May 8, 2024

హిమము కురిసిన వేళ

 

జెజ్జాల కృష్ణ మోహన రావు

 

పరిచయము – గడచిన వారము జనవరి22 నుండి 24 వఱకు మా ఊళ్లో (ఫ్రెడరిక్, మేరిలాండ్, అమెరికా తూర్పు తీరము) భారీగా మంచు  కురిసింది. ఇది అలాటి ఇలాటి హిమపాతము కాదు. మూడు అడుగుల మంచు. 22 శుక్రవారము రాత్రి ప్రారంభమై 23 శనివారమంతా, 24 ఆదివారము ఉదయము కురిసింది. ఒక్కొక్కప్పుడు గంటకు   రెండు మూడు అంగుళాలు. దీనితోబాటు సుమారు 30 మైళ్ల వేగపు గాలి. దీనినే blizzard అంటారు. ఈ మూడు రోజులు రాష్ట్రములో అత్యవసర పరిస్థితి (emergency) అని ప్రకటించారు. వీధులలో, రోడ్లలో ఎవ్వరు ప్రయాణము చేయరాదు. తఱువాత ఆ మంచు కుప్పలను ఇంటిముందు నుండి రోడ్డులనుండి పక్కకు నెట్టాలి. ఇది అతి ప్రయాసకరమైన పని. మూడు రోజులు ప్రభుత్వ కచేరీలు, ఇతర కార్యాలయాలు మూత బడ్డాయి. ఇప్పుడు కూడ కొన్ని వీధులలో కారు నడపడము కొద్దిగా కష్టమైన పనియే.

 

గురువారము 21 తారీకు నా స్నేహితులు శ్రీ సోమయాజులు ఒకప్పుడు నేను హిమపాతముపైన వ్రాసిన కొన్ని పద్యాలను తాను చదివి ఆనందించానని ఒక సందేశాన్ని పంపినారు. వారికి అలాటి ఇంకా కొన్ని పద్యాలను కూడ చదవమని పంపాను. మాలిక పత్రిక పాఠకులు కూడ ఇట్టి పద్యాలను చదివి ఆనందిస్తారని వాటినన్నిటిని సేకరించి ఇక్కడ జత పరుస్తున్నాను.

 

తెలుగు, సంస్కృత భాషలలో ఘనీభవించిన వర్షపాతానికి మంచు, హిమములాటి పదాలు తప్ప ఇతరములు తక్కువ. ఎస్కిమో భాషలో లెక్కకు లేన్నని పదాలు ఉన్నాయి మంచుకు! అంతేకాక నీళ్లు ఘనీభవించి ఆకాశమునుండి నేలకు ఎన్నో విధములుగా చేరుతాయి. అవి ice, sleet, frost,  snow లాటివి. నేల ఉష్ణోగ్రత 0 C కంటె తక్కువైనప్పుడు, ఆకాశమునుండి పడిన వాన చినుకులు గడ్డకట్టుతుంది. అలాటి గట్టి మంచు (ice) రోడ్డులపైన, ఇంటి బయట అర్ధ అంగుళము వరకు కూడ ఉంటుంది. అట్టి రోడ్డులపైన కారు నడపడము అపాయకరమైన విషయము. ఎందుకంటే వాహనాలు ఆ గట్టి మంచు పైన జారుతాయి. నడిచేటప్పుడు కాలుజారి పడి ఎముకలు విరుగగొట్టుకోడము కూడ సర్వసామాన్యము. sleet  అనేది మొట్టమొదట snowగా ఆరంభించి మధ్యలో నీరుగా మారి మళ్లీ ఘనీభవిస్తుంది. అవి చిన్నచిన్న గులక రాళ్లలా ఉంటాయి. ఇది కూడ నేలపైన ఘనీభవించి iceగా మారవచ్చును. frost అనేది కిటికీలపైన, కారుపైన ఒక సన్నని పొరలా ఉంటుంది. అది చినచిన్న తీగలవలె కూడ ఉంటుంది. ఇక snow అన్నది స్ఫటిక రూపముగా ఏర్పడి నేలపైన పడుతుంది. ఉష్ణోగ్రత 0 C కన్న కొద్దిగా తక్కువైనప్పుడు ఈ snow ముద్దముద్దగా ఎక్కువ బరువుతో పడుతుంది. ఉష్ణోగ్రత -10 కన్న తక్కువగా ఉంటే ఈ snow పిండిలా తేలికగా ఉంటుంది. గట్టి snow ఒక అంగుళము నీటికి ఎనిమిది అంగుళాలయితే ఈ పొడి snow ఒక అంగుళము నీటికి 12 అంగుళాల snowగా ఉంటుంది. సామాన్యముగా ఒక అంగుళము వర్షపాతము పది అంగుళాల snowతో సమానము. మా ఊళ్లో పడ్డ 36  అంగుళాల snow సుమారు మూడున్నర అంగుళాల (14 సెంటిమీటరులు) వర్షానికి సమానము. snow అన్నది స్ఫటిక రూపములో ఉంటుంది.  ఒక హిమస్ఫటికమువలె మరొకటి ఉండదు. Wilson Bentley అనే ఒక photographer ఈ snow స్ఫటికాలను తన సూక్ష్మదర్శిని కామెరాతో చిత్రములుగా తీసినాడు. వాటిని Dover Publishers ప్రచురించిన ఒక పుస్తకములో చూచి ఆనందించ వీలగును.   (https://en.wikipedia.org/wiki/Wilson_Bentley)

 

పద్యములు – ఇంతకు ముందు చెప్పినట్లు నేను సుమారు పది సంవత్సరాలుగా మంచుపైన వ్రాసిన పద్యములను కొన్ని ఇక్కడ మీముందు ఉంచుతున్నాను. చదివి ఆనందించండి.

 

అపరాజితా – న/న/ర/స/లగ, యతి (1, 9) III III UI – UII UIU 14 శక్వరి 5824

ద్యుమణి వలను బోయె – ద్యోతము తగ్గెఁగా
సుమము విరియ దింక – సొంపులు నిండఁగా
ద్రుమము లవని నింక – మ్రోడుగ మారుఁగా
హిమము గురియు నింక – నిచ్చటఁ జల్లఁగా

 

కమలగీతి – సూ/సూ/సూ – సూ/సూ, యతి లేక ప్రాసయతి నాలుగవ గణముతో.
రవి వెలుంగు తగ్గె – రాత్రి హెచ్చె
భువిని చెట్టులెల్ల – మ్రోడువారె
దివిని పులుఁగు వలను – దెసకుఁ బోయె
అవుర హిమము గురియు – నవనిపైన

కాంచన – భ/న/య/లల UIIII – IIU UII 11 త్రిష్టుప్పు 1663

మంచు విరులు – మణులై పూచెను
కాంచన రవి – కళలన్ దోచెను
చంచలముగ – జలముల్ బారఁగ
కాంచ నుషయు – కవితాకారము

 

గీతిక – (కన్నడ ఛందస్సు) బేసి పాదములు – ఇం/సూ/ఇం, సరి పాదములు – ఇం/ఇం – సూ/ఇం

సుమముతో రంగవల్లులే
యమరు నీ మనసులో – నమరవల్లిగా
హిమముతో స్ఫటికవల్లులే
యిముడు నీ మనసులో – హేమవల్లిగా

 

జగతీకందము – ప్రతి పాదారాంభములో జ-గణము, మిగిలినవి కంద పద్యపు లక్షణములు

దిగంతమం దుదయించెను
జగమ్మునకు వెలుఁగు నిచ్చు – సవితృఁడు మఱలన్
నగమ్ము వెలింగె మణులన
జిగేలుమని హిమము మెఱయఁ – జెలువముతోడన్

(ఈ ఛందస్సు  శ్రీమతి సుప్రభగారి కల్పన)

 

తేటగీతి వద్యము –
వదలినది అనుకొన్నాము
వదలలేదు
నేను ఉన్నాను అంటుంది
మేను చలికి వణికి పోతుంది ఇంకా
చివరికి గెలుపు చలికి
హేమంత ఋతువుకు!

 

తేఁటిబోటి – ఆటవెలఁది బేసిపాదములకు చివర యతి లేక ప్రాసయతితో ఒక చంద్రగణము

చెంగుమంచు నడచు – చిన్న దూడలు లేవు – సీమయందు
చెఱకు లేదు పళ్ల – కొఱకఁగా నిచ్చట – దొఱకవే
భోగి మంట లేదు – ప్రొద్దుట వాకిలి – ముందు జూడ
నిది ప్రతీచి, ధవళ – హిమము నిండిన దీర్ఘ – హేమంతము

 

పంచనంద – పంచమాత్రా గణములతో కందమువంటి పద్యము. ఈ ఉదాహరణములో ప్రాసయతి వాడబదినది. పద్యము ఒక షట్పద రూపము దాల్చినది.

సుమము విరిసిన వేళ మది విరిసె

హిమము కురిసిన వేళ హృది మురిసె

విమలుఁ డిట నుండఁగా

సుమము విరియంగ మది శిశిరమయె

హిమము కురియంగ హృది యనలమయె

విమలు డిట లేఁడుగా

 

భావన – భ/ర/ర/స/జ/గ,  UIIUIUUI – UII UI  UIU 16 అష్టి 22167

ఎక్కడ పోయె నా యాకు – లెక్కడ పోయెఁ బుష్పముల్
ఎక్కడ పోయె నా రంగు – లెక్కడ పోయెఁ గోకిలల్
ఎక్కడా పోయె సంగీత – మెక్కడ పోయె మోదముల్
ఇక్కడ నేఁడు హేమంత – మెక్కువ తెచ్చు మంచులన్

 

మణిగణనికరము లేక శశికళ –  న/న/న/న/స,  IIII IIII – IIII IIU15 అతిశక్వరి 16384

మధురగతి రగడ – చ/చ – చ/చ
మణిగణనికరము – మహిపయి దళముల్
మణిగణనికరము – మలపయి హిమముల్
మణిగణనికరము – మఱి యుడుగణముల్
కనకపు శశికళ – గగనముపయినన్

 

మనసున వినఁబడె – మధురపు పదముల్

కనులకుఁ గనఁబడెఁ – గరుఁగని ముదముల్

తనరెడు స్మితమయ – ధవళ కుసుమముల్

మణిగణనికరమె – మహి పయి హిమముల్

 

మధురగతి రగడ – చ/చ – చ/చ

ఎక్కడ జూచిన – హిమముల మ్రుగ్గులు

చక్కని మ్రుగ్గులు – చల్లని మ్రుగ్గులు

చుక్కల మ్రుగ్గులు – సొబగుల మ్రుగ్గులు

దిక్కుల దిక్కులఁ – దెలి నును మ్రుగ్గులు

 

శ్యామగీతి – ఇం/ఇం/ఇం – సూ/సూ, యతి లేక ప్రాసయతి

ఆకసమ్మున నీల జీమూత – హార మెందు
నేకమై మెలమెల్లఁ జల్లఁగా – హిమము చిందె
స్వీకరించెను పృథ్వి యభ్రంపు – శ్రీముఖమ్ము
రాకపోకలు తగ్గె రహదారి – రజత మాయె

 

సన్యాసి – స/న/య/స, యతి (1, 8) IIU IIII – UU IIU  12 జగతి 124

మలపైఁ గురిసిన – మంచుల్ దెలిపెన్
తెలుపౌ ఋతువును – దివ్యాంబరమున్
ఇలపై ధవళిమ – లెందున్ జలిలో
జలబిందువు లయె – సాంద్రాంబరమై

కందముగా –
మలపైఁ గురిసిన మంచుల్
దెలిపెన్ తెలుపౌ ఋతువును – దివ్యాంబరమున్
ఇలపై ధవళిమ లెందున్
జలిలో జలబిందువు లయె – సాంద్రాంబరమై

 

హయప్రచార రగడ – త్రి/త్రి – త్రి/త్రి

తెల్లఁగఁ బడెఁ – దిన్నఁగఁ బడె

మెల్లఁగఁ బడె – మృదువుగఁ బడె

చల్లఁగఁ బడెఁ – జక్కఁగఁ బడె

వెల్లఁగ హిమ – వృష్టియు పడె

 

హిమ – ర/జ/మ UIUIUI UUU యతి లేదు 9 బృహతి 43
ఆకసమ్మునుండి స్వచ్ఛమ్మై
యాకువోలె రాలె నందమ్మై
యే కరమ్ము గీచెఁ జిత్రమ్మై
నాకు జూడఁ దెల్లనౌ మ్రుగ్గుల్

శ్వేత కంబళమ్ము దాల్చెన్గా
భూతధాత్రి నిండు మోదమ్మున్
శీతలానిలమ్ము వీచంగా
నీతరిన్ హిమమ్ము పర్వెన్గా

మెల్లమెల్లఁగాను రాలెన్గా
చల్లచల్లఁగాను తేలెన్గా
కల్ల గాదు మంచుకారున్ నా
యుల్లమిందు గోరెఁ జైత్రమ్మున్

 

హేమంత – భ/య/య/య  UIII UUI – UUI UU 12 జగతి 591

మ్రోడులను జూడంగ – మోదమ్ము రాదే
వాడలిట నెందెందుఁ – బ్రాలేయ రాశుల్
వీడకను బాధించెఁ – బ్రేమాగ్నికీలల్
కాడె నను హేమంత – కాలంపు మంచుల్

 

1 thought on “హిమము కురిసిన వేళ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *