April 30, 2024

అక్షర సాక్ష్యం

రచన: రంగనాథ్

1. తల :

తలపులకు నిలయం …. తల
తలపెట్టే పనులకు కార్యాలయం…. తల!

మంచిపనులు చేసి
మహాత్ములలో
తలమానికంగా
బ్రతికేవారు కొందరు-

తలతిరుగుడుడెక్కువై
తలతిక్క పనులు చేసి
తలవంపులకు
గురయ్యేవారు కొందరు-

కళ్ళు తలకెక్కి
తలెగరేసుకుంటూ
తలపొగరు
పెంచుకొనేవారు కొందరు-

తలవంచుకు బ్రతకాల్సిన
కాని పనులు పూనుకోక
తగిన పనులు తలవడి
తలవాల్చేసేలోగా తలెత్తుకొని జీవించడం మేలు!

2. అవగాహన

కనిపిస్తుంది జీవితం
తలకో తీరుగ –
సరైన రీతిలో చూడలేరు
అందరూ ఒక్కటిగ !
అందుకే మనుషుల
స్వభావాల తికమక !!

మాటిమాటికి
మాట మాటకి
వాగ్వివాదాల సొద-

చూపుల్లో చిటపటలు
మాటల్లో ఎత్తిపొడుపులు
గుండెల్లో భగభగలు
తప్పవు రాజీ పడకుంటే !
అన్యోన్యతకు అడ్డుండదు
అవగాహన పెంచుకుంటే!!

3. ప్రకటనలు

సూర్యుడు ఎండకు ప్రకటన
చంద్రుడు వెన్నెలకు ప్రకటన!

కారుమబ్బులు వర్షానికి ప్రకటన
కోయిల పాట వసంతానికి ప్రకటన!

కోడికూత వేకువకు ప్రకటన
కృషి విజయానికి ప్రకటన !

దయ ధార్మికతకు ప్రకటన
పరోపకారం పరమార్ధానికి ప్రకటన !

ధర్మాచరణ శీలానికి ప్రకటన
సత్యాన్వేషణ చైతన్యానికి ప్రకటన !

సమభావం సహకారానికి ప్రకటన
హింస అనాగరికతకు ప్రకటన !

నిరహంకారం విజ్ఞతకు ప్రకటన
విజ్ఞానం మానవమేధకు ప్రకటన !
జ్ఞానం జీవిత సాఫల్యానికి ప్రకటన !!!

4. గుణసంపద

సంపదలుంటే మాత్రం
వంద గజాల
పట్టుపంచె చుట్టుకొంటావా!
పూటకు
బండెడన్నం తింటావా !
ఇంట్లో కూడా
చక్రాలబండిలో తిరుగుతావా !
సంపద
పదిమందికైతే మేలు-
ఒక్కడివైతే
కొంతే చాలు !
సంపద నిన్ను
ధనవంతుణ్ణి చేస్తుంది….
పరోపకార గుణసంపద
నిన్ను మహనీయుడ్ని చేస్తుంది !!

5. చట్టం దారి చట్టానిది

కట్న మడుగరాదు
కట్న మివ్వరాదు
లంచ మడుగరాదు
లంచ మివ్వరాదు… అని
చట్టం అరుస్తూనే వుంటుంది !

మార్పు చట్టాల వల్ల రాదు…
సంస్కారంతోనే సాధ్యం!
ఆదాయం ఆదాయం
అనుకొన్నంత కాలం
మనిషికి తప్పదు….
దిగజారుడుతనం !

ఆశయాల ఆవిష్కరణ
అంతరంగంలో జరిగితే
ఆదర్శపు శిఖరాలను
అధిరోహించడం సత్యం !!

6. మరో జన్మ వుంటే….

సాంఘిక జీవన విధానంలో
చీమలే ఆదర్శవంతమైతే
చీమనై పుట్టాలని…
పరోపకారం విషయంలో
పండ్ల చెట్లే ప్రతిరూపాలైతే
చెట్టునై పుట్టాలని-
కృతజ్ఞతాపరంగా
కుక్కలే శ్రేష్టమైతే
కుక్కనై పుట్టాలని
కోరకుంటానే గాని
క్రమశిక్షణా రహితుడు
స్వార్ధపరుడు
కృతఘ్నడైన
మనిషిగా పుట్టడం
చస్తే యిష్టపడను….
మరో జన్మ వుంటే !

7. ఆశీర్వచనం

భూమ్మీద పడడం… ‘కెవ్వు ‘ న ఏడవడంతో
ప్రారంభమయ్యే మానవజీవితం రసమయం !

ఆశలు ఆశయాలు దురాశలు అనర్ధాలు
ఆనందాలు ఆవేదనలు సాఫల్యాల వైఫల్యాల
కలబోత జీవితం… ముమ్మాటికీ కలకాదు జీవితం-
పుట్టుకతోనే విచిత్రాలు విడ్డూరాలు ఎన్నెన్నో !

ఒకే కాన్పులో నలుగురని – తనువులు కలిసి యిద్దరని
అంగవైకల్పంతో కొందరు- మనోవైకల్యంతో కొందరు
యిలా రకరకాల పుట్టుకలుండగా
ఒక్క నలుసుక్కూడా నోచనివారు యెందరో మరి !

సక్రమంగా పుట్టినా – తర్వాత
ఆయుష్యుంటే ఆరోగ్యముండదు-
ఆరోగ్యముంటే ఐశ్వర్యముండదు
ఆరోగ్యమూ ఐశ్వర్యమూ వున్నా
ఆయుష్యుండదు- హతవిధి!
అందుకే పెద్దలు
‘ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు ‘
అని దీవిస్తారేమో కదా !!

8. చివరికి మిగిలేది !

బ్రతికి వున్నప్పుడు – భాస్కర్రావంటే…..
ఆజానుబాహుడు – ఎత్తుభుజాలవాడు
పసిడిఛాయ గలవాడు- ముత్యాల పలువరుస
మురిపించే మీసకట్టు- సొగసైన పంచకట్టు
విలాసవంతమైన నడక – కండలు తిరిగిన శరీరం
గంభీరస్వరం అతనికే స్వంతం…..
అనుకొంటారందరూ !

అదే- అతను పోయాక….
అతను దయాళువనో
దానవుడనో
కరుణామూర్తనో
కఠినాత్ముడనో
మహాజ్ఞాననో
పరమ మూర్ఖుడనో
ప్రజాబంధువనో
రాబందనో
అతను మిగిల్చిన జ్ఞాపకాలనే
తలచుకుంటారందరూ !!!

9. భక్తి

పట్టుబట్టలు కట్టి, పరుగులు పెట్టి
గుంపుగుంపులుగ వెళ్లి గుడిలోన దూరి
అర్చనలు, అభిషేకాలు, కైకర్యాలు, కల్యాణాలు
సాష్టాంగాలు, పొర్లుదండాలు… ఎన్నెన్నో చేసి-
కోరికలు తెలిపి కొబ్బరికాయలు కొట్టి-
భక్తిభావమును గుడికే పరిమితం చేస్తే….
ఏమున్నది వ్యత్యాసము- ఎంత యోచించినా…
గుడిలోని భక్తికీ- శ్మశాన ప్రసూతి వైరాగ్యాలకి
ఆరాధన వేరు…. అర్పణ వేరు !

అరిషడ్వర్గాల మలినాన్ని గుండెనుండి తొలగించి
ప్రేమముగ్గులు దిద్ది, దైవభావాన్నందు నిలుపుకొంటే
కాదా అది కోవెల? అందు నెలకొనడా నమ్మిన దేవుడు?
తీర్చడా కోరికలు అడగకుండగనె?
ఆదుకోడా నిన్ను అడుగడుగున తానె?
గుడులు గుడులని తెగతిరుగుతావో-
గుండెనే గుడిగా మార్చుకొంటావో-
భక్తిని బజారుపాలు చేస్తావో-
నీలోనే పెంచుకొని సేవిస్తావో-
భక్తుడిగా మిగిలిపోతావో-
దైవంతో కలిసిపోతావో – నీ యిష్టం… నీ ప్రాప్తం !!

10.ప్రక్షాళన

తిండి తిండితిండంటూ
తెగ తినే రోతపురుగు
తిండితిప్పలు మాని
సమాధి స్థితికి వెళ్లిపోయి
సౌందర్యాన్ని సంతరించుకొని
సీతాకోకచిలుకగా నయనానందకరంగా
మన ముందు విహరిస్తుంది !

పాపం…. మనిషి మాత్రం
తీరని ఆశల ఆకలితో అలమటిస్తూ
ఉన్నదానితో తృప్తిచెందక
సిరిసంపదలకై వెంపర్లాడుతూ
యాంత్రిక జీవితం గడుపుతాడు !

పొందినది చాలనుకొని
ఆత్మవిమర్శ చేసుకొని
హృదయ ప్రక్షాళనంతో
ఆత్మసౌందర్యాన్ని సంతరించుకొని
ఆదర్శవంతుడైతే ఎంత బావుణ్ణు-
సీతాకోకచిలుకలా !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *