May 6, 2024

ఎగిసే కెరటం-3       

డా. శ్రీసత్య గౌతమి  

[జరిగిన కధ: అతి తెలివైన సింథియా ఏమాత్రం ఆలశ్యం చేయకుండా గిరి గీసి రాకేష్ ను అందులో ఉంచేస్తేనే మంచిది, లేకుంటే మొగుడు అనే డెసిగ్నేషన్ ని పెట్టుకొని చంకనెక్కుతాడని వెంటనే ఊహించి, వంట చెయ్యను పొమ్మంది. కానీ తన లంచ్ లో మిగిలిపోయిన పిజ్జా ముక్కని రాకేష్ కి డిన్నర్ లో ఆఫర్ చేసింది. ఇండియాలో ఈజీ గా చటర్జీ దగ్గిర తనకి నచ్చినట్లుగా ఉద్యోగం చేసుకోగలిగింది, ఆ నైపుణ్యం అమెరికాలో కుదరటం లేదేమిటి? … అని తీవ్రంగా ఆలోచిస్తూ బిశ్వాని తలుచుకుంది. అటువంటి సిన్సియర్, హానెస్టీ అంతకన్నా ముఖ్యం గా కపటం తెలియని వ్యక్తిని తానెన్నడూ చూడలేదు. అటువంటి ఇచ్చేసే వ్యక్తులేగా పుచ్చేసుకునే వాళ్ళకి కావాలి?]

తన ఎజెండాలో తన మొదటి స్టెప్ క్రొత్తవాళ్ళని ఆకట్టుకోవడం, వాళ్ళకి బిశ్వా కన్నా తానే ముఖ్యమవ్వడం. అందుకే వాళ్ళచుట్టూ తిరుగుతోంది సింధియా. దీనివల్ల ఆమెకేమొస్తుందయ్యా అంటే క్రొత్తవాళ్ళను సింథియా ఎంతో నేర్పరితనంతో తన ల్యాబ్లో ఒక త్రాటి మీద నడిపిస్తుందని చటర్జీ అనుకోవాలి. మరి ల్యాబ్ లో నువ్వు చేసేదేముంది, అయినా వాళ్ళు స్టూడెంట్లు … బిశ్వా వాళ్ళని సూపర్వైజ్ చేస్తాడు, ల్యాబ్నీ మ్యానేజ్ చేస్తాడు, నువ్వు నీ పన్లు చూసుకుంటే చాలు అని అనగానే తనలో ఎన్ని నరాలు తెగాయో చటర్జీకి ఏమి తెలుసు? అలాగే మరో ప్రక్క బిశ్వా దగ్గిర తేనెపూసిన కత్తిలా మెలగాలి. అతనికి తన దురాలోచన ఏమీ అర్ధం కాకుండా తననే నమ్మాలి, అప్పుడే కదా బిశ్వాని ఆ క్రొత్తవాళ్ళనుండి పూర్తిగా దూరం చెయ్యగలదు? తనలోని నరాలను తెంపినందుకు చటర్జీకి కూడా బుద్ధి చెప్పగలదు?

హు… ఏవిటో … సింథియాలాంటి … “వాళ్ళకోసం” మాత్రమే బ్రతికేవాళ్ళవల్ల ఎవరికి లాభం? చటర్జీకా? బిశ్వాకా? క్రొత్తవాళ్ళకా? లేక ఆ రీసెర్చ్ సెంటర్కా? నిజానికి వీళ్ళందరికీ ఆవిడొక భారం ఎంత చటర్జీ వీస్మెత్తు లాభం ఆమెనుండి పొంద్తున్నా. చటర్జీ కళ్ళు తెరిస్తేగాని ఈ కుళ్ళుని కడగలేడు. అలా ఎవరొచ్చి కళ్ళు తెరిపిస్తారు? అలా తెరిపించకుండానే కదా సింథియా అహర్నిశలూ బెహరా వేసుకొని చటర్జీని, అతని చుట్టూ వుండే మనుష్యులని గమనిస్తూ ఉంటుంది. అదే ఆవిడ ఉద్యోగం. ఆమె ఏమి చెబితే అదే వేదం చటర్జీకి. ఇలా ఈజీ ఈజీ గా నాలుగు మాటలు చెప్పి హాయిగా గడిపేసిందే తప్పా … ఏదైనా ఒక మంచి పనితనాన్ని నేర్చుకోవాలని ఆలోచించలేదు. పోనీ చటర్జీతో తృప్తి పడిందా అంటే అదీ లేదు. కౌశిక్ వచ్చివెళ్ళిన నాటినుండి తనలో ఒక లేమి అనేది స్టార్ట్ అయ్యింది. అతనితో తిరిగిన రోజులన్నీ కూడా అమెరికా స్వప్నాలే. అతని సెల్ ఫోన్లో అతను చూపించే అమెరికా ఫోటోల్లోని అందాలన్నీ తన సొంతం కావాలనే క్రొత్త దురాశే రాకేష్ ని ఇంటర్ నెట్ ద్వారా వెతుక్కోవాడానికి పునాది వేసింది. కౌశిక్ ఆరోజు తర్వాత మళ్ళీ కాంటాక్ట్ లో లేడు తనతో. ఎందుకో తాను కూడా కౌశిక్ గురించి ఆరాటపడలేదు, ఏదో అమెరికా పిట్ట కదా… తన ఒడుపు, నేర్పు సరిపోద్దో లేదో అని అనుకున్నట్లుంది. పాపం రాకేష్ దొరికిపోయాడు పైగా రాకేష్ పెళ్ళి చేసుకుంటాడు. చటర్జీలు, కౌశిక్ లు చేసుకోరుగా … వాళ్ళు సెటిల్డ్ మనుషులు. ఎన్నాళ్ళని తను మాత్రం పెళ్ళి లేకుండా ఉంటుంది?

సమాజం పెళ్ళి అనే సౌకర్యాన్ని కూడా అందిస్తున్నపడు, తాను ఎందుక్కాదనాలి? ఆ పెళ్ళికి పెద్ద అర్హతలేమున్నాయని తాను కాదనుకోవడానికి … కావలసింది కేవలం ఒక ఆడా, ఒక మగ … తాళి, కట్టించడానికి ఒక బ్రాహ్మడు, ఆ తంతు చూడ్డానికి ఓ నలుగురు మనుషులు. ఆ తర్వాత ఎవరూ ఎవరికీ బాధ్యులు కారు. ఈమాత్రం దానికి తాను అది మాత్రం ఎందుకు వదిలెయ్యాలి? ఎలాగూ పెళ్ళి కావాలనుకునేటప్పుడు … ఆ చేసుకొనేదేదో విదేశాల్లో ఉన్నవాడిని చేసుకుంటే పోలా? అదేమన్నా విశేషమా ఈ రోజుల్లో? ఎంత అమేరికాల్లో, లండన్లలో ఉన్నా… ఇండియన్స్ మళ్ళీ ఇండియాలో అమ్మాయిలనే చేసుకుంటారు. అమెరికా వెళ్ళినంతమాత్రాన ఇండియా బుద్ధి పోదుగా. ముందు చేసేసుకుంటే పోయె…ఆ తర్వాత చూద్దాం…వాడ్ని ఎలా వంచాలో అని లెక్కలు వేసేసుకొని రాకేష్ ని చేసుకొంది.

ఈ చేసుకోవడానికి ముందరే రాకేష్ ఇంటర్నెట్ లో ప్రేమ కబుర్లతో, సైబర్ ముద్దులతో పాటు సింధియా అమెరికాలో నిలదొక్కుకోవడానికి అనువైన మార్గాలను కూడా సూచించాడు. మరి సింథియా అతి తక్కువగా కష్టపడి, అతి ఎక్కువగా సుఖించే మార్గాలను వెతుక్కున్నదే తప్పా…ఇన్నేళ్ళల్లో తాను కెరియర్ ని ఎలా సంపాదించుకోవాలని ఆలోచించలేదు. ఇప్పుడు రాకేష్ చూస్తే ఊదరగొట్టేస్తున్నాడు, పెళ్ళు దగ్గిరపడుతుంది, అమెరికా తన స్వంతం అయిపోతుంది. ఇంత తక్కువకాలంలో తాను అప్పటికప్పుడు ఏమి సాధించగలదు? నెవర్. సాధించిన్వాళ్ళని చూసుకొని ఓక ఏటేసేయాలి. అలాగయితేనే తన గీసుకున్న స్కెచ్ కి పెర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది. ఏమాత్రం లేట్ చెయ్యడానికి తనకు టైంలేదు. ఈ తాపత్రయాన్ని కూడా బిశ్వాకే రుద్దేసింది. ఎలాగూ తాను బిశ్వాన్ని ఒకందుకు ఫ్రేం చేసింది, ఈ రెండవదానికి కూడా బిశ్వానొక్క ఏటేసెస్తే తానొక పి.హెచ్ డి. పరురాలవుతుంది, ఒక ఇంటిదీ అవుతుంది. ఒక ఆడపిల్లకు పెళ్ళికావడంకన్నా ఆనందం ఏముంది చెప్పండి?

*****************

క్రొత్తవాళ్ళు (బిశ్వాకి) వచ్చేసారు ల్యాబ్ కి. రాగానే వాళ్ళు ఎవరినీ వెతుక్కోకుండా సింథియా దగ్గిరకి వెళ్ళిపోయి … ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు, చాలాసేపటివరకు. బిశ్వాకి తెలియనే తెలియదు వాళ్ళు వచ్చినట్లు … తానింకా ఎదురుచూస్తున్నాడు తన చాంబర్లోనే కూర్చొని ఎక్కడికీ వెళ్ళకుండా. చటర్జీ తనకు పొద్దున్నే ఈ-మెయిల్ కూడా ఇచ్చాడు… పూనం, రంజిత్, పాత్రో వస్తున్నారని … వాళ్ళతో మాట్లాడాక, తనని కలవమని. ఆ ఈ-మెయిల్ ను సింథియాకి కూడా కాపీ పెట్టాడు. ఎందుకంటే సింథియా అతనికి సెక్రటరీ కూడా డేటా బేస్ మేనేజ్మెంట్, చటర్జీ మేనేజ్మెంట్ తో పాటు. పాపం చటర్జీ, బిశ్వా లకి తెలియదు వీళ్ళని సింథియా బై పాస్ చేసిందని. అలా ఎదురు చూస్తూనే లంచ్ టైం అయ్యింది. బిశ్వా లంచ్ కి వెళ్ళిపోయాడు మరో సహ కొలీగ్ కి క్రొత్తవాళ్ళు వస్తే తనకి ఫోన్ చెయ్యమని చెప్పి.

సింథియా ఇన్ని మేనేజ్మెంట్లు చేసేస్తుంటే తాను చాలా బిజీగా వుండాలి, రాజకీయాలకి టైమే వుండదు మరి…అలా లేదే!!! అంటే అంతా బాస్ లో వుంటుంది. తమకు కావలసిన వాళ్ళని ఏదో ఒక కుర్చీ వేసేసి కూర్చోబెట్టుకుంటారు. ఎవరయినా అడిగితే చెప్పడానికి ఉండాలి కదా? నిజానికి ఈ పన్లన్ని ప్రొఫెషనల్ గా చేసే వాళ్ళు చటర్జీకి ఉన్నారు, వాళ్ళు హాస్పిటల్ స్టాఫ్. ఈమెది హాస్పిటల్ స్టాఫ్ కాదు, యూనివర్సిటీ స్టాఫ్ కాదు. తన సొంత స్టాఫ్ అందుకే ల్యాబ్ కి దగ్గరలో ఉంటుంది ఏదో మేనేజ్మెంట్ అని పేరు చెప్పి. మరి ఆమెకీ జీతం పే చెయ్యాలి కాబట్టి, తన రీసెర్చ్ ప్రాజెక్ట్స్ లోంచి డబ్బు ఇస్తాడు. నిజానికి అది ఊరకనే పోతున్న డబ్బు. ఏదో చిన్న ఉద్యోగమే కదా అని ఇలాంటి ఆడవాళ్ళకి సహాయాలు చేస్తుంటారు మగవాళ్ళు. కానీ పేను పెత్తనమిస్తే బుర్రంతా గొరిగిందిట, అలా సింథియా ఎవరో ఒకళ్ళకి గొరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు బిశ్వా టర్న్!!!

చటర్జీ బిశ్వా ఆఫీస్ క్ ఫోన్ చేశాడు, బిశ్వాలేడు. ఆపై సింథియాకి ఫోన్ చేశాడు. ఆమె ఎత్తలేదు, తనకి తెలుసు అది చటర్జీదే అని. వెంటనే వాళ్ళ ముగ్గురిని చాకచక్యంగా … “ఓకే… మీరు బిశ్వాని చాంబర్లో కలవండి. అతను మీకోసం ఎదురు చూస్తుంటాడు, మీకు అతనే గైడ్ చేసేది, లేట్ అయితే తాను వెళ్ళిపోతాడు, రోజూ ఒక పూటే వస్తాడు … మళ్ళీ ఏరాత్రో రావొచ్చు” అని.

వెంటనే వాళ్ళు ఒక్క ఉదుటున లేచి బిశ్వాని ఎక్కడ కలవకపోతారో అని పరుగున అతని చాంబర్ కి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిపోయాక సింథియా చటర్జీ కి ఫోన్ చేసింది “సారీ … మీ ఫోన్ ఇప్పుడే మిస్ అయ్యాను”.

చటర్జీ: “ఓకే… క్రొత్తవాళ్ళొచ్చారా?”

సింథియా: “యస్ … బిశ్వా దగ్గిరకి పంపాను”.

చటర్జీ: బిశ్వాకి ఫోన్ చేస్తుంటే ఎత్తటంలేదు, వాళ్ళతో మాట్లాడి నన్ను కలవమని చెప్పాను. కానీ రాలేదు. ఏమి జరుగుతుందో చూసి రా.

సింథియా: ఓహో… సరే” అని చెప్పి రిసీవర్ ని పక్కకు పెట్టి పైకి వెళ్ళింది.

అక్కడ ఈ స్టూడెంట్లు బిశ్వాకోసం ఎదురుచూస్తున్నారు. బిశ్వాకి తెలియదు, అతని కొలీగ్ కూడా కాసేపయ్యాక లంచ్ కి వెళ్ళిపోయాడు కాబట్టి, వీళ్ళు వచ్చారన్న సంగతి ఎవరికీ తెలియదు ఒక్క సింథియా కి తప్ప.

పైకి వెళ్ళాక సింథియా భయం నటిస్తూ… బాస్ ఫోన్ చేశారు, మీగురించి వెయిట్ చేస్తున్నారుట. బిశ్వాని మిమ్మల్ని కలిసి తన వద్దకు తీసుకురమ్మని చెప్పారుట, మీరింకా ఇక్కడే ఏమి చేస్తున్నారు? బిశ్వా ఏడి?”.

బాస్ పేరు వినగానే వాళ్ళు నిజంగా బెంబేలు పడిపోయి … బాస్ చాంబర్ కి పరుగులు పెట్టారు.

స్టూడెంట్స్: “మే ఐ కమిన్ సార్?”

చటర్జీ: యస్. కమాన్ ఇన్, ప్లీస్ బి సీటెడ్.

ఆ తర్వాత వాళ్ళతో చాలాసేపు మాట్లాడాడు. ఆఖర్న, బిశ్వా గురించి అడిగాడు.

చటర్జీ: డిడ్ యు మీట్ బిశ్వా?

వాళ్ళు వెంటనే “నో సార్. హి లెఫ్ట్ ఫర్ థ డే లుక్స్ లైక్… వియ్ మిస్స్డు హిం. సారీ అబౌట్ ఇట్. వియ్ డు నాట్ నో థట్ వియ్ నీడ్ టు కం ఎర్లీ ఇన్ థ మార్నింగ్”.

చటర్జీ: ఈస్ ఈట్? ఈస్ హి లెఫ్ట్? లెట్స్ గో టూ హిస్ ఆఫీస్!

బాస్ తో పాటు వెనుక ఫాలో అయ్యారు ముగ్గురూ. బిశ్వా ఆఫీసు ని తెరిచారు, అఫీసు రూం లో లైట్ ఆపేసి ఉంది, వెంటనే టైం చూశాడు, మధ్యాహ్నం ఒంటిగంట. బిశ్వాకి ఆశ్చర్యం వేసింది వాళ్ళు చెప్పింది విని. బిశ్వా వెళ్ళిపోయాడా? పైగా తాను ఈ-మెయిల్ ఇచ్చాక కూడా! పోనీ వంట్లో ఏదైనా సడన్ గా బాగోలేదా? అలా అయితే తనకు చెప్పవచ్చుగా.

“ఒకవేళ ల్యాబ్ లో పనిచేస్తున్నాడేమో” … అందరూ వెళ్ళారు అటు ప్రక్క. ఎవరూ లేరు. చటర్జీకి ఆశ్చర్యం వేసింది. మొదటిసారి వేరేవాళ్ళ ద్వారా వినడం… తాను నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడా?

ఆ తర్వాత … “సరే…రేపు వచ్చొకసారి మీరు బిశ్వాని కలవండి. తాను అన్ని విషయాలు మీ ప్రాజెక్ట్లకు సంబంధించి మాట్లాడతాడు, తర్వాత అందరం కలుద్దాం” అని చెప్పి వెనుదిరిగి వెళ్ళిపోయాడు.

పూనం, పాత్రో, రంజిత్ తిరిగి అలవాటయిన సింథియా దగ్గిరకి వెళ్ళి జరిగినవన్నీ చెప్పారు, వాళ్ళకి ఎంతో నమ్మకం – సింథియా బాస్ కి కావలసిన మనిషి, ఆ ల్యాబ్ కి ముఖ్యమైన మనిషి. తనకు దగ్గరయితే వాళ్ళకు బాస్ దగ్గిర మంచి ఇంప్రెషన్ ఉంటుంది అనీ. అలాగే వాళ్ళదగ్గిర అన్నిరోజులూ పునాది వేసుకుంది.

అయితే బిశ్వామీద మాత్రం ఏనాడూ వాళ్ళకి తప్పుడు గా చెప్పలేదు తన నోటితో. కానీ యాక్షన్స్ ద్వారా వాళ్ళంతట వాళ్ళే బిశ్వాని తప్పుగా అర్ధం చేసుకొని, బాస్ కి చెప్పించి బిశ్వాపై చటర్జీకి ఉన్న నమ్మకాన్ని, గౌరవాన్ని తుంచేయాలని ప్లాన్ చేసింది.

మొదటిరోజు సక్సెస్ అయ్యింది.

వాళ్ళల్లో ఏ ఒక్కరికీ తెలియదు, తప్పుడు ఇన్ ఫర్మేషన్ తో ఆ స్టూడెంట్లను పంపించి … వాళ్ళు బాస్ దగ్గిరకి వెళ్ళాక బిశ్వా ఆఫీసు రూంలోని లైట్ తానే ఆపేసి వచ్చి…ఆ తప్పుడు ఇన్ ఫర్మేషన్ ని వాళ్ళందరూ నిజమని నమ్మేలా చేసినది అని.

(ఇంకా ఉంది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *