May 4, 2024

అల్విదా నేస్తం

రచన: వడ్లమాని బాలా మూర్తి

“లాస్యా! ఓ లాస్యమ్మా లేవవే తల్లీ. నాలుగైపోయింది లే లేచి స్నానం చేసిరావేమ్మా. కోత్త పట్టుచీర మార్చుకోకుండానే పడుక్కు నిద్ర పోయావు…రేపు అత్తవారింట్లో ఇలా చేస్తే ….పిల్లకి ఏమీ నేర్పలేదని నన్నే ఆడిపోస్తారు.”అని లలిత, కూతుర్నిలేపుతూ.
“అబ్బా, ఉండమ్మా.”
“చూడు లాస్య, ఆరున్నరకి పీటలమీద కూర్చోవాలట. నువ్వు ఇలాగే నిద్ర పోతూంటే, ఇంక చీర మార్చక్క ర్లేదు పూల జడ కుట్టక్కర్లెదు. ఆ పైన నీ ఇష్టం”
“ఏమైంది అంటి?”
“రా శాంతి. లాస్య లేవట్లేదు. గురువుగారు వచ్చే వేళైంది”.
“మీరెళ్ళి మీ పని చూసుకోండి నేను లాస్యను లేపి తయ్యారు చేస్తాను. అదిగో వనజ కూడా వచ్చేసింది.”
కామేశ్వరరావు, లలితల ఏకైక పుత్రిక లాస్యప్రియ. క్రితం రాత్రీ లాస్యప్రియకు శ్రీధర్ కు వివాహం అయింది. శోభనం ఆడపెళ్ళి వారింట్లో జరగాలనే ఆనవాయితీ వల్ల, వధూవరులని వదిలి మొగ పెళ్ళివారు కూడా వెళ్ళిపోయారు. శాంతి, వనజ కాకుండా ఇంకో ఐదారుగురు మిత్రురాళ్ళు, కలిసి లాస్యని అలంకరిస్తున్నారు. కన్నెపిల్లలు కలిస్తే ఇంక వాళ్ళ కబుర్లకీ, వేళాకోళాలకీ అదుపేముంది!
“అబ్బబ్బా…కొంచెం కదలకే మహాతల్లీ, నీ జడవెయ్యాలంటేనే ఒక మహా యజ్ఞం, ఇంకా దాంట్లో నిన్నటి హడావిడిలో అంతా చిక్కు పడిపోయింది”.
“జుట్టంతా అలా పికేస్తుంటే నాకు నొప్పి పుడుతోందే, రాక్షసీ… నేనే చిక్కు తీసుకుంటా వదిలేయ్.”ఆ పువ్వు లన్నీ నా జడకి కుట్టవద్దు”
“జాజుల్లాంటి పువ్వులు, భలే ఉన్నాయే. ఏం ఘుమఘుమలడు తున్నాయో ! మాకే మత్తుగా ఉంటే ఇంక ఆ మహానుభావుడికీ …” గొల్లున నవ్వులు. “ఏయ్ నోరు మూస్తారా” అని ముఖం ఎర్రగా కందిపోతుంటే లేచిపోతున్న లాస్యని కూర్చోపెట్టి, అందరూ కలసి అలంకరణ ముగించీ, ఛలోక్తులతో తీసికెళ్ళి టెర్రేస్ పైన వదిలి తలుపులు వేసి వెళ్ళారు.
ప్రతీ కన్నెపిల్లకీ కలిగే తడబాటు, ఉద్వేగం, భయం ఆనందం, లాస్యని కుడా ముప్పిరిగొన్నాయి, తడబడే అడుగులతో ముందుకు అడుగు వేసింది. తెల్లని పాల మీగడలాంటి చీర ఆమె మేని రంగుతో పోటీపడుతోంది. నాగుపాములాంటి జడ ముందుకు వేసుకొని, తలనిండా జాజి మాలలతో, గాజులు గలగలలతోభువికి దిగిన దేవకన్యలా మెరిసిపోతోంది. శ్రీధర్ ఆమెను చూడగానే చటుక్కున లేచి ఆమెకి ఎదురు వచ్చాడు. తెల్లని కుర్తా పైజామాలో, అతడు ఆమెకి ధీటుగా అందంగా ఉన్నాడు. “హాయ్ ప్రియా! నా జీవితంలోకి స్వాగతం, సుస్వాగతం!” అని చేయి అందించ్చాడు. ఆమె కుడా సిగ్గుపడుతూ మెల్లిగా తన చేయి అతనికి అందించింది. ఇద్దరికీ ఒక కొత్త కలయిక, ఒక కొత్త అనుభవం!
శుక్లపక్ష ఏకాదశి వెన్నెల్లో, చుట్టూ రకరకాల చెట్లతో, లతలతో చాలా ఆహ్లాదంగా ఉంది. , లాన్ మధ్యలో ఉన్న పెద్ద చెక్క ఉయ్యాల మీద తెల్లటి దుప్పటి బాలీసులతో, పైన రంగురంగుల పూలతో అలంకరించారు. ఇద్దరూ కలిసి ఉయ్యాల పై, ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఆమె బిడియం వదలి, కొంచెం రిలాక్స్ అయి, అతనితో తన కాలేజీ విషయాలు, సినిమా కబుర్లు చెప్పసాగింది. అతనుకూడా తన జాబ్ గురించీ, ముంబైలో జీవితం గురించి వివరించాడు. ఇలా మాట్లాడుతూ ఆమెకి దగ్గరగా జరిగి, ఆమె చేతుల గాజుల్ని సవరిస్తూ ఆమె బుగ్గల్ని చుంబించాడు. ఆమె ఏమీ అనకపోవడంతో మెల్లిగా తన కౌగిలిలో తీసుకొని గాఢంగా చుంబించాడు. ఆమెను మెల్లిగా లేపి అక్కడే ఉన్నగదిలోకి నడిపించి తీసుకెళ్ళాడు. ఆమె కూడా మత్తుగా అతని పరిష్వంగంలో కరిగిపోతూ అతనితో గదిలోకి నడిచింది. ఆమెని జాగ్రత్తగా, పందిరి పట్టెమంచం మీద పడుక్కోబెట్టి , తలుపులు వేసి, లైట్ తీసి, ఫ్యాన్ వేసి వచ్చీ ఆమె పక్కన కూర్చొని, ఆమె తలనీ రెండు చేతులతో పట్టుకోని, ఆమె పెదవులను అందుకునేందుకు ఆత్రంగా వంగేడు…….. లాస్య ఒక్కసారి కట్టేలా బిగుసుకు పోయి, కెవ్వు కెవ్వుమని అరవడం మొదలు పెట్టింది. ఈ హటాత్ చర్యకు, శ్రీధర్ ఆమెను విడిచి కంగారుగా లేచి లైట్ వేసి ఆమెను కుదుపుతూ “ ఏమైంది ప్రియా? లే లే” అన్నాడు. అయినా అరుస్తూనే ఉంది. ఇంతట్లోకి లలిత పరిగెత్తుకొచ్చి తలుపు తట్టసాగింది. శ్రీధర్ వెళ్ళి తలుపు తీసి బిక్క మొహం పెట్టి “నేనేమీ చెయ్యలేదత్తయ్యగారూ ! ఇప్పటి దాకా బాగానే ఉందీ, ఇప్పుడే లోపలికొచ్చేము. నేను దగ్గరకు రాగానే ఇలా అయిపొయింది’
“నువ్వేమీ కంగారు పడకు బాబూ! తనకి అప్పుడప్పుడు పీడకలలు వస్తాయి”, అని లాస్య ముఖం మీద నీళ్ళు జల్లుతూ “లాస్యా! లేమ్మా” అని ఆమెని పట్టుకుని తీసికెళుతూ….”బాబూ నువ్వేమనుకోకు. పెళ్ళి హడావిడిలో బాగా అలిసిపోయింది. రేపటికి బాగా అయిపోతుంది! నీకు ఆశాభంగం కలిగినందుకు సారీ! కొంచెం పెద్ద మనసు చేసుకొని, క్షమించు నాయనా! ఈ విషయం అందరికీ తెలిసే లోపులో నేను తీసికెడతాను”, అని గబా గబా లాస్యను తీసుకొని వెళ్ళిపోయింది. శ్రీధర్ కి నీరసం ముంచుకు రాగా అలా సోఫాలో రాత్రంతా పరిపరి విధాల ఆలోచిస్తూ గడిపేసాడు.
మర్నాడు పొద్దున్న లాస్య తిరిగి మాములుగా, నవ్వుతూ అతనితో మాట్లాడసాగింది.’సారీ శ్రీధర్, మీతో మాట్లాడుతూ, తెలియకుండానే నిద్ర పట్టేసింది. మీరు పడుకున్నట్లు లేదు! ఏమీ మాట్లాడటం లేదు, కోపం వచ్చిందా?’ అని అమాయకంగా అడుగుతూ ఉంటే… పాపం నిజంగానే అలిసిపోయి రాత్రీ అలా బిహేవ్ చేసిందేమో…..అని. “పద తొందరగా అమ్మా వాళ్ళింటికి వెడదాం. వ్రతం అయ్యాక లంచ్ చేసీ, సాయంత్రం ఆరింటికి ముంబై ఫ్లైట్ తీసుకోవాలి.’ అని తొందర పెట్టేడు.
సాయంత్రం ఆరింటికి ఫ్లైట్ ఎక్కీ కూర్చున్నాక కబుర్లు చెబుతూ నిద్ర పోయింది లాస్య. అందరినీ విడిచివచ్చేస్తుంటే, బెంగ, బాధతో అలిసిపోయింది. విమానం దిగి టాక్సీలో అంధేరీ ( వెస్ట్) లోనీ ఆనంద్ హౌసింగ్ సొసైటీలోని నాలుగో అంతస్తు ఫ్లాట్ కి వెళ్ళారు. లాస్యకు విమానంలో ప్రయాణం దగ్గర్నించి ముంబై వీధులు, ఆరంతస్తుల బిల్డింగ్, లిఫ్ట్ లో ఫ్లాట్ దాకా వెళ్ళడం అంతా కొత్తగా అనిపించడంతో, విచిత్రంగా చూస్తూ, శ్రీధర్ చేయి విదలకుండా పట్టుకుని నడిచింది.
అతని స్నేహితులు ఇల్లంతా సర్ది, అన్ని సదుపాయాలు చేసి పెట్టి వెళ్ళారు. ఆ రోజు రాత్రి ఇద్దరూ అలసిపోయి ఉండడం వల్ల నిద్ర పోయారు. మర్నాడు ఇద్దరూ కలిసి జుహూ బీచ్ కి వెళ్లి వచ్చేరు. రాత్రీ మళ్లీ యథాతథంగా, అతడు ఆమె మీదకు వొరిగినంతనే, ఆమె కెవ్వు మని కేకలెయ్యడం, అతడు మెల్లిగా మంచినీళ్ళు తాగించి బుజ్జగించి పడుకోబెట్టడం జరిగింది. ఇదే అనుభవం ఇంకో రోజు కూడా జరగడంతో అతడు ఆమెకు దూరంగా మెలగసాగాడు.
లాస్య ఇల్లు సర్దుకోవడం, రుచిగా వండి పెట్టడం వగైరాలు చాలా చక్కగా చేసుకొనేది. నెల్లాళ్ళు అయినా వాళ్ళ సమాగమం జరుగలేదు. శ్రీధర్ కి ఈ పరిస్థితి ఎలా పరిష్కరించుకోవాలో అర్ధమవలేదు. చాలా చికాగ్గా తయ్యారయ్యాడు. ఆఫీస్ పని కూడా అన్యమనస్కంగా చేసుకుపోయేవాడు. లాస్యకూడా పెళ్ళి అయ్యాక ఏమౌతుందో తెలియంది కాదు. పెళ్ళంటే ఉత్తి ముద్దులు పెట్టుకోవడం, కౌగిట్లో తీసుకొవడమేనా?! తననుంచి శ్రీ ఎందుకు దూరంగా ఉంటున్నాడు? ఈ మధ్య కొంచెం ముభావంగా, విసుగ్గా ఎందుకుంటున్నాడూ? తనకూ అంతలా నిద్ర ఎందుకు వచ్చేస్తోందీ?…అనే ఆలోచనలో పడింది. ఏదో మిస్సింగ్ అనే భావన కలగసాగింది! అలా ఆలోచిస్తూ తను కూడా కలత చెంద సాగింది.
శ్రీధర్ బాల్య మిత్రుడు సహాధ్యాయి అయిన సుమీత్ దాతార్, అతని వాలకం చూసి, అతన్ని తన ఇంటికి తీసికెళ్ళి కారణం అడిగితే, ఏమీ లేదని మాట దాటవేసేడు. గుచ్చి గుచ్చి అడిగితే, విషయమంతా వివరించాడు. “ఒరేయ్! కొత్తగా పెళ్ళైనవాళ్లు కదాని, మీ ఏకాంతాన్ని డిస్టర్బ్ చెయ్యడం ఎందుకని, నేను నిన్నుకలవలేదు. ఇలాంటి విషయం నా దగ్గర చెప్పడానికీ, ఇంత ఆలోచనా? చూడు శ్రీ! ఆ అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం ఏమో! అరే మర్చిపోయాను! మా సునీల్ దాదా ఉన్నాడుగా, వెళ్లి కలుద్దాం”
“దాదాకి ఎలా చెప్పడంరా? నాకైతే ఇష్టం లేదు” “చూడు శ్రీ! మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మన ఇంట్లో వాళ్ళకి చెబితే మంచిది కదూ! రేపు దాదాకి ఫోన్ చేసి ఏవిషయమూ నీకు చెబుతా”. అన్నట్లుగానే ఆదివారం పొద్దున్న పది గంటలకి అప్పాయింట్మెంట్ తీసుకునీ శ్రీధర్, లాస్యలని కలవమని చెప్పేడు.
సునీల్ దాతార్, సుమీత్ కి పెద్దన్నగారు, ముంబైలోని లీడింగ్ కౌన్సిలర్ & సైకియాట్రిస్ట్! శ్రీధర్ లాస్యలు, దాదర్లో ఉన్న అతని క్లినిక్ కీ, చేరుకోగానే, “మనం ఇక్కడకెందుకు వచ్చేము”? “నీకు పీడకలలు వస్తున్నాయి కదా, ఒకసారి డాక్టర్ కి చూపిస్తే మంచిదనీ తీసుకువచ్చాను. ఇతను మన సుమీత్ కి పెద్దన్నయ్యే కలిసినట్లు ఉంటుంది”.
లోపలి వెళ్ళగానే రమ్మని పిలుపొచ్చింది.”హల్లో రండిరండి! ఏమ్మా ఎలా ఉంది మా ముంబై? కూర్చోండి. ఏం శ్రీ నెల్లాళ్లై వచ్చీ, అమ్మాయిని ఇప్పుడా తీసుకురావడం? ’నీ పేరు యేమిటమ్మాయ్”? అని నవ్వుతూ మాట్లాడేసరికి, లాస్యకి కొంచెం బెరుకు తగ్గి మాట్లాడసాగింది. ఇద్దరూ కొంచెం రిలాక్స్ అయిన తర్వాత, ముందు శ్రీధర్ ని విడిగా తీసికెళ్ళి సమస్య ఏమిటో కనుక్కున్నాడు. తర్వాత లాస్యప్రియని విడిగా లోపలి రూమ్ లోకి తీసికెళ్ళాడు.
‘నీకు ఏవో పీడ కలలు వస్తున్నాయన్నావు కదా, అవి ఎప్పుడు వస్తాయి? ఏమైనా చెప్పగలవా లాస్య’? “చిన్నప్పుడు చాలా సార్లు వచ్చేవి, తర్వాత చాలా తగ్గాయి. ఈ మధ్య అంటే…..పెళ్ళైనప్పటి నుండీ ఎక్కువయ్యాయి. సాదారణంగా నేను అలిసిపోయి పడుకున్నప్పుడు, లేకపొతే ఏదైనా ఎక్సైట్ అయ్యే ఇన్సిడెంట్ జరిగినప్పుడు వస్తాయి”.
‘ఆ కలలు ఎలా ఉంటాయి’?
“ఏదో చీకటిగా అయిపోతుంది. భయంకరమైన మొహం నా మీద వంగుని నా కళ్ళల్లోకి గుడ్లురిమి చూస్తున్నట్లు ఉంటుంది, నాకు లోపల్నించి భయం, వణుకూ మొదలౌతుంది. ఆ మొహం ఒకసారి నా ముఖానికి దగ్గరగానూ ఇంకోసారి దూరంగానూ కనిపిస్తుంది. ఆ తర్వాత ఏమౌతుందో నాకు తెలియదు’. ఇది చెబుతూ ఉంటే లాస్య మొహం నిండా చెమటలు పట్టి వణకసాగింది. డాక్టర్ ఆమెకీ మంచినీళ్ళు ఇచ్చి భుజం తడుతూ ‘రిలాక్స్ బేబీ రిలాక్స్! పద మనం శ్రీ, దగ్గరకి వెడదాం. నీకింక ఇలాంటి పీడ కలలు రాకుండా నేను ట్రీట్ చేస్తానుగా. డోంట్ వర్రీ”.
‘వెళ్ళండి. శ్రీ, ఈ టాబ్లెట్స్ రోజుకీ రెండు సార్లు వెయ్యి. మళ్లీ వచ్చే శనివారం సాయంత్రం నాల్గింటికి వచ్చెయ్యండి, తిరిగి కౌన్సిలింగ్ చేస్తాను. ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే షీ విల్ స్టార్ట్ ఫీలింగ్ బెటర్ “.
ఈ ట్రీట్ మెంట్ ఇంకో రెండు నెలలు నడిచాయి. లాస్యలో పెద్ద తేడా రాలేదు. డాక్టర్ శ్రీధర్ని ఒంటరిగా పిలిచి ‘చూడు శ్రీ, వీలైతే లాస్య వాళ్ళ అమ్మగారిని పిలు. ఆవిడతో మాట్లాడితే, ఈ కేస్ లో ముందుకు పోవచ్చు’ అన్నాడు. శ్రీధర్ మెల్లిగా వాళ్లత్తగారికి విషయం తెలియజేసి తొందరగా రమ్మన్నాడు.
ఒక వారం తర్వాత లలిత, పిల్లని చూసొస్తానని, ముంబై చేరుకొంది. తల్లిని చూసి లాస్య సంతోషంతో, ఆమెని హత్తుకుపోయింది. శ్రీధర్, లలితని డాక్టర్ సునీల్ దగ్గరకు తీసుకెళ్ళాడు. డాక్టర్ శ్రీని బయటకు పంపి, లలితతో హిందీ , ఇంగ్లీష్ కలిపి మాట్లాడ సాగాడు. “పిల్లకు చిన్నప్పుడు ఏమైందీ?”
‘పాప. చిన్నప్పుడు ఎందుకో దడుచుకుంది, అప్పటినించీ ఇలాగే భయపడుతుంది. మా ఊళ్ళోని డాక్టర్ కి కూడా చూపించాము. కొంచెం తగ్గింది గానీ పూర్తిగా పోలేదు” అంది.
“అమ్మా మీరు ఏదో దాస్తున్నారు. పిల్లకు చిన్నప్పుడు ఏమైందీ?” ‘ఏమీ కాలేదు’. “చూడండీ, మీరు పెద్దవారు, మీకు తెలిసే ఉంటుందీ, పిల్లలకీ పెళ్ళైతే అయిందిగానీ వారిద్దరూ ఇప్పటి దాకా దంపతులు కాలేదు. మీ అల్లుడు మంచివాడు. లేకపోతే ఏమయ్యేదో మీకు తెలుసు. దయచేసి, ఏదీ దాచకుండా చెప్పండి”.
లలిత ఏడవడం మొదలు పెడుతుంది. కొంచెం సంభాళించుకొని చెప్పసాగింది.‘ఈ విషయం బైట పడితే నా జీవితం నా కూతురి జీవితం, నాశనమై పోతుంది డాక్టర్! నా భర్త, నా అల్లుడూ మా మొహాలు చూడరు”.
”అమ్మా మీరు చెప్పేది ఈ గది దాటి బయటికి వెళ్ళదు అని హామీ ఇస్తున్నాను”.
ఆమె ట్రాన్స్ లోకీ వెళ్ళినట్లు కళ్ళు మూసుకొని చెప్పసాగింది. “మేము అంబాజీ పేట, తూర్పు గోదావరి జిల్లాలో ఉండేవాళ్ళం. మా పాపకి ఐదేళ్ళు వచ్చేదాకా చాలా సంతోషంగానే గడిచింది. ఆయనకీ కొబ్బరి కాయల వ్యాపారం ఉంది. ఆయన అక్కడే వ్యాపారం చేసేవారు. ఆ తర్వాత వ్యాపారానికై వేరే ఊళ్ళకి తిరగడం మొదలుపెట్టారు. నెలలో వారం పది రోజులు బయటుండేవారు. మా బావగారు ఊర్లోని వ్యవసాయం, వ్యాపారం సంభాళించే వారు. మా వారి తల్లితండ్రులు చిన్నప్పుడే పోయారు, అన్నగారే పెళ్లి చేసుకోకుండా, ఈయన ఆలనా పాలనా చూసుకున్నారు. అందుకే అన్నగారంటే ఈయనకు భక్తి, గౌరవం. అన్నగారి మాటను జవదాటరు. ఆయన కూడా వ్యవహార దక్షత కలవారు. ఊర్లో అందరికీ ఆయనంటే గౌరవం, ఆయన దగ్గర సలహాలు తీసుకునేందుకు వచ్చేవారు. కానీ …. ఓహ్ ఏం చెప్పనూ….? అతడి దృష్టి నాపై పడింది. నన్ను కోరుకున్నాడు, బలవంతం చేసాడు! ఎవ్వరితో చెప్పుకున్నా ఎవ్వరూ నమ్మరు…. అదే అతడి ధైర్యం. నా జీవితం నాశనమై పోతోందని బాధ, నా భర్తకీ అన్యాయం చేస్తున్నానే అన్న ఆవేదన… ఓహ్ నరకం అనుభవించాను! ఇంతట్లోకి ఆ త్రాష్టుడి కళ్ళు నాకూతురి పై పడ్డాయి. నేనెంత మొత్తుకున్నా వినకుండా పసితనం వీడని, ఆ పసిమొగ్గ పై దౌర్జన్యం చేయడానికి వెనకాడలేదు. వావి వరుసలు కూడా మర్చి పోయాడు! పిల్ల ఏడుస్తున్నా పట్టించుకోకుండా గదిలోకి తీసుకెళ్ళి, తలుపు గడియపెట్టి, సీలింగ్ ఫ్యాన్ వేసుకొని ఆ పసిపిల్లను అనుభవించాడు. ఆ పిల్ల భయంతో గడ్డకట్టుకు పోయి, స్పృహ లేకుండా పడిపోయింది. రక్తస్రావం జరుగుతుంటే నా స్నేహితురాలైన డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళి, పిల్లకి వైద్యం చేయించాను ఇలా రెండు మూడు సార్లు జారిగింది. పాప గదిలోకెళ్ళాలన్నా, గడియ వేసినా భయపడిపోయేది. ఇంకా ఈ విషయాన్నీ దాచకూడదనుకొని, మావారితో చెప్పేద్దామనీ నిశ్చయించుకున్నాను. ఇంతట్లోకి మా బావగార్ని పొలంలో నాగుపాము కరిచి, సమయానికి వైద్య సహాయం అందక, మరణించారు. నా భర్త దుఃఖం వర్ణనా తీతం! స్థలమార్పు కోసం, పిల్ల చదువు కోసం అని మేము హైదరాబాద్ వచ్చేసాము. పిల్లకి వైద్యం చేయించాక, మెల్లిగా జరిగినది మర్చిపోయి మామూలు మనుషుల్లో పడింది. అప్పుడప్పుడు పీడ కలలోస్తుంటాయి. ఇప్పుడు చెప్పండి డాక్టర్! నేనేం చెయ్యాలి!” అనీ భోరుమని ఏడవ సాగింది. ఆమెని ఓదార్చి “ఏమీ భయపడకమ్మా! జరిగినది చాలా దారుణం..! ఈ విషయం మనిద్దరి మధ్యే ఉంటుంది. దీని గురించి మర్చిపోండి. మీరు కొంచెం ముఖం కడుక్కొని రండి. మిగతాది నేను చూసుకుంటాను, మీరు ధైర్యంగా ఉండండి”. అని ఆమెని పంపించేసాడు.
లాస్యప్రియ పీడ కలలకి మూల కారణం తెలుసుకున్న డాక్టర్ సునీల్ దాతార్, తన ట్రీట్మెంట్ విధానం మార్చి, ఆమెకు ట్రీట్ చెయ్య సాగాడు. మూడు నెలలు గడిచి పోయాయి కానీ లాస్య దాంపత్యానికి సుముఖురాలు కాలేక పోయింది. దంపతులిద్దరిలోనూ ఒక రకమైన నిరాశక్తత, విసుగూ మొదలైయ్యాయి.
మార్పు ఉంటే బాగుంటుందేమో అని లాస్య తన తల్లి తండ్రులను కలవడానికి హైదరాబాద్ వెళ్ళలని నిశ్చయించుకొని శ్రీధర్ తో చెప్పి బయలుదేరుతుంది. లాస్య రాక తండ్రికి చాలా ఆనందాన్నీ ఇస్తుంది. “రామ్మా రా. అల్లుడుగారు రా లేదా? ఏమ్మా అలా చిక్కి పోయావూ! “ అని ఆప్యాయంగా పలకరించాడు. రెండు రోజులు సరదాగా గడిపేక లాస్యకి శ్రీధర్ లేకుండా పుట్టింట్లో తోచలేదు.
“ఎలా ఉన్నారే అమ్మడూ? మీ సంసారం బాగానే నడుస్తోందా?”
“ బాగానే నడుస్తోంది. ఏం ఎందుకు అలా అడిగావు? అన్నట్లు నువ్వు ముంబై వచ్చినప్పుడు డా. సునీల్ దగ్గరకు నువ్వు ఎందుకు వెళ్ళేవు? అప్పుడే అడుగుదామనుకున్నాను, వీలు కుదరలేదు.”
“ ఏమి లేదే!”
“ఇదుగో నువ్వు ఏదో దాస్తున్నావు. నిజం చెప్పమ్మా నాకు ఈ పీడ కలలు ఎందుకు వస్తున్నాయి? నా సంసారం సజావుగా సాగాలంటే, నువ్వు నిజం చెప్పితీరాలి లేక పొతే నా మీదొట్టే.”
“ ఏం చెప్పనే తల్లీ! చిన్నప్పుడు …..”, అని జరిగిన అత్యాచారం గురించి చెప్పి, ఏడవసాగింది. లాస్య విషయం విని, షాక్ తో నోట మాట రాక, స్తబ్దుగా ఉండిపోయింది. రెండు రోజులు తిండి నిద్రా లేకుండా, ఆలోచిస్తూ గడిపేసింది. మెల్లిగా గుండె దిటవు చేసుకొని, ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం ఆలోచించాలని ఒక నిర్ణయానికి వచ్చింది. తాను ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్ళడానికి నిశ్చయించుకొని, దానికి కావలసిన వివరాలు తెలుసుకొని, పంపవలసిన అప్లికేషన్లూ, సర్టిఫికెట్లు అన్నీ పంపించింది. శ్రీధర్ కి ఫోన్ చేసి “శ్రీ ఎలా ఉన్నారూ! నేను హయ్యర్ స్టడీస్ కి యూఎస్ వెడదాం అనుక్కుంటున్నాను.”
“ ఏం ఇప్పుడు చదువు అవసరమా?”
“ అలా అని కాదు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నా ఏమీ మార్పు లేదు.“
“ ఏం నా నించి పారిపోతున్నావా?”
“ అబ్బెబ్బే అదేంకాదు. దూరంగా ఉంటే నాలో ఏమైనా మార్పు వస్తుందేమో చూద్దామని.”
“ నీ ఇష్టం వెళ్లిరా.”
తనకు పై చదువులకై యూఎస్ వెళ్ళే ఉద్దేశం ఉందనీ, భర్త అనుమతితోనే వెడుతున్నానని, కావలసిన ధన సహాయం చేయవలసిందిగా తండ్రిని కోరింది. తండ్రిని వప్పించి లాస్య ముంబై తిరిగి వచ్చింది. ముంబై రాగానే సుమీత్ ని కలసింది.
“ హయ్ ప్రియా! హాలిడే ఎలా ఎంజాయ్ చేసావు?” బాగానే అని తల ఆడించింది. “సుమీత్ దాదా నాకో హెల్ప్ చెయ్యాలి.”
“ చెప్పు,ఏమిటి”?
“నీకు విషయం తెలుసుకదా. నా వల్ల శ్రీకి ఏమీ ఆనందం లేదు . సునీల్ దాదా ఇస్తున్న ట్రీట్మెంట్ వల్ల నాలో ఏమీ మార్పు లేదు. నేను దూరమైతేనే శ్రీ వేరే పెళ్లి చేసుకోవచ్చు. అందుకే నేను ఏంఎస్ చెయ్యడానికి కావలసిన ప్రయత్నాలు చేస్తున్నాను. నాకు నువ్వు ఒక లాయర్ని చూసి పెట్టు. నేను డైవోర్స్ కి కావలసిన పేపర్ వర్క్ చేసివేడతాను. నా ఎం.ఎస్ పూర్తయ్యే సరికి డైవోర్స్ కూడా వస్తుంది. నా రిక్వెస్ట్ ఒక్కటే. ఇవన్నీ జరిగే దాకా అంటే నేను దేశం వదిలే దాకా ఈ విషయం శ్రీకీ తెలియనివ్వకూడదు. ముఖ్యంగా డైవోర్స్ గురించీ. నాకు మాట ఇయ్యి” .
“ఏమిటి ప్రియా ఇలాంటి డెసిషన్ తీసుకున్నావు?! సునీల్ దాదా ట్రీట్మెంట్ పూర్తి అవ్వనీ”.
“లేదు దాదా, నాకు బాగావుతుందని ఏమీ ఆశ లేదు. నేను తీసుకున్న నిర్ణయమే సరైనది. నువ్వు తప్పక నాకీ సాయం చేస్తావనే నమ్మకంతోనే నా నిర్ణయం నీకు తెలిపాను. నా తల్లితండ్రులకు కుడా తెలియదు. ప్లీజ్ ప్రామిస్ మీ”! “సరే ప్రియా! నువ్వు నా మీద ఇంతటి భారాన్ని మోపేవు! నువ్వు అడిగిన సహాయం తప్పక చేస్తాను, బై” .
లాస్య తన పనులన్నీ చకచకా చెయ్యడం మొదలు పెట్టింది. ఎంఎస్ కి కావలసిన జీ ఆర్ యి వగైరా పరిక్షలు రాయడం, కావలసిన డాక్యుమెంటేషన్ తయ్యారు చెయ్యడం దానితో పాటు లాయర్ తో సంప్రదింపులు వగైరాలన్నీ పూర్తి చేసుకుంది. వీటితో పాటు డా. సునీల్ దాతార్ ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉంది.
లాస్యప్రియ తనని విడిచి యూఎస్ వెడుతోందనే ఆలోచనే శ్రీకి నచ్చలేదు. ఆమెకి తప్పక నయం అవుతుందనీ, తమ దాంపత్య జీవితం ఆనందంగా సాగిపోతుందనే నమ్మకంతోనే ఉన్నాడు. ఆమెనీ వెళ్ళవద్దనడానికి ఏ కారణం కనిపించడం లేదు. ఈ ఆలోచనతోనే ఇంకో మూడు నెలలు గడిచి పోయాయి. లాస్యప్రియ బయలుదేరే రోజు వచ్చింది. ఎయిర్ పోర్ట్ కి సుమీత్ తో కార్లో శ్రీధర్ లాస్య బయలు దేరారు. అందరూ తమతమ ఆలోచనల్లో నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఎయిర్ పోర్ట్ లో వారిద్దరినీ ఏకాంతంగా వదిలి సుమీత్ ఇప్పుడే వస్తానని బైటకు వెళ్ళేడు. కొంచెం సేపు ఇద్దరి మధ్య మాటలు కరువైయ్యాయి, నిశ్శబ్దంగా ఒకరినొకరు ఆర్తిగా చూస్తూ ఉండిపోయారు. మెల్లిగా గొంతుక పెగల్చుకొని గద్గదస్వరంతో “శ్రీ ! నన్ను క్షమించు! నా వల్ల నీ జీవితం అస్తవ్యస్తం అయిపొయింది. కనీసం ఇప్పుడైనా నీ జీవితం ఆనందంగా గడవాలని కోరుకుంటున్నాను. నన్ను మర్చిపో ……” అనీ ఏడుపు ఆపుకుంటూ ఉండిపోయింది. చటుక్కున ఆమె చేతుల్ని తన చేతుల్లో తీసుకొని “ప్రియా! ఏమంటున్నావు?” లాస్య చటుక్కున అతడి చేతిలో ఒక కవర్ పెట్టి, బై చెప్పి పరుగు పెట్టింది. శ్రీధర్ “ప్రియా ప్రియా ! ఆగు” అనీ ఆమెను ఆపేందుకు ప్రయత్నించే లోపుగా ఆమె సెక్యురిటీ చెక్ కేసి వెళ్ళిపోయింది. చేసేదేం లేక ఆగిపోయి చేతిలోని కవర్ని చటుక్కున తెరిచాడు. అది ఆమె తనను సంభోదిస్తూ వ్రాసిన లేఖ… ఆతృతగా చదవ సాగాడు

ప్రియాతిప్రియమైన శ్రీ,
నిన్ను వదిలి నీకు దూరంగా వెళ్ళి పోతున్నాను. శ్రీ. నేను కన్యగా కన్న, నా కలల రాకుమారుడవు నీవే అంటే నమ్ముతావా! నీకు సహచరిని అవుతున్నానంటే, నా అంత అదృష్ట వంతురాలు ఇంకెవ్వరూ ఉండరని మురిసిపోయాను. కానీ నీకు ఇంత దుఃఖాన్ని కలిగిస్తానని అనుక్కో లేదు. నిజం శ్రీ, నాకు తెలియకుండా, నా ప్రమేయం లేకుండా, నా జీవితం అస్తవ్యస్తం అయింది. విధి మనిద్దరి జీవితాలతో ఆడుకుంది. మనిద్దరం విధి వంచితులమే! జరిగి పోయినదాని గురించి బాధ పడడంలో అర్ధం లేదు! నీకు కలిగించిన దుఃఖానికి క్షంతవ్యురాలిని. శ్రీ! నువ్వు, నీకు తగిన అమ్మాయిని చూసుకుని పెళ్ళి చేసుకో. నువ్వు ఆనందంగా జీవితం గడపాలని ప్రార్ధిస్తున్నాను. ఇంక ఉండనా శ్రీ. ఐ లవ్ యూ! నిజంగా దేముడనే వాడుంటే వచ్చే జన్మ లో మనిద్దరినీ కలపమని మనసారా ప్రార్ధిస్తున్నాను.
శెలవా మరి. ఫేర్వెల్ మై ఫ్రెండ్! అల్విదా !

నీకు ఏమీ కాలేని…..
లాస్యప్రియ.

శ్రీధర్ చేతిలో ఉత్తరాన్నీ పట్టుకుని అలా నిస్తేజంగా నిలబడి పోయాడు….

***********************

12 thoughts on “అల్విదా నేస్తం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *