May 3, 2024

అవును, వాళ్ళు చేసిన తప్పేమిటి? (తరాలు – అంతరాలు)

రచన: గౌతమి

ఏ కాలమయినా కులాంతర వివాహాన్ని ఆ ప్రేమికులు మాత్రమే గౌరవిస్తారు తప్ప వారివురి కుటుంబాలు మాత్రం ఆ వివాహాన్ని గౌరవించకపోవడం అనేది సర్వ సాధారణం. కొంతమంది విషయాల్లో అమ్మాయి వైపు నుండో, అబ్బాయివైపునుండో కొన్ని లోపాలు వుండడం వల్ల కుటుంబాలలో కలవలేకపోవచ్చు, అటువంటి పరిస్ఠితిలో వారివురి మధ్యనే సమస్యలు తలెత్తుతాయి. కొంతమంది విషయాల్లో ఎంత వెతికినా సరియైన కారణం కనబడదు, ఒక్క “కుల వివక్షత” తప్ప. కాలాలతో పనిలేకుండా ఆధునిక యువత ఆలోచనా ధోరణిని మట్టుపెట్టే ఏకైక పనిముట్టు కుల వివక్షత. దీనికి వుదాహరణ క్రింద చెప్పబోయే ఒక తరంలో ముగిసిపోయిన ఒక ప్రేమ కధ.

*****************

వందనమ్మ ఇంటిముందు ప్రాంగణంలో చక్కటి పూలమొక్కలు, వెనుక పెరట్లో కాయగూర మొక్కలు, పాదులు అలాగే ఆడపిల్లలందరూ ముచ్చటపడే గోరింటాకు చెట్టు, మధ్యలో అందమయిన తులసికోటతో ఆవిడపేరులాగే వందనంగా వుంటుంది. తన పిల్లలు ముగ్గురూ చదువులయిపోయి, ఉద్యోగాలు చేస్తూ, పెళ్ళిళ్ళు కూడా చేసుకొని స్థిరపడ్డారు. ఆవిడ భర్త కూడా మంచి ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయి ఇంట్లో వుండడం వల్ల, ఒకరికొకరు కాలక్షేపం. ప్రొద్దున్న ఆరింటికల్లా ఆ యింట్లోంచి అంబికా అగరుబత్తి సువాసనలు వచ్చేస్తుంటాయి. దానితో వీధిలో అందరికీ అజా వందనమ్మ ఇంట్లో పూజా పునస్కారాలయిపోయాయి, ఇక మిగిలిన పూలేమయినా వుంటే కోసుకోవచ్చు ఆవిడింటికి వెళ్ళి అని. దేవునికి పెట్టాలి అంటే ఆవిడా ఇస్తుండేవారు కాదనకుండా మరి. ఇదీ రోజువారీ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో క్రమం తప్పకుండా పాల్గొనే మొదటి వ్యక్తి మల్లిక. ఆమెకు ఇరవై సంవత్సరాలు, బి.యస్.సి పరీక్షలు రాసింది, ఫలితాలు ఇంకారాలేదు. వాళ్ళ నాన్నగారికి బ్యాంకులో ఉద్యోగం, అమ్మ ఇంట్లోనే వుంటుంది. తానే పెద్దకూతురు. సంబంధాలు చూసి పెళ్ళి చేసేయాలని అనుకుంటున్నారు, ఎందుకంటే ఆమె తర్వాత ఆమెకి ఒక చెల్లి, తమ్ముడు వున్నారు. మల్లికకి తన ప్రమేయం లేకుండా వాళ్ళు తీసుకొచ్చిన సంబంధం చేసుకోవడానికి ఇష్టం లేదుట. తానింకా చదవాలని ఈ లోపుల తనకు నచ్చిన వరుడు దొరికితే ప్రేమించి పెళ్ళిచేసుకోవాలని ఉబలాటపడుతున్నది. ఎందుకంటే ఫేస్ బుక్ లో తన ఇద్దరు స్నేహితురాళ్ళు అలాగే పెళ్ళి చేసుకున్నారని, వాళ్ళు వాళ్ళభర్తలతో కలిసి వెళ్ళే అందమయిన ప్రదేశాల ఫొటోలు, అందంగా వాళ్ళు వేసుకునే బట్టలు, అందంగా తీసుకునే ఫొటోలు చూసి ప్రేమంటే అంత అందం గా వుంటుంది. ఇటువంటివేవీ తాను తన కుటుంబాల్లో ఏ అమ్మయి కీ చూడలేదనీ ఎందుకంటే వాళ్ళెవరూ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోకపోవడం వల్లనే అని, అందువల్ల తనకు పెద్దలు తీసుకొచ్చే సంబంధం చేసుకోవడం ఇష్టం లేదని వందనమ్మతో కరాఖండి గా చెప్పేసింది. మల్లిక అమాయకత్వానికి వందనమ్మ చిన్నగా నవ్వుకున్నారు.
“ఏం అమ్మాయీ, ఆల్ రెడీ ఎవరి ప్రేమలోనయినా వున్నావా?” అడిగారు వందనమ్మ.
“ఉహు” -మల్లిక సమాధానం.
“మరి అంత తెగేసి చెప్పడానికి కారణం?” మళ్ళీ అడిగారు వందనమ్మ.
“ఏమో తెలియదు ప్రేమ పెళ్ళిళ్ళల్లో ఉన్నంత అందమయిన జీవితం అరేంజ్ డు లో లేదని మా కజిన్స్ కూడా అంటుంటారు. ఎప్పుడు చూసినా ఇంట్లో పని, ఎక్కడి వెళ్ళనివ్వరు, వాళ్ళకి నచ్చింది ఏమీ కొనుక్కోనివ్వరు, భర్త తెచ్చేది మాత్రమే మిగిలేది. దానికి కారణం అది ప్రేమ పెళ్ళి కాకపోవడం, కేవలం అధికారపు పెళ్ళి” మల్లిక చెప్పింది.
వందనమ్మ నవ్వుకొని “మీరడిగింది తూ చ తప్పకుండా బాధ్యతగా తెచ్చిపెట్టడమే ప్రేమర్రా..పిచ్చిపిల్లల్లారా” అని అన్నారు.
అది పూర్తిగా అర్ధం కాకపోయినా లాజిక్ ఏదో బాగుందే అనుకొంది.
“పోనీ అలాగే అనుకుందాం, ఈ పెళ్ళిలోనే ప్రేమ వుందంటే అదే మనకి నచ్చిన వాళ్ళని ప్రేమించి పెళ్ళిచేసుకుంటే ఇంకెంత బావుంటుందో కదా ఆంటీ, అదెందుకాలోచించరు? మీరు కూడా నాలా ఆలోచించడం లేదు” అని బుంగమూతి పెట్టుకుంది.
“ఏమి చెప్పమంటావ్ మల్లికా? నీకు జీవితం అంటే తెలియదమ్మా అలాగే నీ కజిన్లకి కూడా. పెళ్ళంటేనే బాధ్యత. ఏ పెళ్ళికయినా ఆ బాధ్యత సమానమే. పెళ్ళి అంటే కుటుంబభారాన్ని ఎత్తుకోవడం ఎంత అమ్మాయి, అబ్బాయే అనుకున్నా అతని కుటుంబం యొక్క పాత్ర వాళ్ళ జీవితంలో ఎంత కాదనుకున్నా వుంటుంది. అదే మనకి నచ్చిన వాళ్ళని కేవలం వాళ్ళని చూసే చేసేసుకుంటే అది అతని కుటుంబం అంగీకరరించని పక్షాన ఆ ప్రేమ పెళ్ళి అదనపు భారం అయిపోతుంది. ఫేస్ బుక్ లో పెట్టిన ఫొటోల్లోలాగ జీవితం అంతా అలా వుండదు. ఆ అదనపు భారాన్ని జీవితాంతం మొయ్యడానికి ఆ ఇద్దరు మాత్రమే సంసిద్దులై వుండాలి.
“అదనపు భారమా? అదేంటి? అది ఎవరిది?” అడిగింది మల్లిక.
“అతని కుటుంబమే అదనపు భారం” చెప్పారు వందనమ్మ బాధగా ముఖం పెట్టి.
మల్లికకి ఏమీ అర్ధం కాలేదు, కానీ ఆవిడ ముఖంలో విచారాన్ని గమనించింది. అందుకే మళ్ళీ అడిగింది “ఏమయింది ఆంటీ? మీ ముఖంలో ఎప్పుడూ నేను విషాద చాయలు చూడలేదు. ఎవరికయినా ఏమయినా జరిగిందా?” .
“అవును మల్లిక, అది నా చెల్లి జీవితం. తను పోయి ఈ రోజుకి రెండు సంవత్సరాలయింది. చాలా స్వీట్ గాళ్. తాను ప్రేమించి పెళ్ళి చేసుకొని అతను ఎంతో ప్రేమించాడని, ఆ ప్రేమకి కట్టుబడిపోయి అతని కుటుంబం పెట్టిన నరకమంతా అనుభవించింది. నువ్విలా ప్రేమ పెళ్ళే చేసుకుంటానని వాదిస్తుంటే నాకు మా చెల్లెలే గుర్తొస్తున్నది” అని కళ్ళు తుడుచుకున్నారు. మల్లిక మొదటిసారిగా అవిడ బేలతనాన్ని చూసింది.
“ఆంటీ, మీరేమనుకోకపోతే ఆవిడ కధ చెప్పరూ” అని అడిగింది. వందనమ్మ కాస్సేపాగి చెప్పడం మొదలుపెట్టారు.

**************

వందనమ్మ చెల్లెలి పేరు సుగుణ. మంచి గాయని, తీయని స్వరం. ఈమె తర్వాత మరో చెల్లి కూడా చక్కగా పాడేది. సుగుణ చదువుకుంటూవుండేది, తనకి ఎక్కడ పాడే అవకాశాలు వస్తే అక్కడ పాడుతూ వుండేది. వీధిలో నడుచుకొని వెళ్తున్న వాళ్ళు కూడా ఆమె చెల్లెళ్ళిద్దరూ కలిసి శ్రావ్యంగా పాటలు పాడుతుంటే ఇంటి ముందు ఆగి విని వెళ్ళేవారు. ఆ గంధర్వ గానం వాళ్ళకి దేవుడిచ్చిన వరం, శాస్త్రీయ సంగీతం ఏదీ నేర్చుకోలేదు. అయితే సుగుణకి పాటల ద్వారా పైకి ఎదగాలనే కోరిక వుండేది. మద్రాస్ తీసుకెళ్ళి తనకెక్కడయినా సినిమాల్లో పాడడానికి అవకాశం కల్పించమని తండ్రిని శతపోరు పెట్టేది. ఇంట్లో పెద్దగా ఇలాంటి కలలు ఆమెకోసం కనలేదు, అందుచేత ఆ డైరక్షన్ లో ఆలోచించలేదు. మా అందరికీ టైం రాగానే పెళ్ళిళ్ళు చేసినట్లు ఆమెకీ చేసేయాలనుకున్నారు. కానీ సుగుణ మాత్రం పెళ్ళి మాట ఎత్తేది కాదు. అప్పటికి పెళ్ళి గురించి ఎటువంటి ఆలోచనా లేదు. తనతో కలిసి చదువుకునే ఒక అమ్మాయి తో చాలా క్లోజ్ గా వుండేది, ఆమె కూడా పాటలు చాలా బాగా పాడేది. ఆ అమ్మాయి వాళ్ళ కజిన్లతో కలిసి సుగుణ కూడా పాటలు వ్రాయడం, వ్రాసిన పాటలకు బాణీలు కట్టడం వాళ్ళతో కలిసి పాడడం చేస్తూవుండేది. కన్నవాళ్ళు కూడా ఏమీ అనలేదు ఎలాగూ తనని మద్రాసు పంపించే ప్రసక్తి లేదు, ఏదో ఫ్రెండ్స్ తో కలిసి తమ కళ్ళముందే పాడుకుంటుందిలే ఇంక పోరుపెట్టడం తగ్గుతుంది అనుకున్నారు. ఫ్రెండ్స్ తో కలిసి అక్కడా ఇక్కడా పాడుతూవుండేది. అలాగే తనకు ఒక అబ్బాయితో పరిచయమయ్యింది, నిజానికి ఈమె గళానికి ముగ్ధుడై ప్రేమించేశాడు. మనిషికూడా బాగుండేది. ఆ పరిచయం, ప్రేమగా మారడం, ఇంట్లో అమ్మా నాన్నని ఎదిరించి స్నేహితుల సహాయంతో పెళ్ళి కూడా చేసేసుకున్నారు. ప్రేమలో వున్నవాళ్ళకి ఆ ప్రేమే కనిపిస్తుంది. తాను క్రొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. ఆ అబ్బాయిది వరంగల్ దగ్గిర హనుమకొండ అనే పల్లెటూరు, అక్కడినుండి విశాఖపట్నం వచ్చి చదువుకున్నాడు. పెళ్ళికి ముందు టీచర్ గా కామిరెడ్డిగూడెం (హనుమకొండ ప్రక్కన) లో ఒక ఎలిమెంటరీ స్కూల్ లో ఉద్యోగం వచ్చింది. ఆ ధైర్యంతోనే ఇంట్లోవాళ్ళు వద్దన్నా పెళ్ళి చేసుకోగలిగాడు.
క్రొత్త ఆశలతో కాలంతో పాటు, తన మంచి ప్రవర్తనతో తాను ఆకట్టుకొంటుందనే దైర్యంతో అడుగు పెట్టిన సుగుణకి అడియాసలే ఎదురయ్యింది. మావగారు ఏనాడో చనిపోయారు, అత్తగారున్నారు. తన భర్తకి ముగ్గురు అన్నలు, ఒక చెల్లెలు. చెల్లెలికి పెళ్ళయ్యి అత్తారింటికి ఆ ప్రక్కనే వున్న పల్లెటూరికి వెళ్ళిపోయింది,. ఇక ఉమ్మడికుటుంబం అన్నదమ్ములందరికీ వ్యవసాయమే ఆధారం..తాత ముత్తాతల నుండి వస్తున్న ఉమ్మడి ఆస్థి అది. సుగుణ భర్త ఒక్కడే చదువుకొని ఉద్యోగం చేస్తున్నాడు. అతని అన్నదమ్ములకి చదువుల్లేవు, వాళ్ళభార్యలు, అతని తల్లీ అంతే. ఇంటిల్లిపాదికీ వీళ్ళిద్దరే చదువుకున్నవాళ్ళు. వాళ్ళు పొద్దున్న లేచిన దగ్గిరనుండి ఇంటి పన్లూ, పొలం పన్లు లేదా ముసుగు తన్ని పడుకోవడం అంతే దిన చర్య. సుగుణ, అవిడ భర్త జీవన విధానం వేరేగా వుండేది. సుగుణ భర్త కూడా పాటలు వ్రాసేవాడు, దానికి సుగుణ బాణీలు కట్టి పాడేది. అలాగే ఆమెని తనకి తెలిసిన స్నేహితుల గ్రూపు లో ఆర్కెష్ట్రా లో పెట్టాడు. ఆమె టాలెంట్ ని పైకి తీసుకు రావాలని చూసేవాడు. ఇవేమీ లేని అత్త, తోటికోడళ్ళు వాళ్ళ భర్తలు అసూయపడి, ఈమెను సాధించేవారు. వాళ్ళందరూ ఒక కట్టు అయిపోయి ఈమెతో మాట్లాడకపోవడం, పిల్లల్ని చీదరించుకోవడం ఇంకేమన్నా అంటే కులాంతరం అని బోర్డ్ పెట్టేవారు. ఆఖరికి ఆడబడుచు కూడా పుట్టింటికొచ్చిన ప్రతిసారీ తల్లి, మిగితా వదినల మాటలు విని సుగుణని గౌరవించేది కాదు.
అయినా సరే అతను చాలా మోరల్ సపోర్ట్ గా వుండి అమెని ఓదారుస్తూ పట్టువదలని విక్రమార్కుడిలా భార్య టాలెంట్స్ అన్నింటినీ ప్రోత్సహిస్తుండేవాడు. హైదరాబాద్ ఆకాశవాణి లో పాడడానికి, రేడియో బుర్రకధల్లో కూడా పాల్గొనడానికి అవకాశాలన్నింటినీ తన స్నేహాల ద్వారా సంపాదించేవాడు. దానితో కుటుంబీకులందరూ ఇద్దరికీ వ్యతిరేకులయి.. కులాంతర వివాహమనేది ఒక పెద్ద నేరంగా, వీళ్ళని నేరస్తులుగా చిత్రీకరించి గొడవలు చేసేవారు. వీళ్ళు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు కాస్త పిల్లల్ని చూసుకోమని అడిగినా కూడా చూసేవారు కాదు, ఆఖరికీ మిగితా తోటికోడళ్ళందరూ చెయ్యాల్సిన పనంతా కూడా తాను చేసి కూడా బ్రతిమలాడేది, అయినా కలిసి ఉండేవారు కాదు, అత్త అయితే కొట్టేసేది, ఏమన్నా అంటే కులాంతరమనేది. ఆఖరికి భార్యాభర్తలిద్దరూ చిన్నపిల్లల్ని చంకనేసుకొని తీసుకెళ్ళిపోయేవారు ఎండల్లో. వరినూర్పులు జరిగేటప్పుడు సుగుణ భర్త స్కూలికి ఏ అధికారో వచ్చి శెలవు పెట్టలేకపోయినా తన వాటా కొచ్చిన పొలాన్ని చూసుకోవడానికి వెళ్ళలేకపోయేవాడు. అప్పుడు అతని అన్నదమ్ములు సహాయం చెయ్యకపోగా ” మేము ఎండల్లో నిలబడి నీ పన్లు కూడా చెయ్యాలా, నువ్వు మాత్రం నీడపట్టున ఉద్యోగం చేస్తావా? నీ భార్యా హాయిగా తిని ఇంట్లో వుంటుందా” అని దెప్పుతుండేవారు. ఇవన్నీ ఇక భరించలేక సుగుణే ఎండల్లో పడి నెత్తి మీద కొంగు కప్పుకొని పొలానికి వెళ్ళిపోయేది. ఇలా ఈవిడ కష్టానికి అతను, అతని కష్టానికి ఆమె చేదోడు వాదోడుగా వుంటూ భరిస్తూ జీవించేవారు. వీళ్ళేమన్నా అంటే ఆ కులాంతర వివాహాన్ని మధ్యలోకి తీసుకువచ్చి, అది ఒక పెద్ద నేరంగా గొడవలు చేసేవారు, ఈ భార్యా భర్తలిద్దరినీ మామూలుగా జీవించడానికి కూడా సాధ్యమయినంతవరకూ అవకాశాన్నివ్వకుండా ఎప్పుడూ ధు:ఖ భాజనంచేసేవారు. సుగుణ పుట్టింట్లో ఇవన్నీ తెలిసి బాధపడే వారు. ఆవిడకి కావలసిన సహాయాలు చేసేవారు. ఈలోపు పిల్లలు పెద్దవాళ్ళయ్యారు..చాలా మటుకు సమస్యలు కాలంతో పాటు సర్దుకున్నాయి, బహుశా వాళ్ళందరూ ముసలయిపోతూ, వాళ్ళ కుటుంబసమస్యలు పెరుగుతూ వుండడం వల్ల కావొచ్చు. అలాగని వాళ్ళు మారారని కాదు.

రాను రానూ వీళ్ళిద్దరికీ బయట పరపతి పెరిగింది, సుగుణకు సహజసిద్దమయిన స్వభావం ఎవరయినా కష్టాల్లో వుంటే ఆదుకోవాలనుకోవడం. ఒక టీచర్ భార్య, తానూ ఒక సింగర్ కావడంతో మహిళా మండలి సభ్యురాలయింది. పల్లెటూరి మహిళలకు కుట్టుమిషన్లు ఇప్పించడం, వాళ్ళు కుట్టే బట్టల్ని, అల్లే స్వెట్టర్లని పక్కూర్లో షాపులకి తరలించే ఏర్పాట్లు భార్యాభర్తలిద్దరూ చేసేవారు. ఆ వచ్చే ప్రాఫిట్ ని వాళ్ళకి ఇచ్చి, కొంచెం సొసైటీ కి కట్టించేవారు, అలా మహిళా మండలిని అభివృద్దిచేసి మరికొన్ని సహాయాలు పేదలకు చేసేది. లంచాలని ఆశించి కరణమో, మునసబో వాళ్ళ పనులకు అడ్డుపడితే తాను పోరాడేది. ఇటువంటి ప్రజాకార్యక్రమాల్లో కూడా భర్త చేదోడు వాదోడు గా వుండేవాడు. పిల్లలు ఎదిగారు, అబ్బాయికి ఈవిడ కళలన్నీ వచ్చాయి, ఆకాశవాణిలో ఆర్టిస్ట్ అయ్యాడు, ఫోక్ మ్యూజిక్ ని డైరక్ట్ చేసేవాడు, అమ్మాయికి పెళ్ళయి అత్తారింటికి వెళ్ళిపోయింది. అక్కడితో కధ సుఖాంతమయ్యిందని చెప్పుకోవడానికి లేదు. అత్త మంచాన పడింది. ఆవిడ ఇష్టపడి తెచ్చుకున్న కులపు కోడళ్ళెవరూ మూతిమీద ఇంత గంజి పోయడానికి ఇష్టపడలేదు, ఎక్కడ ఆవిడకి సేవ చెయ్యాల్సొస్తుందో అని. ఆఖరికి ఆవిడ బాగున్నన్నాళ్ళు మిగతా కోడళ్ళతో కలిసి కుల, ప్రాంతీయ భేదాలు చూపుతూ వుండేది, ఆఖరిదశలో ఆ కోడలే గతి అయ్యింది. సుగుణే సేవ చేసి తిండిపెట్టేది. అప్పుడు అత్త తాను చేసిన తప్పులన్నింటికీ పశ్చత్తాపపడే, అది సుగుణకి చెప్పే ఆవిడ చేతిలోనే ప్రాణాలొదిలింది. తల్లి చనిపోయాక మిగతా కొడుకులు, కోడళ్ళు మళ్ళీ తలెత్తారు. ఉమ్మడి ఆస్థులను పంచుకోవాలనే కోరిక కలిగింది వాళ్ళకి. కానీ ఈ భార్యా భర్తలకి, వాళ్ళ పిల్లలకి అతని వాటాపోవడం ఇష్టం లేదు. ఇంతవరకూ వాళ్ళ అబివృద్దిని చూస్తూ భరించలేక, వాళ్ళలా ఈ ఫ్యామిలీ లేకపోవడంతో ఈర్ష్యా ద్వేషాలతో మరో క్రొత్తమలుపు తిప్పారు. సుగుణ భర్త బ్రతికి వున్నంతవరకు మాత్రమే అతని వాటాకొచ్చిన పొలం మీద రాబడిని అనుభవించి, అతని తదనంతరం అది వాళ్ళకి చెందేటట్లుగా సంతకాలు చెయ్యమని గొడవచేశారు. మరి నా భార్యాపిల్లలేమయిపోవాలని అడిగితే ఆవిడకి చెందడానికి లేదని, అవిడ అక్కడినుండి వెళ్ళిపోవాలని ఎందుకంటే కులం మనిషి కాదని..మళ్ళీ అదే పాట. వాళ్ళకేవంక దొరికినా, దొరక్కపోయినా వాళ్ళు చేసుకున్న పెళ్ళిని ఒక నేరంగా పరిగణించి వాళ్ళు దోషుల్ని చేస్తుండేవారు. కానీ అతను సంతకాలు చెయ్యలేదు, ఈలోపున బ్రెయిన్ ట్యూమర్ తో అతను చనిపోయాడు. ఇక ఈవిడ వంటరిదయిపోయింది. వీళ్ళు మళ్ళీ తలెత్తారు, ఆ ఆస్థుల రాతలు, కోతలు అప్పటికి అవ్వలేదు. వాళ్ళు కోర్టుకెక్కారు, ఈవిడని అతను పెళ్ళి చేసుకోలేదని అబద్దపు సాక్ష్యాలు సృష్టించి వీళ్ళ ఆస్థిని కూడా కొట్టేయడానికి కోర్టులో కేసు వేసారు. అవన్నీఅబద్దాలని, తాను లీగల్ భార్య ని కోర్టులో నిరూపించుకొని తన ఆస్థిని తాను దక్కించుకొని తన సొంత పిల్లలకు దక్కించుకొనేసరికి ఈ మానసిక వత్తిళ్ళ కారణం చేత హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. ఇంతకు మునుపు గుండె దడ ప్రారంభమయితే.. ఇక రేడియో ప్రోగ్రాములివ్వడం మానేసింది, అది కొడుకు పిక్ అప్ చేసి తాను పర్మనెంటు ఆర్టిస్టు అయ్యాడు. కొంతవరకు అవిడ ఆరోగ్యం కుదుటపడింది, ఈ ఆస్థి తగాదాల్లో హార్ట్ అటాక్ వచ్చేసి ఏకం గా మనిషే దూరమయ్యింది.

**************

మల్లిక కళ్ళు చెమర్చాయి. బొంగురు గొంతుతో అడిగింది “వాళ్ళు చేసిన తప్పేమిటి?”
“ఏమీ లేదు. ఆ భార్యా, భర్తల సక్సెస్ ఫుల్ లైఫ్ వీళ్ళకి ఒక కంటకంగా వుండేది. వాళ్ళలా సుగుణ లేకపోవడం, ఆవిడ టాలెంట్లు వాళ్ళని ఎద్దేవా చేసేటట్లుగా అనిపించేది, అదే వాళ్ళ కులపు మనిషి అయి వాళ్ళ రేంజ్ లోనే వుండే మనిషినే వాళ్ళ మధ్య కి తెచ్చుకుండేవారు. కాని ఇతగాడు పూర్తిగా పరాయి పిల్లని, తన ఇంటి వాతావరణానికి భిన్నం గా వున్న వ్యక్తిని పెళ్ళిచేసుకునేసరికి వాళ్ళు ఆమెని అంగీకరించలేదు, ఏ సంధర్భంలోనైనా సరే కనీసం అంగీకరించడానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు ఆఖరికి ఆమె చావైనా చూశారు గాని. అందుకే అమ్మా మల్లికా.. పెళ్ళి అంటే భర్తతో అయిపోదు, అతని కుటుంబం కూడా మంచిదయి వుండాలి. అతని ప్రేమ సుగుణని కట్టిపడేసింది. ఆ శక్తితోనే ఆమె అంత నరకాన్ని కూడా భరించగలిగింది. ప్రేమకి అంత శక్తివున్నప్పటికీ కూడా జీవితం ఇంకా విలువయినది”.
“నువ్వు ఎవరి ప్రేమలోనూ లేవు కాబట్టి ఏవో పైపై మెరుగులుచూసి తెలిసీ తెలియని తనంతో పెళ్ళి గురించి నిశ్చిత అభిప్రాయాలకు రావొద్దు. పెళ్ళి చేసుకున్న వ్యక్తితో కూడా ప్రేమలో పడవొచ్చు. సుగుణ, అవిడ భర్త వున్నంత ప్రేమగా నువ్వు ఎవర్ని చేసుకున్నాకూడా వుండవొచ్చు. పెద్దల చేసిన పెళ్ళయితే కొన్ని సమస్యలు వున్నా కుటుంబరీత్యా ఎన్నోసమస్యలు రాకుండా వుంటాయి, ఒకటే కులమని అందరూ భరించగలిగే శక్తిని కలిగివుంటారు. అందుకే అమ్మా, నాన్నలను బాధపెట్టకు, వాళ్ళు చెప్పింది చెయ్యి” అని అక్కడితో ఆగారు వందనమ్మ.
భారమైన హృదయంతో మల్లిక లేచి.. ఆలోచనలో పడింది, అడుగులో అడుగువేసుకుంటూ ఇంటివైపునడిచింది. సోఫాలో లాప్ టాప్ లో ఫేస్ బుక్ ఓపెన్ వున్నా తన ఫ్రెండ్స్ చాట్ కి సిద్ధపడినా సమాధానమివ్వకుండా లాప్ టాప్ మూసేసింది.

******

3 thoughts on “అవును, వాళ్ళు చేసిన తప్పేమిటి? (తరాలు – అంతరాలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *