May 6, 2024

పితృదినోత్సవం

రచన: కట్టమూరి కిషోర్ కుమార్

kattamuri kumar
ఇంటర్నెట్ అనే ఒక సాధనాన్ని కనుగొనబడడం దరిమిలా సోషల్ నెట్వర్క్ మీడియాల ప్రభంజనం వల్ల గత అయిదు ఏళ్లలో ఎన్నో గొప్ప విషయాలు జన బాహుళ్యానికి తెలిశాయి, అవే కాక ప్రతి సందర్భాన్ని పురస్కరించుకుంటూ ఒక రోజును జరుపుకోవడం లేదా గుర్తు చేసుకోవడం లాంటి చక్కని సంస్కృతి కూడా ప్రభలంగా విస్తరించింది, అలాగే జూన్ 21 న అంతర్జాతీయ పితృ దినోత్సవం జరుపుకోవడం కూడా.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ పితృ దినోత్సవాన్ని సోనార స్మార్ట్ డోడ్ అనే ఒక అమ్మాయి తన తల్లి మరణించిన తరువాత తన ఆరుగురు తోబుట్టువులను కంటికి రెప్పలా కాపాడి పెంచి పెద్ద చేసిన తన తండ్రి గౌరవార్ధం మొట్టమొదటి సారిగా 19 జూన్ 1910 న జరుపుకున్నారని తెలుస్తోంది, ఆ తరువాత వాషింగ్టన్ నగర ఇంచార్జ్ ఆ సందర్భాన్ని అధికారికంగా అనుమతించడంతో అప్పటినుండి ఈ పితృ దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకుంటున్నారు.
ఈ పితృదినోత్సవాన్ని పురస్కరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాధ్యతాయుతులైన మంచి తండ్రులందరికి శుభాకాంక్షలు తెలుపుకోవడం ఒక సాంప్రదాయంగా మారింది. అయితే ఇక్కడ ఉదహరించిన బాధ్యతాయుతులైన మంచి తండ్రులు అంటే ఎవరు? వారెలా ఉంటారు? లేదా ఏమి చేస్తే మంచి తండ్రులవుతారో తెలుసుకోడానికి ఇదొక మంచి సందర్భం.
అలా తెలుసుకునే ముందు అసలు బిడ్డ యొక్క పరిణామ క్రమపు ఆంత్రోపాలజీ ని గమనించడం విధాయకం, భూమిమీద పుట్టే ప్రాణి కోటిలో ఒక్క మానవజాతిలోనే పుట్టిన బిడ్డకు కొన్ని సంవత్సరాల దాకా సంరక్షణ అవసరమవుతుంది, బిడ్డ పుట్టిన క్షణం నుంచి తొమ్మిది నెలల వయసు వచ్చేవరకు తల్లి ఒడిలోనే ఉండడం లేదా తల్లిని మాత్రమే గుర్తు పట్టడం జరుగుతుంది. ఆ సమయంలోనే బిడ్డను ఆడించడానికి, లాలించడానికి తల్లి వాడే పదాలు మాతృభాషగా పరిణామం చెందాయని ఆన్త్రోపాలజిస్టులు తెలిపారు, అలా (భాషను) పదాలను ఉపయోగిస్తూ ఆదిమానవులు గుహలలో నివసించే కాలంలో బిడ్డను తండ్రికి లేదా తండ్రిని బిడ్డకు పరిచయం చేసేది తల్లి. బిడ్డకు పరిసరాలను గుర్తించే వయసు వచ్చిన నాటినుండి స్వతంత్రంగా జీవించే వయసు (ఆహారాన్ని సంపాదించుకునే వయసు) వచ్చేదాకా ఆ తండ్రి బిడ్డకు సంరక్షకుడిగా ఆహార సంపాదనకు అవసరమైన వేట నేర్పే గురువుగా ఉండేవాడు.
మనిషి ఆటవిక దశనుంచి బుద్దిజివుడిగా మారిన క్రమంలో బిడ్డ జీవితంలో ఒక్క తండ్రే కాక మరికొంతమంది ఆవశ్యకత ఏర్పడింది. చాణుక్యుడు ఉటంకించిన దానిని బట్టి ఎవరెవరిని తండ్రిగా గౌరవించాలో ఈ క్రింది విధంగా చెప్పబడింది

అన్నదాతా భయత్రాత,యస్య కన్యా వివాహిత
జనిత చౌపనేత చ, పంచైతే పితరః స్మృతః

అనగా
1. అన్నదాత : ఆకలేసినపుడు అన్నం పెట్టి ప్రాణం నిలబెట్టిన వారు తండ్రిగా గౌరవింపదగినవారు
2. భయత్రతా : జీవితపు ప్రయాణంలో ఎదురయ్యే ధన, మాన, ప్రాణ హాని సమయంలో కాపాడినవారు తండ్రిగా గౌరవింపదగినవారు
3. కన్యాదాత : ఒక వ్యక్తి (మగవాడు) తండ్రిగా మారగలిగే భాగ్యాన్ని కలిగించగలిగే కన్యను భార్యగా ఇచ్చిన వ్యక్తీ (మామగారు) తండ్రిగా గౌరవింపదగినవారు
4. జనిత : జన్మనిచ్చిన/ ఉద్యోగమిచ్చిన/బ్రతుకు తెరువు నేర్పిన వారు తండ్రిగా గౌరవింపదగినవారు
5. ఉపనేత చ: మంత్రోపదేసము చేసిన వారు/విద్యా బుద్దులు నేర్పినవారు తండ్రిగా గౌరవింపదగినవారు

పై వాటిలో ఒక్క కన్యాదానము తప్ప మిగిలిన ఆన్ని భాద్యతలను ఒకే వ్యక్తి ఏకకాలంలో నిర్వర్తించగలిగితే వారే ఉత్తమ తండ్రులు. ఈ విషయాన్ని మరింత విశ్లేషనాత్మకంగా తరచి చూస్తే…..

పిల్లలు శైశవ దశ నుంచి కౌమారము దాకా వినడం, చదవడం ద్వారా కాక అనుకరణ ద్వారా ఎక్కువ విషయాలు గ్రహిస్తారు అని, కౌమారము నుంచి యుక్త వయసు దాకా తాము ఇష్టపడే వారిని అనుసరిస్తారని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ మానసిక శాస్త్రవేత్తలు అంగీకరించే విషయం, ఒకతరం నుంచి మరోతరం తాను పుట్టి పెరుగుతున్న కుటుంబం నుంచి అనుకరించేదే “జీన్స్” అని అనుకోవచ్చు. అనగా కుటుంబ పెద్దగా ఒక తండ్రి భాద్యతాయుతమైన నడవడిక తరువాతి తరానికి అలవాటు అవుతుంది అన్నది విశదమవుతోంది. కాలక్రమేణా మనిషి బుద్ది జీవుడు అవుతున్నకొద్దీ బిడ్డకు జీవన విధానాన్ని నేర్పడంలోను, జ్ఞాన సముపార్జనలోను బాధ్యతాయుతులైన పౌరులుగా మెలగడంలోనూ ఆ తండ్రి బిడ్డకు మార్గదర్శిగా ఉండడం మొదలయింది.
తప్పటడుగులు వేస్తూ నడక నేర్చుకునే దశలో ఉన్న బిడ్డకు సంరక్షకుడిగా, విద్యార్జన అన్నది కష్టంగా కాక ఇష్టంగా మార్చే క్రమంలో గురువుగా, తప్పు చేసినపుడు దండించే దశలో భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటూ మంచిని ప్రభోదించి తప్పు చెయ్యడం వల్ల వచ్చే చెడు పరిణామాలను మాత్రమే తెలియజేసి సన్మార్గంలో నడిపించే దశలో ప్రవచనకర్తగా, యుక్తవయసులో జీవనోపాధికి అవసరమయ్యే విజ్ఞానాన్ని విపులీకరించే దశలో సమకాలీన మిత్రుడిగా, నడివయసులో వచ్చే ఇబ్బందులను చాకచక్యంగా ఎదుర్కోవడంలో సలహానివ్వగలిగే చతురునిగా ఉంటూ ఒక మనిషి జివక్రమంలో తండ్రి పాత్ర అత్యంత కీలకం. అనగా తండ్రి తన సమయాన్ని పిల్లలకోసం వెచ్చించడం అన్నది ఖచ్చితంగా అవసరం. అందుకే ప్రపంచంలో ఏ గొప్ప వ్యక్తి చరిత్ర చూసినా ఆ వ్యక్తి యొక్క తండ్రి తన సమయాన్ని పిల్లలతో గడుపుతూ వారిని విజయం వైపు నడిపించడం చూస్తాం. అందువల్లనే అపర కుబేరులైన వారి వారసుల తండ్రులు ధనార్జనలో పడి పిల్లలకోసం సమయాన్ని కేటాయించలేని తండ్రుల సంతానం అందువల్లే కొంత శృతి తప్పిపోవడాన్ని ఈ మధ్య గమనిస్తున్నాం.
సంస్కృతం లో భగవంతుడిని ప్రార్ధించుకునే ఒక శ్లోకాన్ని ఒక పాదం మార్చడం ద్వారా తండ్రి తత్వాన్ని ఇలా చెప్పుకోవచ్చు

త్వమేవ భందుస్చ సఖా త్వమేవ
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ
త్వమేవ సర్వమ్ మమ దేవదేవ
త్వమేవ ప్రియతం త్వం మమ పితః
అనగా
నీవే నా బంధువు, నీవే నా స్నేహితుడు
నీవే నా జ్ఞానము నీవే నా ఐశ్వర్యము
నీవే నా సర్వస్వము నీవే నా దేవుడు
నీవే అత్యంత ఆప్తుడవు/ఇష్టుడవు – నీవు నా తండ్రివి

ఇలా ఎవరి బిడ్డలయితే అనుకోగలరో ఆ తండ్రినే మంచి తండ్రి లేదా భాద్యతాయుతుడైన తండ్రి అనవచ్చు – ఇలా బిడ్డలచే కీర్తించబడాలంటే ఆ తండ్రికి సహనము, సమయస్పూర్తి, సంయమనము మెండుగా ఉండాలి. అంతే కాక బిడ్డల కోసం ఖచ్చితంగా సమయాన్ని కేటాయించగలగాలి, తన ఇంటిలో బిడ్డల ఎదుగుదలకు అవసరమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరచగలగాలి, తాను సమకుర్చలేని వాటిని గురించి ఏంటో సంయమనంతో బిడ్డలకు విశదికరించాగాలగాలి, ఇవన్ని అనుకున్నంత సులభంగా అలవడవు కాబట్టే ప్రపంచంలో కొంతమందే మంచి తండ్రులు కాగలిగారు. మిగిలినవారు తండ్రులులుగా మాత్రమే మిగిలిపోయారు.

3 thoughts on “పితృదినోత్సవం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *