May 4, 2024

పప్పణ్ణం ఎప్పుడు?

రచన: వేటూరి సుందరరామమూర్తి

Pappannam-eppudu-1
“తిండికి మొహం వాచినట్లు- కరువొచ్చి చస్తున్నట్లు- పాడుగోలా వీళ్ళూనూ- ఇంతింత కళ్ళు వీళ్ళూనూ…”
విసుక్కుంటూ, నసుక్కుంటూ విసురుగా లోపలకొచ్చింది తాయారమ్మ. శనగలు కట్టిన రుమాలు సోఫాలో పారేసి- తానూ కూలబడింది.
భాగవతం చదువుకుంటున్న విశ్వనాధంగారు తలయెత్తి చూసి- పూతనకు అపరావతారంలా ఉగ్రురాలై ఉన్న తాయారమ్మతో ” ఏవిటే- మళ్ళీ ఏం ఒచ్చిందీ? ” అన్నాడు గుండె బలహీనత మాటల్లో మలచి, ఓపికంతా చూపుల్లో పొదివీ.
రయ్యనందుకుంది తాయరమ్మ- రుంజుకుంటూ.
‘ఆహ నాకు తెలియకడుగుతాకాని తిండికి మొహంవాచి ఏడుస్తున్నారాంట- ఆ సుబ్బయ్యగారి రావమ్మా, పక్కింటి చుక్కమ్మానూ. పెళ్ళికెదిగిన అమ్మాయి ఉంటే సరి పొడుస్తారు- కాకులు పొడిచినట్టు- మన బాధంతా వీళ్ళే భరిస్తున్నట్లు…”
ఇన్ని మాటలు ఓపికనే దున్నపోతు మీద కురిసిన వాన కాగా యధాప్రకారం విశ్వనాధం తిరిగి ప్రశ్నించాడు.
“ఇంతకూ ఏమన్నారు? అమ్మాయి పెళ్ళి మాటేనా?”
“ఆహా! అది తప్ప ఏమైనా పనుండి చస్తేగా వీళ్ళ మొహానికి. ఏవమ్మా అమ్మాయి పెళ్ళి మాటేమైనా అనుకున్నారా? అని ఒకళ్ళు- మరి మాకు పప్పణ్ణం ఎప్పుడూ? అంటూ ఒకళ్ళు ఆపేక్షలు ఒలకపోస్తూ ఉహూ ప్రశ్నలు-నాకు నిజంగా అరికాలిమంట నెత్తికెక్కింది- ఎప్పుడు బయట పడతానా అని ఉక్కిరిబిక్కిరై చక్కా వచ్చాను. పప్పణ్ణంట పప్పణ్ణం- మరీ ఆ చుక్కమ్మను చూస్తే ఒళ్ళు భగ్గున మండిపోతుంది.చెట్టలే ఎదిగాడు కొడుకు కొడుక్కి తనెప్పుడు చేస్తుందో- మనవాడు మొగవాడు కదా అని ధీమా…”
ఏకధాటిన ఇలా దొణ దొణ పదజాలం పారబోస్తున్న తాయారమ్మతో విశ్వనాధం నింపాదిగా రొష్టుపడిపోతున్న మొహంతో పేలవంగా నవ్వుతూ- మనః పంజరంలోంచి నిజభావ కపోతాన్ని రెక్కలు నిమిరి ముఖతః వదిలిపెట్టాడు.
“ఇక అంతటితో నోర్మూసుకో, రణగొణ ధ్వనిగా ఒకటే గోల. అన్నారంటే అనరు! ఏ వయసుకా ముచ్చట. పట్నంలో కాలేజీల్లో చదివించాలని పట్టుబట్టి ఆడిందాటగా కానిస్తున్నావు. ఎప్పుడైనా అమ్మాయి మనసు గ్రహించావూ.
వాళ్ళు పప్పణ్ణం అడిగారంటే నీ ఇంటి తిండికి మొహం వాచి కాదు. నీవు పెట్టే పాటి ఎవరికీ చాతకాకపోలా. మహా లావు పెటకం పెడతావని ఎదురుచూస్తున్నారంతా… సిగ్గుండాలి మొహానికి…”
పుస్తకభాగవతంలోంచి బ్రతుకు భాగోతంలోకి అడుగుపెడుతూ ఓపికా, నిష్కర్ష, నిష్టూర్యం, నింద, హెచ్చరికా, కోపం మొదలైనవన్నీ మాటల్లో బట్వాడా చేసిన విశ్వనాధం గారికి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు తాయారమ్మకి..
రుద్ధ కంఠంతో- శోకచ్ఛాయల శ్లేషతో- ఎర్రబారిన ముఖం ” అయితే తప్పంతా నాదేనంటారు? అందరూ నన్నే అనండి. కాకులు పొడిచినట్టు పొడవండి” అని తాయారమ్మ హుమ్మస్సంతా కసిగా వెడలగక్కింది. కన్నీరుగా రాల్చింది.
‘పిలుస్తే పలుకుతుంది ఏడుపు- కుళాయి తిప్పినట్టే కన్నీళ్ళు- మీ దుంప తెగ వీటితో సాధిస్తున్నారు పొండే మీరు.” అన్నాడు ‘హు ‘ అని నిశ్వసిస్తూ విశ్వనాధం గారు.
ఐతే ఇరవై నాలుగ్గంటలూ సోఫాలో చతికిలపడి భారతాలూ, భాగవతాలూ నా బొంద చదువుతూ కూచుంటే అవుతుంది అమ్మాయి పెళ్ళి- నెత్తిన నోరు పెట్టి మొత్తుకుంటున్నా దిక్కులేదు. వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుని ఆ చుక్కమ్మా వాళ్ళూ అమ్మాయి నైలాన్ చీరలు కడుతుందనీ, రెండు జడలు వేస్తుందని ముక్కు మీద వేళ్ళు మూతివిరుపులూను, అన్నివిధాల నేను చస్తున్నాను, అందరూ నన్ను ఆడిపోసుకునేవాళ్ళే.
ఏం అది నైలాన్ చీరలు కడితే ఏం? ఊరేగుతే ఏం? పల్లెటూరి గొడ్డల్లే కాశా బూశెకట్టి కానీ అంత బొట్టు పెట్టుకు తిరగాలనా వీళ్ళ గోల! దానిష్టం.. పట్నం ఫాషన్ల ప్రకారం సాటి ఆడపిల్లలతో అది కలిసి మెలిసి ఉంటుంది. అదీ వీళ్ళకి కడుపుమంటేనా?”
విశ్వనాధం గారు భాగవతం మళ్ళీ తెరుస్తూ కళ్ళజోడులోంచి కౌటిల్యుడి చూపుతో ” ఏమిటే లొడ లొడ లొడ గొడవ- అన్నారని రుంజుకుంటావు. నా భారతాలూ, భాగవతాలూ

Pappannam-eppudu-2

నీకు లోకువ. నా మీద విరుచుకు పడతావ్. మాట అంటే తీసుకు తీసుకు చస్తావ్. సరే పద లోపల పొయ్యిమీద అన్నం మాడిపోతోందో ఏమో! ” అని సర్దుకోబోయారు.
అహా! చుక్కమ్మకేం పోయేకాలం? అంత చేటు వికవికలూ పకపకలూనూ. అమ్మాయినీ, నన్నూ చూస్తే- మొన్న అది సెలవులకు వచ్చి వెడితే ఏమి తిప్పింది మూతీ ముక్కూ. దీని కొడుకు మాటేవిటి. చెట్టల్లే, పాక నిట్టాడల్లే పెరిగి పెళ్ళీ పెటాకులూ లేకుండా వాడికొచ్చినేళ్ళకి నోటి హార్మనీ వాయిస్తూ బొమ్మల బుష్కోట్లు తొడగడంలా?మొగాడైతే సరి ఏమైనా చెల్లిపోతుంది.
ఆ రాత్రి కురిసిన బ్రహ్మాండమైన వానతో తెల్లారిపోయింది. బావి దగ్గర నీళ్ళకెళ్ళిన చుక్కమ్మా, తాయారమ్మా మూతులు ముప్ఫై మూడు విరుపులు విరుచుకుని ఇళ్ళకు చేరారు.
ఆ రోజు టపాలో రిజిష్టర్డ్ ఉత్తరం వచ్చింది విశ్వనాధం పేరిట. ఏదైనా రిజిష్ట్రారు కోర్టు విషయమా అన్నది తాయారమ్మ పొయ్యి మీద గిన్నె కాలేసి వచ్చి.
తాపీగా చూసి, కళ్ళజోడు తీసి “బలీయసి కేవలమీశ్వరేచ్చా’- అంటూ నిట్టూర్చాడు ప్రశాంత వదనంతో విశ్వనాధం గారు.
“ఏమిటండీ?” అన్నది ఆదుర్దాగా తాయరమ్మ.
“వినగానే సంతోషించే ఓపికొకటి కావాలి నీకు. నీ కూతురుకు మంచి జరుగుతే నీవు సంతోషించగలవా తాయారూ ?” అన్నాడు విశ్వనాధంగారు సాత్వికునిలా, జీవిత తాత్వికునిలా.
ఎందుకానందించనండీ మీ పిచ్చికానీ- ఇంతకూ ఏం జరిగింది? ఏదైనా ప్రైజు వచ్చిందా కాలేజీలో?
ఏమీ లేదు- నీ కోరిక నెరవేరింది- పప్పణ్ణం అక్కరలేకుండా అమ్మాయికి పెళ్ళయిపోయింది. నీ పంతం నెగ్గింది.
‘ఆ’ అంటూ నివ్వెరపోయింది- తాయారమ్మ ‘ఏమిటండీ మీరంటున్నదీ? అన్నది తార్మారై, తలకిందులై ఆదుర్దాతో అదురుతో.
మరేంలేదు చుక్కమ్మ కొడుకు రమేష్ కలెక్టరయ్యాట్ట మొన్న- నీ అల్లుడయ్యాడట నిన్న. రిజిష్టర్ పెళ్ళి చేసుకున్నారట ఇద్దరూ. భగవచ్హిత్రం! నీకూ, చుక్కమ్మకు భగవంతుడు రోగం ‘ఠకీ’ మని ఒక్కసారి కుదిర్చాడు. నీకు పప్పణ్ణం పెట్టే బాధ తప్పిపోయింది.
‘రమేష్ కలెక్టరా! నా అల్లుడా !అని ముప్పిరిగొనిపోయింది ఆనందపు ఉప్పెనలో తాయారమ్మ.
“అహ కాదు చెట్టూనిట్టాడని… సిగ్గుండాలి మొహానికి! అన్నాడు విశ్వనాధం సమయాన్ని సదవకాశం క్రింద వినియోగిస్తూ. ” చాల్లే ఊరుకోండి మరీనూ” అన్నది తాయారమ్మ.
ఈ మాట విన్నావుటే అంటూ సంభ్రమంతో పరుగెత్తుకువచ్చింది రామయ్య గారి సుబ్బమ్మ- చుక్కమ్మగారింటినించి సరాసరి.
“సరే పద పద లోపలకి, పొయ్యి మీద గిన్నె కాలిపోతోంది-” అన్నారు విశ్వనాధం గారు.
“మరి పప్పణ్ణం ఎప్పుడూ?” అంది రామయ్యగారి సుబ్బమ్మ.
*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *