April 30, 2024

చిగురాకు రెపరెపలు: 6

రచన: మన్నెం శారద

ఇప్పుడు కాస్త మా నాన్న గారి గురించి చెప్పాలి.
ఆయన పేరు సీతారామయ్య. నిజంగా రాముడే అనేవారంతా. గుంటూరు హిందూ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేసారట! మంచి ఇంగ్లీషు మాట్లాడేవారు. బ్రిటిష్ లెక్చరర్స్ దగ్గర చదివేరట. చాలా నిరాడంబరం జీవి. ఆయన పరుషంగా మాట్లాడటం మేం వినలేదు.
వ్యవసాయ కుటుంబం నుండి వచ్చేరు. మా తాతగారు చిన్నప్పుడే చనిపోతే మా నాన్మమ్మే చదివించింది.
నాకు నాన్న దగ్గర చనువెక్కువ. అసలు భయం లేదు. నాకయిదారు సంవత్సరాల వయసు వచ్చేవరకు నాన్న దగ్గరే పడుకునే దాన్ని. నేను పెద్దయ్య్యేక ఏం చేస్తానో చెబుతుంటే నవ్వుతూ వినేవారు.
మా అమ్మ “ఇక నోర్మూసుకొని పడుకో!” అని అరిచేది. ఆయన పోస్టల్ ఎండ్ టెలిగ్రాఫ్ డిపార్టుమెంటులో యూనియన్ సెక్రటరిగా చేసేవారు. ఎప్పుడూ ఢిల్లీ వెళ్ళి వస్తుండేవారు. అంతే కాదు.. ఆయన ఏ వూరిలో జాబ్ చేసినా ఆయనే ఆఫీసర్ల క్లబ్ సెక్రటరి. మంచి బాడ్మింటన్ ప్లేయర్. మా ఇంట్లో ఆయన కొచ్చిన కప్పులు, మెమెంటోలు చాలా వుండేవి. సాయింత్రం ఆయన క్లబ్బులో చాలామంది పిల్లలకి ఇంగ్లీషు గ్రామర్, బాడ్మింటన్ నేర్పేవారు. ఇక రాత్రి మాకు చదువు చెప్పడం.
ఒంగోలు అనుభవాలు అంత గుర్తులేవు కాని… మేము గెద్దల గుంటకి ట్యూషన్ కి వెళ్ళేవాళ్ళం. మాకు త్రిలోచన, చక్రపాణి అని భార్యాభర్తలు (టీచర్స్) ట్యూషన్ చెప్పేవారు. తరచూ భూకంపం వచ్చి గిన్నెలు పడిపోతుంటే, రోళ్ళు కదులుతుంటే గమ్మత్తుగా వుండేది.
నేను, హేమక్క ఇంటికి రావడానికి చంద్రుడితో పాటూ పరిగెత్తే వాళ్ళం. చంద్రుడు కూడా పరిగెత్తేవాడు. ఆగితే ఆగిపోయే వాడు. నెమ్మదిగా నడిస్తే నెమ్మదిగా నడిచేవాడు.
“చూశావా చంద్రుడు నేనెలా చెబితే అలా వింటున్నాడు అనేదాన్ని!” మా అక్క నిజమేనా అన్నట్లు చూసేది.
వెళ్ళి మా అమ్మ కి చెప్పేది.
“ఏడ్చింది. నీకు బుర్ర లేదు. అది చెబితే చంద్రుడు వినడమేంటే? ఎవరు అలా చేసినా అలానే కనిపిస్తుంది” అనేది.
మా అక్క గుర్రుగా చూసేది.
మా ఇంటి పక్కన ప్రముఖ నటీమణి భానుమతిగారి ఇల్లు వుండేది. భానుమతి అప్పటికే చాల పెద్ద నటీమణి.
వాళ్ళ కుటుంబం మా అమ్మగారితో స్నేహంగా వుండేవారట. నాకేమీ గుర్తులేదు కాని భానుమతి చెల్లెలొకామె నన్ను ఉప్పుమూట అని వీపు మీద ఎత్తుకు తిప్పేది. అది గుర్తుంది.
ఇంతలో మాకు తమ్ముడు పుట్టాడు. మళ్ళీ మేం కాకినాడ చలో!
నల్గురి ఆడపిల్లల తర్వాత తమ్ముడు!
చాలా హడావుడి చేసేరు! ఇంతలో మా అమ్మమ్మ నన్ను తీసుకుని మా మామయ్య (సూర్యప్రకాశరావు) వున్న వూరు వెళ్ళింది. ఆ వూరి పేరు వెల్దుర్తి. అక్కడ మామయ్య సర్కిల్ ఇన్స్పెక్టర్. ఆ మామయ్యకి నేనంటే చాలా ఇష్టం. నన్ను తీసుకుని రమ్మని అమ్మమ్మకి చెప్పేడు. ఎలాగూ స్కూలు చదువులు లేవుగా.
కర్నూలు జిల్లాలో వుందా వూరు!
అన్నీ నాపరాళ్ళ ఇళ్ళే!
ఊరి చివర వాగు!
మామయ్య నాకు ట్యూషన్ పెట్టించేడు.
రోజూ ఒక కానిస్టేబుల్ హరికేన్ లాంతరు పట్టుకొని నన్ను ట్యూషన్ నుండి తిరిగి తీసుకొచ్చేవాడు. వచ్చేటప్పుడు, మిఠాయి షాపు దగ్గర ఆపి ఏదో ఒకటి ఇప్పించేవాడు (బేవార్స్ అని అప్పుడు నాకు తెలియదు). శుబ్బరంగా తింటూ ఇంటికి వచ్చేదాన్ని.
ఎదురుగా ఒక రెడ్డిగారి ఇల్లువుండేది. వాళ్ళ ఇల్లు చాలా ఎత్తుమీద వుండేది. ఒక పెట్రోమాక్స్ లైట్ అరుగుల మీద పెట్టేవారు. రాత్రి పదివరకు అక్కడే ఆట! రెడ్డిగారి భార్య జొన్నరొట్టె, వంకాయ కూర పెట్టేది. చాల బాగుండేది. అది తిన్నానని మా అమ్మమ్మ ఒకటే గోల! జొన్నలు తింటావా అని తిట్టేది.
“ఏం బాగుంది కదా?” అనేదాన్ని.
అప్పట్లో గోదావరి జిల్లా వాళ్ళకి వరి తప్ప అన్నీ తప్పే!
రెడ్డిగారి భార్య నా కోసం ఇంటిక్కూడ పంపించేది. మా అమ్మమ్మ వాటిని పనిమనిషి కివ్వాలని పై అరలో పెట్టేది.
ఒకసారి వాటిని అందుకోవాలని బిందె తిరగేసి వేసి ఎక్కిపడ్డాను.
మళ్ళీ హాస్పిటల్ గొడవ!
“మా మామయ్య అమ్మమ్మ ని తిట్టేడు. దానికిష్టమైతే తిననివ్వు నీకేంటి బాధ!” అని.
మా అమ్మమ్మ సణుగుతూనే వుండేది.
నాకు వరలక్ష్మి అనే అమ్మాయి స్నేహం అయ్యింది. ఆమెకు నాకన్నా అయిదారేళ్ళ వయసు ఎక్కువ వుంటుంది. అప్పటికే ఓణీలేసేది.
ఇద్దరం వూరి చివర వాగుకి నీళ్ళకెళ్ళేవాళ్ళం. తను బిందె తీసుకొచ్చేది.
వాగు పక్కన చెలమలు తీసి చిన్న గ్లాసుతో నీళ్ళు తీసి బిందెలో పోసేది.
అప్పుడు నాకు బోల్డు దయ్యాల కధలు చెప్పేది. ఒకసారి అక్కడ ఒక పుర్రె కనిపించింది.
ఇద్దరం భయంతో పరిగెత్తుకొచ్చేం.
అయినా దయ్యాల్ని చూడాలని మహాసరదాగా వుండేది. రాత్రులు కలవరిస్తుంటే అమ్మమ్మ తిడుతూ విబూది పెట్టేది. మా అత్త మాత్రం చోద్యం చూస్తూ నిలబడేది. పెద్ద జడ చాల అందంగా వుండేది. ఎప్పుడు ఎంబ్రాయిడరీ చేస్తుండేది.
నన్నేమీ అనేది కాదు. నా అల్లరికి ఎప్పుడన్నా అయ్యో మాయదారి పిల్ల! మీ మావయ్య రానీ చెబుతా!” అనేది.
కాని ఏమీ చెప్పేది కాదు.
ఒకసారి మహానంది తిరునాళ్ళకనుకుంటాను. మావయ్యని బందోబస్తు కేసారు. అంతా కర్నూలు వెళ్ళి గెస్ట్ హౌస్ లో దిగాం.
గెస్ట్ హౌస్ చుట్టూ చాల పెద్ద ఖాళీ స్థలం వుంది. అక్కడక్కడా పెద్ద చెట్లు!
మాకు వూళ్లో తిరగడానికి ఒక జట్కాబండి పెట్టేరు.
మా అత్తయ్య మార్నింగ్ షో కంటే రాత్రి సెకండ్ షోకి తయారయ్యే టైపు.
జడ దువ్వి దువ్వి నున్నగా వేసి మళ్ళీ విప్పి మళ్ళా వేసుకునేది. చీర కుచ్చేళ్ళు తీర్చి తీర్చి తెట్టుకుని మళ్ళీ గబుక్కున లాగేసి మళ్ళీ పెట్టేది.
అప్పుడు సినిమా అంటే పిచ్చి సరదాతో ‘అత్తా, బాగుందత్తా జడ! రా!” అని బ్రతిమలాడేదాన్ని.
అత్తయ్య దేనికయినా జవాబిచ్చేది కాదు.
నిర్వికారంగా చూసి మళ్ళీ అదే పని చేసేది.
చివరికి సినిమా ప్రోగ్రాం కాన్సిల్!
మామయ్య తిట్టుకుంటూ వెళ్ళి పడుకునే వాడు! అందుకని జట్కా అలా ఖాళీ గా పడుంది.
జట్కా బండతను బయట గేటు దగ్గర కూర్చుని బీడీ తాగుతున్నాడు.
కానిస్టేబుల్ మా మామయ్య కొడుకుని ఆడిస్తున్నాడు.
అదే అదనుగా నేను జట్కా ఎక్కి కళ్ళేలు లాగేను!
ఇక చూడండి, గుర్రం దానిష్టమొచ్చినట్లు పరుగు లంగించుకుంది. ఇక్కడ అక్కడా అని చూడకుండా గెస్ట్ హౌస్ చుటూ దౌడు! చెట్లమీద నుండి, రాళ్ళమీద నుండి!
నాకూ భయం వేసింది.
ఆపాలన్న ప్రయత్నంలో కళ్ళెం గట్టిగా లాగుతున్నాను. కళ్ళెం లాగే కొలదీ గుర్రం స్పీడు పెంచుతోంది.
బండి వెనుక కానిస్టేబుల్, బండతను పరిగెత్తుతున్నారు. ఈ గొడవకి అత్త, అమ్మమ్మ వరండాలో వచ్చి నిలబడ్డారు.
“అయ్యో, బండి బోల్తా పడుతుందేమో, ఆపండి!” అంటూ అరుస్తోంది అమ్మమ్మ.
“ఎక్కడమ్మా, అమ్మాయి కళ్ళెం లాగేస్తున్నది. గుర్రం దౌడు తీస్తున్నది” అంటున్నాడు బండివాడు.
బండి ఎగుడు దిగుడుల మీద ఇంచుమించు పడిపోతున్నట్లే వెళ్తోంది. ఒక చక్రం పేకి లేచి.
సరిగ్గా అప్పుడే నా అదృష్తం బాగుంది గుర్రం ఒక జామ చెట్టు క్రిందుగా వెళ్ళింది. దాని కొమ్మ ఒకటి వాలుగా కొంచెం క్రిందుగా పెరిగింది.
గుర్రం దాని క్రిందుగా వెళ్ళింది గాని జట్కా బండిని కొమ్మ అడ్డుకుంది. దాంతో బండి ఆగిపోయింది. అదే అదనుగా బండి వాడు వచ్చి నా చేతిలోంచి కళ్ళెం లాకున్నాడు.
కాన్స్టేబుల్ వచ్చి నన్ను ఎత్తుకుని దింపేడు.
“హమ్మయ్యా” అనుకున్నారంతా.
నేను కూడ నిజానికి వణికి పోయాను భయంతో.
మా అమ్మమ్మ అక్కడే వున్న ఒకే చెట్టు కొమ్మ విరిచి నన్ను తన్నడానికి సిద్ధంగా నిలబడింది.
‘నీ రౌడి పనులకి ఏమన్నా అయితే మీ అమ్మకేం కవాబు చెప్పాలే!’ అని కోపంగా.
“వద్దులెండత్తయ్యగారూ! కొట్టకండి. అయినా ఏంటి శారదా, నువ్వు. ఇంతల్లరా!” అంది మా అత్త కొద్దిగా కోపం తెచ్చుకొని.
అలా మహానంది తీర్ధం కధ ముగిసింది.
వెల్దుర్తి ఫాక్సనిస్టుల వూరట.
ఫాక్సనిజం అంటే అప్పుడేం తెలుసు?
మావయ్య ఎప్పుడూ తలగడ క్రింద ఒక రివాల్వర్ పెత్తుకొని పడుకునేవారు. మావయ్య లేనప్పుడు నేను గదిలో కెళ్ళి దాన్ని పట్టుకుని చూసేదాన్ని. చాలా బరువుండేది.
‘ఎలా కాలుస్తారు దీన్ని అని పరిశీలించి మళ్ళీ మావయ్య వచ్చేసరికి తలగడ కింద పెట్టేసేదాన్ని.
రాత్రిపూట ఒకతను బాగా తాగి, మా ఇంటి ముందునుండి మామయ్యని తిడుతూ వెళుతుండేవాడు.
“ఒరేయ్, నన్నే అరెస్టు చేస్తావురా? నీ అంతు చూస్తాను. నువ్వీ వూరునుండి ప్రాణాలతో ఎలా వెళ్తావో చూస్తాను” అని.
“నేను అమ్మమ్మ పక్కలో వణుకుతూ పడుకునేదాన్ని. గట్టిగా అమ్మమ్మని పట్టుకుని ఏడ్చేదాన్ని.
“ఎవరో రౌడీ వెధవలే. మీ మావయ్య వాణ్ణి అరెస్టు చేశాడని కోపం! పడుకో” అనేది నా మీద చేతులేసి పట్టుకుని.
మావయ్య ఎవరొచ్చినా తలుపులు తీయొద్దని, ఎవర్నీరానివ్వద్దని మమ్మల్ని హెచ్చరించి ఇద్దరు కానిస్టేబుల్స్ ఇంటికి కాపలా పెట్టి డ్యూటీకి వెళ్ళేవాడు.
నన్ను ట్యూషన్ కూడ మానిపించేడు.
మమ్మల్నందరినీ ఊరు పంపించేయాలని నిర్ణయించేడు కూడా.
ఈ లోపునే ఒక తప్పు చేశాను నేను.
నా దృష్టి చాల రోజులుగా మావయ్య తలగడ క్రింద వున్న రివాల్వర్ మీదనే వుంది.
ఒకరోజు మావయ్య దాన్ని మరచి పోయి వెళ్ళాడు.
అదే అదనుగా నేను అత్తయ్య లేకుండా చూసి దాన్ని తీసి పరిశీలించడం మొదలెట్టేను.
ట్రిగ్గర్ మీదకి పదే పదే వేలు వెళ్తోంది.
ఒక పక్క భయం, మరో పక్క ఒక్కసారి నొక్కితేనో… అనే సరదా!
మనసు భయాన్ని జయిస్తోంది.
పేల్తుంది. అంతేకదా! ఈ గోడ మూలకి కాలిస్తే సరి!.. అసలు కాల్తుందా?
కళ్ళు మూసుకొని మెల్లిగా రెండు చేతుల్తో పట్టుకుని ట్రిగ్గర్ మీద వేలుంచాను.
అప్పుడే సరిగ్గా నా చేతి మీద బలంగా దెబ్బ పడింది. దెబ్బకి రివాల్వర్ వదిలేసి మంచమ్మీద పడ్డాను.
ఎదురుగా మావయ్య!
రివాల్వర్ కోసమే వచ్చాడట తిరిగి.
నేను మంచమ్మీద పడి గజ గజా వణుకుతున్నాను.
“ఎంత పనంటే అంత పని చేస్తావా? చంపేస్తాను”
మావయ్య అరుపుకి అమ్మమ్మ, అత్త, కానిస్టేబుల్స్- అంతా పరిగెత్తుకొచ్చేరు.
“దీన్ని ఒక కంట కనిపెట్టండి. ఇదేం చేస్తుందో దీనికే తెలియడం లేదు. అన్నం పెట్టకండి” అన్నాడు కోపంగా.
“జాగ్రత్త! లాకప్ లో వేసేస్తా. పిచ్చి పిచ్చి వేషాలేసేవంటే” అని రివాల్వర్ తీసుకుని జీప్ లో వెళ్ళిపోయాడు.
నేను వెక్కెక్కి ఏడుస్తూనే వున్నాను. మావయ్యని అంత కోపంగా ఎన్నడూ చూడలేదు నేను.
చాలా సౌమ్యుడు. నేనంటే చాలా ఇష్టం. ఇలా తిట్టేసాడేంటి? చిన్నప్పటినుండీ నాకు ఆత్మాభిమానం ఎక్కువ. జీవితంలో వచ్చిన కష్టాలకన్నా ఎవరన్నా మాటంటే నేను ఏడుపు ఇప్పటికీ ఆపుకోలేను. కాని చాలా త్వరగా మరచిపోవడం కూడా ఎక్కువే!
అందుకే ఎన్నడూ తిట్టని మావయ్య తిట్టేసరికి… చెప్పలేని ఏడుపొచ్చింది.
“తప్పు చేసి ఆ ఏడుపు దేనికి? అదెవరికన్నా తగిలుంటే… మీ మావయ్య ఉద్యోగం పోయేది! నువ్వెళ్ళి జైలువూచలు లెక్కెట్టే దానివి రా! అన్నం తిందువు గాని!” అంది అమ్మమ్మ కోపంగా.
నా ఏడుపు అమ్మమ్మ మీద కోపంగా మారింది.
అమ్మమ్మ తెచ్చిన కంచం తోసేసి ” నేను అమ్మ దగ్గర కెళ్ళి పోతాను” అన్నాను.
“అవును. ఇప్పుడు మీ అమ్మగాని వుంటే నీ తోలు తీసుండేది. మీ అమ్మ తన్నులు లేకే నున్న పడ్డావ్..” అంది అమ్మమ్మ.
అత్తయ్య మెల్లిగా వచ్చి నా పక్కన కూర్చుంది.
నా వీపు మీద చెయ్యేసి “ఊరుకో ఏడవకు! మీ మావయ్యకి నువ్వంటే ఇష్టమే. అది పేలిందంటే కొంపలంటుకునేది. అలాంటి వస్తువులు ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు మరి. నీకేం తెలుసు మరి! రా, అన్నం తిను. అందరం వెళ్ళిపోదాం. వాడు మనల్నందరినీ చంపుతానని తిరుగుతున్నాడట. అరెస్టు చేస్తారు లే” అని బ్రతిమాలింది.
అయినా నా ఏడుపు ఆగలేదు. ఎవరు బ్రతిమాలినా అన్నం తినలేదు.
రాత్రి మావయ్య ఇంటికొచ్చేసరికి మంచం క్రింద దాక్కున్నాను. ఒకటే వణుకు. కొడ్తాడేమోనని.
అత్తయ్యేం చెప్పిందో “శారదా శారదా… అంటూ ఇల్లంతా తిరిగేడు”.
ఆ తర్వాత మంచం క్రింద నన్ను గమనించి కొందకి వంగి “బయటికి రావే! నేనేమనను” అన్నాడు అనునయం గా.
వణికిపోతూనే వచ్చాను బయటికి.
మావయ్య నన్ను ఎత్తుకుని వళ్ళో కూర్చోబెట్టుకున్నాడు.
“రివాల్వర్ అక్కడ పెట్టడం నా తప్పేలే! కాని అలాంటి వస్తువులు ముట్టుకోకూడదే. చాల డేంజర్. నువ్వెంత అల్లరి చేసినా… కొన్నిటి దగ్గర జాగ్రత్తగుండాలి. నీళ్ళంటే కూడ ఎక్కువ వెళ్ళిపోతున్నావ్. దిగుడు బావుల్లో దిగుతున్నావంట. చచ్చిపోతావే… అమ్మ మాట విను. సరేనా?” అన్నాడు ప్రేమగా.
నేను తల దించుకుని బుద్ధిగా తలూపేను.
‘ఇదిగో, ఇవి తీసుకో’ అని బోల్డంత చిల్లర పోసేడు మంచమ్మీద.
“మీ అమ్మ కివ్వకు. నువ్వే ఫ్రాకులు కొనుక్కో” అన్నాడు. అవి చూసి నా కళ్ళు మెరిసాయ్.
“ఎన్ని డబ్బులో? చాల ఐస్ ఫ్రూట్స్ వస్తాయి. జీళ్ళొస్తాయి, గాలి పటాలు కొనుక్కోవచ్చు” అనుకున్నాను సంతోషంగా.
ఒక జేబు రుమాలు తెచ్చి మూట కట్టుకున్నాను.
“ఇలా తే నే దాస్తాను” అంది అమ్మమ్మ.
“ఏవక్కర్లేదు. నువ్వు అమ్మ కిచ్చేస్తావ్” అన్నాను.
“ముందు రా అన్నం తిందువు గాని” అని మావయ్య చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి అన్నం తినిపించేడు.
ఆ మర్నాడే పోలీస్ ఎస్కార్ట్ తో మమ్మల్ని రైలెక్కించి ఊరు పంపేడు మావయ్య.
అమ్మమ్మ రైలు కదిలే ముందు చాలా ఏడ్చింది. ” ఇలాంటి వెధవ ఉద్యోగం వద్దురా. మనకున్నది చాలు. ఆ వెధవ పగలూ రాత్రీ చంపుతానని తిరుగుతున్నాడు” అని.
“ఫర్వాలేదు. ఇలాంటి బెదిరింపులకి ఝడిస్తే జాబ్ చెయ్యలేం. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. చిన్నక్కకి దీన్ని వూరికే కొట్టొద్దని చెప్పు” అన్నాడు మావయ్య.
రైలు కదిలింది. నాక్కూడా ఏడుపొచ్చింది. ఆ రౌడీ మావయ్యని చంపేస్తాడా? అని ఎన్నోరోజులు నేను నిద్రపోయేదాన్ని కాదు.
చాలా రోజులకి అమ్మని చూసిన అన్నందంతో మావయ్యిచ్చిన డబ్బులన్నీ అమ్మకిచ్చేసేను నేనే!
అమ్మకి మాత్రం అదే కోపం. అదే స్వభావం. ఇంత డబ్బులిచ్చేసినా… ఇన్నాళ్ళకొచ్చినా దగ్గరకి తీసుకుని ముద్దుపెట్టుకోదే?
నాలో చెప్పలేని నిరాశ.
వారం రోజుల తర్వాత మావయ్య వచ్చేడు వీపు మీద పెద్ద బాండేజ్ తో.
ఆ రౌడీని అరెస్టు చేసేరట.
వాడి తాలూకు వాళ్ళు మావయ్య మీద కొడవళ్ళతో దాడి చేసేరట. అదృష్టం కొద్దీ ఆ కొడవలి వీపు మీద పడిందిట. మావయ్య కాల్పులు జరిపేటప్పటికి పారిపోయేరట. మావయ్యని ఆ ఊరిలో కొందరు జీప్ లోంచి తీసుకెళ్ళి జట్కా బండి గడ్డిలో దాచి ఊరు తరలించేరని… ఏదేదో చెప్పుకున్నారు.
అందరూ మావయ్యను చూసి గొల్లుమన్నారు.
మావయ్య బతికొచ్చినందుకు అందరూ చాలా సంతోషించేరు. మావయ్య రెండు నెలలు ఇంట్లోనే వుండి పోయాడు.
అప్పుడే తెలిసింది మావయ్య మంచి సింగరని.
ఎప్పుడూ హిందీ పాటలు రేడియో గ్రాం లో వింటూ పాడుతుండేవాడు. అతను కాకినాడలో వున్న యంగ్మెన్స్ హెవీ క్లబ్బు మెంబరని తర్వాత తెలిసింది. బాంబే లో ప్లే బాక్ పాడే అవకాశం వస్తే మా తాత గారు పడనివ్వలేదని.
నేను ఆ శెలవుల్లో మావయ్యకి దగ్గరగా సేవ చేస్తూ చనవుగా తిరిగేను.
అదే మావయ్య రిటైరయ్యాక నా కధలు పత్రికల్లో చదువుతూ “ఇంత అల్లరి చేసే దీనిలో ఇన్నిన్ని భావాలున్నాయా?, ఎంత బాగా రాస్తుంది?” అని ఎంతో సంతోషపడేవాడని అత్తయ్య, మావయ్య పిల్లలు మావయ్య చనిపోయినప్పుడు వెళ్తే చెబుతుంటే విని నా కళ్ళు చెమర్చేయి. ఇప్పుడు కూడ!

2 thoughts on “చిగురాకు రెపరెపలు: 6

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *