May 4, 2024

వెటకారియా రొంబ కామెడియా 11

రచన: మధు అద్దంకి

అషాడం:

“వదినా ఏమి చేస్తున్నావ్ ” అంటూ లోపలికొచ్చిది శాంతమ్మ

ఆ ఏమి లేదు ” ఏబ్రాసి మొగుడు ఏడుపుగొట్టు పెళ్ళాం” సీరియల్ వస్తుంటే చూస్తున్నా అన్నది కాంతమ్మ

“రిపీట్ ప్రోగ్రాం చూస్తున్నావా? ఇది నేను నిన్న రాత్రే చూసేశాలే” అన్నది శాంతమ్మ.

మళ్ళా తనే ” ఇది విన్నావా కమలమ్మ కోడలు పుట్టింటికి వెళ్ళిందిట” అన్నది

“ఆషాఢ మాసం కదూ వెళ్ళుంటుందిలే” అన్నది కాంతమ్మ..

“పెళ్ళయ్యి రెండేళ్ళవుతుంటే ఇంకా అషాఢం, మూఢం ఏమిటి? ఆషాఢ మాసం ఆచారం అని చెప్పి , వియ్యలవారి దగ్గర డబ్బులు గుంజటానికి పంపించారుట.. వాళ్ళ పనిమనిషి రత్తాలు మా పనమ్మాయి తాయారుకి చెప్తే అది నాకు చెప్పింది” అన్నది శాంతమ్మ

“మొత్తానికి కమలమ్మ ఇంట్లో విషయాలు కూపిలాగావులే” నవ్వుతూ అన్నది కాంతమ్మ

” ఆ నాకంత ఇంటరెస్ట్ లేదమ్మా మా తాయారు చెప్తే ఒక చెవి పారేసి విన్నా ” మూతి తిప్పుతూ అన్నది శాంతమ్మ..

“అది సరే గాని వదినా మీ కోడలెక్కడ” అడిగింది శాంతమ్మ

“వంట చేస్తోంది” అన్నది కాంతమ్మ

” అవునొదినా మీ వియ్యాలవారివ్వాల్సిన డబ్బులు, నగలు అవి రాబట్టావా లేదా” అనడిగింది శాంతమ్మ

“ఈ దెబ్బతో రాబడతా.. ఈ ఆషాఢానికి పుట్టింటికి వెళుతోంది రేపు..ఈ సారి నిక్కచ్చిగా చెప్పా అన్నీ తీసుకురావాలని” అన్నది కాంతమ్మ.

“అయినా నీ సంగతి తెలిసి వాళ్ళివ్వకుండా ఎందుకుంటారులే..నువ్వసలే నిక్కచ్చైన మనిషివి కదా” అన్నది శాంతమ్మ

“సరే కాని వదినా ఆషాఢ మాసంలో అన్ని షాపుల్లోను బోల్డు బోల్డు సేల్స్ ఉన్నాయి కదా మనం కూడ వెళ్ళి చూసొద్దాం.. వరలక్ష్మీ వ్రతానికి కోడలికి ఒక చీర కొనాలి కదా..కోడలితో పాటు మనం కూడ “అని కిసుక్కున నవ్వింది శాంతమ్మ .

ఇద్దరూ కలిసి ఆ మర్నాడు ” బోడెన్న బ్రదర్స్” కి వెళ్ళారు.. అక్కడైతే ఆషాడానికి 75% సేల్ ఉంది..

షాపులోకి జొరబడ్డారు ఇద్దరూ..షాపులో అన్ని మూలల చీరలూ గుట్టలు గుట్టలుగా పోసున్నాయి. ఇద్దరూ విడివిడిగా రెండు గుట్టల్లోకి జొరబడ్డారు.. చుట్టూ మూగిఉన్న ఆడవాళ్లతోటి కుస్తీ, మల్ల యుద్ధం, ముష్టి యుద్ధం చేసి ఎట్టకేలకి చెరీ నాలుగు చీరలు ఏరుకుని కవుంటర్ దగ్గరికి చేరారు.. జుత్తు రేగిపోయి, బొట్టు చెరిగిపోయి ఆయాసంతో రొప్పుతూ ఇద్దరూ కాష్ కవుంటర్లో డబ్బులు కట్టి ఇంటికి చేరారు..

మర్నాడు ఆ అపార్టమెంట్ బిల్డింగ్లో ఉన్నవారందరినీ పిలిచి తమ చీరలు చూపెట్టారు..

ఆడంగులందరూ ఎంత బావునాయి ఈ చీరలు అంటూ మెచ్చుకుని ఎక్కడ కొన్నారొదినా అంటూ ఆ షాపు అడ్రెస్ అదీ తీసుకున్నారు..

ఆ తరువాత ఆషాఢంలో, శ్రావణంలో బోల్డు బోల్డు నోములు చేసుకున్నారు.. ప్రతి నోముకీ ఫెళ ఫెళ లాడే పట్టు చీరలు కట్టుకుని ఒకరికొకరు నీ కంటే నేనే గొప్ప అని చూపించుకున్నారు, ఒకరి గురించి మరొకరు చెవులు బాగ కొరుక్కోవడమే కాక తినేసుకున్నారు..
తమ కోడళ్ళని ఒకరి కంటే ఒకరు ఎంత బాగా రాచి రంపాన పెడుతున్నారో తెలుసుకుని గర్వంతో తలెగరేసుకున్నారు ఆడంగులు.. ఒకామె కోడలికి పురుగులన్నం పెడితే, ఇంకొకామె కోడలి కాఫీలో ఫినాయిల్ కలిపింది. ఇంకొకామె కోడలికి వాతలు పెట్టింది. ఇలా గయ్యాళితనం లో తమని మించిన వారు లేరని మురిసిపోయారు.. కానుకలివ్వమని వియ్యపురాళ్ళని ఎలా పీక్కుతిన్నారో చెప్పుకుని చెప్పుకుని మురిసి ముక్కలైపోయారు.
మొత్తానికి ఆషాఢం, శ్రావణం ఇలా హడావిడిగా సందడిగా, హాయిగా జరుపుకున్నారు.. వీళ్ళ వ్యవగారం తెలిసిన మొగుళ్ళెవ్వరూ నోరెత్తలేదు.. నోరు తెరిస్తే వాతలు పడతాయన్న భయంతో…

1 thought on “వెటకారియా రొంబ కామెడియా 11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *