May 4, 2024

మాయానగరం – 16

రచన: భువనచంద్ర రాజు

“ఆనంద్ గారు… యీ మనుషుల్ని చూస్తుంటే ఓ పక్క జాలి మరో పక్క బాధ కలుగుతోంది. కల్తీ కల్లుతో చచ్చిపోయారని తెలిసినా, అంత్యక్రియలు చేయించినందుకు ఆ కల్లు దుకాణం ఓనర్ని దేవుడంటున్నారు. ఓ పక్క ఉన్నవాడు అంతస్థుల మీద అంతస్థులు కడుతుంటే, మరో పక్క లేనివాడు తిండికీ గుడ్డకి మొహం వాచిపోతున్నాదు. రిజర్వేషన్లు అంటున్నారు, నిజమైన అర్హత కలవాడికి ఆ రిజర్వేషన్లు దక్కుతాయా? ‘సుపరిపాలన ‘ అంటున్నారు, లంచం లేకుండా ఒక పనైనా జరుగుతోందా? తత్కాల్ పేరుతో రైల్వేల దోపిడి, సర్వీస్ చార్జీల పేరుతో దోపిడీ చేయని పార్లమెంటు ఏది? ఎక్కడబడితే అక్కడ రౌడీలు, గూండాలు హంతకులు రాజ్యం చేస్తుంటే చదువుకున్న మేధావులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటున్నారు.
ఓ ఎం.ఎల్.ఏ. గెలవాలంటే కోట్లకు కోట్లు ఖర్చు చేయాలి. గెలిచాక దానికి పదింతలు సంపాదిస్తాడుగా. రాజకీయాలలోనూ వారసత్వము. ఓ నాయకుడు చచ్చిపోతే ఆయన పెళ్ళాన్ని వంటింటి నుంచైనా అసెంబ్లీ కో, లోక్ సభకో లాక్కొస్తారు. పెళ్ళాం కాకపోతే కొడుకుని. ఈ పరిస్థితిలో గూండాలు, ప్రజల్ని ‘ కొన ‘ గల పారిశ్రామికవేత్తల తొత్తులు తప్ప ఎవరూ ఎలక్షన్లలో పోటీ చేసి గెలవగలరు? దీని కోసమేనా మన తాతలు ‘స్వరాజ్యం ‘ అని కలవరించి కటకటాల వెనుకకు వెళ్ళింది? దీని కోసమేనా గాంధీలు, నెహ్రూలు లాఠీ దెబ్బలు తిన్నది? దీనికోసమేనా భగత్ సింఘ్, రాజ్ గురు లాంటి యువకులు ఉరి కొయ్యకు వేళ్ళాడింది? ” వేదనగా అంది మాధవి.
“మీరన్నది ముమ్మాటికీ నిజం. ఎన్ని కుట్రలని బయటపెట్టినా, ఎన్ని రాజకీయకుతంత్రాలు వెలికి తీసినా
పైవాళ్ళ అండాదండాల తోటి, పచ్చనోట్ల రెపరెపల తోటీ మరుగునపడిపోతున్నాయి. యీ పరిస్థితులు మారాలంటే ముందు ప్రజలు విద్యావంతులు కావాలి. ఆ విద్య అబ్బాలంటే.. పోనీ చదువుకోవాలంటే ఆ చదువు ‘కొనాలి ‘ గా. సామాన్య మానవుడు ఏం కొనగలడు? నా ఫ్రండ్ ఒకడు ఎం.బి.బి.ఎస్. సీట్ కి 90 లక్షలు కర్చుపెట్టాడు. వాడు పి.జి. చేయాలంటే రెండు కోట్ల దాకా ఖర్చు అవుతుందిట. మాధవి గారు! వాడి దగ్గరకెళ్తే దోపిడి కాక ‘సేవ ‘ ఎలా చేయగలడు. ప్చ్… ఎవ్రీ థింగ్ ఈజ్ ఫర్ సేల్ … మానాభిమానలతో సహా… ఎనీవే… ఒక విధంగా మనం పిచ్చివాళ్ళం. ఎవరి పరిధిలో వారు బాగానే వున్నారు. మనం మాత్రం బాధపడుతున్నాము. ఇంకా కొద్దో గొప్పో ఈ మానవత్వం ఉన్నది కనుక మనసుని అమ్ముకోలేదు కనక!” నిట్టూర్చాడు ఆనంద రావు.
మాధవి ఏమీ మాట్లాడలేదు. ఆమె మనసులో నుంచి ఇంకా చీపురుపుల్లావిడ తొలగిపోలేదు.
“మీతో ఓ విషయం చెప్పాలి ” సందేహిస్తూ అన్నాడు ఆనంద రావు.
“ఏమిటీ? ” పరధ్యానంగానే అంది మాధవి.
“తొందరేం లేదులెండి… తరవాత కూడా చెప్పొచ్చు… అన్నట్లు కాఫీ తప్ప మీరేమి తాగలేదు. పొద్దునుంచి కూడా ఏమీ తినలేదన్నారు. ఏ చెపాతీ అయినా పాక్ చేయించనా? ” అక్కరగా అడిగాడు ఆనంద రావు.
“ఇంటికి వెళ్ళాక ఏదో ఒకటి చేసుకుంటానులెండి. అయినా మీరు కూడా ఏమీ తినలేదు కదా? పోనీ మీరు కూడా మా ఇంటికి రాకూడదు. అక్కడే తిందురుకానీ. ” ఆహ్వానించింది మాధవి.
“నిజం చెపితే మీరూ నీరసంగానూ వ్యాకూలంగానూ ఉన్నారు, ఇప్పుడు వంట పని పెట్టుకోవడం మంచిది కాదు. ”
“మనసుని డైవర్స్ చేయడానికి వంటకు మించిన ప్రక్రియ లేదు ఆనంద్ గారు. శరీరం ఎంత అలసిపోయినా ఫర్వాలేదు. ఇప్పుడు నాకు కావల్సింది మనసుని మరో వైపు మరల్చడం ” స్థిరంగా అన్నది మాధవి.
ఇద్దరు కూరగాయల షాపు వైపు నడిచారు. ఆనందరావే కూరగాయల్ని సెలక్ట్ చేసి కొన్నాడు. మాధవి డబ్బులు ఇవ్వబోతే చిరునవ్వుతో వద్దని వారించాడు.
“ఇంటి దాక నడుద్దాం ” అంది మాధవి. నడుస్తూ వుండగా దారిలో ఒక ఇంట్లో అరటి చెట్లు కనపడ్డాయి.
“ఒక్క నిముషం ” ఆనందరావ్ ఆ ఇంట్లోకి వెళ్ళాడు, ఐదు నిమిషాల తరవాత లేత లేత అరిటాకులతో తిరిగి వచ్చాడు.
“అవెందుకూ? ” ఆశ్చర్యంగా అడిగింది.
“పచ్చని అరిటాకులో వడ్డిస్తే మనసుకి ఆహ్లాదం కలగడమే కాక తిన్నది అరుగుతుంది. ప్రస్తుతం మనకి కొంచం ఉత్సాహం కావాలి. అందుకే ఆ ఇంటివారికి అరిటాకులు అడిగితే ఆనందంగా ఇచ్చారు. ” నవ్వి అన్నాడు ఆనందరావ్.
“మీకు చాలా కిటుకులు తెలుసే” నవ్వింది మాధవి.
“బ్రహ్మచారిని , అందునా ఒంటరిగాడిని కొద్దో గొప్పో తెలుసుకోవాలి కదా! ” రోడ్డు మీద రాయిని చెప్పుతో తంతూ అన్నాడు ఆనంద రావ్.
“అంటే మీకు ఎవరూ లేరా? “కుతూహలమూ, జాలీ కలిసిన స్వరంతో అన్నది మాధవి.
“అదో పెద్ద కథ. ఒకేలైన్ లో చెప్పాలంటే ‘నాకు ఉన్నది నేను మాత్రమే’ వివరంగా చెప్పాలంటే ఓ వెయ్యి ఎపిసోడ్ల కాలం పడుతుంది. అంత సుదీర్ఘ సీరియల్ ని మీరు భరించలేరు. ” పకపక నవ్వాడు ఆనంద రావ్.
“నాకు ఓపిక వున్నది లెండి ” తానూ నవ్వి అంది మాధవి.
“మీకు ఓపిక వున్నా, నా కథని నోరారా చెప్పి, దొరక్క దొరక్క దొరికిన ఏకైక స్నేహితురాలిని, అంటే మిమ్మల్ని పోగొట్టు కోలేను. కనుక కథని నిరవధికంగా వాయిదా వేస్తున్నాను. ” అల్లరిగా అన్నాడు ఆనంద రావ్. మనసులో సంతోషించాడు కూడా. ఎందుకంటే, నాకున్న ఒకేఒక్క స్నేహితురాలు మీరే అని చెప్పినందుకు.
“అంటే మీకు స్నేహితులే లేరా? ” ఆశ్చర్యంగా అడిగింది మాధవి.
“ఉండేవారు ఒకప్పుడు, అందరూ స్నేహితులే. స్నేహితురాలు మాత్రం మీరొక్కరే. “స్థిరంగా అన్నాడు.
“చిత్రం ఉందే! ” మళ్ళీ ఆశ్చర్యపోయింది మాధవి.
“చిత్రం ఎందుకూ? ”
“మీరు మంచివారు, చూడటానికి హాండ్ సమ్ గా ఉంటారు. మీ ప్రవర్తన ఏ స్త్రీకైనా నచ్చుతుంది. మీరు మాట్లాడే విధానం చాలా మెత్తగా , ఎవరినీ నొప్పించని పద్ధతిలో ఉంటుంది. అలాంటప్పుడు కనీసం ఇద్దరు ముగ్గురైనా స్నేహితురాళ్ళు వుండాలే…. ఈ రోజుల్లో కుర్రాళ్ళలాగా. ”
“నా మీద అంత మంచి అభిప్రాయాలు ఉన్నందుకు హార్ట్లీ థాంక్స్ . ధన్యవాదాలు….షుక్రియా. కానీ నేను చెప్పింది ముమ్మాటికీ నిజం. ఇప్పటి వరకూ మీరొక్కరే నా స్నేహితురాలు. ” మాధవి మొహం చూస్తూ అన్నాడు ఆనందరావ్. మాధవి మొహం వంక చూస్తూ రోడ్డు వైపు చూడకపోవడం వల్ల కాలికి మాన్ హోల్ మీద ఉండే ఇనుప పళ్ళెం తగిలి ధబాల్న తూలిపడ్డాడు. చేతిలో కూరగాయలు కిందపడ్డాయి. బంగాళాదుంపలు, టమాటాలు దొర్లుకుంటూ రోడ్డు ని ఆక్రమించాయి. అరిటాకులు మాత్రం మాధవి చేతిలో భద్రంగా ఉన్నాయి.
ఆనందరావ్ పడిపోగానే కంగారుగా మాధవి వొంగి అతన్ని లేవదీసే ప్రయత్నం చేసింది. అతని భుజం మీద చెయ్యి వేసింది. రెండు చేతులతో లేపాలంటే అరిటాకులు పారేయ్యాలి. యీ లోపల ఆనందరావే లేచాడు. చెప్పు తెగిపోవటమే కాక కుడికాలి బొటన వేలు చితికి ధార కారుతోంది. బొటన వేలి గోరు ఊడిపోయింది.
“అబ్బా… ఓ గాడ్! ” భయంతో కళ్ళు మూసుకొని మళ్ళీ కళ్ళు తెరచి అరిటాకులు ఆనందరావ్ కిచ్చి బాగ్ లోంచి రుమాలు తీసి బొటన వేలికి చుట్టి గట్టిగా కట్టు కట్టింది.
“డాక్టర్ దగ్గరకి వెళ్ళాల్సిందే ” అంటూ అటువైపు వస్తున్న రిక్షాని ఆపింది. అతని చేతిని తన భుజం మీద వాల్చుకొని కష్టం మీద రిక్షా ఎక్కించి పక్కన తనూ కూర్చుంది.
బొటన వేలి బాధ విపరీతంగా ఉన్నా, దాని మించిన ఆనందం ఆనందరావ్ కి కలిగింది…. మాధవి పక్కనుండటంలో….

****************

“అక్కా..” అంటూ లోపలకి వచ్చిన శోభ ఆనందరావ్ ని చూసి అవాక్కయ్యింది.
“రండి శోభారాణీ ! మాధవి గారు కూరగాయలు కొనడానికి బజారుకెళ్ళారు. త్వరలోనే వస్తారు ” ఆహ్వానించాడు ఆనంద రావ్.
“మీరు…ఇక్కడ…”ఆశ్చర్యంగా అంది శోభ.
“మొన్న నా కాలికి అంటే కాలి బొటన వేలికి యాక్సిడెంటు జరిగింది. మాధవిగారే కట్టు కట్టించి ఇక్కడకు తీసుకొచ్చారు. ఒంటరి వాడ్ని కదా ! ఆ జాలితోనన్న మాట. అప్పటి నుంచి ఈ మంచం మీద పడుకొని మహరాజులా ఆనందిస్తున్నా. పాపం మాధవిగారికే నా వల్ల రెస్ట్ లేకుండా పోయింది.”
” అయ్యో నాకు తెలియదండి! ” అని కట్టుతో ఉన్న బొటన వేలిని పరీక్షించి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కుర్చిని లాక్కొని కూర్చుంది శోభ.
“మీరెలా ఉన్నారు? మీ స్కూల్ ఎలా ఉంది? ” అడిగాడు ఆనంద రావ్.
“బ్రహ్మాండంగా ఉంది. ఆమధ్య ఓ నెల రోజుల జీతం ‘బోనస్ ‘ గా కూడా ఇచ్చారు. ” సంతోషం గా అంది శోభ.
“అన్నట్లు స్వీట్స్ తెద్దామనుకొన్నాను, బోనస్ తరవాత నాకో ఇంక్రిమెంటు కూడా ఇచ్చారు. ఆ సంధర్భంలో సంతోషం పంచుకోవాలిగా మరి! ఇప్పుడే వస్తానేం. అక్క వస్తే చెప్పండి! ” గబగబ చెప్పేసి బయటకు నడిచింది శోభ. ఆమెని ఆపలేదు ఆనంద రావ్.
మాధవి పడుకునే పక్క మీద పడుకోవడం అతనికి అపురూపంగా ఉంది. మెట్లెక్కి వచ్చిన తొందరలో బెడ్ షీట్, తలగడ మార్చలేదు. ఆ తలగడని ప్రేమగా చుంబించాడాతను. మాధవి జుత్తు యొక్క సువాసనని కూడా ఆ తల దిండు నుంచి ఆఘ్రాణించాడు.
జీవితం కొత్తగా ఏదో తెలియని మత్తుగా అతనికి కనిపిస్తోంది. డాక్టర్ దగ్గరకు వెళ్ళేదాకా మాధవి పడ్డ బాధ, కంగారూ, కట్టుకట్టాక రిక్షాలో కూర్చోబెట్టే వరకు తనని నడిపించినప్పటి స్పర్శ, ఆ స్పర్శలోని వెచ్చదనం క్షణక్షణానికి అతని మనసుని ఊయలూగించినై.
ఆమె చేస్తున్న శుశ్రూషకి అంతే లేదు. పక్క మీద నుంచి కిందకు దిగనివ్వడం లేదు. దిగాల్సి వచ్చినప్పుడు తన భుజాన్ని ఆసరాగా ఇస్తోంది. ఆమె వంటి పరిమళం ఆనందరావ్ ని మరో ఆత్మీయలోకంలోకి తీసుకుపోతోంది.
“జీవితం అంటే ఇదే ! నేను జీవించడం మొదలు పెట్టింది ఇప్పుడే !” నూట ఇరవయ్యోసారి ఆనందంతో నిట్టూర్చాడు ఆనంద రావ్.
“మాధ్వీ..” మాధవిని పిలుస్తూ లోప్లకి వచ్చింది సుందరీ బాయ్.
సుందరి గొంతు వినగానే ఉలిక్కిపడ్డాడు ఆనంద రావ్.
“నువ్వా? ” షాక్ తిన్నది సుందరీ బాయ్.
***********

మదాలస రోడ్డు మీద నడుస్తోంది. కళ్ళలో నీరూరి రోడ్డు మసక మసకగా కనిపిస్తుంటే, కొంగుతో కళ్ళు తుడుచుకుంది. నడుస్తు నడుస్తూ వుంటే ఎదురుగా గోవిందస్వామి ఆలయం కనిపించింది. అక్కడున్న మండపంలో ఒక్కతే కూర్చుంది. శనాదివారాలు కాకపోవడం వల్ల భక్తులు ఒకరో ఇద్దరో మాత్రమే తిరుగుతున్నారు.
భర్త అన్న మాటలు గుర్తుకొచ్చి మళ్ళీ కన్నీళ్ళు బుగ్గల మీదుగా జారాయి.
“కామపిశాచిలా ఏమిటా గోలా? అవతల పెళ్ళికి ఎదిగిన ఆడపడుచు, అనారోగ్యంతో నిద్రపట్టని అత్తగారూ వున్నారన్న జ్ఞానమైన లేదా? ” అతని మొహం కోపంతో చికాకుతో కందగడ్డయింది. తనేంచేసింది? తనకి పుట్టినరోజని కూడా ఆ మొగుడు మూర్ఖుడికి గుర్తు లేదు. తనే తెల్లచీర కట్టుకొని దగ్గరకు వెళ్ళి భుజం మీద చెయ్యి వేస్తే దక్కిన మాటలు అవి. మదాలసకి తన పుట్టిల్లు గుర్తుకొచ్చింది. అయిదుగురు అక్కల తరవాత పుట్టింది. నలుగురి పెళ్ళి వరకూ కట్న కానుకలతో బాజాభజంత్రీలతో గొప్పగా చేసినా , ఐదో పెల్లకి మాత్రం పెళ్ళి చెయ్యలేకపోయాడు తండ్రి. కారణం ఆ పిల్ల పెళ్ళికి సుముఖంగా లేకపోవడమే. తనో అందగత్తెనని ఆ పిల్లకి మహానమ్మకం. అంతే కాదు, ఏ సినీహీరోనో, నలకూబరుడో, బిజినెస్ టైకూనో అకస్మాత్తుగా వచ్చి వరిస్తాడనే సినిమా ఊహలు. ముప్పై ఏళ్ళు వచ్చి ఆవిడ కలలన్నీ కన్నీళ్ళైయ్యేసరికి , తండ్రి హరీమన్నాడు. ఆవిడకోగంతకు తగ్గ బొంతకిచ్చి పెళ్ళి జరిపించే సరికి మదాలసకి పాతికేళ్ళు వచ్చాయి.
విరబూసిన పూలతోటలాంటి మదాలసకి సౌందర్యమూ, శృంగారమూ అంటే తెలియని మొగుడు దొరికాడు. కనీసం ‘కామం ‘ వున్నా జీవితం ఇంత నిష్టూరంగా ఉండేది కాదు. ఇహ అత్తగారు అదో రకం మనస్థత్వం. కొడుకు కోడలు కలిసి అన్నానికి కూర్చున్నా సహించేది కాదు. ఇహ కలిసి పడుకోవడం ఎలా కుదురుతుంది? శోభనం రాత్రే నిస్సారంగా నిర్వీర్యంగా నిస్సత్తువగా గడిస్తే ఇక భవిషత్తు మీద ఆశ ఏం మిగిలి వుంటుంది?
కొంగుతో కళ్ళు తుడుచుకుంది మదాలస. ‘ వద్దు…. యీ నికృష్టపు జీవితం వద్దు. ఇలా ఎన్నేళ్ళు జీవచ్ఛవంలా బతకలి? పోనీ చచ్చిపోతే? చచ్చిపోతే ఏమౌతుందీ? ఏమీ కాదు. గాలి యధాతధంగా వీస్తూనే వుంటుంది. యీ గుళ్ళో గంటలు మోగుతూనే వుంటాయి. సూర్యోదయ సూర్యాస్తమాలు మామూలుగా జరిగిపోతూనే వుంటాయి. ఒకవేళ చచ్చినా ఏడ్చేదెవరూ? రకరకాలుగా ఆలోచిస్తోంది మదాలస.
తటాల్న ఆమెకి ఆనందరావ్ గుర్తుకొచ్చాడు. ఠక్కున లేచింది. గుండె నిండా శ్వాస పీల్చుకుని రోడ్డు మీద మళ్ళీ అడుగుపెట్టింది.

ఇంకా వుంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *