May 6, 2024

పద్యమాలిక జూన్ 1 2015

unnamed

నాగజ్యోతి సుసర్ల
1 .అరుణుడు ,అందమున వెలుగు
తరుణిని వదలక తిరుగుతు- తాపము జెందెన్!
యిరువిధముల వేడిపెరుగ
నరరే చెమటల యువకుని – నరయరె జనులూ!!

2.కం: చెఱువుకు బోయిన చిన్నది
బరువెక్కిన కడవతోడ -బాధగ నడచెన్
తరుణికి భారము దించగ
కరుణను కార్మొయిలుదాగె-కాసిని నీళ్ళన్!!

3. కం:
భారీ పరిశ్రమలచట
జారవిడుచు కలుషజలము-జనములు బట్టన్
సూరీడు చూడనొప్పక
నేరుగ స్ట్రాతో ఘటమున- నీటిని బీల్చెన్!!

గోలిశాస్త్రి

గ్రక్కున మేఘుడు ద్రాగెను
మిక్కుటముగ తాళలేక మీదటి వేడిన్
చక్కగ కడివెడు నీటిని
గ్రక్కును బానెడుగ రేపు కదలుము భామా !

ఈ చాన కుండ లోపల
నాచల్లను కవ్వమిడుచు నడచుచు నుండెన్
చూచెడు కోణము లోనను
నాచదలున మొయిలుద్రాగు నట్లుగ ” దోచెన్ ”

చల్లనె అమ్మగ బోయెడు
చెల్లెమ్మా ! చూచుకోమ్మ చిత్రము, మొయిలే
చల్లగ ద్రాగుచు నుండెను
చెల్లునె నీకీ పరాకు ? చిల్లర రాదే !

కుండ పోతగ వర్షమ్ము కురియ జేయ
దలచ మేఘము యీ రీతి తలను నిడిన
నిండు కుండను నీరంత నిండు కొనగ
జేయ వలయున ? నేమిటో ” చిత్ర ” మిదియె ?

కుండను నీరేమి తొణక
కుండగనే నడచుచున్న కోమలి కనవే
మండెడు యెండకు, కనబడ
కుండగనే మేఘమింక ” కూలుగ ” త్రాగెన్.

అన్నపరెడ్డి సత్యనారాయణరెడ్డి

ఆః కులుకు నడక తోడ కోమలి యొక్కతి
గొడుగు నీడ లోన వెడలుచుండ
భానుకిరణ ధాటి బాధించుచున్నను
చిన్నవాని మనసు చిక్కుకొనియె

ఆః చీరె కట్టు తోడ చెంగలించుచుఁబోవు
భామగాంచి మనసు బ్రమము నొంద
చెమట కారు చుండ శీర్షముపైనుండి
చొంగ గార్చుచుండె సొగసుగాడు

తేః చిన్నదానిపై చూపులు చిక్కుకొనగ
స్థాణు వయ్యెను కనుగొని చక్కనయ్య
చేతిగుడ్డను దాల్చి తా శిరముపైన
చూచు చుండెను కన్నియ సోకులన్ని
సవితృని కిరణముల ధాటి సరకుగొని

ఉత్సాహ:
నడకలోన నీదు నడుము నాట్య మాడుచున్నదే
విడువ కుండ నాదుమనసు వెంబడించ మన్నదే
కడుబెగడును పొందుచుంటి కమలమిత్రు ధాటితో
గొడుగులోన చోటునిచ్చి కూర్మితోడ కాచుమా
అడుగులోన నడుగు వేసి యరుగుదాము సతతమున్
గడుపుదాము జీవితమ్ము కరము తృప్తితోడుతన్

ఆః రంగుచీర లోన రంజిల్లు చున్నావు
రాణి వాసపు నెఱ జాణ వోలె
సూర్యకిరణ ప్రభలు చురచుర లాడిన
నిన్ను విడువలేను నీరజాక్షి

ఆః మైళ్ళదూరముచని మచ్చెకంటియొకతె
నీరముఁగొని వచ్చు దారిలోన
తపనుడేకరమగు దప్పికఁగొనితాను
గ్రోలుచుండె నీరు కుండనుండి

తేః పద్మభందుపాలిబడిన వారిధరము
తపన భరియించు మార్గమ్ము తలచిమదిని
కొమ్మ శిరముపై నుదకపు కుండగాంచి
త్రాగుచున్నది నీటిని త్వరితముగను

తేః ఏఱులన్నియు రయమున నెండిపోవ
ఉప్పునీటిని గొనినోరు చప్పబడగ
పంకజాక్షితాగొనివచ్చు వారిగాంచి
పీల్చుచుండెను మేఘుడు ప్రీతితోడ

ఆః చల్లను గొనిపోవు గొల్లభామనుగని
దప్పిదందడించ తపనతోడ
నానుచుండె రయము నబ్దమ్ము పైనుండి
పీకనుగొని కరము ప్రీతితోడ

శైలజ ఆకుండి
కందం —1
తాపము బెట్టెడి భానుడు
పాపము తన వేడికి తనె వడగొనె నేమో!
సూపరుగా స్ట్రా వేసుకు
రూపరి బుంగన జలమును రొప్పుచు ద్రాగెన్!!!

కందం —2
కుండను తలపై బెట్టుకు
యెండన బడి నడచి పోవు ఇంతిని గనుచున్
మెండుగ దాహము వేయగ
కుండన గల పీథమును గ్రోలె గుట్టుగ రవియే!!!
కందం —3
మంటలు రేపే సూరుడ
తుంటరి తనమేల నీకు తొయ్యలి నీటిన్
వెంటదగిలి ద్రాగితివే!
కంటన నీరొలుకు సకికి ఘటమును జూడన్!!!

గుండా వెంకట సుబ్బా సహదేవుడు
1.
చెమట చిందు నటుల చెయ్యెత్తి బిందెతో
నీరు మోసు కొనుచుఁ దారి నుండ
మేఘమంత నీరు మింగేసి పోవగా
మొగుడి నింద నెటుల మోయ గలను ?

2.
దాహ మన్ననీకు తర్షమ్ము లేకనా?
బిందెలోని నీటిఁ బీల్చ నేల?
ఉప్పు నీటి తోడ దప్పి తీరదె తల్లి!
గుటిక డైనఁ జాలు కొలను నీరు!!

3.
నాయకత్వమంత నగుబాటు లైపోయె!
త్రాగు నీటి కొరత తగ్గదాయె !!
చినుకుఁ గురియు నీవె చెరవమ్ము లో నీరు
గ్రుక్కకొనగ మాకు దిక్కెవరయ?

4.
పంట నీరుఁ బెట్ట పతిదేవుడేగంగ
నింటి నీటి కొరకు నిక్కడుంటి!!
కరిగి పోయి నీవు కన్నీరుఁ గార్చక
దొంగ వలెను నీరు దోచఁ దగునె?

5.
నీరముగల ధేనములో
నేరముఁ గాదది చవిగొను నీరదములకున్!
నీరము బిందెలఁ జేరిన
నీరదములు నోరుఁ బెట్ట నేరము గాదే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *