April 26, 2024

శోధన 4

రచన: మాలతి దేచిరాజు

అతను స్టేషన్ బయటకు వస్తూనే ఓ ఆటో దగ్గరికి వెళ్లి “వస్తావా?” అని అడిగాడు ఎక్కడికో చెప్పకుండానే .
ఆ ఆటో అతను కూడా ఎక్కడికి అని కూడా అడగకుండానే “రాను” అన్నాడు.
అతను మరో ఆటో దగ్గరికి వెళ్లి “వస్తావా?” అని అడిగాడు.
అతను కప్పుకున్న దుప్పట్లో నుండే కుడి చేతిని పైకి లేపి “రాను” అన్నట్టు అడ్డంగా ఊపి చెప్పాడు.
అతనికి కోపం నషాళానికి అంటింది. భుజానికి వున్న లగేజీ బ్యాగ్ ని తీసి జిప్ ఓపెన్ చేసాడు. కుడిచేతికి పాములా తగిలింది రివాల్వర్.
దాని మీద చేయి వేసి మరో ఆటో దగ్గరకి వెళ్ళి అడిగాడు అతనూ రాననే సమాధానమే చెప్పాడు. ఇంక కోపం ఆగలేదు చేయి రివాల్వర్ మీదికి వెళ్ళింది. అప్పుడే అతని పక్కన మరో ఆటో ఆగింది. ఆటోలో నుంచి ఓ తల బయటకు వచ్చింది.
“రండి సార్ నేనొస్తాను”అన్న గొంతు వినిపించింది. ఆ గొంతు శోధనది. జీన్స్ ప్యాంట్ మీద బ్లాక్ టీ షర్టు దాని మీద ఖాకీ చొక్కా.
ఆమె వైపు చూసి “సిటీ అవుట్ స్కట్స్ కు వెళ్ళాలి”చెప్పాడతను.
“మీటర్ మీద వంద రూపాయలు ఎక్స్ ట్రా అవుతుంది” చెప్పింది శోధన.
“రెండు వందల రూపాయలు ఇస్తాను” అని చెప్పి అతను ఆటో లో కూచున్నాడు. బ్యాగ్ లో వున్న రివాల్వర్ ని లోపలికి నెట్టి జిప్ మూసేసాడు.
ఆటో డ్రైవ్ చేస్తూనే సైడ్ మిర్రర్ లో వెనుక కూచున్న అతన్ని చూస్తోంది.
అతని మోహంలో ఆందోళన కనిపిస్తుంది.
అప్పుడే అతని చేతిలోని సెల్ రింగ్ అయింది. ఓకే బటన్ నొక్కి మెల్లిగా “హలో” అన్నాడు.
అవతలి వైపు నుంచి మాటలు వినిపిస్తున్నాయి.
“ఫోటోని నీ సెల్ కు పంపిస్తున్నా. జాగ్రత్తగా ఫినిష్ చేయాలి ఈ రాత్రి పని పూర్తవ్వాలి” అటు వైపు నుంచి వినిపించింది.
“సరే” ముక్తసరిగా చెప్పి “సెల్ లో యెమ్మెమెస్ ద్వారా వచ్చిన ఫోటో చూసి షాకయ్యాడు.
సెల్ లో వచ్చిన ఫోటో ఓ అమ్మాయిది అదీ శోధనది.
ఒక వ్యక్తిని చంపడానికి సుపారీ తీసుకున్నాడు, ఆ వ్యక్తి అమ్మాయి అని అతనికి ఇప్పుడే తెలిసింది, అదీ ఓ ఆటో డ్రైవర్నిఅని .
అతడి పేరు గఫూర్ కిరాయి హంతకుడు, కాంట్రాక్ట్ కిల్లర్ ముంబై నుంచి వచ్చాడు.
అతడికి అన్ని భాషలూ తెలుసు. అతను దయా దాక్షిణ్యాలు లేని నరరూప రాక్షసుడు.
ఒక్క క్షణం అతనికి ఆశ్చర్యం వేసింది. ఈ అమ్మాయిని చంపడానికా తను అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చింది. అయినా ఎలుక ఎలుకల బోనులోకే సరాసరి వచ్చింది అనుకున్నాడు.
ఆమె పులి అని పులి బోనులోకి వేటగాడిని మట్టు బెట్టడానికి వచ్చిందని ఆ క్షణం అతనికి తెలియదు.
గఫూర్ ఎవరికో యస్సెమ్మెస్ పంపించాడు. సరిగ్గా పది నిమిషాల తర్వాత రోడ్డు మీద ప్రత్యక్ష్యమయ్యాడు ఒకతను.
గఫూర్ ఆటోలో అతడిని ఎక్కించుకున్నాడు. మరో పదిహేను నిమిషాల తర్వాత మరొకతను. ఆటో సిటీ అవుట్ స్కట్స్ లోకి ఎంటరైంది.
చుట్టూ చెట్లు, ఆటో నిర్మానుష్యమైన రోడ్డు మీద వెళ్తుంది. గఫూర్ తనకు రెండు వైపులా కూచున్న వాళ్లకు సైగ చేసాడు. వాళ్ళు తమ జేబుల్లో వున్న రివాల్వర్స్ బయటకు తీసారు. వాటిని శోధన మెడ మీద పెట్టి “ఆటో ఆపు” అన్నారు.
ఆటో ఆపి వాళ్ళ వైపు చూసింది శోధన.
“ఎవర్నువ్వు ? అడిగాడు గఫూర్
“ఆటో డ్రైవర్ ని” క్యాజువల్ గా చెప్పింది శోధన.
“ఒక ఆటో డ్రైవర్ కోసం అందులో ఒక ఆడదాని కోసం కొన్ని లక్షలు సుపారీ ఇచ్చి చంపమన్నారంటే నువ్వు మామూలు ఆడదానివి కాదు” నిజం చెప్పు అన్నాడు గఫూర్.
“పోనీ స్పెషల్ ఆడపిల్లను అనుకో, లేదా పులి పిల్లను అనుకో” ఏ మాత్రం టెన్షన్ లేకుండా అంది.
“మగాడిని అయితే సింపుల్ గా చంపేసి వెళ్ళిపోయేవాడిని, కానీ నువ్వు అమ్మాయివై పోయావ్ నిన్ను కామ్ గా చంపితే కిక్కు వుండదు, వీళ్ళు మా ఫ్రెండ్స్ ఇక్కడే ఎంజాయ్ చేసి ఆ తర్వాత నిన్ను ఫినిష్ చేస్తాం” గఫూర్ శోధన వంక చూసి అన్నాడు.
శోధన నవ్వింది.
అ ముగ్గురూ విచిత్రంగా శోధన వంక చూసారు.
“మమ్మల్ని చూస్తే భయం వేయడం లేదా?” అందులో ఒకడు అడిగాడు.
“భయమా. . . అదే వేస్తే నేను ఇంతదూరం ఆటోలో నిన్ను ఎందుకు తీసుకువస్తాను గఫూర్” తాపీగా అంది తన ఖాకీ జేబులో వున్న ఫోటో బయటకు తీస్తూ.
ఒక్క సారిగా షాకయ్యాడు గఫూర్ తన పేరు ఆమెకు ఎలా తెలుసు అనుకుంటూ ?
“అయినా నన్ను రేప్ చేయలన్నా, చంపాలన్నా నువ్వు కూచున్న సీట్ లో నుంచి లేవాలి కదా? అంది శోధన.
“అంటే?” అనుమానంగా అడిగాడు గఫూర్. .
“పూర్ గఫూర్ నీ సీటు కింద బాంబ్ ఫిక్స్ చేశాను నువ్వు కానీ నీతో వచ్చిన తొట్టి గ్యాంగ్ కానీ లేచారా పైకి లేచిపోతారు” తాపీగా చెప్పింది శోధన.
గఫూర్ తో పాటు మిగితా ఇద్దరూ షాక్ అయ్యారు.
చెవులు రిక్కించి విన్నారు సీటు కింద శబ్దం ఇలాంటి వాటిలో ఎక్స్పర్ట్ లు వాళ్ళు
తమని శోధన ట్రాప్ చేసిందని అర్ధం అయిపోయింది వాళ్ళ.
తన క్రైమ్ ట్రాక్ లో ఇలాంటి వరెస్ట్ రికార్డ్ లేదు ఇప్పటివరకు ఇదే మొదటిది చివరిది కూడా అని అతనికి తెలియడానికి అట్టే సమయం పట్టలేదు.
శోధన తాపీగా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళింది, ఆమె చేతిలో వున్న బాంబ్ రిమోట్ లో వున్న బటన్ మీద చేయి పడింది.
శోధనను చంపుదామని వచ్చిన గఫూర్,ఆమెతో ఆడుకోవడానికి వచ్చిన మరో ఇద్దరు క్రిమినల్స్ పోలీస్ రికార్డ్స్ నుంచే కాదు భూమ్మీది నుండే తొలిగిపోయారు.
ఆటో పెద్ద శబ్దంతో పేలిపోయింది.
ఆ వెలుగులో శోధన రోడ్డు ఎక్కింది.
రోడ్డు మీద వెళ్తోన్న కారును “లిఫ్ట్ ప్లీజ్ “అంటూ ఆపింది.
కారు ఆగింది.
“థాంక్యూ” అంటూ డ్రైవింగ్ సీట్ లో వున్న విశ్వక్ ని చూసింది.
“ఆ ముగ్గురిని పరలోకానికి పంపించావా? అడిగాడు విశ్వక్ కారును ముందుకు పోనిస్తూ”
అలాగే చూస్తోండిపోయింది శోధన.
*****
ఆ హాల్ లో ఇద్దరే వున్నారు. ఒకరు హోం మినిస్టర్ ధనంజయరావ్,మరొకరు సిద్దప్ప.
“నా బిడ్డ మీద దాడి చేసింది ఎవరో వెంటనే తెలుసుకోవాలి” సిద్దప్ప అన్నాడు.
పార్టీకి నల్లధనాన్ని విరాళంగా ఇచ్చే సిద్దప్ప, ఆ డబ్బును ఎరలా భావిస్తాడు. అందుకే ప్రభుత్వాన్ని అతడి పనులను చేసిపెట్టే బ్రాంచీ ఆఫీసులా మార్చుకున్నాడు.
“ఏంటి హోం అలోచిస్తున్నారేమిటి?” అడిగాడు సిద్దప్ప.
“పోలీసులు ఆ పని మీదే వున్నారు. క్లూస్ టీం కూడా వెళ్ళింది. ” హోం మినిస్టర్ చెప్పాడు.
“ఆ విషయం నాకూ తెలుసు నాకు కావలిసింది నా బిడ్డ మీద దాడి చేసిందెవరో నాకు తెలియాలి ఈ వార్త పేపర్ లో రాకముందే నా బిడ్డ మీద దాడి చేసిన మనిషి శవమై పోవాలి. లేక పోతే రేపు నన్ను చూసి చిన్న పిల్లాడు కూడా భయపడడు. ” సిద్దప్ప అన్నాడు.
చిత్రంగా చూసాడు హోం మినిస్టర్.
తన కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు, అదీ మామూలుగా కాదు అతని ప్రైవేట్ పార్ట్ తీవ్రగాయానికి లోనైంది. అదే మిగుడుపడడం లేదు అతనికి ఎందుకంటే స్వయంగా తనే ఎన్నో రేప్ కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. యాసిడ్ దాడి కేసుల్లోనూ వున్నాడు. ఎందరో అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు. కానీ తన రాజకీయ పలుకుబడితో సనాయాసంగా బయట పడ్డాడు. శిక్ష అంటూ విధిస్తే అతను చేసిన నేరాలకు వంద సంవత్సరాల శిక్ష కూడా సరిపోదు. ఆ విషయంలో తను అదృష్టవంతుడనుకునే వాడు ఇంతవరకు. కానీ ఇప్పుడు నిజానికి అతనికి కొడుకు పరిస్థితి కన్నా తన పవర్ పోతుందన్న భయం పట్టుకుంది.
సిద్దప్ప హోం మినిస్టర్ వైపు చూసి “పబ్ లో వున్న ఫూటేజ్ తెప్పించండి” అన్నాడు.
“ఆ పని మావాళ్ళు చేస్తున్నారు. ఆ పుటేజ్ ఆధారంగా మనం ప్రొసీడ్ అవ్వొచ్చు” అన్నాడు హోం మినిస్టర్.
కానీ అతనికి నమ్మకం ఆ పుటేజ్ వల్ల సిద్దప్ప కొడుక్కి సరైన శిక్ష పడక మానదు .
దేవతలు సైతం “తధాస్థు” అన్నట్లున్నారు అతను అనుకున్నదే జరిగింది.
గోల్కొండ ఆ పరిసరి ప్రాంతాల్లో శోభన కనిపించిందని తన దగ్గర సమాచారం ఉంది. అందుకే వచ్చింది అందుకే ఎదురుగా కనిపిస్తున్న గోల్కొండ అందాలు కానీ ఆ పురావస్తు శోభ కానీ ఆమెని ఆహ్లాద పరచలేక పోతున్నాయి. ఆమెకి కావాల్సింది తన అక్క శోభన తన ప్రాణం.
“ఎక్కడున్నావ్ నా ప్రాణమా! నా శరీరాన్ని రెండు ముక్కలు చేసినట్టు,నా నుండి విడిపోయావా? ఎక్కడని వెతకనూ. . . నీ కోసం ఎంత కాలం నిరీక్షించను?”
బాధగా ఆమె కళ్ళు కన్నీళ్లను వర్షిస్తున్నాయి.
ఆ ఏరియాలో అనుమానం వున్న ప్రాంతాలను తన మెదడులో నిక్షిప్తం చేసుకుంటోంది శోధన. గోల్కొండకు మూడు కిలోమీటర్ల దూరంలో వున్న అడ్డా అది. చతుర్వేది అక్రమ నేర సామ్రాజ్యానికి బ్రాంచీ ఆఫీసు. అక్కడ ముఖ్యమైన ల్యాండ్ సెటిల్ మెంట్స్ జరుగుతాయి, ఈ సంచారం తెలిసే ఇక్కడికి వచ్చింది శోభన. ఆ తరవాతే తను కనిపించలేదు. ఏమైపోయిందో ఎవరికీ అంతుబట్టలేదు. శోధన పిడికిళ్ళు బిగుసుకున్నాయి. దూరంగా పాడుబడిన ఇల్లు కనిపిస్తింది. లోపలికి వెళ్తే అదో కట్టుదిట్టమైన శత్రు దుర్భేద్యమైన కోట అని తెలుస్తుంది.
శత్రుసంహారానికి నాంది మొదలైంది.
శోధన అటువైపు వెళ్ళింది. అక్కడ పటిష్టమైన భద్రత ఉంది. చతుర్వేది నేర సామ్రాజ్యానికి పునాదులు అక్కడే వున్నాయిమరి. అతను ఒక బాలనేరస్తుడిగా తన నేర జీవితాన్ని ప్రారంభించింది అక్కడినుండే. చిన్నగా చిల్లర దొంగతనాలు మొదలుపెట్టి గంజాయి వరకూ ఎన్నో నేరాలు చేసాడు. బాలనేరస్తుడిగా బోస్టన్ స్కూల్ లో ఉండి బయటకి వచ్చిన తర్వాత తరవాత తన నేరాల స్థాయిని పెంచాడు. నేరం చేయడం కన్నా నేరాన్ని సృష్టించడం నేర్చుకున్నాడు. తాను ఎదగడం కోసం ఎవరినైనా అణగదొక్కే క్యారెక్టర్ అతనిది.
హైదరాబాద్ బాంబ్ పేలుళ్ళలో అతని హస్తం వుందని తెలిసినా సాక్ష్యాధారాలు దొరకలేదు ఎవ్వరికీ . ముంబై బాంబ్ పేలుళ్ళలో కూడా అతను ఉన్నాడని తెలిసింది. ప్రతీ వ్యాపారాన్ని తను చేసే నేరానికి వాడుకోవడం చతుర్వేది ప్రత్యేకత.
గల్లీ నుంచి ఢిల్లీ వరకూ విస్తరించిన అతని నేరాలపై సిబీఐ కన్నేసింది. ఆ కేసును సిబీ ఐ ఆఫీసర్ శోభనకు అప్పగించింది. శోభన చాలావరకూ సాక్ష్యాలు సేకరించింది. ఒక్కో విషయం తెలుస్తోన్న కొద్ది విభ్రాంతికి గురైంది శోభన. ఆ సమయంలోనే శోభన మిస్సయింది.
శోధన మెల్లిగా ఆ పాడుబడిన భవనం వైపు నడిచింది. సాధారణంగా కనిపించే ఆ భవనం శత్రుదుర్భేధ్యంగా వుంటుంది. ఆయుధాలు ధరించిన నరరూప రాక్షసుల పహారా ఉంటుందక్కడ. ఎందుకంటే చతుర్వేది ప్రాణాల గుట్టు ఆ భవనంలోనే ఉంది.
శోధన వారంరోజులుగా అబ్జర్వ్ చేసాకే అక్కడికి వచ్చింది. వెనుక వైపు అంతా ముళ్ళ పొదలు నిండి వున్నాయి. అటువైపు ఎవరూ రారు. దానికి కారణాలు రెండు ఒకటి అది దూరంగా విసిరివేయబడినట్టు ఉండటం, రెండో కారణం అది చతుర్వేది నేర సామ్రాజ్యం అని తెలియటం. వాళ్ళని పట్టుకోవాలని అక్కడికి వస్తే ప్రాణాలతో తిరిగి వెళ్ళలేరనీ తెలుసు పోలీసనే ప్రతివాడికి. శోధన మెల్లిగా వెనుక వైపు నుంచి వెళ్లి చూస్తే స్టోర్ రూం కనిపించింది . దాని కిటికీ చాలా ఎత్తులో వుంది. మునివేళ్లపై నించుని లోపలికి చూడటానికి ప్రయత్నించింది శోధన. మరో రెండు అడుగులు ఎత్తు వుంటే తప్ప సాధ్యం కాదు. మరోసారి ట్రై చేయబోయింది. కుదరలేదు. చుట్టూ చూసింది రాయి లాంటిది దొరుకుతుందేమోనని కనుచూపుమేరలో కనిపించలేదు చివరి సారిగా ట్రై చేయడానికి ప్రయత్నం చేసింది.
సడెన్ గా ఆమె శరీరం పైకి లేచింది. రెండు బలనైన చేతులు ఆమె నడుం భాగాన్ని పట్టుకుని పైకి లేపాయి. స్టోర్ కిటికీ స్పష్టంగా కనిపిస్తోంది ఆమెకి . లోపల సిలిండర్స్ వున్నాయి. అక్కడ అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్నట్టు అనుమానం కలిగింది.
మెల్లిగా కిందికి దిగి ఎదురుగా వున్న వ్యక్తీ వైపు చూసి
“ఎవరు?” అని అడిగింది.
“లవర్” చెప్పాడు అతను
“ఇట్సాల్ రైట్ “అంది.
“హెల్ప్ చేస్తే థాంక్స్ చెబుతారు ఇట్సాల్ రైట్ అనరు” అన్నాడతను.
“అందమైన అమ్మాయి నడుంను పట్టుకోవడం హెల్ప్ కాదు. పైగా ఎవరు అంటే లవర్ అనేవాడు హెల్పర్ కాదు ఈవ్ టీజర్ ఎంజాయ్ నా పర్మిషన్ లేకుండా నా నడుం ను ముట్టుకున్నా ఇట్సాల్ రైట్ అన్నానంటే నేను మంచిదాన్ని అని అర్థం. నిజంగానే హెల్ప్ చేసావని అర్థం ఇంతకీ మీ పేరు?” అడిగింది శోధన .
“వి విశ్వక్ సారీ ఒక్కటే వి. విశ్వక్ గ్లాడ్ టు మీట్యూ” చేయి చాపి అన్నాడు విశ్వక్,
“ఓహ్. . అని విశ్వక్ వైపు చూసి. . “ఈ భవనాన్ని పేల్చేద్దామా?” అని అడిగింది.
అతని చేయి గాలిలో అలానే వుంది.
“గీతాంజలి సినిమా చూసారా?” అడిగాడు విశ్వక్.
“చూసాను ఎందుకు?”
“లేచిపోదామా అన్నంత ఈజీగా పేల్చేద్దామా?” అని అడిగితే అని నవ్వుతూ “సరే” అన్నాడు తన చేతిని వెనక్కి తీసుకోబోతూ విశ్వక్.
వెంటనే శోధన అతని చేతిలో చేయి వేసింది.
“నేనో సారి లోపలికి వెళ్లోస్తాను ఎవరైనా వస్తే నీ సెల్ నుంచి మిస్సిడ్ కాల్ ఇవ్వు” అంది లోపలికి వెళ్తూ
సరే అన్నట్టు బుద్ధిగా తలూపాడు. లోపలికి వెళ్ళాక శోధనకు డవుట్ వచ్చింది. అతనికి తన నంబర్ ఇవ్వలేదు మరి తనకెలా మిస్సిడ్ కాల్ ఇస్తాడు? అనుకుంటూనే వెనుక వైపు వున్న చిన్న ఇరుకైన దారి గుండా లోపలికి వెళ్ళింది. చిన్న చెక్క తలుపు తుప్పు పట్టి వుంది. దాన్ని మెల్లిగా తీసే ప్రయత్నం చేసింది శోధన. మొహమంతా చెమట పట్టింది. పది నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది. లోపలికి వెళ్ళింది. లోపల సిలిండర్స్ మేళాలా వుంది. దొంగతనంగా గ్యాస్ ఫిల్లింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎంత డబ్బు వున్నా అక్కడ ప్రతి అణువులోనూ ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టని చతుర్వేది నిజస్వరూపం కనిపిస్తోంది. ఆ స్టోర్ రూం లోనుంచి చూస్తుంటే మరో గదిలో వున్న హెరాయిన్ కూడా కనిపిస్తోంది. అందులోనే మారణాయుధాలు వున్నాయని తెలుసు. కొన్ని రహస్య కీలక పత్రాలు అన్నింటికన్నా ముఖ్యంగా అమ్మాయిలను బెదిరించి. వాళ్ళను నేకేడ్ గా తీసిన నీలిచిత్రాలు, దాన్ని బూచిగా చూపిస్తూ అతను చేసే బ్లాక్ మెయిలింగ్ ఆ క్యాసెట్స్ కూడా అందులోనే వున్నాయి.
అన్నింటికన్నా ముఖ్యంగా అక్క శోభన మిస్సయిన ప్లేస్. ఇది ఆనవాలు లేకుండా చతుర్వేది కీలక స్థావరం కుప్ప కూలిపోవాలి. అగ్నికి ఆహుతి అవ్వాలి. ఆమె చేతివేళ్లు వేగంగా పనిచేస్తున్నాయి. గ్యాస్ లీక్ చేసే ప్రయత్నం మొదలుపెట్టింది. ఏ మాత్రం అనుమానం రాకూడదు. వాళ్లకు అనుమానం వచ్చేలోగా ఎస్కేప్ కావాలి. కొద్ది నిమిషాల్లోనే ఆమె శ్రమ ఫలించింది. అటు వైపు ఎవరూ రాకపోవడం ఆమెకు కలిసి వచ్చింది.
సక్సెస్ అనుకున్నది సాధించింది. గ్యాస్ లీక్ అవుతోంది తను వెంటనే బయటకు వెళ్ళాలి ఆ ఆలోచన కన్నా వేగంగా బయటకు నడిచింది. బయటకు వచ్చాక అనుమానం వచ్చింది. అగ్గిపెట్టె ఎలా అప్పుడు గుర్తొచ్చాడు విశ్వక్. అక్కడే ఓ బండ మీద ధైర్యంగా కూచోన్న అతని దగ్గరికి వెళ్లి “అగ్గిపెట్టె ఉందా?” అని అడిగింది చేయి చాచి.
వెంటనే విశ్వక్ ఆమె వైపు చూస్తూ “అగ్ని పర్వతం సినిమా చూసావా?” అని అడిగాడు.
“సూపర్ స్టార్ కృష్ణ సినిమా కదా ఇప్పుడు ఆ విషయం ఎందుకు?” అడిగింది శోధన.
“ఆ స్టైల్ లో చేయి చాచి అడిగితే” అంటూ జేబులో నుంచి అగ్గిపెట్టె తీసి ఇచ్చాడు
“థాంక్స్” అంది అగ్గిపెట్టె తీసుకుని.
“సిగరెట్ కూడా ఇచ్చేదా?” అడిగాడు వస్తోన్న నవ్వును కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తూ.
అంత కోపంలోనూ నవ్వొచ్చింది “మీకు సిగరెట్ తాగే అలవాటు ఉందా?” అడిగింది అగ్గిపుల్ల గీస్తూ.
“కనీసం వక్కపొడి అలవాటు కూడా లేదు పెట్రోల్ బంక్ లో చిల్లర లేకపోతే ఇచ్చారు” నవ్వి చెప్పాడు.
“బావుంది పెట్రోల్ బంక్ లో అగ్గిపెట్టె ఇవ్వడం” అని అగ్గిపుల్ల గీసి స్టోర్ రూం వైపు విసిరి. .
“పరుగెత్తు” అని విశ్వక్ తో చెప్తూనే తన స్కూటీ దగ్గరికి పరుగెత్తింది.
ఇక అక్కడ ఒక్క క్షణం వున్నా మంచిది కాదు. స్కూటీ స్టార్ట్ చేసింది స్కూటీ స్టార్ట్ కావడం లేదు. కోపంతో స్కూటీని ఒక్కతన్ను తన్నింది.
“స్కూటీలు తిడితే పడటం, తన్నితే స్టార్ట్ కావడం లాంటి పనులు చేయవు. ముందు నా బైక్ ఎక్కు, అవతల మన జాయింట్ మొగుళ్ళు వస్తున్నారు” అంటూ అటువైపు చూపించాడు.
చతుర్వేది మనుష్యులు బిల బిల మంటూ బయటకు వస్తున్నారు. పెద్ద శబ్దంతో ఆ భవనం పేలింది. చతుర్వేది బలమైన పునాది ఒకటి కూలిపోయింది. అంత ప్రమాదంలోనూ చతుర్వేది మనుష్యులు శత్రువుల కోసం వేట మొదలుపెట్టారు.
“నా పాతిక వేల స్కూటీ పైగా వాళ్ళు చూస్తే సరాసరి అడ్రెస్ వెతుక్కుని వస్తారు” అంది.
“ముందు ఎక్కవే” అని బైక్ స్టార్ట్ చేసాడు.
ఓ వైపు చతుర్వేది మనుష్యులు వస్తున్నారు. గత్యంతరం లేదు. ముక్కూ మొహం తెలియని మనిషి తనను “వే” అనడమా, ఉక్రోషంతో చిన్న పిల్లలా మారిపోయింది. ఒక రెండు కిలోమీటర్ వెళ్ళాక అతని ఎడమ భుజం మీద గట్టిగా కొరికింది.
“రాక్షసి” గట్టిగా అరిచి అన్నాడు “కండ వూడేలా కొరికావు, నాన్ వెజ్ అంటే అంతిష్టమా” బాధగా అన్నాడు విశ్వక్.
“నన్ను వే అంటావా? ఎక్కవే అంటావురా” కచ్చగా అంది.
బైక్ శోధన ఇంటి ముందు ఆగింది.
అప్పటికే ఆమె ఉక్రోషం, కోపం కొద్దిగా తగ్గాయి. ఇంటి ముందు తన స్కూటీ కనిపించేసరికి మొత్తం తగ్గింది. అతని ఎడమ భుజం వైపు చూసింది. షర్టు రక్తం తో తడిసింది. తను గట్టిగానే కొరికినట్లుంది.
“సారీ అండ్ థాంక్స్” అంది బైక్ దిగి శోధన.
“ఏది ఎందుకు” తన భుజం రుద్దుకుంటూ అన్నాడు.
“మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. నన్ను, నా స్కూటీనీ సేఫ్ గా ఇంటికి చేర్చారు. నేనే అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను అందుకు సారీ. నన్ను సేఫ్ గా ఇంటికి చేర్చినందుకు థాంక్స్.” అన్నది
“ఇట్సాల్ రైట్”అన్నాడు విశ్వక్.
“వెల్ కం అనాలి” అంది శోధన.
“మీరు ఇంట్లోకి పిలిస్తే అలానే అనేవాడిని ఎనీ హౌ గుడ్ నైట్ ” అన్నాడు బండి స్టార్ట్ చేస్తూ.
“అవును నా నంబర్ తీసుకోకుండా నాకు ఎలా మిస్సిడ్ కాల్ ఇద్దామనుకున్నారు?” అడిగింది శోధన.
విశ్వక్ తన మొబైల్ తీసి ఓ నంబర్ డయల్ చేసాడు. శోధన సెల్ రింగ్ అయింది.
“ఇలా” అన్నాడు.
షాకయింది. తన నంబర్ అతనికి ఎలా తెలుసు? శోధన మరో విషయం కూడా మర్చిపోయింది, అతను తనను సరిగా తన ఇంటిదగ్గరే దింపాడు. అతనికి తన ఇల్లు ఎలా తెలుసు అన్న విషయం?
ఇంతకన్నా పెద్ద విషయం అసలు ఆమె స్కూటీ లో పెట్రోల్ మొత్తం విశ్వక్ తీయడం వల్లే స్కూటీ స్టార్ట్ కాలేదు. ఆమె మీద ఎటాక్ జరుగుతుందన్న అనుమానంతోనే ఆమెను స్వయంగా తనే తీసుకు రావాలని అలా ప్లాన్ చేశాడు అతను.
అతి తొందరలోనే ఎన్నో శేష ప్రశ్నలకు సమాధానం దొరకబోతుంది.

పోలీస్ జీపు ఫస్ట్ కిక్ పబ్ ముందు ఆగింది. అందులో నుంచి దుర్జన రావ్ చాల పొగరుగా దిగాడు. ఆకలితో వున్న క్రూర జంతువులా వున్నాడు, సరైన సమయానికి యూనిఫాం తిరిగి తన ఒంటి మీదికి వచ్చినట్టు ఫీల్ అవుతున్నాడు. తనలాంటి నీచ్ కమీనే పోలీస్ లు యూనిఫాం లేకుండా బ్రతకడం అంటే మొసలి రోడ్డు మీద ఉన్నట్టే.
తన బలం ఈ ఖాకీ యూనిఫాం. చతుర్వేదికి, సిద్ధప్పకు మేలు చేస్తే తనకు ప్రమోషన్ గ్యారంటీ అనుకున్నాడు దుర్జన రావు
పోలీస్ జీపు దిగుతూనే మేనేజర్ రూంలోకి వెళ్ళాడు. రాత్రి తాలూకు సిసి ఫుటేజ్ తీసుకున్నాడు. ఆ పబ్ లో చాలా చోట్ల సిసి కెమెరాలు వున్నాయి. వీడియో ఫూటేజ్ చూస్తున్న కొద్దీ దుర్జన రావ్ మోహంలో రంగులు మారుతున్నాయి.
విక్కీకి పబ్ లో వున్న వెయిట్రెస్ కు జరిగిన సంభాషణ అంతా వుంది. ఆ తర్వాత విక్కీ వాష్ రూంలోకి వెళ్ళడంతో సహా. . . కానీ కొని చోట్ల కెమెరా లేకపోవడం కొంత భాగం రికార్డ్ కాలేదు . సడెన్ గా వాష్ రూం లో అపరిచిత యువతి స్కార్ప్ కట్టుకుని విక్కీ ని కొడుతున్న దృశ్యం, నైఫ్ తో అతని శరీరం మీద, అతని ప్రైవేట్ పార్ట్ మీద తగిలిన గాయం. ఎంతో మందిని దారణంగా హింసించిన దుర్జనరావ్ కూడా ఆ దృశ్యం చూసి ఒక్క క్షణం భయపడ్డాడు.
స్కార్ప్ లో వున్నా అమ్మాయి ఎవరో గుర్తించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడో చూసినట్టే అనిపిస్తోంది. అతను రీ కలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ వీడియో ఆపేసాడు. పబ్ లో పనిచేసే వెయిట్రెస్ ను పిలిపించమన్నాడు. ఆ వెయిట్రెస్ మరుసటి రోజు నుంచి పని మానేసింది. వెంటనే అతని మనసులో వికృత ఆలోచన. వెళ్లి ఆ అమ్మాయిని తీసుకు రమ్మన్నాడు.
పోలీస్ జీపు ఆ వెయిట్రెస్ ఇంటి వైపు బయల్దేరింది.
అంత కన్నా ఒక పది నిమిషాల ముందే శోధన ఆ వెయిట్రెస్ దగ్గరికి బయల్దేరింది తలుపు తెరిచిన ఆ అమ్మాయి తన ఎదురుగా వున్నా శోధన వైపు చూసింది. వెంటనే గుర్తు పట్టింది. “మీరా మేడం! ప్లీజ్ రండి” అంటూ పక్కకు తొలిగి దారి ఇచ్చింది. ఆ రోజు శోధన లేకపోతే తన జీవితం నాశనం అవ్వడమే కాదు తనను ఆ విక్కీ చంపేసేవాడే ఆ భయంతోనే అక్కడ పని మానేసింది ఆ వెయిట్రెస్.
ఇంట్లో ఆ అమ్మాయి తండ్రి వున్నాడు. అతను మంచానికి అతుక్కుపోయి వున్నాడు. ఆ ఇంటి పరిస్థితి అర్థమైంది.
“థాంక్యూ మేడం ఆ రోజు మీరు సమయానికి రాకపోయి వుంటే నా పరిస్థితి చాలా ఘోరంగా వుండేది” కన్నీళ్ళతో అంది ఆ అమ్మాయి.
“ఓకే వదిలేయ్ సమస్యలకు భయపడకు. అప్పుడు విక్కీని ఆ పరిస్థితిలో చూసేక భయమేసింది కదూ” అంది శోధన.
“అవును మేడం. వాడు చాలా మంది జీవితాలతో ఆడుకున్నాడు. నాకు తెలిసి మీరు ఆ రోజే జాయిన్ అయ్యారు. ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే పని కోసం జాయిన్ అయినట్టు అనిపించలేదు. ” అంది ఆ వెయిట్రెస్.
“యస్, నిజమే కారణం చెప్పను గానీ నాకు నీ నుంచి రెండు సాయాలు కావాలి చేస్తావా భార్గవి “అడిగింది శోధన.
“మేడం నా పేరు మీకెలా” ఆశ్చర్యంగా అడిగింది.
“తెలుసుకున్నాను మీ నాన్నగారి ఆరోగ్య పరిస్థితి గురించి కూడా తెలుసు. మీ గురించి వైదేహి మేడంకు చెప్పాను. మీలాంటి వారికోసం ఆ మేడం నడిపే ఆసరా సంస్థ ఎంతో సాయం చేస్తుంది. ఈ నంబర్ ఉంచుకో ఇది ఆ మేడం నంబరే” అంటూ వైదేహి మేడం ఫోన్ నంబర్ ఇచ్చింది.
“చెప్పండి మేడం నేను మీకు ఏ విధంగా సాయం చేయగలను? నా ప్రాణం ఇవ్వమన్నా ఇస్తాను”అంది సిన్సియర్ గా భార్గవి.
“ఆ రోజు అంతగా భయపడ్డావు మరి ఇప్పుడిలా ధైర్యంగా?
“ఆ రోజు ప్రాణాల మీద తీపితో కాదు మేడం నేనేమైనా అయితే నాన్నకు ఏమవుతుందో అని భయపడ్డాను. అదీ కాక ఒక మానవ మృగానికి నా శరీరాన్నిఅర్పించడానికి ఒక ఆత్మాభిమానం గల ఆడపిల్లగా ఇష్టపడలేదు. ”
“వెరీ గుడ్ ఇంకాసేపట్లో నీ కోసం పోలీస్ లు వస్తారు. నిన్ను దుర్జనరావ్ అనే వెధవ పోలీస్ డ్రెస్ లో ప్రశ్నలు వేస్తాడు. అతనికి నువ్వు నిజాలు చెప్పాలి.
“వాట్ మేడం నిజాలు చెప్పాలా? ఇంకా అబద్దాలు చెప్పమంటారు అనుకున్నాను”
“ఆ నిజాలతో పాటు నువ్వు నీ చీరెకు, బ్లవుజ్ కు మధ్య సేఫ్టీ పిన్ బదులు ఒక కెమెరా పెట్టుకోవాలి అది నీకు ఒక పోలీస్ ఆఫీసర్ ఇస్తాడు నీకు ఏ ప్రమాదం లేకుండా అతను చూసుకుంటాడు. ” అన్నది.
“తప్పకుండా మేడం ముందు మీ కోసం కాఫీ”
“వద్దు మళ్ళీ తీరిగ్గా వస్తాను” అని శోధన గుమ్మం దగ్గరికి వెళ్లి ఏదో మర్చిపోయినట్టు వచ్చి, భార్గవి తండ్రి దగ్గరికి వచ్చింది. హ్యాండ్ బాగ్ లో వున్నా ఆపిల్స్ తీసి అతని చేతిలో పెట్టి. అతనికి కళ్ళతోనే ధైర్యం చెప్పింది. అతని కళ్ళలో సన్నటి కన్నీటి మెరుపు.
శోధన చెప్పినట్టుగానే పది నిమిషాల తర్వాత పోలీస్ జీపు వచ్చింది. ఇద్దరు పోలీసులు, ఒక ఇన్స్పెక్టర్ వున్నాడు. వాళ్ళను చూడగానే ఆశ్చర్యం నటించింది భార్గవి.
“మిమ్మల్ని మా సి ఐ గారు రమ్మంటున్నారు” అన్నాడు ఓ పోలీస్ చెప్పాడు.
ఇన్స్పెక్టర్ లోపలికి నడిచాడు. కానిస్టేబుల్స్ లోపలికి వెళ్ళబోయి ఇన్స్పెక్టర్ చూపులకు భయపడి ఆగిపోయారు.
లోపలి అడుగు పెట్టగానే ఇన్స్పెక్టర్ “నా పేరు శామ్యూల్. శోధన మేడం చెప్పిన ఇన్స్పెక్టర్ ని నేనే మీరేమీ భయపడకండి” అన్నాడు శామ్యూల్.
“థాంక్యూ సర్ మీలాంటి వారి వల్లే ఇంకా పోలీస్ లు అంటే గౌరవం మిగిలి వున్నాయి” మనస్ఫూర్తిగా అంది.
“సరే బయల్దేరండి మీకు అంతా మంచే జరుగుతుంది. ఆ ప్రభువు మంచి వాళ్ళకు మంచే చేస్తాడు. ” అన్నాడు.
భార్గవి తండ్రికి చెప్పి బయల్దేరింది. ఆమెలో భయం మచ్చుకైనా కానరావడం లేదు.
పోలీస్ జీపు భార్గవి ఇంటి నుంచి వెళ్ళగానే ఒక నిట్టూర్పు విడిచింది శోధన. అంతా తను అనుకున్నట్టే జరుగుతుంది. తన శోభన తనకు కనిపించడానికి అట్టే టైం పట్టదు అనుకుంది, అపుడే ఆమె సెల్ రింగ్ అయింది. ఆ నంబర్ ఎవరిదో సడెన్ గా గుర్తుకు వచ్చింది. విశ్వక్. . . రాత్రి జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది.
వెంటనే ఓకే బటన్ ప్రెస్ చేసి “హలో ఎవరూ?” అంది.
“నేనని నీకు తెలుసు. ఎవరూ అని ఎందుకు అడగడం” అటు వైపు నంచి విశ్వక్ అన్నాడు.
“సరే విషయం ఏమిటో చెప్పండి” అంది శోధన.
“రాత్రి నా మీద ఓ వాంపయిర్ దాడి చేసింది. కోరల్లాంటి పళ్ళతో గాయం చేసింది ట్రీట్మెంట్ కోసం స్టార్ హాస్పిటల్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. నా భుజాన్ని నాన్ వెజ్ లా కొరికేసింది” అన్నాడు.
నవ్వొచ్చింది శోధనకు. కాసింత సిగ్గుగా కూడా అనిపించింది. ఎంత ఇన్మెచ్యూర్డ్ గా బిహేవ్ చేసిందో గుర్తుకువచ్చింది. అయినా బయట పడకుండా
“అయితే ఏమిటి? అయినా వాంపయిర్స్ తో మీకు పనేమిటి?” అంది.
“పోనీ మీతోనే నాకు పని అనుకోండి ఎక్కడున్నారు?”
“పనా ? నాతోనా? నేను అని ఎదురుగా వెళుతున్న ఓ బస్సు వంక చూసి దాని మీద వున్న బోర్డు చదివి శిల్పారామం దగ్గర వున్నాను.” అనిచెప్పింది.
“అరె వాటే కోఇన్సిడెన్స్ నేను ఇక్కడే వున్నాను” అన్నాడు విశ్వక్.
“అయితే వచ్చి కలవండి అంటూ ఇంతకీ ఎందుకో తెలుసుకోవచ్చా?” క్యూరియాసిటి తో అడిగింది.
“ఎందుకేమిటి లవ్ ప్రపోజ్ చేయడానికి. రాత్రి మర్చిపోయాను అందుకే ఇప్పుడు ప్రపోజ్ చేద్దామని. ”
“వాట్ నీకేమైనా లూజా రాత్రి పరిచయం అయిన మనిషిని, అదీ యాక్సిడెంటల్ గా. లవ్ ప్రపోజ్ చేస్తావా?”
“ప్రేమ కూడా యాక్సిడెంట్ లాంటిది అని ఓ పుస్తకంలో రచయిత రాసాడు. ”
“అయితే రా ప్రేమించుకుందాం” కచ్చగా అని ఫోన్ పెట్టేసింది.
శోధన సెల్ పెట్టేయగానే “హలో” అన్న పిలుపు వినిపించి వెనక్కి తిరిగి చూసి షాకయింది.
విశ్వక్ “ప్రేమించుకుందాం రా అన్నారుగా వచ్చేసాను” అన్నాడు.
*****
దుర్జనరావ్ తన ఎదురుగా వున్న భార్గవి వైపు చూసాడు.
“నువ్వేనా భార్గవి అంటే. నీ వెనుకే పడ్డాడా ఆ విక్కీ? బాగానే వున్నావు కత్తి లాంటి ఫిగర్ ఎవరైనా పడతారులే అని వెకిలిగా నవ్వుతూ “చెప్పు ఆ రోజు నిన్ను కాపాడింది ఎవరు?”
“ఆమె ఎవరో తెలియదు కానీ చూస్తే గుర్తు పడతాను” అంది.
సిసి ఫుటేజ్ చూపించాడు. అందులో స్కార్ప్ లో వున్న శోధనను గుర్తు పట్టి పట్టినట్టు వెంటనే చెప్పింది “ఈ మేడమే ఆ విక్కీగాడిని తుక్కు తుక్కుగా కొట్టింది” కసిగా చెప్పింది.
“విక్కీ ని కొట్టినందుకు చాలా హ్యాపీ గా వున్నట్టు వున్నావు” ఆమె శరీరం వంక చూస్తూ అన్నాడు.
“అమ్మాయిలను అనుభవించాలనుకునే మగమృగాలను అలానే చితక్కొట్టాలి”అంది భార్గవి.
తనని కూడా కలిపి అంటున్నట్టు అనిపించింది అతనికి.
“ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా?” భార్గవి దగ్గరికి వస్తూ అడిగాడు.
ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ “చూసాను” అంది.
భార్గవి భుజం మీద చేయి వేసి ఆమె భుజం నొక్కుతూ “ఎక్కడ?” అని అడిగాడు.
“ప్లీజ్ చేయి తీయండి” అంది గింజుకుంటూ
“ఏం నేను అందంగా లేనా? అయినా పబ్ లో పనిచేసే నీకు ఈ కల్చర్ తెలియదా? నాతో వున్నావనుకో నీకు ఫుల్ బందోబస్తు దొరుకుతుంది. నిన్ను ఎవరూ ఏమీ చేయరు నాతో టచ్ లో వుంటే నిన్ను టచ్ చేయడానికే భయపడుతారు” తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ అన్నాడు.
అప్పుడే శామ్యూల్ లోపలికి వచ్చాడు.
“నువ్వెందుకు వచ్చావు అసలు నిన్ను ఉద్యోగం లో నుంచి పీకేయాలి బయటకు వెళ్ళు” సీరియస్ గా అన్నాడు.
శామ్యూల్ బయటకు వెళ్ళాడు.
“ప్లీజ్ నన్నేమీ చేయొద్దు ఇదన్యాయం విచారణ కోసం పిలిపించి ఇలా ప్రవర్తించడం ఏమీ బాగాలేదు సర్ ”
“చూడూ నా వెనుక సిద్దప్ప, చతుర్వేది లాంటి వాళ్ళు వున్నారు ఎవరూ నన్ను ఏమీ పీకలేరు. అంతెందుకు హోం మినిస్టరే నన్నేమీ పీకలేకపోయాడు” వెకిలిగా నవ్వుతూ అన్నాడు.
“యూ ట్యూబ్ లో మీ వీడియో పెట్టినా ఎవరూ ఏమీ పీకలేరా? ఒకసారి ఇలాంటి అనుభవం జరిగినా మీకు బుద్ది రాలేదా” అడిగింది భార్గవి.
ఆ మాటలతో షాక్ తిన్నాడు.
“మీ కోసం శోధన మేడం వూరి చివర వున్న ఓల్డ్ ట్రావెలర్ బంగ్లాలో ఎదురు చూస్తోంది . మీరు వస్తే మీతో ఓ బిజినెస్ డీల్ మాట్లాడుతుందిట. నేను మీదగ్గరకి మేడం దూతగా వచ్చాను. మీరు సారీ నీలాంటి వాడికి మర్యాద అవసరం లేదు. నువ్వు రాకపోతే ఈ వీడియో యూట్యూబ్ లోకి ఎక్కుతుంది. అప్పుడు జనమే కాదు ఆ సిద్దప్ప, చతుర్వేది మిమ్మల్ని ఏం చేస్తారో ఊహించుకో ఒకసారి” అంటూ తన బ్లవుజ్ కు పెట్టుకున్న బటన్ కెమెరాను చేతిలోకి తీసుకుంది.
శామ్యూల్ లోపలికి వచ్చి భార్గవి వైపు తిరిగి “పనై పోయిందా?” అడిగాడు.
“అయిపోయింది అన్నయ్యా, మీ సి ఐ గారు బాగా కోఆపరేట్ చేశారు” అంది బయటకు నడుస్తూ.
*****
శోభన ఇప్పుడు నలభై ఏళ్ళ మహిళ గెటప్ లో వుంది. ఓల్డ్ బస్తీలో వున్న జర్దార్ స్థావరానికి కిలోమీటర్ దూరంలో వుంది. ఢిల్లీ లో భారీ పేలుళ్లకు కుట్ర పన్నినట్టు తన దగ్గర సమాచారం వుంది. దేశాన్ని అల్లకల్లోలం చేయాలన్న కుట్ర దుబాయ్ లో ఉన్న ఓ మాఫియా డాన్ స్థావరంలో మొదలైంది అన్నదే ఆ సమాచారం.
ఇలాంటి కుట్రలు, ఇలాంటి వార్తలు చాలా మందికి సెన్సేషన్ గా అనిపించవు. సరిహద్దుల్లో ఎముకలు కొరికే చలిలో మైనస్ ఉష్ణోగ్రత లో కనురెప్పల మీద తుపాకీ ఉంచుకుని కాపలా కాసే జవాను సాహసం కన్నా, పంటితో కారు లాగితే, గదిలో బొద్దింకల తో సహవాసం చేస్తే గొప్పగా అనిపిస్తుంది. వాటిని చూడటానికి సమయాని కన్నా ముందే టీవీ కి అతుక్కుపోతాము. కానీ మనదేశం ప్రమాదకరమైన స్థితిలో వుంటే, అసలు మన వెనుక ఏం కుట్ర జరుగుతుంది ? మనం ఎలా స్పందించాలి? అన్న విషయం ఆలోచించం,
ఇందుకు ఎవరూ మినహాయింపు కాదన్నది శోభన స్ట్రాంగ్ ఫీలింగ్ తన ప్రాణానికి ప్రాణమైన తన చెల్లి శోధనతో సహా. . .
అందుకే తను శోధనను అస్త్రంగా ప్రయోగించింది. ఢిల్లీ నుంచి ఇక్కడికి రప్పించింది.

sodhana4
ఒక్కసారిగా ఆమె గతంలోకి వెళ్ళింది.
“ఇన్నాళకి గుర్తొచ్చానా వానా” అంటూ హామ్ చేసుకుంటూ వచ్చింది శోధన ప్లేట్ లో అన్నంకలుపుతూ. “మై డియర్ సిస్టర్ ఇదిగో” అంటూ శోభన నోటికి ముద్ద అందించింది.
“ఇప్పుడే వద్దు నువ్వు తినేయ్ నేను ఈ పని పూర్తిచేసేసి తింటాను” అంది శోభన.
“అబ్బా అక్కా ఈ పనులు ఎప్పుడూ ఉండేవే కదా తిండి తిప్పలు మానేసి మరీ చేయాలా” అంటున్న శోధన వైపు చూసింది. తన చెల్లి రూపంలో అమ్మే వచ్చిందా అన్న భావం మళ్ళీ ఆమె మనసులో కలిగింది. చిన్నతనంలో అన్నం తినను అని మారాం చేస్తోంటే అమ్మ బుజ్జగించి తినిపించే దృశ్యం కళ్ళముందు కదిలింది. అంతే గుండెలోతుల్లో దాగున్న కన్నీళ్ళు కళ్ళ కొలనులు దాకా వచ్చాయి. అవి చెంప నిమిరే సమయానికి శోధన ‘హే ఎంటే ఇదీ” అంటూ ప్లేట్ పక్కనపెట్టి శోభనకి దగ్గరగా జరిగింది. శోభన కళ్ళుతుడుచుకుంటూ “ఏం లేదులే అన్నం తినిపించు” అన్నది. అలా అంటున్న అక్క మాటల్లో పసితనం కనిపించింది శోధనకి గబగబా రెండుముద్దలు తినిపించింది. “ఏంటీ మొత్తం నాకే పెట్టేస్తావా” అంటూ కంచంలో ఉన్న అన్నాన్ని తన చేతుల్లోకి తీసుకొని చెల్లి నోట్లో పెట్టింది. ఇలా ప్రేమగా అన్నం పెట్టే దగ్గరివారు ఉంటే అదే నిజమైన జీవితం. ఆప్యాయంగా మనతో కొన్ని మాటలు మాట్లాడటానికి,మనసులో ఉన్న భావాలను పంచుకోవడానికి మనకు మాత్రమే సొంతమైన కొన్ని జ్నాపకాలను తట్టిలేపటానికి ఎవరో ఒకరుండాలి.
రక్తసంబంధాలు పరాయి సంబంధాలు గా మారిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి దృశ్యం చూస్తే మనం ఏం కోల్పోతున్నామో అర్ధం అవుతోంది. బానే ఉన్నా అని అబద్ధం చెప్పటానికైనా బాగున్నావా అని అడిగే వాళ్ళు ఉండాలి కదా! వాళ్ళిద్దరిని అలా చూసి గోడమీద ఫోటో లో ఉన్న వాళ్ళ అమ్మ కూడా సంతోషంగా నవ్వుతున్నట్లుంది. వాళ్ళ మాటలు గాలికి మాత్రమే వినిపిస్తున్నాయి,వాళ్ళ నవ్వులు ఆ ఇంట్లో దీపాలతో సమానంగా వెలుగుతున్నాయి. వాళ్ళ చిలిపితనపు కేరింతల రవళులు వింటూ ఆ నాటి రాత్రి కదులుతోంది. నిద్రాదేవి ఇద్దరినీ జోకొడుతోంది.
న్యూ ఢిల్లీ
చల్లగాలి హస్తినను చుట్టు ముట్టింది. ఆ విశాలమైన ఇంట్లో ఒక గదిలో మోకాలు మీద చుబుకాన్ని ఆన్చి కిటికీ అవతల వున్న వెన్నెలను చూస్తోంది శోధన.

ఈ వెన్నెల ఇలానే రోజంతా వుంటే ఎంత బావుండు?
ఈ వెన్నెల్లో మనసైన వాడి ఒళ్లో తల పెట్టి అతను చెప్పే కబుర్లు వింటూ గడిపేస్తే? శోధన మనసులో అందమైన ఊహలు సందడి చేస్తున్నాయి.
ఎం.ఎ సైకాలజీ చేసిన శోధన జర్నలిజంలో కూడా పట్టా పుచ్చుకుంది. ఎదురుగా గోడకు వున్న ఫోటో వంక చూసింది. ఇద్దరు అమ్మాయిలు ఒకే రూపంలో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఫోటోలు.
ఆ క్షణం శోధనకు అక్క గుర్తొచ్చింది. ఎవరు అక్క?ఎవరు చెల్లి కేవలం క్షణ వ్యవధిలో పుట్టిన చిన్నారులు వాళ్ళు. చిన్నపుడే యాక్సిడెంట్ లో అమ్మానాన్న చనిపోతే తనే అన్నీ అయి పెంచిన అమ్మ లాంటి అక్క శోభన.
దేశాన్ని ప్రేమిస్తూ, సి బి ఐ లో చేరి నేరాలను పసిగట్టి, అరికట్టే అధికారి శోభన
శోభనను చూస్తే గర్వంగా వుంటుంది కానీ, ఆ ప్రమాదాలు,ఆ రిస్క్ లు నచ్చవు శోధనకి. జీవితం హాయిగా, సాఫీగా సాగిపోవాలని అనుకునే మనిషి తను.
అడుగుల శబ్దం వినిపిచింది. అది అక్క అడుగుల శబ్దమే వెంటనే లేచింది, హాల్ లోకి పరుగెత్తింది అలిసి పోయి వచ్చిన శోభన.
“దేశోద్ధరణ పూర్తయిందా ” అడిగింది శోధన.
“శోధనా నువ్వసలు సీరియస్ గా ఉండవా?” చిరు కోపంగా అడిగింది శోభన.
“ఓకే ట్రై చేస్తాను ఈ సీరియస్ నెస్ సరిపోతుందా?” మొహాన్ని కాస్త సీరియస్ గా పెట్టి అంది శోధన.
“ఇదే వద్దు యమ్మే చేసావు. చదివింది మనుష్యుల సైకాలజీ, జర్నలిజం చేసావు, సంగీతం నేర్చుకున్నావు అయినా ఖాళీగా ఇంట్లో కూచుంటావు. ” అంది.
“అక్కా ఇవ్వన్నీ టైం పాస్ కోసం నేను జర్నలిజం చేస్తే నీకిష్టం అని చేశాను. యమ్మే సైకాలజీ మనుష్యుల మనస్తత్వం తెలుసుకోవాలని చదివాను. కానీ తర్వాత తెలిసింది మనుష్యుల సైకాలజీ పుస్తకాల్లో ఉండదని అది మన మస్తకాల్లో (మెదళ్ళలో ) ఉంటుందని. ఇక సంగీతం అంటావా? హాయిగా నువ్వు డ్యూటీ కి వెళ్తే నీ పిల్లలకు నేర్పించడానికి మాస్టర్ ఎందుకు నేనే నేర్పిస్తాను. నాకు పెళ్ళయ్యాక నా మొగుడి ముందు కూచోని వీణ వాయిస్తాను. పాత సినిమాల్లో సావిత్రి వీణ వాయిస్తుంటే యన్టీ వోడు ఎంత హ్యాపీ గా వింటాడు కదా అలా. ” నవ్వుతూ అన్నది.
శోభన చెల్లెలి వంక చూసింది. ఒక ఆడపిల్లగా సాధారణ అమ్మాయిగా తను చెప్పింది రైట్ కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో శోధనలాంటి తెలివైన అమ్మాయి జర్నలిస్ట్ గా అక్షరాన్ని అస్త్రంగా ఎక్కుపెడితే తప్ప దేశానికి రక్షణ లేదు.
ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణా రాష్ట్రం కూడా ఏర్పడింది. కొందరు అవకాశ వాదులు దేశంలో అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.
తనకు తెలిసిన సమాచారం ప్రకారం పెద్ద కుట్ర జరుగుతోంది. ఈ కుట్రని ఛేదించాలంటే కొన్ని సందర్భాల్లో అధికారం పనిచేయదు. శోధనలాంటి జర్నలిస్ట్ బయటకు రావాలి. స్వేచ్చగా ఏదైనా రాయగలిగిన కలం అనే అస్త్రం వున్నది జర్నలిస్ట్ చేతిలోనే.

ఇంకా ఉంది..

2 thoughts on “శోధన 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *