April 28, 2024

Gausips – Dead ppl don’t speak-10

రచన: డా. శ్రీసత్య గౌతమి

ఏరన్ వెంటనే డోర్ తీసి బయటకు వచ్చి, “ఏం జరిగింది అనైటా? ఎందుకా కేకలు? లోపల ఏం జరిగింది” అని ఏరన్ అడిగాడు.
అనైటా వణికిపోతూ.. “ఏరన్, ఒకసారి లోపలికి వెళ్దాం రా” అంది.
పరిగెత్తుకుని వెళ్ళారు. ఆమె ఇంట్లోవున్న పనమ్మాయి నేల మీద పడి వుంది. క్రిస్టల్ తో చేసిన అందమైన పెద్ద టేబుల్ డెకరేషను టేబుల్ మీద నుండి నేలమీద పడి ముక్కలయిపోయి వుంది. అనైటా కాలింగ్ బెల్ నొక్కి ఆమెను లేపుదామనేసరికి.. డోర్ దగ్గరకి వేసినట్లుగా అనిపించింది, దాన్ని తోసుకొని లోపల అడిగుపెట్టేసరికి ఇదీ దృశ్యం. ఇదంతా ఏరన్ కి వివరించింది.
ఏరన్ నేల మీద పడున్న పనమ్మాయి దగ్గిరకి వెళ్ళి ముక్కు దగ్గిర వేలు పెట్టి శ్వాస ఆడుతుందో లేదో అని చూశాడు.
“ఆడుతుంది, కేవలం స్పృహ తప్పింది అంతే”… చెప్పాడు అనైటాకి.
వెంటనే ఫ్రిడ్జ్ తెరిచి వాటర్ బాటిల్ తీసి, నీళ్ళు ఆమె ముఖం మీద జల్లింది అనైటా. కొద్దిసేపటికి ఆ అమ్మాయి కుదుటపడి లేచి కూర్చున్నది. ఆ అమ్మాయి పేరు సుజి.
సుజీ.. ఏం జరిగింది? ఎందుకలా పడిపోయావ్? మొహం తిరిగిందా? (అంతా మలై భాషలోనే సంభాషణ).
అనైటా, సుజీతో వుంటే ఏరన్ కిచెన్ లోకి వెళ్ళి, ముగ్గురికీ వేడి వేడి కాఫీ చేసుకొని వచ్చాడు. అది కొంచెం గొంతులో పడ్డాక, సుజీ కాస్త మనిషయ్యింది. అప్పుడు మెల్లగా ఒక్కొక్కటి చెప్పడం మొదలుపెట్టింది గుర్తుతెచ్చుకుంటూ. సుజీ గొంతు నిమొదటిసారిగా విన్నాడు ఏరన్.
సుజీ: నేను పనంతా పూర్తిచేసుకొని ఇంకా నిద్ర రావట్లేదు కదా అని, కాసేపాగి టీ.వి చూసి ఇంటికి వెళ్దామని ఆగి హాల్లోకి వచ్చాను. ఈ లోపుల మీ ఫోన్ రింగ్ అవ్వడం మొదలైంది, అప్పటికే మీరు వెళ్ళిపోయారు. వెంటనే ఫోన్ కూడా కనబడలేదు. రింగు వస్తూనే వుంది..ఫోన్ వెతగ్గా..అది మీ హ్యాండ్ బ్యాగ్ లోనుండి వస్తున్నది. అప్పుడు చూశాను, మీరు హ్యాండ్ బ్యాగ్ వదిలేశారని, దాంట్లో ఫోన్ కూడా వదిలేశారని. అయితే మీరు ఇంటి తాళాలు కూడా వదిలేసే వుంటారని అనుకున్నాను. మరి నేను ఇంటికి వెళిపోతే.. మీరు తాళాలు లేకుండా ఎలా లోపలికి వస్తారు అని ఆలోచించి, మీకు కాల్ చేద్దామని టేబుల్ మీద వున్న ల్యాండ్ ఫోన్ దగ్గిరకి వచ్చాను. మీరు రేడియో స్టేషన్ వెళ్తామన్నారు కానీ ఏ నెంబర్ కి ఫోన్ చెయ్యను? ఎల్విన్ బాబు నెంబరు.. టేబుల్ మీద మీ టెలిఫోన్ బుక్కులో చూసి కాల్ చేశాను. అది స్విట్చ్ ఆఫ్ వుంది. ఏం చెయ్యాలో తోచలేదు. అలాగే మీరొచ్చేంత వరకు వుండిపోదామనుకున్నాను. టీ.వి. చూద్దామనుకున్నాను, కానీ ఎందుకో చూడాలనిపించలేదు. రేడియో వినాలనిపించింది. సరే అని ఎఫ్.ఎం. ప్లే చేస్తూ వింటూ మీకోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. అప్పటికే ఫోన్ ఇన్ ప్రోగ్రాం మొదలయ్యి చాలా సేపయినట్లున్నది. ఇంతలో మీరు, ఎల్విన్ బాబు ఆ ప్రోగ్రాంలో మాట్లాడుతున్నారు. మీ గొంతు వినగానే ప్రాణం లేచొచ్చినట్లయినది. కరెక్ట్ గా అదే టైంలో ఫోన్ ఇన్ కి కనెక్ట్ అవ్వదలిచిన వారు ఈ నెంబర్ కి కాల్ చెయ్యండి అని ఎల్విన్ బాబు చెప్పారు. అంతే ఆ నెంబర్ కి ఫోన్ చేసి మాట్లాడాలనిపించింది. నాకే తెలియకుండా నేను ఆ నెంబర్ కి ల్యాండ్ లైన్ ద్వారా కాల్ చేశాను. చేస్తే ఎల్విన్ బాబు ఎత్తారు. అంతే.
ఏరన్: మరి నువ్వేం మాట్లాడావ్?
సుజి: తెలియదు. అట్నుండి ఎల్విన్ బాబు ఎత్తడమే గుర్తుంది.
ఏరన్: పోనీ ఏం మాట్లాడాలనుకున్నావ్ అనైటాతో? తాళాలు మర్చిపోయిందని చెబుదామనుకున్నావా?
సుజీ: కాదనుకుంటా. ఏదో ప్రోగ్రాం జరుగుతుంటే.. మధ్యలో నేను తాళాల గురించి చెప్పడం ఏం సమంజసం గావుంటుంది? తాను వచ్చేంతవరకు వుండిపోదామనే అనుకున్నాను.
ఏరన్: మరి అనైటా గొంతు ఫోన్ ఇన్ లో వినగానే ప్రాణం లేచొచ్చిందన్నావ్. ఎందుకు? దేనికి?
సుజి: ఆలోచనలో పడింది. చివరికి ఎందుకో తెలియదు అంది.
ఏరన్: సరే ఏమిమాట్లాడావు? గుర్తున్నంతవరకూ చెప్పు.
సుజి: అస్సలు గుర్తు లేదు. ఫోన్ డయల్ చేసి, ఎల్విన్ బాబు గొంతు వినినంత వరకే గుర్తుంది.
అనైటా: పోనీ ఎల్విన్ ఇంకా ఏం మాట్లాడాడు?
సుజీ: అది కూడా గుర్తులేదు. నా బ్రెయిన్ కాసేపు ఏదీ ఆలోచించలేదు నాకు తెలిసినది.
ఏరన్: పోనీ.. ఇంకా నీకు తెలియనివి ఏమైనా నీ కళ్ళకి కనబడడం గానీ, చెవులకు వినబడడం గానీ ఏమైనా జరిగినదా?
సుజీ: మెల్లగా ఆలోచించి. నేనలా ఫోన్ తో ఎంతసేపున్నానో కూడా నాకు తెలియదు. కానీ ఎక్కడో ఏదో పైనుండి పడిపోయి భళ్ళున విరిగిపోయినట్లుగా శబ్ధం వినబడింది. కానీ ఇది చాలా దూ…రం గా ఎక్కడో జరిగింది.
అనైటా వెంటనే కొద్ది దూరంలోనే క్రిందపడివిరిగి ఆ పడున్న ట్రోఫీని చూస్తూ..”కానీ సూజీ ఎక్కడో విన్నాను అని అంటున్నది. ఆశ్చర్యం….అని ముత్తాయించింది”.
అప్పుడు ఆ దిశలో సూజీ కూడా ఆ ట్రోఫీ కేసి చూసింది. అది చూశాక దిగ్గున లేచి రెండు చెంపల మీద అరచేతులు ఆనించుకొని.. షాక్ గా.. “అవును ఇదే.. ఎక్కడో లీలగా క్రింద పడిపోతున్నప్పుడు చూశాను” అంది మళ్ళీ.
ఏరన్: ఇది నీ ప్రక్కనేగా జరిగింది? ఎక్కడో చూశాను, ఎక్కడో విన్నానంటావేం????
సుజీ: అవును, నా ప్రక్కనే జరిగినట్లు అనిపించలేదు.
ఏరన్: పోనీ దీన్ని ఎవరు పడదోశారో చూసావా? ఎవరైనా ఆ టైంకి ఇంటికి ఏవరైనా వచ్చారా?
సుజి: లేదు, ఎవ్వరూ రాలేదు.
ఏరన్: అనైటా వచ్చేంతవరకు తలుపు తీసేవుంది. నువు వెయ్యలేదా?
సుజీ: అవును.. అనుకుంటాను, మర్చిపోయుంటాను.
ఏరన్: ఓకె. నువ్వుఇక నీ గదిలోకి పోయు పడుకో. తెల్లారేక మాట్లాడుదాం అని ఆమెని ఆ రాత్రి అక్కడే ఉంచేశారు.
అనైటాకి గుడ్ నైట్ చెప్పి ఏరన్ అక్కడినుండి తన హోటల్ రూం కి వచ్చేసాడు.
**************
టైం ఒంటిగంట అయ్యింది. కానీ నిద్రపట్టలేదు. సుజీ ఎపిసోడ్ తో కధ పూర్తిగా అర్ధమయిపోయింది ఏరన్ కి. తాము ఫోన్ ఇన్ కార్యక్రమం లో వున్నప్పుడు పెయింటర్ ఆత్మ తన అతీత శక్తులతో సుజీని కాసేపు వశం చేసుకొని, తన ద్వారా ఫోన్ లో ఆమె గొంతుతో మాట్లాడాడు. వెయిట్ ఎ సెక్, వెయిట్ ఎ సెక్.. అని ఆగి మళ్ళీ ఆలోచన్లను రీవైండ్ చేసుకున్నాడు.
యస్.. ఆమె గొంతులా కూడా వుంది స్పష్టత అంతగా లేకపోయినా! అమాండా కూడా చనిపోయిందన్నాడు, ఆమె ఏడుపు కూడా వినబడింది, అంటే అమాండా ఆత్మ కూడా సుజీ మీద పనిచేసివుంటుంది, సుజీయే తనకు తెలియకుండా నే తాను ఏడ్చింది అమాండా ఆత్మ కి లొంగి. ఓ మై గాడ్ !!!
మరి పెయింటర్ తో సంభాషణ అయిపోవడానికి ముందు ఏదో పైనుండి క్రిందపడి భళ్ళున ముక్కలయిపోయినట్లుగా మాకూ వినబడింది, అంటే అది ఈ క్రిస్టల్ ట్రోఫీ యే అన్నమాట., అది మేము గట్టిగా, స్పష్టంగా విన్నాము కానీ సుజీ మాత్రం ఎక్కడో దూరంగా విన్నది, అది ఆమె ప్రక్కనే జరిగినా కూడా. ఏమిటో ఈ వ్యత్యాసం. ఫెర్నాండేజ్ ని కలవాలి, ఇదంతా చెప్పాలి ఏదైనా క్లూ ఇస్తాడేమో! ఏది ఏమైనా ఇది చాలా త్వరగా తేల్చేయాల్సిన వ్యవహారం.. ఆలశ్యం అమృతం విషం. ఇంకా ఆలశ్యం చేస్తే ఏమేమి జరుగనున్నవో!!!
ప్రొద్దున లేచాక బ్రేక్ ఫాస్ట్ కూడా చేసేసి కూర్చున్నాడు. ఫెర్నాండేజ్ కి కాల్ చేశాడు.. టూకీగా జరిగినదంతా చెప్పాడు. ఫెర్నాండేజ్ సాయంత్రం మరో ఫ్రెండ్ దగ్గిరకి తీసుకువెళ్తానన్నాడు. తర్వాత ఏరన్, అనైటా ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఈ కేసు విషయాలు తెలుసుకుందామని ఫోన్లో మాట్లాడుకున్నారు. రూబీని రిసెప్షన్ లో చూశాడు ఏరన్. అమాండా విషయం గుర్తొచ్చింది. తనకా రోజు రూబీ ఇచ్చిన అమాండా ఫోన్ నెంబర్ గురించి అడుగుదామనుకున్నాడు, మళ్ళీ ఆ ఆలోచనని మార్చుకున్నాడు. ఎందుకంటే ఈ ఆత్మలు ఎవరో ఒకరిని లొంగదీసుకొని వాళ్ళద్వారా వాళ్ళ గొంతులతో మాట్లాడుతున్నాయని అర్ధమయిపోయింది కాబట్టి, రూబీ కి కూడా అలాగే అయ్యుంటుందని అనుకొని ముందుకు సాగిపోయాడు.
సమయం ప్రొద్దున్న 10.30 కావస్తుంది. అనైటా ఇంకా రాలేదు, స్టేషన్ కి వెళ్ళాలి. ఈ లోపున తనని ఈ కేసుకి అంటించిన థ గ్రేట్ బాస్ కి ఇదంతా 30 ఏళ్ళ క్రిందటి కేసనీ, దాన్ని పోలీసు రికార్డుల్లో నుండి వివరాలు తీయించబోతున్నామనీ చెప్పాలనుకున్నాడు. ఆలోచిస్తూ అక్కడే హోటల్ ముందు అనైటా కోసం ఎదురు చూస్తూ జేబులోంచి ఫోన్ బయటకి తీస్తూ బాస్ తో మాట్లాడదామని. ఇంతలో రివ్వున ముందర కారు వచ్చి ఆగింది, అది అనైటా నవ్వుతూ. సరే.. ఇక బాస్ కి ఫోన్ చేసి మాట్లాడే ప్రోగ్రాం ని టెంపరరీగా వాయిదా వేశాడు.
ఏరన్: అనైటా ఈ లోకల్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ పేరేమన్నావ్?
అనైటా: జేసన్
ఏరన్: మనం వస్తున్నామని ముందుగా ఇన్ ఫామ్ చేశావు కదా?
అనైటా: యస్. పదకొండుకల్లా అక్కడ వుంటాము, వెళ్తున్నాముగా. టూకీగా కేసు గురించి కూడా అడిగాను. రికార్డ్స్ వెతికిస్తానని చెప్పాడు జేసన్. జేసన్ కి ఒక 30-35 ఏళ్ళు వుండవచ్చు. చాలా సిన్సియర్ మనిషి. ఎక్కడా అన్యాయం జరగనివ్వడని విన్నాను.
ఏరన్: ఊ..30-35 ఏళ్ళు అంటే పెయింటర్ తర్వాత పుట్టాడు జేసన్. తాను ఇంకా భూమ్మీద పుట్టకముందే భూమిలోకి వెళ్ళిపోయిన విషయాన్ని ఇప్పుడు బయటికి తీయాలన్నమాట.. హ..హ..హ..
అనైటా: నిశ్శబ్దంగా ఉంది. ఎందుకో తాను నవ్వలేకపోయింది.
ఏరన్: ఏవిటా మౌనం? నేను సరదాగా అన్నాలే.
అనైటా: అన్నందుకు కాదు, ఎందుకో ఆ పిల్లలు చనిపోవడం, వాళ్ళ ఆత్మలు క్షోభిస్తూ తిరుగుతూండడం తలుచుకుంటుంటే బాధ కలుగుతున్నది.
ఏరన్: నమ్మలేని నిజం, కానీ నమ్మేట్లు చేస్తున్నది. జేసన్ ఏదైనా మనకి హెల్ప్ చెయ్యగలిగితే ఈ కేసు వివరాలు బయటకు తియ్యగలిగితే నా నమ్మకం బలపడుతుంది.
అనైటా: ఇంకా నమ్మట్లేదా?? (చురుగ్గా ఒకసారి ఏరన్ కేసి చూసి)
ఏరన్: నమ్మినట్లుగానే అనిపిస్తున్నదనుకో నాకు. అచ్చా.. టెల్ మి థిస్. ఎప్పుడైనా ఆ సమాధి దగ్గిరకి వెళ్ళావా?
అనైటా: యస్. వెళ్ళాను.
ఏరన్: ఎందుకు?
అనైటా: అదేం ప్రశ్నా?
ఏరన్: అవును. ఎందుకు వెళ్ళావ్? నేను ఇన్ని రోజులయ్యింది ఈ కేస్ డీలింగ్స్ మొదలెట్టి. నేను వెళ్ళలేదే? అసలు అది పెయింటర్ సమాధేనని ఎలా తెలిసింది?
అనైటా: చిన్న ఆలోచనలో పడింది. యస్. నేనెందుకు వెళ్ళాను? హ..గుర్తొచ్చింది. అందమైన ప్రదేశాలన్నీ ఫోటొస్ తీస్తూ వస్తుంటే.. విశాలంగా, నీట్ గా ఈ సిమెటరీ కనబడింది. గేట్ లోపలికి వెళ్ళి అక్కడినుండే రెండు, మూడు పిక్చర్లు తీశాను. అప్పుడే ఈ సమాధిని చూశాను.. చక్కగా అందమైన ఎరుపు, పసుపు ఫ్రెష్ పూలగుచ్చాలతో అలంకరించి వుంది. ఆ తర్వాత ఎల్విన్ నుండి రికార్డింగ్స్ తీసుకున్నాక.. పెయింటర్ తన సమాధి గురించి చెప్పిన వివరాలను బట్టి అక్కడికి మళ్ళీ వెళ్ళి చూసాను. అది ఆ రోజు నేను పుష్పగుచ్చాలతో చూసిన సమాధే అని నిర్ధారించుకున్నాను.
ఏరన్: ఊ. పూలతో అలంకరిస్తున్నారంటే.. ఎవరో క్రమం తప్పకుండా ఇన్ని సంవత్సరాలనుండి ఆ సమాధి దగిరకి వచ్చి వెళ్తున్నారు. ఎప్పుడైనా వాళ్ళెవరో చూశావా?
అనైటా: లేదు. ఒకసారి ప్రయత్నించాను. ఊహు..దొరకలేదు, మళ్ళీ ఆ రోజు తర్వాత మళ్ళీ ఆ సమాధి ఎప్పుడూ అలంకరించి వుండడం నేను చూడలేదు.
ఏరన్: ఇంట్రస్టింగ్ !
ఇంకెప్పుడైనా ఏ సంధర్భంలోనైనా వెళ్ళావా?
అనైటా: వెళ్ళాను రెండు మూడు సార్లు, పోయినవారం కూడా. కరెక్ట్ గా ఫోన్ ఇన్ కార్యక్రమం మొదలవ్వడానికి ముందు. ఆ సిమెటరీ నుండే ఎవరైనా ఇలా ఫోన్లు చేసి మాట్లాడుతున్నారేమో అని చూడడానికి. ఊహు..ఎవరూ కనబడలేదు. తీరా స్టేషన్ కి నేను వచ్చినప్పుడో, లేదా తర్వాత ఎప్పుడైనా ఎల్విన్ ఫోన్ చేసి చెప్పేవాడు, నేను వెళ్ళిన రోజునే పెయింటర్ మాట్లాడాడని. ఆశ్చర్యం ఏమిటంటే.. నాకక్కడ ఎవరూ కనబడలేదు, మరి ఆ సమాధి దగ్గిరనుండి ఎవరు మాట్లాడారు ?????
.
.
.
ఇంకెవరూ “నువ్వే”….ఏరన్ స్వగతం లో గట్టిగా ఒక అరుపు అరుచుకున్నాడు.

(ఇంకా వుంది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *