May 7, 2024

మాయానగరం-24

“కిషన్ నువ్వివ్వాళ నాతో కూర్చోవాలి” అధికారం ధ్వనించే గోముతో అంది సుందరీబాయ్.

“దేనికి?” సావధానంగానే అడిగాడు కిషన్ చంద్ జరీవాల.

“తాగాలి” సూటిగా అతని వంకే చూస్తూ అంది.

“ఆర్డరా?” నవ్వాడు కిషన్ చంద్. సైలెంట్ అయ్యింది సుందరి ఓ క్షణం. కారణం అదివరకట్లో మహోత్సాహంజేసేవాడు.

“ఆర్డర్ అయితే ‘నో ‘.. ప్రెండ్లీ గా అయితే ఓ.కే. ” స్పష్టంగా అన్నాడు కిషన్ చంద్.

“ఆర్డరే” కళ్ళలో నిప్పులు కురిపిస్తూ అన్నది సుందరి.

“అయితే నో!” లేచి వెళ్ళబోయాడు కిషన్.

“యూ…. ” ఏదో తిట్ట బోయేంతలో లోపలకొచ్చాడు సుందరి నాన్న.

“ఏమ్మా.. గొడవపడుతున్నారా? చూడు.. సంసారంలో ఎన్ని గొడవలైనా వుండొచ్చు. నేనే వున్నాను… మీ అమ్మ నీ చిన్నప్పుడు పోయినా ఇప్పటి వరకూ మరో పెళ్ళి గురించి నా ఊహల్లోకి కూడా రానివ్వలేదు. మీకూ ఇద్దరు పిల్లలున్నారు. మీరిట్టా కొట్టుకుంటూ తిట్టుకుంటూ వుంటే వాళ్ల పరీస్థితి ఏంటీ? మీ ఇద్దరి జీవితాలని నేను గమనిస్తూనే వున్నాను. అందుకే చెబుతున్నాను. ప్రతిమనిషిలోనూ ‘గ్రేట్ నెస్’ ఎలా వుంటుందో అలాగే ‘ వీక్ నెస్ ‘ కూడా అలాగే వుండి తీరుతుంది. గొప్పతనాన్ని మెచ్చుకో. వీక్ నెస్ మాత్రం చూసి చూడనట్టు వెళ్ళిపో. అదే జీవితం అంటే… అంటూ నవ్వాడు సేట్ చమన్ లాల్.

“అది కాదు” చెప్పబోయింది సుందరి.

“సుందరి… నేను నీకు తండ్రిని. అంత మాత్రాన కళ్ళు చెవులు మూసుకొని కూర్చుంటాననుకోకు. పాన్ బోకర్ గా చిన్న జీవితం మొదలెట్టిన నేను కోటీశ్వరుడినయ్యానంటే ఎంత కృషి ఎంత పట్టుదల వుందో ఆలోచించుకో. ఈ డబ్బు లేని రోజున మీ బతుకు ఏమిటి? అందుకే మళ్ళీ మళ్ళి చెబుతున్నా… మీరెలాగన్నా వుండండి.. నీ ఫైట్.. దట్సాల్. మరోసారి హెచ్చరించను. ” సీర్యస్ గా చూసి వెళ్ళిపోయాడు.

“హూ.. మగబుద్ధి” ఈసడిస్తూ  లోపలికెళ్ళింది సుందరి.

 

ఓ క్షణం అక్కడే నిలబడి తలపంకించి మామగారి గదిలోకి వెళ్ళాడు కిషన్.

“కిషన్.. ఇక్కడ ఏం జరుగుతోందో నాకు తెలుసు. మగాడికి ప్రేమ కావాలి. అది ఆడది, అంటే కట్టుకున్నది ఇవ్వలేనప్పుడు వేరే చోట పొందడానికి ప్రయత్నిస్తాడు. అలాగే ఆడది కూడా కట్టుకొన్న మొగాడు కనీసం తనని ఆడదిగా గుర్తించనప్పుడు వేరే వాళ్ళ మెప్పు కోసమో ప్రాపు కోసమో పాకులాడటం సహజం. కానీ, కిషన్ ఏది చేసినా పరిస్థితులని గమనించాలి. ఏ పరిస్థితుల్లో నువ్వు యీ ఇంటి అల్లుడివయ్యావో నీకూ నాకూ ఇద్దరికీ తెలుసు. సుందరి అమాయకురాలని నేను అనను. అది వాళ్ళ అమ్మలాగా త్రాచుపాములాంటిది. నాగస్వరం ఊదు…. పడుంటుంది. లేదంటావా… కాటు వేయడానికి సందేహించదు! ” హెచ్చరికగా అన్నాడు సేట్ చమన్ లాల్.

“పితాజి.. మీరనేది నాకు అర్ధమౌతోంది. కానీ ఒక్క విషయం చెప్పక తప్పదు. అమె చేసిన, చేస్తున్న అన్ని తప్పుల్ని సహించగలను. పిల్లల కోసం ఎన్నేళ్ళయినా మౌనంగా వుండగలను కానీ.. ఒక్కరిని, ఒకే ఒక్కరికి అపకారం చేస్తే మాత్రం సహించలేను. ఏ క్షణం అటువంటిది జరిగిందో ఆ మరుక్షణం నేనుండను.. ప్రాణం పోయినా సరే! మీకు అర్ధమౌతుంది. పితాజీ నేను జీవితంలో ఏదీ నోచుకోలేదు. సుందూకి సిన్సియర్ గా వున్నంత కాలం నన్ను ‘కుక్క ‘ లానే చూసింది. ఓ.కే. అది తన దృష్టి. కానీ లోకం లో ‘నన్ను నన్నుగా ‘ చూసేవాళ్ళు కూడా..” ఆగాడు.

“నాకు అర్ధమౌతుంది కిషన్, కానీ గమనించు చుట్టూ గమనించు. పరిస్థితులని గమనించు. జీవితం ఎంత విలువైనదంటే.. ఏదీ దానికి సమం కాదు” భుజం తట్టి అన్నాడు చమన్ లాల్.

కిషన్ బయటకు వెళ్ళగానే సుందరిని ఫోన్ చేసి పిలిచాడు చమన్ లాల్.

“అమ్మాయి.. నీ విషయం, కిషన్ సంగతి కూడా నాకు తెలుసు. షీతల్ యీ ఇంటి పనిమనిషి. అంటే కేవలం ఓ సర్వెంట్.  యజమానులు కొందరు సర్వెంట్లను వాడుకొంటారు. అంతెందుకు ఒక రాజుకు వందమంది పెళ్ళాలే కాక లెక్కలేనంత మంది అందగత్తెలు సర్వెంట్స్ గా వుండేవారు. వాళ్ళు నీలాగ పంతానికి పోలేదే. అతను చేసేది తప్పు అని నాకు కూడా తెలుసు. అంతే కాదు దాన్ని “ప్రేమ – మోజు ” అంటారని కూడా తెలుసు. పడి వుండనీ. నీకేం పోయింది? బయట ‘ఖాతాలు ‘ పెట్టనందుకుసంతోషించు. నువ్వెట్టాగూ అతన్ని దగ్గరకు రానివ్వవు. వచ్చిన నష్టం ఏముందీ? డబ్బు ఉండటం మంచిదే. కానీ దాన్ని నిలుపుకొనే తెలివితేటలు వుండాలి. నీకా తెలివితేటలు లేవు. నీ బిడ్డలకు తండ్రిగా అతన్ని ఇంట్లో వుండనీయ్. మన కంపెనీ ఇంకా ఇంకా వృద్ధి చేస్తాడు…. నువ్వు గొడవ పెట్టుకోకుండా వుంటే.. ఎందుకో తెలుసా? కృతజ్ఞతతో! షీతల్ నీ కాలు కింద చెప్పులాంటిది. అందుకే వాళ్ల ఎఫైర్ పట్టించుకోకు. పట్టించుకుంటే నువ్వు ఇంపార్టన్స్ ఇచ్చినట్లవుతుంది. ఏదీ చేసినా బాగా ఆలోచించుకొని చేయ్యాలి. ఎమోషనల్ గా బిహేవ్ చేయకు. “టు బీ ఎమోషనల్ ఈస్ టూ బీ ఫూలిష్ ” అని కూతురి భుజం తట్టాడు చమన్ లాల్.

మౌనంగా విని బయటకొచ్చింది సుందరి. ఆమె గుండె భగభగా మండుతోంది. ఆఫ్ట్రాల్… ఆఫ్ట్రాల్ ఓ దాసి ముండని ‘నా ‘ కంటే ఎక్కువగా ప్రేమించడమా అనే నిప్పు.. గుండెని మండించేస్తోంది. ఆ మంట చల్లారాలంటే ఆనందరావుని తనవాడిని చేసుకొని , కిషన్ గాడి ముందే వాడు షీతల్ తో సుఖిస్తునట్లు సుఖించాలి.

కూతురు మౌనంగా బయటికెళ్ళడం చూసి నిట్టూర్చాడు సేట్ చమన్ లాల్. కూతురంత మూర్ఖురాలు మరొకతి వుండదని, ఆ పిల్ల పట్టుదలే ‘ఆమె సంసారాన్ని’ ముక్కలు చేస్తుందనీ అతనికనిపించింది.

**************************

బోస్ బాబు చేరదీసిన యంగ్ విడో పేరు ‘ నవనీతం ‘. మనిషి నిజంగానే నవనీతమే. ప్రస్తుతం ఆమె శంఖుచక్రపురం లో వుంది. ఫాదర్ అల్బర్టు ఆవిడకి దూరపు బంధువు. ఆ వరసన బోసు బాబు బంధువే. అయితే బోసు బాబు ‘మతం’ పుచ్చుకున్నాడో లేదో ఎవరికీ తెలియదు. అన్నీ గుళ్ళకూ వెళ్తాడు. అన్నీ పండగలూ చేస్తాడు.

కల్తీ సారా చావులు జరిగినపుడు కొంతకాలం ‘మరుగున’ వుండమంటే, శంఖుచక్రపురం వచ్చింది నవనీతమ్మ. నవనీతమ్మకి వయసు ముప్పై. జవజవలాడుతూ వుంటుంది. క్షణం తీరిగ్గా కూర్చోడం అలవాటు లేదు గనగ ఆరోగ్యం తొణికిసలాడుతూ వుంటుంది.  శంఖుచక్రపురంలోనే అయిదారుగురు ‘పెళ్ళి ‘ చేసుకుంటామని ప్రపోజల్ పెట్టినా నవనీతం ఒప్పుకోలేదు. ఇతర వూళ్ల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ప్రపోజల్స్ పెట్టారు. నవ్వి వూరుకుందంతే.

అందరి జీవితాలూ అందరికీ ఒకే జీవిత పాఠాన్ని నేర్పవు. ఎవరి జీవితం వారిది. ఎవరి జీవితం నేర్పే పాఠమూ వారిదే. నువ్వు నేర్చుకున్న నేకే వుపయోగపడుతుంది తప్ప నాకు కాదు. కానీ కొన్ని పాఠాలుంటాయి. వాటిని యూనివర్సల్ లెసన్స్ అంటారు. ఆ పాఠాలు ఎవరికైనా వుపయోగపడతాయి.

నవనీతం జీవితం కూడా నవనీతానికి ఓ పాఠం నేర్పింది. ‘ప్రేమ’ అనేది ‘మబ్బు’ లాంటిదని, అది వర్షించేది ఒకసారనీ.. ఆ తరవాత మిగిలేది దాహం తప్ప మరేమీ కాదని.

ఇంకో పాఠం కూడా నేర్చుకుంది. లక్ష సార్లు రెపరెపలాడించే తుమ్మెద కంటే, మగవాడు వందరెట్లు చంచలమైనవాడు.

ఆకాశంలో ఏ మబ్బు స్థిరంగా వుండదు.

 

మగాడి మనోకాశంలోనూ ఏ ప్రేమా స్థిరంగా వుండదు.

అందం లేని వాళ్ళు ఎక్కువగా మోసపోరు.

ఎక్కువగా మోసపోయేది అందగత్తెలే.

నవనీతం అందగత్తెలలో అందగత్తే. పదహారేళ్ళప్పుడు జనాలను పిచ్చెక్కించింది. పదెనిమిదేళ్ళకే నేనంటే నేనని మొగపిల్లలు పెళ్ళికోసం పోటీ పడ్డారు. ఆ తరవాత ఓ మంచి అందగాడ్నిపెళ్ళి చేసుకుంది. అందమే కాదు. డబ్బున్న వాడు కూడా. అర్ధాయుష్కుడు. చేసేదేముంది. గాలి పటంలా ఎగిరిఎగిరి అలసి బోసు బాబు ఇలాకాకి వచ్చింది. జీవితం ఓ దారిన పడింది. ఇప్పుడు మళ్ళీ పెళ్ళి పిల్లలు అనుకొని, ముళ్ళ కంచె మీద చీర ఆరేయ్యడానికి సిద్ధంగా లేదామే. బోసు బాబు పిలుపు కోసం ఎదురు చూస్తోంది. పిలుపు రాగానే బయలుదేరాలి మరి.

మాయాబజార్ లో ఓ పాట వుంది “ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు” అని. విధి విధానాన్ని ఎదిరించడం ఎవరికి సాధ్యం? చీకటి పడటం నవనీతం తప్పు కాదు. అసలే ఆ వూరు చిన్నది. టాయిలెట్స్ అనేవి చాలామందికి తెలియదు. అన్నీ ఓపెన్ ఏయిర్ లోనే.  ఆడవాళ్ళు మాత్రం ఏ తెల్లవారుఝామునో పొద్దుగుంకాకో దాపునున్న కొండలవైపుకి వెళ్తారు. పల్లెటూరు వాళ్ళకి సమయాసమయాలు తెలుసు గనక ఆ సమయం లో అటువైపుకి వెళ్ళరు.

నవనీతం కడుపు కొంచం గడబిడ చెయ్యడంతో ఆ రాత్రి ఓ టార్చి లైటు పట్టుకొని అటువైపు వెళ్ళింది. పిచ్చిగా తాగేసిన పరమశివం కూడా ఆమె అటువైపు వెళ్ళడం చూశాడు. వాడి కళ్ళకి నవనీతం దూరం నుండి మూగమణిగా కనిపించింది. ఇంకేం.. లేడిని చూసిన పులిలా అటువైపు పరిగెత్తాడు. శబ్ధం విని చెంబు అవతలకి విసిరేసి నవనీతం పరుగులకించుకుంది.

ఒక్క చిన్న ‘రాయి’ చాలు మనిషి బోర్లా  పడటానికి. మొదట బోర్లా పడిన మనిషి నవనీతం. ఓ రాయికి మొహం గుద్దుకొని సృహతప్పి పోయింది.

రెండో సారి బోర్లాపడింది పరమశివం. అతని తలకి ఏ రాయి గుద్దుకోలేదు కానీ ఓ పెద్ద బండరాయి వాడి తల మీద పడింది. ఆ రాయి వాడి నెత్తిన విరిసిన వాడు వెంకటస్వామి.

——–*****——

 

“అతని మతి చలించింది” డిక్లేర్ చేశాడు డాక్టర్ శ్రీధర్.

“ప్రమాదకారిగా మారతాడా” అడిగాడు వెంకట స్వామి.

“నో! అసలు మనిషి బ్రతకడమే అదృష్టం , పెడితే తింటాడు అంతే. మెల్లమెల్లగా శరీరభాగాలు చచ్చుబడిపోతాయి. మే..బీ.. మళ్ళీ మామూలు మనిషి కావడం ఇంపాజిబుల్. ” నిట్టూర్చాడు డక్టర్ శ్రీధర్. ఆయనో గొప్ప మానవతావాది. ఉన్నవాళ్ళ దగ్గర మాత్రమే ఫీజి తీసుకునే హృదయమున్న వైద్యుడు. పావలా టాబ్లెట్ కూడా అవసరం అయితే తప్ప ప్రిస్క్రైబ్ చెయ్యని ఉన్నత వ్యక్తిత్వం అతనిది.

“థాంక్యూ డాక్టర్” ధన్యవాదాలు తెలిపాడు ఫాదర్ అల్బర్ట్.

ఆయన ఓ రకమైన శాంతితో నిట్టుర్చాడు.

“మహాకూటమి” లో ఇలాంటి ప్రమాదం జరగడం భక్తుల మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అందుకే అల్లరి కాకుండా అంతా సద్దుబాటు చెయ్యడం జరిగింది. నవనీతం తల మీద అంటే నుదిటి మీదుగా తలపైకి మూడు నాలుగు కుట్లు పడ్డాయి గానీ మనిషి ఆరోగ్యంగానే వుంది. వెంకటస్వామి ఆమెని భుజం మీద ఎత్తుకొని  గబగబ రావడం వల్ల లోకల్ డాక్టర్ రక్తస్రావాన్ని అరికట్టగలగడంతో ఎక్కువ రక్తం పోలేదు.

పరమశివం మామూలుగా పడ్డాడనుకొన్నారు గానీ, వాడి తల మీద నెల్లూరి వాళ్ళన్నట్టు ” బండ ” పడిందని ఎవరూ అనుకోలేదు. కానీ ఏదో జరిగి వుంటుందని ఫాదర్ అల్బర్ట్ అనుమానించారు. అయినా అడగలేదు. ఆయన దృష్టిలో వెంకటస్వామి మంచివాడు. పరమశివం గ్రీడీ మాన్.

చిత్రమేమిటంటే ఏ మూగమణి మీద  పరమశివం  కన్ను వేశాడో చివరికి ఆ మూగమణి భాషే పరమశివానిదైంది. “బా.. బా.. బా.. ” తప్ప మరో పలుకు రావడం లేదు. కళ్ళల్లో మాత్రం అప్పుడప్పుడు జ్ఞాపకాల మెరుపులు వెంకటస్వామికి కనిపిస్తుంటాయి.

“దేముడున్నాడు” మనసులోని మాట బయటకే అనేశాడు వెంకట స్వామి.

“ఎందుకు లేడు బిడ్డా! దేముడు లేకుండానే ఈ సర్వ సృష్టి మనగలుగుతోందా? ఇన్ని కోట్ల జీవరాశులని సృష్టించినది పాలిస్తున్నదీ భగవంతుడు కాడా ? ”

కన్నీరు వత్తుకుంటూ అన్నాడు ఫాదర్ అల్బర్ట్. దేవుని నామం స్మరిస్తే   చాలు ఆయన కళ్ళల్లో నీళ్ళు ఉబుకుతాయి. “హిందువా ముస్లీమా క్రిస్టియనా సిక్కా … యివన్నీ ఎందుకు? గుడా చర్చా మసీదా గురుద్వారానా ఇవన్నీ కూడా ఎందుకు? నీ గుండెల్లో సర్వజీవుల మీదా ప్రేమ వుంటే ఆ ‘ప్రేమే’ దేవుడు. బిడ్డా.. ఒక గొర్రెపిల్లని గుండెలకి హత్తుకొన్నవాడు… మానవాళి మొత్తాన్ని  తన రెక్కల కిద దాచుకోడు?” శిలువ కళ్లకి అద్దుకొని కన్నీరు కార్చారు ఫాదర్ అల్బర్ట్.

“ప్రేమ వున్న హృదయమే దేవాలయం” తనలో తాను అనుకొని పరమశివాన్ని నడిపిస్తూ తీసుకెళ్ళి ఫాదర్ గారి కారెక్కించాడు వెంకటస్వామి.

___________________________-******________________________

“వాడ్ని అక్కడే వదిలెయ్యి ఇక్కడకు తీసుకొని రాకు” కోపంగా అన్నాడు మహదేవన్ .

“అదేంటి సారు… మనిషి బాగుంటే వదిలెయ్యొచ్చు. మెదడు బాగా దెబ్బ తిన్నది. బ్రతికేది కూడా ఎంత కాలమో తెలియదు” సిన్సియర్ గా అన్నాడు వెంకటస్వామి.

“వెంకటస్వామి… మొన్న పొరపాటున వాడి పెట్టె తెరవాల్సి వచ్చింది.  కారణం నా పెట్టే అలాంటిదే, కేరళాలో కొట్టయంలో తయ్యారైనదే. చూస్తే దాన్నిండా చురకత్తులు, చాకులు, ఇంకా యాసిడు చాలా వున్నాయి. కన్న తండ్రిని కర్కశంగా చంపిన విధానం అక్షరం పొల్లుపోకుండా వాడి డైరీలో వాడే రాసుకున్నాడు. బిడ్డనిచ్చి పెళ్ళి చేద్దామనుకున్నాను. ఆ పాపాత్ముడి నీడ కూడా నా బిడ్డ మీద పడకూడదు. నువ్వు మాత్రం వచ్చేయ్. అవసరం అయితే ఏ అనాథ శరణాలయం లోనో చేర్చేయి. కావాలంటే ‘నెలకింత ‘ అని పంపుద్దాము. వాడు మాత్రం ‘వద్దు’ ” ఫోన్ పెట్టేశాడు మహదేవన్.

“ఏం చెయ్యమంటారు” నిట్టుర్చి అడిగాడు ఫాదర్ వెంకట స్వామి.

“అనాధలు ఎవరూ లేరు వెంకటస్వామి. లోకం కోసం రక్తాన్ని చిందించిన ప్రభువు వుండగా అనాధలెవరూ? ఈ ఆశ్రమంలోనే ఉంటాడు .. ఉన్నన్నాళ్లు. ” కళ్ళజోడు తుడుచుకుంటూ అన్నారు ఫాదర్ అల్బర్ట్.

ఆవూరు చిన్న చర్చికి సంబంధించిందే! బిషప్ ఆల్మండ్ అనాధాశ్రమం ‘ మూగమణి వుంటున్నదీ అక్కడే.

ఇప్పుడు ఆ పిల్ల మతిలేని పరమశివానికి తల్లిలా ముద్దలు కలిపి పెడుతోంది.

 

ఇది మనిషి చేసిన పాపానికి ఫలితమా?

స్వర్గ నరకాలు ఇక్కడే తప్ప ఎక్కడా లేవనీ నిజమా?

ఏమో! తెలిసిన దైవం మాట్లాడడు.

మాట్లాడే మనిషికి తెలిసిందేమిటి?

———–*****—–

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *