May 4, 2024

జీవితం ఇలా కూడా ఉంటుందా..? – 1

రచన: అంగులూరి అంజనీదేవి

ప్రేమంటే ఒక లోతైన అవగాహన. అది ఎవరి మధ్యనైనా పుట్టొచ్చు. అది వుంటేనే జీవితం సంతోషంగా, అద్భుతంగా వుంటుంది. ఎప్పుడైనా తర్కం (లాజిక్‌) గుడ్డిదేమో కాని ప్రేమ గుడ్డిది కాదు. అదొక మౌన తరంగిణి. దాన్ని ‘నువ్వు నాక్కావాలి’ అని ఎవరూ అడగలేరు. ‘నేను నీతోనే వుంటాను’ అని ప్రేమ కూడా ఎవరితో చెప్పదు. అలాంటప్పుడు ప్రేమతో ‘నువ్వు ఎక్కడికీ వెళ్లకు, నాతోనే వుండు’ అని ఎలా చెప్పగలం… అదొక అనంతం. శక్తివంతం. ఆది, అంతం లేని మహోజ్వల జ్వాలా ప్రహేళిక. ఆపినా ఆగని భావోద్వేగపు ఉప్పెన. ఆ ఉప్పెనలో మునిగేవాళ్లున్నారు. అభిషేకించబడేవాళ్లున్నారు. ముంచినా, అభిషేకించినా అది ప్రేమకే సాధ్యం. ప్రేమ ఒడిని మించిన ఓదార్పును ఈ ప్రపంచంలో ఏమిస్తుంది? కానీ అలాంటి ప్రేమను పొందాలన్నా, జయించాలన్నా కొంత సాధన కావాలి. అంకితభావం కావాలి. అదృష్టం వుండాలి. ఏ అదృష్టాన్నయినా అర్హత లేకుండా అందుకోగలమా??
జీవిత యుద్ధంలో మనిషి గెలవాలీ అంటే పోరాటం తప్పనిసరి. ఆ పోరాటం న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా వుండాలి. కానీ మన ఆధీన రేఖ దాి శాంతియుతంగా వున్న భారతసైనికుల మీద దాడులు జరిపి తలల్ని నరికేసి, శరీరాన్ని మన భూభాగంలో వదిలి తలల్ని పాకిస్తాన్‌ వాళ్లు పట్టుకెళ్లారు. నిజంగానే యుద్ధం జరిగినప్పుడు చనిపోతే వీరమరణం కాని యుద్ధం లేకుండానే దాడులు జరపడం, చంపడం పిరికిపంద చర్య. ఇది అసలు యుద్ధవీరుల నైజమే కాదు. నైతికత అంతకన్నా కాదు.
అంకిరెడ్డికి నిద్రపట్టక తన లాప్‌టాప్‌ని ఓపెన్‌ చేసి ఫేస్‌బుక్‌లోకి లాగిన్‌ అయ్యాడు. అక్కడ తన హోమ్‌లో పోస్టయి వున్న వీడియోను క్లిక్‌ చేశాడు. పాకిస్తాన్‌ సైనికులు, భారతదేశ సైనికులతో యుద్ధం చేస్తున్నారు. వేల రౌండ్ల తూటాలను ఫైర్‌ చేస్తున్నారు. దాన్ని చూడగానే కళ్లు తిరిగి బెడ్‌ మీద పడిపోయాడు అంకిరెడ్డి. ఆ తర్వాత ఆయన ఎప్పుడు నిద్రపోయాడో ఆయనకే తెలియదు.
తెల్లవారి నిద్రలేచి వాకింగ్‌కి వెళ్లాలని కారును బయటకు తీశాడు అంకిరెడ్డి. ఆయన కారు మెయిన్‌రోడ్డు మీద తిన్నగా వెళ్తోంది. ఆయన ఆలోచనలో ఆయన వున్నాడు. కాలేజి గేటు రాగానే డ్రైవింగ్‌ సీట్లో కూర్చుని వున్న అంకిరెడ్డి అలర్టయి కారును కాలేజీ లోపలికి పోనిచ్చాడు. గేటు పక్కన వున్న చింతచెట్టు కింద కారును ఆపుకొని నడవటం ప్రారంభించాడు. అలా ఓ పదినిమిషాలు నడుచుకుంటూ వెళ్తే ఆయన వాకింగ్‌ చేసే ప్లేగ్రౌండ్‌ వస్తుంది. ఆ గ్రౌండ్‌లోకి వెళ్లి నాలుగు రౌండ్లు నడుస్తాడు. తర్వాత ఏరోబిక్స్‌ ఓ పది నిమిషాలు చేసి కారు దగ్గరకి ఒక పదినిమిషాల్లో నడుచుకుంటూ వస్తాడు. ఒకా రెండా ఇరవై సంవత్సరాలుగా ఆయన దినచర్య అది…
ఆయన నడుస్తూనే వున్నాడు. గ్రౌండింకా రాలేదు. వారం రోజులుగా వర్షం పడుతున్నందువల్ల రోడ్డుకి ఇరువైపుల వున్న చెట్లు పచ్చబడ్డాయి. నేలమీద మొలిచిన పచ్చిక చిక్కబడింది. పువ్వులు విరబూసి అప్పుడప్పుడు తొడిమల నుండి విడిపోయి కింద పడుతున్నాయి. తలపైకెత్తి చూస్తే పొన్న, తురాయి, మద్ది, వేప, కానుగ చెట్ల మధ్యలోంచి నీళ్లు తాగి రావటానికన్నట్లు వేగంగా వెళ్తున్న మేఘాలు కన్పిస్తున్నాయి.
ఆ దృశ్యాలేమీ అంకిరెడ్డికి కనబడటం లేదు. ఆయన తల వంచుకుని నడుస్తూ వున్నాడు. ఎప్పుడైనా ఆయన అలా వుండేవాడు కాదు. ఎండాకాలం వస్తే ఎండని, వర్షాకాలం వస్తే వర్షాన్ని, ఏమీ లేకుంటే ఆకాశాన్ని చూసైనా ఆనందిస్తాడు. ప్రతిదీ హృదయంతో చూస్తాడు. మనసుతో ఆనందిస్తాడు. ఈ కాలం వచ్చిందంటే ”ముళ్లుంటాయి రెడ్డీ! వద్దు. రోడ్డుపైకి రా! షూష్‌ విప్పి పచ్చికలో అలా వట్టి పాదాలతో నడవటం సేఫ్‌ కాదు” అని స్నేహితులు అంటున్నా నవ్వి వినకుండా నడిచేవాడు. ఏ సరదాను చంపుకునే వాడు కాదు. కానీ ఈరోజు ఎందుకో ఆయన మనసు ఉత్సాహంగా లేదు. చాలా రసహీనంగా, దిగులుగా, గుబులుగా, భయంగా వుంది. హృదయం మొత్తం డ్రైగా వుండి ఊపిరి కూడా సరిగా ఆడటం లేదు.
వాకింగ్‌కి వెళ్లే ముందు ఆయన భార్య మాధవీలత రాత్రి నీళ్లలో నానబెట్టిన మెంతులు, బాదాంపప్పు, రాగి చెంబుతో నీళ్లు ఇచ్చి ”ఏంటండీ అలా వున్నారు?” అని అడిగింది. ఆయన సమాధానం చెప్పకుండా మూగవాడిలా చూడగానే ఆమె మౌనంగా వెళ్లి గేటు దగ్గర పడివున్న పేపర్‌ పట్టుకొచ్చింది. ఆయన బాదం పప్పు తిని నీళ్లు తాగుతుంటే పేపర్ని ఆయన ముందున్న టీపాయ్‌ మీద పెడుతూ ఆయన ముఖంలోకి పరీక్షగా చూస్తూ నిలబడింది. ఆయన నవ్వి ”ఏంటే! పిచ్చీ! ఎందుకలా చూస్తావ్‌? కొత్తవాడిని చూసినట్లు…”అన్నాడు.
”మీరు కొత్తగానే వున్నారండీ! ఏదో పోగొట్టుకున్నట్లు కన్పిస్తున్నారు” అంది. ఆమె చాలా సునిశిత చూపు కలిగిన మహిళ. భర్తలో ఏ మార్పు వచ్చినా వెంటనే పసిగట్టేస్తుంది. ముఖం మీద వచ్చిన ముడతలనే కాదు. మనసులో వచ్చిన మడతను కూడా కనిపెట్టయ్యగలదు. అది తెలిసి, ఆయన భార్యకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా రెండు చేతులతో పేపర్‌ పట్టుకొని సీరియస్‌గా చదువుతూ కూర్చున్నాడు. ఆమె వంటగదిలోకి వెళ్లి వేడివేడిగా కాఫీ కలుపుకుని వచ్చి ఆయన చేతికి ఇచ్చింది. అప్పుడు కూడా అదే ప్రశ్న ఆమెలో… ఆయన కాఫీ తాగి ”మధూ! కారు కీస్‌ తెచ్చివ్వు” అంటూ లేచి బయటకెళ్లి స్పోర్ట్స్‌ షూస్‌ వేసుకున్నాడు. ఆమె కారు కీస్‌ తెచ్చివ్వగానే కారులో కూర్చుని గ్రౌండ్‌కి వచ్చాడు.
వాకింగ్‌కి వచ్చినా ఆయన మానసిక స్థితిలో మార్పు లేదు. అదే ఆలోచన. అదే బాధ. రోడ్డు దిగి ఎప్పటిలాగే గ్రౌండ్‌లోకి వెళ్లి నడుస్తున్నాడు. భార్య అన్నట్లు నిజంగానే తను కొత్తగా కన్పిస్తున్నాడా? ముఖంలో బాగా మార్పు వచ్చిందా? ఆలోచిస్తున్నాడు అంకిరెడ్డి.
రోడ్డు మీద నడుస్తున్న ఆయన స్నేహితులు ఆయన్ని చూసి ఆశ్చర్యపోతూ ”రెడ్డీ!” అంటూ పిలిచారు. అంకిరెడ్డి పలకలేదు.
జాన్‌, నాయక్‌, వాసుదేవ్‌ చప్పట్లు కొడుతూ ”రెడ్డీ! గ్రౌండ్‌ మొత్తం బురదగా వుంది. రోడ్డు మీదకు రా! వచ్చి మాతో జాయినవు” అంటూ పిలిచారు.
ఆ గ్రౌండ్‌ ఒకప్పుడు అలా లేదు. రోజుకి నూటయాబై ఏడు మంది వాకర్స్‌ నడిచే ఆ గ్రౌండ్‌కి రెండు సంఘాలు ఏర్పాడి ఈ మధ్యనే మట్టితో ఎత్తు, పల్లాలు లేకుండా నీట్ గా చేయించారు. అంతేకాదు వాకర్సంతా నెలకి, ఇంత చొప్పున డబ్బులు పోగు చేసుకొని సంఘసేవ కూడా చేస్తుంటారు. వాళ్లలో ఎక్కువగా ముందుకొచ్చి ఏది చెయ్యాలన్నా ఉత్సాహం చూపేది జాన్‌, నాయక్‌, వాసుదేవ్‌. ఈ మధ్యన అంకిరెడ్డి కూడా వాళ్లతో కలిశాడు. వాళ్లే ఆ సంఘానికి సెక్రెటరీ, జాయింట్ సెక్రెటరీ, ప్రెసిడెంట్, ట్రెజరరీగా వ్యవహరిస్తుంటారు. గౌరవ అధ్యక్షులుగా ఎప్పటికీ వాసుదేవే వుంటున్నాడు.
గ్రౌండ్‌లో నడుస్తున్న అంకిరెడ్డి వాళ్లు పిలుస్తుండగానే తల తిరిగినట్లై కింద పడిపోయాడు. ఆజానుబాహుడైన అంకిరెడ్డి ఎత్తైన చెట్టు నేలమీదకి ఒరిగినట్లు దబ్బున పడిపోవడంతో రోడ్డుమీద వాకింగ్‌ చేస్తున్న ఆయన స్నేహితులతో పాటు మిగిలిన వాకర్సంతా ”అరెరె! రెడ్డి పడిపోయాడు రండి! రండి!” అంటూ ఒకరిని ఒకరు పెద్ద గొంతుతో పిలుచుకుని, రోడ్డు దిగి అంకిరెడ్డి దగ్గరకు పరిగెత్తారు.
అంకిరెడ్డి అప్పటికే లేవబోతున్నాడు. తన చుట్టూ చేరిన వాకర్స్‌ను చూసి అసలేం జరిగిందో ఒక్కక్షణం అర్థంకాక బిత్తరపోయాడు. ఆయన తేరుకుని వాళ్ల వైపు చూసేలోపలే వాసుదేవ్‌, జాన్‌, నాయక్‌ ఆయన్ని తమ చేతుల మీదుగా తీసికెళ్ళి చెట్టుకింద కూర్చోబెట్టారు.
”వాటరుంటే పట్టుకురా జాన్‌!” అని వాసుదేవ్‌ అనగానే జాన్‌ వెళ్లి తన కారులో వున్న వాటర్‌ బాటిల్‌ తెచ్చాడు. బాటిల్‌ మూత విప్పి తనే స్వయంగా అంకిరెడ్డితో నీళ్లు తాగించాడు. రెండు గుక్కలు నీళ్లు తాగి ”ఇక చాలు జాన్‌! థాంక్యూ!” అంటూ జాన్‌ వేపు చూశాడు అంకిరెడ్డి.
అంకిరెడ్డి ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్న మార్పును చూసి ఉలిక్కిపడ్డాడు జాన్‌. నిన్న బాగానే వున్న అంకిరెడ్డి ఇవాళ ఎందుకిలా వున్నాడన్న సందేహం జాన్‌ ముఖంలో చూసి మిగిలినవాళ్లు కూడా అంకిరెడ్డి ముఖంలోకి గుచ్చిగుచ్చి చూశారు. అంకిరెడ్డికి ఆ వాతావరణం ఇబ్బందిగా వుంది. వాళ్లంతా తనను వదిలి వెళ్లిపోతే బాగుండని వుంది. ఒక్కరు కూడా అక్కడ నుండి కదలటం లేదు. కాకిపిల్ల కింద పడితే కాకులన్నీ గుంపులా చేరి ‘కాకా’ అని అరిచినట్లు ”ఎలా వుంది రెడ్డీ?” అంటూ ఆయన చుట్టూ గుమిగూడారు. వాళ్లు అలా అడుగుతుంటే ఆయనకు వూపిరాడటం లేదు.
”మీరేం కంగారు పడకండి! నేను ఓ.కె.” అంటూ అందరివేపు చూసాడు. ఆయన గొంతు ఎప్పటిలా గంభీరంగా లేదు. ఏదో చిన్న జీర. ఆ జీరలోనే ఆయన పడుతున్న ఆందోళన ధ్వనిస్తోంది.
ఆయన ”నేను ఓ.కె.” అనగానే చాలామంది వాకర్స్‌ అక్కడ నుండి వెళ్లిపోయారు. ఇప్పుడు ఊపిరాడింది అంకిరెడ్డికి.
”జాన్‌! నువ్వెళ్ళి రెడ్డిని ఇంటి దగ్గర దింపిరా!” అంటూ వాసుదేవ్‌ జాన్‌ వేపు చూశాడు. వాసుదేవ్‌ వర్షాల వల్ల నాలుగు రోజుల నుండి వాకింగ్‌కి రాలేదు. ఆయన ఇంకా ఓ మూడు రౌండ్లు నడిచాకనే ఇంటికెళ్లాలని జాన్‌కి రెడ్డి బాధ్యతను అప్పజెప్పాడు. లేకుంటే ఆయనే తీసుకువెళ్లేవాడు. ఆయన ఆర్మీలో వాలెంటరీ రిటైర్‌మెంట్ తీసుకొని ప్రస్తుతం ఒక కాలేజిలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. అంకిరెడ్డి స్నేహాన్ని మనస్ఫూర్తిగా కోరుకునేవాళ్లలో ఆయనొకడు.
”లే! రెడ్డీ వెళదాం!” అంటూ అంకిరెడ్డిని ఇంటి దగ్గర డ్రాప్‌ చేసి రావానికి జాన్‌ సిద్ధమయ్యాడు. జాన్‌ కొంతకాలం ఏర్‌ఫోర్స్‌లో ఉద్యోగం చేసి వాలెంటరీ రిటైర్‌మెంట్ తీసుకొని ప్రస్తుతం బ్యాంక్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు.
అంకిరెడ్డి మాట్లాడకుండా మౌనంగా చూస్తున్నాడు. తన కోసం తన స్నేహితులు వాకింగ్‌ను మధ్యలో మానేసి తన దగ్గర వున్నారన్న ధ్యాస కూడా ఆయనకు లేదు… జాన్‌ మళ్లీ అడిగితే ”వద్దు జాన్‌! నేను వెళ్లగలను. మీరు వాకింగ్‌కి వెళ్లండి!” అన్నాడు.
వాళ్లు వెళ్లలేదు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ అక్కడే వున్నారు.
నాయక్‌ అంకిరెడ్డి పక్కన కూర్చుని అంకిరెడ్డి వైపు పరీక్షగా చూస్తున్నాడు. నాయక్‌కి తెలుసు అంకిరెడ్డి అందరికన్నా ఉత్సాహంగా, హుషారుగా, పుష్టిగా వుంటాడని… అంతేకాదు ఎండా, వాన, చలి అన్నది చూడకుండా వాకింగ్‌ చేస్తుంటాడు. వానలో గొడుగు పట్టుకొని, చలిలో షాల్ కప్పుకొని వాకింగ్‌ చెయ్యటం అదో రకమైన థ్రిల్‌ నాకు అని కూడా అంటుంటాడు. నిన్న కూడా బాగానే వున్నాడు. ఇవాళే బాగా క్రుంగినట్లు కన్పిస్తున్నాడు. ఒక్కరోజులోనే ఇంత మార్పా? ఎందుకో ఏమో అని మనసులో అనుకొని అక్కడ నుండి సడెన్‌గా లేచి వాసుదేవ్‌ని చేయి పట్టుకొని పక్కకి తీసికెళ్లాడు.
”ఏంటి నాయక్‌? ఎందుకిలా తీసుకొచ్చావ్‌?” అర్థం కానట్లు చూస్తూ అడిగాడు వాసుదేవ్‌.
”అంకిరెడ్డిని చూస్తుంటే నాకేదో అనుమానంగా వుంది వాసు!”
”అనుమానం దేనికి నాయక్‌?”
”అంకిరెడ్డి పడింది కాలుజారో, బురద వల్లనో అనుకుంటున్నావా?”
”అవును. దాని వల్లనే పడిపోయాడు. మనం పిలవగానే రోడ్డుమీదకి వచ్చి వుంటే ఈ ఇన్సిడెంట్ జరిగేది కాదు” అన్నాడు వాసుదేవ్‌.
”నువ్వలా అనుకుంటున్నావు కాని అది కరక్ట్‌ కాదు వాసూ! అంకిరెడ్డి నడుస్తున్న ప్రాంతంలో అసలు బురదే లేదు. బురదకి పది అడుగుల దూరంలో ఆయన వుండగానే మనం పిలిచాం. ఈ లోపలే పడిపోయాడు” అన్నాడు నాయక్‌.
”అయితే నువ్వనేది ఏంటి నాయక్‌? నాకేం అర్థం కావటం లేదు” అన్నాడు వాసుదేవ్‌.
”ఆయనకు బి.పి పెరిగో, షుగర్‌ డౌన్‌ అయ్యో పడిపోలేదు. అసలు ఆయనకి ఆ జబ్బులేం లేవు వాసుదేవ్‌! ఇంకేదో జబ్బు రెడ్డి శరీరంలో తయారవుతుండవచ్చు. అది ఆయనకు తెలిసి కూడా మన దగ్గర దాచిపెడుతున్నాడు… మనం పిలుస్తున్నా వినకుండా ఆయన దిగుల్లో ఆయన వుండి సడెన్‌గా కిందపడిపోయి వుంటాడు” అన్నాడు నాయక్‌.
నాయక్‌ చెప్పింది విని నిజమే కావచ్చు అనుకున్నాడు వాసుదేవ్‌. నాయక్‌ కూడా వాసుదేవ్‌, జాన్‌లాగే నేవీలో కొంతకాలం పనిచేసి వాలెంటరీ రిటైర్‌మెంట్ తీసుకొని ప్రస్తుతం మోటర్లు, పైపులు అమ్మే షాపులో షిఫ్ట్‌ టైం పనిచేస్తూ ఎక్కువగా ఇంట్లోనే గడుపుతుంటాడు. ఎన్ని పనులు వున్నా నెలనెలా హాస్పిటల్‌కి వెళ్లి అన్ని టెస్ట్‌లు చేయించుకుంటూ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు.
”సరే! రా! వెళ్లి రెడ్డితో మాట్లాడదాం నాయక్‌!” అంటూ నాయక్‌ను అక్కడి నుండి తీసుకొని రెడ్డి దగ్గరకి వచ్చాడు వాసుదేవ్‌.
రెడ్డి చెట్టు మొదట్లో అలాగే కూర్చుని చూపుల్ని ఎక్కడో నిలిపి తన ఆలోచనలో తనున్నాడు. ఆయనకు అప్పుడే ఇంటికి వెళ్లాలనిపించటం లేదు. ముఖ్యంగా తన బాధను భార్యతో పంచుకోవాలంటే భయపడుతున్నాడు. ఇంటికెళ్తే ”ఏంటండీ! అలా వున్నారు?” అని మళ్లీ అడుగుతుందేమోనని కంగారుగా వుంది. తను ఎలాగైనా ధైర్యం తెచ్చుకోవాలి. మానసికంగా బలవంతుడు కావాలి. కళ్లు మూసుకుని చాలాసేపు అలాగే కూర్చుంటే శక్తి వస్తుందేమోనని కళ్లు మూసుకున్నాడు.
పక్కనే కూర్చుని వున్న జాన్‌ రెడ్డిని కదిలించకుండా అలాగే చూస్తున్నాడు.
వాసుదేవ్‌, నాయక్‌ వచ్చి ఆయన భుజం తట్టి ”లే! రెడ్డి! ఇంటికెళ్దాం! ఇంటికెళ్తే పడుకోవచ్చు, ఇక్కడ ఎంతసేపని కూర్చుంటావు. మళ్లీ మబ్బులు మొదలయ్యాయి. వర్షం వచ్చేలా వుంది” అన్నారు నెమ్మదిగా.
రెడ్డి నెమ్మదిగా కళ్లు విప్పి పేలవంగా నవ్వాడు.
”ఎందుకు రెడ్డీ అలా నవ్వుతావు. మేమంతా వెళ్లిపోతే ఇక్కడ ఎవరూ వుండరు. ఒక్కడివే ఒంటరిగా ఎంతసేపని ఇలా కూర్చుంటావ్‌? పైగా వాతావరణం కూడా నిమిష నిమిషానికి చల్లపడుతోంది. ఎక్కడో తుఫాన్‌ అట…” అన్నాడు జాన్‌.
”నాలో నిమిషనిమిషానికి భయపెడుతున్న తుఫాన్‌ కన్నా ఈ బయట వచ్చే తుఫాన్‌ అంత పెద్దదా జాన్‌! నాకు ఇంట్లో కన్నా ఈ విశాలమైన మైదానంలో… ఈ చెట్టు కిందనే బాగుంది. మబ్బుల మీద నుండి తేలి వస్తున్న ఈ చల్లగాలికి నా బుర్రలో వున్న వేడిని తగ్గించుకుంటాను. మీ ముగ్గురు వెళ్లిపొండి!” అన్నాడు.
అంకిరెడ్డి మాటలకు వాళ్లు ముగ్గురు విస్తుపోయారు.
”నాయక్‌! నువ్వు చెప్పింది నిజమే!” అన్నట్లు నాయక్‌ వైపు చూశాడు వాసుదేవ్‌.
”అంకిరెడ్డితో మాట్లాడు వాసుదేవ్‌! మనం కాకుంటే ఆయనకు ఎవరున్నారు? ఇలాంటి సమయంలోనే కదా ధైర్యం చెప్పాలి” అన్నట్లు వాసుదేవ్‌ వైపు చూశాడు నాయక్‌.
”అలాగే!” అన్నట్లు కళ్లతోనే సైగచేశాడు వాసుదేవ్‌.
అంకిరెడ్డికి అటువైపు జాన్‌ కూర్చుని వుంటే ఇటువైపున వాసుదేవ్‌ కూర్చుని ”నువ్వు కూడా కూర్చో నాయక్‌!” అంటూ నాయక్‌ను తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు.
వాళ్లు అలా కూర్చున్నారో లేదో గాలి, వాన మొదలైంది. వాళ్లు ఆనుకుని కూర్చున్న చెట్టు కూడా గాలికి ఊగసాగింది.
”ఇక్కడ వుంటే తడిసిపోతాం రెడ్డీ!” అంటూ ముగ్గురు కలిసి అంకిరెడ్డిని బలవంతంగా అక్కడి నుండి తీసికెళ్లి కారులో కూర్చోబెట్టారు.
”రెడ్డీ! నువ్వు కారును డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లగలవా? లేక మాలో ఎవరో ఒకరం తోడుగా రావాలా?” అడిగాడు జాన్‌.
”వద్దు జాన్‌! ఫిజికల్‌గా నేను బాగానే వున్నాను. మీరేం కంగారు పడకండి! నేను వెళ్లగలను” అంటూ స్నేహితులు ముగ్గురికి ‘బై’ చెప్పి స్టీరింగ్‌ పట్టుకుని రోడ్డు మీదకి చూశాడు. వర్షం ఎక్కువైంది.
స్నేహితులు ఎవరి కార్లో వాళ్లు కూర్చుని వెళ్లిపోయారు.
స్టీరింగ్‌ పట్టుకుని కూర్చున్న ఆయన చేతులు అప్రయత్నంగానే వణికాయి. ఒకటే నిర్ణయించుకున్నాడు. ఇంటికెళ్లాక తలనొప్పిగా వుందని ఆఫీసుకి సెలవు పెట్టాలి. తలకి గుడ్డ కట్టుకొని పడుకోవాలి. అలా చేస్తే మాధవీలత తన గురించి ఎక్కువగా ఆలోచించదు. మహా అయితే ఒకటికి రెండుసార్లు కాఫీ కలిపి ఇస్తుంది. పెయిన్‌ కిల్లర్‌ వేసుకోమంటుంది. ఒక అర్ధగంట గడవనిచ్చి ‘ఇప్పుడెలా వుందండీ?’ అంటూ తన చుట్టూ తిరుగుతుంది. అంతకన్నా ఇంకేం హడావుడి చెయ్యదు. కంగారు పెట్టదు. తలనొప్పి వల్లనే తన భర్త అలా వున్నాడని మనసుకు నచ్చచెప్పుకుంటుంది. ఎప్పటిలాగే ఇంటి పనిలో పడిపోతుంది అని అంకిరెడ్డి అనుకుంటుండగానే ఇల్లు వచ్చింది.
కారు దిగి ఇంట్లోకి వెళ్లాడు.
ఇంట్లోకెళ్లగానే మాధవీలత జాడ లేదు. ఎప్పుడైనా గేటు దగ్గరకి కారు వెళ్లగానే నవ్వుకుంటూ వచ్చేది. చిన్నపిల్లలా ఉత్సాహంగా వచ్చి గేటు తీసేది. ఇవాళ అలాంటి పనేం చెయ్యలేదు. ఇంట్లోకి వెళ్లాక కూడా ఎదురు రాలేదు. వంటగదిలో వుందేమో అనుకున్నాడు. అక్కడా లేదు. ఎక్కడుంది మాధవి? కన్పించదేం? అనుకుంటూ ఇల్లంతా వెదికాడు. బాల్కనీలోకి వెళ్లాడు. ”మధూ! మధూ!” అంటూ పిలిచాడు.
ఆమె బాల్కనీ చివరన అటువైపుకి తిరిగి కూర్చుని వుంది.
ఆయన ఎంత పిలిచినా పలకలేదు.
దగ్గరకెళ్లి భుజంమ్మీద చేయి వేసి తనవైపుకి తిప్పుకున్నాడు.
ఆమె ఆయన వైపు చూడగానే ఆమె కళ్లలోకి చూసి నివ్వెర పోయాడు.
”ఏంటలా వున్నావు మధూ? ఏం జరిగింది?” ఆతృతగా అడిగాడు అంకిరెడ్డి. ఆ క్షణంలో ఆయన పడుతున్న బాధను మరచి పోయాడు.
జారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ”ఏం లేదండీ! మీరెప్పుడొచ్చారు? పదండి వేణ్ణీళ్లు పెడతాను” అంటూ ఆయనకన్నా ముందు ఆమెనే బాత్‌రూంలోకి వెళ్లి గీజర్‌ ఆన్‌ చేసి వంటగదిలోకి వెళ్లింది.
ఆయన ఊహించినట్లు ఆమె ఆయనవైపు చూసే మూడ్‌లో లేదు. ఆయనను ప్రశ్నలు వేసే ఉద్దేశంతో అసలే లేదు.
ఆయన ఎప్పటిలాగే రెడీ అయి ఆఫీసుకెళ్లాడు. ఆఫీసుకెళ్లే ముందు ”ఎందుకలా వున్నావు మధూ!” అని భార్యను అడగాలని వున్నా సమాధానం ఏం చెబుతుందోనన్న భయంతో మౌనంగానే వెళ్లిపోయాడు.
*****
రాత్రికి డిన్నర్‌ చేస్తున్నంత సేపు మాధవిలత భర్తతో మాట్లాడలేదు. అంకిరెడ్డి ఎప్పుడైనా తింటున్నంత సేపు కూరల్ని, అన్నాన్ని మెచ్చుకుంటూ తింటాడు. అలా మెచ్చుకుంటూ తింటే మాధవీలత పడిన కష్టం మరచిపోయి తృప్తి పడుతుంది. ఆయనకు కూడా మంచి ఆహారాన్ని ప్రేమగా తింటున్నానన్న ఆనందం కూడా వుంటుంది. ఇవాళ అలాంటి వాతావరణమేం లేదక్కడ. మాధవీలత ఎందుకలా వుందో అడిగి తెలుసుకోవాలని ఆమెవైపు చూడబోయేంతలోనే ఆమె వెళ్లి బెడ్‌మీద పడుకొని దుప్పి కప్పుకుంది.
అంకిరెడ్డి కూడా ఆమె వెనకాలే వెళ్లి ఆమె పక్కన పడుకున్నాడు. అసలే మనసు బాగలేని ఆయన ఆమెను కదిలించే సాహసం చెయ్యలేక తలకింద చేతులు పెట్టుకొని ఆలోచిస్తూ పైకి చూస్తున్నాడు.
ఎందుకిలా ఇద్దరికి ఇద్దరం ఎవరి ఆలోచనలో వాళ్లం వున్నాం…? ఒకరి బాధను ఒకరితో ఎందుకు పంచుకోలేకపోతున్నాం? ఒకరివైపు ఒకరం చూడాలంటేనే ఎందుకు భయపడుతున్నాం? తప్పు ఎక్కడ జరిగింది? తను పడుతున్న బాధ ఏంటో తనకి తెలుసు. మాధవికి తన బాధను తను చెప్పందే తెలిసే అవకాశం లేదు. మరి ఆమె ఎందుకు బాధ పడుతున్నట్లు? కణతలు పగిలిపోతున్నాయి అంకిరెడ్డికి.
*****
వర్షాలు కుండపోతగా పడుతున్నాయి.
ఒక్కరోజు కాదు. గత వారం రోజులుగా!
తీర ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికలు చేరవేశారు.
రిజర్వాయర్లలో నీటిమట్టాలు పెరిగాయి.
వాతావరణ శాఖ మరో రెండు రోజులు ఇలాగే వర్షం పడొచ్చని, అది భారీ వర్షంగా కూడా మారొచ్చని ప్రకించటంతో నీటిపారుదల శాఖ ముందు జాగ్రత్తగా ఆనకట్టల్లోని వరద ప్రవాహాన్ని సముద్రంలోకి వదులుతున్నారు.
నీట మునిగిన జిల్లాల్లో ఆహార పొట్లాలను, తాగునీటిని అందించాలని, లక్షల ఎకరాల్లో మునిగిపోయిన పంటను చూసి వెంటనే చర్యలు చేప్టాలని, ప్రత్యామ్నాయ పంటలు కూడా వేసుకునేందుకు సహాయాన్ని అందించాలని ఒక రాజకీయ నాయకుడు రోడ్డు పక్కన షెల్టర్‌ కింద నిలబడి టీవి యాంకర్‌ పట్టుకొచ్చిన మైక్‌లోంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాడు…
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుండడం వల్ల చెరువులకి గండ్లు పడి రోడ్లు తెగిపోతున్నాయి. ఊర్లు కొట్టుకుపోతున్నాయి. పలుచోట్ల వరదనీరు ఇళ్లలోకి రావడంతో అక్కడున్న జనాలు చెట్లమీదకి ఎక్కి కూర్చుని వున్నారు. ఇదంతా టీవీలో చూస్తున్న మాధవీలతకి కన్నీళ్లొస్తున్నాయి.
ఆ వార్తలు అయిన వెంటనే అదే ఛానల్లో చైనాలో భూకంపం వచ్చి వేల ఇళ్లు ధ్వంసం కావటం కన్పించింది. ఎనభై ఐదు మంది చనిపోయి వందల మంది గాయపడ్డారు. గాయపడిన వారిని స్ట్రెచర్స్‌ మీద హాస్పిటల్స్‌కి తరలిస్తున్నారు. పరుగులు తీస్తున్న సిబ్బంది, అరుపులు, ఏడుపులు నానా భీభత్సంగా వుంది.
చూడలేక భయంతో చెవులు మూసుకుని అరిచింది మాధవీలత. ఆ అరుపులు విని అంకిరెడ్డి పరిగెత్తుకొచ్చాడు.
మాధవీలతను చూడగానే విషయం అర్థమై టీవీ ఆపేశాడు అంకిరెడ్డి.
మాధవీలత చాలా సెన్సివ్‌. సినిమాలో ఒకరినొకరు కత్తితో పొడుచుకోవటం చూసినా చెవులు మూసుకుని అరుస్తుంది. వెంటనే అది నిజం కాదు సినిమా అని తెలిశాక చెమట్లు పడితే తుడుచుకున్నట్లు ముఖాన్ని, మెడని చేతులతో తుడుచుకుంటుంది. పెళ్లయిన కొత్తలో సినిమాకెళ్లినప్పుడు ”ఏమైంది మధూ! అరిచావ్‌?” అని అడిగాడు అంకిరెడ్డి. కాలికేదో పాకిందని అబద్దం చెప్పలేక నిజమే చెప్పింది. అలా ఎందుకంటే ఆమె తల్లి ఆమెను అంకిరెడ్డితో పంపేటప్పుడు ”మధూ! ఇప్పుడు నీకు నేను చెప్పేవి విని వదిలేసేవి కావు. జాగ్రత్తగా విని మనసులో దాచుకో! నీ భర్తతో నువ్వెప్పుడూ అబద్దం చెప్పకు. వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకు. అది నీ జీవిత కాలంలో ఇప్పుడా అప్పుడా అని కాదు. ఎప్పుడైనా సరే! నువ్వలా వుంటే ‘చివరి శ్వాస వరకు ఈమెతో నేను చాలా సంతోషంగా గడపగలను’ అన్న నిశ్చింత నీ భర్తలో కలుగుతుంది. నువ్వెలా వున్నా నీ జీవితంలో ఓ రోజు గడిచిపోకుండా వుండదు. ఎలాగో గడవటం కాదు. ఒక పద్ధతి ప్రకారం గడవటం ప్రధానం. భార్య, భర్త అంటేనే చిన్నచిన్న తగవులకు ప్రతీకలు. తగవులు లేకుండా ఏ కాపురం నడువదు. సమిష్టి కృషి లేకుండా ఏ కుటుంబం నిలవదు. రోల్‌మోడల్‌గా వుండానికి ప్రయత్నించు…” అంది.
తల్లి అప్పుడు ఎలా చెప్పిందో అలాగే వుంది మాధవీలత. తల్లి మాటల ప్రభావం వల్ల ఆమెకు చాలా సందర్భాల్లో మంచే జరిగింది. ఆమెకే కాదు. తల్లి మాటలు ఎవరికైనా మంచి ఫలితాలనే ఇస్తాయి. కానీ చాలామంది తల్లులు తమ పిల్లలతో మాట్లాడవలసినంతగా మాట్లాడటం లేదు. అదేం అంటే మన పిల్లలు పెద్ద చదువులు చదువుతున్నారు. వాళ్లకన్నీ తెలుస్తాయి. మనకేం తెలుసని వాళ్లతో మాట్లాడతాం? ఈ రోజుల్లో పిల్లలకి మన మాటలు పనికొస్తాయా? ఆ మాటలు చెప్పినా వాళ్లు వింరా? అన్న అనుమానంలోనే వుంటారు. కానీ సమయం వచ్చినప్పుడు కొడుకుతో మాట్లాడడం తండ్రి ధర్మం. కూతురుతో మాట్లాడడం తల్లి ధర్మం. అలా మాట్లాడలేని తల్లిదండ్రులు వున్నా లేనట్లే! అయినా తల్లి శ్రద్ధ పెట్టి చెబితే వినని పిల్లలు వుంటారా? అలాంటి పిల్లలు వుంటే వాళ్లు సమాజానికి కాని వాళ్లకు వాళ్లు కాని ఎంతవరకు పనికొస్తారు?
భార్య చేయిపట్టుకొని బెడ్‌రూంలోకి తీసికెళ్లి ”నువ్వు కొద్దిసేపు ఇలా పడుకొని విశ్రాంతి తీసుకో మధూ!” అన్నాడు అంకిరెడ్డి.
”నేను బాగానే వున్నానండీ! నాకెందుకు విశ్రాంతి? అయినా ఈ టైంలో నాకు పడుకోవాలనిపించదు. మీకు మరోసారి కాఫీ కలుపుకురానా? ఇవాళ మీరు వాకింగ్‌కి వెళ్లలేదు. తలనొప్పి తగ్గలేదా?” అంది అంకిరెడ్డి నుదుటిపై చేయివేసి చూస్తూ. ఆమె నిన్నటి నుండి అంకిరెడ్డి పనులు యాంత్రికంగా చేస్తుందే కాని మనసు పెట్టి చెయ్యటం లేదని ఆమెకు తెలుస్తూనే వుంది.
ఆమె ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ”నీ తత్వం నీకు తెలిసి కూడా అలాంటి వార్తల్ని ఎందుకు చూస్తావ్‌? భయపడ్డప్పుడు నువ్వెలా అరుస్తావో నీకే తెలియదు. ప్లీజ్‌ మధూ! నువ్వసలు టీవీ చూడకు” అన్నాడు. ఆయన అనే విధానం చూస్తుంటే అసలే నా బాధలో నేనున్నాను ఇదో బాధనా మళ్లా! అన్నట్లుంది.
”వార్తలు చూడకపోతే ఎక్కడేం జరుగుతుందో ఎలా తెలుస్తుందండి? చూడబట్టేగా చైనాలో భూకంపం వచ్చినట్లు తెలిసింది. తుఫాన్‌ వల్ల ఎంత భీభత్సం జరుగుతుందో తెలిసింది” అంది.
”తెలుసుకుని నువ్వేం చేస్తున్నావ్‌? ఇక్కడ కూర్చుని అరుస్తున్నావ్‌! నువ్వలా అరుస్తూ కూర్చుంటే అక్కడ జరిగే భీభత్సం తగ్గుతుందా?” అన్నాడు.
”ఎంతయినా మీది రాతిగుండెండీ బాబూ!” అంటూ ఆమె అక్కడి నుండి వెళ్లబోతుంటే నిన్నటి నుండి ఆయన ఎందుకు బాధపడుతున్నాడో ఆమెతో చెప్పాలని ”నువ్వు కూర్చో మధూ! నీతో మాట్లాడాలి” అన్నాడు. ఆయన ఏం మాట్లాడబోతున్నాడో ఆమెకు తెలియదు. అదేమిటో వినాలన్న ఆసక్తితో ఆమె కూర్చుని ”ఈ వర్షాలేంటండీ! అసలు తగ్గేలా లేవు. బయటకెళ్లి మార్కెట్ పనులు చూసుకోవాలంటేనే వీలుకావటం లేదు. పైగా ఊరెళ్లిన మోక్ష ఇంకా రాలేదు” అంది.
”ఇవి మామూలు వర్షాలయితేగా తగ్గటానికి…” అన్నాడు కిటికీలోంచి సూదుల్లా జారుతున్న వర్షపు జల్లును చూస్తూ.
”మామూలు వర్షాలు కాదు, తుఫాను కదా! మీరింకా మామూలు వర్షాలనే అనుకుంటున్నారా? ఇవాళ పేపర్‌ చదవలేదా?” అడిగింది సందేహంగా చూస్తూ.
”చదివాను. భవిష్యత్తులో ఈ వర్షాలు ఆమ్ల వర్షాలుగా మారే ప్రమాదం వుందట. మనకిక చినుకుతో వణుకే” అన్నాడు.
”ఆమ్ల వర్షాలేంటండీ! కొత్తగా వింటున్నాను. అసలు అలాంటి వర్షాలు ఎందుకొస్తాయి?” అంది.
”ఎందుకొస్తాయంటే! వాతావరణ కాలుష్యం పెరిగి గాలిలో సల్ఫర్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్ల తీవ్రత అధికమవటం వల్ల వస్తాయి. ఇంధనాల్లో సల్ఫర్‌ మోతాదు భారీగా తగ్గించినా కూడా పరిశ్రమలు, వాహనాల కారణంగా వాతావరణంలో అవి పేరుకుపోతున్నాయి. అవి రసాయన చర్య పొందడంతో వర్షాకాలంలో ఆమ్ల వర్షాలకు దారితీస్తుంది” అన్నాడు.
ఆమెకు పూర్తిగా అర్థంకాక ”అంటే! అదెలాగండీ?” అని అడిగింది.
”ఎలా అంటే గాలిలోని ఉద్గారాలతో కలిసి వాననీరు కిందకు పడుతుంది. సహజంగా తాగే నీటిలో వుండాల్సిన పీహెచ్‌ విలువ వుండాల్సిన దానికన్నా తగ్గితే ఆమ్ల వర్షంగా మారుతుంది. ప్రస్తుతం వాననీటిలో పీహెచ్‌ విలువ తగ్గిపోతోందట. గత ఏడాది ఉస్మానియా విశ్వవిద్యాలయం భూ రసాయన శాస్త్ర విభాగం నగరంలోని 20 ప్రాంతాల్లో వాననీటి నమూనాలు సేకరించగా ఆమ్ల వర్షాలు కురిసే అవకాశం భవిష్యత్తులో వుందంటున్నారు. కొద్దిరోజుల క్రితం విశాఖపట్నం సమీపంలో ఆమ్ల వర్షం పడిందట” అన్నాడు.
”నిజంగానే పడిందా?” భయంతో కళ్లు పెద్దవి చేసింది మాధవీలత.
ఆయన ఆమెవైపు చూడకుండానే ”నిజంగానే పడిందట. ఒక్క విశాఖపట్నమే కాదు గత ఏడాది ఢిల్లీలో కూడా పడిందట” అన్నాడు.
”మరి ఆ వర్షం ఏ రంగులో పడుతుందో అదేమైనా పేపర్లో రాసివుందా?” అడిగింది మాధవి. రంగును బట్టి అదెలాంటి వర్షమో తెలుసుకుని జాగ్రత్త పడొచ్చని ఆమె అభిప్రాయం.
”ఆమ్ల వర్షం పడినప్పుడు నీటి రంగు మారదట. రసాయనాల వాసన వస్తుందట. మొక్కలు, చేపలపై తీవ్ర ప్రభావం పడుతుందట. భవనాలు కూడా దెబ్బతింయట. వాన నీటిని డైరెక్ట్‌గా పట్టి తాగకూడదట. ఎందుకంటే వాటిలో ఖనిజ లవణాలు వుండవట… భూమిపై పడ్డాకనే ఆ నీటికి తాగునీటి లక్షణాలు వస్తాయట” అన్నాడు.
అప్పటికే కళ్లు మూసుకుని కూర్చున్న మనిషి కూర్చున్నట్లే బెడ్‌మీద పడిపోయింది మాధవీలత.
అప్పుడు చూశాడు మాధవీలత వైపు అంకిరెడ్డి.
ఆయన ఏం మాట్లాడాలనుకుని ఆమెను కూర్చోబెట్టాడో, ఏం మాట్వాడి ఆమెను పడిపోయేలా చేశాడో ఆయనకేం అర్థం కాలేదు. గబగబ కిచెన్‌లోకి వెళ్లి నీళ్లు తెచ్చి ఆమె ముఖం మీద చల్లాడు. ఆమె వెంటనే లేచి కూర్చుంది. ఇంకెప్పుడూ ఆమెతో భయపడే విషయాలను చెప్పకూడదనుకున్నాడు. ఆమె తత్వం తెలిసికూడా అప్పుడప్పుడు ఇలా పొరబడుతూనే వున్నాడు. ఇకముందు జాగ్రత్తగా వుండాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు.
వెంటనే ఆమె భుజం పట్టుకొని ”మధూ! ఆర్‌యు ఓ.కె.?” అని అడిగాడు.
పవిటకొంగుతో మెడచుట్టూ తుడుచుకుని ”ఏంటోనండీ! ఏది విన్నా, ఏది చూసినా భయంగా వుంటోంది. మీ అందరిలా ప్రశాంతంగా వుండలేకపోతున్నాను” అంది.
ఆయన నిట్టూర్చి ”నీ తత్వమే అంత!” అంటూ ఆ గదిలోంచి బయటకి నడుస్తుంటే…
”జాన్‌ అన్నయ్య ఫోన్‌ చేసి మీరు వాకింగ్‌కెందుకు రాలేదో, మీ హెల్త్‌ ఎలా వుందో అడగమన్నారు. మీరు పడుకున్నారని మీకు ఫోన్‌ ఇవ్వలేదు. ఆయనకోసారి కాల్‌ చెయ్యండి! ఏం పని వుండి చేశారో ఏమో!” అంది.
”జాన్‌కేం పని లేదు. వూరికే ఫోన్‌ చేస్తుంటాడు. నేను జాన్‌ దగ్గరకే వెళ్తున్నాను. డోర్‌ పెట్టుకో! టీ.వి. చూడకు. ప్రశాంతంగా పడుకో!” అన్నాడు.
”ఇంత వర్షంలో వెళ్లాలా? పైగా ఆమ్ల వర్షాలంటున్నారు” అంది భయంగా చూస్తూ.
”అవి అప్పుడే రావులే మధూ! అలాంటి ప్రమాదం భవిష్యత్తులో పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతే! అదిచూసి పర్యావరణ వేత్తలు ముందుజాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు ఇస్తున్నారు. ఇకపై వాననీటి నమూనాను పీసీబీ కేంద్ర కార్యాలయాలకు పంపుతారట. అక్కడవాళ్లు చేసే ప్రయోగాలువాళ్లు చేస్తారు. సో! మనం నిశ్చింతగా వుండొచ్చు. కంగారు పడకు” అంటూ ధైర్యం చెప్పాడు అంకిరెడ్డి.
ఎంత ధైర్యం చెప్పినా వర్షంలో భర్త బయటకి వెళ్తానంటే ఆమెకు భయంగానే వుంది. భయం అనేది ఒకసారి మనసులోకి ప్రవేశించకుండా వుండాలి కాని అది ప్రవేశించిందీ అంటే మనిషిలోని జవసత్వాలను చంపేస్తుంది. ఆమె భయంలో ఆమె వుండగానే అంకిరెడ్డి కారును బయటకు తీసి నేరుగా జాన్‌ ఇంికి వెళ్లాడు.
కారు దిగి లోపలికి వస్తున్న అంకిరెడ్డిని చూడగానే నవ్వి ”రా! రెడ్డీ! నిన్ని నుండి నువ్వెలా వున్నావోనని ఉదయం చెల్లెమ్మకి కాల్‌ చేశాను. నువ్వు పడుకుని వున్నావని చెప్పింది. ఎలా వుంది ఒంట్లో…?” అంటూ అంకిరెడ్డిని ప్రేమగా లోపలికి తీసికెళ్లి హాల్లో వున్న సోఫాలో కూర్చోమని తను కూడా కూర్చున్నాడు జాన్‌.
కూర్చున్నాక జాన్‌ వైపు చూసి ”నా హెల్త్‌ ఓ.కె. జాన్‌!” అన్నాడు అంకిరెడ్డి.
జాన్‌ భార్య నూతన వంటగదిలోంచే అంకిరెడ్డిని చూసి కాఫీకప్పులతో వచ్చింది.
”నమస్తే! అన్నయ్యా! బాగున్నారా?” అంటూ కాఫీ ఇచ్చింది. ఆయన కాఫీ అందుకుంటూ ”బాగున్నానమ్మా!” అన్నాడు. ఆమె అక్కడ నుండి వెళ్లిపోయింది. ఆమె ఎప్పుడైనా అంతే! ఎవరు వచ్చినా మంచిమనసుతో మర్యాద చేస్తుంది. తర్వాత అక్కడి నుండి వెళ్లిపోతుంది. స్నేహితుల మధ్యలో కూర్చుని వాళ్ల ప్రైవసీని పాడుచెయ్యదు. అదామెకు స్వతహాగా వచ్చిన అలవాటే! ఎవరో చెప్పింది కాదు.
స్నేహితులు ఇద్దరు హాల్లో ఒంటరిగా మిగిలిపోయారు. వాళ్లు ఒకరితో ఒకరు మ్లాడకుండా కాఫీ తాగుతుండటం వల్లనో ఏమో హాలంతా నిశ్శబ్దంగా వుంది.
సమయం, సందర్భం లేకుండా అంకిరెడ్డి జాన్‌ ఇంటికి ఎప్పుడూ రాడు. పైగా వాళ్లు వాకింగ్‌లో రోజూ కలుస్తూనే వుంటారు. ఇప్పుడిలా ప్రత్యేకించి ఇంటికెందుకొచ్చాడన్నది మిస్టరీ… బహుశా పర్సనల్‌ ప్రాబ్లమ్స్‌ ఏమైనా వుంటే తనతో చెప్పుకోవాలని వచ్చాడేమో! ఆదివారం కాబ్టి జాన్‌కి బ్యాంక్‌ కూడా లేదు. అందుకే అంకిరెడ్డి చెప్పేది వినాలని ప్రశాంతంగా చూస్తున్నాడు.
”చెప్పు రెడ్డి! ఎనీ ప్రాబ్లమ్‌?” అడిగాడు జాన్‌.
జాన్‌ అలా అడగ్గానే అంకిరెడ్డి ముఖం అదోలా పెట్టుకొన్నాడు. ఆయన శరీరం మొత్తం సన్నగా కంపిస్తోంది. లేచి గబుక్కున జాన్‌ రెండు చేతుల్ని పట్టుకొని ”చెప్పు జాన్‌! నీకంతా తెలుసు కదా! నా కొడుకు సతీష్‌చంద్ర చనిపోతాడా? నాకేదో భయంగా వుంది జాన్‌” అన్నాడు అంకిరెడ్డి.
జాన్‌ షాకింగ్‌గా చూస్తూ ”అదేం ప్రశ్న రెడ్డీ?” అన్నాడు.
ఆరడుగుల అంకిరెడ్డి వణుకుతున్న గువ్వలా కుంచించుకుపోతున్నాడు. స్నేహితుడు అలా బాధపడుతుంటే చూడలేక వీపుపై చేయివేసి ”ఊరుకో రెడ్డి! బాధపడకు. అయినా సతీష్‌చంద్ర చనిపోవటం ఏమి? చెడ్డ కలేమైనా వచ్చిందా?” ఓదార్పుగా అడిగాడు.
ఆయన మామూలుగా కూర్చుని ”చెడ్డకల కాదు జాన్‌! వాస్తవమే!” అన్నాడు.
”వాస్తవమా! అసలు నువ్వు సతీష్‌చంద్ర గురించి ఇలాంటి ఆలోచన ఎందుకు చేస్తున్నావు రెడ్డీ! అది చెప్పు?” అన్నాడు జాన్‌.
ఆందోళనగా చూస్తున్నాడే కాని ఆయన నోట్లోంచి మాట పెగలడం లేదు. వయసు పెరిగేకొద్దీ ఆయనలో ఆత్మస్థైర్యం తగ్గుతోంది.
”రెడ్డీ! మన స్నేహితులంతా నిన్నటి నుండి నీ హెల్త్‌ గురించే ఆలోచిస్తున్నారు. నువ్వు సతీష్‌చంద్ర చావు గురించి ఆలోచిస్తున్నావ్‌! చిత్రంగా వుంది. ఏది ఏమైనా నువ్వొకసారి సైకియాటిస్ట్‌ దగ్గరకి వెళ్లటం మంచిదనిపిస్తోంది” అన్నాడు జాన్‌.
”నా హెల్త్‌కేం ప్రాబ్లమ్‌ లేదు జాన్‌. నా దిగులంతా సతీష్‌చంద్ర గురించే…”
”అదే! ఎందుకు?”
”నీకు తెలియదా జాన్‌?”
”నాకెలా తెలుస్తుంది? చెప్పు రెడ్డి! అసలేం జరిగింది?”
”ఒక్కటి చెప్పు జాన్‌! నీ కొడుకే గనక నా కొడుకు వుండే దగ్గర వుండి వుంటే నువ్వింత ప్రశాంతంగా వుండేవాడివా?”
”ప్రశాంతంగా కాదు గర్వంగా వుండేవాడిని… అయినా నీ కొడుకు నా కొడుకు ఒకేచోట ఎలా వుంటారు? వాళ్ల చదువులు వేరు, దారులు వేరు, గమ్యాలు వేరు. అలా వుండాలని కూడా మనం కోరుకోకూడదు. కోరుకున్నా అది జరిగేపని కాదు. అయినా నీ కొడుక్కి మాత్రం ఏం తక్కువ…?”
”చదువు తక్కువ!”
”చదువు ఎక్కువగా లేకపోవటం వల్లనే నీ కొడుకు ఆర్మీలోకి వెళ్లాడన్న భావన నీలోంచి పోవటంలేదు. ఆర్మీ అంటే నువ్వు అనుకునేంత తక్కువదేం కాదు. ఆర్మీలో పనిచేయడం అంటే దేశసేవ చేయడం, రిస్క్‌ లేదు. అసలు దాని గురించి ఊహించే స్థాయి ఆలోచనలు కూడా నీలో లేవు. నీకు వయసు, అనుభవం వుంటే వుండొచ్చు… ఆర్మీ గురించి అంతా తెలుసని మాత్రం అనుకోకు…” అన్నాడు.
అంకిరెడ్డి పేలవంగా నవ్వి ”ఆర్మీలో ఏముందో! ఏం జరుగుతుందో నాకు తెలుసు జాన్‌! ఎప్పటికప్పుడు వార్తలు చదువుతున్నాను. ఫేస్‌బుక్‌ చూస్తున్నాను. నా భార్యకి అక్కడ జరిగేవన్నీ తెలిస్తే అసలు ప్రాణాలతోనే వుండదు. అసలే ఆమె భయస్తురాలు” అన్నాడు.
”భయం మృత్యువు కన్నా భయంకరమైంది. భయపడిన ప్రతిసారి మనిషి మరణిస్తున్నట్లే లెక్క… ఈ క్షణంలో చనిపోతామని తెలిసినా భయపడకూడదు రెడ్డీ!” అన్నాడు జాన్‌.
”అలా నువ్వుండగలవు జాన్‌! ఎందుకంటే నువ్వు అదే ఫీల్డ్‌లో వుండి వచ్చావ్‌! శారీరకంగా, మానసికంగా చనిపోయినా ఫర్వాలేదన్నట్లు మనసును మౌల్డ్‌ చేసుకున్నావ్‌! నీకు చావంటే భయం లేదు”
”చావంటే భయం నాకూ వుంది రెడ్డి! కానీ ఆ చావు అందరిలా వుండకూడదని మౌల్డ్‌ చేసుకునేవాడిని. అది ఏ క్షణంలో వచ్చినా గర్వపడేలా వుండాలనుకునేవాడిని. అయినా చావంది ఎవరు?”
”అలా అని ముందే చస్తామా?”
”ముందుగా ఎప్పుడూ చనిపోము రెడ్డీ! చావు వస్తేనే చనిపోతాం! మరణం అనేది గాల్లో యుద్ధం చేసేవాడికి వస్తుంది… సముద్రంలో యుద్ధం చేసేవాడికి వస్తుంది. భూమి మీద యుద్ధం చేసేవాడికి వస్తుంది. చిత్తు పేపర్లు ఏరుకునేవాడికి వస్తుంది. అది ఎక్కడ వున్న వాళ్లనైనా వెతుక్కుంటూ వెళ్తుంది. వీళ్లు ఇక్కడున్నారు కదా వీళ్లను వదిలేద్దాంలే అనుకోదు. అసలు చావకుండా వుండేవాళ్లు ఎవరైనా వున్నారా?”
”లేరు. అది నాకు తెలుసు! కానీ నా కొడుకు చావుకి అతి దగ్గరలో వున్నాడు. పాకిస్తాన్‌ వాళ్లు నా కొడుకుని ఎప్పుడు కాలుస్తారో అని భయంగా వుంది జాన్‌!” అంటూ చేతుల్లో ముఖం దాచుకుని బోరుమన్నాడు అంకిరెడ్డి.
జాన్‌ ఆలోచనలో పడ్డాడు. అంకిరెడ్డి భయంలో అర్థం లేకపోలేదు. మనిషి జీవిత యుద్ధంలో గెలవాలీ అంటే పోరాటం తప్పనిసరి. కానీ ఆ పోరాటం న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా సాగాలి. అలా లేకుండా మన ఆధీన రేఖ దాటి శాంతియుతంగా వున్న భారత సైనికులపై దాడులు జరిపి తలల్ని నరికేసి బాడీని భారతదేశానికి వదిలి తలల్ని పాకిస్తాన్‌ వాళ్లు పట్టుకెళ్లారు. నిజంగానే యుద్ధం జరిగినప్పుడు యుద్ధం చేయాలి. వీరులైతే వీరమరణం పొందాలి. కానీ ఇలా యుద్ధం లేకుండానే దాడులు జరపటం పిరికిపంద చర్య… ఇది అసలు యుద్ధవీరుల నైజమే కాదు. నైతికత అంతకన్నా కాదు. ఇది జాన్‌కి కూడా నచ్చటం లేదు. కానీ ప్రపంచంలోకెల్లా మన సైన్యం చాలా నిష్ణాత పొంది, ఎన్నో యుద్ధాల్లో విజయం సాధించింది. చైనా తర్వాత సంఖ్యాపరంగా అతిపెద్ద సైనిక సమూహం గల దేశం మనది. మన దేశ సైనికులు ప్రపంచంలో శాంతి కాపాడుటకు ఇతర దేశాలలో పనిచేస్తూ అక్కడ ప్రజలను కాపాడుతున్నారు. శాంతిని పెంపొం దిస్తున్నారు. ఐతే గత 60, 70 సం||లలో చిన్నచిన్న యుద్ధాలే తప్ప రెండవ ప్రపంచ యుద్ధం లాంటి పెద్ద యుద్ధం, మానవ సంహారం జరగలేదు. ప్రపంచ దేశాలు, ప్రజలు శాంతి కోరుకుంటున్నారు. శత్రువుల నుండి భద్రత కూడా అవసరం కాబట్టి ప్రతి దేశానికి తమదైన సైన్యం ఉండాలి. ఇప్పటి పరిస్థితుల్లో సైనికుడిగా పని చేయడం చాలా సులభం, ప్రాణభయం తక్కువ, యుద్ధం అవకాశాలు తక్కువ. కాబట్టి అందరం నిర్భయంగా సైన్యంలో పనిచేయవచ్చు. అనవసర భయం అక్కరలేదు.
జాన్‌ మాట్లాడకపోవటంతో తనను తాను సముదాయించుకుని లేచి నిలబడ్డాడు అంకిరెడ్డి.
”జాన్‌! నేను వెళ్తున్నాను” అన్నాడు.
జాన్‌ ఉలిక్కిపడి ”కూర్చో రెడ్డీ! భోంచేసి వెళ్లొచ్చు” అన్నాడు.
”నాకీ స్థితిలో భోజనం సహించదు జాన్‌! నన్ను ఆపకు” అంటూ జాన్‌ చూస్తుండగానే వెళ్లి తన కారులో కూర్చున్నాడు అంకిరెడ్డి. ఆయన ఎక్కడెక్కడ తిరిగాడో ఇల్లు చేరుకునే సరికి అర్ధరాత్రి దాటింది.
*****
మాధవీలత, అంకిరెడ్డి ఉదయాన్నే నిద్రలేచి వారి దినచర్యలో నిమగ్నమయ్యారు. అంకిరెడ్డి స్నేహితుడ్ని కలవాలని ఏడు గంటలకే తన కారులో ఘట్ కేసర్ వెళ్లాడు.
వాళ్ల పెద్దబ్బాయి ఆనంద్‌ మాత్రం ఎనిమిది అయినా నిద్ర లేవలేదు.
ఊరెళ్లిన మోక్ష త్వరగా వస్తే బాగుండని ఆమెకోసం గంట, గంటకి గేటువేపు చూస్తోంది మాధవీలత. మోక్ష మాధవీలతకు కోడలు. ఆనంద్‌కు భార్య.
ఉదయం పదకొండు గంటల సమయంలో మోక్ష గేటు తీసుకొని నెమ్మదిగా లోపలికి వచ్చింది. సోఫాలో దిగాలుగా కూర్చుని వున్న అత్తగారి దగ్గరకి వెళ్లి ”ఏం జరిగింది అత్తయ్యా? అలా వున్నారు?” అని అడిగింది.
”గత నాలుగు రోజులుగా నేను ఇలాగే వున్నాను మోక్షా! నీకోసమే ఎదురు చూస్తున్నాను” అంది మాధవీలత.
”నాకోసం ఎదురుచూస్తున్నారు అంటే ఏదో జరిగే వుండాలి. ఏం జరిగింది అత్తయ్యా!” అడిగింది మోక్ష.
మోక్ష అలా అడగ్గానే బోరున ఏడవాలనిపించింది మాధవీలతకు. కోడలి ఒడిలో తల దాచుకుని తన భయాన్ని ఆమెతో పంచుకోవాలనుకుంది. అదే పని భర్త దగ్గర చెయ్యలేకపోయింది.
”మీరలా మౌనంగా ఉంటే ఎవరికేం జరిగిందోనని నాకు కంగారు వుంది. ఏం జరిగిందో త్వరగా చెప్పండి అత్తయ్యా!” అంటూ అక్కడే నిలబడి మాధవీలతనే చూస్తోంది మోక్ష.

ఇంకా వుంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *