May 4, 2024

ఎంత మంచి వారో మా నాన్నగారు

రచన: నాగలక్ష్మి కర్రా

nagalakshmi karra

ఆడపిల్ల కావాలి , ఆడపిల్ల కావాలి అని తపించిపోయే మా నాన్నగారికి నలుగురు మొగపిల్లల తరువాత పుట్టిన దాన్నని ఎంతో ముద్దు . కాబట్టి సహజంగా ఎంతో గారాబం చేసేవారు నాన్నగారు . అలాగే అన్నయ్యలు కూడా .
నాకు జ్ఞానం వచ్చిన దగ్గరనుంచి నాన్నగారితో పాటే భోజనం, నాన్నగారి పక్కనే కూర్చోవడం . పక్క గదిలోకి వెళ్లినా పాపేది ? పాపేది ? అని వెతికేవారు . నాన్నగారు తొమ్మిదింటికి భోజనం చేసేవారు, ఎప్పుడైనా ఆ సమయానికి ఆకలిగా లేదు అంటే యిప్పుడు నాతో కొంచెం తినీ తరవాత కొంచం తిను అనేవారు . పండుగలు వస్తే గాజులు , రిబ్బన్లు ( యీ కాలం పిల్లలకి తెలీనివి ) బట్టలు అన్నీ రెండు జతలు తెచ్చేవారు. పొద్దున్న వొక సెట్టు , సాయంత్రం వొక సెట్టు వేసుకునేదాన్ని. చేతులకి గోరింట పెట్టుకోవాలి . కాళ్ళ పట్టీలు తియ్యనిచ్చేవారు కాదు . ఆడపిల్ల యింటికి అందం అనేవారు .
నాన్నగారు ఎప్పుడూ సరదాగా మాట్లాడేవారు . మోహంలో యెప్పుడూ చిరునవ్వు చెరగనిచ్చేవారు కాదు . అందుకే అతనికి ఎందరో స్నేహితులు వుండేవారు . అగ్గి బుగ్గి అయిపోతూ వచ్చినవాళ్లు కూడా నవ్వుకుంటూ వెళ్ళేవాళ్ళు . నాన్నగారు నాటకాలలో ఆడ పాత్రలు , మొగ పాత్రలు వేసేవారు. కాని నాన్నగారు నటిస్తూ వుండగా నేను ఎప్పుడూ చూడలేదు . నాకు పదేళ్ళు వచ్చేంతవరకు నాటకాలలో నటించారు . నాకు ఏడుగంటలకే నిద్ర పోవడం అలవాటు . యెంత ఆపుకుందామన్నా నిద్ర ఆగేదికాదు . అందుకే నాటకాలు చూడలేకపోయేదాన్ని. ఆయన బాగా నటించేరు అనేదానికి గుర్తుగా బోల్డన్ని కప్పులు వుండేవి యింట్లో, అవన్నీ నా ఆట బొమ్మలలో చేరిపోయేవి . అప్పట్లో వాటి విలువ తెలీదు . నాన్నగారు ఆగ్నేయ రైల్వే ఆధ్వైర్యంలో కొన్నాళ్లు ఒరిస్సాలో వున్న కటక్ లోను తరువాత ఖుర్దా రోడ్డు లోను నాటక పరిషత్తులు నిర్వహించేవారు .
నాన్నగారు రైల్వే ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ లో అక్కౌటెంట్ గా పని చేసేవారు . ఫస్ట్ క్లాస్ పాసులు ఏడాదికి మూడు ఇచ్చేవారు . అంటే యేడాదికి మూడు ప్రయాణాలు చెయ్యొచ్చు . అందులో తిరుపతి ప్రయాణం వొకటి తప్పకుండా వుండేది . జీతం ఎంతొచ్చేదో తెలీదు . పెత్తనమంతా అమ్మదే . మా నాన్నగారికి చేబదుళ్లిచ్చే అలవాటు వుండేది . యిచ్చిన డబ్బు అడగకూడదు అనే నియమం వుండేది . యీ నియమానికి మా అమ్మ నక్షత్రకురాలిగా ( నక్షత్రకుడు కి స్త్రీలింగం ) అడ్డుపడి నాన్నగారి జీతం రక్షించేది .
నిజం చెప్పడానికి భయపడకూడదు , మనం తప్పు చెయ్యనప్పుడు యెవ్వరికీ భయపడనవసరం లేదు . తప్పు పని యెప్పుడూ చెయ్యొద్దు అని చెప్పేవారు .
అందుకే తప్పు ఎవరు చేసినా నిలదియ్యడం , నా తప్పు లేకుండా ఎవరైనా చిన్న మాట అన్నా పడక పోవడం చిన్నప్పుడే అలవాటయ్యింది . నాలోని యీ గుణం తలబిరుసు, పెద్దవాళ్ళని గౌరవించని మనిషిగా ముద్ర వేసేయి . అయినా నాకు మా నాన్నగారు చెప్పినదే వేదం .
ఖుర్దా రోడ్డులో మేము కొత్తగా కట్టిన కాలనీకి మారినప్పుడు నేను 2వతరగతి పాసయి మూడులోకి వచ్చాను . నాలాంటి పిల్లలు వో ముపై మందికి స్కూలుకి వెళ్ళడం సమస్యగా మారింది. యెందుకంటే స్కూలుకి 2కిమి నడవాలి . వోకటో క్లాసు చదవవలసిన పిల్లలకి యింకా కష్ఠం . ఒరియా పిల్లలు కూడా వో నలభైమంది దాకా వుండేవారు. యింత మంది పిల్లలు చదువు లేకుండా గాలి పట్టి పోవాలా ? పిల్లల భవిష్యత్తు ఏమిటి ? మా వూర్లో తెలుగు వాళ్ళ ఇళ్ళల్లో జరిగే మంచి చెడు కార్యాలకి పురోహితుడు లేదు . అప్పుడు మా నాన్నగారు కొందరు స్నేహితులతో కలసి యింటికి వొక రూపాయి చొప్పున కలెక్ట్ చేసి తెలుగు చెప్పే టీచర్ని , వొక పురోహితుడిని ఏర్పాటు చేసి , పై అధికారులతో మాట్లాడి స్కూలుకి వొక నాలుగు యిళ్ళు తీసుకోని , గ్రాంటు వచ్చేంత వరకు టీచరు జీతాలు కలెక్ట్ చేసిన డబ్బులలోంచి ఇచ్చేవారు . మొదలు పెట్టినప్పుడు 1 , 2 , 3 , తరగతులు నడిచేవి తరవాత 5వ తరగతి వరకు దాని తరువాత 10 వ క్లాస్ వరకు పెరిగి ఇప్పుడు యెందరో పిల్లలు చదువుకుంటున్నారు .
కుట్లు అల్లికలు , ఆటలుపాటలతో , పెంకితనంతో అంటే యిష్ఠమైన సబ్జెక్ట్స్ మాత్రమే చదవడం , అది యిష్ఠ మైనంత సేపే చదవడం అలా సాగింది . 1969 లో మా ఊర్లో సైకులు తొక్కడం నేర్చుకున్న మొదటి ఆడపిల్లని నేనే . నాగలక్ష్మిని మొగపిల్లడిలా పెంచుతున్నారు అనేవారు ఊర్లో వారు .
1972 లో నా పదమూడవ యేట పెళ్లి నిశ్చయించారు . ఎందుకు యింత తొందరగా పెళ్లి చేస్తున్నారు అని గాని , నేను పెళ్లి చేసుకోను అని అనాలని గాని తెలీని వయస్సు . నాన్నగారు మాత్రం తనకి తానూ చెప్పుకుంటున్నట్టుగా అన్న కొన్ని మాటలు యివాళ కూడా నాకు జ్ఞాపకం వున్నాయి . అందరికి చదువు అయేక పెళ్లి అవుతుంది , నువ్వు స్పెషల్ కాబట్టి నీకు ముందు పెళ్లి తరవాత చదువు అంటే నిజంగా అంతే అనుకున్నా ! మెట్రిక్యులేషన్ తో చదువు ఆగిపోతే, చదువుకి వయసుతో సంబంధం లేదమ్మా. వీలున్నప్పుడు చదువుకోవచ్చు అని, మా పెద్దబ్బాయి 1975 లో పుడితే వీడు నీ ఇంటర్ సర్టిఫికెట్టు అని , చిన్నవాడు 1978 లో పుడితే వీడు నీ డిగ్రి అని అన్నారు . జీవితంలో కొన్ని ముందు , కొన్ని వెనుక జరుగుతాయి . ఇది ఎందుకు యిలా జరిగింది ,అలా ఎందుకు జరగలేదు అని విచారించకు , యిలాగే జరగాలని పట్టుపట్టకు , జరిగే వాటికి అనుగుణంగా నిన్ను నువ్వు తీర్చిదిద్దుకో అదే జీవితం . నేర్చుకోడం అనేది ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా ఫరవాలేదు , నేర్చుకోనేది మంచి అయితే చాలు అనేవారు . ఎప్పుడు చిరునవ్వుని , వినయాన్ని మరచిపోకు అనేవారు . మరో ముఖ్య మైనది ఏం చెప్పేవారంటే అన్నయ్యలు పెట్టినవి (పసుపుకుంకంతో పాటు పెట్టేవి ) నచ్చలేదు అనడం గాని , యింతేనా పెట్టేరు అనడం గాని చెయ్యొద్దు అని .
నాన్నగారు స్నేహం గురించి వో విషయం చెప్పేవారు. స్నేహితులు నొప్పించె మాటలు అంటే ఎందుకన్నారో ఏమిటో, పొరపాటో అని క్షమించేయ్యాలట. వాళ్ల ప్రవర్తన అలాగే కొనసాగుతూ వుంటే అక్కడతో స్నేహం కట్ చెయ్యాలి అనేవారు, మనం మాత్రం ఎవరిని తెలిసి నొప్పించకూడదు , తెలియక నొప్పిస్తే క్షమించమని అడగడానికి వెనుకాడకూడదు .
యింటి ముందు ముగ్గులేదేంటి అనేవారు. ముగ్గు వేసేటప్పుడు వర్షం పడుతుంటే గొడుగు పట్టుకు నిలబడే వారు, చీకటి పడిపోతే నేను సాయం నిలబడతా నువ్వు ముగ్గు వెయ్యి అనేవారు . యింటి ముందు ముగ్గు చెరగకూడదు , ఇల్లాలి మొహంలో నవ్వు చెదరకూడదు అనేవారు .
ఎప్పుడూ చిరునవ్వు చేరిగేది కాదు, బట్టలు నలిగేవి కావు . అందుకే మావుర్లో మా నాన్నగారిని దసరా బుల్లోడు అనేవారు .
మా నాన్నగారి ఆరోగ్యం పాడయిన విషయం నేను బెంగ పడతానని నాకు చెప్పనివ్వలేదు. 1979 లో మా మావగారు మీ నాన్నగారి పరిస్తితి బాగులేదు అంటే అర్ధం కాలేదు. కాని ఏదో భయం, అందుకే పిల్లలని తీసుకోని నాన్నగారిని చూడడానికి వెళ్ళేను . అప్పటికే ఆయన ఆరోగ్యం చాలా పాడైపోయింది. రోజులలోకి వచ్చింది ఆయుష్షు . నాకు చిన్నప్పుడే పెళ్లిచేసినందుకు అపరాధ భావం అతనిలో వుండిపోయిందేమో. పదే పదే పిల్లలు స్కూలికి వెళ్ళడం మొదలు పెట్టేకా చదువుకో అనేవారు . 1979 మే 1 న పోయేరు. మా నాన్నగారు పోవడం ఏమిటి అనే భావం నాలో ఉండిపోయింది .
మానాన్నగారు నాతో చెప్పిన వాటిని తుచ తప్పకుండా పాటించాలని అతను చెప్తున్నప్పుడే శపథం తీసుకున్నాను . నా పిల్లలని చాలా ముద్దుగా చూసుకునేవారు. పోస్టు గ్రాడ్యుయేట్ ని అయాను , అలా అలా ఏవేవో కోర్సులు చేసాను. జీవితంలో ఎన్నో ఎన్నెన్నో నేర్చుకున్నా అన్నీ నాన్నగారికోసమే . మా నాన్నగారి పోలికలు నా మనుమలలో కనిపిస్తే మురిసిపోవడం నాకో సరదా .
నాకు, మా రెండో అన్నయ్యకి మా ఇళ్ళల్లో జరగబోయే శుభకార్యాలు మా నాన్నగారు కలలో చెప్పడం వో అనుభూతి , అవి వెంటనే నిజమవడం నమ్మలేని నిజం .
యిప్పటికి మా నాన్నగారిని తెలిసిన చుట్టాలు ఫ్రెండ్స్ నాన్నగారిని పొగుడుతూ వుంటే మా నాన్నగారు యెందరి హృదయాలలొ స్థానం సంపాదించుకున్నారో కదా అని అనిపిస్తూ వుంటుంది .
చిన్న వయసులోనే మమ్మల్ని భౌతికంగా విడిచి పోయినా వారి ఆత్మ యెప్పుడూ మాతోనే వుండి మా ప్రతి అడుగుని మంచి వైపు వేయిస్తూ మాతోనే వుంటారు మా మంచి నాన్నగారు .

4 thoughts on “ఎంత మంచి వారో మా నాన్నగారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *