April 30, 2024

శంభునటనము

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు

nataraj-dancing-form-lord-shiva-maha-shivratri-wallpaper

మొట్ట మొదట – పతంజలి, శివుని వాహనమైన నంది – వీరిరువరికి సంబంధించిన ఒక చాటుకథను చెప్పాలి. పతంజలి యోగశాస్త్రమును రచించిన మహాముని. అతనికి ఒకనాడు పరమేశ్వరుని సందర్శించాలనే అభిలాష కలిగినది. కైలాస ద్వారమునకు వెళ్లాడు. ఎవరు ఈశ్వరుని చూడవలయు నన్నను, నంది అనుమతి తీసికొని వెళ్ళవలసినదే. నేటి పరిభాషలో నంది ఈశ్వరునికి పీ. ఏ. అన్న మాట. ఎందుకో గాని ఆ రోజు నంది పతంజలికి శివుని దర్శనానికి అనుమతి నీయలేదు. పతంజలి అప్పుడు ఆశువుగా ఈశ్వరుని రూపమైన నటరాజును ఉద్దేశించి కొన్ని పద్యములను చదివాడు. నందికి కొద్దిగా కోపము తెప్పించే పద్యాలు అవి. నిజముగా అవి చిత్రకవిత్వపు కోవకు చెందినది. ఈ పద్యములన్నిటికి దేవనాగరి లిపిలోని కాలు, కొమ్ము లేవు. అనగా ఆకార, ఏకార, ఐకార, ఓకార, ఔకారములతో ఉండే దీర్ఘాక్షరములు లేవు. అనుస్వారము, విసర్గము, సంయుక్తాక్షరములు, మాత్రమే ఇందులో గురువులను కలిగిస్తాయి. ఇకార, ఈకార, ఉకార, ఊకారములు అంగీకృతములు. దీనిని చరణశృంగరహిత నటరాజ స్తోత్రము అని పిలుస్తారు. అనగా కాలు కొమ్ము లేని నటరాజ స్తోత్రము అని అర్థము. కాళ్లతో నడిచే కొమ్ములుండే జంతువు వృషభము గదా! అనగా పతంజలి నందిని అవహేళన చేస్తూ ఈ స్తోత్రమును రచించినాడు. మొత్తము పది పద్యాలు ఉన్నాయి. ఇది విన్న శివునికి సంతృప్తి గలిగి పతంజలికి దర్శనము నిచ్చెను.

మచ్చుకు మొదటి పద్యమును క్రింద ఇస్తున్నాను-

సదంచిత ముదంచిత నికుంజిత పదం ఝలఝలంచలిత మంజు కటకం
పతంజలి దృగంజన మనంజన మచంచల పదం జనన భంజన కరం
కదంబరుచి మంబర వసం పరమమంబుద కదంబక విడంబక గలం
చిదంబుధి మణిం బుధ హృదంబుజ రవిం పర చిదంబర నటం హృది భజ
(సద్భక్తులచే కొనియాడబడువాడు, సంతోషము నిచ్చు వాడు, నాట్యమాడు నప్పుడు పాదములను వంచినవాడు, నాట్యమాడు నప్పుడు సవ్వడిచేయు కడియములు గలవాడు, పతంజలి కన్నులకు కాటుకవంటివాడు, మలినములేనివాడు, అచంచల పదములు గలవాడు, భవనాశనము చేయువాడు, కదంబపుష్పకాంతులు గలిగినవాడు, అంబరమునే అంబరముగా కట్టినవాడు, దట్టమైన మేఘములగుంపును బోలిన కంఠము గలవాడు, చిత్తు అను సముద్రములోని మణియైనవాడు, విజ్ఞుల మానసాంభోజములకు సూర్యునివంటి వాడు, ఇట్టి గుణములు కలిగిన చిదంబర నటరాజును మనస్సులో భజించుచున్నాను.)

మొత్తము పది శ్లోకములను, వాటి తాత్పర్యములను ఇక్కడ చదువవచ్చును –
http://sanskritdocuments.org/doc_shiva/nataraj.html?lang=sa

ఇక్కడ వినవచ్చును –

ఇక్కడ విని నృత్యరూపములో దర్శించవచ్చును –

దేవనాగరిలిపి పురాతన బ్రాహ్మి లిపిపై ఆధారపడినది. ఇది క్రీస్తుశకము ఒకటినుండి మూడవ శతాబ్దము కాలములో భారతదేశములో అమలులోనికి వచ్చినది అని భాషాశాస్త్రజ్ఞులు భావిస్తారు. ఏడవ శతాబ్దానికి ఇది పూర్తిగా అమలులోనికి వచ్చినది. అనగా ఈ శ్లోకములను వ్రాసిన పతంజలి కవి కనీసము మూడవ శతాబ్దము లేక తఱువాతి కాలమునకు చెందినవాడని చెప్పవచ్చును. ఈ పతంజలి కవి నివాస స్థానము తమిళనాడులోని నేటి చిదంబరము అని ఊహ.

ఈ వృత్తపు ఛందస్సును పరిశీలిస్తే, ఇందులో ఆఱు జ-ల (IUII) గణములు, చివర ఒక లగము ఉన్నాయి. అనగా ప్రతి పాదములో 26 అక్షరములు. ఇది ఉత్కృతి ఛందములోని 31317470వ వృత్తము. దీనిని నేను నంది వృత్తము అని కూడ పిలుస్తాను. ఇది ఒక విధముగా మంగళమహాశ్రీ వృత్తమువంటిది. మంగళమహాశ్రీ వృత్తములో ఆఱు భ-లములు (UIII), రెండు గురువులు, ఇందులో ఆఱు జ-లములు, ఒక లగము. పద్యము ఎదురు నడకతో (IU – లగముతో) ఆరంభమవుతుంది. రెండు వృత్తములు మంగళప్రదములే. ఈ వృత్తమును ఛందశ్శాస్త్రములో శంభునటనము లేక సుధ అని పిలుస్తారు. ఈ వృత్తము వేళంకర్ వ్రాసిన “జయదామన్” సంకలనములో లేదు. అనగా, ఇది పన్నెండవ శతాబ్దమువఱకు సంస్కృత లాక్షణికులకు తెలియదు. కన్నడములో నాగవర్మ రచించిన “ఛందోంబుధి”లో కూడ ఈ వృత్తము లేదు. తెలుగులో కోవెల సంపత్కుమారాచార్యుల “ఛందఃపదకోశము”లో కూడ ఈ వృత్తము పేర్కొనబడలేదు. కావున ఇందులోని పతంజలి నిజముగా మహాభాష్య రచనాకారుడు కాదని నా అభిప్రాయము. నేను ఈ వృత్తమును మొట్టమొదట మరాఠీ లక్షణగ్రంథమైన “ఛందోరచనలో” సుధా అనే పేరితో చూచినాను. క్రింద తెలుగులో నా ఉదాహరణములు –

శంభునటనము / సుధ / నంది వృత్తము – 26 ఉత్కృతి 31317470

(1) రెండేసి మాత్రాగణములకు ప్రాసయతితో –
వనమ్మున విరుల్ బలు – కనంగను ముదమ్మున – మనస్సున దలంచితి నినున్
ఘనమ్ముల మహస్సులు – స్వనమ్ములు రయమ్ముగ – జనించగ గలంగితి దడన్‌
దినమ్మది నిరంతర – మనర్థము సునందిని – మునుంగగ గడుంగడు వ్యధన్‌
సునందన ముఖమ్మును – గనన్‌ వర గళమ్మును – వినన్‌ మది తరించును వడిన్‌
वनम्मुन विरुल् बलु – कनंगनु मुदम्मुन – मनस्सुन दलंचिति निनुन्
घनम्मुल महस्सुलु – स्वनम्मुलु रयम्मुग – जनिंचग गलंगिति दडन्‌
दिनम्मदि निरंतर – मनर्थमु सुनंदिनि – मुनुंगग गडुंगडु व्यधन्‌
सुनंदन मुखम्मुनु – गनन्‌ वर गळम्मुनु – विनन्‌ मदि तरिंचुनु वडिन्‌

(2)
నగమ్ములు ధ్వనించగ – జగమ్ములు భ్రమించగ – యుగమ్ములు రమించగ బృహ-
న్నగమ్ముల తనూజయు – జగత్పిత శివున్ గని – సుగమ్మున నటించగ సుప-
న్నగమ్ములు చలించగ – దిగంబర పదంచిత – మగమ్యము లచింత్యము లవన్‌
భగప్రద శివప్రద – మగత్యము చిదంబరు – దిగంతపు పదమ్ముల లయల్‌
नगम्मुलु ध्वनिंचग – जगम्मुलु भ्रमिंचग – युगम्मुलु रमिंचग बृह-
न्नगम्मुल तनूजयु. – जगत्पित शिवुन् गनि – सुगम्मुन नटिंचग सुप-
न्नगम्मुलु चलिंचग – दिगंबर पदंचित – मगम्यमु लचिंत्यमु लवन्‌
भगप्रद शिवप्रद – मगत्यमु चिदंबरु – दिगंतपु पदम्मुल लयल्‌

(3) రెండు అక్షరముల తఱువాత ప్రాసయతితో (న-గములకు)
హరిన్‌ సరసునిన్‌ సదయునిన్‌ – స్వరధునిన్‌ సజయునిన్‌ – వరమణిన్‌ శమనునిన్‌
వరున్‌ లలితునిన్‌ విమలునిన్‌ – చలితునిన్‌ సుమసరున్‌ – బలభుజున్‌ బలనిధిన్‌
నరున్‌ నరవరున్‌ స్మితముఖున్‌ – మురహరున్‌ శశిముఖున్‌ – గురువరున్‌ రసనదిన్‌
దరిన్‌ గనగ సమ్ముదమగున్‌ – విన సడిన్‌ గరగుదున్‌ – మనమగున్‌ సుధయనన్
हरिन्‌ सरसुनिन्‌ सदयुनिन्‌ – स्वरधुनिन्‌ सजयुनिन्‌ – वरमणिन्‌ शमनुनिन्‌
वरुन्‌ ललितुनिन्‌ विमलुनिन्‌ – चलितुनिन्‌ सुमसरुन्‌ – बलभुजुन्‌ बलनिधिन्‌
नरुन्‌ नरवरुन्‌ स्मितमुखुन्‌ – मुरहरुन्‌ शशिमुखुन्‌ – गुरुवरुन्‌ रसनदिन्‌
दरिन्‌ गनग सम्मुदमगुन्‌ – विन सडिन्‌ गरगुदुन्‌ – मनमगुन्‌ सुध यनन्

పై మూడు పద్యములు దేవనాగరి లిపిలో కూడ ఇవ్వబడినది. దీర్ఘములు, కొమ్ములు పై మూడు పద్యములలో లేవని మీరు గమనించ వచ్చును.

(4) ఒక అక్షరము తఱువాత ప్రాసయతితో (భ-లములకు)
సరాళగతి గీతముల – తాళగతి వృత్తముల – మేలులయ సంగతులతో
కరాళ హరనృత్యమున – లోలుడయి నంది గడు – లీలగ మృదంగతతులన్‌
కరాల వడి మ్రోయ శివు – డోలగమునందు మది – జాల ముదితుండయె గదా
సరాల మెడ వేతును సు-మాల నిను గొల్తును వ-రాల బసవయ్య యివరా

మూడవ, నాలుగవ ఉదాహరణములలో ప్రాసయతిని రెండవ అక్షరముతో కాక తఱువాతి అక్షరములతో ఉంచినాను. దీనివలన ఒక ప్రయోజనము ఏమనగా, అన్ని పాదములలో ఒకే ప్రాసయతిని ఉంచ నక్కరలేదు. ఈ వృత్తములో మౕఱొక విశేషము కూడ ఉన్నది. అదేమనగా మొదటి పది అక్షరాలకు, చివరి పది అక్షరాలకు గురు-లఘువులు ఒక్కటే. వీటికి ప్రాసయతిని ఉంచి వ్రాసిన పద్యములు క్రింద చదువవచ్చును. మధ్య గల ఆఱు అక్షరాలు వాటంతట అవే ఉంటాయి. ఈ అక్షరాలను ఉంచి చదివితే ఒక లయ, లేక చదివితే మఱొక లయ. అట్టి దానికి క్రింద ఉదాహరణములు –

సుధా లేక శంభునటనము లేక నందివృత్తము –
(జ-ల-జ-ల- ల-గ) (న-భ) (జ-ల-జ-ల- ల-గ), ప్రాసయతి (1, 17)

సదా నిను స్మరింతు నచరా – అనలలోచన – పదమ్ముల దలంతు రుచిరా
సుధాకరధరా సురవరా – అఘవిమోచన – సుధార్ణవ వరా౽భయకరా
చిదంబర నటేశ్వర హరా – నగజనాయక – హృదంబుజ దివాకర పరా
ముదాకర గణేశ్వర చిరా – సుగుణదాయక – సదాశివ సదా శివకరా

పదునొకండవ అక్షరముతో అక్షరసామ్య యతి, 17వ అక్షరముతో (అనగా 2, 18 ప్రాసాక్షరములు) ప్రాసయతితో ఒక ఉదాహరణము –

ధరాతలి నభమ్మది సదా – ధ్వను లొసంగెడు – స్వరమ్ముల విభూతియె గదా
సురాసురు లనాదిగ స్థిరా – శుభ మవంగను – గరమ్ముల యజింతురు హరా
నిరామయ నిరంతర నిధీ – నృతి నొనర్చెడు – నిరంజన దయామయ సుధీ
హరోంహర హరోంహర శివా – యని భవమ్మున – దరింతును స్మరింతును భవా

వంతెన గణములైన న, భ గణములను తొలగించినప్పుడు కూడ పై రెండు వృత్తములు అర్థవంతముగా ఉండును. అదెట్లనిన –

సదా నిను స్మరింతు నచరా – పదమ్ముల దలంతు రుచిరా
సుధాకరధరా సురవరా – సుధార్ణవ వరా౽భయకరా
చిదంబర నటేశ్వర హరా – హృదంబుజ దివాకర పరా
ముదాకర గణేశ్వర చిరా – సదాశివ సదా శివకరా

ధరాతలి నభమ్మది సదా – స్వరమ్ముల విభూతియె గదా
సురాసురు లనాదిగ స్థిరా – గరమ్ముల యజింతురు హరా
నిరామయ నిరంతర నిధీ – నిరంజన దయామయ సుధీ
హరోంహర హరోంహర శివా – తరింతును స్మరింతును భవా

శంభునటన వృత్తము బోలిన ఛందస్సు అరుణగిరినాథర్ వ్రాసిన తమిళములోని తిరుప్పుగళ్‌లో కూడ ఉన్నది. పెరుంగుడి క్షేత్రమును సందర్శించినప్పుడు వ్రాసిన పాటలలో ఒకటి క్రిందిది –

తనందన తనందన తనందన తనందన తనందన తనందన తనదానా ఛందము –

తలంగళిల్ వరుంగన ఇలంగొడు మడందైయర్ తళైందవు తరందిగళ్ … దశమాద-
చ్చమందనర్ పిఱందనర్ కిడందన రిరుందనర్ తవళ్‌ందనర్ నడందనర్ … శిలకాలం
తులంగునల పెణ్గళై ముయంగినర్ మయంగినర్ తొడుందొళిలుడందమ … గ్రగపారం
శుమందన రమైందనర్ కుఱైందన రిఱందనర్ శుడుంబినై యెనుంబవ … మొళియోనే

(భూమిలో పలు చోటులలో నుండు పెద్ద ఇళ్లలో ఉండే తల్లుల గర్భములో పది నెలలు పెఱిగి తఱువాత శిశువులై జన్మించినారు, పడకలో పరుండినారు, కూర్చున్నారు, ప్రాకినారు, తఱువాత నడచినారు, కొన్ని ఏళ్ల పిదప శీలవతులను పెండ్లాడారు, భార్యలను మోహించినారు, పిదప గృహస్థాశ్రమమును స్వీకరించినారు, అలా ఆ జీవితాన్ని గడిపి చివరకు మరణించారు, దహించబడినారు. అట్టి ఈ జననమరణములను నాశనము చేయజాలడా?)

సంబందర్ వ్రాసిన తేవారములో నాలుగు జ-ల ములు గల పాటలు ఉన్నాయి. కాని ఆఱు జ-ల ములు గల పాటలు లేవు.

ఈ ఛందస్సు పూర్తిగా దక్షిణ దేశములో ఆవిర్భవించినది. సామాన్యముగా వృత్తము లన్నియు సంస్కృతమునుండి పుట్టినవనే ఒక భావన మనకున్నది. ఎక్కువ పాలు వృత్తములు సంస్కృతమునుండి పుట్టినను, దక్షిణాదిలో కూడ కొన్ని వృత్తములు పుట్టినాయని నిస్సందేహముగా చెప్పవచ్చును.

నేను శ్రీ రాళ్లబండి కవితాప్రసాద్ గారిని ఎనిమిదేళ్ళకు ముందు హైదరాబదులో కలిసి మాటలాడాను. ఆ సంభాషణలో ఈ శంభునటన వృత్తపు ప్రస్తావన కూడ వచ్చినది. దానిని నెమరువేసికొంటూ, ఈ లఘు వ్యాసమును వారి స్మృతికి అంకితము చేస్తున్నాను. తిరుప్పుగళ్ లోని ఉదాహరణమును నాకు తెలిపిన న్యూజెర్సీ వాస్తవ్యులు శ్రీ సుబ్రహ్మణ్యం గారికి నా కృతజ్ఞతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *