May 3, 2024

శుభోదయం 1

రచన: డి.కామేశ్వరి

శ్యామ్ అద్దం ముందు నిలబడి తల దువ్వుకొంటూ తన రంగు చూసి తనే నిట్టూర్చాడు. భగవంతుడు తననింత నల్లగా, అనాకారిగా ఎందుకు పుట్టించాడో! రోజుకి కనీసం ఒకసారన్నా ఆ మాట అనుకునే శ్యామ్ ఆ రోజు పదిసార్లు ఆ మాట అనుకున్నాడు. ఈ రంగే.. ఈ రంగే తనకి శత్రువయింది. లేకపోతే.. రేఖ.. నిట్టూర్చి తల దువ్వుకోసాగాడు. వెనకనించి తల్లి వచ్చిన నీడ అద్దంలో కనిపించింది.
“శ్యామ్! టిఫినుకి రా రా, యింకా ముస్తాబవలేదా? ఏనాడనగా స్నానం చేశావు? దోసెలు చల్లారిపోతున్నాయి” అంది.
“వస్తున్నానమ్మా” వెనక్కి తిరిగిన కొడుకు మొహం అదోలా వుండడం చూసి, “శ్యామ్! అలా వున్నావేం, ఏం జరిగింది? వంట్లో బాగులేదా?” అంది ఆదుర్దాగా.
“ఏం లేదమ్మా, పద వస్తున్నాను” షర్టు టక్ చేసుకుంటూ ఆమె వెనక డైనింగ్ రూములోకి నడిచాడు.
“ఊహూ… ఏదో ఉంది. ఏం జరిగిందో చెప్పాలి..” కొడుకు అన్యమనస్కంగా తింటున్న తీరు చూడగానే రాధాదేవికి అర్ధం అయి అడిగింది.
శ్యామ్ కాసేపు మౌనంగా వుండి, కళ్ళెత్తి తల్లివంక చూస్తూ “అమ్మా! నేనింత నల్లగా ఎందుకు పుట్టానమ్మా? నీవంత తెల్లగా వుంటావు. నాకీ రంగు ఎలా వచ్చిందమ్మా..” కొడుకు గంభీరంగా అడిగిన తీరు చూడగానే రాధాదేవికి నవ్వు వచ్చింది. “ఒరేయ్!! ఎన్నిసార్లు అడిగావురా యిప్పటికి ఆ మాట. నీకీ రంగు పిచ్చేమిట్రా.. బాహ్య సౌందర్యం కాదు శ్యామ్ కావలసింది. ఆత్మ సౌందర్యం కావాలిరా నాన్నా!! అది నీకుంది అని నాకు తెలుసు. లేని రంగు కోసం నీకెందుకురా ఆ బాధ.. యింతకీ నీవేమన్నా ఆడపిల్లవా అందంగా లేకపోతే దిగులు పడడానికి. ఏం, మళ్ళీ ఎవరన్నా నిన్ను హాస్యం ఆడారా కాలేజీలో? ” రాధాదేవి కొడుకు మనసులో బాధ గుర్తించకుండా ఎప్పుడూ అడిగే ప్రశ్నే అని తేలిగ్గా జవాబు చెప్పింది.
హాస్యం! హు..! హాస్యం అయితే తను స్పోర్టివ్‌గా తీసుకోగలడు. అపహాస్యం! హేళన, అవమానం. రేఖ.. ఏ రేఖనయితే తను ఆరాధిస్తాడో, ఏ రేఖనయితే హృదయంలో ప్రతిష్టించుకున్నాడో ఆ రేఖ ఎంత చులకనగా, ఎంత హేళనగా మాట్లాడింది. తన ఆనాకారితనాన్ని నల్గురిలో ఎంతలా యీసడించి మాట్లాడింది. “వసేయ్ నీరూ, ఈ జీడిగింజ ఏమిటే మన వెంట యిలా జీడిపప్పు పాకంలా తగులుకున్నాడూ” అమ్మాయిలంతా కిసుక్కున నవ్వారు. “నీగ్రో నయమే బాబూ, ఆ నలుపుకి తోడు తెలుగు బట్టలు కడ్తాడు. ఆ నలుపు మరింత కొట్టచ్చినట్లు కనపడుతోందే!”
“పాపం ఎందుకే? నిన్నేం చేశాడే అలా ఏడిపిస్తావు ఆ అబ్బాయిని?” ఎవరో అమ్మాయి జాలిగా అంది.
“మహా జాలిపడ్తున్నావు. ఏం కథ? “రేఖ హేళనగా అంది. ఆ అమ్మాయికి కోపం వచ్చింది. “కూరొండుకుందుకి కావాలా? కాకరకాయలు కథలు నీకున్నాయేమో, రంగు చూసి ఒకర్ని ఎద్దేవా చేయడం సంస్కారం కాదంటాను” తీవ్రంగా అంది. “నీవు తెలుపు, నేను చామనచాయ, యింకోరు నలుపు రంగు. నీవు, నేణు కావాలంటే వచ్చేది కాదని కూడా తెలియకుండా ఎందుకలా ఆ అబ్బాయిని అవమానపరచాలి” తీవ్రంగా అంది. రేఖ కాస్త తగ్గి “వాడి రంగెలా వుంటే ఎవరికి? వాడి చూపులు, కొరుక్కుతినేటట్టు చూస్తాడే.. ఆ చూపు చూస్తే వంటిని తేళ్ళు, జెర్రులు పాకినట్లుంటూంది. అందుకే అసహ్యం నాకు. ఆ అందగాడీని చూసి వరించాలని కాబోలు వెధవ పోజులు. నవ్వులూను. చూస్తుంటే తిక్క రేగుతుంది నాకు..” రేఖ గొంతులో తిరస్కారం.
“పోనీలే పాపం. నల్లగా వున్నాడు కనక తెల్లంటి వాళ్లంటే వీక్‌నెస్ ఏమో, నిన్నేం చెయ్యలేదు కదా. చూసి తృప్తి పడితే నీ సొమ్మేం పోయింది.”
… వీక్నెస్… నిజమే.. తెల్లటి వాళ్ళంటే అదోరకం ఆరాధనా భావం. ఎంత పుణ్యం చేసుకుని పుట్టారోననిపిస్తుంది తనకి! అందులో రేఖ.. ఆ గులాబిరంగు, గీత గీసినట్లుండే ఫిగర్.. నల్లటి వంకుల జుత్తు. భగవంతుడు అంత అందమూ ఒకరికే యీయకపోతే తనలాంటి వాళ్లకి కాస్త పంచకూడదూ అనుకున్నాడు మొదటిసారి కాలేజీలో చూసినప్పుడు. రేఖ రంగు చూసి ఆమె మీద ఆరాధన పెంచుకున్నాడు. ఆమె తనకందదని తెల్సు. అసలలాంటి అత్యాశ లేదు. అయినా ఆమె అంటే అదో ఆరాధన, అభిమానం. తన భావాలు తనలోనే వుంచుకున్నాడు తప్ప పైకి వ్యక్తపరచే ప్రయత్నం ఎన్నడూ చెయ్యలేదు. అ యినా రేఖ తన చూపులలో భావం పసికట్టిందంటే తనకి తెలియకుండానే తన కళ్లల్లో ఆమెపట్ల ఆరాధన కన్పించింది కాబోలు. తనకీ వీక్‌నెస్ ఏమిటి.. చా.. చా.. తనపట్ల ఆమెకంత చులకన ఏర్పడింది?
అయినా.. పోనీ తన బలహీనత గుర్తించి సానుభూతి చూపచ్చు. అవహేళన చెయ్యాలా? అందరిలో చులకన చెయ్యాలా? చిన్నపుచ్చుకుని, విషణ్ణ వదనంతో యిల్లు చేరి, రాత్రి నిద్రపోకుండా పదే పదే ఆ మాటలనే గుర్తు చేసుకుంటూ బాధపడ్డాడు. అతని మొహంలో ఆవేదన తల్లి గుర్తుపట్టకుండా ఎలా వుంటుంది.?
“శ్యాం.. ఏమిటా ఆలొచన, టిఫిను తినుముందు. నీలో యీ యిన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎలా పోగొట్టాలో నాకు తెలియడంలేదు. రంగు నీ చేతిలో, నా చేతిలో వుందా…” రాధాదేవి అనునయిస్తూ అంది.
“కాని నాన్నగారు, నీవు తెల్లగా వుంటే నేనింత నలుపు ఎలా వచ్చానసలు”|?”
“బాగుంది ప్రశ్న. తల్లిదండ్రి తెల్లగా వున్నా నల్లటి పిల్లలు ఎందరు లేరు శ్యాం? శ్రీకృష్ణుడు నల్లటివాడు. శ్రీరామచంద్రుడు నల్లటివాడు. అంత మాత్రాన వాళ్లని పూజించలేదా? ఆ నల్లనయ్యని ఎందరు గోపికలు ఆరాధించట్లేదు. అవతార మూర్తులే నల్లటివారయినప్పుడు .. మనం ఎంత..”
“ఆరాధించవద్దు. పూజించవద్దు. అపహాస్యం చెయ్యకుండా వుంటే చాలమ్మా.. నీకేం తెల్సు కాలేజీలో అంతా నన్ను చూసి ఎలా నవ్వుకుంటారో..” శ్యామ్ నల్లటి మొహం మరింత నల్లబడింది. అది చూసిన రాధాదేవి మనసు గిలగిలలాడింది. శ్యామ్ ని చూసి చిన్నప్పుడు అందరూ హేళనగా మాట్లాడితే తను బాధపడింది. ఈ రోజు శ్యామ్ బాధపడడంలో వింత ఏముంది? కాని.. తనేం చెయ్యగలదు? ఏం చెప్పి కొడుకుని ఓదార్చగలదు.
“శ్యామ్.. రంగు చూసి మనుష్యుల్ని అంచనా కట్టే మనుష్యులతో నీకేం పని . అది వాళ్ల కుసంస్కారానికి నిదర్శనం. నీ మానాన నీవు చదువుకో. అని అని వాళ్ళే వూరుకుంటారు. ఇంత చిన్న విషయానికి నీవు మనసు పాడు చేసుకుంటే యింక నా మీద ఒట్టే. ఊ కానీయి. టిఫిను తిను. ఆలస్యం అవుతుంది కాలేజీకి.”
కొడుకుని సముదాయించడానికి ఏదో అన్నా ఆమె మనసు అది సరిపెట్టుకోలేకపోయింది. శ్యామ్ నలుపు.. కాని అతని మనసు తెల్లని పాలవంటి తెలుపు అన్నది తనకి తెలుసు. ఆ తండ్రి బుద్ధులు రారాదని భగవంతుని ఎంతో ప్రార్ధించింది. తన మొర విన్నాడు ఆ దేముడు. తన పెంపకంలో సహృదయుడు, సంస్కారిగా పెరుగుతున్న కొడుకుని చూసి నల్లటివాడని ఆమె మనసు యిప్పుడు నొచ్చుకోవడం లేదు. శ్యాం పుట్టినప్పుడు అందరి చూపులు తూట్లలా పొడుస్తుంటే, అందరి గుసగుసలు, అందరి వ్యంగ్యపు విసుర్లు విని విని ఆ బిడ్డని చంపి తానూ చనివాలనుకున్నంత అవమానం కల్గింది. కాని అన్నింటినీ మాతృత్వపు మమత జయించింది. ఎంత ఆనాకారి అయినా బిడ్డని తల్లి ప్రేమించకుండా వుండలేదు. ఆ బిడ్డ తండ్రిని ప్రేమించినా, ద్వేషించినా ఆ బిడ్డని మాత్రం ద్వేషించలేదన్నది అర్ధం అయింది.
శ్యామ్ కి ఆ తండ్రి పోలికలు వస్తే? అనుకుంటూ, భయపడుతూ చిన్నప్పటినుంచి అతి జగ్రత్తగా వెయ్యికళ్లతో బిడ్డకి మంచి అలవాట్లనూ, అభిరుచుల్ని పెంచుతూ పెంచింది. శ్యామ్ పెద్దవుతున్నకొద్ది తను ఎలా మలుచుకుంటే అల మలచబడుతుంటే సంతృప్తిగా నిట్టూర్చింది. శ్యామ్ కోసమే తన బ్రతుకు. వాడిని సంస్కారవంతుడిగా తీర్చిదిద్దడమే తన ఆశయం. అదే ఆమె తపన. కాని. శ్యామ్ పెరిగి పెద్దవుతూ తన అనాకారితనాన్ని నలుగురూ హేళన చేస్తుంటే బాధపడేవాడు. ఆ బాధ మనిషితో పాటు పెరిగి పెద్దదయింది. శ్యామ్ లో ఆ భావం ఏం చేసి పోగొట్టాలా అని మధనపడేది. ఎవరు ఏం అన్నా అతి సున్నితంగా చలించి బాధపడే అతని తత్వం మార్చాలని, అ అత్మవిశ్వాసం కల్గించాలని తాపత్రయపడేది. ఈ రోజు శ్యామ్ విషణ్ణ వదనం చూస్తుంటే ఆమె కడుపు తరుక్కుపోయింది.
భగవంతుడా! నాకీ బిడ్డని ఎందుకిచ్చావు. పుట్టగానే చంపితే నాకానాడు, ఈనాడు యిన్ని సమస్యలుండేవి గాదు కదా? నా బతుకు ఈ విధంగా మారేది కాదు కదా.. ఆవేదనగా కళ్ళు మూసుకుంది.
కళ్లు మూసుకున్నా శ్యాం నల్లటి రంగు, బండపెదాలు, వెడల్పు ముక్కు , చిన్న కళ్లు.. మొహంలో ఏ కోశానా మృదుత్వం లేకుండా చూడగానే అబ్బా ఏం రూపు బాబూ అనుకునే శ్యామ్.. తన బిడ్డ!! ఎంత అనాకారి అయినా శ్యామ్ తన కడుపున పుట్టిన బిడ్డ. పురుడు వచ్చాక, మత్తులోంచి తెలివి రాగానే నర్స్ తీసుకొచ్చి చూపించిన బిడ్డని చూడగానే కెవ్వుమంది. పుట్టినాక అంత నల్లటి బిడ్డని చూడడం అదే మొదటిసారి ఆమెకి. ఆ బిడ్డ తన బిడ్డ .. తను ఏనాడో చేసిన పాపం యీనాడు ఈ రూపంలో భగవంతుడు శిక్షించాడు. మూగగా రోదించింది. అంత అనాకారి బిడ్డని వడిలో వేసి నర్సు ఆమె స్తనాన్ని బిడ్డ నోట్లో పెట్టి పాలు యీయడం చూపగానే ఆ బిడ్డ పెదాలు స్థనానికి తాకగానే వెన్నులోంచి ఏదో మమత పొంగుకొచ్చినట్లయింది. ఆ బిడ్డ మొహం చూడకూడదనుకున్న ఆమె తెలియకుండానే బిడ్డని గుండెకి అదుముకుంది. తల్లి ప్రేమ, కడుపు తీపి, పేగుబంధం అనే మాటలకి అర్ధం తెల్సింది. ఆమెకి తెలియకుండానే బిడ్డ మీద అసహ్యం, ఏహ్యం, తిరస్కారం క్రమంగా మాయమయి ఆ స్థానంలో మమత, అనురాగం పుట్టుకొచ్చాయి. శ్యాం బుద్ధులు తండ్రిని పోలనందుకు అనేక దేముళ్ళకి మొక్కుకుంది. ఈనాడు శ్యామ్.. తనకి జీవనాధారం. వాడి కోసమే తన బతుకు. శ్యామ్!!, బాబూ! నేను ఏం చేసి నీ యీ దిగులు పోగొట్టనురా.” విచలిత అయి కళ్ళు ఒత్తుకుంది రాధాదేవి…

******

“అమ్మా.. అమ్మా…” హడావిడిగా లోపలికి వచ్చాడు శ్యామ్. శ్యామ్ వెంట వచ్చిన అమ్మాయిని చూసి రాధాదేవి ప్రశ్నార్ధకంగా చూసింది.
“అమ్మా!! ఈ అమ్మాయి మా కాలేజ్‌మేట్ రేఖ. ఇవాళ రేఖకి చాలా గొడవయిందమ్మా.. నల్గురు రౌడీలు వెంటపడ్డారమ్మా” ఎక్సైట్ అవుతూ గబగబా అన్నాదు.
“ఆ” రాధాదేవి కూడా గాభరా పడింది.
“సరిగ్గా ఆ సమయానికి శ్యామ్ రాబట్టి బతికిపోయాను. లేకపోతే వెధవలు ఏం చేసేవారో..” రేఖ భయంగా అంది.
“అసలు ఏం జరిగిందమ్మా.. ముందలా కూర్చో. మంచినీళ్లివ్వనా?” రాధాదేవి వెళ్ళి ఫ్రిజ్‌లోంచి చల్లటినీళ్లు తీసుకొచ్చి యీయగానే రేఖ గడగడ తాగింది.
“వళ్లంతా చెమట పట్టిందమ్మా.. యింక ఫరవాలేదు. స్థిమితంగా కూర్చో..” అంటూ మృదువుగా ఆమె నుదురు పమిటచెంగుతో వత్తింది రాధాదేవి. ఎదురుచూడని ఆ ఆప్యాయతకి రేఖ చలించి దోషిలా శ్యామ్ వంక చూసి తలదించుకుంది. యింతటి మంచి హృదయం గల తల్లికి పుట్టిన బిడ్డనా తను యిన్నాళ్లు చీదరించుకుంది. ఈరోజు శ్యామ్ రాకపోతే?? ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి.
“చెప్పమ్మా.. ఏం జరిగిందసలు?” రాధాదేవి ఆరాటంగా అడిగింది.

ఇంకా వుంది…

3 thoughts on “శుభోదయం 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *