May 4, 2024

“అమ్మ, నాన్న- ఓ గారాల కూతురు.”

రచన:మంథా భానుమతి

“ఎందుకంత భయం?” శాస్త్రన్నయ్యని అడిగాను… అప్పుడు నాకు ఐదేళ్ళుంటాయేమో!
ఐదేళ్ళ పిల్ల ఏం రాయగలదు అనుకోకండి.. ఇది రాస్తున్నప్పటికి నాకు బోలెడు ఏళ్ళొచ్చాయి. రింగు రింగులుగా వెనక్కెళ్ళి..
చిన్నప్పటి రోజుల్నుంచీ మొదలు పెట్టి నా కథ చెప్తున్నా! నేనే ఆ గారాల కూతుర్ని.
అమ్మకి నలభై, నాన్నగారికి నలభై రెండేళ్ళు దాటాక పుట్టాను. ఇంట్లో అమ్మా, నాన్న, నేను, శాస్త్రన్నయ్య ఉంటాం. వాడి పైన ముగ్గురన్నలూ వేరే ఊర్లలో ఉంటారు. అందరి కంటే పెద్దైన అక్కకి పెళ్ళయి ముగ్గురు పిల్లలు కూడా.. పెద్దన్నయ్యకి కూడా పెళ్ళయింది.. నేను పుట్టక ముందే! రెండో అన్నయ్య, ఇంట్లో బాబు అంటారు.. మద్రాస్ లో యఫ్.సి.ఏ చదువుతున్నాడు. మూడో అన్నయ్య కనకం.. బెల్గాంలో ‘లా’ చదువుతున్నాడు.
“ఏమో.. నాకేం తెలుసు? ఏది కావలసినా అమ్మనే అడుగుతా. ఏ గొడవా లేకుండా పనై పోతుంది.” అమ్మ ఇచ్చిన పదిరూపాయలు పట్టుకుని బూట్లేసుకుని, తలుపు దగ్గరకెళ్ళాడు శాస్త్రన్నయ్య, నా నెత్తి మీదో మొట్టికాయ మొట్టి మరీ.
“అమ్మా!” గావు కేక పెట్టా.
వెనక్కి తిరిగి ఓ వికటపు నవ్వు నవ్వాడు.
“అవున్లే.. క్లాసులో అన్నీ సున్నా మార్కులే.. అందుకే..” నాలిక బైట పెట్టి వెక్కిరించా.
వెనక్కి వచ్చి మళ్ళీ ఓ మొట్టికాయ వేశాడు దుర్మార్గుడు.
“వెధవా!” ఈ సారి ఊరుకోలేదు.. చెయ్యి తీసుకుని గట్టిగా కొరికా. రెండు జళ్లూ ఓ లాగు లాగి వెళ్లిపోయాడు.
పెంకులెగిరిపోయేలా రాగం పెట్టాను. ముచ్చిలిగుంట దగ్గరంతా నొప్పి.
“నీ కంటే అంతరం పెద్దవాడు.. వాడితో నీకేవిటే..” అమ్మ నన్నే తిట్టింది.
అంతరం అంటే ఏంటో! నాకు అర్ధం కాలే.. “వాడు” అప్పుడే యస్సేసేల్సీ పరీక్షలు రాశాడు. కాళ్ళెత్తి వేళ్ళ మీద సాగదీసి నిలుచుంటే తల, గుమ్మానికి తగలేంత పొడుగు. అంతరం అంటే అంత పొడుగనేవో.. నా కంటే పదేళ్ళు పైనే పెద్ద. అయినా ప్రతీదానికీ నాతో వంతుకొస్తాడు. అమ్మ మాత్రం నేనే వాడితో వంతంటుంది.. అమ్మకి వాడంటేనే ఇష్టం..
హాల్లో మూలకెళ్లి కూర్చుని ఏడుస్తూ కూర్చున్నా.
అప్పుడే నాన్నగారొచ్చారు బైటినుంచి.
“ఏంటమ్మా చిట్టి తల్లీ?” చేతులు చాచారు.
ఒక్క ఎగురు ఎగిరి ఆ చేతుల్లోకి దూకి, నాన్నగారి భుజంమీద మొహం దాచుకున్నా. ఒక చేత్తో తల మీద దువ్వుతూ, ఎత్తుకునే లోపలికి తీసుకెళ్ళారు.
“ఇదిగో! ఎందుకే మా తల్లిని ఏడిపిస్తారు? చిన్న పిల్లని చేసి.. ఏడీ? వాడేనా?” అమ్మని ‘ఇదిగో’ అని పిలుస్తారు నాన్నగారు. అదేంటో నాకెప్పుడూ అర్ధం కాదు.
“ఇది చిన్న పిల్లా! రాక్షసిలా పడిపోతుంది వాడి మీద.”
“అమ్మా!” చిన్నగా అరిచాను. నాన్నగారు తల దువ్వుతుంటే అన్నగాడు మొట్టిన చోట చివ్వు మంది. కళ్ళలోంచి బోలెడు నీళ్ళు కారాయి.
“ఏమైందిరా నాన్నా?” నాన్నగారు మంచం మీద కూచోపెట్టి తల తడిమారు నెమ్మదిగా.
“శాస్త్రనయ్య కొట్టాడు.” సందు దొరికింది కదా.. లొడలొడా అన్నీ చెప్పేశా.
నాన్నగారి కళ్ళు ఎర్రగా అయిపోయాయి.
“ఇదేం తక్కువ తినలేదు. పళ్ళన్నీ దిగేట్టు కరిచింది.” అమ్మ అన్నయ్య గాడిని వెనకేసుకొచ్చింది.
“ముందు వాడే మొట్టాడు నాన్నగారండీ..” వెక్కుతూ అన్నాను.
“రానీ చెప్తాను.. వెధవని. చెమడాలెక్కదీస్తాను. ఆడపిల్లని ఎంత సున్నితంగా చూసుకోవాలీ!”
“జుక్కు జుక్కు చిట్టి తల్లి, జుక్కారి చిట్టితల్లి..” అంటూ నన్ను నవ్వించడానికి పాట పాడారు. అప్పటికప్పుడు కల్పించి పాడేదైనా సరే.. చక్కగా పాడతారు నాన్నగారు.
అందుకే నాన్నగారంటే నాకు చాలా ఇష్టం.
………………..
అంత పొడుగున్నాడు.. ఆ మాటనడానికి ఇష్టం లేదు కానీ నాన్నగారంటే దడే వాడికి. వాడంటే తెలుసుగా.. శాస్త్రన్నయ్య..
ఎదురుగా కనిపిస్తే తప్పించుకుని వెళ్లిపోతాడు.
నేనైతే వీధిలో పకోడీల బండి గంట వినిపిస్తే నాన్నగారి దగ్గరకెళ్ళి చెయ్యి చాపుతా. ఏమీ అనరు.. నవ్వుతూ అర్ధణా కాసు చేతిలో పెట్టేస్తారు.
మరి శాస్త్రి.. ఇంకా పైనున్న ముగ్గురన్నయ్యలూ, ఎందుకబ్బా ప్రతీదీ అమ్మ ద్వారా అడిగిస్తారు?
చాలా రోజులు నాకు అర్ధం కాలేదు..
నాన్నగారు ఎప్పుడూ కాంపులకెళ్తుంటారు. ప్రొహిబిషన్ యస్సై. అందుకని.. అల్లరి చేసినప్పుడల్లా, “మీ నాన్నగారికి ఇష్టం ఉండదు.. కోపం వస్తుంది. వచ్చారంటే ఊరుకోరు..” అంటూ భయపెట్టేసి ఉంటుంది.
నా దగ్గర కూడా అంటుంది. కానీ..
నేను మాత్రం ఎప్పుడూ భయపడను.
అందుకే, మా శాస్త్రి కూడా నాకు భయపడుతుంటాడు. సాయంత్రం అంతా.. మొన్నా మధ్యని బాబన్నయ్య వచ్చినప్పుడు తెచ్చిన టెన్నిస్ బంతి కోసం, వీధరుగు మీద ఇద్దరం దెబ్బలాడుకున్నాం. తను క్రికెట్ ఆడుకోడానికి కావాలిట. చచ్చినా ఇవ్వనన్నాను. బలం బాగా ఉందిగా.. లాక్కుని, గోడ దూకి పారిపోయాడు.
అమ్మ సామాన్లు సర్దుకుంటూ పట్టించుకోలేదు. చెప్పినా లాభం ఉండదని మూలకెళ్లి పడుక్కున్నా.
రాత్రి నిద్రపోయానా! పొద్దున్న లేచే సరికి ఎక్కడో ఉన్నా..

కళ్ళు నులుముకుంటూ లేచి, బార్లా తీసున్న కటకటాల్లోంచి బైటికొచ్చాను. పొడవాటి వరండా! అంతా కొత్తగా ఉంది. ఏడుపొస్తోంది. అమ్మకోసం అటూ ఇటూ చూశాను. కనిపించలేదు. ఇల్లు కూడా మారిపోయింది. ఎదురుకుండా వరుసగా గదులు. వరండాలో నవారు దణ్ణాలు. దణ్ణాల మీద బట్టలారేసి ఉన్నాయి.
అదిగో.. నిన్న నేను వేసుకున్న గౌను, నాన్నగారి యూనిఫారం.. పెద్ద కాకీ నిక్కరు, కాఖీ షర్టు. అమ్మ చీరేది? అసలు అమ్మేదీ? గట్టిగా ఏడవాలనుంది..
అమ్మనొదిలేసి నాన్నగారు గానీ నన్ను ఎత్తుకొచ్చేశారా? నిన్న అమ్మ నన్ను తిట్టిందని అనవసరంగా చెప్పాను. అవునూ.. వాడేడీ? అనుకోకుండా చెయ్యి నెత్తి మీదికెళ్లింది.
నెమ్మదిగా నడుచుకుంటూ వరండా చివరున్న వీధి గుమ్మం దాటి బైటికొచ్చాను.
రోడ్డు కూడా కొత్తగా ఉంది. పట్టుపరికిణీ కాళ్ళకడ్డం పడుతోంది. రాత్రి పడుకున్నాక, లేపి మారుస్తానంటే పేచీ పెట్టి ఏడవడం గుర్తుంది. అమ్మ పెరుగన్నం కలిపి నోట్లో ముద్దలు పెడుతుంటే గుటుకు గుటుకు మింగడం కూడా గుర్తుంది.
అడుగో.. వీరన్న. నాన్నగారి దగ్గర పని చేసే కానిస్టేబుల్. యూనిఫారం వేసుకుంటాడు కానీ వేరుగా ఉంటుంది. అమ్మయ్య.. ఐతే, అమ్మ కూడా ఇక్కడే ఎక్కడో ఉంటుంది. రోడ్డు మీద నడవడం మొదలెట్టాను.
“పాపగారూ! ఎక్కడికెల్లిపోతన్నారండీ? అయ్యబాబోయ్.. అయ్యగారు చూస్తే నా పనైపోదండే? అమ్మగారేరీ?’
“అమ్మ కోసవే వీరన్నా! వెతుకుతున్నా.. ఎక్కడా కనిపించట్లే.” రాయి అడ్డం వచ్చి బొక్క బోర్లా పడి పోయాను.
“అయ్యయ్యో.. పాపగారూ! వత్తన్నా ఉండండి.” వీరన్న గబుక్కున లేపి ఎత్తుకుని, మళ్ళీ కటకటాలింట్లోకి తీసుకెళ్లాడు. అప్పుడే అమ్మ తడీపొడి చీర కట్టుకుని, తలకి పిడప చుట్టుకుంటూ వరండా ఆ చివర్నుంచి రావడం కనిపించింది.
చటుక్కున జారిపోయి, అమ్మ కుచ్చిళ్ళల్లో తల దాచుకున్నా వెక్కుతూ.
నాన్నగారంటే నాకు చాలా ఇష్టమే.. కానీ,
అమ్మ ఎక్కడికైనా వెళ్తే.. అమ్మో! ఇంకేవైనా ఉందా! శాస్త్రన్నయ్యని వెనకేసుకొచ్చినా సరే.. అమ్మ కావాలి.
…………………….

10 thoughts on ““అమ్మ, నాన్న- ఓ గారాల కూతురు.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *