May 7, 2024

మాయానగరం 27  

భువనచంద్ర

నన్ను నేను పోషించుకోలేని కుచేలుడ్ని. దరిద్రం అనే మొసలి బారిన పడ్డ గజేంద్రుడ్ని. అభిమానాన్ని కాపాడే దుర్యోధనుడి లాంటి స్నేహితుడు దొరకని కర్ణుడ్ని. ఎంత హింసను అనుభవించినా దైవదర్శనం  లభించని భక్తుడ్ని. నన్ను ప్రేమించద్దు. నన్ను గౌరవించనూ వద్దు. కేవలం నన్నో ‘జీవి ‘ లా చూడంది. మనిషిలా చూడకపోయినా ఫర్వాలేదు.

“అంటే ఏం చేయమంటారు?” అన్నాడు విసురుగా శామ్యూల్ రెడ్డి.

“అయ్యా! మీరో గొప్ప మానవతావాది … ఓ గొప్ప స్కూలు నడుపుతున్నారు. నేను కొద్దో గొప్పో చదువుకున్నవాడ్ని. ఒక్కప్పుడు బాగా బతికినవాడ్ని. కానీ కాలం కలసి రానప్పుడు కోటీశ్వరుడైనా కుచేలుడు కాక తప్పదు. ప్రస్తుతం నా పరీస్థితి అంతే. నాకు నేను చెప్పుకోకూడదు కానీ నా బుర్ర చాలా పదునుంది. ఒకే ఒక్క చిక్కు ఏమిటంటే, అది మంచి పనులు చేయడానికి పనికి రాదు. అది నా స్వానుభవం. మరొకటి ఎమిటంటే, నేను నిచ్చెనలాంటి వాడ్ని. ఇతరుల్ని మా చక్కగా అందలం ఎక్కించగలను గానీ, నాకు నేను ఉపయోగపడను. ఉన్నదున్నట్టు చెబుతాను, మీ పూర్వికులు రెడ్లు. ‘మతం మార్చుకున్నారు ‘ అన్ని విధాలుగా సంపాదించారు. మీకు కాస్త ప్రధమ కోపం ఎక్కువ. కానీ మీ భార్యగారి ముందు మీరు నోరెత్తరు. ఇప్పటి వరకు మీరు సతీవ్రతులే. ఈ మద్యనే మీ మనసుకి రెక్కలొచ్చాయి. మీ జీవితంలో ‘ప్రేమ ‘ అనే ద్వారం మొట్టమొదటి సారిగా తెరచుకుంది. నలభై ఏడేళ్ల వయసు కాస్త ఇరవై కి దిగిపోయింది. మీ పిల్లలు కూడా మీకు గుర్తుకురానంతగా ప్రేమలో మునిగిపోయారు. కళ్ళు తెరిస్తే ‘శోభ ‘ … కళ్ళు ముస్తే ‘శోభ ‘ … నడిస్తే శోభ… నిలబడితే ‘శోభ ‘ మీ జీవితం మొత్తం ‘శోభయమానం ‘ అయ్యిపోయింది. ఆకలి పుట్టదు…. నిద్రపట్టదు… చెవులు తెరుచుకునే ఉంటాయి కానీ ఏదీ వినపడదు. .. ఆ పిల్ల స్వరం తప్ప. కళ్ళు తెరచుకునే ఉంటాయి కానీ ఏదీ కనపడదు… ఆ పిల్ల రూపం తప్ప. ఇదీ మీ ప్రస్తుత పరిస్థితి. శకుంతలని చూసి విరహ వేదనతో అలమటించిన దుష్యంతుడి పరీస్థితి మీది. దీనికి ఒక్కటే మార్గం …” ఆగాడతను.

“అసలు నువ్వెవరు? ఇవన్నీ నీకెలా తెలుసు? నా దగ్గరకెందుకొచ్చావు? బ్లాక్ మేలింగా?” అసహనాన్ని కోపాన్ని అదుపులో వుంచుకుంటూ అన్నాడు శామ్యూల్ రెడ్డి.

అతనిలో అతి పెద్ద ప్లస్ పాయింట్ అదే! కోపాన్ని ఎంత త్వరితంగా వెళ్ళగక్కుతాడో, అవసరం అనుకున్నప్పుడు అంతగానూ అణుచుకోగలడు అంటూనే ఎదుట వ్యక్తిని పరీక్షగా చూశాడు. ఆ మనిషి సన్నగా ఉన్నాడు. కొంచం పొడుగ్గానూ ఉన్నాడు. పైజామా లాల్చీ, భుజాన సంచీ, దవడలు లోపలకి పోయాయి. గుంట కళ్ళు. కానీ ఆ కళ్ళల్లో ‘ కన్నింగ్ నెస్ ‘ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎంతగా అంటే ఆ మనిషిని తక్షణం వదిలించుకోమని మనసు చెప్పేంతగా!

“నా పేరు సర్వనామం… అంటే మీరే పేరుతో పిలిచినా పలుకుతాను. అయినా జనాబ్… ‘పేరులో ఏముంది ‘ అని పెద్దు ఏనాడో సెలవిచ్చారనుకోండి. అదీ రైటు కాదు. లేకపోతే ఇందరు సినీ నటులు నటీమణులు పేరెందుకు మార్చుకుంటారు? ఇన్ని రకాల న్యూమరాలజీలు ఆస్త్రాలజీలు, హస్త, పాద, ముఖ సాముద్రికలు లోకంలో ఎలా పుట్టుకొస్తాయి? నాకు తెలుసు… నా వాగుడు మీకు కోపాన్ని తెప్పిస్తోందని … దాన్ని మీరు అణచుకుంటున్నారని. అయ్యా.. కొన్ని కొన్ని సార్లు శాంతమే మహాభాగ్యం. సరే.. మీరు అడిగినా అడగకపోయినా నా గురించి నేను పరిచయం చేసుకోవాలిగా. నా పేరు సర్వనామమే. ఇహ ఊరు సంగతి మాత్రం అడగకండి. ఏ వూళ్ళో వుంటే ఆ ఊరే నాది. ప్రస్తుతానికి నా వూరు ఇదే. మీ గురించి నాకు ఎలా తెలుసు అని గదూ అడిగింది? మనిషనేవాడు తెలుసుకు తీరాలి…. ఎవరి వల్ల తనకి లాభం వుంటుందో, ఎవరి వల్ల తనకి హాని వుంటుందో ఆ రెండు విషయాలు తెలుసుకోని వాడు మనిషే కాదు. ఈ లోకంలో నడిచేది కులాల మతాల మీద మతాల మీదా, దేవుళ్ళ మీదా ప్రవక్తల మీదా , దేశభక్తుల మీదా దేశద్రోహుల మీదా కాదు… కెవలం యీ లోకం నడిచేది లాభనష్టాల మీద. అది ఎటువంటి బంధమైనా కానివ్వండి. లాభమున్న చోటె ఆసక్తి వుంటుంది. లాభమున్న చోటే ప్రేమవుంటుంది. లాభమున్న చోటే ఆప్యాయతలు, అనురాగాలు సర్వం నడయాడుతూ వుంటాయి. ఇహ నష్టం ఎక్కడుంటుందో అకక్డ భయం ఉంటుంది… అభద్రత వుంటుంది. అసహనమూ, క్రోధమూ వంటి వన్నీ అకక్డే వుంటాయి. ఇది నిఖార్సైన మాట”.

మళ్ళీ ఆగాడు సర్వనామం. శామ్యూల్ రెడ్డి కోపం నషాళానికెక్కుతోంది. “శోభ గారి విషయం” మనవి చెయ్యాలని గేట్ మాన్ తో చెప్పి తన అనుమతి మీద లొపలికొచ్చిన యీ వ్యక్తిని చూస్తుంటే శామ్యూల్ రెడ్డికి ఒళ్ళంతా కారం రాసుకున్నట్టుంది. కానీ ఏదో తెలియని ఓ సిక్స్త్ సెన్స్ అతన్ని తొందర పడవద్దని హెచ్చరిస్తోంది. అందుకే మౌనంగా వింటున్నాడు.

మీరు నా గురించి ఆలోచిస్తున్నారని నాకు అర్ధమౌతోంది. సరే… నా పేరు సర్వనామం. కొన్నాళ్ళ నుంచి యీ నగరంలోనే వుంటున్నాను. గత మూడు నెలలలో అత్యంత వేగంగా పేపర్లోకి దూసుకొస్తున్న వారిలో మీరు ప్రధములు. బోసు బాబు మీ కంటే సీనియర్ … పేపర్లో! అదీ కాక అతనికి చాణక్యుడి లాంటి గురువు అండ వుంది. చిత్రమేమిటంటే మీ ఇద్దరి మనసులూ తిరుగుతున్నది ‘శోభ ‘ అనే పిల్ల చుట్టూనే. ఇవన్నీ నాకు ఎవరూ చెప్పలేదు. నేనే గమనించాను. బతకాలనుకునే ప్రతీవాడు తన చుట్టూ వున్న ప్రపంచాన్ని గమనించాలి. నేను చేసింది అదే. చాలీచాలని సుఖాలతో విసిగిపోయాను. ఇందాక ‘బ్లాక్ మేలింగా ‘ అన్నారు కదూ? కాదు… అది వైటే. పూర్తిగా తెలుపే. స్వఛ్ఛమైన హంసలాంటి తెలుపు. నాకు మీ వల్ల లాభం కలుగుతుందనే విషయం నేను గ్రహింగలిగాను. అయితే ఆ లాభమ్న్ని మీ ‘మిత్రుడిగా’ పొందాలనుకుంటున్నాను…. శతృవుగా కాదు. యీ లోకంలో పైకి ఎదగాలనుకునే ప్రతీవాడు ఎన్నో కొన్ని ‘నెగటివ్’ పనులు చేయక తప్పదు. తెలివైనవాడు తను చేయ్యడు. ఆ పనులు ఇతరులతో చేయిస్తాడు. అలా చేయించాలంటే, ఆ ‘చేసేవాడు’ సమర్ధుడై వుండాలి. అసమర్ధున్ని ఎన్నుకుంటే, అదః పాతాళానికి పడిపోయినట్టే. నేను సమర్ధున్ని, నన్ను ఎంచుకోండి.

మీ పదవీ వ్యవహారాలనుంచి పడక గది వ్యవహారాల దాకా మీరు నిశ్చింతగా వుండొచ్చు. ఏదీ బయటకు రాకుండా చూసుకునే బాధ్యత నాది. నెలకింత ఇమ్మని నేను అడుగను. నా అవసరాలని మీరు గమనించండి… మీ అవసరాన్ని నేను గమనిస్తా! తొందరేం లేదు, అన్నట్టు నా సమర్ధత నేను నిరూపించుకోవాలిగా? ఇదిగో యీ ఫైల్ ని విశ్రాంతిగా చూడండి. త్వరలోనే మళ్ళీ వస్తాను. “భుజానికి వేలాడుతున్న సంచీ నుంచి ఓ పైల్ తీసి శామ్యూల్ రెడ్డి కిచ్చి నవ్వుతూ బయటకు నడిచాడు సర్వనామం.

ఒకొక్క పేజిని తిప్పుతూ నిర్ఘాంతపోయాడు శామ్యూల్ రెడ్డి … తన చిన్నతనం నుంచీ యీనాటి ఉదయం వరకు వున్న ఫొటోలు, వివరాలూ, తప్పొప్పుల పట్టికలు వగైరాలని చూసి ‘భయంకరమైన’ తెలివితేటలూ, ‘భయంకరమైన ‘ ఓర్పు వున్నవాడికి కానీ అంత ‘లోతు’ కి వెళ్ళడం సాధ్యం కాదు. తన చుట్టూ వీడు నీడలా తిరుగుతున్నాగమనించలేదంటే వీడెంత ఘటికుడై వుండాలి? అనుకున్నాడు శామ్యూల్ రెడ్డి.

‘వీడు ఎటువంటివాడైనా అభినందించక తప్పదు’ అని కూడా అనుకున్నాడు. “ఏం చెయ్యాలి?” అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు శామ్యూల్ రెడ్డి.

“తల నొప్పిగా ఉందా సార్?” అమాయకంగా అడిగింది శోభ. ఆమె ముఖం ఎంత అమాయకంగా, స్వఛగా వుందంటే , అప్పుడే విరిసిన రోజాలా వుంది. అప్పుడే సూర్యున్ని చూసి ఆశ్చర్యపోయిన చివురుటాకులా వుంది.

“ఐ కాన్ డూ ఎనీ థింగ్ ఫర్ దిస్ డివైన్ బ్యూటీ” అనుకుంటూ లేచి నిల్చున్నాడు శామ్యూల్.  అతని కళ్ళల్లో ఓ నిశ్చయం కదలాడింది.

**********************

“అవకాశం రానంత కాలం అందరూ మంచివాళ్ళే, అందరూ గొప్పవాళ్ళే. అవకాశం దొరికినప్పుడు కదా అసలు విషయం తేలేది! ఆనంద్… నువ్వూ అంతే… నేనూ అంతే. ఒక్కసారి నన్ను చూడు…. నాలో లేనివి ఆ మాధవిలో ఏమునై? ఆవిడంటే నువ్వు పడి ఛస్తున్నావని నాకు తెలుసు. అదో వెర్రిమాలోకం. ఎవడ్నో ప్రేమించిందిట, వాడు చచ్చిపోయినా వాడ్నే ప్రేమిస్తోందిట. పెళ్ళి కాకపోయినా మిసెస్ రావ్ అని.  ఏం? నువ్వు మగాడివికావా? కోరి వచ్చిన ఆడదాన్ని కాదనే మగాడు నిజంగా లోకంలో ఉంటాడా? ఆనంద్ … నిన్ను విరగదన్నించాలనుకున్నాను. తన్నించగలను. కాళ్ళు చేతులు కట్టి నిన్ను మా ఇంట్లో బంధించగలను… ఏదన్నా చేయగలను. కానీ చెయ్యలేను. ఎందుకో తెలుసా … నాకో నమ్మకం. ఒక్కసారి నాతో పడుకుంటే ఏనాడూ నన్ను వదిలిపోలేవు. అంత సుఖాన్ని ఇస్తా. బంధీలదొడ్డిలాంటి ఈ ఛండాలపు గదినుంచి నిన్ను విముక్తుడ్ని చేస్తా. నీ ఇష్టం వచ్చిన బంగాళా చూపించు … వారం రోజుల్లో దాన్ని నీ పేరిట రిజిస్ట్రాషన్ చేయిస్తా. కానీ, నన్ను మాత్రం తిరస్కరించకు. నీమీద నాకు వచ్చింది నిజమైన ప్రేమ. అందుకే కుక్కలా నీ వెంటపడి అడుగుతున్నా. అసలిలా అడుక్కునే స్వభావం కాదు నాది. కోరినదాన్ని సాధించుకోవడమే నాకు తెలుసు” ప్రాధేయపడుతూ అన్నది సుందరి.

ఆనందరావుకి ఇబ్బందిగా అనిపించింది. పడవలాంటి కారు ఇంటి ముందు ఆగడాన్ని వీధిలో అందరూ చూశారు. సుందరి అర్ధనగ్న దుస్తుల్లో లోపలికి రావడం జనానికి మరింత ఊపునిచ్చింది. సుందరీబాయ్ ఏమాత్రం ‘కేర్ ‘ చెయ్యకుండా గట్టిగా మాట్లాడటం వారి చెవుల్లో అమృతం పోసినట్టుంది. చెవులు ఆర పెట్టుకొని మరీ వింటున్నారు. ఆడవాళ్ళైతే సిగ్గుతో చెవులు మూసుకున్నట్లు నటిస్తూ మరీ వింటున్నారు.

‘నల్లా’ గొడవల్లో తప్పా ఇలాంటి రొమాంచిత సంభాషణలు ఆ వీధి ‘పుట్టాక’ ఏనాడు జరగలేదు.

కాఫీ టిఫినీలు అప్పుడప్పుడు ప్రసాదించే ‘వదిన గారికి ‘ యీ సంభాషణ వింటుంటే భలే ఉత్సాహంగా ఉంది.

“అవునంటాడా? కాదంటాడా? అవునటే వూహ్.. కాదంటే చెల్లికి ఇచ్చి పెళ్ళి చేయచ్చు. మళ్ళీ యీ మాధవెవత్తి?” ఇవీ ఆవిడ మనసులోని ప్రశ్నలు.

“అలనాటి జ్యోతి లక్ష్మి, మొన్నటి నమితలా ఉందీ అమ్మాయి” విమెన్ గెట్ నాటీ అట్ ద ఏజ్ ఆఫ్ థిర్టి” అంటారు.. చూడటానికే ఇంత ‘విషయం’ ఉన్న ఆడది పడక మీద ఎలా ఉంటుందో? ఓ..గాడ్.. “ఊహల్లో తేలిపోతున్నాడు ఇంటి ఓనరు. ఆయన వయసు యాభై రెండు.ప్రశస్తమైన బట్టతలా, తోడేలు పొట్టా. భార్య పక్కలోకి రావడం మానేసి చాలా ఏళ్ళైంది. అయితేనేం.. ఊహేగా.

“అబ్బ.. వీడికంటే ఓ అడుగు పొట్టిగా వున్నాను కానీ లేకపోతేనా?” అని సుందరీ బాయ్ ని నగ్నంగా ఊహించుకుంటూ అనుకున్నాడు శబరి. అతను ఇంటి ఓనరు కొడుకు. వయసు ఇరవై రెండు. ఎత్తు ఐదడుగుల రెండంగుళాలు.

“ప్లీజ్ సుందరి గారు …ప్రస్తుతానికి ఆ విషయం వదిలెయ్యండి. చుట్తుపక్కలవాళ్ళంతా కళ్ళూ చెవులు ఇటే పెట్టుకొని వున్నారు. ప్లీజ్…” బ్రతిమాలుతూ అన్నాడు ఆనందరావు. ఫక్కున నవ్వింది సుందరి.

“యీ సిగ్గరితనమే నీలో నాకు నచ్చింది ఆనంద్ ” వాళ్ళెందుకు యీ చుట్టుపక్కలే తచ్చాడుతున్నారో తెలుసా? వాళ్ళెవరికీ పట్టని అదృష్టం నీకు పట్టిందని కుళ్ళుకు చస్తున్నారు. ఇహ్.. ఆడాళ్లమాట ఎత్తకు. బోయ్…  అవకాశానికి నిర్వచనం ఏమిటో తెలుసా? అదృష్టం… అదృష్టమే అవకాశం, అవకాశమే అదృష్టం. ఆ అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకునేవాడే అసలు సిసలైన తెలివైనవాడు. కాదని కాలదన్నుకునేవాడు నిజమైన మూర్ఖుడు. సరే.. నీ మాట ఎందుకు కాదనాలి? వెడతా.. కానీ గుర్తుంచుకో.. నేను నిన్ను వదల్ను. వలపుతో గెలుచుకుంటా లేకపోతే…” మాటని మధ్యలోనే తృంచేసి ‘టాటా” అన్నట్టు  చేయ్యాడించి బయటకొచ్చింది సుందరి.

‘మాటలు ‘ వినిపించేటంత దూరాన్ని మెయింటేన్ చేస్తున్న ఓ పదిమంది ఆడామగా కంగారుగా ఎలకల్లా ఎవరి కలుగుల్లోకి వాళ్ళు పరిగెత్తారు. కారు వెళ్ళిపోయాక దీర్ఘంగా నిట్టూర్చాడు ఆనంద రావు.

జీవితంలో ఇటువంటి పరీస్థితి ఎదురౌతుందని అతను ఏనాడు వూహించలేదు. ఇది ఇక్కడితో ఆగదని .. ముందుకు వెళ్ళినకొద్ది మరింత ప్రమాదమనీ అతనికి తెలుస్తూనే వుంది. ఆపడం ఎలా? శతృత్వం వుంటే ఏదైనా చేయొచ్చు. ప్రేమించి వెంటపడేవాళ్ళని ఏం చేయగలం? ఇది ప్రేమేనా? కాదు… పచ్చివాంఛ.. పశువాంఛ. రెండు హ్ర్దయాలు స్పందిస్తే దాన్ని ప్రేమ అనొచ్చు. ఇది ప్రేమ కాదు. కేవలం కోరిక. అదీ వన్ సైడ్. సడన్ గా అతనికో ఆలోచన వచ్చింది. “నేను మాధవిని ప్రేమిస్తున్నాను. నాదీ వన్ సైడే. అయితె సుందరి లాగా నాకు ఆమె శరీరం మీద వాంఛ లేదు. శరీరం మీద కాంక్ష లేని ప్రేమ అనేది వుంటుందా? ఒకవేళ మాధవి ఓ.కె. అంటే అప్పుడామె శరీరాన్ని తాకకుండా ఉండగలనా? ” తనని తానె ప్రశ్నించుకున్నాడు ఆనందరావు. “అసలు ప్రేమకి శరీరానికి సంబంధం ఏమిటి? ప్రేమ అనేది మనసుకు సంబంధించిదా లేక శరీరానికి కూడానా? ” అని ప్రశ్నించుకున్నాడు.

“ఇదిగో ఆనంద్ రావు.. ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది యీ వ్యవహారం?”వెకిలిగా అడిగింది రెండో ఇంట్లో అద్దెకుండే

అనసూయమ్మ.

“ఏ వ్యవహారం పిన్నిగారూ? అయినా వినాల్సిందంతా విన్నాక మీకీ అనుమానాలు ఎందుకు? “కావాలనే కొంచం వెటకారంగా అన్నాడు ఆనంద్ రావ్.

“అది కాదయ్య.. మాంఛి అందగత్తె  అందునా డబ్బు గిబ్బు బాగా వున్నది వెంటపడి మరీ అడుగుతుంటే వద్దంటావే?” అదో రకమైన గొంతుతో అన్నది అనసూయ.

“ఒప్పించమని ఆవిడ మీదేదైనా లంచమిచ్చిందా?” ఫక్కున నవ్వాడు ఆనంద రావు.

“పిన్నిగారు.. ఇంత ఉత్సాహం మీకెందుకండి? అయినా… ఎందుకులెండి” అనాల్సిన మాటని మధ్యలోనే వదిలేశాడు ఆనంద రావు.

“అదికాదయ్య.. నువ్వు మంచివాడివని మాకు తెలుసు. అదే మరోసారి ఋజువైంది” మాట మార్చి బయటికెళ్ళింది అనసూయమ్మ.

“అదేమిటోయ్ ఆనంద రావూ.. కొబ్బరిముక్కలాంటి పిల్ల కోరి వస్తే కొరుక్కుతినాలి కానీ పస్తయిస్తావేమిటోయ్?” మనసులోనే లొట్టలు వేస్తు అన్నాడు ఇవతలింటి సామాన్యరావు.

“అంతేనంటారా?” సూటిగా సామాన్యరావు కళ్ళలోకి చూస్తూ అన్నాడు ఆనంద రావు. అతనికి తెలుసు సామాన్య రావు రెండో పెళ్ళి చేసుకున్నాడనీ, ఆవిడ పాపం నిట్టుర్పులతోనే అఘోరిస్తూ వుంటుందనీ.

“అదీ… అంతేలే… నువ్వు కాబట్టి నిగ్రహంగా వుండగలిగావు కానీ మరొహడు మరొహడు అయితేనా” ఓ పిచ్చినవ్వు జారుకున్నాడు సామాన్య రావు.

ఆ తరవాత ఓ అరగంట సేపు ఆనంద రావు రూము కి ఆడామగా పరామర్శకుల “భాషణ ‘ తో నిండిపోయింది.

అందరిలోనూ ‘ ఆకలే’ చూపుల్లో, మాటల్లో  మనసులో అంతా.. ‘ఆకలే’ … ఆ ‘ఆకలే’. కానీ విందుని విస్తర్లోకి వడ్డిస్తే హరాయించుకోలేని మనుషులు వీళ్ళు.

శృంగారం అంటే ఏమిటో నిజంగా తెలియని అమాయకులు. వీళ్ళ దృష్టిలో శృంగారం అంటే నాలుగు నిమిషాల పని. కళ్ళుముసుకొని కానిచ్చే సంభోగం. అంతే స్పందనల గురించి ఏమాత్రం పట్టించుకోని మనస్తత్వాలు. పెళ్ళికి పరమార్ధం పిల్లు పుట్టడమే… లేక పుట్టించడమే. ‘సెక్స్’ అనే మాటని ఎత్తకూడదు. ఆ మాటే ఓ పచ్చిబూతు. ఆ మాట ఎత్తితే మహాపాపం. ఎంత పాపం అంటే లక్ష నరకాలలో పడినంత.

*******************

“అక్కా.. దేవుడున్నాడంటావా?” మెల్లగా అడిగింది శోభ మాధవిని. ఇద్దరూ కోదండ రామలయంలో వున్నారు… శ్రీరామనవమి సందర్భంగా.

“ఎందుకు లేడు? ఎవరూ లేకుండ ఇంత సృష్టి ఎలా జరుగుతుంది? శోభ… ఇంకోటి కూడా వుంది. ‘ఎవరూ లేరు అనుకునే బదులు .. ఎవరో ఒకరు ఉన్నారు … ఆపదలో నన్ను ఆదుకుంటారు” అనుకుంటే ఎంత ధైర్యంగా వుంటుందో ! ఆ ధైర్యమే కాసేపు దేవుడని అనుకో “చల్లగా నవ్వుతూ అంది మాధవి.

కోదండస్వామి గుడి కోలాహలంగా వుంది. గుంపులు గుంపులుగా భక్తులు వస్తున్నారు.

“దేవుడా ఏడాదికోసారి నీ పెళ్ళి ఊరువూరూనా అత్యంత వైభవంగా జరుగుతూనే వుంది. ఊరందరూ నీకు కట్నకానుకలు సమర్పించుకుంటూనే వున్నారు. యుగాలు మారినా నీ వివాహ మంత్ర తంత్రాలతో మహావైభవంగా జరుపుకుంటునే వున్నావు. నేనేం తప్పు చేశాను? ఆడదానిగా పుట్టడమే నా తప్పా? అందునా బీదదానిగా పుట్టడం నా తప్పా? నా వల్ల మరో ఆడది కాపురానికి నోచుకోవడం లేదు. బలవంతపు బ్రహ్మచర్యం ఆవిడకి తప్పడం లేదు.  సీతమ్మా… నువ్వూ ఆడదానివేగా? ఓ సాటి ఆడదాని బాధ నీకు తెలీదా? ఇన్ని లక్షల సార్లు మళ్ళి మళ్ళీ మళ్ళీ నీ మొగుడ్నే నువ్వు పెళ్ళాడుతున్నావే, ఒక్కసారైనా పెళ్ళి కాని నేను ఏం చెయ్యాలి? చస్తే మహాపాపం అంటారు. బ్రతికి ఏం చేయను? ఆడదాన్ని ‘కట్నం ‘ తో కొలిచే యీ దేశంలో నన్నెందుకు పుట్టించావు? అసలిది ఏం సమాజం? కుక్కలు నక్కులు కూడా కట్నం అడగలే. మరెందుకు మనుషులు మగువలని ఇలా పీక్కుతుంటున్నారు? కట్నాలా? లాంఛనాలా? అలకపాన్పు లా ? వాచీలా? స్కూటర్లు, కారులూనా? అమ్మ.. సిగ్గు విడిచి చెబుతున్నా.. ఇల అకోరుకునే దగుల్బాజీ వెధవల్ని పెళ్ళి చేసుకోవడం కంటే వ్యభిచారం చెయడం వెయి రెట్లు నయం. క్షమించు .. అటు పక్క నీ వివాహం జరుగుతుండగా ఇటుపక్క ఇంత కృరంగా నేను ఆలోచించకూడదు. కానీ ఏం చేయను? నా గుండె ఉడికిపోతోంది. నా ఒళ్ళు మండిపోతోంది. యీ సమాజాన్ని యీ మగజాతిని పెట్రోల్ పోసి తగలెయ్యాలని వుంది. కానీ ఓ సీతమ్మ… ఓ జానకి.. ఓ మైథిలి.. నేనేమీ చేయలేను. కారణం నేనో మధ్యతరగతి ఆడదాన్ని” గొణుకుంటోంది నీరజ… ఆమె మదాలస మరదలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *