May 6, 2024

శ్రీకృష్ణదేవరాయ వైభవం           ఎపిసోడ్-2

 

రాచవేల్పుల విజయభాస్కరరాజు

శ్రీ కృష్ణదేవరాయల వారి జన్మ దిన తేదీలపై, ఆ మహనీయుని వయస్సు పై రక రకాల వాదోప వాదాలున్నాయి. కవులు, రచయితలు ఎవరికి తోచిన విదంగా వారు సదరు తేదీని, వయస్సును నిర్ణయిస్తూ వచ్చారు. వారి వారి వాదనలకు మద్దతుగా ఎన్నెన్నో ఆధారాలను క్రొడీకరించారు. అయితే అవన్నీ నిరాధారాలే.

కృష్ణదేవ రాయల వద్ద నున్న అష్టదిగ్గజాల్లో ప్రధాన కవివర్యులైన అల్లసాని పెద్దన గారు ఒకానొక పద్యము ద్వారా శ్రీ కృష్ణ దేవ రాయలు పరమపదించినట్లు వ్రాశారు. అందులో తెలుగు సంవత్సరం, నెల, తిథి, వారాన్ని పేర్కొన్నారు. అయితే ఆయన వ్రాసిన ప్రకారం ఆ ఏడాది మృత్యు ఒడి చేరినది రాయల వారి తనయుడు. అంతకు ఎనిమిది నెలల క్రితమే రాయల వారు తన తనయుడిని చక్రవర్తిని చేసి, తాను ప్రధాన మంత్రి, దండ నాయకుడిగా కొనసాగుతుండి నాడు. అందువల్ల పెద్దన వారికి చక్రవర్తి చనిపోయారన్న సమాచారం మేరకు శ్రీ కృష్ణ దేవ రాయల వారే మృతి చెంది ఉంటారని భావించి అప్పటికప్పుడు తన పద్యకవిత ద్వారా బాధను వ్యక్త పరచి ఉండవచ్చు. ఆ పద్యము ఇలా ఉండినది.

“బోరన యాచక ప్రతతి భూరి విపద్దశ నొందుచుండగా నారయ శాలివాహన శకాబ్దములద్రి యుగాబ్ది సోములందారణ వత్సరంబున నిదాఘ దినంబున జ్యేష్ట శుద్ద షష్టీ రవి వాసరంబున నృసింహుని కృష్ణుడు చేరె స్వర్గమున్ ద్వారకనున్న కృష్ణుడవతార సమాప్తమునొందు కైవడిన్”.

ఈ పద్యము నాధారము చేసుకొని క్రీ.శ. 1524వ సంవత్సరమున శ్రీ కృష్ణ దేవ రాయలు మృతి చెందినట్లు కావలి వెంకట రామ స్వామి గారు తన దక్షిణ హిందూ దేశ కవుల చరిత్రలో పొందుపరిచారు. అదే విధంగా రాయలు మరణించే నాటికి నలభై సంవత్సరాల వయసంటూ అందులో పేర్కొన్నారు. కాగా చరిత్ర పై నిశిత పరిశీలన గావించకుండానే వీరేశ లింగం పంతులు గారు కేవలం పెద్దన రచనను ఆధారం గావించుకొని రాయల వారు హోణ శకం 1484 సంవత్సరంలో పుట్టారంటూ పేర్కొన్నారు. అయితే సరి అయిన ఆధారం దొరికేంతవరకు ఈ సంవత్సరాన్నే పరిగణనలోకి తీసుకోవడంలో తప్పు లేదని మినహాయింపు నిచ్చారు.  ఇలా ఎవరికి తోచినట్లు వారు రాయల వారి జన్మదినం, వయస్సులపై మనలను సందిగ్దంలో పడేశారు. కాగా క్రీ. శ. 1906 వ సంవత్సరంలో జనవరి నెల 18 వ తేదీన “సత్యవాదిని” వార్తా పత్రికలో శ్రీ కృష్ణ దేవ రాయల పుట్టిన తేదీని తేట తెల్లం చేస్తూ ఒక వ్యాసం ప్రచురితమైంది. ఆ వ్యాసంలో పద్య రూపకంగా తెలుగు సంవత్సరాల ప్రకారం వివరించబడింది. అందలి పద్యం ఇలా ఉంది.

“అందలి శాలివాహన శకాబ్దములద్రి వసుత్రి సోములన్ వందితమైన యవ్వికృతి వత్సరమందలి పుష్య మాస మందుందగు కృష్ణ పక్షమున నుండెడి ద్వాదశి శుక్ర  వాసరం బందుదయించే కృష్ణుడు  శుభాన్వితున్ డే నరసింహ మూర్తికిన్”

పై పద్యము ననుసరించి సంవత్సరము, నెల, వారము, తిథులను లెక్క వేయాలంటే వాస్తవంగా కొంత కష్టమైన పనే. అయినప్పటికీ తెలుగు సంవత్సరాల ప్రకారం పరిశీలించగా వికృతి నామ సంవత్సరం శాలి వాహన శకం 1392 లో వచ్చింది. ఆ మేరకు క్రీ. శ. 1470-71 వ సంవత్సరం వికృతి నామ సంవత్సరం అవుతుంది. తెలుగు సంవత్సరం ప్రతిసారి ఉగాది పర్వదినం తో మొదలై మళ్ళీ ఉగాదికి క్రితం రోజుతో ముగుస్తుంది. ఉగాది ఎప్పుడైనా మార్చి, ఏప్రిల్ నెలల్లో కొంచెం అటు ఇటుగా వస్తూంటుంది. ఆ ప్రకారం

క్రీ. శ. 1470 సంవత్సరంలో మార్చి నెల మూడవ తేదీ నాటి  ఉగాదితో వికృతి నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. తిరిగి క్రీ.శ. 1471 మార్చి నెల 20 వ తేదీతో  ముగుస్తుంది. ఈ మేరకు రాయల వారి పుట్టిన తేదీని ఖచ్చితమైన దినంగా నిర్దారించేందుకు ఆనాటి పౌర్ణమి, అమావాస్య, సూర్య, చంద్ర గ్రహణాలను. ఆ ఏడాది అధిక మాసం వచ్చిందా ? లేదా ? తదితర అంశాలను లెక్కించాల్సి ఉంటుంది. అదే కాకుండా ఆ ఏడాదిలో గానీ, అంతకు ముందు గానీ వెలువడిన రాజ శాసనాలను కూడా పరిగణన లోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలా పరిశీలించే క్రమంలో ప్రభుత్వ రికార్డుల ద్వారా లభ్యమవుతున్న శాసనాలను లెక్కలోకి తీసుకున్నాము. నెంబరు. 461 {ఏ. ఆర్.నెంబరు. 390 ఆఫ్ 1927} కుంభకాశీ గుడి, కొండాపూర్ తాలూక, దక్షిణ కెనరా జిల్లా శాసనాన్ని లెక్కించాము. ఆనాటి చక్రవర్తి విరూపాక్ష మహారాయల ఘనమును గూర్చి మహా ప్రధాని కాచప్ప దండ నాయకుడు తన అధికార ప్రతినిధి విఠరస ఒడయుల ద్వారా వేయించాడు. శా.శ. 1389 సర్వజిత్తు నామ సంవత్సరము ప్రథమ బాద్ర పథ మాసం శుక్ల పక్షం 15 వ దినం, శనివారం చంద్ర గ్రహణ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ శాసనం వేయించాడు. కుంభ కాశీ మహాదేవునికి పలు రకాల సేవలతో పాటు , అలంకార నిమిత్తం బంగారు సొమ్మును దానం చేస్తూ వేయించిన శాసనం ఇది. ఈ శాసనం ప్రకారం ఆ రోజును క్రీ.శకం లోకి అన్వయించి చూడగా క్రీ. శ. 1467 ఆగష్టు నెల 15 వ తేదీ శనివారం చంద్ర గ్రహణంగా తేలింది.

ఆ ప్రకారం శాలివాహన శకాన్ని క్రీస్తు శక సంవత్సరాలలోకి  అన్వయించి  చూడగా వికృతి నామ సంవత్సరం క్రీ.శ. 1470-71 సంవత్సరంగా తేలింది. ఆ ఏడాది అధిక మాసం బాద్రపద మాసం కాగా , పుష్య మాసం క్రీ.శ. 1470 సంవత్సరం డిసెంబరు  నెల 22  వ తేదీ నుండి 1471 జనవరి  నెల 20  వ తేదీ వరకు ఉండినది. అందులో శుక్ల పక్షం డిసెంబరు 22 వ తేదీ నుండి జనవరి 7 వ తేదీ వరకుండగా, బహుళ పక్షమి జనవరి నెల 8 నుండి జనవరి 20 వ తేదీ వరకు ఉండినది.  అదేవిధంగా శ్రీకృష్ణ దేవరాయల జననానికి ముందు వికృతి నామ సంవత్సరంలో అప్పటి విజయనగర సామ్రాజ్య మహా ప్రధాన మంత్రి సాళువ నరసింహ రాయలు ఓ శాసనం వేయించాడు.  ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆ శాసనం ఇలావుంది.  No.463 (A.R.No.  372 of 1921)

తిరువిట్టనేశ్వర గుడి, తిరువాడి, కడలూరు, దక్షిణ ఆర్కాట్ జిల్లా శా.శ.1392 వికృతి నామ సంవత్సరం, ఆశ్వీయుజ మాసం శుక్ల పక్షం 13 వ రోజు,  సోమవారం ….శాసన సారాంశం :: విరాట దేవుని పూజా పునస్కారాలు, పుష్య మాస రథోత్సవం నిమిత్తం సత్యభరణ నల్లూరు, సున్ననూరు గ్రామాలను సాళువ నరసింహ రాయల తరపున ఆయన కార్యకర్త అన్నమరుసయ్య మంజూరు చేసారు. ఈ రెండు గ్రామాలు అన్నమరుసయ్యకు అమర నాయంకర గ్రామాలు. విరాట దేవుని పూజా పునస్కారాలు సక్రమంగా నడుస్తున్నాయా? గ్రామాల ఆదాయం దేవుని సేవకే సద్వినియోగం అవుతోందా? లేదా? అని తనిఖీ చేసేందుకోసం ఓ అధికారిని నియమించారు. అతని జీతభత్యాల కోసం మాన్యం భూములను ఏర్పాటు చేసారు. ఈ శాసనం కృష్ణ దేవరాయల వారి జననానికి అతి సమీపం లోనిది. ఈ మేరకు ఈ శాసనాన్ని కూడా లెక్కించగా అందుకు సంబంధించిన తేదీ  క్రీ.శ.1470 వ సంవత్సరం , అక్టోబరు నెల ఎనిమిదవ తేదీ సోమవారం గా నిర్ధారణ అయ్యింది.  దీని ప్రకారం చూసినా వికృతి నామ సంవత్సరం, పుష్యమాసం క్రీ.శ.1471 జనవరి నేలతో సరిగ్గా సరిపోతుంది.  వీటన్నింటినీ పరిగణన లోకి తీసుకుని పరిశీలిస్తే క్రీ. శ. 1471 వ సంవత్సరము జనవరి  నెల 18 వ తేదీ శుక్రవారం నాడు శ్రీ కృష్ణ దేవ రాయల వారు జన్మించారు. ఆ రోజు బహుళ పక్షమి , ద్వాదశి, శుక్రవారమవుతుంది.  ఈ ప్రకారమే “సత్యవాదిని” పత్రిక శ్రీ కృష్ణ దేవ రాయల వారి జయంత్యుత్సవం పురస్కరించుకొని తన వ్యాసం సరిగ్గా జనవరి నెల 18 వ తేదీన  ప్రచురించింది. వికృతి నామ సంవత్సరంలో పుట్టి తిరిగి వికృతి నామ సంవత్సరంలోనే ఆ మహనీయుడు మృతి చెందడం విశేషం. దీన్ని బట్టి రాయల వారు 60 సంవత్సరాలు జీవించారు. ఇందులో ఏలాంటి సందేహం లేదు. అంతకంటే ముఖ్యంగా ఏలాంటి వాదోపవాదాలకు తావు లేదు

(ఇంకావుంది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *