May 8, 2024

ఒక్క రోజు పండగ కారాదు                

రచన: పుష్యమీ సాగర్ 

మనదేశం లో అనాది నుంచి మహిళ అణిచివేతకు గురి అవుతూనే ఉన్నది. స్వతంత్ర సమరం లో తమ వంతు కృషి ని చేసిన గొప్ప మహిళా దేశ భక్తులు చరిత్ర లో ఉన్నారు. 60 ఏళ్ళ పరిపాలన తరువాత కూడా సగటు స్త్రీ పరిస్థితి ఏమిటి..? నాయకుల కుటిల రాజకీయ తో మహిళా బిల్లు ని వెనక్కి తోసేసారు …మహిళా శక్తి కి ప్రతీక గా మార్చ్ 8 రోజున “మహిళా దినోత్సవం” అని గొప్ప గా జరుపుకొని, మరల షరా మాములే అంటూ  బానిస భావజాలం లో కి జారిపోతున్నారు …అసలు నేడు దేశం లో స్త్రీ ల స్థితి ని స్థూలం గా చూద్దాం… సాధారణం గా పని చేసే మహిళలు రెండు రకాలు గా విభజించవచ్చు ఒకటి సంఘటిత రంగం, మరొకటి అసంఘటిత రంగం.  ముందు వీటి గురించి క్లుప్తం గా తెలుసుకుందాము ..

సంఘటిత కార్మికవర్గానికి “ఉద్యోగుల రాజ్యబీమా సంస్థ” మరికొన్ని సదుపాయాలు లబిస్తాయి .. కాని అసంఘటిత రంగాలకు అవేమి వర్తించవు…ఇక పై రెండు రంగాల్లో మహిళ ఎంత భద్రతను పొందుతున్నది అంటే సరి అయిన సమాధానం చెప్పడం కొంచెం కష్టమే…ఇప్పటికి భారత దేశం లో కొన్ని వృత్తులలో కొనసాగుతున్న మహిళా కార్మికుల దుస్థితి శోచనీయము.

 

సఫాయి కార్మికులు: వీటిలో చాలా వరకు మహిళలు పని చేస్తుంటారు. వీరు సెప్టిక్‌ ట్యాంకుల్లో దుర్వాసనను భరిస్తూ పనిచేస్తారు. ఆరోగ్య భద్రత ఉండదు. పనికి తగిన వేతనం కూడా అంతంత మాత్రమే…ఎన్ని ప్రభుత్వాలు మారినా వీరిని పట్టించుకునే నాధుడే లేరు.  మేరీకుమారి గారి కవిత లో అన్నట్టు “కంపుతోటీ, కంపుతోడి – కడుపునిండే నా సఫాయి” అవును నిజమే కంపుని తోడి డబ్బులు సంపాదించి పొట్ట పోసుకునే వృత్తి లో ఉన్నవాళ్ళు…వాళ్ళకి వోట్లు వుండవు కనుక ఎవరు పట్టించుకోరు…మలమూత్రాలు ఎత్తి పోస్తూ, అనారోగ్యానికి గురి అవుతూ స్మార్ట్ ఫోన్ ల కాలం లో, నాగరికత అని జబ్బలుచరుచుకుంటున్న ఈ కాలం లో అలాంటి వృత్తిని ఇంకా కొనసాగించడం సిగ్గు చేటు…పారిశుద్ధ నిర్వాహణలో అహర్నిశలు కృషి చేస్తున్న సఫాయి కార్మికుల పట్ల పాలకులు, అధికారులు చిన్నచూపు చూస్తారు… వాళ్ళు మనుషులే కదా.

బీడీ కార్మికులు: బీడీ కార్మికులు తునికాకు సేకరించి వాటిని బీడీ లు గా చుట్టి, అమ్ముకుంటే వచ్చే స్వల్ప ఆదాయం తోనే పూట గడిచేది … బీడీ కార్మికుల జీవితాలు కార్ఖనాలో కంపుబతుకులు. దుర్భరమయిన జీవితాలను గడుపుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలు చూపించడంతో బీడీ కార్మికులు మూడు పూటలు ఆహారానికి దూరమవుతున్నారు. బీడీలు తయారీలో నడుం, మెదడు, వెన్నెముక నొప్పులతో అనారోగ్యంపాలవుతున్నారు. తంబాకు వాసనతో క్యాన్సర్‌ వంటి రోగాలు వెంటాడుతున్నాయి. బీడీ కార్మికుల హక్కులను యజమానులు కాలరాస్తున్నారు. కొంత మంది యజ మానులు బీడీ కార్మికులపై లైంగిక వేధింపులు ఎక్కువయి పోయినాయి. ఎక్కువ గా ఇంట్లో ఉండి పనిచేసుకొనే వెసులు బాటు వుండటం వలన చాలా మంది ఈ రంగం లో కి వస్తున్నారు. 16 గంటలు కష్టపడినా కూడా వారికి దక్కేది కేవలం రూపాయల్లో మాత్రమే. ప్రబుత్వం వీరి సమస్యలను పట్టించుకోదు… ఎన్నిసార్లు వినతి పత్రాలను అధికారులకు, నాయకులకు విన్నవించినా వీరి బాధలు తీరవు… ఇవేకాక దురాచారాల సంగతికొద్దాం. మొదటిగా ఇంకా బాల్యవివాహాలు.

బాల్య వివాహాలు: ఎప్పుడో బ్రిటీష్ కాలంలో నిషేధం విదించినప్పటికీ ఇప్పుడు కూడా అనేక రాష్ట్రాల్లో బాల్యవివాహాలు ప్రజాప్రతినిధుల ఎదుట, చట్టాన్నిఆచరించాల్సిన పోలీసుల ముందు యదేచ్చ గా కొనసాగుతూనే ఉన్నాయి …పెళ్లి వయసుకు రాని ఒక బాలికను …చదువుకోవాల్సిన వయసు లో మనువు చేసి పంపడం, అది కూడా నాన్న వయసు ఉన్నవారితో పెళ్లి జరిపించడం, చాలా దారుణం … రెండు పదులు దాటకుండానే ముగ్గురు నలుగురు పిల్లలు కలగడం ముప్పై వయసు వచ్చేలోగానే రక్త హీనత మరి కొన్ని జబ్బులు వెంటాడి అర్థాంతరం గా జీవితాన్ని చాలించడం విషాదం కాక మరేమిటి …మూఢ నమ్మకాలతో కునారిల్లుతున్నవ్యవస్థలో ఇలాంటి ఆచారాలు మహిళ  జీవితాన్ని నాశనం చేసేవే …

అంతరిక్షం లో కి నేటి మహిళ  దూసుకు పోతున్నా ఇంకా వెనకబడిన భావజాలం తో మన దేశం లో ని పురష అహంకారం బుసలు కొడుతూనే ఉంటుంది. ఉద్యోగాలలో, ఫ్యాక్టరీ లలో రెండు విధానాలు అమలు చేస్తారు …ఇక మహిళా కూలీల పరిస్తితి మరీ దారుణం…వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో పనిచేసే మహిళా కూలీలకు సమానం గా వేతనాలు ఇవ్వరు…మగకూలీలకు ఇచ్చినంత గా మహిళా కూలీల కు ఇవ్వరు. అదే విధంగా భవన నిర్మాణ కార్మికుల స్థితి కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది …ఎక్కడా సమానత్వం ఉండదు ..చట్ట సభ ల్లో మాత్రం 32 శాతం మహిళ లకు ప్రాధాన్యత ఇస్తున్నాము అని ప్రతి ప్రభుత్వం డబ్బా కొడుతూనే ఉంటుంది కాని ఆచరణ లో మాత్రం చేసింది శూన్యమే …ఇక చదువుకున్న మహిళలు తమ భద్రత ని వేరే వాళ్ళ చేతుల్లో పెట్టడం విషాదమే …ఈ రోజు సగటు స్త్రీ పట్ట పగలు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి …అలాగే చదువుకునే ఆడ పిల్ల స్కూల్ కి, కాలేజీ కి వెళ్లి క్షేమంగా తిరిగి వచ్చేదాకా తల్లి తండ్రులకి గుబులే …

పురాణాల్లో దేవత గా కొలవబడిన స్త్రీ నేడు ఎందుకు ఆట వస్తువు లా, విలాసానికి ప్రతీక గా మారిపోయింది.  రాతి యుగంలో మాత్రుస్వామ్యపు పరిపాలనే ఉండేది …క్రమం గా పురుషుడు స్త్రీని అన్నివిధాల బలహీనపరిచి వంటి ఇంటికి పరిమితం చేసాడు …ఇది ఒక్క రోజులో జరగలేదు కొన్ని వందల సంవత్సరాలు గా మరీనా క్రమమే నేటి పరిణామం…అప్పటి నుండి ఇప్పటి దాక స్త్రీ హింస కి గురి అవుతూనే వుంది.

వరకట్నపు చావులు, తల్లి తండ్రుల మూర్కత్వం అడ పిల్లల పాలిట శాపాలు గా మారి బతుకు మరింత దుర్బరం చేస్తున్నాయి…ఇప్పటికే జనాభా నిష్పత్తి లో చాలవరకు స్త్రీ సంఖ్య తగ్గిపోయింది. ఇలానే ఆడ పిల్ల లని పురిటి లోను, వరకట్నపు చావులలో స్త్రీ అస్తిత్వాన్ని రూపు మాపితే ఇంకొన్ని తరాల తరువాత స్త్రీ అన్నది కన్పించకుండా పోతుంది. ఇప్పటికైనా మించి పోయింది ఏమీ లేదు…చదువుకున్న వారంతా ఊరూరూ తిరిగి మహిళా చైతన్యానికి నడుం కట్టాలి. మూడ నమ్మకాలను పారద్రోలి మంచి సమాజం వైపు అడుగులు పడేలా చూడాలి. వీటికోసం పురుషులలో మంచివారు, సమసమాజ భావాలు కలిగిన వ్యక్తుల సహాయం తీసుకొని ముందు అడుగు వెయ్యాలి “మహిళా దినోత్సవం”ఒక్క రోజు పండగ గా చరిత్ర లో మిగలకూడదు అంటే… ప్రతి స్త్రీ తనవంతు కృషి ని సమయాన్ని వెచ్చించాలి. అప్పుడే ఆకాశం లో సగమై….ప్రపంచానికి దారి చూపుతుంది.

 

“మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ..”

1 thought on “ఒక్క రోజు పండగ కారాదు                

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *