May 9, 2024

పద్యమాలిక – జూన్ 15 2015

unnamed

భళ్లమూడి శ్రీరామ శంకరప్రసాద్

కం . 1
గోగో సారూ , డూ డూ
యోగా డైలి , కరిగించు ఓవర్ వెయిటూ !
సాగిన నడుమును చూస్తే
బేగమ్ నచ్చును భళి భళి భేషూ అంటూ !

తే.గీ . 2
పిడికె డంతటి నడుమున్న పిల్ల ప్రక్క
బండ వాడని యొకడిని ఎండ గట్టి
నడుము వంచ మనుట మీకు న్యాయ మౌన ?
తప్పు మాటలు వ్రాయుట తప్పు కాద ?

ఆ.వె. 3
ల్యాపు టాపు పనులె లలనలు చేయంగ
యోగ ముద్ర వలయు ఒడలు తగ్గ
రాత్రి పగలు కూడ రంగునీళ్ళ ను త్రాగి
తిండి మస్తు తినగ బండ యవర ?

తే.గీ . 4
తల్లి దండ్రులు జూపిన దారి బట్టి
పిల్ల పాపలు ఎదగరె ? పెద్ద గాను
మంచి మార్గము నేతలు ఎంచి చూప
దేశ సంస్కృతి వర్ధిల్లి దివ్య మవదె

తే.గీ . 5
పెంచ వచ్చును మొక్కను వంచి వంచి
మాను గట్టిన చెట్టును మలచ లేము
ఆసనమ్ములు సాధించ అక్క రేమి ?
ఇంటి పనులందు ఇంతికి ఇష్ట మున్న !

ఆ.వె. 6
యువతి శక్తి చూచి యోగాసనము వేయ
పోటి గాను చేరె పోర డొకడు
చాప పరిచె నంత చక్కగా ప్రక్కన
నవ్వు బాటు కాద ? నడుము విరగ !

కం . 7
కొంచెమ్ కొంచెమ్ మెల్లగ
వంచగ కాస్తా నడుమును వాటము తోడన్
పెంచిన కొవ్వు తరగ ప్రే
మించిన సతియే వలపుల మిత్రము కాదా ?

నాగజ్యోతి సుసర్ల

1.కం:
విల్లు వలె వొళ్ళువంచగ
నిల్లాలికి సాధ్యమాయె- నిక్కడ జూడన్
ఫుల్లుగ బొజ్జను , నడుమును
పెళ్ళున పెంచిన పతికది – పెనుభారమ్మే!!

2.కం:
యోగా చేసిన చాలును
రోగాలనుబాపుననుచు – రూపసి బిలవన్
బాగా సరదా పడితిని
పోగా లమ్మిది తనకని – పోరడు ఏడ్చెన్!!

3. ఆ.వె :
పెళ్ళి చూపు లనుచు పెక్కుగా ప్రశ్నించి
వెకిలి నవ్వు నవ్వె పెళ్ళి కొడుకు
ఒళ్ళు మండి యువతి యోగాసనమిడగ
వాని నడుము విరిగి వాచి పోయె

ధనికొండ రవి

యోగాలో వంపుల సొంపుల
నే గమనించుటకు జేర నెంతటి బలమో
యీ గతి తన్నితి వికనే
నేగతి కాపురము జేతు నికపై నీతో !

సుదర్శన్ కుసుమ
సుచిగ స్నానమాడి సూర్యోదయమువేళ
యోగ సాధనమును బాగ చేయ
ఒంపుసొంపులన్ని యింపుగా మారును
శాంతి గలుగు మనసు సవ్యమగును.
సాధన జేయగ యోగా
సాధించగవచ్చుసకల చైతన్యములన్
వ్యాధుల నరికట్టుచు మన
బాధలు హరియించ వచ్చు ప్రాశస్త్యముగన్
యోగా జేసిన నిత్యము
వేగమ్మున శక్తి గూరి వేదన తొలగున్
రోగమ్ములు దరిజేరవు
రాగల యాపదలు బాసి రక్షణ కలుగున్.
ఒళ్ళును వంచుచు వేసిన
పెళ్ళామాసనము జూసి వేయగ తానున్
కళ్ళకు చీకటి గ్రమ్మెను
పెళ్ళున నడ్డే విరుగగ పెడబొబ్బెట్టెన్.
నిబ్బరముగ భార్య అకట
తబ్బిబ్బయ్యేల యోగ దనకున్ జూపా
అబ్బో! నా నడ్డి విరిగె
రబ్బరులానడుము వంచ రాదుర యనియెన్!

శైలజ ఆకుండి

కందము…1
యోగా జేయుచు నడుమును
బాగా మరి వంచలేని భర్తను గనుచున్
సాగుచు జూపంగ సతియె
ఈగో హర్టగును గాదె యింటాయనకే!!!
కందము…2

యోగా జేయుట మేలని
వాగితి నేనొక్కమారు వామ్మో !నడిచే
యోగము లేకుండె నిపుడు
నా గాదిలి చాలునింక నాధుని గానా!!!

కందము….3

లేజీ నే వదలినచో
నాజూకుగ మార్చు గాదె నయముగ యోగా
రోజూ తప్పక జేయగ
తాజాగా నుండుననుచు తరుణియె దెల్పెన్!!!

కందము…4

సాధన జేయగ నిలలో
సాధింతురు దేనినైన సత్యం బిదియే
వ్యాధుల నరికట్టుచు పలు
బాధలు తగ్గించు యోగ బాగుగ నేర్వన్ !!!

శ్రీధరరావు మాచవోలు

కం.
యోగా నేర్చిన నడుములు
రాగాల వలె కదలాడ రంజిలు చుండన్,
భోగాలె కోరిన యువత
సాగుట, వంగుట నెరుగక సాగిల పడిరే!

ఆ.వె. ఇంటి పనులు కూర్చు ఇంతి తనువు కోరి
ఆశ్రయించె నవియె ఆసనాలు
ఆలి చేసి పెట్ట నారగించెడి వాని
ఒడలు మాట వినక ఓటు పడియె!

గుండా వెంకట సుబ్బా సహదేవుడు

1.
తలకిందుల వేసితివే
నెలతా నీవాసనమును నేర్పరి వందున్!
కలుపగఁ జేతులు వెనుకన్
దొలగించగ లేకనుంటి తోడుగ రావా?

2.
నా చేతులు వెనుక ముడచి
నీ చేతుల నేల నుంచి నేర్పుగ లేయన్
జూచేందుకు నా తరమే?
వాచెను విడదీయ లేక వనితా కరముల్!

3.
నాపై కోపమ్ముండిన
చూపింతువు నట్లకాడ! చోద్యమ్మేమో
వీపున జేతులు ముడచియు
నీపనిలో నుండి శిక్ష నిడితివె భామా!
4.
వీరుడ! ధీరుడ! నంటివి
‘బీరు’డవని దెలిసి పోయె బిగుసుకు పోవన్
జేరిచి వెనుకగఁ జేతులఁ
గారుచు కొన చెమటలెల్ల కంగారెత్తన్!

శ్రీనివాస్ ఈడూరి
యోగా చేదాం రమ్మని
బాగా పోరును పెడితివి వాణీ గనుమా
సాగక యున్నది నడుమే
వేగమె రావే నను గని వేయగ మెడిసిన్

టీవీ యోగా నేర్చిన
బీవీ ఉంటే దొరకవు బీరూ గీరూ
ఏవీ సాగవు ఆటలు
నావీ మాటలు నిజాలు నమ్మర భాయీ

యోగా చేశారంటే
రోగాలేవీ కలగవు రోజూ రండీ
ఫ్రీగా దొరుకును హేల్తూ
బాగా చెస్తే కలుగవు బాధలు ఎపుడూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *