April 30, 2024

మలయ సమీరం

రచన: శారదా మురళి

“పొద్దుణ్ణించీ వెతుకుతున్నా కనబడడం లేదు రేషన్ కార్డు. జాగ్రత్తగా బీరువాలో పెట్టమని వసూ చేతికిస్తే, ఎక్కడ పెట్టిందో ఏమో,” చిరాగ్గా బీరువాలోంచి బట్టలన్నీ బయటకి తీసి కుప్పపోస్తూ అనుకున్నాడు శ్రీధర్.
వసూ చీరల మధ్య చిన్న చెక్క డబ్బా చూసి వెతుకుతున్న పని ఆపి ఆశ్చర్యంగా డబ్బా తెరిచాడు. ఒక్క నిమిషం తను చూస్తున్నదేమిటీ అర్థం కాలేదు అతనికి. ఎర్రని క్రికెట్ బంతి, డబ్బాలో చిన్న రుమాలులో చుట్టి. ఇది తనదే కానీ, చాలా పాతది. దాదాపు పాతికేళ్ళ కిందటిది. ఎక్కడో పోయిందనుకున్నాడు. వసూ దగ్గరకొచ్చిందన్నమాట. అతని పెదవుల మీద కొంటె నవ్వు తీయటి గతాన్ని తల్చుకుని! అమ్మ దొంగా! ఇక్కడ దాచి పెట్టుకుందన్నమాట. మబ్బులు వీడిన చంద్రుళ్ళా అతని మొహం వున్నట్టుండి వొచ్చిన ఆలోచనతో వెలిగిపోయింది.

******************

“అడ్డ గాడిదలా పెరిగి ఎమ్మెస్సీ చదువైపోయినా ఆ గల్లీ క్రికెటేంట్రా నీకు!” అమ్మ తిట్లేవీ పట్టించుకోకుండా తనకంటే చిన్నవాళ్లతో హాయిగా క్రికెట్ ఆడుకునే ఎండాకాలం- ఎమ్మెస్సీ పరీక్షలైపోయి రెక్కలు విప్పుకున్న పక్షిలా మనసు ఆకాశంలో ఎగురుతున్న కాలం-తన జీవితానికంతటికీ ముఖ్యమైన ఆ ఎండాకాలాన్ని మర్చిపోయే ప్రసక్తే లేదు-
” అన్నా! నువ్వు మళ్ళ బాల్ ఆ రాళ్ళ ఇంట్లోకేసినవ్. ఇప్పుడు ఆ ఇంట్లో అక్క మన చెమడాల్లెక్కదీస్తది!” పన్నెండేళ్ళ విక్కీ గొల్లుమన్నాడు. మిగతా అందరూ తలలూపారు గంభీరంగా.
“అన్నా, మా అందరికంటే నువ్వే పొడుగ్గా వున్నవ్. నువ్వు పోయడుగు ఆ అక్కను, నీకిస్తదేమో!”
“నేనా? చంపుతదాపిల్ల!” భయపడ్డాడు శ్రీధర్. ఆమెనింతకుముందు చూడకపోయినా పిల్లల మాటల్లో ఆమె దౌర్జన్యాన్ని గురించి చాలా కథలే విన్నాడు మరి.
“నీకు పోక తప్పదు భాయ్! ఆ బంతి కూడా నీదే మరి!” నవ్వాడు పదిహేడేళ్ళ విజయ్. సరే, ఇక పిల్లల ముందు పరువు దక్కించుకోక తప్పదని ఆ ఇంటి గేటు తీసాడు శ్రీధర్.
గేటు చప్పుడుకి వాకిట్లోకొచ్చి నిలబడిందొక అమ్మాయి. పంతొమ్మిది ఇరవై మధ్య వయసుండొచ్చు- సన్నగా, తెల్లగా, చిన్నగా, ముద్దుగా, అతని మనసుకి ఇక మాటలు దొరకక ఆపేసింది. కళ్ళు మాత్రం యమ బిజీగా అమ్మాయి అన్ని వివరాలూ నోట్ చేసుకుంటున్నాయి. లేత నీలం రంగు లంగా మీద ముదురు నీలం రంగు ఓణీ దగ్గర్నించి, భుజాల మీద పడుతున్న ఉంగరాల జుట్టు వరకూ, నొసట చిన్న బొట్టు మీదుగా దేన్నీ వదలకుండా.
అతన్ని చూసి సంగతేమిటో పసిగట్టినట్టుంది కానీ, ఏమీ తెలియనట్టు ఏం కావాలన్నట్టు కళ్ళెగరేసింది. అసలు శ్రీధర్ కి మాటకారిగా స్నేహితుల్లో చాలా పేరుంది. కానీ వున్నట్టుండి గొంతు పట్టేసినట్టయి మాట రాలేదు. అతని అవస్థని గమనించిన అమ్మాయి చిరునవ్వు బయటకి రాకుండా పెదవుల్లో బిగబట్టింది. ఇంకా క్వశ్చను మార్కు మొహంతో తన వంక చూస్తూండడంతో గొంతు విప్పక తప్పలేదు శ్రీధర్ కి.
“అదీ, అది, మేము క్రికెట్ ఆడుతూంటే నేనొచ్చి మీ కాంపౌండు గోడ దాటి మీ ఇంట్లో! ఛీ,ఛీ! బంతి వొచ్చి మీ గోడ దాటి పడింది, కొంచెం వెతికి తీసిస్తే…” నసుగుతూ అన్నాడు.
“నో! ఏ బంతీ పడలేదు. యూ కెన్ గో!” అందా అమ్మాయి అతని వంక నిశితంగా చూస్తూ. ఏమనాలో తోచలేదతనికి. అలాగని అక్కణ్ణించి వెళ్ళాలనీ లేదు.
“కాదండీ, మేమంతా చూసాం. అదిగో, ఆ వైపు నించి పడింది.” ఈ సారి గొంతులో వొణుకు కొంచెం తగ్గింది.
“లేదని చెప్తూంటే మీక్కాదూ! ఇక్కడే బంతీ పడలేదు. అసలు ఈ సారి పడిందంటే నిజంగానే ఇవ్వను.” ఆ అమ్మాయి గిరుక్కున తిరిగి వెనక్కెళ్ళిపోయింది.
ఎలాగో కాళ్ళీడ్చుకుంటూ తిరిగి గుంపు దగ్గరకెళ్ళాడు.
“అయ్యో! అన్నా, రేపణ్ణించి మనకి ఆట ఎలా?” అందరూ నీరస పడ్డారు. అతనికి మాత్రం ఏదీ బుర్రలోకి ఎక్కట్లేదు.
నాల్రోజుల తర్వాత బస్సులో కనిపించింది ఆ అమ్మాయి. ఈ సారి కాఫీ రంగు లంగా మీద బిస్కెట్టు రంగు వోణీ వేసింది. అసలా నాజూకు ఒంటికి ఏ రంగైనా ఎంత బాగా నప్పుతుందో! అతని పరవశానికి అడ్డంవస్తూ ఆ అమ్మాయి మాటలు వినబడ్డాయి, పక్కనున్న చెలికత్తెతో,
“మా ఇంటి దగ్గరో కోతి మూక చేరిందిలే! ఈ ఎండా కాలం సెలవులంతా వాళ్ళు చేసే గొడవకి పుస్తకం చదవడానికే వీలవట్లేదు. అన్ని పుస్తకాలూ లైబ్రరీలో తిరిగిచ్చేసి వస్తున్నా,” అంటూంది.
ఒళ్లు మండిపోయిందతనికి.ఎంత మాట అంది! కోతి మూకా! అసలు అందగత్తెనన్న గర్వం కాదూ! తన వైపు చూడనట్టు అటు తిరిగి కూర్చున్నా, తనని చూసిందనీ, అందుకే అలాటి మాటలంటోందనీ అనుమానం. ఇంత పరాభవించిన అమ్మాయి ఏ లంగా వేస్తే తనకెందుకూ, దాని మీద ఏ వోణీ వేస్తే తనకెందుకు! భారమైన గుండెతో ఇక లంగా-వోణీల రంగులగురించి ఆలోచించనని ఒట్టేసుకున్నాడు.
కానీ- మనసు కోతి లాటిది. దానికి ఆ అమ్మాయి లంగా ఓణీల లెక్క తేలకపోతే పిచ్చెత్తి పోయేలాగుంది. మర్నాడు సాయంత్రం క్రికెట్ టీం తో సహా వాళ్ళ ఇంటి చుట్టుపక్కలే మీటింగ్ పెట్టాడు, సోది కబుర్లతో. అనుకున్నట్టే కూరలో, పళ్ళో చేత బట్టుకుని ఇంట్లో కెళ్తూ తన వైపొకటీ, టీం వైపొకటీ ఈసడింపు చూపులు రెండు పారేసి వెళ్ళింది. తనూ అంతకంటే ఈసడింపుగా చూడాలనీ, వీలైతే వెటకారంగా నవ్వాలనీ కూడా అనుకున్నాడు. కానీ అదేమిటో ఆమెని చూడగానే పెదవులమీదకి చిరునవ్వు తోసుకొనొచ్చింది. ఆ చిరునవ్వుతో ఇంకా కళ్ళు పెద్దవి చేసి, వాటితోనే “వెకిలి వెధవా!” అని తిట్టి లోపలికెళ్ళిపోయింది.
ఏదో మాటల్లో అడిగినట్టు, “ఎవర్రా ఆ అమ్మాయి?” అనడిగాడు క్రికెట్ టీంని.
“వసుధ అక్కా! కిందటేడాది అంతా ఆమె దగ్గరే లెక్కలు చెప్పిచుకున్నా! భలేగా చెప్తది.” విక్కీ గర్వంగా అన్నాడు.
“అబ్బో! అంత తోపా? ఏం చదువుతుంది?” మళ్ళీ క్యాజువల్ గానే అడిగాడు.
“బీ యస్సీ అయిపోయింది.” ఈసారి విజయ్ అన్నాడు శ్రీధర్ వంక పరికించి చూస్తూ. ఇహ బాగుండదని అప్పటికి పరిశోధన ఆపేసినా, ఆ తరవాత విజృంభించిన ఉత్సాహంతో ఆమె వివరాలన్నీ, తండ్రి ఉద్యోగంతో సహా, అన్నీ సేకరించి పారేసాడు. ఆమె దగ్గరున్న లంగా ఓణీల లెక్క కూడా తేలిపోయింది.
“అబ్బో! ఈ ఎక్స్పీరియెన్సు ముందు ముందు రీసెర్చికి పనికొస్తుంది,” అని కూడా అనుకున్నాడు. ఆమె మాత్రం, ఏ రంగు లంగా వేసుకున్నా అతని వంక కోపంగానే చూసేది.
“అన్నా! కమ్యూనిటీ హాల్లో అందరూ మీటింగ్ పెట్టిన్రు. ఎండాకాలం సెలవుల్లో పిల్లలతోని ఏదైనా ప్రోగ్రాం చేయిస్తరట. నడు, మనం కూడా పోదాం!” విక్కీ తొందరపెట్టాడు.
“అవున్రా! మన కాలనీకీ, పక్క కాలనీకీ క్రికెట్ మాచ్ పెట్టమని అడుగుదామా?” శ్రీధర్ కూడా ఉత్సాహపడ్డాడు.
“నిన్ను పిల్లల్లో లెక్కెయ్యరేమో నన్నా!” విజయ్ అనుమాన పడ్డాడు. వాళ్ళు మంతనాలాడుతూండగానే, వసుధ బయటికొచ్చింది, నల్ల పూలున్న తెల్ల లంగా, పైన నల్లటి ఓణీ వేసుకోని.
తనతోపాటు ఎప్పుడూ వుండే చెల్లాయో, చెలికత్తో కాకుండా ఒక యువకుడున్నాడు. సన్నగా, పొడుగ్గా, ఆమె పక్కనే నవ్వుతూ నడుస్తున్నాడు. శ్రీధర్ కి ఒళ్ళంతా కారం రాసుకున్నట్టయింది.
“ఈ కొత్త శాల్తీ యెవర్రా?” పిల్లలని అడిగాడు. అతని మొహంలో మారుతున్న భావాలని ఎప్పుడో పసికట్టాడు విజయ్,
“వసూ అక్క వాళ్ళ బావ! వైజాగ్ నించొచ్చాడు!” ఒక రకమైన నవ్వుతో చెప్పాడు.
“బావా?” పిడిగుపడ్డట్టయిపోయాడు శ్రీధర్. అంత అందమైన వసుధకి ఈ కొంగ లాటి బావా? భగవాన్, ఏమిటీ అన్యాయం? అతని మనసు ఆక్రోశిస్తూ వుండగానే,
“ఆ బావ భావ కవిత్వం రాస్తాడంట!”
ఈ దెబ్బ అతన్ని ఇంకా బాధ పెట్టింది. పిల్లలతో కలిసి అలాగే అన్యమనస్కంగానే కమ్యూనిటీ హాల్లోకెళ్ళాడు. అక్కడ వసుధ కాలనీ కల్చరల్ కమిటీ సెక్రెటరీ తో మాట్లాడుతూంది,
“మా బావ ఫణీంద్ర అద్భుతంగా కవిత్వం రాస్తారండీ! అసలు ఒక పుస్తకం కూడా వేయించాలనుకుంటున్నాం. కల్చరల్ ప్రోగ్రాంలో కవి సమ్మేళనం లాటివి వుంటాయా?”
వాడి పేరు ఫణీంద్రా? నాగరాజంటే సరిగ్గా వుండేది, నంగిరి నవ్వూ వాడూ! పళ్ళు కొరుక్కున్నాడు శ్రీధర్. వున్నట్టుండి పెద్దగా అన్నాడు,
“సెక్రెటరీ గారూ! మీరలా ఒంటరిగా నిర్ణయాలు తీసుకోకూడదండీ! అందరినీ సంప్రదించాలి. మాకెవరికీ కవి సమ్మేళనాలంటే ఇష్టం వుండదు. అసలు కవులు కవిత్వాలు రాస్తూ, పుస్తకాలు వేసుకోవడం వల్ల ఏం ప్రయోజనం వుంది చెప్పండి? చెట్లు కొట్టెయడమూ, విన్న వాళ్ళకి తల నొప్పి తెప్పించడమూ తప్పితే..” హాలంతా కొయ్యబారిపోయింది.
వసుధ మొహం ఎర్రబడింది, అవమానంతో. క్రికెట్ టీం పిల్లలు తల పట్టుకున్నారు, “ఇప్పుడీ గొడవ అవసరమా?” అంటూ.
“ఊరికే పది మంది పిల్లల్ని వెంటేసుకొని గల్లీ క్రికెట్ ఆడే మీలాటి వేస్ట్ గాళ్ళకేం తెలుసు కవిత్వంలో అందచందాల సంగతి!”
“హాల్లో మేడం! ఎవరినీ వేస్ట్ గాళ్ళంటున్నారు? కవిత్వానికేముంది, అక్షారలన్నీ వొచ్చిన ప్రతీ వాడూ కవిత్వం రాసేయగల్డు. క్రికెట్ గురించి మీకేం తెలుసు..” ఇంకా వీరావేశంతో ఏదో అనబోయే వాడే, తమ్ముడు శ్రీరాం వచ్చి “అన్నయ్యా, అమ్మ అర్జంటుగా రమ్మంటోంది,” అంటూ పిలవకపోతే.
ఇంటికెళ్ళేసరికి అమ్మ నవ్వు మొహంతో ఒక కవరు చేతిలో పెట్టింది.
“నీకు ఇంటర్వ్యూ కాలొచ్చిందిరా! వచ్చే వారమే ఇంటర్వ్యూ, బొంబాయిలో. ఎల్లుండి దాటితే మంచి రోజులు లేవు. ఎల్లుండే బయల్దేరు, రేపు స్టేషనుకెళ్ళి టికెట్ తెచ్చుకో,” అమ్మ చెప్తూనే వుంది.
అంతే, ఇక ఆ తర్వాత ఆలోచించడానికే తీరిబడి లేదు. ఇంటర్వ్యూకి వెళ్ళి వొచ్చేసరికి పది రోజులు. పెద్ద సంస్థలో జూనియర్ సైంటిస్టు ఉద్యోగం. వస్తుందో రాదో నన్న టెన్షన్లో కూడా ఆకుపచ్చ లంగా ఇంతవరకూ తను చూడలేదన్న విషయం గుర్తు పట్టాడు. అయితే దానికన్నా వింతైన విషయం, వసుధ ఇదివరకులా కాక తన వైపు చిరునవ్వుతో చూడడం! ఎప్పట్లా తన వొంక తీవ్రవాదిని చూసినట్టు కాకుండా, ఆప్యాయంగా చూడడం, అప్పుడప్పుడూ ఒక చిరునవ్వు కూడా విసిరేయడం, ఏం జరుగుతోంది? తనకి ఇంటర్వ్యూ కాల్ వచ్చిందనా? వచ్చింది ఇంటర్వ్యూ కాలే కానీ, ఉద్యోగం కాదుగా? మరింకేమిటి కారణం. అసలింతకూ ఆ భావ కవి బావేడీ? పిల్లలని అడిగినా ఏమో తెలియదన్నారు.
అతనీ అయోమయంలో వుండగానే, ఉద్యోగం వచ్చిందని ఉత్తరం రావడం, బొంబాయిలో వెళ్ళి చేరిపోవడమూ జరిగాయి. విజయదశమికీ, దీపావళికీ హైదరాబాదు వచ్చినప్పుడు, వసుధ ఎమ్మెస్సీలో చేరిందని తెలిసింది. అప్పుడప్పుడూ చీరల్లో కూడా కనబడుతూంది. అయినా, అవి ఓణీలంత అందంగా లేవే అనుకున్నాడు. మరీ ముఖ్యంగా, గంధం రంగుకి ఎర్ర అంచున్న పట్టు లంగా మీద ఎర్ర ఓణీ చూసినప్పుడు!
హైదరాబాదు బొంబాయి మధ్య రైళ్ళలోనే ఏణ్ణర్థం గడిచిపోయింది. బొంబాయిలో చుడీదార్లూ, రకరకాల డ్రస్సులూ కనిపించినా, అవేవి అంత అందంగా అనిపించలేదతనికి ఎందుకో!
**********

“ఒరే శ్రీధర్! నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలిరా. పై శనివారం ఒక రెండురోజులు సెలవు పెట్టి ఇంటికి రా.” నాన్న దగ్గరినించి ఉత్తరం చూసుకుని, ఇంటికి బయల్దేరాడు. పొద్దున్నే పొగమంచులో స్టేషన్ నించి ఇంటికి ఆటోలో దిగుతూంటే, ఇంటి ముందర వరండాలో కుర్చీలో పేపరు చదువుతూ వసుధ. ఈ సారి తనని చూసి లోపలికి వెళ్లిపోయింది,కానీ, మొహం మిద నవ్వు వెలుగ్తూనే వుంది.
స్నానం చేసి అన్నం తిన్నాక నాన్న మొదలు పెట్టారు.
“ఒరే! మన పక్కింటి సుధాకర్ రావు గారు లేరూ, వాళ్ళ అమ్మాయి వసుధని నీకిస్తామంటున్నారు. ఆలోచించుకొని చెప్పు. నీకు నచ్చితే నిశ్చితార్థం చేసుకొని పెళ్ళి వచ్చే సంవత్సరం పెట్టుకుందాం.” అసలు ‘ వసుధని నీకూ ‘అన్న మాటల తరవాత తనకింకేమైనా వినిపిస్తేగా. అయినా, అప్పటికేమీ మాట్లాడకుండా లేచాడు. కొంచెం టైమివ్వడానికన్నట్టు అమ్మా-నాన్నా కూడా ఆ విషయం ఇంకేమీ పొడిగించలేదు. సాయంత్రం ఆరింటికి గేటు దగ్గర నిలబడి,
“అమ్మా, నేనలా గుడి దాకా వెళ్ళొస్తా!” గట్టిగా చెప్పి బయల్దేరాడు, వీలైనంత నెమ్మదిగా నడుస్తూ. అనుకున్నట్టే వసుధ వచ్చింది, చీరలో. ఏం మాట్లాడకుండా నవ్వి వచ్చి పక్కనే కూర్చుంది.
“మీ అమ్మగారు పిలిచి, వసుధా, వాడు గుడికి వెళ్తూ నిన్ను రమ్మన్నాడు. ఒకసారి వెళ్ళి రామ్మా,అని చెప్పి పంపారు నన్ను,” నవ్వుతూ చెప్పింది. హే భగవాన్! అసలు అమ్మలకి తెలియకుండా ఏ పనీ చేయలేమేమో!
“చెప్పండి, ఎలా వుంది బొంబాయి?” తనే మొదలు పెట్టింది.
“బొంబాయి బానే వుంది కానీ, ఈ చీరేమిటి? ముదురు నీలం రంగు లంగా, ఆకాశం రంగు ఓణీ వేసుకు రావొచ్చుగా?” అయిష్టంగా మొహం పెడుతూ అన్నాడు.
పగలబడి నవ్వింది.
*********
పాతికేళ్ళుగా ఆ నవ్వు తన జీవితాన్ని పండిస్తూనే వుంది. పెళ్లైన కొత్తలో ఎన్నో సార్లడిగాడు తను-
“అవును కానీ, వసూ! వున్నట్టుండి నీ మనసెందుకు మారిపోయింది? అప్పడిదాకా నన్ను చూస్తే కస్సుమనేదానివి, అంతలోనే ఎందుకు మారిపోయావ్?” అని. తనెమైనా చెప్తేగా- ఎప్పట్లాగే నవ్వేసి,
“సరే, పోనీ, కావాలంటే మళ్ళీ ఇప్పుడు కస్సు బుస్సుమంటాలే, సరేనా?” అనేది.
మరీ క్రికెట్ బాలు? అప్పణ్ణించి దాచుకొన్నదా? అంటే, తనంటే మొదట్నించీ ఇష్టమేనన్నమాట, ఆ కస్సు బుస్సులూ, వెటకారం మాటలూ అంతా వొట్టిదే! గబగబా వసు ఫోటో దగ్గరకు నడచాడు శ్రీధర్. దాని ముందుంచిన వాడిపోయిన పూలు తీసి పారేసాడు. పొద్దున్న తోటలోనుంచి తెచ్చిన పూలు గుత్తిలా చేసి ఫోటో ముందు పెట్టాడు.
“నీ రహస్యం తెలిసిపోయింది వసూ! నీకసలు మొదణ్ణించీ నేనంటే, అబ్బో, పెద్ద యిది. అసలు ఆ కవి బావ గాడు మీ పెద్దమ్మ కూతురి మొగుడని తెలిసినప్పుడే నాకీ అనుమానం వొచ్చింది. కానీ, ఇహ ఇప్పుడు పక్కా సాక్ష్యాలు నా దగ్గరున్నాయ్! ” గర్వంగా అన్నాడు. క్రికెట్ బాలు తీసి పూల పక్కనే పెట్టాడు.
ఫోటోలోంచి వసు అతని వంక చూస్తూ నవ్వుతూ వుంది, చిలిపిగా, ప్రేమగా, పాతికేళ్ళ క్రితం లాగే.

**************

1 thought on “మలయ సమీరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *