April 27, 2024

దింపుడుగల్లం

రచన:-రామా చంద్రమౌళి

dimpudu

ఎదురుచూపులన్నీ ఆఖరి చూపులుగా మారుతున్న వేళ
మనిషి సమూహంలోనుండి ఒంటరిగా పరివర్తిస్తూ
ఒక దుఃఖసముద్రం మధ్య
దింపుడుగల్లం..భస్మపీఠానికి తొలిమెట్టు
స్మశానం..ఒక నిత్యానందలోకం..ఒక నిసర్గ స్వర్గం

అందరి మనసులనిండా స్తబ్ధసాగరం
ఆ క్షణం..నిజానికి ఆమె మృతురాలు కాదు
విముక్త ఆత్మ
పక్షి విడిచిన పంజరం
మనిషి శరీరం ఒక మజిలీ..ఇప్పుడు విడిచిపెట్టిన ఇల్లు
ఆ దింపుడుగల్లం వేదిక..అంటే చివరి ఆశ
జీవశేషంకోసం వెదుకులాట
అప్పటిదాకా మనిషిని మోస్తూ వచ్చినవాళ్ళు
బాధ్యతను భుజాలు భుజాలుగా మార్చుకుని
అనివార్యమై భారాన్ని దించుకుంటారు..క్షణిక విరామం
చుట్టూ సుళ్ళు దిరిగే దుఃఖమే..
ఐనా ఆమె శరీరంపై ఉన్న నగలపై దృష్టి అందరిదీ
ఒలిచెయ్యాలి..ఎక్కడా ఓ పిసరైనా మిగలకుండా
చుట్టూ చూపులు స్థంభిస్తాయి….ష్ ష్ ష్ ..అంతా నిశ్శబ్దం
‘పిలవండి..పిలవండి..చివరిసారి పిలవండిక తనివిదీరా’
ప్రేమలకు అతీతమైన దుఃఖాకర్షణేదో గంగలా పొంగుతుంది
అమ్మ..అమ్మమ్మా..బామ్మా..నా భార్యా..జీవనసహచరీ
పరమ పవిత్రమైన ఆత్మకు ప్రతీకైన ‘స్త్రీ’
నువ్వు దేవతవు..సహనమూర్తివి
ఆదివీ..అంకురానివీ..అంతానివీ
ఒక్క వ్యక్తివై.. నీనుండి ఒక కుటుంబాన్ని ఆవిష్కరించిన
సృష్టి మూలానివి.,
పిలుపులు పెగలవు గొంతులోనుండి
మనిషిలో..ఇనాళ్ళూ గుప్తమై ఒక మహాసముద్రముందా
శవయాత్రకు అందని.. మనుమడు
ఖండాంతరాల్లోనుండి ‘మొబైల్ ‘ లోనుండి పిలుస్తాడు
‘ బామ్మా’ అని పొగిలి పొగిలి వేదన
కాని తలనిమిరే చేతులు విశ్రమించాయి కదా
ఉండీ..ఉండీ..మళ్ళీ..చావు డప్పుల హోరు కెరటమై
ధనాధన్..ధనాధన్..ఒక లయ విస్ఫోటనం
‘ గోవిందా గోవిందా..రాం నాం సత్య హై ‘
అసలు మనిషి జీవితం సత్యమేనా
అంతా అవాస్తవిక వాస్తవికత..మాయ
మాయలోనుండి రెండు నిమిషాలు మళ్ళీ శవయాత్ర
చితిపై..కొత్త బట్టల్లో పాత మనిషి
అంతా..చావు వాసన..అగరొత్తులు..డాంబర్ గోళీలు..సెంట్ ఆవిరి
అది మృత్యు పరిమళం కూడా కాదా.?
చుట్టూ అందరూ..గడ్డకడ్తున్న చూపులతో
‘రేపటి తమ గతినీ..యాత్రనూ స్పృహిస్తూ’
ఛీ..పాడు జీవితం..ఒట్టి నీటిబుడగ..అంతా భ్రాంతి
చూస్తూండగానే..గుప్పున మంటలు
భుజంపై కుండ పగలగానే
నీటిలోనుండి ప్రళయించిన నిప్పు
మనుషులందరూ..తలలు వంచుకుని నిశ్శబ్దంగా
ఎవరింటికి వాళ్ళు..గూడుదిక్కు పక్షులు
ప్రక్కన చెట్టుపైనుండి
ఒక ఒంటరి కాకి..అరుస్తూంటుంది ఆనందంతో
క్షణకాలమైనా మనుషులు
కాకుల్లా సమూహమై కూడినందుకు అభినందన
* * *
తెల్లారుతుందికదా
రాత్రంతా చితి ఎర్రగా మండీ మండీ
చివరికి తెల్లగా మిగిలిన దోసెడు చితాభస్మం
భస్మసింహాసనంపై..సామ్రాజ్ఞి ..ఆమె –

1 thought on “దింపుడుగల్లం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *