April 28, 2024

మన వాగ్గేయకారులు – (భాగము – 6)

రచన: సిరి వడ్డే

మహాకవి క్షేత్రయ్య (క్షేత్రజ్ఞుడు) :

200px-XEtrayya

సముద్రతీరాంధ్ర ప్రాంతాల్లో వెలసిన వాగ్గేయ కారులు, పదకర్తలు, తెలుగులో మహనీయులెందరో ఉన్నారు. వారి సేవ అనంతమైంది. శిష్ట సాహిత్యమైన పద్య కవితకంటే, శిష్టేతర సాహిత్య మైన ఈ పదసాహిత్యం వల్లనే ప్రజల్లో- అంటే అక్షర జ్ఞానంలేని వారికెందరికో ముక్తికి సోపానమైన భక్తితో పాటు నీతి, వైరాగ్య, వేదాంత ధోరణులు వివరించబడ్డాయి. భక్తి భావన భారతీయ తత్త్వం. భక్తితో పాటు పదకవిత ప్రారంభమైంది. జనపదాలలోని పామర ప్రజానీకం తమకు తగిన రీతిలో ఆడిపాడుకొన్నారు. దీన్నే జానపద కవిత అంటున్నాము. అది లిఖితంకాలేదు, మౌఖికం మాత్రమే. రాజపోషణ లేదు. అయినా ‘ముఖేముఖే సరస్వతి’- అన్నట్లు ఈ జానపద సాహిత్యం అందరిలో వ్యాపించింది. ఈ జానపదమే నిబద్ధీకరింపబడి, పదసాహిత్యమైంది. తీరాంధ్ర ప్రదేశంలో ఎందరో వాగ్గేయకారులు, పదకర్తలు వెలసి సామాన్య ప్రజానీకానికి భక్తి, తాత్త్వికత, నీతి, వైరాగ్యాది మార్గాలను చూపి, ప్రజలలో చైతన్యం తీసుకొని రావడానికి ప్రయత్నించారు. అందులో మొట్ట మొదట పేర్కొనదగ్గ మహావాగ్గేయకారుడు క్షేత్రయ్య. అన్నమాచార్యులు రచించినన్ని వేల సంకీర్తనలు రచించక పోయినా క్షేత్రయ్య శృంగార, మధురభక్తి మార్గాల్లో మహా వాగ్గేయకారుడు అభినయాచార్యులు.

జీవిత విశేషాలు :

కర్ణాటక సంగీతంలో పేరెన్నకగన్న వాగ్గేయకారులలో క్షేత్రయ్య (1595-1660) ఒకరు. ఈయన అసలు పేరు “మొవ్వా వరదయ్య”గా భావిస్తున్నారు. అనేక పుణ్యక్షేత్రాలు, దేవాలయాలను సందర్శిస్తూ వాటి గురించిన వివరాలు తెలుసుకుంటూ ఉండటం చేత ఈయనకు “క్షేత్రజ్ఞుడు” అనే పేరు వచ్చింది. క్రమేణా అది క్షేత్రయ్యగా మారింది. క్షేత్రయ్య గారి జీవితకాలం 1595-1660 మధ్యకాలం కావచ్చును. ఈయన అసలుపేరు “అర్భకం వరదయ్య”. ఇంటిపేరు “మొవ్వ”. క్షేత్రయ్య పదాలలోని “వరద” అనే ముద్ర స్వనామ ముద్రగా భావించి, అసలు పేరు ‘వరదయ్య’గా నిర్ణయించారు. ఈయన జన్మస్థలం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోని, కృష్ణా జిల్లాలో “మొవ్వ” గ్రామం. ఈ మొవ్వని మువ్వ, మూవ, మవ్వ అని కూడా అంటారు. ఆ ఊరిలో వెలసిన వేణుగోపాలస్వామి ఈయన ఇష్టదైవం.
జనబాహుళ్యంలో ఉన్న కథ ప్రకారం చిన్నతనం నుండి వరదయ్య గారికి గానాభినయాలంటే మక్కువ. కూచిపూడిలో ఒక ఆచార్యుని వద్ద నాట్యం నేర్చుకొన్నారు. సహపాఠి అయిన “మోహనాంగి” అనే దేవదాసితో సన్నిహితుడైనారు. తరువాత మేనమామ కూతురు “రుక్మిణి”ని పెండ్లాడారు. కాని మోహనాంగి పట్ల ఈయనకు మక్కువ తగ్గలేదు. మోహనాంగి చాలా వివేకం కలిగిన పండితురాలు. తమ ఆరాధ్య దైవమైన మువ్వగోపాలునిపై నాలుగు పదాలు పాడి తనను మెప్పించగలిగితే తాను వరదయ్య ప్రేమను అంగీకరిస్తానని మోహనాంగి షరతు విధించిందట. మోహనాంగి పెట్టిన షరతు కోసం వరదయ్య నిరంతరం సాధన చేయసాగారట. ఆ సాధన కారణంగా ప్రపంచములోని జీవాత్మలన్నీ స్త్రీలని, పరమాత్ముడయిన మువ్వగోపాలుడొక్కడే పురుషుడనే తత్వం వరదయ్యను అలుముకొన్నదట. క్రమంగా ఆ మధురభక్తితో అనేక పాటలు పాడారు. వాటికి మోహనాంగి నాట్యం చేసిందట. మరొక కథ ఏమిటంటే, బాల్యంలో విద్యాగంధం లేని వరదయ్య పశువుల కాపరిగా ఉండేవారు. ఒక యోగి ఇతనికి ‘గోపాల మంత్రం’ ఉపదేశించారు. ఆనాటి నుండి అతనికి గొప్ప కవితా శక్తి అలవడింది.

దేశాటనం, సన్మానాలు :

ఆంధ్రదేశంలోని తిరుపతి, కడప, శ్రీశైలం మున్నగు క్షేత్రాలలో నెలకొన్న దేవతలపైనే కాక, కంచి, శ్రీరంగం, మధుర, తిరువళ్ళూరులలో వెలసిన స్వామి వార్లపై కూడా క్షేత్రయ్య పదాలు రచించారు. కాని, అన్నిటిని మువ్వ గోపాలునికి అంకితంగావించి ఆ స్వామితో ఆయా దేవతలకు అభేదం కల్పించారు. ఈ దేశాటనం కారణంగానే వీరికి క్షేత్రయ్య అనే నామం స్థిరమైనదనిపిస్తున్నది. ముందుగా గుంటూరు జిల్లా బెల్లంకొండలో చలువు చక్కరపురీశుని దర్శించారు(చలువ చక్కెరపురి నిలయుడని మదిలో వలవేసి నిను వలపించలేద?). అనంతరం భద్రాచలం లోని సీతారామచంద్రస్వామిని, పిదప శ్రీశైలం మల్లికార్జునుని, ఆపై హంపి హేమాద్రి నిలయుని దర్శించారు. క్షేత్రయ్య దర్శించిన ఇతర క్షేత్రాలు – పాలగిరి చెన్నకేశవుడు, ఇనగలూరు ఇనపురి స్వామి, (దేవుని) కడప వెంకటేశ్వర స్వామిని దర్శించారు. తిరుపతి చేరి వెంకటేశ్వర స్వామి, ఇతర దేవతామూర్తులపై అనేక పదాలు రచించారు.
పిదప దక్షిణాభిముఖంగా సాగి (దక్షిణ ఆర్కాటు జిల్లా) కోవిల్లూరు మువ్వగోపాల స్వామిని దర్శించారు. తిరువళ్ళూరు వీర రాఘవస్వామి, వేద నారాయణపురం వేదపురీశుడు, సత్యవేడు సత్యపురవాసుదేవుడు, కరిగిరి స్వామి దేవుళ్ళ దర్శనం చేసుకొన్నారు. మార్గంలో పండితుల, పాలకుల సత్కారాలందుకొన్నారు. క్షేత్రయ్యను ఎందరో ప్రభువులు సన్మానించారు. వారిలో మధురనేలిన తిరుమల నాయకుడు, గోల్కొండ నవాబు, తంజావూరు రఘునాధ నాయకుడు, చెంజి కృష్ణప్ప నాయుడు (తుపాకుల రాయుడు) ప్రముఖులు. రఘునాధ నాయకునిపై క్షేత్రయ్య వేయి పదాలు చెప్పారు.
చిదంబంరం గోవిందస్వామిని “తిల్ల గోవిందస్వామి” అని క్షేత్రయ్య ప్రస్తుతించారు. చిదంబరం పాలకుడైన కృష్ణప్పనాయకుని సన్మానం అనంతరం క్షేత్రయ్య తంజావూరు వెళ్ళి రఘునాధనాయకుని ఆస్థానంలో కొంతకాలం ఉన్నారు. అక్కడి నుండే శ్రీరంగం, కంచి, రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించారు. క్షేత్రయ్య దర్శించిన క్షేత్రాలలోని దైవం గురించి కొన్ని క్షేత్రయ్య పదాలు మనకు లభిస్తున్నాయి. 1646లో తంజావూరు పతనమై గోల్కొండ నవాబు వశమైంది. గోల్కొండ సైన్యాధిపతి మీర్ జుమ్లా సాహిత్యాభిమాని. క్షేత్రయ్యను సగౌరవంగా గోల్కొండ నవాబు సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా వద్దకు తోడ్కొని వెళ్లాడు. ఆ నవాబు ఆస్థానంలో క్షేత్రయ్య పెక్కుకాలం ఉండి 1500 పదాలు వ్రాశారు. తిరుగుప్రయాణంలో భద్రాచలం క్రొత్త తహశీల్దార్ శ్రీ కంచెర్ల గోపన్న క్షేత్రయ్యను ఆదరించారు. అనంతరం క్షేత్రయ్య తన స్వగ్రామం మొవ్వకు తిరిగివచ్చారు. తాను వివిధ పాలకులవద్ద కూర్చిన పదాలగురించ ఈ క్షేత్రయ్య పదం ద్వారా మనకు తెలుస్తుంది.

దేవగాంధారి రాగం – ఆది తాళం

పల్లవి:
వేడుకతో నడచుకొన్న – విటరాయడే

అనుపల్లవి:
ఏడుమూడు తరములుగా – ఇందు నెలకొన్న కాణాచట!
కూడుకొని మువ్వ గోపాలుడే నా విభుడు ||వేడుక||

చరణాలు:
మధుర తిరుమలేంద్రుడు – మంచి బహుమానమొసగి
యెదుట కూర్చుండమని – ఎన్నికలిమ్మనెనే
యిదిగో రెండువేల పదములు – ఇపుడెంచుకొమ్మనగా?
చదురు మీదనే యున్న సామికి – సంతోషమింతింత గాదె? ||వేడుక||

అలుకమీరి తంజావూరి అచ్యుత విజయరాఘవుడు
వెలయ మనుజుల వెంబడి – వేగమె పొడగాంచి
చలువ చప్పరమున నుండగ – చక్కగ వేయి పదముల
పలుకరించుకోగానే బహుమానమిచ్చేనావేళ ||వేడుక||

బలవంతుడయిన గోలకొండ – పాదుషా బహుమానమిచ్చి
తులసిమూర్తితో వాదు తలచే నావేళ
వెలయు మువ్వ గోపాలుడు – వెయ్యిన్నూరు పదములు
నలువది దినములలో – నన్ను గలసి వినిపించెనే ||వేడుక||

క్షేత్రయ్య పద విశిష్టత :

మాట, పాటలను స్వతంత్రంగా రచించగలిగినవారినే వాగ్గేయకారులు లేదా బయకారులు అన్నారు. భక్తుడు తనను నాయికగా భావించి భగవంతుని పొందుకోసం చెందే ఆరాటమే మధురభక్తి. ఇలాంటి మధురభక్తి ప్రబలంగా ఉన్న17వ శతాబ్దంలో క్షేత్రయ్య జీవించారు. పదకవితలకు ఆద్యుడిగా క్షేత్రయ్యను భావిస్తున్నారు. ఆయన పదకవితలు నేటికీ సాంప్రదాయ నృత్యరీతులకు వెన్నెముకగా నిలిచి ఉన్నాయి. ఆయన 4,500కు పైగా పదాలు రచించారని “వేడుకతో నడుచుకొన్న విటరాయుడే” అనే పదం వలన తెలుస్తున్నది. వాటిలో 1,500 పదాల వరకు గోల్కొండ నవాబు అబ్దుల్లా కుతుబ్ షాకు అంకితమిచ్చారు. ఈనాడు మనకు 330 పదాలు మాత్రమే లభిస్తున్నాయి. క్షేత్రయ్య పదాలలో లలితమైన తెలుగుతనంతో పాటు, చక్కని అలంకారాలు మరియు జాతీయాలు ఎక్కువగా కనిపిస్తాయి. సంగీతానికి, సాహిత్యానికి సరైన ప్రాధాన్యము ఇచ్చిన పదకర్తగా ఆధునికులు క్షేత్రయ్యను మిక్కిలి ప్రశంసించారు.
డాక్టర్ మంగళగిరి ప్రమీలాదేవి తన రచనలో క్షేత్రయ్య పదాలకు ఈ విశిష్టతలు ఉన్నాయని వివరించించారు. భావ విస్తృతికి అనువైన రాగ ప్రస్తారం. క్షేత్రయ్య పదాలకు సంగతులు పాడే అలవాటున్నది. ఈయన పదాలు రాగ భావ పరిపూరితాలు. రాగాలను భావానుగుణంగా ప్రయోగించడం తెలిసిన సంగీతజ్ఞుడు క్షేత్రయ్య. ఈయన తన పదాలలో షుమారు 40 రాగాలను ఉపయోగించాడు. త్రిపుట తాళంలో ఎక్కువ పదాలు పాడారు. క్షేత్రయ్య పదాలు ఎక్కువగా అభినయం కోసం ఉద్దేశింపబడినవి. వీనిలో నృత్తానికి అవకాశం తక్కువ. దృశ్యయోగ్యాలైన శబ్దాలను ఎన్నింటినో చక్కగా వాడారు. మూర్తి వర్ణన కూడా చాలా చక్కగా చేశారు.
ఒక్కమాటలో చెప్పాలంటే క్షేత్రయ్య పదం దృశ్య శ్రవణ సమసంబంధి! కళాహృదయ చైతన్య గ్రంధి! సంగీత సాహిత్య అభినయాలకు సముచిత ప్రాధాన్యత ఉన్న పదకవితలను రచించి క్షేత్రయ్య తరువాతివారికెందరికో మార్గదర్శకుడైనారు.
క్షేత్రయ్య పదాల లక్షణాల గురించి డా. దివాకర్ల వేంకటావధాని ఇలా వ్రాశారు. తెలుగులో గేయములను ఆరు విధాలుగా విభజింపవచ్చును – కృతులు, కీర్తనలు, తత్వములు, పదములు, జావళీలు, పాటలు. వీటిలో పదములు, జావళీలు అభినయానుకూలములు. అందునా పదములు రాగతాళవిలంబముతో కూడియుండును. క్షేత్రయ్య వట్టి పదకర్తయే కాదు. అలంకారశాస్త్రములో ప్రావీణ్యత సంపాదించి క్రొత్త పుంతలు త్రొక్కినారు. పదములలో గొప్ప సంగీత కళాపాటవమును ప్రవేశపెట్టినవారిలో అగ్రగణ్యుడు క్షేత్రయ్య. అదివరకెవ్వరు రాగమునకిట్టి అందచందములు కూర్చలేదు. తరువాతి వాగ్గేయకారులకును, సంగీతకారులకును క్షేత్రయ్య మార్గదర్శియైనారు. కాలప్రభావముననుసరించి ఈయన తన పదములలో శృంగారమునకే అధిక ప్రాధాన్యతనిచ్చినారు. మనమెట్టి నాయికానాయకుల గురించి తెలుసుకోవాలన్నా గాని క్షేత్రయ్య పదాలలో చక్కని ఉదాహరణం లభిస్తుంది. భావ ప్రకటనమున క్షేత్రయ్య మిక్కిలి ప్రౌఢుడు. అతని పదములన్నియును వినివారి హృదయములకత్తుకొనే భావములకు ఉనికిపట్టు. ఆనాటి పలుకుబడులెన్నో అతని పదాలలో గోచరిస్తాయి. అతడు మారు మూల పదములు, జాతీయములు ఎక్కువగా వాడారు. “శబ్దరత్నాకరం”లో అతని పదాలను విరివిగా ఉదాహరించారు. క్షేత్రయ్య పదములు అభినయానుకూల్యమైనవి.

పూర్తి క్షేత్రయ్య పదాలు :
ఆనంద భైరవి రాగం – ఆదితాళం
1.
పల్లవి:
శ్రీపతి సుతు బారికి నే-నోపలేక నిను వేడితే
కోపాలా? మువ్వ గోపాలా?

అనుపల్లవి:
ఏ ప్రొద్దు దానింటిలోనే-కాపైయుండి నీ సరస స
ల్లాపాలా? మువ్వ గోపాలా?

చరణాలు:
పైపూత మాటలు నేర్ప-జూపుదాని రతిపై నింత
తీపేలా? మువ్వ గోపాలా?

చూపుల నన్యుల దేరి-చూడని నాతో క
లాపాలా? మువ్వ గోపాలా?

నా పొందెల్ల దానికబ్బి-యే పొందును లేక యుసురనుటే
నా పాలా? మువ్వ గోపాలా?

2.
ఇంతసేపు మోహమేమిరా ? ఇందరికంటే – నింతి చక్కనిదేమిరా ?
సుంతసేపు దాని – జూడకుండలేవు
అంతరంగము దెలుప – వదియేల మువ్వగోపాలా ! ||ఇంత||

నీకెదురుగ వచ్చునా ? నెనరూరగా – నిండు కౌగిట జేర్చునా ?
ఆకుమడుపు లిచ్చునా ? తన చెలిమి
కైన వాడని మెచ్చునా ? తమి హెచ్చునా ?

ఏకచిత్తమున మీరిద్దరు – నింపు సొంపుగ నున్న ముచ్చట
నాకు వినవిన వేడుకయ్యిరా ! యిపుడానతీరా ! ||ఇంత||

మోవి పానకమిచ్చునా ? కొసరి కొసరి – ముద్దులాడనిచ్చునా ?
తావి పువ్వుల దెచ్చునా ? తన సొగసుకు
తగినవాడని మెచ్చునా ? మనసిచ్చునా ?
దేవరే మొగడు గావలెనని – భావజుని పూజ లొనరించిన
యా వనిత పేరేమి సెలవీరా ? సిగ్గేలరా ? ||ఇంత||

సంతోషముగ నాడునా ? తంబుర మీట – సంచు పాట పాడునా ?
వింత రతుల గూడునా ? ఆ సమయమున
విడవకుమని వేడునా ? కొనియాడునా ?
సంతతము న న్నేలుకొని యా – కాంతపై వలచినపుడె యిక
కొంత యున్నదో మువ్వగోపాల ? గోరడ మేలా ? ||ఇంత||

3.
ఎవ్వడే ఎవ్వడే ఓ భామ వీడెవ్వడే
ఎవ్వడే నేను పవ్వళించిన వేళ
పువ్వుబాణము వేసి రవ్వ చేసిపోయె ||

మొలక నవ్వుల వాడే-ముద్దు మాటల వాడే
తళుకారు చెక్కు-టద్దముల వాడే
తలిరాకు జిగి దెగడ-దగు జిగి మోవి వాడే
తలిదమ్మి రేకు క-న్నుల నమరు వాడే ||

ఎలమావి తోటలో – నింపొంద నొకనాడు
యెలమి గౌరిపూజ – సలుపుచుండగా
అల మువ్వగోపాలుడగు వేంకటేశుడు
కలువల శయ్యపై – గలసే మన్నది నిజమై ||

అంటూ సరళమైన అచ్చతెనుగు పదాలతో పండితపామరులను రజింపచేసిన పదాలను రచించిన వాగ్గేయకారుడు క్షేత్రయ్య. క్షేత్రయ్య వరహూరు (వరయూర్ వరాహస్వామి), చిదంబరం (తిల్లై గోవిందుడు), కడప (వెంకటేశుడు), కంచి (వరదరాజస్వామి), వేదపురి (వేదనారాయణుడు), హేమాద్రి (సామి), యదుగిరి (చెలువరాయుడు), ఇనపురి (సామి), పాలగిరి (చెన్నడు), తిరుమల (వేంకటేశుడు), తిరవళ్ళూరు (వీరరాఘవుడు), శ్రీరంగం (రంగేశుడు), మధుర (మధురాపురీశుడు), సత్యపురి (వాసుదేవుడు), శ్రీనాగశైలము (మల్లికార్జునుడు), చలువ చక్కెరపురి, కోవళ్ళూరు మున్నగు క్షేత్రాలను దర్శించి ఆయా దేవుళ్లపేర్ల పదాలను సుమారు నాలుగువేలకు పైగా రచించగా అందు నేడు మనకు లభ్యమవుతున్న పదాలు, “మువ్వగోపాల” ముద్రతో ఉన్నవి 372, రాజాంకితాలు, ముద్ర లేనివి 25 మాత్రమే.
అలాగే, క్షేత్రయ్య మధుర తిరుమలనాయకుని (1623-59), తంజావూరు విజయరాఘవుని (1633-73), గోలకొండ పాదుషా (1622-72) ఆస్థానాలలో అగ్రకవిగా విరాజిల్లాడని ఆయన పదాల ద్వారా వెల్లడవుతోంది. భాగవతా భక్తినిరూపకమైన క్షేత్రయ్య పదాలలో అష్టవిధనాయికా శృంగారంతోపాటు మధురభక్తి కూడా నిక్షిప్తమైవుంది. ముఖ్యంగా క్షేత్రయ్య తానే నాయిక అయి మువ్వగోపాలుని ప్రియునిగా భావించి వర్ణించిన మధురభక్తి అనన్యసామాన్యం. ”చూడరె అది నడిచే హోయలు సుదతి చేయు జాడలు; ఆడది కులకాంత అత్తింటి కోడలు, అలగోపాలునిని ఉదికి వెడలెను” అనే పదంలో భాగవతులని గోపికా మధురభక్తిని స్పష్టం చేశారు క్షేత్రయ్య.
క్షేత్రయ్య ఒకనాడు ‘సావిరహే తవ దీన కృష్ణా’ అనే జయదేవుని సంస్కృత అష్టపదికి నర్తకీమణులు చేసిన నృత్యాన్ని చూసి ప్రభావితమై తేనెలొలికే తెలుగులో అటువంటి పాటలు ఉంటే అందరికీ అర్ధమై మరింత రక్తికడతాయన్న భావన ఏర్పడింది. అచ్చ తెలుగులో అందరికి అర్ధమయ్యే పదాలు వ్రాయాలన్న తపన పెరిగింది, అలాగే తెలుగు భాష ఉన్నంతకాలం తన పదాలు, పాటలు జీవించియుండాలని మువ్వగోపాలుని పేరు ప్రతినోట విన్పించాలన్న సంకల్పం ప్రభలమైంది. అందుకు అనుగుణంగా క్షేత్రయ్య సంగీత, సాహిత్యాలను, అభినయరీతులను ఆకళింపు చేసుకున్నారు. ఆయన సంగీత, రాగ,తాళ విన్యాసాలలో, ఛందస్సు, వ్యాకరణాలలో పటిమ ఉన్నదనడానికి ఆయన పదాలే తర్కాణాలు. తంజావూరు రఘునాథరాయలను చూడటానికి వెళ్లినపుడు ఆయన చెప్పిన ఈ కందపద్యం అందుకు నిదర్శనం –

తము దామె వత్తురర్ధులు
క్రమ మెరిగిన దాతకడకు రమ్మన్నారా
కమలంబులున్న చోటికి
భ్రమరంబుల యచ్యుతేంద్ర రఘనాథనృపా

క్షేత్రయ్య మొట్టమొదట వ్రాసిన పదం “ఆనందభైరవిరాగం”, “ఆదితాళంలో ‘శ్రీపతి సుతుబారికి నేనోపలేక నిను వేడితే కోపాలా? మువ్వగోపాలా”. క్షేత్రయ్య రచనలు పదాలుగా ప్రసిద్ధి చెందాయి. పదం కూడా కీర్తనవంటిందే. అయితే ఇందు కవి తన భావాలను నాయికా, నాయకుల మధుర, శృంగార భావాలుగా వర్ణించి దేవునికి అంకితం చేస్తారు. సంగీత, సాహిత్యాలు సమపాళ్లలో కలిగి, పల్లవి, అనుపల్లవి, చరణాలతో కూడి ఉంటుంది. క్షేత్రయ్య వ్రాసిన ఈ మొదటి పదంలో మాత్రం మనకు పల్లవి, అనుపల్లవులు కన్పించవు.
క్షేత్రయ్య పదములలో ముఖ్యమైన రసము రసరాజమైన శృంగారము. సంభోగ, విప్రలంభాదులను గురించి అష్టవిధ నాయికలు పడే అనుభావలు ఇందు కథా వస్తువు. ఉదాహరణకు కంచి వరదరాజస్వామి వారి కేళమందిరంనుంచి మీనాక్షీ అమ్మవారు తెలతెలవారే వేళలో శృంగారాంచిత చిహ్నాలతో సుప్రభాత సేవకంటే ముందుగా చెలులతో కలిసి “చెలువం మీరేలా వచ్చే సొగసులన్నీ కళ్ళారా దర్శించి”, క్షేత్రయ్య రాసిన అద్భుత పదమిది, అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ పదమే తెలుగు కవిత్వంలోని అత్యంత సుందరమైన కృతుల్లో అగ్రశ్రేణికి చెందిందని తెలుగురసజ్ఞ లోకం గుర్తుపట్టగలిగిందిగాని, ఆ సౌందర్య రహస్యమెక్కడుందో ఇప్పటికీ తెలుసుకోలేకపోయింది.

ప: మగువ తనకేళికా మందిరము వెడలెన్
అను: వగకాడ మా కంచివరద తెల్లవారెననుచు

చ1: విడజారు గొజ్జంగి విరిదండ జడతోను
కడు చిక్కపడి పెనగు కంట సరితోను
నిడుద కన్నుల దేరు నిదుర మబ్బుతోను
తొదరి పదయుగమున దడబడెదు నడతోను

చ2: సొగసి సొగయని వలపు సొలపు జూపు తోను
నగవగల ఘనసార వాసనలతోను
జిగమించి కెమ్మోవి చిగురు కెంపులతోను
సగము కూచముల విదియ చందురుల తోను

చ3: తరిదీపు సీయు సమసురతి బడలికతోను
యిరుగడల కైదండలిచ్చు తరుణులతోను
పరమాత్మ మువ్వగోపాల తెల్లవారెనునుచు
మగువ తనకేళికా మందిరము వెడలెన్. (మోహన – ఝంప)

పై పదము అన్నమాచార్యులవారి ‘పలుకు దేనెల తల్లి పవళించెను కలికి తనమున విభుని గలసినది గాన’ అన కీర్తనను పోలి ఉండడం కాకతాళీయమే. జయదేవుని అష్టపదులు సంస్కృతాన ఎంత అందంగా పొదగాయో, క్షేత్రయ్య పదాలు తెలుగు సొగసులను, సొబగులను అదేవిధంగా పొదవుకున్నాయని అనేకమంది పరిశోధకులు కొనియాడారు. ప్రాసలు, అనుప్రాసలు, ఎంచుకున్న అచ్చ తెనుగు పదాలు క్షేత్రయ్య కవితా సౌందర్యానికి ప్రతీకలు. మచ్చుకు కొన్ని —

మోనిపానక మిచ్చునా?
కొసరి కొసరి ముద్దులాడ నిచ్చునా”
తావి పువ్వులు దెచ్చునా? తన సొగసుకు
తగినవాడని మెచ్చునా? మన సిచ్చునా?
దేవరే మొగడు గావలెనని భావజుని పూజలొనరించిన
యా వనిత పేరేమి సెలవీరా, సిగ్గేలరా?

పడతి నే నొకచోట ప్రాణేశుడొకచోట
నెడబాసి మరునిచే నిడుములకు లోనై
కడలేని విరహాగ్ని గ్రాగి వేగితి చాల
పుడమిలో వేరె జన్మము లేదె సుదతి

నల్లని మేని వాడట ఓయమ్మ! వాడు –
నయము లెన్నో చేసునట!
చల్లగా మాటాడు నట! – సరసము వాని సొమ్మట!
కల్లగాదట వాడు – కళలంట నేర్చునట!

తెలుగు భాషలో పదకేళిక చేయడం సాధ్యం కాదనే అభిప్రాయమానాడు ఉండేది. సంస్కృత ప్రభావం అటువంటిది. ఆ దశలో అభినయానికి అనుగుణమైన పదాలను తెలుగలో రచించి పండితులు ముక్కుమీద వేలేసుకొనేటట్టు చేశారు క్షేత్రయ్య. అయితే రావే, పోవే, ఒసే, ఏమే వంటి పదాలు కవిత్వమేమిటని విమర్శించిన వారూ లేకపోలేదు. తంజావూరు విజయరాఘవ నాయకుల అస్థానంలో ఇటువంటి విమర్శలే ఎదురైనపుడు, కాంభోజి రాగం, త్రిపుట తాళంలో ఈ కింది పదం పల్లవి, అనుపల్లవి, రెండు చరణాలు వ్రాసి వారి ఆస్థాన కవులను పూర్తిచేయమని అభ్యర్ధించగా, వారి వల్ల సాధ్యం కాలేదు.

‘‘వదరక పోపోవే వాడేల వచ్చీని వద్దూ రావద్దనవే
అది యొక్క యుగము, వేరే జన్మమిపుడు
అతడెవ్వరో, నేనెవ్వరో ఓ చెలియా
నిచ్చ నిచ్చలు, నేదో వచ్చీని రేపైన
వచ్చిననచు మదిలో
నిచ్చగా బరు వేడి, నిట్పూర్పుల చేత
నింతిరో పెదవులెండి
హెచ్చైన, వెన్నల చిచ్చుల రాత్రులు
యెన్నెన్నో గడిపితిని నేటి మాటలే’’, అంటూ ఈ పదం సాగుతుంది.
తన పదాలలో స్త్రీ అనే పదాన్ని తరుణీ, ముదిత, కొమ్మ, అక్కరో, సుదతి, పడుపగత్తి, మానిని, జవ్వని, ఎలనాగ, ఉవిద, ముచ్చు, మొలక, కంజాక్షి అంటూ దాదాపు 100 పర్యాయ పదాల్లో సంబోధించారు. అలాగే నాయకులను అన్నెకాడు, చిన్నెలవాడు, నళినాక్ష, ఎమ్మెకాడు అంటూ అనేక పర్యాయ పదాలతో సంబోధించి తెలుగు భాషా విస్తృతను చాటిచెప్పారు. క్షేత్రయ్య పదాలలో దృశ్యాలను సాహితీవేత్తలొక మాదిరిగా, చిత్రకళాకారులొక మాదిరిగా, సంగీతజ్ఞులొక మాదిరిగా, నృత్యకళాకారులు మరొకమాదిరిగా, సంగీతాన్ని, సాహిత్యాన్ని, భాష అలంకార, ఛందస్సులను అధ్యయనం చేస్తారు. సంగీత, రాగతాళాలతోపాటు సాహిత్య భావ వ్యక్తీకరణకు ప్రాధాన్యమిస్తేనే క్షేత్రయ్య పదాల సోయగం, మాధుర్యం, మృదుత్వం, లాలిత్యం, గాంభీర్యం, క్షేత్రయ్య నాయికా, నాయకులను మలిచిన తీరును, వారి భావాలను అర్ధం చేసుకోగలరని పద్మశ్రీ నటరాజ రామకృష్ణ అంటారు.
క్షేత్రయ 49 రాగాలలో పదాలను అల్లినట్టు పరిశోధకులు తెలుపుతున్నారు. ఎక్కువగా కాంభోజి, పంతువరాళి, కేదారగౌళ, కల్యాణి, హుసేని, ముఖారి, తోడి, భైరవి, ఆనందభైరవి, మోహన, మధ్యమావతి, బిలహరి, శంకరాభరణం వాడారు. అయితే, కాంభోజి, కల్యాణి, హుసేని రాగాలను శృంగార రసాన్ని ఆవిష్కరించడానికి, ముఖారి, భైరవిలను శోకరసానికి, మోహన రాగాన్ని సంతోషాన్ని వ్యక్తీకరించడానికి ఉపయోగించారు. క్షేత్రయ్య ఎక్కువగా భాషాంగరాగాలనే వాడారని మంచాళ జగన్నాథరావుగారు చెప్పారు. అలాగే క్షేత్రయ్య ఎక్కువగా త్రిపుట తాళంలో పదాలను పొందుపర్చారు. సాంప్రదాయానికి విరుద్ధంగా క్షేత్రయ్య పదాలను పాడేటప్పుడు మొదట అనుపల్లవినీ, తర్వాత పల్లవిని పాడుతారు. క్షేత్రయ్య పదాలను భరతనాట్యం, కూచిపూడి పద్దతులలో సొగసుగా అభినయించి, బోధించినవారిలో ప్రముఖులు బాలసరస్వతి, వెంపటి సత్యం, నటరాజు రామకృష్ణ, కలానిధి నారాయణన్ గార్లు.

రాగాది సూచిక

అఠాణా / త్రిపుట అక్కరో! యోర్వనివారు సరసుడు గాడని – ఆడుకొంటే ఆడుకొనేరు
కల్యాణి / చాపు అమ్మా! యిటువంటివాని – కేమి సేయుదునే!
మంగళకైశిక / చాపు అలల్ల అలల్ల కృష్ణ పదర నాతో నీవగలెల్ల
మోహన / ఆది ఇన్నాళ్ళు మల్లాడిన – దిందు కోసమా?
కల్యాణి / రూపక ఎందుదాచుకొందు నిన్ను – నేమి సేతు నేను
బిలహరి / ఆది ఎటువంటి స్త్రీల పొందైన హితమై యుండునా?
మధ్యమావతి / ఆది తెలిసి తెలియలేక – పలికేరు చెలులు
ఆహిరి / చాపు పచ్చియొడలి దానర! పచ్చియొడలి దాన – పాపడు నిలువడు
వరాళి / చాపు ప్రొద్దు పోదు నిదుర రాదు – పొలతి నెడబాసినది మొదలు
భైరవి / త్రిపుట మంచి వెన్నెల యిపుడు – మగువ మనకు
కాంభోజి / త్రిపుట వేడుకతో నడుచుకొన్న – విటరాయడే!
ముఖారి / ఆది సామికి సరియెవ్వరే? నాచక్కని

క్షేత్రయ్య పదము – పిలువనంపె నన్నీవేళ

పిలువనంపె నన్నీవేళ – ప్రేమమీరగా నిపుడు
చెలియ మువ్వగోపాలుడు – చిత్తము రంజిల్ల నేడు ||పిలువ||

విరిబోణిరో రమ్మని – విరుల జడను జుట్టి
పరువ మైననాటికి – పైడి యిదే ననుచు
మరువకు మీ మాట – మనకిద్దరికీ పూట
చెరుకువిల్తుడే సాక్షి – చెలియన్న సామె ||పిలువ||

ఎమ్మె కాడు నేను – నెనసి చిన్ననాడే
సమ్మతిగా నొకచోట – జదుపుచుండగ
పమ్మిన వేడుకతో – భామ నీవు ప్రౌఢైతే
కమ్మవిల్తుని కేళి – గలనే మన్నది నిజమై ||పిలువ||

ఎలమావి తోటలో – నింపొంద నొకనాడు
యెలమి గౌరిపూజ – సలుపుచుండగా
అల మువ్వగోపాలుడగు వేంకటేశుడు
కలువల శయ్యపై – గలసే మన్నది నిజమై ||పిలువ||

కూచిపూడి కళాక్షేత్రం పేరు వినని తెలుగు కళాకారుడు ఉండడు. కూచిపూడి భాగవతుల ప్రదర్శనలకు నోచుకోని గ్రామం తెలుగునాట లేదు. తమ ప్రదర్శనల ద్వారా విశ్వవిఖ్యాతినొందిన కూచిపూడి గ్రామం కృష్ణాజిల్లాలో మచిలీపట్నంకు 15 మైళ్ళ దూరంలో ఉంది. తన పదాలతో దక్షిణ దేశాన్నంతా సుసంపన్నం చేసిన క్షేత్రయ్య స్వగ్రామమైన మువ్వ గ్రామంలో 500 సంవత్సరాలకు పూర్వమే నాట్య కళకు అంకురార్పణ జరిగినట్లు చారిత్రాకాధారాలున్నాయి. ఈ భాగవతులు పురాణేతిహాసాలనుండి కథలు తీసుకుని యక్షగాన, నాటకరూపంలో భరతనాట్య శాస్త్ర సంప్రదాయాలను అనుసరించి ప్రదర్శనలనిస్తూ ఉంటారు. వీటిని కొంతవరకు మార్చి వీధి నాటకాలుగా ప్రదర్శించారు. వీరు క్షేత్రయ్య పదాలను ఎక్కువ ప్రచారంలోకి తీసుకొచ్చారు. వీరి వీధి నాటకాల్లో పురాణేతిహాసాలకు సంబంధించిన గాధలను యక్షగాన, వీధినాటకాల రూపంలో సంప్రదాయసిద్ధంగా ప్రదర్శించేవారు. వాటిలో త్యాగరాయ కృతులు, జయదేవుని అష్టపదులు, మువ్వగోపాల పదాలు, భద్రాచల రామదాసు కీర్తనలు, దశావతారాలు వంటివి ఎన్నో ఉండేవి. క్షేత్రయ్య పదాలలో బహుభార్యాత్వం, వేశ్యాసంపర్కం, వ్యభిచారభావం లౌకికమైనవి కావు. అవి అలౌకికమైనవి. కృష్ణభగవానుడొక్కడే పురుషుడు. తక్కిన మానవులంతా స్త్రీలు. కృష్ణుడు పరమాత్మ. మానవుడు జీవాత్మ. ఈ జీవాత్మ పరమాత్మలో ఐక్యానుసంధానం కోసం పడే తపననే మదురభక్తి అంటారు. ఈ మధుర భక్తి రసరాట్టు. క్షేత్రయ్య పదాలు ఈ మధుర భక్తికి మచ్చుతునకలు! అంటూ ప్రవచించారొక లాక్షణిక శిరోమణి.

తరువాత భాగంలో శ్రీ నారాయణతీర్థ యతీంద్రుల వారి గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం నేస్తాలు.

(సేకరణ – కొన్ని అంతర్జాల లింకుల నుండి…వారికి హృదయపూర్వక ధన్యవాదములు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *