April 30, 2024

చేరేదెటకో తెలిసీ..

రచన: స్వాతీ శ్రీపాద

శృతి గదిలోకి వచ్చాడు శ్రీకాంత్ శర్మ. కళ్ళు తెరచి గోడను చూస్తూ ఉంది శృతి . అతను రాగానే లేచి నిల్చుంది నర్స్. “నేను ఇక్కడ కాస్సేపు౦టాను, ఓ రెండు మూడు గంటలు. ఏదైనా పని చూసుకునేది ఉంటే వెళ్లిరా “ అన్నాడు.
“థాంక్స్ “ చెప్పి వెళ్ళింది నర్స్.
“శృతి “ నెమ్మదిగా ఉచ్చారి౦చాయి అతని పెదవులు.
ఉహు! విన్నట్టే అనిపించలేదు.
కొంచం స్వరం పెంచి పిలిచి చూసాడు.
లాభం లేకపోయింది.
వినలేకపోతో౦దేమో అనిపింఛి నిరాశ కలిగింది. లేచి వెళ్లి పక్కన నిల్చుని ఒక్కక్షణం గమనించి ఆమె దృష్టి మరల్చడానికి చేతి మీద చెయ్యి వేశాడు .
వెంటనే ఒక జర్క్ లాటిది కనబడి తల అతని వైపు తిరిగింది.
అనుకోని పరిణామానికి ఉక్కిరిబిక్కిరయాడు. ఇన్ని నెలల్లో ఇది మొదటిసారి, అతడామెను అనునయపూర్వాకంగా స్పృశించడం, దానికి ఆమె ప్రతిస్పందన.
ఆ కళ్ళలో ఓ విధమైన మెరుపు.
“ శృతి “ ఈ సారీ మంద్రంగానే ఉంది అతని స్వరం.
పాలిపోయిన చెక్కిళ్ళు నిమరాలనిపి౦చి౦ది.
ఏ సంశయమూ లేకుండా అతని బొటనవేలు చూపుడు వేలు సుతారంగా ఆమె పెదవి వంపులో కదిలాయి.
అమేజింగ్ ! ఎదురు చూడని ఒక గగుర్పాటు ఆమె దేహంలో ..
“శృతీ” ఈ సారి ఆమె కళ్ళలో మెరుపు అతని పిలుపు వినిపి౦చి౦దనడానికి నిదర్శనంగా.
“నేను చెప్పినది నీకు వినబడుతోందా “ సందేహం నివృత్తి చేసుకుందుకు గాను అడిగాడు. నిస్సహాయంగా చూడటం మినహా ఏం చెయ్యగలదని గుర్తుకు వచ్చి –“చూడు నేను చెప్తున్నది నీకు వినబడుతూ౦టే కళ్ళు మూసుకో , ముయ్యగలవు కద..”
కాస్సేపు త౦టాలు పడి కళ్ళు ముయ్యగలిగి౦ది.
ఏది చెప్పినా అర్ధంకావడానికి తిరిగి తను చేసే ప్రయత్నానికీ కొంత సమయం పడుతోందని గ్రహించాడు శ్రీకాంత్ . నిరాశపడలేదు .
“శ్రుతీ నువ్వేదైనా చెప్పాలనుకుంటున్నావా? అవునంటే రెండు సార్లు కళ్ళు మూసి తెరు కాదంటే ఒక సారి “
రెండు మూడు నిమిషాలు ప్రయత్నించి కళ్ళు మూసి తెరిచింది.
ఇదేమిటి తానేమీ చెప్పలనుకోడం లేదా –కలవరపడబోయే లోగానే మరోసారి కళ్ళు మూసే౦దుకు ప్రయత్నిస్తూ కనబడింది.
గొప్ప సంతోషం కలిగింది శ్రీకాంత్ కి.
నిజమే తన ఊహ నిజమే. ఏదో చెప్పాలనుకుంటూ చెప్పలేకపోతో౦ది.
కొంచం ప్రయత్నిస్తే.
“శ్రుతీ , మనకు మిగిలినది ఒకటే దారి , ముందుగా అక్షరాలూ అన్నీ పెదవులతో ఎలా ఉచ్చరిస్తావో చూసుకుంటాను, నేను ఎలా అంటే నువ్వు అలాగే అనాలి. నేననే అక్షరం శబ్దం పైకి రాకున్న నువ్వు అనడానికి ప్రయత్నించు ”
“అ”
కాస్సేపు అయోమయంహా చూసింది .
మళ్ళీ ప్రయత్నించాడు .
“అ ..అమ్మ”
సరిగ్గా అలాగే ప్రయత్నించింది.
“అ ‘అంటూ కొద్దిగా విడివడిన పెదవులు మళ్ళీ కలుసుకోడం ..అమ మళ్ళీ మరో సారి ప్రయత్నించాక ‘అమమ” అనడం.
“గుడ్, ఇలాగే ఇలాగే..” సంబరపడిపోయాడు.
‘ఆ … “
“ఆ..” చాలా సేపు నోరు తెరిచి ఉంచింది.
పట్టుమని పది అక్షరాల శిక్షణకు నాలుగ్గంటలు పట్టింది. ఎందుకైనా మంచిదని ప్రతి అక్షరానికీ ఆమె పెదవుల ఆకృతిని పేపర్ మీద గీసుకుని దాని కింద సంబంధిత అక్షరాన్నీ రాసుకున్నాడు.
స్పూన్ తో మాంగో జ్యూస్ తాగిస్తూ
“శ్రమ పెడుతున్నానా బంగారూ , తప్పదు. ఏది కావాలన్నా శ్రమపడక తప్పదు “ తనలో తనే అనుకున్నట్టుగా అన్నాడు.
అన్య మనస్కంగా టీవీ ముందు కూచుని సౌమ్య వేడి వేడి టీ తాగటం మొదలెట్టింది. ఆఫీస్ నుండి కాస్త ముందు బయల్దేరి వెయిట్ లాస్ సెస్సన్ కి వెళ్లి వచ్చేసరికి పూర్తిగా అలసిపోయిన ఫీలింగ్. నిజానికి అక్కడి డైటీషియన్ ఒక డైట్ ప్లాన్ వివరించి ఆ షీట్ రాసిచ్చింది కూడా .
ఉదయం లేస్తూనే రెండు గ్లాస్ ల నీళ్ళు తాగాలి.
ఎనిమిదింటికి పాలు పంచదార లేకుండా టీ, వీలయితే పాలు కలిపిన టీ మానేసి గ్రీన్ టీ తాగాలి. ఎనిమిదిన్నరకు రెండు ఇడ్లీలు అదీ సాంబార్ తో లేదా అల్లం పచ్చడి, కొబ్బరి, పల్లీలు లాటివి బహిష్కరించాలి.
పదకొండింటికి మళ్లీ ఒక పండో అయితే అది జామకాయో, బొప్పాసి ముక్కో అలాటివే మళ్ళీ ద్రాక్ష , మామిడి , సీతాఫలంలాటివి కూడదు.
ఇలా సాగింది.
లంచ్ టైమ్లో ఒక పుల్కా లేదా ఒక కప్పు అన్నం , ఒకకప్పు కూర ముఖ్యంగా ఆకుకూరలు, ఒక కప్పు పప్పు, మజ్జిగ
మళ్లీ మూడింటికి టీ బిస్కెట్స్.
రాత్రి ఏడూ ఎనిమిది మధ్య డిన్నర్.
రోజుకి కనీసం ఒక ముప్పావు గంట వాకి౦గో వ్యాయామమో చెయ్యాలి.
ఇంతేనా అనుకుంది.
కాని అసలు కష్టం ఏమిటో అనుభవానికి వచ్చాక కాని తెలిసి రాలేదు. పొద్దునే లేచినా అబ్బ ! కళ్ళు మండుతున్నాయి. ఆవులింతలు మరి కాస్సేపు పడుకు౦దామా అన్న లాలస.
ఒక రోజు వాకింగ్ వెళ్లి వస్తే రెండు రోజుల కాళ్ళు నొప్పులు , ఇంట్లో వంట ఆలస్యమవడం… ఆఫీస్ లో అలసట.
ఒకరోజు వెళ్తే నాలుగు రోజులు నాగాలు పెట్టడం..
తిండి విషయంలోనూ అంతే.
పంచదార వేసుకుని టీ తాగకపోతే తలనొప్పి , ఏ పనీ చెయ్యలేకపోడం చీటికీ మాటికీ అందరినీ విసుక్కోడం , ఆ చిరాకంతా చిత్రంగా టీ తాగగానే సర్డుకునేది.
ఇహ లాభం లేదు, టీ తాగకుండా జరగదు, మిగిలినది తిండి తగ్గి౦చుకోడం. అందుకే. ముందుగా బ్రేక్ ఫాస్ట్ తగ్గించుకుని ఆ స్థానంలో మరొకప్పు టీ చేర్చుకుంది.
మధ్యాన్నం లంచ్ మానేసి సాయంత్రం ఇంటికి వచ్చాక ఏదో ఒకటి తిని సరిపెట్టు కోడం.
ఉహు. వెళ్లి స్లిమ్మింగ్ సెంటర్ లొ వెయ్యి౦గ్ మెషిన్ ఎక్కగానే చక్రం గిర్రున తిరిగి మరో కేజీ ఎక్కువ చూపడం…
లాభం లేదనుకుని వెళ్లేముందు రోజు పూర్తిగా ఏమీ తినకు౦డా వెళితే కాస్తలో కాస్త నయం.
అయినా సెష్షన్ నుండి రాగానే ఏదో ఒకటి తినెయ్యడం.
అన్నింటికీ మించి పురుగులా తొలిచేస్తున్న అనుమానం. ఈ మధ్య శివ ప్రతిమాటా కృత్రిమంగానే అనిపిస్తోంది. ఎందుకు అతను మారాడా? తను మారిపోయిందా?
సౌమ్య టీ తాగి పదినిమిషాలు కాలేదు. ఏమిటో విపరీతమైన నీరసం అనిపించింది.
లేచి వెళ్లి చూస్తే డబ్బాలో జంతికలు కనిపించాయి. ఒక బవుల్ లో వేసుకుని తెచ్చుకుంది.
ఈ మధ్య పిల్లలిద్దరూ కోచింగ్ కి వెళ్తున్నారు.
వచ్చేసరికి ఎనిమిది అవుతుంది.
పదినిమిషాల్లో జ౦తికలు తినేసి లేచి వెళ్లి రైస్ కుకర్ లొ బియ్యం కడిగి పెట్టి వచ్చింది.
మళ్ళీ వచ్చి చానెల్స్ అన్నీ ఓ సారి తిప్పి ఏవీ నచ్చక లేచి వెళ్లి బెడ్ మీద వాలింది.
ఆలోచనలు శివ వైపు మళ్ళాయి.
అయిదారు నెలలుగా శివ ఇదివరకులా లేడు. ఏదో తేడా. పరధ్యాసగా ఉంటున్నాడు. అయిదారు మార్లు స్విచాఫ్ చేసినప్పుడు మరో సిమ్ కార్డ్ వాడుతున్నాదేమోనని అనుమానం వచ్చింది.
అక్కడికీ అతని సెల్ ఈ మధ్యనే కొన్నది డ్యూయల్ సిమ్ ఉన్నాడని తెలిసి ఒకటి రెండు సార్లు చెక్ చెయ్యాలని ప్రయత్నించింది కూడా.
ఆ రోజు ట్రాఫిక్ లో కారులో కనిపించాక మరో రెండు సార్లు అక్కడో ఇక్కడో అతన్ని చూసినట్టుగానే అనిపి౦చి౦ది. ఆర్నెల్లలో చచ్చీ చెడి ముప్పై వేలు సమర్పించుకుని రెండున్నర కిలోల బరువు మాత్రం తగ్గింది. అయినా ఏ పండగలో రావడం మళ్ళీ మామూలే.
రీతూ, నీతూ వచ్చినట్టున్నారు. లేచి పిల్లల ధ్యాసలో పడదామని చూసింది. ఇద్దరూ కాళ్ళూ చేతులూ కడుక్కుని బట్టలు మార్చుకుని వచ్చి పుస్తకాలు ముందేసుకు కూచున్నారు హోం వర్క్ చెయ్యాలంటూ.
వంటింట్లోకి వెళ్లి చూసింది ఉదయం వండిన కూర, చారు ఉన్నాయి. కాస్త పచ్చడేదయినా చేసుకుంటే ఈ పూటకు కానివ్వవచ్చు. లేచి వెళ్లి కాస్త టమాటా పచ్చడి చేసి మళ్ళీ వచ్చి టీవీ ముందు కూచుంది.
వార్తలు వస్తున్నాయి.
ఏముంది బంద్ లూ ప్రమాదాలూ, కాదంటే రాజకీయాలూ అంతేగా అనుకుంటూ చానెల్ మార్చబోయిన సౌమ్య షాక్ తగిలినట్టు ఆగిపోయింది.
ఏదో ఊరేగింపు చూపిస్తున్నారు. రోడ్డుకి వారగా ఆపి బైక్ మీద నుంచుని చూస్తున్న అతను …అవును అతను శివానే. ఆగి ఆసక్తిగా చూసే లోగానే సీన్ మారిపోయింది.
అవును బైక్ హాండిల్ పట్టుకున్న అతని కుడిచేతి చూపుడు వేలికి ఉన్న ఉంగరం ……..
ఎన్నాళ్ళిలా లోలోపల సందేహపడుతూ కళవెళపడటం?
లేచి బెడ్ రూమ్ లోకి వెళ్లి అతనికి ఫోన్ చేసింది. ఎప్పటిలాగే స్విచాఫ్ లో ఉంది.
తాడో పేడో తేల్చుకోవాలి నిర్ణయించుకుంది సౌమ్య.

**********

మర్నాడు ఉదయం లేస్తూనే నిర్ణయించుకుంది ఓ వారం సెలవు పెట్టయినా ఈ విషయం ఏమిటో తేల్చుకోవాలని.
అందుకే ఫోన్ చేసి సిక్ లీవ్ అని చెప్పి పిల్లలు స్కూల్ కి వెళ్ళాక శివ ఆఫీస్ కి వెళ్లాలని నిర్ణయించుకుంది.
ఆ లోగా అతనికోసారి ఫోన్ చేసింది. ముందు ఎంగేజ్ వస్తూ ఉ౦డి౦ది. నిమిషమాగి మళ్ళీ ఫోన్ చేసింది.
ఈ సారి ఆన్సర్ చేసాడు.” చెప్పు సౌమ్యా , ఏమిటి సంగతి?”
“అబ్బే ఎందుకో ఒకసారి మాట్లాడదామనిపి౦చి …”
“బె౦గెట్టుకున్నావా? శనివారం వచ్చేస్తాగా ?”
మరో రెండు నిమిషాలు మామూలుగానే మాట్లాడి పెట్టేసాక తన స్కూటీ తీసుకుని బయల్దేరింది.
ఎప్పుడో ఆ వైపు వెళ్ళినప్పుడు “ఇది మా ఆఫీస్ “అని చూపించినప్పుడు చూడటం మినహా ఎప్పుడూ వెళ్ళింది లేదు .
పెళ్లి అయి పదమూడేళ్ళయినా ఒక్కరోజూ ఒక్క మిత్రుడూ ఇంటికి వచ్చిందీ లేదు.
సరిగ్గా ఆఫీస్ ముందు స్కూటీ ఆపి౦దో లేదో ఎదురుగా చిన్ననాటి మిత్రురాలు సుశీల , ఇద్దరూ ఒకరినొకరు హత్తుకొని ఎప్పటెప్పటి విషయాలో గుర్తు చేసుకున్నారు.
“మా ఇల్లు ఈ పక్కనే రా “అంటూ పలికిన ఆహ్వానాన్ని కాదనలేక పొయింది సౌమ్య.
“నేను టెలిఫోన్స్ లో పని చేస్తున్నాను పది రోజులుగా సెలవు పెట్టాను పిల్లకు పరీక్షలు పనిమనిషికి జ్వరం . ఇంతకీ నీ సంగతి చెప్పు” అంది సుశీల అదిగాక గాని తనక్కడికి ఎందుకు వచ్చిందో గుర్తు రాలేదు సౌమ్యకు.
మొహం ఒక్కసారి చిన్నబోయింది.
పిల్లల గురించీ తన గురించీ చెప్పి భర్త టూరింగ్ ఉద్యోగం వల్ల పిల్లలు తనే ఇక్కడ ఉ౦టామనీ చెప్పింది. ఆ కబురూ ఈ కబురూ అయాక మరిక వెళ్తానని లేచాక హఠాత్తుగా ఏదో గుర్తుకు వచ్చినట్టు “అవును సుశీ , ఫోన్ కాల్ ని బట్టి మనిషి ఎక్కడున్నదీ తెలుసుకోవచ్చా ?” యధాలాపంగా అడిగినట్టు అడిగింది.
“సిగ్నల్ ని బట్టి టెక్నికల్గా గుర్తిస్తారు. అయితే లోకల్ అయితేనే కనెక్ట్ అవుతుంది. పొరుగు ఊరవుతే సున్నా చేరిస్తే గాని కాల్ కనెక్ట్ అవదు. ఇప్పుడు ప్రపోజల్ ఉ౦దనుకో రాష్ట్రమంతా లోకల్ చెయ్యాలని ..”
“థాంక్ యూ సుశీ” మరో మాటకు అవకాశం ఇవ్వకుండా బండి స్టార్ట్ చేసింది.
అనుమానం లేదు. ఇందాక కాల్ చేసినప్పుడు తానేమీ సున్నా యాడ్ చెయ్యలేదు. ఆ మాటకు వస్తే ఎప్పుడూ చెయ్యలేదు. అయితే అతను మాత్రం విజయవాడ అనీ, విశాఖ అనీ , బరంపురం అనీ పూనా అనీ చెప్తూనే ఉన్నాడు.
ఒకటి మాత్రం ఖాయం తన అనుమానం నిజమే. అతను ఇక్కడే ఉన్నాడన్నది నిజం.
అంటే అతనిక్కడే ఉండి…ఉంటున్నది ఎక్కడ ?
టూర్ల౦టూ అబద్ధాలు ఎందుకు ? వారానికి అయిదు రోజులు .
ఉలిక్కిపడింది.
వెంటనే ఆఫీస్ కి వెళ్లి నలుగురి ముందూ కడిగేయ్యలనిపి౦చి౦ది. అయినా ఇది తొందరపడో, ఆవేశపడో తేల్చుకునే విషయం కాదు. ముందు సంగతేమిటో తెలిసాక కదా ఏం చెయ్యాలని ఆలోచించేది. అయినా గట్టిగా అడిగితే మాట తప్పి౦చడమో, పట్టుపడితే అబద్ధాలు చెప్పి బుకాయి౦చడమో కదా చేసేది.
సగం దూరం ఇంటివైపు వచ్చినది మళ్ళీ ఆఫీస్ వైపు బండి తిప్పింది. ఆఫీస్ ఎదురుగా రోడ్డుకి ఆ వైపున ఉన్న చెట్టు నీడకి౦ద ఆగి ఆలోచించింది .
లోపలికి వెళ్లి ఒకసారి అతనితో మాట్లాడాలా వద్దా అని.
అంతలోనే ఆఫీస్ నుండి బయటకు వచ్చిన శివ బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది.
అది పెద్ద ఆశ్చర్యమేమీ అనిపించలేదు. ఏది జరగాలో అదే జరిగిన భావన. నింపాదిగా బండి స్టార్ట్ చేసుకుని ఇంటి మొహం పట్టింది సౌమ్య.
రాబోయే శని వారం కోసం ఎదురు చూస్తూ .
*****
బెల్ కొట్టిన శబ్దానికి తుళ్ళిపడి శృతి వైపు చూశాడు శ్రీకాంత్ .
అప్పుడే వచ్చి వెళ్ళాడు శివరావ్.
ఇహ మరెవరూ అవరోధం కలిగించరనే తన శిక్షణ మొదలు పెట్టాడు .
అంత క్రితమే ఒక్కో అక్షరానికీ పెదవుల కదలిక, దాని వల్ల వచ్చే శబ్దం రాసుకోడం పూర్తయింది.
అదే ఒక యజ్ఞంలా సాగింది.
ఆ ప్రయత్నమే ఒక శారీరిక వైద్యంలా పనిచేసి ముఖ కండరాలలో కొంత కదలిక మొదలయింది.
“ఒక్క నిమిషం “ అంటూ శృతి చెయ్యి తట్టి వెళ్లి తలుపు తీశాడు.
ఎదురుగా అపరిచిత.
ఏం అడగాలో తెలియక క్షణం తికమక పడ్డాడు.
“నేను, నా పేరు సౌమ్య …”
“ఎవరు కావాలి?” మరెవరైనా అనుకుని వచ్చిందేమో నని అడిగాడు.
“మీతో ఓ పది నిమిషాలు మాట్లాడవచ్చా? “ అభ్యర్ధనగా అడిగింది.
కాస్త ఇబ్బంది పడుతున్నట్టుగా ” నేను ఇంట్లో ప్రాక్టీస్ చెయ్యనండి. ఏదైనా ఉంటే హాస్పిటల్ ద్వారానే..” అన్నాడు.
“మీరు డాక్టరా ? అయాం సారీ …నేను అందుకు రాలేదు, ఇప్పుడు వచ్చి వెళ్ళిన శివ భార్యను. అతని గురించే.. మీ సమయం వృధా చేస్తున్నాననుకోకపోతే …”
తుళ్ళిపడ్డాడు శ్రీకాంత్.
ఇదెక్కడి ట్విస్ట్ !
ఓ పక్కన శృతి , మరో వైపు సౌమ్య..
“ప్లీజ్”
“రండి …” డ్రాయింగ్ రూమ్ లోకి నడిచి వెనక వచ్చిన ఆమెకు సోఫా చూపాడు.
టీపాయ్ మీద ఉన్న జగ్ నుండి గ్లాస్ లోకి నీళ్ళు వంపి అందించాడు.
కృతజ్ఞతగా చూసి గ్లాస్ తీసుకుని గటగటా తాగి గ్లాస్ టీపాయ్ మీదుంచి ఒకసారి చుట్టూ చూసింది సౌమ్య.
“చెప్పండి”
“శివగారు ఎందుకు వచ్చారు? మీరేమైనా అతనికి ట్రీట్ మెంట్ ఇస్తున్నారా? ఇలా అడగటం ఇబ్బందికరమే గాని గత కొన్నాళ్ళుగా అతని పైన నాకు కొన్ని అనుమానాలున్నాయి. అవి నిర్దారి౦చుకుందుకు …. అర్ధమైంది అతన్నే అడగవచ్చంటారేమో …..అడిగితే జవాబు రాదని తెలిసే…”
“నేనతనికెలాంటి చికిత్స చెయ్యడం లేదు , కాని ఏదైనా నిజం తెలిస్తే ఏంచేద్దామని ?”కొంచ౦ ఆసక్తి కనబరచాడు శ్రీకాంత్
ఒక్క క్షణం ఆలోచనలో పడింది సౌమ్య . అవును ఆ విషయం ఆలోచించలేదు. లోలోపల అతని పైన ఏదైనా నమ్మకమా ? అంత నమ్మకం ఉంటే ఇంత గోప్యంగా అతన్ని వెంబడించి వెనకాల వెనకాల ఎందుకు వచ్చినట్టు?
ఎప్పటిలాగే శనివారం అతను ఇంట్లో ఉ౦టాననగానే బండి తీసుకుని బయల్దేరింది.
ఓపిగ్గా ఓ గంట ఎదురు చూశాక చక్కగా రెడీ అయి బయటకు వచ్చిన శివ తన మోటార్ బైక్ తియ్యగానే అతని వ్యూ మిర్రర్ లో కనబడనంత దూరాన ఉంది అతన్ని అనుసరించడం ఆరంభించింది.
దాదాపు అరగంటపైన ప్రయాణించి అక్కడకు వచ్చిన అతను లోపలి వెళ్ళగానే వెనక్కు వెళ్ళిపోదామనుకునే లోగా డాక్టర్ శ్రీకాంత్ శర్మ నేం ప్లేట్ చూసి ఆగిపోయింది. అరగంట నిరీక్షణ తరువాత ఈ ప్రశ్న.
కాస్సేపు ఆలోచించుకున్నట్టుగా ఆగి , “ సందర్భాన్ని బట్టి ఏం చెయ్యాలన్నది ఆలోచిస్తాను”
సమయోచితంగా జవాబిచ్చింది.
ఆ మాట నచ్చినట్టుగా మెచ్చుకోలుగా తలూపి, వెంట రమ్మన్నట్టు సైగ చేసి సౌమ్యను శృతి గదిలోకి తీసుకు వెళ్ళాడు.
“ఈమె ఒకప్పటి నా మిత్రురాలు. యాక్సిడెంట్ లో శరీరం మొత్తం చచ్చు పడిపోయింది. మనం చెప్పినది వినబడుతుంది . ఇప్పుడిప్పుడే మాట్లాడేందుకు ఆమెకు మాటలు నేర్పేందుకు నేను ప్రయత్నిస్తున్నాము”
అవునా అన్నట్టు జాలిగా చూసింది సౌమ్య. అయినా ఆమెను తనకెందుకు పరిచయం చేశాడో అర్ధం కాలేదు.
“శృతీ”
కళ్ళెత్తి అతనివైపు చూసి రెప్పలార్పి౦ది.
“శివరావ్ మీ ఆయన కదూ?”
రెప్ప వాల్చకుండా అతనివంకే చూస్తో౦ది .
“శివరావ్ వెళ్ళిపోయాడు.. అతను మీ ఆయన కదూ ..?”
మళ్ళీ అడిగాడు.
అవునన్నట్టు రెండు సార్లు కళ్ళరెప్పలు పూర్తిగా ఆర్పి౦ది.
ఉలికిపడింది సౌమ్య.
“ఈమె సౌమ్య “ పొడిగా చెప్పాడు .
విన్నట్టుగా కనుగుడ్లు అటూ ఇటూ తిప్పింది.
నర్స్ ని పిలిచి చూస్తూ౦డమని చెప్పి మళ్ళీ హాల్లోకి నడిచాడు. అతని వెనకాలే యాంత్రికంగా కదిలింది సౌమ్య.
ఏదో అర్ధమయీ అవని స్థితి.
ఆమె భర్త శివరావ్ శివ ఒకరేనా ? ఏమో!
“ఇక్కడ కొంచం మీకు అర్ధమయే ఉండాలి..”
సౌమ్య అతని వైపు వెర్రిగా చూసింది.
“ అఫ్కోర్స్ , శివరావ్ , శివ ఒకరే”
కూడదీసుకు౦దుకు సమయం ఇస్తున్నట్టుగా అతను లేచి వెళ్లి టీ ఏర్పాట్లు చూసి , ఏవో పోన్ కాల్స్ అటెండ్ చేసి నెమ్మదిగా పదినిమిషాల తరువాత పనిమనిషి టీ తెచ్చాక వచ్చి కూచున్నాడు.
ఆత్రంగా టీ కప్పు తీసుకుని వేడి వేడి టీ ఆబగా తాగుతున్న సౌమ్య వంక జాలిగా చూసాడు.
“ఇప్పుడు చెప్పండి “
“ ఏం చెప్పను ? మా పెళ్లి జరిగి పదమూడేళ్ళు . ఇద్దరు పాపలు ట్విన్స్ ..”
ఆగింది సౌమ్య.
ఉలిక్కిపడ్డాడు శ్రీకాంత్ .
అవును . శృతికి కూడా ట్విన్స్ ఉన్నారు. అంటే శివ పిల్లలు ఎప్పుడూ ట్విన్సే .
“ఈ మధ్య ఈ మధ్యనే ఎందుకో ఈ ఊళ్లోనే అతన్ని రెండు మూడు సార్లు చూశాననుకున్నాను. నాకు మాత్రం ఇక్కడలేననీ ఏదో టూర్ లో మరెక్కడో ఉన్నాననీ చెప్తున్నాడనిపి౦చి౦ది. అడిగినా పెద్ద ఉపయోగం లేకపోయింది. అందుకే ఇలా వెనక పరిశోధన ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో తెలుసుకుందామని ..” ఆగింది సౌమ్య.
“సౌమ్య గారూ ఇలా పొడిపొడిగా విషయం తెలుసుకుని లాభం లేదు, జరుగుతున్న కధ ఏమిటో ఒక సమగ్ర అవగాహనకు వస్తే తప్ప ఏం చెయ్యాలన్నది చెప్పలేము. ఇక్కడ నేను చెప్పాల్సింది కూడా చాలానే ఉంది. అది ముఖ్యంగా మీరు తెలుసుకోవాలి. అసలు సంగతి చెప్పడానికి శృతి మాట్లాడే స్థితిలో లేదు. అయితే నాకూ శృతికీ ఉన్న అనుబంధం గురించి చెప్పుకు౦దుకు నేనేమీ ఇబ్బందిపడను .
నాకున్న అనుమానాలు నాకున్నాయి. కావాలని శ్రుతిని ప్రమాదంలోకి నెట్టే౦దుకో, మరింకేం ఆశి౦చో ఈ ప్రమాదం కావాలని చేసారేమోనని నాకు అనుమానం . అయితే దాన్ని నిరూపించుకునే ప్రయత్నంలోనే ఉన్నాను. ఇప్పుడు మీ సహకారం కూడా తోడైతే అనుకున్న పని మరింత వేగంగా చెయ్యగలనేమో ..”
“అలా నేనేమైనా ఉపయోగపడటం కంటే ఏ౦ కావాలి? చెప్పండి, ఏంచెయ్యను ?”
సిన్సియర్ గానే అడిగింది
“ఇప్పుడు మీరు అర్జంట్ గా వెళ్ళాలా ? ఒకటి రెండు గంటలు స్పేర్ చెయ్యగలరా?”
“అర్జంట్ ఏమీ లేదు. ఎలాగూ ఆఫీస్ కి సెలవే చెప్పండి”
“ మీరు కనీసం ఈ విషయం ఒక కొలిక్కి వచ్చే వరకూ శివగారిదగ్గర ఎత్తక పోడం చాలా ముఖ్యమైన పని. అలా జరిగితే ఒక్క నిజమూ బయటకు రాకపోవచ్చు. మరొకటి ఏం జరుగుతోందన్నది మీరు పూర్తిగా తెలుసుకోవాలి”
కాస్త అయిష్టంగానే ఒప్పుకున్నట్టు తలూపింది సౌమ్య . అసలు ఇ౦టి కెళ్లగానే కాలర్ పట్టుకుని మొగుణ్ణి నిగ్గదీసి అడగాలనుకుంది.
ఎట్టి పరిస్థితుల్లో సహనం కోల్పోకండి సౌమ్యా మీరు ఒక్కరు కాదు మీకు తోడూ మీకు అండగా నేనూ ఉంటాను” అంటూ మొదలు పెట్టాడు శ్రీకాంత్ .
స్థాణువులా వింటూ ఉ౦డిపోయి౦ది సౌమ్య.
*******
“ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది” తనంత తానుగా పలకరించింది సౌమ్య.
“అవును నాకూ నిన్ను చూసినట్టుగానే ఉ౦దమ్మాయ్ గుర్తు రావడం లేదు. నువ్వేమైనా మా శృతితో చదువుకున్నావా? “ కళ్ళద్దాలు సవరి౦చుకుంటూ అడిగిందావిడ .
“ ఓ అవునా౦టి , గుర్తొచ్చారు. మేమిద్దరం స్కూల్లో కలిసి చదువుకున్నాము. ఒకటి రెండు సార్లు మీ ఇంటికి వచ్చాను. ఇప్పుడా ఇంట్లోనే ఉంటున్నారా ?” గబగబా అడిగింది సౌమ్య .
“లేదమ్మాయ్ ఆ ఇల్లు అప్పుడే అమ్మేశాము. ఆ తరువాత ఎక్కడో అవుట్ స్కర్ట్స్ లో ఉన్నాము కొన్నాళ్ళు …. “
“ఇంతకీ శృతి ఎక్కడ ఉంది? ఎలావుంది? ఏదైనా ఉద్యోగమా ? పిల్లలా?”
ఒకదాని వెంట ఒకటి ఆగకుండా అడుగుతూనే ఉంది సౌమ్య.
“ఉద్యోగం చేసేది, ముగ్గురు పిల్లలు కాని ఇప్పుడు…”
మాట్లాడలేక కళ్ళు తుడుచుకుందావిడ.
“ఏం జరిగి౦దా౦టీ “ శృతి …”
“మొన్నీ మధ్యనే స్కూటర్ పైన వెళ్తుంటే యాక్సిడెంట్.. తలలో గునపం గుచ్చుకు పొయింది. ఒళ్లంతా చచ్చుబడిపోయింది…” ఆవిడ గొంతులో దుఃఖం.
“అయ్యో! అవునా అంటీ? ఇప్పుడు…”
“పెద్దఆసుపత్రిలోనే చూపించాము. ఇప్పటికి ఆరు నెలలైంది.ఆ డాక్టర్ గారి పుణ్యమా అనిఏదో అబ్జర్వేషన్ లో ఉంచారు”
“ మా ఇల్లు ఈ పక్కనే ఆంటీ రండి కాఫీ తాగి వెళ్ళవచ్చు“ అంటూ కాస్త బలవంతంగానే ఆవిడను తనవెంట బయలుదేరదీసింది సౌమ్య.
కాఫీ తాగుతూ తన కష్ట సుఖాలు చెప్పుకుంది.
ఒక్కతే కూతురైన శృతిని ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నదీ,
“ఏమిటో దాని జీవితం … అది ఎంతగా రాజీపడితే అంతగా ఏడిపిస్తో౦ది.”
అని, అంతలోనే తెప్పరిల్లి మాటమారుస్తూ సవరించుకుని “ నీ సంగతి చెప్పు అమ్మాయ్” అనేసింది.
పది నిమిషాల తరువాత బస్ ఎక్కించి వచ్చాక కాని తట్టలేదు సౌమ్యకు ఆంటీ చెప్పిన శృతి, తన చిన్ననాటి నేస్తం, డాక్టర్ శ్రీకాంత్ శర్మ వైద్యం చేస్తున్న శృతి ఒక్కరేనేమో అన్న సంగతి . ఆ రోజున ఎంతసేపూ శివ గురించి ఆలోచనల్లోనే ఉ౦డిపోయి౦ది కాని ఆమెను పరీక్షగా చూడనైనా లేదు. పైగా మెడ వరకూ కప్పుకుని ఉండటం, కళ్ళు తప్ప మరేం చూసిన గుర్తే లేదు. ఆ తరువాత చాలాసార్లే వెళ్ళినా పెద్దగా దగ్గరకు వెళ్లి చూసినదే లేదు. వెంటనే ఒక సారి చూసి రావాలనిపి౦చి౦ది.
కాని పిల్లలు ఇంటికి వచ్చే వేళ ఎలా? ఏదైనా బలంగా చెయ్యాలనిపించి చెయ్యలేకపోడం ఎంతనరకమూ తెలిసి వచ్చింది.
తెల్లవారే వరకూ కలత నిద్రతోనే గడిపింది,
పిల్లలు స్కూల్ కి వెళ్ళగానే ఒక గంట ఆలస్యంగా వస్తానని పర్మిషన్ తీసుకుని ఉదయమే శ్రీకాంత్ ఇంటికి బయల్దేరింది.
“రండి రండి, చాలా రోజులైంది కదా… మీకో అద్భుతమైన వార్త. “ నిజంగానే చాలా ఆనందంగా కనిపించాడు శ్రీకాంత్.
“ఏమిటి శృతి మాట్లాడుతోందా?” చెప్పు వదిలి లోనికి అడుగుపెడుతూ అడిగింది.
“ ఒక రకంగా , చాలా రోజులుగా ఆలోచించినా ఇంత త్వరగా సాధ్యపడుతుందని అనుకోలేదు .
కంప్యూటర్ వినియోగంలో ఒక సాఫ్ట్ వేర్ ఉంది. మనం మాట్లాడుతుంటే అది ఆ మాటలను టైప్ చేస్తుంది. దాని ఆధారంగా కాస్త మార్పులు చేర్పులతో బ్రెయిన్ వేవ్స్ చదివి టైప్ చెయ్యగల ఉపకరణాన్నిరూపొంది౦చాను. అది ఎంత వరకు పని చేస్తుందా అని అనుమానంగా ఉండేది. రాత్రి మొదటిసారిగా అమర్చి చూసాను. ఇదిగో తెల్లారే సరికి ఇంత మాటర్ టైప్ చేసింది “ అంటూ కాగితాలబొత్తిని చూపాడు.
“ ఓ గ్రాండ్ సక్సెస్ అన్నమాట “
“ఇప్పుడే చెప్పలేం ఆ కాగితాల్లో ఏం ఉందో. చదివితే గాని తెలియదు కద. అలా ఏదైనా ఆమె గురించి ఉంటే ఇలాటి వాటి వల్ల మరెన్నిటినో సాధించవచ్చు, ముందు నా అనుమానాలకు ఒక జవాబు దొరుకుతుంది.
“నాకూ కొన్ని అనుమానాలున్నాయి , ఒక్క సారి శృతితో మాట్లాడిరానా? “ అతని జవాబు కోసం ఎదురు చూడకుండానే శృతి ఉన్న గదిలోకి వెళ్ళింది. పక్కన కుర్చీలో కూర్చుని నర్స్ పుస్తకం చదువుకుంటూ౦ది.
అలికిడి విని లేచి “నిద్రపోతున్నట్టున్నారు మేడం“ అతి చిన్న స్వరంతో చెప్పింది.
ఆమెను కూర్చోమని సైగ చేసి వెళ్లి పక్కన నిల్చుంది.
ఈ మధ్య కాలంలో అయిదారు సార్లు వెళ్ళడం వల్ల, శ్రీకాంత్తో చనువు, నర్సుతొ పరిచయం పెరిగాయి.
ఉహు! ఎంత గుర్తు తెచ్చుకున్నా తన నేస్తం పోలికలుఏ మాత్రం కనబడలేదు. పాలిపోయి పలుచనైన చెక్కిళ్ళు , కోలగా అనిపించే మొహం. కాదు తన స్నేహితురాలు బొద్దుగా, బాపూబొమ్మలా ఉండేది.
అయిదు నిమిషాలయాక ఎటూ నిర్ధారించుకోలేక సంశయాత్మకంగానే గదిలో౦చి బయటకు నడిచి శ్రీకాంత్ తో పాటు టీ తాగి ఆఫీస్ కి బయలుదేరింది.

*****

ఎక్కడి నుంచో జారి మరెక్కడికో చేరుకున్నట్టు ఒక చిన్న జర్క్.
ఇంత తేలికగా ఉన్నానేమిటి? ఇదేమిటి ఇలా ఎటంటే అటే దూదిపింజెలా తేలిపోతున్నాను?
నిజమే!! ఏం జరిగిందో తెలిసే లోపలే ఇదిగో ఇక్కడ ఇలా కళ్లువిప్పాను. అటు వేపున ఎం వుందో కనుమరుగైపోయింది, ఇటువైపే….
మెత్తటి మబ్బుల మీద మేను వాల్చినట్టు ఎంత హాయిగా వుంది. ఎన్ని యుగాలుగానో అలసిపోయి చక్కటి నిద్రపోయి లేచినట్టుగా…. ఎంత సేద దీరేలా …
ఏదో మాట వరసకు కళ్ళు విప్పానని అన్నానే కాని నిజానికి ఇంకా కళ్ళు మూసుకునే ఉన్నాను . అలవోకగా మొగ్గలోంచి పూరెక్కలు విడివడినట్టు కనురెప్పలు కదిలించాను.
ఆశ్చర్యం! నిజంగానే తెల్ల మబ్బులా గదినిండా పరచుకున్న పరుపు చుట్టూ నేలబారుగా పెరిగిన ఆకు సంపెంగలు.
పరిమళ భరితంగా చల్లదనం.
ఎక్కడో ఎవరో ఎవరినో పిలుస్తున్న ఆలాపన. ముందు ఎవరు ఎవరిని పిలుస్తున్నారో అర్ధం కాలేదు. కాని ఏ మూలో ఆ పిలుపు నాకోసమే అన్న చిన్న అవగాహన. లేచి కూచు౦దామనుకున్నదే ఆలస్యం లేచి కూచుని ఉన్నాను.
ఆశ్చర్యం –ఇలా అనుకోడమేమిటి అలా జరిగిపోతూనే ఉన్నాయి.
బిగుతుగా జడ వేసుకోడమేమిటి?? చక్కగా ఒదులొదులుగా అటూ ఇటూ ము౦గురులు వాలేలా.. ఆలోచన రాడం తడవు జడవిడి వడి జుట్టు అచ్చు నా మనసులో ఎలా ఉన్నానో అలా మారిపోయింది. నాకు పూర్తిగా అర్ధమయిపోయింది.
ఇదివరకులా అన్ని పనులూ నేనే చేసుకోనవసరం లేదు. వాటంతట అవే జరిగిపోతాయని . ఒక్కసారి నా వంక నేను చూసుకున్నాను. చీర సరి చేసుకొందామని అనుకునే లోగానే మరో కొత్త ఆలోచన .
అసలు చిన్నప్పటినుండి ఎప్పుడూ ఇలా పరికిణీలూ, పావడాలు చీరలే తప్ప ఒక్క రోజూ పంజాబీ డ్రెస్ లో స్కర్ట్ లో వేసుకున్నదే లేదు. ఇక్కడెవరూ లేరు కదా , ఒకసారి వేసుకుని చూసుకుంటే …
నిజమే, ఎవరైనాఅనుకుంటారా ఇలా నన్ను చూస్తే నేను ముగ్గురు పిల్లల తల్లిని.
అద్దంలో నన్ను నేను తృప్తిగా చూసుకున్నాను. ఇంకా నా తనివి తీరనేలేదు.
ఎవరిదో పిలుపు .
“అందరూ ఇక్కడ నీకోసమే ఎదురు చూస్తున్నారు. ఇంకా ఆలస్యమెందుకు ?” ఇప్పుడు ఈ మారు చాలా స్పష్టంగా తెలిసింది. మాటలు శబ్దతరంగాలుగా మారి రావడంలేదు. అవి సూటిగా మనసులోకి నీటి ధారలానిశ్శబ్దంగా వచ్చేస్తున్నాయి.
ఎటు వెళ్ళాలి ఎక్కడినుంచి వెళ్ళాలి? ఎక్కడా తలుపనేది కనబడటం లేదే ?
ఇంకా పూర్వ వాసనలు, అలవాట్లూ పోనీ కారణంగా నేనెలా ఆలోచిస్తున్నానేమో …ఇక్కడ తలుపులూ లేవు గోడలూ లేవు .
ఒక సువిశాల వెలుగు సముద్రంలా కనుచూపుమేర అలుముకుపోయిన దృశ్యం అంతే.
లేచి వెళ్తున్నాననుకునే లోగానే వెన్నెల పోతపోసినట్టున్న గోడ ముందున్నాను.
“ ఇంకా నిల్చునే ఉన్నావా ?”
ఎవరో చెయ్యి పట్టుకుని నన్ను గోడ లోనుండే నడిపించుకు వెళ్ళారు.
“ఎవరు ఎవరది ? “
ప్రశ్న పెదవులు దాటి బయటకు రాలేదు.
“ ఓ నీకింకా కొత్త కదూ …ఇక్కడ నువ్వేమి చూడాలనుకుంటే అవే కనబడతాయి కాని మనం కోరుకోని వేవీ కళ్లబడవు. అందుకని ముందుగా నువ్వేం చూడాలని అనుకుంటున్నావో నీకు ముందు తెలవాలి. ఇలా అనుకో అలా చూసేస్తావు.
“ఇది మరో విచిత్రమా?”
నాకు బాగా తెలుసు ఈ మాటలు నేను పైకి అననేలేదు.
“ నీకు కొత్త కనక అలా అనిపిస్తుంది అలవాటు పడితే బాగానేఉంటు౦ది”
“ జాగ్రత్తగా ఉండాలి”
“ఉండలేరు. ఇక్కడ ప్రతిదీ పారదర్శకమే. జాగ్రత్త పడటాలు ఉండవు.” బిత్తరపోయాను.
అంటే నగ్నంగా అక్కడికి ఆపేసి మనసు మరెటో పోయేలోగా చెప్పింది
“నన్ను చూడాలని అనుకో “
అనుకోబోయే లోగానే,
“నీకు నన్ను చూడగానే మన అనుబంధం, గతం వర్తమానం అన్నీ గుర్తుకు వస్తాయి “
మరి ఆలస్యం చెయ్యకుండా నా చెయ్యిపట్టుకు నడిపిస్తున్న తనను చూడాలనుకున్నాను.
అంతే కాదు ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము ఎటు వైపు వెళ్తున్నాము ..ఇవన్నీ కూడా ……..
ఒకదానివెంట ఒకటి అనంతంగా వస్తూనే ఉన్నాయి.
నా పక్కన ఉన్నది ఇంతవరకూ ఎందుకలా అనుకున్నానో గాని ఆడమనిషని అనుకున్నాను. కాదు నా వయసు దరిదాపుల్లోని మనిషే …నున్నటిమొహం ఎక్కడా కాస్తైనా గడ్డం పెరగలేదు. కళ్ళల్లో ఒక విధమైన మెరుపు పెదవుల చివర కవ్వింపులా నవ్వు.
“నువ్వు నువ్వు అమర్ వి కదూ “

ఇంకా వుంది….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *