అరిచారు. ఆటో ఆగగానే ఆటోవాడికి డబ్బులిచ్చి ఆరాధ్య దగ్గరకి వచ్చారు.
”నువ్వెక్కడికే వెళ్తున్నావ్‌? మేము నీ దగ్గరకి వస్తుంటే! అవునూ! నిన్నటి నుండి నీ సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అని వస్తుందేం? రైలు ఎక్కినప్పటి నుండి మీ డాడీ నీకు ఫోన్‌ చేస్తూనే వున్నాడు. ఏం జరిగిందే ముఖం అలా వుందీ?” గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతోంది రమాదేవి.
ఆరాధ్యకు తల్లి హడావుడి తెలియంది కాదు.
సరయు దగ్గర నచ్చక తనిలా బయటకొచ్చానని తెలిస్తే కంగారు పడుతుంది. తండ్రిని కూడా కంగారు పెడుతుంది. ఇప్పుడేదో తన బిడ్డ ఉద్యోగం చేసుకుంటూ ఎక్కడోచోట హాయిగా వుందనే అనుకుంటోంది. తనిప్పుడు ఏ స్థితిలో వున్నది ఆమెకు తెలియనివ్వకూడదు. తెలిస్తే అనవసరంగా బాధపెట్టినట్లవుతుంది.
తల వంచుకొని నవ్వింది ఆరాధ్య. ఈమధ్య తలవంచుకోవటం ఎక్కువవుతోందన్న ఆలోచన రాగానే టక్కున తలఎత్తి ఇంకొంచెం నవ్వి ”రాత్రి తినకుండా పడుకున్నాను. అందుకే ముఖం అలావుంది” అంది.
”ఎందుకు తినలేదు?” వెంటనే అడిగింది రమాదేవి.
ఏం చెప్పాలో అర్ధం కాలేదు ఆరాధ్యకు.
ఆరాధ్య సమాధానం చెప్పే లోపలే ”ఎందుకు తినలేదే!” అంది రమాదేవి. ఇంకొంచెమయితే ఆమె ఏడ్చేలావుంది.
అది గమనించిన వెంటనే అంది ”వర్క్‌ బిజీలో పడి మా ఆఫీసులో ఎవరూ తినలేదు” అని ఆరాధ్య.
అప్పుడు చల్లబడింది రమాదేవి.
”తినకుంటే ఆరోగ్యం చెడుతుంది ఆరాధ్యా! ఎంతపని వున్నా తింటూ చేసుకోవాలి” అంది రమాదేవి. శాంతారాం వినడం వరకే ఆగిపోతున్నాడు. ఆరాధ్య వైపు చూస్తున్నాడు. ఆయన ఎప్పుడైనా అంతే తల్లీ, కూతుళ్లు మాట్లాడుకుంటుంటే వింటుంటాడు. ఆయనకు అదే హాయిగా వుంటుంది.
”పని హడావుడిలో నా మొబైల్‌కి నిన్నటి నుండి చార్జింగ్‌ పెట్టుకోలేదు. ఇంట్లో సరయు లేదు. ఆఫీసు పని మీద బెంగుళూరు వెళ్లింది. రావటానికి పదిరోజులు పడుతుంది. ఇంకా పైనే పట్టొచ్చని చెప్పింది. అందుకే వాత్సల్య దగ్గరకి వెళ్తున్నాను” అంది ఆరాధ్య. అబద్దం చెప్పకూడదనిపించినా చెప్పింది. ఎందుకంటే ఇవాళ రేపు వాత్సల్య దగ్గర అడ్జస్ట్‌ అయినా తర్వాత ఎక్కడో చోట తనకి షేరింగ్‌ షెల్టర్‌ దొరుకుతుంది. ఈలోపలే తొందరపడి, ఈ మాత్రం దానికే నిజం చెప్పి వాళ్లనెందుకు బాధపెట్టాలి? నిన్ననే తన టీమ్‌ లీడర్‌ తనకో వాక్యం చెప్పాడు. ‘ఎప్పుడైనా మన బాధల్ని మన లైఫ్‌ జర్నీకి ఇంధనంగా వాడుకోవాలి కాని ఇతరులతో పంచుకోకూడదు’ అని… అందుకే ఇకముందు ఏదీ ఎవరికీ చెప్పుకోకూడదు అనుకుంది.
శాంతారాం వెంటనే ఆరాధ్య చేతిలో వున్న బ్యాగ్‌ని తన చేతిలోకి తీసుకున్నాడు. వాళ్లు త్వరగా వెళ్లిపోవాలని వచ్చినట్లుంది. వాళ్ల దగ్గర ఎటువంటి లగేజి లేదు.
”ఆరాధ్యా! నువ్వు వాత్సల్య దగ్గరకి మళ్లీ వెళ్లొచ్చు. మేము త్వరగా వెళ్లిపోవాలి. ఇంటి దగ్గర పనులున్నాయి. మమ్మల్ని అర్జంటుగా మీ అత్త, మామల దగ్గరకి తీసికెళ్లు…” అంది రమాదేవి.
ఆరాధ్య ఉలిక్కిపడి ”ఇప్పుడు వాళ్ల దగ్గరకి ఎందుకు?” అంది.
”వెళ్లాలి ఆరాధ్యా! వాళ్లు మాకు వియ్యంకులు. సునీల్‌ పెళ్లి గురించి వాళ్లకి చెప్పుకోవాలి”
”వాళ్లకెందుకు చెప్పటం? వాళ్లకు, మనకూ సత్‌సంబంధాలేమైనా వున్నాయా? వాళ్లెవరో! మనమెవరో!”
”శుభ కార్యాలప్పుడు అలా అనుకోకూడదు. కలిసిపోతుండాలి. నువ్వు కూడా సరయు దగ్గర, వాత్సల్య దగ్గర వుండొద్దు. సునీల్‌ పెళ్లి లోపలే హేమంత్‌ దగ్గరకి వెళ్లు…”
”ఎందుకూ?”
”అదంతే! నేను చెప్పినట్లు విను”
”అది జరగని పని. రండి! టిఫిన్‌ తిందాం!” అంటూ పక్కనే కన్పిస్తున్న రెస్టారెంట్‌లోకి నడిచింది. వాళ్లు కూడా ఆమెతోపాటు వెళ్లారు. ఒక మూలగా వున్న టేబుల్‌ దగ్గరకి వెళ్లి ”కూర్చోండి” అంటూ తను కూడా కూర్చుంది ఆరాధ్య.
వాళ్లు కూర్చున్నారు. ఆరాధ్య ముఖ వర్చస్సులో ఏదో గంభీరత కన్పించటం వల్లనో ఏమో మాట్లాడాలంటే జంకుగా వుంది రమాదేవికి.
”మమ్మీ! నువ్వు ఎన్ని చెప్పినా నేను హేమంత్‌ దగ్గరకి వెళ్లను. నన్ను ఇలాగే వుండనీయ్‌! ‘నేను చెప్పినట్లు వినూ!’ అంటూ నన్ను పిండకు…” అంది ఆరాధ్య.
”అయ్యయ్యో! నేను పిండుతానంటే నిన్నూ! తల్లిని. నువ్వంటే ప్రాణమే నాకు…”
”సరే! మీరొచ్చిన పనేదో చూసుకొని వెళ్లండి!”
”మీ అత్తమామల్ని కలిసి పోదామనేగా వచ్చాం. అంతకన్నా మాకు వేరే పనులేమున్నాయి?”

ఇంకా వుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *