May 7, 2024

శుభోదయం-5

                                                               రచన: డి.కామేశ్వరి

వారిద్దరిమధ్య ప్రేమానురాగాలు శాశ్వతమని, ఒకరికొకరం అనుకుని మురిసే జంటకి – అనుకున్నట్లంతా అయితే యింక నా ఉనికిని మీరు విస్మరిస్తారు. మీ జీవితాలు మీ చెప్పుచేతల్లో లేవు నా చెప్పుచేతల్లో వున్నాయి సుమా _ అని నిరూపించడానికన్నట్టు వారిద్దరి జీవితాల్లో మాధుర్యాన్ని హరించి, యిద్దరి జీవితాలమీద విధి దెబ్బ తీసింది.

ఆ రోజు… వాళ్ళ రెండో వెడ్డింగ్ ఏనివర్సరీ! ఆ రోజు యిద్దరూ యింట్లో వంట చేసుకోకుండా హాయిగా పెద్దహోటల్లో భోజనంచేసి రెండో ఆట సినిమాకి వెళ్ళి రావాలని ప్లాన్ చేసుకున్నారు.

తెల్లటి జరీచీర బహుమతిగా తెచ్చాడు మాధవ్. ముత్యాలహారం, ముత్యాల దిద్దులు పెట్టుకుని మెరిసిపోతూంది రాధ తెల్లచీరలో. మాధవ్‍కి  తెల్లటి పైజమా, లక్నోకుర్తా కొని తెచ్చింది రాధ. ఇద్దరూ కొత్తబట్టలు కట్టుకుని, పౌర్ణమినాటి ఆ వెన్నెలలో హోటల్లో భోంచేసి స్కూటర్‍పై వెళ్ళి సినిమా చూశారు. ఆ ఇద్దరి ఆనందానికి చిన్న కొరతలా వారు కావాలనుకున్నా ఏడాదిగా రాధ కోరిక తీరడంలేదు. “ఒక ఏడాది వద్దన్నారు. చూశారా కావాలనుకున్నప్పుడు పుట్టడానికి మనచేతుల్లో వుందా, వద్దనుకోవడానికి వీలుందికాని కావాలనుకోవడంమనచేతుల్లో లేదని అర్ధమైందా” అంటుంది ఎన్నోసార్లు నిరాశగా.

మాధవ్‍కీ ఇప్పుడు ఇంట్లో పసిపాప కావాలని ఎంతో అన్పిస్తూంది. అనవసరంగా వద్దనుకుని ఆలస్యం అయింది అని అన్పిస్తూంది అతనికీ…రెండేళ్ళు నిండిన ఆ రోజు యిద్దరూ ఎంతో సంతోషంగా తిరుగుతున్నా ఆ వెలితి యిద్దరి మనసుల్లో పూడ్చలేనంతగా అన్పించింది.

అర్ధరాత్రి పన్నెండు అయింది సినిమా విడిచిపెట్టేసరికి – పుచ్చపూవులాంటి వెన్నెల…చల్లటిగాలి వీస్తుంటే  స్కూటర్‍మీద  అతని నడుంచుట్టూచేయి బిగించి వీపుమీద తల ఆన్చి…”మాధవ్..” అంది మత్తుగా.

“మైగాడ్…నన్ను స్కూటర్ నడపనిస్తావా…యంటికెళ్ళేవరకన్నా ఆగలేవా?” అన్నాడు కొంటెగా.

“ఛీ..ఫో..” వీపుమీద ముద్దు పెట్టింది రాధ.

“ఏయ్..ఇది రోడ్డు, ఏమిటా సరసం..”

“చూడడానికి ఎవరూ లేరులే, మాధవ్…ఈ వెన్నెల, ఈ చల్లగాలి, నీవు…స్వర్గం యింకెక్కడో లేదు మాధవ్..”

“అబ్బో అమ్మాయిగారికివాళ కవిత్వం వస్తుందే..ఓ..ఓ..మైగాడ్..”

స్కూటరు టైరు పంక్చరయి గాలి పూర్తిగా పోయి…యిటు అటు వూగింది. బ్రేక్‍వేసి కాలు ఆన్చి “హెల్విత్ది టైర్…టైరు పంక్చరయింది అమ్మగారూ, దిగండి. దిగి వెన్నెలలో విహారం చేస్తూ కవిత్వాలు అల్లండి.. మేం స్టెపెనీ వేసేవరకు”

“అబ్బ అర్ధరాత్రి ఏం గొడవ…అసలే నిద్రవస్తుంటే యిదో గొడవ, ఛా..అదేదో త్వరగా కానీండి..” అంది రాధ.

మాధవ్ స్టెపినీ తీసి టైరు తీసి మార్చే ప్రయత్నంలో పడ్డాడు. నిర్మానుష్యంగా వున్న రోడ్డులో అక్కడికి కొద్ది అడుగుల దూరంలో కానామీద కూర్చున్న ముగ్గురు మనుష్యులని వీళ్ళు చూడలేదు కాని వీళ్ళని వాళ్ళు చూశారు.  లేచి స్కూటర్‍వైపు నడిచారు. స్కూటర్ స్టెపినీ బిగిస్తున్న మాధవ్ తనముందు మూడునీడలు పడడం చూసి తలెత్తాడు. చడీచప్పుడు లేకుందా ఒక్కసారిగా నీడపడేసరికి ఉలిక్కిపడి తలెత్తాడు.

రాధ కూడా చప్పుడుకి అప్పుడే అటు చూసింది.

“ఏమయింది?” అందులో ఒకరు అడిగాడు.

“టైరు పంక్చరయింది. మారుస్తున్నాను” మాధవ్ జవాబిచ్చాడు.

“సహాయం కావాలా…మీరు లెండి. మేం మారుస్తాం.”

మాధవ్ కూర్చున్నవాడు లేచి నుంచుని “ఎందుకూ ఫరవాలేదు, యింకో ఐదు నిముషాలలో అయిపోతుంది” అన్నాడు.

మాధవ్ లేచి నుంచోగానే ఒకడు అతివేగంగా మాధవ్ ఏం జరిగేది ఊహించేలోగా గడ్దంకింద ఒక్కగుద్దు గుద్దాడు. ఏమరుపాటుగా వున్న మాధవ్ వెల్లకిలా పడ్డాడు. రాధ కెవ్వుమనబోయింది. ఒకడు చటుక్కున రాధనోరు మూసి రెండుచేతుల మధ్య రాధని కదలకుండా పట్టుకున్నాడు. మాధవ్‍కి  ఆ ముగ్గురూ గుండాలని అర్ధమయి లేవబోతుంటే పొట్టలో ఒకటి గుద్దాడు. ఆ దెబ్బకి మాధవ్ తట్టుకోలేక పొట్టపట్టుకు కూలబడిపోయాడు. రాధ అరవబోయింది. నోరు నొక్కేసి గింజుకుంటున్న రాధని మరింత గట్టిగా బిగించి పట్టుకున్నాడు. కిందపడిన మాధవ్‍ని  ఇష్టంవచ్చినట్లు ఎడాపెడా నాలుగైదు దెబ్బలు కొట్టడంతో మాధవ్…ఆ తాకిడికి తట్టుకోలేక ప్రతిఘటించలేక చలనరహితంగా వుండిపోయాడు.

మూడోవాడు చకచక మాధవ్ జేబులు వెతికి పర్సు, వాచి తీసుకుని నోట్లో ఒక రుమాలు కుక్కి యింకో రుమాలుతో చేతులు వెనక్కికట్టి మాధవ్ని రోడ్డుపక్కకి  లాగేసాడు. స్కూటర్ చెట్టుపక్కకి లాగాడు. ఒకడు రాధని పట్టుకుంటే మరోడు రాధవంటినున్న నగలన్నీ ఊడలాగి జేబులో వేసుకున్నాడు. వాచ్‍కూడా విప్పేశాడు. రాధకి భయంతో బాహ్యస్మృతి పోయింది. కళ్ళముందు మాధవ్ చావుదెబ్బలు తిని పడిపోవడం చూసి భయంతో ఆమె నిశ్చేష్టురాలైంది. వస్తువులు లాక్కుంటుంటే నగలకోసం యింతపని చేస్తున్నారని నగలన్నీ తీసేసుకోండి,తీసుకుని వదిలిపెట్టండన్నట్టు చేతులు జోడించి సౌంజ్ఞచేసింది. అంతవరకు కేవలం డబ్బు, నగలు దొంగతనంచేసే ఉద్దేశం వున్నా గుండాలు ఆ వెన్నెలె వెలుగులో తెల్లచీరతో మెరిసిపోతున్న రాధని చూడగానే వాళ్ళమనసులో అప్పటికప్పుడు కొత్త ఆలోచన మెదిలింది. ముగ్గురూ కూడబలుక్కున్నారు. కాళ్ళు చేతులు కొట్టుకు గింజుకుంటూన్న రాధని ముగ్గురూ రోడ్డుపక్క ఖాళీస్థలంలో చెట్లచాటుకి తీసుకెళ్ళిపోయారు. జరిగే ఘోరం చూడలేనన్నట్టు చంద్రుడు మబ్బులచాటుకి వెళ్ళిపోయాడు.  సగం సగం స్మారకస్థితిలో వుండి జరుగుతున్నది చూడక తప్పలేదు మాధవ్‍కి. కదలలేక, అరవలేక, వళ్లంతా చితికిపోయి ముక్కులోంచి రక్తం కారిపోతూంటే రాధపై జరుగుతున్న అత్యాచారాన్ని ఏ విధంగానూ ఆపలేని మాధవ్… కొంతసేపటికి పూర్తిగా స్పృహ కోల్పోయాడు.

తెల్లవారేసరికి ఊరు ఊరంతా ఈ వార్తతో గుప్పుమంది.

రోడ్డుపక్కన పడివున్న భార్యాభర్తలని ఎవరో లారీవాళ్ళు చూసి తీసికెళ్ళి ఆస్పత్రిలో పడేశారు. మాధవ్‍కి  మోపయిన గాయాలు తగిలాయి. ఎడంచెయ్యి విరిగింది. ముక్కులోంచి చాలా రక్తం ఎక్కించాల్సి వచ్చింది. రాధని ఘోరంగా మానభంగం చేసినట్లు డాక్టర్లు గుర్తించారు. పోలీసులకి కంప్లయింట్ యిచ్చారు.

ఉదయం ఆరుగంటలకి ముందుగా రాధకి తెలివి వచ్చింది. ఆమె శారీరకంగాకంటే మానసికంగా ఎక్కువ దెబ్బతినడంతో షాక్‍కి  తెలివితప్పింది. తెలివివస్తూనే మాధవ్, మాధవ్ అంటూ కలవరించింది. పూర్తిగా తెలివివచ్చి జరిగింది గుర్తురాగా భోరున విలపింఛింది. “మాధవ్ మాధవ్…మాధవ్ ఏడి..నన్ను చూడనీండి”అంటూ డాక్టర్లు వారిస్తున్నా వినకుండా అతని దగ్గిరకి తీసికెళ్ళేవరకు  వూరుకోలేదు.

మంచంమీద వంటినిండా కట్లతో తెలివిలేకుండా పడివున్న మాధవ్‍ని  చూస్తూనే అతనిమీద వాలిపోయి ఏడవసాగింది. మాధవ్‍కి  రక్తం ఎక్కిస్తున్నారు కదల్చకూడదని ఆమెని నర్సులు బలవంతంగా లేవదీసి తీసికెళ్ళిపోయారు. “ఉహు..నన్ను వదలండి, మాధవ్‍ను  వదిలి నేనుండను. నన్నిక్కడే వుండనీయండి”  అంటూ పక్కనే వున్న కుర్చీలో కూలబడింది. ఆమె అసలు నించోలేని స్థితిలో వుంది. కాళ్ళు వణుకుతూ, కళ్ళు తిరుగుతున్నట్టున్నా బలవంతంగా కూర్చుంది.

ఈలోగా పోలీసులు వచ్చి వివరాలు అడిగారు. తమ పరువు, ప్రతిష్ట అన్నీ మంటగలిపిన ఈ దుర్ఘటన గురించి చెప్పకుండా వుండలేని పరిస్థితిలో పడింది. ఎవరికీ తెలియకుండా జరిగితే తమలో తాము బాధపడవచ్చు. తెలివి తప్పిన స్థితిలో ఆస్పత్రిలో చేర్చాక, పోలీసు కేసయ్యాక వివరాలు ఎలా దాచగలరు? మానభంగం జరిగిన అవమానంకంటే …దాన్ని గురించి నల్గురిముందు వెల్లడించుకోవడం…ఊరూ వాడా ఈ సంగతి తెలియడం, పేపర్లలో వార్తలు వస్తాయి. శరీరానికి జరిగిన అవమానభంగం కంటే. నల్గురిముందు బతుకు బట్టబయలు అయిన “మానభంగం ఎక్కువ కష్టం కల్గించింది రాధకి. చెపుతూ చెపుతూ ఇనస్పెక్టర్ మొహం చూడలేక, డాక్టర్ల మొహం చూడలేక తలదించుకుని కన్నీళ్ళు కారుస్తున్న రాధని చూసి లేడీడాక్టరు ఓదార్పుగా భుజంతట్టి “టేకిట్ ఈజీ..వుయ్ ఆర్ ఆల్ విత్ యూ..నీ అవమానం మా అందరిదీనూ..” అంటూ ఇనస్పెక్టర్‍తో  దోషులని పట్టుకుని శిక్షించాలని ఆవేశంగా అంది.  ఇనస్పెక్టర్ “వుయ్ విల్ ట్రై అవర్ బెస్ట్ మేడమ్” అన్నాడు. రాధ ఉద్యోగస్థురాలని, ఏ దిక్కుమొక్కులేని ఏ ఆడవాళ్ల కేసులో అయితే శ్రధ్ధ తీసుకోకపోయినా ఫరవాలేదుగాని యిలాంటి ఉన్నత కుటుంబం స్త్రీపై జరిగిన ఈ అత్యాచారాన్ని చూసీ చూడనట్లు వూరుకోవడానికి వీలులేదని అతనికి తెల్సు.

“హు..ఎన్ని యుగాలు గడిచినా ఆడదాన్ని ఆటవస్తువుగా, విలాసవస్తువుగా వాడుకునే ఈ పురుషప్రవృత్తి యింకెన్ని యుగాలకి మారుతుందో…ఒక ఆడదానికి ఈ సమాజంలో వున్న రక్షణ ఏమిటి? ఎంత అభ్యుదయం సాధించాం అనుకున్నా స్త్రీ వంటరిగా ఈనాటికి బతికే రక్షణలేని మనం సాధించిన ప్రగతి ఏమిటి?…ఛా.. ఇంత ఘాతుకంగా, యింత కిరాతకంగా ఓ ఆడదాన్ని అనుభవించే ఆ వెధవలకి దొరికే ఆనందం ఏమిటో…సెక్స్ అంటే పైశాచిక కామమా? అదో సున్నితమైన తీయని అనుభూతి కావాలిగాని పైశాచిక కృత్యం జరిపేవాళ్ళు రాక్షసులు కాక మనుషులా…కీచకులు, రావణులు  అన్నియుగాలలోనూ వుంటారు గాబోలు. ఇన్సెపెక్టర్ర్..ఈనాడు ఈమె. ఇంకోరోజు ఇంకోస్త్రీ..ఇలా ఎన్ని మానభంగం కేసులు వస్తున్నాయో తెలుసా! ఈ మానభంగం జరిగిన స్త్రీల గతేమిటి? వారి భవిష్యత్తేమిటి? ..” లేడీడాక్టర్ చాలా ఆవేశంగా అంటూ రాధమొహం చూసి అగిపోయింది.  అప్పుడామె వున్నస్థితిలో యింకా మాట్లాడి ఆమెని భయపెట్టలేకపోయింది. ఆమె మాటలకి తోటి డాక్టర్లు, నర్సులు అంతా ఏకగ్రీవంగా రాధకి జరిగిన అన్యాయం ఆమె ఒక్కరిదే కాదు మొత్తం స్త్రీ జాతిదే అంటూ మాట్లాడారు. “మానం, గీనం, పవిత్రత అంతా ట్రాష్. ఐడోంట్ బిలీవ్ దోజ్ థింగ్స్..కాని ఒక స్త్రీని ఇష్టంలేకుండా అంత క్రూరంగా చెరచడం మాత్రం అమానుషం. పశుత్వం ఉపయోగించి బలప్రయోగంతో ఒక స్త్రీని అనుభవించే హక్కు వాళ్ళకేముంది? మనకుచెందిన ఏ వస్తువన్నా యింకోరు దొంగిలిస్తే వూరుకోం. అలాంటిది ఒకస్త్రీని యిలా అవమానంపాలు చేసిన వాళ్లని చట్టం ఉరితీసినా పాపం లేదంటాను. జైలుశిక్ష కాకుండా హత్య చేసినవాడికి విధించే ఉరిశిక్షలాంటిది విధించాలంటాను. హత్యచేస్తే మనిషి ఒకసారే చస్తాడు. కాని యిలా మానభంగం జరిగిన స్త్రీ రోజురోజుకీ చచ్చే పరిస్థితి మన సమాజం కల్పిస్తుంది. అంచేత హత్యకంటే తక్కువ నేరం కాదంటాను” లేడీడాక్టరు చాలా ఆవేశంగా అరిచింది.

అక్కడున్న డాక్టర్లు, పోలీసులు పురుషులయిన అందరూ తలదించుకున్నారు.

చీరకొంగుతో మొహం దాచుకు ఏడుస్తూన్న రాధని చూసి అందరూ చలించారు.

“మేడమ్,.. నా శాయశక్తులా దోషులని పట్టుకునే ప్రయత్నం ఈ క్షణంనించి చేస్తాను. ముందు అక్కడికెళ్ళి  ఏమన్నా గుర్తులు దొరుకుతాయేమో చూస్తాం. దురదృష్టవశాత్తూ ఆమె ఒక్కక్షణమాత్రం వాళ్ళని చూశారు కనక గుర్తుపట్టడం కష్టం అయినా మా ప్రయత్నం మేం చేస్తాం” అంటూ అభయం ఇచ్చి వెళ్ళాడు ఇనస్పెక్టర్.

“చూడమ్మా, నీవింక ఏడుపు మానాలి. అసలే వీక్‍గా వున్నావు. మానసికంగా ధైర్యం తెచ్చుకుంటేగాని శారీరకంగా కోలుకోలేవు. మీవారి ఆరోగ్యం బాగోలేదు. ఆయనను చూసుకోవాలంటే ముందు నీవు కోలుకోవాలమ్మా. చూడమ్మా, ఆ దుండగీళ్ళు మీపై జరిపిన అత్యాచారంలో మీవారికి చెయ్యి విరిగింది. గాయాలు తగిలాయి. అలాగే నీకూ కొన్ని గాయాలయ్యాయి అవటానికి. నీవు అలాగే అనుకోవాలితప్ప ఏదో అన్యాయం జరిగింది, అపవిత్రం అయిపోయాను అలాంటి తలపు నీకు రాకూడదు. ఆ భావం వచ్చినంతకాలం నీవు శాంతిగా వుండలేవు. యీ మానం, పవిత్రత అంతా స్త్రీని కట్టడిలో వుంచడానికి పురుషులు పురాణాలలో కథలు సృష్టించారు, అంతే. ఒక్క ఆడదానికే మానం, నీతి, పవిత్రత కావాలి. కాని పురుషులు పదిమందితో తిరిగినా అంటని అపవిత్రత మనకు మాత్రం ఎందుకుండాలి?.. అంచేత రాధా! ఈ నీతులు, నియమాలు, పవిత్రతలు వాళ్ళకి అనుగుణంగా సృష్టించిన నియమాలు! నీ ప్రమేయం లేకుండా జరిగిన దానిలో నీవేదో అపవిత్రురాలివయిపోయావన్న భావం రాకూడదు. ప్రామిస్..” అంది రాధ భుజం ఆప్యాయంగా తట్టి.

ఆవిడవంక తెల్లబోయి చూసింది రాధ. ఆ తరువాత ఆమెకళ్ళలో వెలుగు వచ్చింది. ఎంత చక్కగా చెప్పింది. ఎంత చక్కగా ఓదార్చింది! ఆరాధనాపూర్వకంగా ఆమెవంక చూసి చప్పున ఆవిడ చేయి అందుకుని మొహం దాచుకుంది రాధ.

లేడీడాక్టరు రాధ తల ఆప్యాయంగా నిమిరి నవ్వి…చేయి నొక్కి…”వస్తానమ్మా, పనంతా అలాగే వుండిపోయింది. ఏమిటో, ఆడవాళ్లకి ఏ అన్యాయం జరిగినా వూర్కోలేని వీక్‍నెస్ నాది. నా చేతుల్లో చట్టం వుంటే…యిలాంటి వెధవలని ఉప్పుపాతర వేయమనేదాన్ని. హు..ఆడదంటే ఆటబొమ్మ అనుకుంటారు. ..ఇలాంటి కేసులు  చూసినప్పుడల్లా రోజంతా ఏదో అశాంతి, ఆవేశం కల్గుతాయి. ఏం చెయ్యగలం మనం, ఆవేశపడడం తప్ప” నిట్టూర్చి రాధకి చెయ్యి ఊపి వార్డులోంచి వెళ్ళిపోయింది. ఎంత చక్కటి మనిషి- ఆ భారీ విగ్రహం, తెల్లటి తెలుపు, హుందాగా, గంభీరంగా, పవిత్రంగా తెల్లటి బట్టలతో స్టెతస్కోపు మెడలో వేసుకున్న అమెని చూస్తే శాంతిదూతలా అన్పించింది. ఆమె మాటలతో, తమ మనసులో భారం తగ్గి తేలిక అయినట్లనిపించింది. మరిచిపోవాలి. ఈ పీడకల మరిచిపోవాలి అనుకుంది.

కాని….ఆమె మరిచిపోవడానికి ప్రయత్నించినా …చుట్టూవున్న మనుష్యులూ, సమాజం మరిచిపోకుండా అనుక్షణం చూపులతో, మాటలతో చీల్చి చెండాడి మనశ్శాంతి హరించి, అనుక్షణం అందరిముందు దోషిలా నిలబెడ్తారని కొద్ది రోజులలోనే గ్రహించింది రాధ.

లోకం అంతా ఏమననీ, ఏమనుకోని ఆమె లెక్కచేసేదికాదు. కాని..కాని..మాధవ్…తన మాధవ్…అంతలా మారిపోతాడని, ఆమె ప్రమేయం లేకుండా జరిగిన దుర్ఘటనకి ఆమెని దోషినిచేసి నిలబెట్టి శిక్షిస్తాడని ఆమె కలలో కూడా అనుకోలేదు. అంత ప్రేమించిన మాధవ్..అంతలా తనను ద్వేషించగలడని రాధ ఎన్నడూ అనుకోలేదు. జరిగిన దుర్ఘటనకి బాధపడ్తాడు, ఓదారుస్తాడు, కలతపడిన మనసుని చల్లని మాటలతో శాంతపరుస్తాడు, దగ్గిరకు తీసుకుని లాలించి, అదో పీడకలని మర్చిపో, అంటాడని ఆశించింది. కాని…ఆ పీడకలని తను మరవకుండా, రాధని మర్చిపోకుండా చేసి హింసిస్తాడని ఎదురుచూడని రాధ అతనిలో మార్పుకి తల్లడిల్లిపోయింది.

తెలివి వచ్చాక…తన మంచం దగ్గిర ప్రాణంలేని బొమ్మలా కూర్చున్న రాధని…తనకోసం విలపిస్తున్న రాధని ఆపాదమస్తకం పరీక్షగా చూస్తున్నట్టు కళ్ళతో రాధ శరీరం అంతా తడిమాడు. ఆ చూపులు గుర్తించిన రాధ సిగ్గుతో, అభిమానంతో చితికిపోతూ “మాధవ్..మాధవ్…”అంటూ అతని గుండెలమీద వాలి ఏడవసాగింది. అతని చెయ్యి ఓదార్పుగా ఆమె తల నిమరలేదు. అతని మొహం గుర్తించలేనట్టు మారిపోయింది.  చుట్టూవున్నవారిచూపులు తూట్లలా గుచ్చుకుంటూన్నట్టు అవమానపడుతూ రాధని ఓదార్చే ప్రయత్నం చేయలేదు. మాట పలుకు లేకుండా నిర్జీవంగా పడివున్నట్టున్న అతన్ని చూసి అతనింకా స్పృహలో లేడని, గాయాల బాధనుంచి మాట్లాడే స్థితిలో లేడని రాధ భావించి తనని తానే ఓదార్చుకుంటూ ఏడుపుమానింది.

మర్నాడు పూర్తి తెలివివచ్చాక…రాధ ఏదో చెప్పబోతుంటే- “ప్లీజ్…రాధా…ఆవిషయం నాకు గుర్తు చెయ్యకు…అది చెప్పకు” అసహనంగా అంటూ కళ్ళు మూసుకున్నాడు.

తనలాగే అతనూ బాధపడ్తూ మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాడని, ఇంక ఆ విషయం అతని దగ్గిర ఎత్తకూడదని అనుకుంది రాధ.

పోలీస్ ఇనస్పెక్టర్ వచ్చి వివరాలు అడుగుతుంటే మాధవ్ చిరాగ్గా… “లీవిట్ ఇనస్పెక్టర్. జరిగింది చాలక యింకా కేసులు అంటూ కోర్టులు కూడా ఎక్కిస్తారా మమ్మల్ని” అన్నాడు తీక్షణంగా.

ఇనస్పెక్టర్ ఆశ్చర్యంగా చూసాడు. అంత ఘాతుకం జరిగితే వాళ్ళని పట్టుకు శిక్షించాలని గట్టిగా చెప్పకుండా కేసు వద్దంటున్న అతన్నీ వింతగా చూసాడు. “మీ స్కూటర్ లేదక్కద…నగలు, వాచి అన్నీ పోయాయని చెప్పారు మీ మిసెస్” ఇనస్పెక్టర్ అన్నాడు.

“ హు..అసలువే అన్నీ పోయాయి..ఇంక వాటికేం వచ్చింది. వదిలేయండి ఇనస్పెక్టర్….వాళ్ళెలాగూ దొరకరు… యీ కేసులు గొడవ భరించేశక్తి నాకులేదు. ఈ జరిగిన అవమానం చాలు…యింకా కేసులుపెట్టి మా బతుకులు కోర్టులో కూడా పెట్టుకోవడం నాకిష్టంలేదు. మమ్మల్నిలా వదిలేయండి…”

“మాధవ్..యింత చేసిన ఆ దుర్మార్గుల్ని వదిలేయమంటావా? వాళ్ళు వాళ్ళు ఆ నీచులు…ఇంత చేసినా తప్పించుకు పోనీయమంటావా…” వణుకుతున్న గొంతుతో అంది రాధ.

మాధవ్ ఆమెవంక విసురుగా చూసాడు. “వదిలేయక కోర్టు ఎక్కి తెలియనివాళ్ళకి కూడా డప్పుకొట్టి చెప్పుకుందామా..” అన్నాడు కోపంగా.

రాధ తల దించుకుంది.

ఇనస్పెక్టర్ అర్ధం అయినట్టు తలపంకించి “మీ ఇష్టం సార్, కంప్లయింట్ యివ్వకపోతే మేం ఏం చెయ్యలేం. కాని సార్, ఒక్కమాట..ఇలా పరువుకోసం అలాంటి నీచులని వదిలేయడం వాళ్లని ప్రోత్సహిస్తున్నట్లవుతుంది. ఇంకోసారి యిలాంటి పని చేసేముందు భయపడేట్టుగా అలాంటివాళ్లని శిక్షించాలి సార్…అలాంటివాళ్లని వదిలేయడం కూడా క్రైమ్ అనే అంటారు. ఆ తరువాత మీ ఇష్టం…” ఇనస్పెక్టర్ అదోలా అని మాధవ్కి షేక్‍హాండ్ యిచ్చి వెళ్ళిపోయాడు.

ఆరోజు అన్ని పేపర్లలో ఈవార్త వచ్చింది. మాధవ్, రాధ స్నేహితులందరూ ఈ వార్త చదివి నిర్ఘాంతపోయారు. అప్పటికే ఈ నోట ఆ నోట విన్న కొందరు నిజమో కాదో అన్న సందిగ్ధంలోపడి ఎవరిని అడగాలో తెలియక వూరుకున్నవాళ్ళు పేపరులో చదివి ఆస్పత్రికి వెళ్ళారు.

కాని, అలాంటి సమయంలో హితైషులు చూపే సానుభూతి కూడా చేదుమాత్రలానే వుంది. మండేనిప్పుల మీద ఆజ్యం పోసినట్టు పుండు కెలికి కారం జల్లినట్టు, వాళ్ళ సానుభూతి వెనక అవహేళన దాగినట్లు, పనికట్టుకువచ్చి పరామర్శిస్తున్నట్టు వివరాలు వినడానికి కుతూహలపడ్తున్నారని- తమ వెనక గుసగుసలాడుకుంటూ నవ్వుకుంటారని….దొంగెవరంటే భుజాలు తడుముకున్నట్లనిపించడంలో ఆశ్చర్యంలేదు. మాధవ్ పరిస్థితి అలాగే వుంది. అంతా వచ్చి భుజంతట్టి జాలిగా చూస్తూ..”ధైర్యంగా వుండాలి మాధవ్…రాధగారికి నీవే ధైర్యం చెప్పాలి” అంటూ ఆప్యాయంగా పల్కరిస్తుంటే- ఒక్కొక్కరూ వచ్చినప్పుడల్లా మాధవ్ మొఖం వివర్ణమయ్యేది.

రాధ ఎవరివంక తలఎత్తి చూడలేనట్లు ఏదో నేరం చేసినదానిలా తల దించుకుని కూర్చుంది.

ఆమె ప్రియస్నేహితురాలు, కొలీగ్ అయిన సరళ వచ్చి “రాధా.. డార్లింగ్” కంపిస్తూన్న గొంతుతో అని చెయ్యి పట్టుకుంది. రాధ కళ్ళల్లో నీరు గిర్రున తిరిగింది. “ఛీ…ఛీ..రాధా..కన్నీళ్ళూ పెట్టడానికి ఏం జరిగిందని…నీవు ధైర్యస్థురాలివని అనుకున్నాను” అంటూ ఏం జరగనట్లు మాట్లాడి ఓదారుస్తున్నకొద్దీ రాధ దుఃఖం ఎక్కువైంది. “మాధవ్…ఏమిటిది, రాధకి ధైర్యం చెప్పవలసిందిపోయి మీరే ఏదో కొంప మునిగినట్టు మొహం పెట్టారేమిటి..” అంటూ మొహం గంటు పెట్టుకుని సీరియస్‍గా ఎటో చూస్తున్న మాధవ్‍ని చనువుగా మందలించింది.

అందరి రాక వక వంతు- మాధవ్ తల్లిదండ్రులరాక ఒక ఎత్తు- రెండేళ్ళ తరువాత కొడుకుకి జరిగిన విపత్తు గురించి విన్నాక ఆ కన్నప్రాణం మరి నిలవలేదు. ఆ రెండేళ్ళలో భర్తమాట జవదాటలేక ఆవిడ ప్రాణం ఎంత కొట్టుకుంటున్నా మాధవ్ యింటికి రాలేదు. మాధవ్ ఒకటి రెండుసార్లు బజారులో ఎదురుపడినప్పుడు…”మాధవా..” ఆర్తిగా పిలిచింది ఆవిడ. తల్లిని చూచి గబగబా నడిచివచ్చి “అమ్మా” అంటూ ఆమె చేతులు పట్టుకున్నాడు మాధవ్ ఆనందంగా. ఆ తల్లికొడుకులు ఆ పదినిముషాలలోనే పదియుగాల మాటలు మాట్లాడుకున్నారు. ఇద్దరి కళ్ళు చెమ్మగిల్లాయి. “అమ్మని మరిచిపోయావా నాయనా.. మీ నాన్నగారు లేనప్పుడన్నా  రాకూడదా యింటికి” నిష్ఠుర్యం వేసింది ఆ తల్లి.

“అమ్మా.. అలా దొంగతనంగా వచ్చిపోవడానికి నేనేం నేరం చేశానమ్మా..ఎప్పటికయినా నాన్న నా తప్పులేదని గుర్తించిననాడు సంతోషంగా వస్తాను. పోనీ, నీ కొడుకు యింటికి నీవెందుకు రాలేదు చెప్పు..” అన్నాడు నవ్వుతూ.

ఆమె జవాబు చెప్పలేక తడబడింది. “నాన్నగారికిష్టంలేని పని నీవెలా చెయ్యలేవో నేనూ అలాగే చెయ్యలేనమ్మా…చేశాను కనక ఆయన యిష్టానికి వ్యతిరేకంగ నడవను”

“ఏదో నాయనా కావాలని చేసుకున్నావు. మీ యిద్దరూ ఆనందంగా వుంటే అంతే చాలు.” అంది ఆమె తృప్తిగా.

అవకాశం వచ్చినప్పుడల్లా కొడుకుని దూరంచేసిన భర్తని ఆమె క్షమించకుండా దుయ్యబడుతూనే వుంది. ఈరోజు మాత్రం ఆవిడ తెగేసి “మాధవ్‍ని వెళ్ళి చూసి తీర్తాను, మీకిష్టంలేదంటే మళ్ళీ గడప తొక్కను, వాడు నాలుగు మెతుకులు పెట్టకపోడు. నాది కన్నప్రాణం అండీ, ఎలా వూరుకోగలను” అంటూ ఏడుస్తూ రిక్షా తెప్పించుకుని ఎక్కుతూంటే, ఆయనా వచ్చి మాట్లాడకుండా ఆమెపక్కన కూర్చున్నారు.

“మాధవా… ఏమిటిరా ఈ ఘోరం, ఎవర్రా ఇంత దారుణం చేశారు” ఆస్పత్రికి వచ్చి గదిలోకి వస్తూనే వంటినిండా కట్లతో పాలిపోయినట్లు పడుకుని వున్న మాధవ్‍ని  చూస్తూనే ఆవిడ ఏడుస్తూ కొడుకుమీద పడింది.

అవధానిగారు కొడుకుని ఆ స్థితిలో చూసి చలించిపోయి ఏం మాట్లాడాలో తెలియక యిబ్బందిపడ్తూ కొడుకుమంచం దగ్గర నిలబడ్దారు.

తల్లిదండ్రుల్ని చూడగానే మాధవ్ మొహంలో కళ వచ్చింది. “అమ్మా.. వచ్చావా..నాన్నగారూ…వచ్చారా” అంటూ తల్లి చెయ్యి పట్టుకున్నాడు ఆనందంగా.

“ఎవరు చేసారురా యీ పని నాయనా, నిన్నిలా కొట్టడానికి నీవేం అపకారం చేశావురా వాళ్ళకి…వెధవలు డబ్బు, నగలు తీసుకుంటే తీసుకున్నారు. ఇలా దారుణం ఎందుకు చేశారురా..కులం గోత్రం తెలియనిదాన్ని పెళ్ళాడినా మీరిద్దరూ సుఖంగా వున్నారని తృప్తి పడ్డాను. కుక్కముట్టిన కుండ అయిపోయిందిరా ఇప్పుడింక..” ఆవిడ ఏడుస్తూ అన్న మాటలకి మాధవ్ గతుక్కుమన్నాడు. కుక్కముట్టిన కుండ! అత్తగారు మామగారు రాగానే మర్యాదగా లేచి మూలగా నిల్చుంది రాధ. ఆ మాటకి రాధ మొహం నల్లబడింది. మాధవ్ రాధ వంక చూశాడు. రాధ కళ్ళల్లో తిరిగే నీరు బలవంతాన అదిమిపెడ్తూంది.

“ఎంత కాదనుకున్నా మా కోడలు… కాకపోదు…అసలే తలెత్తుకోలేక చస్తున్నాం..యిప్పుడింక మొహం ఎలా చూపడంరా” అవధానిగారి బాధ అది.

వాళ్ళిద్దరూ రాధ ఆ గదిలో వుందన్నట్టె గుర్తించకుండా అటువేపన్నా చూడకుండా అంటున్న మాటలని సహించే శక్తిలేక రాధ గబగబా ఆగదిలోంచి వెళ్ళిపోయి వరండాలో బెంచీమీద చతికిలబడి, చేతుల్లో మొహం దాచుకుంది. ఇందులో తన నేరం ఏముందనిఇంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతున్నారు? అత్తగారు స్త్రీ అయివుండి కూడా తోటి ఆడదాని గురించి “కుక్కముట్టిన కుండ” అంటూ అంత హీనంగా ఎలా అనగలిగారు! అదే ఆవిడ కూతురయితే ఆ మాట అనగలిగేవారా? ఆ క్షణంలో రాధకి తనకెవరూ లేని లోటు తెలిసివచ్చింది. తన తల్లే వుంటే కడుపులో దాచుకునేది తనని….తన అవమానాన్ని ఆమెదిగా భావించి ఈ మాట అన్నవాళ్ల నోరు మూయించేది. తనకెవరూ లేరు…అ క్షణంలో రాధ ఎంతో వంటరిగా ఫీలయింది. తనవాడు అనుకున్న మాధవ్ ఆ రెండురోజులలోనే ఎంతో దూరం అయిపోయినట్లనిపించింది. వంటరిగా, దిగులుగా, భయంగా, దిక్కుతోచనట్టు ఆ బెంచీమీద వంటరిగా అలా ఎంతసేపో కూర్చుంది రాధ.

ఓ అరగంట తరువత అన్నపూర్ణమ్మ, అవధానిగారు బయటికి వచ్చారు. బయట కూర్చున్న రాధని చూసి ఆవిడ ఒక్కక్షణం ఆగి ఏదో అనబోయింది.

“ఊ, పద” అంటూ అవధానిగారు గదమాయించడంతో.

ఆవిడ ఆయనవెంట వెళ్ళిపోయింది.

ఒక్కమాట! ఒక్క సానుభూతి వచనం చెప్పివుంటే ఆ క్షణాన రాధకి ఎంతో స్వాంతనగా ఉండేది. హు..అసలే జాతి మతంలేని కోడలు- యిప్పుడందులో కుక్కముట్టిన కుండ అయిపోగా-ఎందుకు మాట్లాడుతారు!

రాధ విషాదంగా నవ్వుకుని చిన్నపోయిన మొహంతో గదిలోకి వెళ్ళింది.

ఏదో సంఘర్షణకి లోనయినట్టుగా మాధవ్ అశాంతిగా ఆలోచిస్తున్నాడు. రాధని చూసి “ఎక్కడికి వెళ్ళావు? అమ్మా, నాన్న వస్తే అలా వెళ్ళిపోవడం ఏమిటి?” అన్నాడు కాస్త కోపంగా.

“వెళ్ళక ఏం చెయ్యమంటారు? నా ఎదురుగానే జాతిలేనిది, కుక్కముట్టిన కుండ అంటూంటే వింటూ సంతోషిస్తూ కూర్చోమన్నారా?” గాయపడిన మనసుతో అడిగింది.

“హు..ఆ కాలంవాళ్ళు, నిష్ఠనియమం కలవాళ్ళు. ఒక్కసారిగా ఎలా మారిపోతారు? వాళ్ల పరువు ప్రతిష్ఠమంటగల్సిందన్న దుఃఖంతో అంటే అంటారు… మనకే యిలా వుంటే పాతకాలంవాళ్ళకి ఎలా వుంటుంది” మాధవ్ తల్లిదండ్రులని సమర్ధిస్తూ అన్నాడు.

సానుభూతి చూపకపోగా వాళ్ళనే వెనకేసుకొస్తున్న మాధవ్‍ని…కొత్త మాధవ్‍ని చూస్తున్నట్టు విస్మయంగా చూసింది.

“మాధవ్.. ఏ కాలంకి చెందినవారయినా మీ అమ్మగారు ఓ స్త్రీ తోటి స్త్రీకి జరిగిన అన్యాయానికి జాలి చూపకపోగా… అలా అంటే…హు..ఆడదానికి ఆడదే శత్రువు అని ఎందుకంటారో అర్ధం అయింది. తోటి స్త్రీ చూపలేని సానుభూతి పురుషులు చూపలేదని వారిని దుయ్యబట్టడం అనవసరం” అక్కసుగా అంది రాధ. మాధవ్ మొహం గంటుపెట్టుకున్నాడు.

“సానుభూతి చూపిస్తే నీవు పోగొట్టుకుంది తిరిగి పొందగలవా?” ఏదో జవాబివ్వాలని అన్నాడుగాని అతనన్నమాటలు అతనికే పేలవంగా కన్పించాయి. రాధకి ఏనాడు మాధవ్‍తో ఈనాటివరకు గట్టిగా మాట్లాడే అవసరం రాలేదు. యిద్దరిమధ్య చిలిపికజ్జాలు, అలకలుకూడా ఎన్నడూ రానీయకుండా అతనికనుగుణంగా తనని మార్చుకుంది. అతనన్నదే వేదంగా దేనికి ఎదురాడకుందా, ఎన్నడన్నా విసుగుతో ఏదన్నా అన్నా పట్టించుకోకుండా సౌమ్యంగా వుండే రాధకి ఆనాడు…తనున్న స్థితిలో మాధవ్ మాటలు, మాధవ్ నిరాదరణ, ప్రవర్తన ఆమెని గాయపరిచింది.

“కన్నతల్లిలేని నన్ను …ఒక్కసారి దగ్గిరకి తీసుకుని తల నిమిరితే చాలండి, నేను పొందిన అవమానం మరిచిపోయేదాన్ని…ఒక్కమాట కాస్త సౌమ్యంగా మాట్లాడితే చాలండి. నా వేదన మరిచిపోయేదాన్ని..తోటి స్త్రీనించి ఆమాత్రం ఆశించడం అత్యాశ అంటారా?…ఒక్కమాట…ఒక్కసారన్నా నావంక చూడకుండా ఏ పురుగునో చూసినట్లు చూసి వెళ్ళారండి…” రాధ రుధ్ధకంఠంతో అంటుండగా కన్నీళ్ళు జారాయి.

“బాగుంది. పెళ్ళినాడే వాళ్లతో తెగతెంపులు అయ్యాయి.. ఆనాడే నిన్నంగీకరించని వాళ్ళు, ఈనాడు ఎలా ఆమోదిస్తారనుకున్నావు?” చిరాగ్గా అన్నాడు.

“అవును..నిజమే..నాది అత్యాశే..క్షమించండి” రాధ యింక వాదన పెంచడం యిష్టంలేక కొంగుతో కన్నీరు వత్తుకుంటూ మాధవ్‍కోసం హార్లిక్స్ కలపసాగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *