May 4, 2024

వెన్నెల పురుషుడు (తరాలు – అంతరాలు)

రచన:వనజ తాతినేని

ఉదయం తొమ్మిది గంటలైనా కాలేదు సూరీడు మహా వేడిమీద ఉన్నాడు వంట గదిలో విజిల్ వేస్తూన్న కుక్కర్ తో పోటీ పడుతూ కిటికి ప్రక్కనే పెరిగిన మామిడి చెట్టుపై కోయిల కూస్తుంది . తనూ స్వరం కలపబోయిన ఆమె అత్తమామలు ఉన్నారన్న సంగతి గొర్తుకొచ్చి ఉత్సాహాన్ని గొంతులోనే అణిచేసుకుంటూ “వసంతంలో కూయాల్సిన కోయిల ఆషాడం చివరిలో కూడా కూస్తుంది వానకారు కోయిల అంటే ఇదేనేమో !” అనుకుంటూ వాయిస్ రికార్డర్ ఆన్ చేసి కిటికీ ప్రక్కనే పెట్టింది. అప్పటిదాకా తెగ సందడి చేసిన కోయిల కూయడం మానేసింది. ఓపికగా ఓ అయిదు నిమిషాలు వేచి చూసాక మళ్ళీ కోయిల పాట మొదలెట్టింది కానీ ఆ పాట ఎందుకో విషాదంగా అనిపించింది అప్పటిదాకా వగరు చిగురులు తిని గొంతు మంటెత్తిందేమో ! రికార్డ్ ని సేవ్ చేయకుండా వదిలేసింది అక్కడ నుండి తన గదిలోకి వచ్చింది వెన్నెల.
విశాలమైన కిటికీ దగ్గర నిలబడి బయటకి చూపు సారించింది ఆమె. చూపు చిక్కుకుపోయిన చోట లేలేత వేపకొమ్మల మధ్య పూచిన పూత. ఆనందంతో మొహం విప్పారింది మళ్ళీ అంతలోనే అరె ! ఇప్పుడు పూసింది ఏమిటీ ? ఉగాదికి కదా పూయాల్సింది మొన్నటిదాకా పండిన కాయలు రాలుతూనే ఉన్నాయి కదా ! తర్వాత అత్తయ్యని అడిగి తెలుసుకోవాలి అనుకుంటూ కనుచూపు మేరా చూసింది . ఇందాకటి కోయిల కాకుండా మరో రాగిరంగు రెక్కల కోయిలొకటి కొబ్బరాకుని చీల్చి ఈనెని ముక్కున కరుచుకుని పోయి మామిడి కొమ్మలపై ఉంచింది బహుశా గూడు కడుతుంది కాబోలు. గుడ్లు పొదగని కోయిలకి మురిపెంగా పిల్లలని పెంచలేని కోయిలకీ గూడెందుకో ! నిరాశగా అనుకుంది.
మధ్యాహ్నం ఎప్పుడైందో, అత్తమామలు ఎప్పుడు భోజనం చేసారో, ప్రొద్దు పడమటికి ఎప్పుడు మారిందో ఏమి తెలియదు. జీవితంలో ఏర్పడిన స్తబ్ధతని పూరించుకోవడానికి ఆమెకి లభించిన వరం తోటే అన్నట్లు బాహ్య ప్రపంచాన్ని మర్చిపోతుంది ఆమె.
సాయంత్రం తోటంతా సందడిగా ఉంది ఎటు చూసినా సీతాకోక చిలుకల విన్యాసాలే ! చెట్లపై నివాసముండే రకరకాల పక్షులు అందులో ఎంతో చిన్నవి బుల్బుల్ పిట్టలు ఎంత ముద్దుగా ఉన్నాయో ! క్షణం కుదురుగా ఉండవు వేప చెట్టు మీద నుండి సంపెంగ పూల చెట్టుపైకి సంపెంగ చెట్టుపై నుండి పారిజాతం చెట్టుపైకి చక్కెరలు కొడుతూనే ఉంటాయి . వాటి మధ్య ఉడుతలు కిచ కిచమని శబ్దాలు చేస్తూ హడావిడిగా తిరుగుతూ జామకాయలు కొరుకుతూ కాసేపు, నేరుడు పళ్ళని తింటూ కాసేపు జీవన మాధుర్యాన్ని అనుభవిస్తున్నాయి. వేప చెట్టు కొమ్మకి పెద్ద తేనే పట్టు . ఎక్కడెక్కడో తిరిగి సేకరించుకున్న మకరందాన్ని భద్రంగా దాచుకున్నాయి . ఏ స్వార్ధపు కళ్ళు దానిపై పడకపోవడం మూలంగా ఆనందంగా జుర్రుకుంటున్నాయి ఎంత అదృష్టమో ఈ తేనెటీగలకి . అవును ఇన్ని ఊన్నాయి, రామ చిలుకలు లేవేంటి ఈ తోటలో ? చిలుకలు వాలని చెట్టెక్కడైనా ఉంటుందా ? అలాగే పావురాలు కూడా ! సృష్టిలో మానవుడికి తప్ప అన్ని ప్రాణ కోటికి ఆనందాలున్నాయి . ఎటు తిరిగి మానవుడు ప్రకృతిని తన స్వార్ధం కోసం నాశనం చెయ్యనంతవరకూ . . తోటకావలి వైపు రోడ్డుకి ఆనుకుని కార్లని బైక్ లని డిస్ట్రిబ్యూట్ చేసే ఓ పెద్ద కంపెనీ వాళ్ళు కార్ డ్రైవింగ్ స్కూల్ పెట్టారు . అంతకు క్రితం ఈ స్థలంలో సర్వీసింగ్ స్టేషన్ ఉండేదట . ఈ లోపలికి అంతగా ఎవరూ రాక పోవడం మూలంగా ఈ మాత్రం ఆనవాలైనా మిగిలింది అంటూ తనలో తనే గొణుక్కుంది
రాత్రి ఇంటికొచ్చిన కొడుకుతో పిర్యాదుని వినిపిస్తుంది ఆమె అత్తగారు
“కంటికెదురుగా కరంట్ బోర్డులకి కందిరీగలు అన్ని గూళ్ళు పెట్టి రొదగా తిరుగుతున్నా పట్టించుకోదు, టాయిలెట్ కిటికీకి దోమతెరకి మధ్య ఉడుతలు గూడు కట్టి పిల్లలని పెంచుతున్నా పట్టించుకోదు . పెళ్లై అయిదేళ్ళు నిండింది కడుపున ఒక కాయైనా కాయలేదు. హాస్పటల్ కి వెళ్లి చూయించుకుని మందూ మాకు వాడదాం అని లేనే లేదు. వంట పని అయిపోతే చాలు గదిలోకి వెళ్ళి తలుపులేసుకుంటుంది . ఎప్పుడూ పుస్తకాలు చదవడం పిచ్చిగీతలు గీయడం ఇదేనా పని ? కొడుక్కి భోజనం వడ్డిస్తూ విసుక్కుంటుంది.
కాసేపటి తర్వాత లోపలికొచ్చిన శశిధర్ “ఎంత సేపూ ఆ మాను మాకుతో మాటలేనా ! కాస్త మనుషులతో కూడా మాట్లాడొద్దూ ! ”
చురుక్కుమంటూ చూసింది
“అమ్మ బాధపడుతుంది కాసేపు బయటకొచ్చి కూర్చోని … పెద్దవాళ్ళతో మాట్లాడుతూ టీవి చూడొచ్చుకదా !” అన్నాడు.
“వాళ్ళతోనేనా నేను మాట్లాడటం ? మీరు నాతో మాట్లాడరా, నే చెప్పిన మాటలు వినకూడదా ? అయినా నోట్ల కాయితాల చప్పుడుకి అలవాటు పడిన మీకు నాతో ఏమి మాటలుంటాయి లే !”అందే కాని కిటికీని ఒదిలి ఇవతలకి రాలేదు . ఒక్క క్షణం ఆలోచించినతను చిన్నగా ఆమె ప్రక్కకొచ్చి నిలుచున్నాడు తనూ బయటకి చూసాడు. కటిక చీకటిలో తోటంతా నిశ్శబ్దంగా ఉంది కొబ్బరాకుల మధ్య నుండి వేప కొమ్మల పైనుండి కనబడుతున్న ఆకాశంలో వెలుగుతున్న నవమినాటి చంద్రుడు . అక్కడక్కడా కనబడుతున్న చుక్కలు.
“ఈ ఇల్లు చూసినప్పుడు నువ్వెంత సంబరపడ్డావో నాకింకా గుర్తుంది. ఈ మహా నగరం నడిబొడ్డున ఇలాంటి తోట, తోట ప్రక్కనే ఇల్లూ … మూడంతస్తులు ఎత్తున పెరిగిన చెట్లు కిటికిలో నుంచి కనబడే చందమామ కాస్త అద్దె ఎక్కువైనా నీ కోసం భరించాలనుకున్నాను కదా !” గుర్తు చేసాడతను. తల ఊపింది ఆమె .
ఈ చక్కని చుక్కకి ఆ చంద్రుడితో కబుర్లు ఎందుకు ? ఎదురుగా ఈ చంద్రుడుండగా అంటూ ఆమె మెడ ఒంపులో తమకంగా తలాన్చాడు. ఆ మాత్రం సామీప్యతకే ఆమె తనువూ త్రుళ్ళింది మనసూ ఒరిగింది. చాలా కాలం తర్వాత ఆమెకి వశమయ్యాడతను. . నువ్వే నా నా వెన్నెల పురుషుడివి అడిగింది లతలా అతన్ని మరో మారు అల్లుకుంటూ .
“నీకొక నిజం చెప్పాలి, విన్నాక నువ్వు బాధ పడకూడదు ఎవరికీ చెప్పకూడదు ఆ రహస్యం మన మధ్యనే ఉండాలి ” ఆమె ముంగురులు సవరిస్తూ అన్నాడతను .
ఏమిటి అన్నట్లు కళ్ళతోనే ప్రశ్నించింది వెన్నెల
“మనకి ఐ మీన్ నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. అందరూ నీలో లోపం ఉందేమోనని అనుమానపడుతుంటే విని నువ్వెక్కడ బాధపడపడతావోనని నేనే అన్ని టెస్ట్ లు చేయించుకున్నాను. ఏ మాత్రం పిల్లలు పుట్టే అవకాశంలేదని డాక్టర్స్ చెప్పేశారు.” చెప్పాల్సిన విషయం చెప్పేసి అతను ఊపిరి పీల్చుకున్నాడు .
ఆమెలో కల్గిన ఆశాభంగం అతనికి కనబడనీయకుండా అతన్ని అల్లుకున్న చేతులని వదలకుండా అలాగే ఉంచింది
ఆమె మౌనం చూసి “పోనీ ఇంట్లో వాళ్లకి తెలియకుండా “ఆర్టిఫిషియల్ artificial insemination ద్వారా ట్రై చేద్దామా ! నాకేం అభ్యంతరం లేదు” అన్నాడతను . ఆమె అడ్డంగా తల ఊపింది . కళ్ళల్లో నీళ్ళు కనబడకుండా అతని గుండెల్లో తలదాచుకుంది. ఆమెనలాగే పొదివిపట్టుకున్నాడతను.
తెల్లారిందో లేదో అతని అమ్మ “ఒరే అబ్బాయ్ ! ఈ ఇంట్లో మేముండలేమురా ! ఇంటికి వెళ్లిపోతాము అంటూ ఖండితంగా చెప్పేసింది. “ఎందుకనమ్మా !? నీ కోడలు వల్ల ఏమైనా కష్టంగా ఉందా ? బాగా చూసుకోవడం లేదా ?” కంగారుగా అడిగాడు .
మీ ఆవిడకి పలుకే బంగారం . ఓ మాట మంచి లేని ఇంట్లో సౌకర్యాలెన్ని అమర్చినా, నవకాయ పిండి వంటలు వడ్డించినా ఉండలేము రా ! ఇల్లన్నాక ఓ పిల్లా పీచు అన్నా ఉండొద్దా ! ఆమేమో ఆ గదిలో, నువ్వేమో డబ్బు రంధిలో. ఎన్నాళ్ళు గోడలతో, టీవితో మాట్లాడుకుని బ్రతుకుతాము మీ నాన్నకి ఇక్కడ తోచుబడి కావడం లేదంట, మేము ఇప్పుడే వెళ్ళిపోతాం అంది .
వెన్నెలతో ఈ విషయం చెప్పినా పెద్దగా స్పందించదు . ఎప్పుడూ తన లోకం తనదే గానీ .. ఎవ్వరిని పట్టించుకోదే ! మనసులో విసుక్కున్నాడు. తల్లి తండ్రి ఊరెళ్ళి పోయాక అతను బయటకెళుతూ
వంట చేసుకుని వేళకి తిను . ఎప్పుడు కిటికీ దగ్గరే నిలబడి ఉండకుండా రెస్ట్ తీసుకో ! సాయంత్రం పెందలాడే వచ్చేస్తాను మూవీ కెళ్ళి బయటెక్కడన్నా డిన్నర్ చేసి వద్దాం .. అని చెప్పి వెళ్ళాడు .
శశిధర్ కోసం ఎదురు చూసి చూసి అలసిపోయి నిద్రపోయింది . అతనెప్పుడో వచ్చి పడుకున్నాడు . ఎన్నోసార్లు సారీ చెపుతూనే నిన్నటిలా కాదు ఈ రోజు త్వరగా వచ్చేస్తాను . నువ్వు నీ ఆలోచనల ధోరణిలో ఉండి తలుపులు కూడా సరిగ్గా వేసుకోవు కదా ! పోన్లే.. నేనే డోర్ లాక్ చేసుకుని వెళతాను అనేవాడు ఉదారంగా .
అలా రోజులు, నెలలు గడచి పోతూనే ఉన్నాయి . వెన్నెలకి కిటికీనే ప్రపంచమూ అయిపొయింది . కాంతి విహీనమైన కళ్ళు, శుష్కించిన దేహం, మౌనంగా యంత్రంలా మారిపోయింది . ఆమెని చూసి అతను జాలి పడ్డాడు . ఆమెకి ఏమివ్వాలో అతనికి తెలుసు, ఇవ్వలేని నిస్సహాయత తెలుసు . పై పై మెరుగుల కోసం అప్రతిహతం అర్రులు చాస్తూ పరిగెత్తడమే తప్ప నెమ్మళంగా జీవనసారాన్ని జుర్రుకోవడం చేతకానితనంతో సిగ్గు పడుతున్నాడు . ఎలాగోలా నాలుగు రోజులు తీరిక చేసుకుని ఆమెకి ఇష్టమైన సాగర సంగమ ప్రదేశానికి తీసుకు వెళ్ళేటప్పుడు కూడా ప్రయాణంలో చిన్న చిరునవ్వు కూడా లేని ఆమె ముఖం చూస్తే మనసంతా ఏదోలా అయిపొయింది . కానీ ఆ నదీ సాగర సంగమం చూడగానే ఆమె ముఖం విప్పారింది. “ఇక్కడికి నిన్ననే నేను అతను వచ్చాం “అంది .
“నిన్నవచ్చావా ! ఎవరితో ?” అడిగాడు అయోమయంగా .
“అదే అతనే … నా వెన్నెల పురుషుడు” అంది ఆమాట చెపుతున్నప్పుడు ఆమె ముఖంలో ఏదో తెలియని వివశత్వం
“అవునా! అది నేనేగా ! “చిన్న నవ్వు అతని పెదాల పై .
“ఊహు.. నువ్వు కాదు . అతను అతనే ! ”
“అతనెలా ఉంటాడు!? ఎక్కడ ఉంటాడో తెలుసా ? ”
తెలుసు తోటలో ఉంటాడు . గుర్తుకు తెచ్చుకున్నట్లు కాసేపాగి చెప్పింది . అవును కొన్నాళ్ళ క్రితం మన ఇంటెనుక తోటలోకి ఒక పురుషుడొచ్చాడు . అతన్ని చూస్తుంటే కవులందరూ మగవాళ్ళని సింహంతో ఎందుకు పోల్చారో అని చిరాకు కల్గింది . పొడుగు పొట్టి కాని ఎత్తు. క్రిందికి పైకి ఒకే మందం తో తెల్లని బట్టలతో దర్జాగా ఉంటాడు అతని నడక చాలా ఠీవిగా ఉండేది . చందమామ లాంటి గుండ్రటి మొహం,విశాలమైన నొసలు , అందమైన కళ్ళు ఆ కళ్ళని చూస్తే చాలు దీపాలు వేలుగుతున్నట్టు ఉండేవి. ఆ చూపులతో మరి కొన్ని దీపాలు వెలిగించుకోవడం అంటే ఏమిటో నా కళ్ళు వెలుగుతుంటే అర్ధమయ్యింది. అతను పెదవి విప్పి మాట్లాడే వాడే కాదు అతనిది దేహబాష . కళ్ళతోటే కథలు చెప్పేవాడు. నాకు చంద్రుడంటే ఉన్న ఇష్టాన్ని ఎలా కనిపెట్టాడో ! . వెన్నెల వాన రెండు కలసి కురుస్తున్నపుడు నన్ను జలకాలాటకి తీసుకు వెళ్ళేవాడు. ఆధర రుధిరంలో పట్టు తేనే రుచి చూపిన వాడు. వెన్నెల్లో కల్గిన వేడిని మృగ చూర్ణ లేపనం పూసి సాంత్వన చేకూర్చిన వాడు . నాకు ఎంతగానో నచ్చాడు . మేమిద్దరం భూత భవిష్యత్ కాలాన్ని మరిచి వర్తమానంలో జీవించిన అమృత ఘడియలవి ”
“నువ్వేమైనా కథ చెపుతున్నావా ? లేక కవిత్వం వినిపిస్తున్నావా? నీ బాష అర్ధం కాక చచ్చిపోతున్నా! మామూలు మూడ్ లోకి వచ్చెయ్యి . వింటుంటే చిరాగ్గా ఉంది ” విసుక్కున్నాడతను
నేను నిజమే చెపుతున్నా ! మేమిద్దరం కలసి ఎన్నో రాత్రులు నదీవిహారంకి వెళ్ళాం . చల్లని రాత్రిలో మంద్రంగా ప్రవహించే నది పాయ ప్రక్కన రెల్లుపూల పొదల మధ్యలో ఇసుక తిన్నెలపై ఆ వెన్నెల పురుషుడి సాంగత్యం నాకు బాగా నచ్చింది ! ఎన్నో సార్లు గుజ్జనగూళ్ళు కట్టుకుని ఆడుకున్నాం . జలకాలడుకున్నాం, పడవెక్కి ఆ తీరానికి ఈ తీరానికి చక్కర్లు కొట్టాము. లంక తోటల్లో పూసిన పూలతో దండలల్లుకుని ఒకరినొకరు అలంకరించుకున్నాం. ఆకుల గుసగుసల వింటూ హాయిగా నవ్వుకున్నాం. విరిసయ్యల పై ఊసులాడుకున్నాం. ఒకొరికొకరు దేహాన్ని కానుకగా ఇచ్చుకున్నాం . స్త్రీ పురుషుల మధ్య అంత కన్నా విలువైన కానుకలేముంటాయి ? మా ఇరువురి దేహాలు మాట్లాడుకున్నాయి పోట్లాడుకున్నాయి అలసిపోయాక ఒకటినొకటి సేద దీర్చుకున్నాయి ఆ అనుభవం ఎంత బావుందో! ఎప్పుడూ వండుకోవడం, తినడం, సంపాదించుకోవడం, పడుకోవడం ఇంతేనా జీవితం ..!? కాస్త ఆత్మకి అనుభూతి నైవేద్యం పెట్టోద్దూ !
ఆమెసలు సృహలో ఉండే మాట్లాడుతుందా ? వింటున్న అతనికి ఏదో తెలియని భయం కల్గింది . వెనుక తోటలోకి వచ్చే పురుషులతో ఎవరితోనైనా పరిచయం పెంచుకుని తను బయటకెళ్ళ గానే నచ్చినతనితో కలసి తిరిగి వస్తుందా ? అనుమానం వచ్చింది . మళ్ళీ అంతలోనే … చ చ .. ఆమె ఎప్పటికి అలా చేయదు . అయినా తనేగా రోజూ మెయిన్ డోర్ లాక్ చేసుకుని వెళుతున్నాడు . మళ్ళీ అంతలోనే అనుమానం . డూప్లికేట్ కీ ఉందేమో ఒకవేళ . అమ్మనడిగి తెలుసుకోవాలి ” వెళ్ళిపోదాం రా ” అంటూ ఆమెని బలవంతంగా తీసుకొచ్చేసాడు .
ఇంటికొచ్చాక సరాసరి గదిలోకి వెళ్లి ఆమె నించునే కిటికీ దగ్గరి వెళ్ళి పట్టి పట్టి పరీక్షించాడు . దోమ కూడా దూరే సందు లేదని నిర్ధారించుకున్నాక కొంచెం రిలీఫ్ గా ఫీలయ్యాడు . ఆమె మాములుగానే వంట చేసింది ఇద్దరూ కలసి భోజనం చేసారు. ఆమె చెప్పిన విషయాలు గుర్తు తెచ్చుకుంటుంటే కొన్ని నిజంగా జరిగినట్లు అనిపిస్తున్నాయి జరగనట్లు అనిపిస్తున్నాయి . నిద్ర రాక అతను అటునిటు మెదులుతూ ఉంటె ఆమె హాయిగా నిద్రపోయింది . నిద్ర పోతున్న ఆమె ముఖం చూసి పాపం పిచ్చిది .. పొద్దస్తమాను కథలు, కవిత్వం చదువుతూ ఉంటుంది . అదే లోకంలో ఉంటుంది .. ఆమె మాటలు పట్టించుకోకూడదు అనుకుంటే కానీ అతనిని నిద్రా దేవి కరుణించలేదు .
ఉదయాన్నే నిద్ర లేచిన అతనికి ఆమె చూపులతో తోటంతా వెదుకుతున్నట్లు కనబడింది . ఏమిటీ ఇక్కడే నిలబడి ఉన్నావ్ ? టిఫిన్ రెడీ చేయలేదా ! అడిగాడు .
అతనొచ్చి రాత్రంతా నాకోసం వెతుక్కుని ఉంటాడు . మళ్ళీ రాత్రి దాకా అతను కనబడడేమో … దిగులుగా మంచం మెక్కింది. అతనికి వెంటనే ఏం చేయాలో అర్ధమైంది .
“డాక్టర్ నేను బాగానే ఉన్నాను కదా ! నాకు ఏ వైద్యమూ వద్దు . నాకు నా వెన్నెల పురుషుడు కనిపిస్తే చాలు . అతన్ని వెతుక్కోవడానికి వెళ్ళనీయకుండా నన్ను ఇలా బందించివేస్తే ఎలా ?” వదిలితే చాలు పారిపోయేటట్లు ఉంది
“చూడమ్మా వెన్నెలా నిన్ను అతని దగ్గరకే తీసుకు వెళతాను కానీ అతనెక్కడ ఉంటాడో తెలుసా !? ” డాక్టర్ ప్రశ్న
” తెలుసు, అతను నేను రెక్కలున్న కారులో ఎవరికీ కనబడకుండా అలా నదీ తీరం వెంబడి ప్రయాణం చేసి చేసి సముద్ర తీరానికి చేరుకున్నాం. పున్నమి వెన్నెల్లో అలలఘోషతో పోటీ పడి పాటలు పాడుకున్నాం కెరటాలతో ఆడుకున్నాం .అలా ఈ ప్రపంచంతో పని లేకుండా ఆడి పాడి అలసి పోయే దాకా ఆ వెన్నెల రాత్రుల్లో విహరించాం. తిరుగు ప్రయాణమయ్యాం. అలా పదునాలుగు రోజులపాటు ప్రయాణం చేస్తూ ఉండగా ఉండగా అలసి పోయానేమో, సోలి అతనిపై వాలిపోయానేమో! ఒక పగలు ఒక రాత్రి నాకసలు మెలుకువే రాలేదు కళ్ళు విప్పి చూస్తే నా వెన్నెల పురుషుడు నా ప్రక్కన లేడు ఎటు మాయమయ్యాడో ఏమో ! ఎంత వెదికినా కనబడలేదు . నా వెన్నెల పురుషుడు నాక్కావాలి కొసరి కొసరి వడ్డించే అతని తీపి ముద్దుల ఆహారం లేకుండా నేను ఎలా జీవించేది ? జీవించిన క్షణాలని నేను ఎలా మరిచేది ? నేను చచ్చిపోతా ,నన్ను వొదిలేయండి… వొదిలేయండి గింజుకుంటుంది ఆమె .
డాక్టర్ ఆమెని మరింత మాట్లాడించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.
“డాక్టర్ గారు నా కోడలి సంగతి ఏమిటి ? ఆమె ఎందుకలా మాట్లాడుతుంది ? రెండు నెలల నుండి మంచం పై అలా పడి ఉండటం పిచ్చి పిచ్చిగా మాట్లాడటం చూస్తుంటే ఏ దెయ్యం పట్టిందోనని భయమేస్తుందండీ ! ఇలా జరుగుతుందని తెలిస్తే ఒంటరిగా ఉండనిచ్చేదానిని కాదు.” అత్తగారు కన్నీళ్ళతో
“మీరేమి కంగారు పడకండి . ఆమెకి మంచి వైద్యం చేస్తున్నాం . మీతో కూడా కొన్ని విషయాలు మాట్లాడాలి. ట్రీట్మెంట్లో భాగంగానే ..లోపలి రండి అంటూ అత్తగారిని కన్సల్టింగ్ రూమ్ కి తీసుకుని వెళ్ళారు. మీరు శశిధర్ కి తల్లికదా ! “అవునండీ ! నా పేరు విమల ‘అని పరిచయం చేసుకుంది.
మీకొక విషయం చెప్పాలి విమల గారు . మీ కోడలు ఒక రకమైన మానసిక వ్యాధితో బాధపడుతుంది. ఆమెకి మీ అబ్బాయి ద్వారా పిల్లలు కలిగే అవకాశమే లేదు. మీ అబ్బాయి కూడా భార్యతో చాలా తక్కువ సమయాలు గడుపుతూ ఆమెని నిర్లక్ష్యం చేస్తున్నాడు. మీరేమో పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకి కూడా తల్లి కాలేదన్న నెపం వేస్తున్నారు. ఆమె అది తట్టుకోలేక మానసికంగా దెబ్బతింది. ఆమె మాములు మనిషి కావాలంటే మీ సహకారం చాలా అవసరం. అంటూ విషయం వివరించాడు డాక్టర్.
అయ్యో ! నాకవన్నీ ఏమీ తెలియదు డాక్టర్ ! మా అబ్బాయి కూడా ఈ విషయాన్ని నా దాకా రానివ్వలేదు. మా అబ్బాయికి పిల్లలు పుట్టే అవకాశంలేకుంటే వేరే మార్గాలు లేవా ఏమిటీ !? ఇదేమైనా మా తరమప్పటి సమస్య కాదుగా ! స్త్రీకి ప్రసవ వేదన పడాలని నట్టింట్లో శిశువు రోదన వినాలని ఎందుకుండదు చెప్పండి ? మునుపటి తరాల మనుషుల్లా నాకంత చాదస్తం లేదు లెండి. మా అబ్బాయికి లోపం ఉందని అసలు పిల్లలని వద్దనుకోలేను కూడా ! ఏవో మార్గాలుంటాయి కదా ! ఆ పద్దతుల్లో మా కోడలి కడుపున ఓ నలుసు పడేటట్లు చూడండి. మా అబ్బాయితో నేను మాట్లాడతాను. ఏది ఏమైనా మా ఇంట్లో పసి పిల్లల బోసి నవ్వులు విరబూయాల్సిందే ! కోడలికి ఇవేమీ తెలియకుండా ట్రీట్మెంట్ ఇవ్వండి .. అందుకు హామీ నేను అంది విమల.
మీరు చాలా సహృదయంతో అర్ధం చేసుకున్నారమ్మా ! ఎంతోమంది తమ పిల్లల్లో ఉన్న లోపాలని కప్పి పుచ్చి ఎదుటివాళ్ళపై నిందలేసి విడాకుల వరకు వెళ్ళడం చూసాను. మీ నిర్ణయం చాలా బాగుంది. మీ కోడలికి నయమై పోయి
త్వరలోనే మీకొక అందమైన ఆరోగ్యకరమైన బిడ్డని కూడా ఇస్తుంది . కొన్నాళ్ళు మా పర్యవేక్షణలో వదిలేయండి చాలు. “అవునా డాక్టర్ గారు.. చాలా సంతోషకరమైన విషయం చెప్పారు. ఒక చిన్న మాటండీ మీరు ఏమీ అభ్యంతర పెట్ట కూడదు . ఈ విషయాన్ని మా కోడలికి తెలియనీయవద్దు తెలిస్తే ఒప్పుకోదేమో కూడా “ అనుమానం వ్యక్తం చేసింది. “శశిధర్ కూడా ఆ మాటే చెప్పాడమ్మా! వెన్నెల ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటమే కావాలి అందరికి. ఈ విషయాన్ని మాకొదిలేయండి చాలు “అన్నాడు డాక్టర్ .
ఏ గాలి ధూళీ సోకిందో బిడ్డకి . ప్రక్కనే ఉన్న తోటలో సమాధులు కూడా ఉన్నాయట. దర్గా దగ్గర కట్టిచ్చుకొచ్చిన ఈ తాయెత్తుని ఆమెకి కట్టనీయండి” అని బ్రతిమలాడింది .
డాక్టర్ నవ్వి ఏమీ చెప్పకుండానే అక్కడి నుండి వెళ్లి పోయాడు
కోడలి చేతికి తాయెత్తు కడుతూ “అబ్బాయి ! ఈ పిల్లకి బాగవుతుండంటావా ? తల్లి తండ్రి అయి మనమే చూసుకోవాలిప్పుడు ” కారే కన్నీటిని కొంగుతో తుడుచుకుంటూ
“తప్పకుండా బాగవుతుందమ్మా ” ఒకింత విశ్వాసంతో చెప్పాడతను. అంతే కాదు తొమ్మిది నెలలపాటు ఆమెని పసిపాపలా చూసుకున్నాడు మరో పసిపాపకి జన్మ నిచ్చేదాకా.
హాస్పిటల్ బెడ్ పై ఆమె నీరసంగా కనులు విప్పింది. ఆమె ప్రక్కనే ఉన్నతను “ఇదిగో … నీ వెన్నెల పురుషుడు నీ ఒడిలోకే వచ్చాడు చూడు” అంటూ ఉయ్యాలలో ఉన్న బిడ్డని ఎత్తుకుని వచ్చి ఆమె చేతుల్లో భద్రంగా ఉంచాడు .
ఆమె ముఖంలో సంతోషం . “అవును పురుషుడు పుత్రుడు రూపంలో పుడతాడట కదా వీడే నా వెన్నెల పురుషుడు” అంటూ బిడ్డని గుండెలకి హత్తుకుంది .
హమ్మయ్య ! ఇక ఈ బిడ్డ ఆలనా పాలనలో జరిగినవన్నీ మర్చి పోతుంది అనుకుంటూ విమల ఊపిరి పీల్చుకుంది .
“అన్నట్టు నీకో విషయం చెప్పడం మరచాను వెన్నెలా! మనం తోట ప్రక్కన ఉన్న ఇంటి నుండి క్రొత్తింటికి మారిపోయాం. ఇప్పుడు ఆ ఇంటికే వెళుతున్నాం ” .
“అక్కడా తోట ఉందా !? “ ఆసక్తిగా అడిగిందామె. పార్క్ కూడా ఉంది . మన బాబుతో పాటు నువ్వు ఆడుకోవచ్చు నవ్వుతూ చెప్పాడతను.

*******

4 thoughts on “వెన్నెల పురుషుడు (తరాలు – అంతరాలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *