May 4, 2024

పిత్రోత్సాహం

రచన: వసంతలక్ష్మి అయ్యగారి

vasanta lakshmi
మూడుదినాలు ఒకే దినాన జరుపుకోవడం ఎక్కడైనా విన్నారా.యివాళ వింటున్నాం. పైగా నాలుగోదికూడా లెక్కలోకి తీసుకుంటే.. యివాళ పొడవైన రోజట, , , పగటివేళ ఎక్కువనిలెండి.! జూన్ 21 ప్రపంచ సంగీత దినమనీ, జూన్ మూడో ఆదివారం ప్రపంచ పితరుల దినమనీ తెలుసు.ఇ.క.మూడోది ముచ్చటకానేకాని YOGA డే అట. యోగా ను బాగా దూరంపెడతానని నాకు ఈ మూడో దినం గురించి తెలియలేదులే.అయిన తొలి యోగా డే ట లెండి.! ఆఁ అయినా తెలిసి పొడిచేముందిలే.?తత్సంబంధిత పోస్టులకు కూడా కనెక్ట్ కానుగా..తెలిసాకానైనా నాలో కనీసం వార్మప్ కదలికలూ కొత్తగా రాలేదు. ఆదివారమని చెప్పి.కిచెన్ లో రెచ్చానే తప్ప.. రిజల్యూషన్ కి కూడా మనసు ఒప్పుకోలేదంటే.మనిషి ఇష్టాయిష్టాల్లో.నాకు యోగా ఆ రెండోదన్నమాట.అయిష్టాలగురించి టైమ్ వేస్టెందుకండీ చేయడం.బోలెడు ఇష్టాలను గౌరవించి తగు మర్యాదలు చేయకుండాను.

సంగీతమంటే ప్రాణం.తెలిసినదింతే యింత..తెలియనిదనంతానంతం.. అందుకని ఊరకుండుట ఉత్తమం.కాకపోతే శృతిలయలతో పాటు, శ్రద్ధాసక్తులుండి, తల్లిదండ్రుల తాపత్రయముండి, ఎంత తపించినా.. తలపోసినా.తరగతులకెళ్ళినా కొనసాగడమన్నదే తటస్థించి ప్రాప్తించలేదన్న వృత్తాంతం నా విషయంలో.. చాలా పెద్ద కథే. .! కనుక పక్కన పెడదాం.

First n foremost,, , , , topping all d days is , జన్మ నిచ్చి.గారంగా పెంచి పొంగి పోయిన గౌరవనీయుడైనతండ్రి.!
మీతో మా నాన్నగారి గురించి పంచుకుని నేను మదినిండా పదిలపరచుకున్న జ్ఞాపకాలకు అక్షరరూపమిచ్చి మరింత పదిలంగా భద్రపరచుకొమ్మని ఇంత మంచి వీలు కల్పించబడ్డాకా కూడా బద్ధకిస్తే.. నా జీవితానికి అర్థం శూన్యమే. .!
ప్రతియొక్కరికీ తల్లిదండ్రుల పెంపకం, , మనమూ.మనతోపాటూ వారూ పెద్దవడం., వారు పడ్డకష్టాలు.మనం పొందిన సుఖాలు, మనం వృద్ధిలోకొచ్చి.మన కాపురాలు[ముఖ్యంగా ఆడపిల్లలవి] సాఫీగా సాగుతుంటే చూసి వారి జన్మ సార్థకమనుకోవడం.యించుమించు కామన్, , అంతస్తులు వేరవచ్చుగాక అనురాగాలు సారూప్యాలు, , , అనుపమానాలు. !!
ప్రపంచమంతా ప్రతి individual కీ ఎంత వయసొచ్చినా.. తమ పేరెంట్స్ గురించిన తీపి గుర్తులు , మధురోహలు వారివి వారికుంటాయి.తమవెంటే.చివరిదాకా తమతోపాటే.!!
కనీసం ఐదారుగురు పిల్లలను కన్న ఆ రోజుల్లో కూడా.. ప్రతి బిడ్డ విడిగా తన తండ్రితో తాను పంచుకున్న బంధమే గొప్పదనో.స్పెషలనో.. అనుకోవడం పరిపాటి. నామటుకు నేనూ అంతే.. మేము మా నాన్నగారికి ఏడుగురం.నాలుగు మైనస్.. మూడు ప్లస్. అంటారేమో చెత్త భాషలో.కానీ మా నానగారికి మేమేడుగురం ఏడు కోట్లు .అంటూ ఉండటమే మాకు తెలుసు.అందరు పిహెచ్డీలైపోవాలన్న కోరిక .!అందుకవసరమైన ఆర్జనకై అవిశ్రాంతంగా శ్రమపడడం వారి తత్వం. ఊహ తెలియకుండా తల్లిని, ఊహల్లో విహరించే పదహారవ యేట తండ్రిని కోల్పోవడమే కాదు.పదిమందున్న యింటికి పెద్ద కొడుకవడం, సవితి తల్లిగార్ల నేపథ్యం ..ఆయనను చదువు మాని , , ఓ శ్రేయోభిలాషి తనచేతికిచ్చిన సిఫార్సు పత్రంతో అలనాటి యింపీరియల్ బాంకులో చేరిపోయేలా చేసిందిట.. వందల ఎకరాలు వచ్చి పోయే వారి తిండితిప్పలకు, పెట్టుపోతలకు, అపాత్ర దానాలకు గోవిందోహరి ట. అప్పట్లో చాలామందిది యిదే కాపీ స్టోరీ.ఇంతలోనే ఐదు ఆపేసిన అమ్మలేని అమ్మతో పెళ్ళి. సింపుల్గా యిది మా ఫాదర్ backdrop. zero తో zindagi మొదలెట్టారని చెప్పడమే నా ఉద్దేశ్యం.
ఆ బాంకు పేరే మారి యిప్పటి SBI అయింది. బేంకులో అంతా వారిని గురువుగారూ .అని సంబోధించేవారే. దానికి తగ్గట్టే చక్కటి గుండ్రని బొట్టు పెట్టుకునేవారు.1969 వరకు ట్రాన్సఫర్ల పేరుతో చాలా ఊళ్ళు తిరిగారు. కాని 69 లో నాకు గుర్తున్నప్పటినుండీ హైదరాబాదే మా స్థిరనివాసం. మధ్యలో పోస్టింగులకి ఆయనే వెళ్ళి ఆరోగ్యం పాడు చేసుకున్నారే తప్ప కుటుంబాన్ని కదపలేదు. బాంకులో వారి అసాధారణమైన , అనన్య సామాన్యమైన కమిట్మెంట్ కి . నిప్పులాంటి నిజాయితీకి ఎనలేని పేరు తెచ్చుకున్నారు, . రూపాయి దాచుకుని ఎరగరు.ఆరోజుల్లో పాతిక వేలకి బాకారం బేంకుకాలనీలో తన తోటి వారంతా ఈ జీ లోను సదుపాయంతో కొనుక్కున్నా.దాని జోలికి పోలేదాయన. కటింగులు పోతే పిల్లలకేం పెడతానని వారి వాదన. అందుకే చివరిదాకా బ్రహ్మాండమైన అద్దిళ్ళలోనే దర్జాగా ఉన్నాం. ప్రతి శనివారం తన కోటి బ్రాంచుకు చేరువలోనే ఉన్నజాన్స్ బేకరీ నుండి పేద్ద సైజు బ్రెడ్డూ, పుల్లారెడ్డి స్వీట్లు, బొంబాయి హల్వా రెడ్.లేదా గ్రీన్ ముద్ద హల్వా, జీడిపప్పు పాకం, వారి కాంటీన్ స్పెషల్స్ ఉన్నపుడల్లా అవీ.ఎక్కువగా బాదుషా, లడ్డూ.. మామిడి పళ్ళ సీజనులో కనీవినీ ఎరుగని వెరైటీలు, చీటీవాలే కేలా సరేసరి.సుల్తాను బజారులో కూరలు, మైసూరు ఘీ, లార్జ్ స్కేలులో తెచ్చేవారు, ఇలా ఆర్భాటాలు.అవాయిడబుల్సూ.. నాన్నగారి కోటా.నెలవారీ సరుకులు, వగైరాలు అన్నీ పూచికపుల్లతో పాటూ అమ్మపనులే.మిగతా ఏ విషయాలలోనూ తలదూర్చే టైముండేది కాదు వారికి. బాంకే సర్వస్వం అని పేరు .అందరికీ టైమింగ్స్ 10 to 5 . వీరికి మాత్రం 5 to 10 అనేవారట.! ఎక్కువగా inspection, vigilance departments లో పని చేసిన నాన్నగారికి టూరింగ్ చేస్తూ దాహమేసి ఏ నూతినీళ్ళైనా తాగితే వెంటనే ఓ పావలా ఆ బావిలో వేసి గాని ముందుకెళ్ళరని వారి సహోద్యోగుల ఉవాచ!
ఈ మనిషికి అత్యంత ప్రీతిపాత్రం MS Subbulakshmi గారి కచ్చేరీ, ప్రతి రోజూ రాత్రివరకు పనిచేసొచ్చి రేడియోలో తొమ్మిదింటి యింగ్లీష్ వార్తలు విని తదనంతరంవచ్చే సంగీత సభ వింటూ నిద్రలోకి జారుకొనేవారు. అలాగే.పగటిపూట భక్తిరంజని, తెలుగు వార్తలు, 8•30 కి కర్నాటకసంగీతం వింటూ భోజనం.డ్రెస్సింగు టిప్టాపు.విత్ టై. అండ్ షూ.పెన్నులకి చాలా ఖర్చు చేసేవారు. బాగుందన్నవారికి దానం అలవోకగా.. !
ఇంకో ముచ్చటేసే మెమరీ చెప్పనా. పిల్లలమంతా మా రిస్టువాచీలను ఒక tray లో పెట్టే వాళ్ళం, అందరివీ ఒకే టైములో కుడివైపుండే screw లాంటిది యిటూ అటూ తిప్పుతూ కీ యిచ్చేవారు. ఆయన ఫిలిప్స్ రేడియో ముట్టుకునే ధైర్యం మాకెవ్వరికీ లేదు. ఆయన ఏడింటికల్లా స్నానంచేసి వారు విడిచిన గుడ్డలను వారే సర్ఫ్ పోసి [వేసి కాదు] జాడించుకునేవారు, , మిగిలిన వారి బట్టలతో కలపనిచ్చేవారు కాదు.! తదనంతరం సుదీర్ఘంగా పైకి పఠిస్తూ పూజ.వెనువెంటనే శ్రీరామకోటి రాసి గాని మా ప్రోగ్రెస్ రిపోర్టు కూడా సంతకం చేసేవారు కాదు. తలచుకుంటేనే యిప్పుడు ఆశ్చర్యమనిపించేటంత క్రమశిక్షణ.సమయపాలన.సంగీతకళ పట్ల అపారమైన అభిరుచి.అన్నట్టు.. వంటలన్నీ టాప్ క్లాసు రుచుల్లోఉండాల్సిందే.! తేడాలొస్తే వెండికంచానికి, నీళ్ళచెంబులకి మూఢి డింపుల్స్ రావాల్సిందేనట సింపుల్ గా.!!
పిల్లలకిచ్చిన ప్రేమలో ఎప్పుడూ యీ కోపోద్రిక్తతలు చూడలేదు మేము.
ప్రతి ఆదివారం ఎవరో ఒకరు bank వారి కుటుంబాలు వచ్చి సందడిగా ఉండేది. కారణం మా నానగారు సందడి కి కేరాఫ్. కాకుండా మరో అతి ముఖ్యమైన మాట. ఆయనకి నేర్చుకోకుండానే చిన్నవయసులో astrology మీద బాగా పట్టొచ్చేసింది. సరదాగా bank staff తో మంచి చెడు predict చేయడం . అవీ మరీ తు. చ తప్పకుండా జరగడం వంటివి రానురాను ఇంటి హడావుడిని పెంచేసింది. అన్నట్టు తరచు తన గురించి ఏదో ఒకటి చెప్పమన్న వారిలో ముఖ్యులు . అప్పట్లో SBI కి చెందిన కోట శ్రీనివాసరావుగారు. చివరి క్షణంవరకు ఎందరెందరికో జాతకపరమైన విషయాలతో పాటు, సూచనలు.సలహాలు, పరిష్కారాలు తెలుపుతూ family special touch యిచ్చేవారు. పాపం .మా అమ్మకి వీరందరి సేవకే సరిపోయేది.. సంతానం ఏదో తక్కువైనట్టు!! మనిషిని చూస్తూనే వారి లగ్నం.రాశి చెప్పడమే కాక characteristics టకటకా చెప్పేసేవారు.కమర్షియల్ మైండే కాదు.ఎవరైనా.ఏమైనా ఆఫర్ చేస్తే.‘ తప్పు తప్పు. వాక్శుద్ధి పోతుంది.డబ్బు తీసుకుంటే” అనేవారు.నిస్వార్థ జీవి.కష్టాలలో పెరిగి.కాసు బంగారంతో జీవితాన్ని ఆరంభించిన ఆదర్శమూర్తి. he never even wanted to own a house… but wherever he lived, , , made it a home!! దివ్యమైన పెళ్ళి ముహూర్తాలు పెట్టేవారు.
పిల్లలమైన మేం ఏడుగురం మనిషికి యిద్దరేసి మితృలను ఇంటికి రప్పించుకునే వాళ్ళం.combined study పేరుతో.ఇంక పరీక్షలపుడు యిల్లు కిటకిటలాడేది.ఒక్కోమూల ఒకగ్రూపు.తలచుకుంటేనే భలే ఫీలింగ్. అమ్మలు అమ్మపనికే అంకితమవబట్టి.ఇంత చేస్తూ విసుగు, చిరాకూ ఏనాడూ ప్రదర్శించేవారు కారు. మా అందరి పెళ్ళిళ్ళూ అయ్యాక కూడా అందరూ మాతోకన్నా మా పేరెంట్స్ తోనే ఎక్కువ టచ్ లో ఉండేవారంటే నమ్ముతారా. నమ్మితీరాలి. !!
ఆరోజుల్లో అతి కొద్దిమంది దగ్గరే ఉండేది గ్రామఫోను.! కేవలం యీ కారణంగా డాక్టరు సి.నారెడ్డిగారూ, ప్రఖ్యాత నర్తకి శోభానాయుడుగారూ.ప్రముఖ రచయిత్రి శ్రీమతి తురగా జానకీరాణిగారి సిఫార్సుమేరకు మా యింటికి వచ్చి లకుమ అనే ballet రూపకల్పనకు పాట విన్నారు LP లో.! ఆ రోజుల్లో LP, EP అంటూ పెద్ద సీడీలను పోలిన డిస్కులు ఉండేవి. classical music తోపాటూ.నాకోసం భరతనాట్యం యల్పీలు సంగీత్ సాగర్ కెళ్ళి తెచ్చేవారు. దానికి నేను నేర్చుకున్న విద్య జోడించి గంతులేస్తే మురిసి పోయేవారు.! అలాగే అరుదైన పెద్ద స్పూల్ రికార్డర్ ఉండేది. బోలెడంత సంగీతాన్ని రేడియోనుంచి స్పూళ్ళలోకి దింపేసుకునేవారు.డౌన్లోడనమాట. దీనికి తోడు ఆయన ఆనందం కోసమే అన్నట్టు పదేళ్ళ వయసునుండే నేను ఆంధ్రాబాంక్ .కిడ్డీ బాంక్ , పాపంపసివాడు, తాతామనవడు, అంటూ బాలానందంవారి తరఫున ముందువరసలో ఉండి ఎన్నో, ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ యిస్తున్నపుడు ఆయన చెప్పనలవి కాని సంబరంతో నా మాటలు రికార్డు చేయడమే కాదు.వచ్చిన వారందరికీ గొప్ప చెప్పేసేవారు. నాన్నగారి కొలీగ్స్ అందరినీ మిమిక్రీ as it is గా నేను చేయడం. ఆయన నవ్వడం.మా వసంతుంటే పదిమంది పెట్టు అని ప్రశంసలు.!కేసెట్లొచ్చాకా అవో బీరువాడుండేవి.జ్యోతిష గ్రంథాలకు పోటీగా.!!ఆ టైమ్ కి నేను అడల్ట్ ఆడిషన్ పిన్న వయసులోనే అయ్యానని అదో గొప్ప.యిప్పటికీ గంట నాటకాలన్నీ ఆయన రికార్డుచేసి పద్ధతిగా లేబుల్ రాసినవి అలాగే ఉన్నాయి. తిరిగి వాటిని తాకిన నాథుడే లేనపుడు, నా నాటకాలు రికార్డు చేసేవాడెక్కడ?? నాకు తెలిసిన రాగాలు, సంగీతం.నేర్చుకున్నదాని కంటే ఇంట్లో నానగారు నిరంతరం ప్లే చేస్తే వినీవినీ వచ్చేసినవే. అంతెందుకు .. ఆయన నిత్యపూజ తన గదిలోనే ప్రత్యేకించి సూర్యభగవానుడు, హనుమంతులవారివి పెద్ద పటాలు అమర్చుకుని పైకి గట్టిగా పఠించేవారు.ఆ టైములో ఎవ్వరం గోల చేసే వాళ్ళంకాదు.గమ్మత్తేంటంటే.ఇంటిల్లిపాదికీ.ఆదిత్యహృదయం, కనకధారాస్తోత్రం, శివాష్టకం , ముఖ్యంగా హనుమాన్ చాలీసా వంటివి నేర్చుకోకుండానే విని విని వచ్చేశాయి. నా నోట్లో ఈనాటికీ నానుతూ.కుటుంబ సంప్రదాయమా అన్నట్టు అచ్చం ఆయనలాగే గట్టిగా పఠిస్తాను. భానుమతి పాటలు, బాలసరస్వతిపాటలు, , ఎందుకే నీకింత తొందరా, పిలచిన బిగువటరా, మనసున మల్లెలమాలలు, ఓహోహోహో పావురమా.యింకా రేలంగి, రమణారెడ్డి కామెడీ మాటలు పాటలూ, మాటున్నదీ మంచి మాటున్నదీ.సుందరాంగ మరువగలేనోయ్ రావేలా.వంటి పాటలెన్నో బాగా పాడేవారు. నాతో పాడించుకుని రికార్డుచేసేవారు కూడా.
ఆయన తాహతుకి మించి పిల్లలని ఉచ్ఛస్థాయిలో పెంచారని పెద్దయ్యాకా నాకు బాగా తెలిసింది. ఆయన కోరినట్టే అందరం బుద్ధిగా చదువుకున్నాం కూడా.నాకు child artisteగా తొలి సారి పది రూపాయల చెక్కునిచ్చినపుడు ఆయన ఆనందాన్ని ఇప్పటికీ మరువలేను. వెంటనే bank లో ఖాతా తెరిపించి హంగామా చేసి మరో పది జతచేసిన వైనం.. చాలా ఏళ్ళే కొనసాగింది. నేను ఆలిండియా రేడియోలో ఆడిషన్ టెస్టు హై గ్రేడులో పాసయ్యానని కబురందినపుడు ఆయన వృత్తి రీత్యా ఖమ్మంలో ఉన్నారు.
ఆయన స్టైలే వేరు.అక్కడినుండి నాకు పెద్ద గొప్పచాటుతూ.టెలిగ్రాము.
“congratulations on the distinction conferred on you” అని.
ఇలాగే.. ఇంగ్లీషు తప్పు మాట్లాడితే సహించేవారు కాదు, , ఆ పోలిక పూర్తిగా దిగింది నాక్కూడా.bank లో ఆయనని అంతా గురువుగారనే పిలిచేవారు.పేరు ఆలమూరి రఘురామ సూర్యప్రకాశరావు.చుట్టాలంతా రామం అనేవారు. అమ్మ పేరు సీత.సరిపోయింది కదూ.మేమిచ్చిన ఎన్నో ప్రదర్శనలకి రాలేకపోయేవారు.రవీంద్రభారతిలో ఆకాశవాణి స్వర్ణోత్సవాలకి ఎందుకనో వచ్చారు. “గొడుగులు, గొడుగులు”. “పడమటివాకిలి తలుపులను గడియతీసి తెరిచారా” అనే దేవులపల్లివారి రచనలకు విశ్వనాథంగారు సంగీతం చేయగా తురగా జానకీరాణిగారు నృత్య దర్శకత్వం చేశారు. వందేమాతరం పాటను సినారె గారు తెలుగులో అద్భుతంగా రాశారు.దానికీ ఆటాపాటా ఈ పెద్దలే కూర్చారు, జమునగారు, పాలగుమ్మివిశ్వనాథంగారు, వేణుగాన విద్వాంసులు శ్రీనివాసన్ గార్లను కలవడం , వారు నన్ను ప్రశంసించడం చూసి పరవశించి పోయారు నానగారు.
అలాగే.విశ్వవిఖ్యాత నటసార్వభౌమ యన్టిరామారావుగారు తీసిన శ్రీనాథుడు సినిమా trailer లో పెద్దనటుల సరసన నిలబడి మీనాక్షీ శేషాద్రికి డబ్బింగ్ .. ప్రసాద్ లాబ్స్ లో తెల్లవారుఝామున చెప్పినపుడు వారి సంతోషానికి అవధుల్లేవు.
ఒకే ఒక్క సారి మరీ రాత్రి వేళ శ్రీనివాసన్ గారి మేధస్సుతో అవార్డులకని బెర్లిన్ పంపడానికి రూపొందించిన ఇంగ్లీష్ ఫీచర్ “you can not stop me” [అన్న దాంట్లో టైమ్ ను personify చేసి రాశారు. అందులో ఆ టైమ్ ను నేనే] రికార్డింగుకి నానగారు తోడు వచ్చి వారి అభిమాన వేణుగానవిద్వాంసుల త్రయంలో ఒకరైన యన్ . యస్ . శ్రీనివాసన్ గారిని పరిచయం చేసుకుని పొందిన ఆనందం చెప్ప సాధ్యంకాదు. అంతరాత్రి రికార్డింగు ఎందుకనుకుంటారేమో, , గడియారం టిక్ టిక్ లను నిశ్శబ్దంలో చేయడంకోసం. అలాగే మేక పిల్లను తెచ్చి నిజంగా దాని మేమే లను రికార్డు చేసిన ఘనత వారిది. సహజత్వానికి తాపత్రయం. he was a perfectionist !! ఈ టైము లేదా ఆగని సమయం రూపకంలో సర్వం తానే అనుకుని గర్వపడే మానవుని చూసి పగలబడి నవ్వే పని టైము పాత్రధారినైన నాకు చాలా ఉండిందందులో.అందుకు నన్ను స్పెషల్గా ఎంపిక చేసి బుక్ చేశారని తెలిసింది. నా ఇంగ్లీషు కూడా అమితంగా నచ్చుకున్నారు. నాకపుడు పద్దెనిమిదేమో.!?

child artiste వేటలో1971లో స్వయంగా శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారే మా ఇంటికి వచ్చి తీసుకెళ్ళినప్పటి వారి సంబరమేమీ తక్కువ కాదు. అప్పటికి యివన్నీ అర్థంచేసుకునే పరిణతి నాకు లేదని యిపుడు తెలుస్తోంది. చిన్నప్పటి శారదగారి వేషం అంటే అది నాదే.పూర్వజన్మ పుణ్యమూ.మా నానగారి పూజలఫలమూనూ.
మరో సంఘటన.APSFDC వారు సినిమాకి ముందు చేసే రాష్ట్ర రాజకీయాలను, ముఖ్యమంత్రి గారి రిబ్బను కటింగులను, వరదలు వగైరాలను భద్రాచల నవమి పండగను , యిలాంటి వివిధ వేడుకలు, సందర్భాల సమాహారాన్ని 15 నిముషములకు కుదించి రాసి వార్తాతరంగిణి పేరుతో సినిమాకు ముందు వేసేవారు. కొల్లేటిసరస్సు వంటి పర్యాటక ప్రదేశాల గురించి, భీభత్సమైన తుఫానులగురించి కూడా చాలా చేశాను. భావం బాగా పలికిస్తానని పేరుండేది.ఉంది యిప్పటికీ ఆ పేరు. ఈ రికార్డింగులు సారథీ స్టూడియోస్. అమీర్పేటలో జరిగేవి. అంటే ఈనాటి నగరపు నడిబొడ్డన్న మాట. కానీ 80 వ దశకంలో అమీర్ పేటలో టింబర్ దుకాణాలు వచ్చాయంటే ఆ తరువాత అడవిలా ఉండి భయమేసేది. అందుకు నానగారు తోడు వచ్చి తీసుకెళ్ళారు రెండుసార్లు, అప్పట్లో పాత కాలం యన్టిఆర్ పల్లెటూరి పిల్ల చిత్ర దర్శకులు బివి సుబ్బారావుగారు FDC కి డైరెక్టరుగారు. వారిని కలిసి నానగారు ఆతరం మాటలాడుకుని మురిసి పోయారు.
నేను వెళ్ళక వెళ్ళక ఏదైనా ఫంక్షన్ కి వెళ్తే ఎవరో ఊహించని వారు అర్జంటంటూ రికార్డింగుకి పిలవడం, నానగారు ఆ ఫోను మాట్లాడి నేనున్న చోటికి పరుగుపరుగున రావడం.ఎన్నిసార్లు జరిగిందో చెప్పలేను. ఆయనకెందుకో నాపట్ల అమితమైన ఉత్సాహం.
ఇదంతా అటుంచి క్లాసు ఫస్ట్ రావడం నాకు నేనే పెట్టుకున్నరూలు. పదోక్లాసు వరకు సాగించగలిగాను. తరువాత పరీక్షలముందు అతిగా నీరసించి పోతే నానగారు బత్తాయిలరసం తీసి బలవంతంగా నా నోట్లోపోసి, కంపాసు బాక్సు నిండా చప్పరించే హార్లిక్సు బిళ్ళలు పెట్టి నాకు సేవలు చేస్తుంటే చూసిన మా మితృలంతా నన్ను తిట్టేవారు.. నాన్నను తెగ వరీ చేస్తున్నావనేవారు. పెద్దపరీక్షలు అంటే అన్నం సయించేది కాదుమరి.పైగా రోజువిడచిరోజు హిప్ మీద డ్యూరోబోలిన్ యింజక్షన్ తప్పనిసరి అన్నారు. ఏంటో!! ఎందుకంత చదివానో అని ఇపుడెంత చింతిస్తానో.
నానగారు ఆవకాయ ముద్దలు పెడితే నెయ్యి పోసేసేవారు. ఆ స్మృతులు మరీమరీ మధురాలు. హిమాం పసందులంటూ ఆయన తెచ్చిపడేసే వంకరటింకర అష్టావక్రపు తీయని మామిడిపళ్ళకన్నా తీపి జ్ఞాపకాలు. ఆయనంటే నాకున్న మేరుపర్వతమంత నమ్మకం, ధీమా. ఇప్పటివరకు ఇంకెవ్వరన్నా లేవు.
నా పెళ్ళై అత్తవారింటిలో దింపిన తొలిరోజుల్లోనే మా పక్కిల్లే వాళ్ళ బేంకు బ్రాంచ్ ఉండటం చూసి మరుక్షణమే నాకు జాయింట్ అకౌంటు తెరిచారు. ఎపుడొచ్చినా అమ్మను నాదగ్గర దింపి ఆయన రిటైరైనా సరే పక్క bank కివెళ్ళి సెటిలైపోయేవారు. మావారి కిష్టమని పుల్లారెడ్డి స్వీటు తీసుకురావడమంటే వారికి పండగ. తన పిల్లలనే కాదు, . యింటికొచ్చిన అల్లుళ్ళకీ, కోడళ్ళకి మరీమరీ ప్రీతిపాత్రులయ్యారు. వియ్యాలవారంతా ఒకటేమాట. ఆయనలాంటి మనిషి మరొకరుండరని. ఆఫీసంతా అదేమాట.
నానగారు అనగానే రొటీనుగా అందరికీలాగా కాక నాకు మరీమరీ ఎక్కువగా తరగనన్ని స్మృతులున్నాయా అనిపిస్తోంది రాయబోతే.. నానగారిని పిచ్చి ప్రేమతో daddy అని మా ఇంట్లో చనువుగా పిలిచి , అల్లరి చేసి ఆటలాడించినది నేనేనేమో.. ఆయన నాకు చేసిన గారమేమీ తక్కువ కాదుమరి. నాతో అప్పటి సంపూర్ణ రామాయణంలోని శబరి పాట ఎక్కువగా పాడించుకొనేవారు. అలాగే మరి ఎందుకనో ఆదివారాలు సాయంత్రం ”కాచిగూడా బాలాజీ రతన్ లాల్ దాకా బర్కత్ పూర్ నుంచి నడవగలవామ్మా.”అని నన్నే ఎక్కువగా తోడు తీసికెళ్ళి మాంఛి మీగడ మీద పంచదార చల్లిన స్వీటు తినిపించేవారు. 1980 లో నాకు అబిడ్సులోని వాజ్ స్టూడియోకి ఆదివారమైనందుకు తోడుగా వచ్చి పక్కనే ఉన్న hotel Emerald లో గట్ఠిగా తినిపించి, బయట మళ్ళీ మంచి సపోటా ఫ్రూట్ జ్యూస్ తాగించి , దారి పొడవునా ఏది కనిపిస్తే అది కొనిపెట్టేవారు. అలా అడిగినా ఎంత భయపడుతూ కావాలనేదాన్నో తలచుకుంటే ఆశ్చర్యమే యిప్పటికీ.. అమ్మేవంటుందో నని భయభక్తులుండేవి. ఆయనకి మాత్రం ఎంత ఖర్చు చేయిస్తే అంత తన్మయమొందేవారు.. నానగారు పక్కనుంటే ఆ thrill వేరు.!
రేడియోవారు నాటకాలకని బుక్ చేస్తే చీరలే కట్టుకుని వెళ్ళేదాన్ని. కాలేజీ లైఫ్ యింకా అవలేదు అప్పటికి. చదువులకి అందరిలాగా అన్నిరకాల డ్రెస్సులు వేసుకునేదాన్ని. 1981 లో నానగారు డ్యూటీ మీద మైసూర్ వెళ్ళి ప్రత్యేకించి నాకోసం తెచ్చిన షిఫాన్ చీరల అందాన్ని ఎప్పటికీ మరువలేను. Like him, the sarees were also class apart, ,!!ఇంతపెద్ద సంసారమని శలవుదొరకదని ఎవరింట్లోను నాకు సౌఖ్యంగా ఉండదని ఏ ఊరికీ తీసికెళ్ళని నానగారు , , రిటైరయ్యేముందు.bank వారి బలవంతంమీద చివరి LTC వాడుకునే నాటికి నాకు జాబు వుండడంతో.. నన్ను బిల్లులో మినహాయిస్తూ total south tour .. flight లో తిరిగాము అమ్మ, చెల్లాయి, యిద్దరు తమ్ముళ్ళతో.
ఆ luxury, , secured feeling మాటలలో చెప్పడం నా వల్ల కాదండీ.one and only pleasure trip గా ఈనాటికి register ఐపోయింది.
1990-91 లో రెండేళ్ళు మాత్రమే మా పెదతమ్ముడుకి మద్రాసు లో జాబ్ వస్తేను మా అమ్మ బలవంతంమేరకు ఊరు కదిలి అడయారులో ఉన్నారు. ఒక దసరాకి పిల్లలమంతా మా పిల్లలతో [చంటీ. చిన్నావయసువారు] ఓ పది రోజులు పుట్టింటి స్టే ని పరమానందంగా గడిపాము. మా పిల్లలందరికీ తాతగారు ఫేవరెట్, గ్రేట్ అయినది ఆ ట్రిప్పులోనే. అడిగినదల్లా కొనివ్వడమేకాక రోజూ గ్రాండ్ బజారుకి తీసుకెళ్ళి అదిరి పోయే కొత్త కొత్త పిండివంటలు తినిపించారు కదూ మరి. అందుకూ. మదరాసులో పెర్సనల్ గా ఆయన enjoy చేసినది మాత్రం సీజన్స్ టికెట్స్ కొనేసుకుని కచ్చేరీలకెళ్ళి లైవులు చూడడం.
చెప్తున్నా కదా.. పిల్లలందరూ ఎవరికి వారే డాడీస్ పెట్ అనుకునేలా పెంచారు.
నానగారి ఉద్యోగానికి ఏ ఆటంకమూ రాకుండా లీవన్నది తీసుకోకుండా అహరహము శ్రమించారన్నాను. గమ్మత్తేంటంటే సివియర్ ఆయాసం వ్యాధి రాత్రంతా సతాయిస్తే పొద్దుటికల్లా ఠంచనుగా బాంకుకి వేళకంటే ఎప్పుడూ గంటముందుగా వెళ్ళేవారు. నేను అనారోగ్య కారణాలవల్ల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో M. Sc chemistry discontinue చేయవలసి వచ్చినపుడు చాలా కృంగి పోయారు. అదే సంవత్సరం 1981 లో మా అమ్మ ప్రోద్బలంతో బేంకు పరీక్ష పాసై SBH లో జాయినవడం ఆయనను మిక్కిలి బాధించింది.. ఆయన పొందిన కాస్త ఆనందం ఏంటయా అంటే. భగవంతుడున్నాడు కనుకనే నాకు SBI లో రాలేదని. !!
నానగారంటే ఎప్పుడూ నేనందరికీ చెప్పే మరో చిన్నకోణముంది. ఇంటిముందు ఆయనంటూ నిలబడి యున్నపుడు దారే పోయేవారెవరైనా ఫలానా అడ్రసు ఎక్కడండీ అని అడిగారో.. ఆ కాయితముచ్చుకుని ఆ పెద్దమనిషిని లోపలకంటా లాక్కొచ్చి అందులోని ఫోను నంబరు స్వయంగా తిప్పి కనెక్టు చేసి మాట్లాడించి పంపేవారు. అందుకే ఆయన కోటికొక్కరు.
ఫోన్ అన్నా కనక మరో ముచ్చట. మేము 1969 లో రాగానే మాకు ఫోనులేదు. మేము యింటివారి ఫోనులో వారు దయదలచి పిలిస్తే కిందకి వెళ్ళి మాట్లాడి వచ్చేవాళ్ళం.
రానురాను రాగద్వేషాలకతీతులుకాని ఆయింటావిడ మాకొచ్చే కాల్స్ గురించి చెప్పేవారు కాదు, మా పోస్టునూ దాచేసేవారు. నాకేమైనా ఆకాశవాణి , అమృతవాణి వారు రికార్డింగుందని గానీ, మా అక్కలప్పటికే కాస్త పెద్ద.. కనుక ఏ పనుండి లేటైనా ఫోను చేస్తే మెసేజ్ మాకందడం బందయిందని తెలుసుకున్న మరుక్షణం. ఫోను పొందడం అంత సులువుకాని ఆ రోజుల్లో పదిరోజుల్లో యింటికి ఫోను పెట్టించేశారు.. that was my dad! అడగకుండా యింటద్దె పెంచి, కొన్నప్రతివస్తువు ముందు యింటివారికి చూపి.తినే ప్రతి పదార్థం వారికి ముందుగానే పంచియిచ్చి మగదిక్కులేని వారని ప్రత్యేకంగా బేంకుపనులన్నీ చేసివ్వగా వారు నానగారికిచ్చిన treatment యిది. సూక్ష్మంగా మాత్రమే చెప్పా సుమండీ.
నానగారితో నా బంధం సరిగ్గా 34 సంవత్సరాలు. ఆహారం చాలా పదును. ఏది పడితే అది, ఎపుడు పడితే అపుడు నోరును గిర్నీలా యేనాడూ వారు వాడలేదు. ఎంతో శక్తియున్నమనిషిలా చివరిదాకా వందలమంది బంధుమితృలకు స్వంతమనిషిలా, శ్రేయోభిలాషిగా, జాతకచక్రాలు, జీవనసాయాలు చేస్తూ, మానసిక స్థైర్యాన్ని అవసరమైనవారందరికీ సొంతాన్ని లెక్క చేయకుండా చేస్తూ, తలలో నాలుకగాఉంటూ.. పిల్లలమైన మేము కూడా పలకరించలేనంత బిజీగా మారిపోయి వచ్చేపోయేవారితో అనునిత్యం మాటామంతి సలుపుతూ. నవ్వుతూ నవ్విస్తూ కనీసం పిల్లలు , పెళ్ళాం పోరుతున్నందుకైనా బీపీ చూపించుకోని, చివరి దాకా తన కిష్టమైన నేతిని తిని.. తగినంత physical, తగనంత mental strain తీసుకునేవారు.! ప్రజాశ్రేయస్సుకి పెద్దపీట వేస్తూ పోస్టు కవర్లు, రెవెన్యూ స్టాంపులు, కొత్త కరెన్సీ నోట్లు, staplers, రకరకాల పెన్నులు , రబ్బర్లు, పెన్ పెన్సిల్స్, యిప్పటికీ నేను చూడని కొత్తరకాల స్టేషనరీ నంతా హాబీ కన్నా ఎక్కువగా తన గదిలో దుకాణంలా స్టాకును మెయిన్టెయిన్ చేసేవారు. అడిగినవారికి , అవసరమైనవారికి వాటిని పంచివ్వడంలో పిచ్చి సంతోషం పొందేవారు. అది వీరి హాబీ.! యిలా సాఫీగా సాగుతున్న మా తండ్రిగారి గుండె ఎందుకనో నిశ్శబ్ద పోటుకు గురై ఒకేఒక రాత్రి తన యింటిలోనే తీవ్ర అసౌఖ్యానికి లోనై మరునాడు 15•9•1994 గురువారం, ఏకాదశి నాడు 68 సంవత్సరాలు అవిశ్రాంతంగా పనిచేసిచేసి ఆగిపోయింది.! ఆసుపత్రి, కోర్టు ఆవరణలలోకి వెళ్ళకూడదన్న ఆయన కాంక్షలు నెరవేరినట్టే అయింది.
ఆయన చివరిలో అర్థాంతరంగా అంతర్థానమొందడం మా ఒక్క కుటుంబానికే వెలితి కాదన్నవిషయం మూలమూలలనుండి వచ్చి సంతాపం తెలిపిన ప్రజల మూలంగా తెలుసుకున్నమేము.. మిశ్రమానుభూతులకు లోనయ్యే వాళ్ళం. కాకపోతే చీటికీ మాటికీ నాకు ఏ సమస్య వచ్చినా .. ”నవగ్రహాల ప్రభావాలు, సంచారాలు.. యిన్నోయింట్లోంచి.. అన్నోయింట్లోకొస్తే నీకు బ్రహ్మాండమమ్మా. ఒక్కయేడాది ఓపిక పట్టరా.అన్నీ సర్దుకుంటాయని” చెప్పే ధైర్య వాక్కులు ఈ రోజుకీ నాకైతే పేద్ద వెలితి.!! మనిషి ఉండగా జాతకశాస్త్రం ఓనమాలు నేర్చుకున్నా వారిలాగే నలుగురికి ఉపయోగపడేదీ. జీవితమన్న బాధ మరికొంత. ఏది ఎలా ఉన్నా.. ఆయన గతించినపుడు కొందరు పెద్దలు.. ఆయనను కొనియాడుతూనే.. ధన్యుడు కనుకనే ‘తీసుకోకుండా పోయారు.” అన్న మాటలు విన్నపుడు నా ఒళ్ళు మండిపోయేది. తీసుకునుంటే మేమూ కాస్త చూసుకునే వీలు దొరికేదికదా. సడన్ గా మాయమవడం. అన్యాయం అని చాలా కాలం గింజుకున్నాను, కానీ మా అమ్మ ఒక ఏడాది బాధపడి.. ‘తీసుకుని’ పోయినపుడు గానీ నాన్నగారి అప్రకటిత, అనూహ్య అస్తమయం వెనుక అంత సుఖమయమైన మరణమనే అర్థం ఉందని తెలియలేదు.. !
నాకు ఆశ్చర్యం కలిగించిన మరో రెండు సంఘటనలు.
నేను ఒకే ఒకసారి మా మేనమామగారి పట్టుదల మేరకు కోనసీమ ప్రాంతాలకు వెళ్ళాను 1976లో. ఊరంటేనే వింత. కొత్త. మా నానగారి ఊరు రాజోలని .. అక్కడవారికో యిల్లుందనీ మాటల్లో వినడమే. మామావయ్య తన ఊరు అమలాపురంనుండి బస్సులో నన్ను రాజోలు చూపిస్తానని తీసికెళ్ళగా ఊళ్ళోకడుగుపెడుతూనే ఎవరో ఆంటీల్లాంటి వారు నన్నుచూసి ఆపి నువ్వు గానీ రామంగారమ్మాయివా.. అని అడిగితే అవాక్కవక ఏమవమంటారు?నానగారు ఆ ఊరొదిలి మళ్ళీ వెళ్ళిందీలేదు. నాసంగతి సరేసరి. అడిగిన వారు మా తాతగారి తమ్ములుంగారి తాలూకు అట. పిలిచి పనసకూర తో భోజనం నేలమీద పీట వేసుకుని తిన్నగుర్తు బలంగా దిగింది.!
మరోసారి నన్ను త్యాగరాయగాన సభ వేదిక పై చూసిన పెద్దలు ఒకరు , కార్యక్రమం అనంతరం నన్ను కలిసి మీరు ప్రకాశరావుగారి అమ్మాయా? అన్నారు.
హాఁ!అప్పటికే వారు స్వర్గంచేరి పదేళ్ళైపోయింది.మళ్ళీ అవాక్కు.
ఆయన కూడా bank లో నానగారితో పని చేశారనీ, పైలోకాలనుండి కూడా తనను తలచుకునేంత దగ్గరి వారనీ తెలిపి నన్ను పులకింపచేశారు.. కేవలం ముఖం.పోలికలను బట్టి యింత విడ్డూరాలా.??ఏవైనా.నాకు అలాంటపుడు కలిగేది అనిర్వచనీయమైన ఆనందమే.
నావరకు నాకు, బాంక్ మాటొచ్చినా, మంచి సుబ్బలక్ష్మి పాటొచ్చినా, టీవీలో రాశిఫలాల ప్రోగ్రామ్ వచ్చినా, మంచి జోక్ విన్నా, మామిడిపళ్ళు విరివిగా చూసినా, గుట్టలుగా కూరగాయలు యింటికి తెచ్చినా, వంకాయ పులుసుపచ్చడి, గోంగూరపచ్చడి చేసినా, ఫిల్టరు కాఫీ పీబెర్రీ తాగినా, ఎవరు నన్ను మెచ్చుకున్నా.. నానగారు నాతో ఉన్నట్టే, నాలో ఉన్నట్టే అనుభూతి చెందుతాను. దానికి తగ్గట్టే జీవితంపట్ల, , సిద్ధాంతపరంగా మావారికీ మా నానగారికీ చాలా పోలికలుండడం నేను చేసుకున్న పుణ్యమే. ఈ మా నానగారికి కూతురునని అవకాశం వచ్చినపుడల్లా చెప్పుకోడానికి ఉవ్విళ్ళూరుతానంటే అతిశయోక్తికాదు.
నాన్నగారూ.జై!!

2 thoughts on “పిత్రోత్సాహం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *