May 5, 2024

మాయానగరం : 28

రచన: భువనచంద్ర

గామోక వీధి (అంటే గాంధి మోహన్ దాస్ కరాంచంద్ వీధి) కోలాహలంగా వుంది. అతిత్వరలో ఎలక్షన్లు రాబోతున్నాయనే పుకారు ఇంటింటికీ, గుడిసె గుడిసెకీ హుషారుగా షికారు చేస్తోంది. అది ‘మిడ్ టరమ్ ‘ అని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం వెనుక ఎవరి హస్తం వుందో ఎవరికీ అర్ధం కావటం లేదు.
“అన్ని చోట్ల నించీ వార్తలు వస్తూనే వున్నాయి. ఈ వార్తని పుట్టించింది ఇక్కడ కాదు. ఢిల్లీలో పుట్టించి ఇక్కడ పెంచుతున్నారు. అంటే, ప్రభుత్వాన్ని కూల్చాలనే ప్రయత్నం ‘పెద్ద’ వాళ్ళే మొదలెట్టారన్న మాట. ఓ క్షణం ఆగి విస్కిని ఓ గుక్క లాగించాడు ‘గురూ’ గారు. బోసుబాబుతో సహా ఓ పదిహేనుమంది శిష్యులున్నారక్కడ. గురువుగారితో ‘గ్లాసు ‘ కలిపే ధైర్యం ఎవరికీ లేదు కనక , మొత్తం వన్ విస్కి ఫిప్టీన్ వాటర్ బాటిల్స్ అక్కడ వున్నాయి. అందరెదురుగుండా నెంబర్ వన్ జీడిపప్పు ప్లేట్లు వున్నాయి. ఆ జీడిపప్పులొచ్చింది ఫైవ్ స్టార్ హోటల్నించి. ఉప్పు కారాలు పర్ఫెక్ట్ గా లేకపోతే గురువుగారికి నచ్చదు. గనక అవి ‘టాప్ క్లాస్ ‘ వే అని నిస్సంశయంగా చెప్పొచ్చు.
ఇక మిర్చీ బజ్జీలు, మిగతా మాచింగులు అవీ వేడివేడిగా అవతలి గదిలో నవనీతం వేసి పంపుతోంది. ఏ స్టార్ హోటలూ ఆవిడ ‘తయారీ’ ముందు బలాదూరే.
“ఢిల్లీ వాళ్ళు మహా తెస్తే ప్రెసిడెంటు రూలు తెస్తారు గానీ మధ్యంతరం ఎన్నికలు పెడతారంటారా?” ఓ సందేహి అడిగాడు.
“ఒక వేళ పెట్టినా ఆ పార్టీ పట్టుమని పది సీట్లు కూడా గెలుచుకోలేదని వాళ్ళకి తెలిదా?” ఇంకో ఉత్సాహి అన్నాడు.
“ప్రస్తుతం వున్న ప్రభుత్వానికి తిరుగు లేదండి. ఎవడో పుకారు పుట్టించాడు. ఆ పుకారు సునామీలా రాష్ట్రంలో వ్యాపించింది. ఎలక్షన్ కి మించిన ‘ఎత్తు ‘ ఏదో వుంది. మొదట పట్టుకోవాల్సింది ఆ మూల కారణాన్నే. ” మరో సూక్ష్మగ్రాహి సాలోచనగా అన్నాడు.
“అవును, అదే నిజం ” అన్నాడో ‘తానా ‘
“కరక్ట్… ఇది కాస్త ఆలోచించవలసిందే” సపోర్టు ఇచ్చాడు ఓ ‘తందానా ‘
సామాన్యంగా అన్ని సమావేశాలు కేవలం ‘గురువుగారి ‘ సంభాషణ లోనే సమాప్తమవుతాయి. గురూగారు అందరి ముందు ‘ విస్కీ ‘ సేవిస్తుంటే మాత్రం శిష్యపరిమాణువుల స్వరాలు ‘బయట ‘ కొస్తాయి. అప్పుడు మాత్రమే ‘గురూజీ ‘ స్వతంత్రం ఇస్తారు. బోసుబాబు శ్రద్ధగా మరో ‘లార్జి ‘ ని వేరే గ్లాసులోకి వొంపి సరైన సోడా + వాటర్ కొలతలతో దాన్ని నింపి గురువుగారికి అందుబాటులో వుంచాడు.
గురూగారు కళ్ళజోడు ఓసారి తీసి, వాత్సల్యముతో బోసుబాబుని చూసి మళ్ళీ కళ్ళజోడు పెట్టుకున్నారు. మిగతావారంతా ఆ ‘గెశ్చర్ ‘ ని గమనించారని, గురూగారూ బోసుబాబు గమనించారు.
“అయితే గురూజీ.. మీ దృష్టిలో మేమందరం సపోర్ట్ ఇవ్వాల్సింది బోస్ కనేగా? ” ప్రశ్నగానే ప్రశించాడు ఓ కుతూహలుడు.
“మిగతావారు ఏమంటారో వినడానికేగా యీ సమావేశం ఏర్పాటు చేసింది. ” ఓ జీడి పలుకు నోట్లో వెసుకుంటూ అన్నారు గురూగారు
కొన్ని క్షణాలు నిశబ్ధం రాజ్యం చేసింది.
“బోసు అందరికీ డ్రింకులు సర్వు చేయించు. వారి వారి బ్రాండ్లనే సుమా! ” చిన్నగా నవ్వి అన్నాడు గురూగారు.
ఐదు నిమిషాలలో అందరి ముందు గ్లాసులు వున్నాయి. “ఎప్పుడూ లేనిది ఇప్పుడేంటి గురూజీ? “సందేహిస్తునే అడిగాడు ఓ సందేహి.
“సందేహాలొద్దు. హాయిగా తీసుకోండి. నిర్ణయాలకేమీ తొందర లేదు. ప్రశాంతంగా తాగండి… ప్రశాంతంగా తినండి. ప్రీగా వుండండి. మందుకొట్టినప్పుడు నేను గురుశిష్య సంబంధాలను పాటించను. ” మరో బాలీసు చంక కింద వేసుకొని అన్నాడు గురుజీ.
గ్లాసులు గలగలమన్నాయి.
కళ్ళు తళతళమంటున్నాయి.
గొంతులు కిలకిలమంటున్నాయి.
నిశాకన్య పూర్తిగా ‘కురులు ‘ విప్పుకుంది.
మూడో ‘పెగ్గు ‘ దాటితే గానీ ‘మనసు ‘ మాటగా మారదని గురుజీకి తెలుసు. ఆ మాత్రం టైం ఇవ్వకపోతే మాటలు ‘మౌనం ‘ లోనే కూరుకుపోతాయి. నోరు తెరుచుకోడానికి మందు మొదటి మెట్టైతే ‘చర్చ ‘ రెండో మెట్టు.

“సరే.. ఎవరైతే బాగుంటుంది? ప్రీగా ఆలోచించి చెప్పండి. మెజారిటీ ఎవరి వైపు వుంటే వారినేగా నిలబెడదాం. గెలిచింది ఎవరైనా ఫలితం మన అందరికీ అనే విషయం మీకూ తెలుసుగా! ” కళ్ళజోడు తీసి అత్యంత కరుణతో దయతో అందరి వంకా చూశాడు గురూజీ.
బోస్ కి మతిపోయింది. అలాంటి ‘చూపు ‘ గురూజీ చూడగలడని బోసు కల్లో కూడా ఊహించలేదు.
ఆ చూపు ఎలా వుందంటే , అందరినీ అనునయించినట్టుంది. అనుగ్రహించినట్టుంది. అరమరికలు లేనట్టుంది. అచ్చమైన ‘ఆత్మబంధువు ‘ చూపులా వుంది.
“గురూజీ.. మీరేమీ అనుకోనంటే… ” అంటూ నసిగాడు ఓ ఉత్సాహి.
“ఏమీ అనుకోను.. మీరందరూ నాకు ఆప్తులే.. నా మానస పుత్రులే. నిస్సంశయంగా చెప్పు! “అన్నాడు గురూజీ.
“లైఫ్ లో ఒక్కసారైనా ఎం.ఎల్.ఏ. అనిపించుకోవాలని వుంది.” కొంచం సిగ్గుపడుతూ అన్నాడు ఉత్సాహి.
“వై నాట్? కలలు కనాలి. కన్న కలలని సాకారం చేసుకోవాలి. జీవితమనే గేమ్‌లో గెలవడానికే శాయశక్తులు ప్రయత్నించాలి. గుడ్.. ఇంకెవరైనా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ” మరో సిప్ తీసుకొని చిద్విలాసంగా అన్నాడు గురూజీ.
“నేనూ అదే చెప్పాలనుకుంటున్నా ” అన్నాడు సూక్ష్మగ్రాహి.
“నాకూ ఆ కోరికే వుంది. కానీ తీరేనా? ” నిట్టుర్చాడో నిరుత్సాహి.
“ఇన్నేళ్ళ నుంచి పార్టి ఫండ్ కి లక్షలకిలక్షలు ఇస్తూనే వున్నా. ఈసారైనా నాకు మీరు ఛాన్స్ ఇవ్వాలి ” పట్టుదలగా అన్నాడో కార్యవాది. సమావేశానికి వచ్చే ముందే అడగాలని అతను నిర్ణయించుకొని వచ్చాడు.
” ఆ మాటకొస్తే అందరికంటే ఎక్కువ పార్టీ ఫండు ఇచ్చింది నేనూ ” నిలబడి మరీ అన్నాడో సత్యవాది.
“కూర్చోండి..కూర్చోండి ” కూర్చోబెట్టే ప్రయత్నం చేశాడు బోసు.
“బోసూ.. ! నీ వెనక గుడిసెల సిటీ వుందని నాకు తెలుసు.
కల్తీసారా చావులున్నాయనీ నాకు తెలుసు. నీ వయసు చిన్నది. మరి నా వయసు? యీ సారి ఎలక్షన్లు దాటాక నెక్ట్ ఎలక్షన్ కి వుంటానో వుండనో? అందుకే గురుజీ యీసారి మీ మద్దత్తు నాకు ఇవ్వాలి. ” గటగట గ్లాసు ఖాళీ చేసి అన్నాడో పెద్దాయన.
మొత్తం పదిహేనుమందికీ వున్న పదవీ కాంక్ష నిస్సుగ్గుగా బయటపడింది. అంతేకాదు ‘గురువు గారి ‘ మీదున్న భయం ‘చనువు ‘ గా మారి ‘వాడు – వీడు ‘ అనేంత నేలబారు తరహాకి జారిపోయింది. బోస్ కయితే షాకు మీద షాకు. కారణం అతను తాగకుండా ఉండటమే.
“అసలు వీడి పుట్టుపురోత్తరాలు తెలిసిన నాకొడుకెవడూ? ” అని ఒకరంటే, “బాబూ… యీడి చుట్టం.. అదే ఆ నవనీతం గనక ఒక్క ‘ఛాన్స్ ‘ నాకిస్తే ఆస్తంతా రాసిస్తా. ” అని మరొకడు.
“ఈడికీమధ్య ఓ టీచర్ పిల్ల దొరికింది. పాఠాలు వీడు దానికి నేర్పుతున్నాడో, అది వీడికి నేర్పుతోందో , అయినా హయిగా ‘ఖుషామత్ ‘ చెయ్యకుండా, యీడికీ ఎమ్మెల్యే ఆశెందుకూ? ” అని వేరొకడు, వాళ్ళు, వాళ్ళు అక్కస్సు చాటుకున్నారు. ఓ స్టేజీలో బోసుబాబు ‘చెయ్యి ‘ చేసుకోవాలన్నత తీవ్రంగా లేస్తే , గురూగారు కంటి సైగలతో ఆపేశారు. ప్రత్యక్ష, పరోక్ష ఆరోపణాస్త్రాలూ, వాగ్వివాద బాణాలూ వర్షంలా కురిశాక అర్ధరాత్రి పన్నెండింటికి సమావేశం ముగిసింది.
చాలామందిని గురూగారి ‘శిష్యులు ‘ మోసుకెళ్ళి కార్లో పడెయ్యాల్సి వచ్చింది. సగం సగం ఆహార పదార్ధాలున్న ప్లేట్లు , కొద్దోగొప్పో ‘ మందు ‘ తో మిగిలున్న గ్లాసులు తియ్యడం పూర్తయ్యేసరికి పన్నెండున్నర. ఓ యుద్ధం తరవాత యుద్ధభూమిలా వుంది గురూజీ డెన్.
చిత్రమేమిటంటే గురుగారు మాత్రం ‘మత్తు ‘ లోకంలో చొరబడకుండా ఇంకా ఫ్రెష్ గానే వున్నాడు. బోసు అసలు తాగనే లేదు.
“చూశావుగా వాళ్ళ ఆలోచనలు? ఛాన్స్ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా వున్నారు. ముఖ్యంగా నీమీద వాళ్ళ కున్న ఈర్ష్యనీ, అసూయనీ గమనించవా? ” చిన్నగా నవ్వి అన్నాడు గురుజీ.
“బహుశా ఎక్కువ తాగి ” ఏమి అనాలో తెలియక అన్నాడు బోసుబాబు.
“తప్పు.. వాళ్ళన్నది ఏమిటో వాళ్ళకి తెలిసే అన్నారు. వాళ్ళన్న ప్రతీ మాటా వాళ్ళకి గుర్తులోనే వుంటుంది. అసలు నేను ‘తాగండి ‘ అనగానే ఎందుకు తాగారో తెలుసా? నీమీద అయిష్టాన్నే కాదు.. నా మీద అసహనాన్ని కూడా ‘డ్రింక్ ‘ పేరు మీద వెళ్ళగక్కలని. నా మీద పీకల దాక ‘అసంతృప్తి ‘ వుంది వాళ్ళకి కారణం నేను నీకు ఫేవర్ గా వుండటం. ” గ్లాస్ లో మిగిలిన విస్కీ జాయిగా నోట్లోకి జార్చి అన్నాడు గురుజీ.
“ఇప్పుడు నన్నేం చేయమంటారు? ” బాధతోనూ, అసహాయతతోనూ అడిగాడు బోసు. వాళ్ళన్న ప్రతీ మాట అతని గుండెల్లో శూలాల్ల దిగబడే వున్నాయి.
“ప్రశాంతంగా ఇంటికెళ్ళు. నవనీతాన్ని కూడా తీసుకుపో. హాయిగా మందేసుకొని పడుక్కో. రేపు నేను కబురు చేశాక రా. అన్నీ నేను చూసుకుంటాగా… ” అనునయంగా అని లేచాడు గురుజీ. అంటే సమావేశం పూర్తైనట్టు లెక్క.

********************

నవనీతానికి నవ్వొచ్చింది. ‘మగజాతి మగజాతే ‘ అని నవ్వుకుంది. గురుజీ ఇంటి నుంచి గామోకా వీధిలోని గుడిసె పేలస్ కి వచ్చాక బోస్ ని కాస్త చల్లబరిచే ప్రయత్నం చేసింది. పురుషుడిలో జ్వాల రగిలించగలిగేదీ, జ్వాలని మళ్ళీ ఆర్పగలిగేదీ కూడా స్త్రీనే. కానీ పురుషుడికి స్త్రీ మాత్రమే లోకం కాదు. స్త్రీకి పురుషుడే సర్వస్వం అయినట్టు. అందుకే నవనీతాన్ని పట్టించుకోకుండా దూరంగా తోశాడు బోసుబాబు. చిన్నబోయింది నవనీతం.
“ఒరే.. నేను నిన్ను నీ ఆలోచనలనుంచీ అవమానాల్నుంచీ దూరంగా తీసుకుపోవాలని ప్రయత్నిస్తుంటే ఎందుకురా నా ఆలోచననీ, అనురాగాన్నీ గుర్తించకుండా తోసేస్తున్నావూ? ” అని అనాలనిపించినా మౌనంగా ఊరుకుంది.
‘అదే పెళ్ళామైతే ఊరుకుంటుందా? నానా రభస మొదలెట్టి కయ్యానికి కాలు దువ్వదూ? ‘ అనుకొని మళ్ళీ నవ్వుకుంది.
“అసలు వీళ్ళకేం కావాలో వీళ్ళకి తెలుసా? ” అని మళ్ళీ ఆలోచించింది.
” ఆ నవనీతం కోసం ఆస్తినంతా రాసిచ్చేయనూ ” అన్నవాడు గుర్తొచ్చాడు నవనీతానికి. వాడు ముసలాడేం కాదు. నిజం చెబితే బోసు బాబు కంటే హాండ్ సమ్ గా వుంటాడు. డబ్బులో తెగ బలిసిన వాడని వాడి మొహం చూస్తేనే అర్ధమయ్యింది.
“పోనీ అటు షిఫ్ట్ అయితే? ” ఓ ఆలోచన మెరుపులా మెరిసింది నవనీతం మదిలో…

“ఉవాచా… మొహం పగలగొట్టుకోడానికి ఏ రాయి అయితేనేం? మొదట్లో వాడూ పీకల్దాకా ప్రేమ చూపిస్తాడు. .. ఆ తరవాత జీవితాలు మామూలే. ” అంతరాత్మ ఆన్సరిచ్చింది.
“తెలియని దేవుడికన్నా తెలిసిన దెయ్యం గొప్పది ‘ అనుకుంది నవనీతం నిట్టురుస్తూ.
ఆ పక్క పెగ్గు మీద పెగ్గు తాగుతున్నాడు బోసు బాబు. ఈ పక్క ‘ చిన్న ‘ అవమానంతో, ఆకలితో నిట్టురుస్తోంది నవనీతం. రాత్రి మూడయ్యిందనటానికి నిదర్శనంగా ‘ చౌకీ ‘ గడియారం మూడు కొట్టింది.

***********************

చట్టుక్కున లేచింది శోభారాణి బియెస్సి. గుండే గబగబా కొట్టుకుంటోంది. టైము చూస్తే తెల్లవారు ఝామున మూడు. దూరంగా చౌకీ గడియారం గంటలు కొట్టడం వినిపించింది.
భయంకరమైన పీడకల. శామ్యూల్ రెడ్డి, బోసు బాబూ, ముక్కు మొహం తెలియని ఎవరెవరో తనని నగ్నం చేస్తున్న పీడకల. మంచం మీంచి లేచి కుండలో నీళ్ళు ఓ గ్లాసుడు ముంచుకొని గడగడా తాగింది.
ఏమిటీ యీ కలకి అర్ధం? అసలు కలలు ఎందుకొస్తాయి? ఇతరుల ఆలోచనలే కలల్లా మనకి వస్తాయా? అలా అయితే శామ్యూల్ రెడ్డికి, బోసుబాబుకీ, ‘ ఇంకా ‘ బోలెడంత మందికి తన మీద కోరిక వుందా?
ఉఫ్ మని నిద్ర ఎగిరిపోవడంతో ఆలోచిస్తూ మంచం మీద కూర్చుంది.
ఆ మంచం మాధవి కొనిచ్చిన మంచం… ప్రేమతో, అనురాగంతో. మాధవిని తలచుకునేసరికి శోభకి ధైర్యం వచ్చింది. ‘అవును.. మాధవక్క మంచిది. నన్ను ఎట్టి పరిస్థితిలోనూ ఒంటరిగా విడిచిపెట్టదు. ‘ అనుకుంటూ తృప్తిగా నిట్టుర్చింది మిస్ శోభారాణి బియెస్సి.
*****************************

కిషన్ చంద్ అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. సుందరీబాయి ఆగడం శృతి మించుతోంది. అన్నీ పనులు షీతల్ కి చెప్పడమే కాకుండా ప్రతిపనిలోనూ వంకలు పెట్టి మరీ సాధిస్తోంది. షీతల్ బ్రతుకుని దుర్భరం చేస్తోంది. ఎంతలా అంటే పారిపోవడమో, లేక ఆత్మహత్య చేసుకోవడమో తప్ప షీతల్ కి వేరే మార్గం లేనంత. సుందరీబాయ్ కి తనకి జరిగిన సంభాషణ మళ్ళీ మరో సారి గుర్తుకొచ్చింది కిషన్ కి. డైనింగ్ టేబుల్ దగ్గరొచ్చింది గొడవ. ‘కచోరీ ‘ లు అద్భుతంగా చేసింది షీతల్. మరో రెండు ప్లేట్లు వేసుకున్నాడు కిషన్.
“ఛండాలంగా ఉప్పగా వున్నాయి. కుక్కలు కూడా తినవు… పందిలా బలిశావు కానీ వొళ్ళు దగ్గర పెట్టుకొని పని చెయ్యడం మాత్రం నేర్చుకోవు. ” అంటూ కచోరీ గిన్నెని షీతల్ మొహం మీదకి విసిరింది సుందరీబాయి.
కిషన్ చందే కాదు, ఆ మాటకి సేఠ్ చమన్ లాల్ కూడా నిర్ఘాంతపోయాడు. గిన్నె షీతల్ నుదిటికి తగిలి ఇంత లావు బొబ్బ కట్టింది.
“బుద్ధుందా లేదా నీకు? అందరికీ బాగున్న కచోరీ నీకు బాగోలేదా? సరే.. బాగోలేక పోతే తినడం మానేయ్యాలి… అంతేకానీ గిన్నెలు విసిరి కొడతావా? అంటే నీ దృష్టిలో మేము కుక్కలమనా? ” అణచుకోలేక అరిచేశాడు కిషన్ చంద్.
“ఓహో.. గిన్నె ఆవిడకి తగిలితే నొప్పి నీకు పుట్టుకొచ్చిందా? మా తిండి తింటూ ఇంట్లో పనిమనిషిని వెనకేసుకొచ్చి నా మీదే అరుస్తావా? ఛీ… ” అసహనాన్ని కళ్ళల్లో ప్రతిఫలింపజేస్తూ అంది సుందరి.
సేఠ్ చమన్ లాల్ చూస్తూ కూర్చున్నాడు. కావాలనే కూతురు అల్లుడ్ని రెచ్చగొడుతోందని అతనికి ఎప్పుడో అర్ధమయ్యింది. కిషన్ చంద్ ని ఎంతకాలం మౌనంగా ఉంచడం? ఆలోచిస్తున్నాడు చమన్ లాల్. ‘కిషన్ చంద్ స్థానంలో నేనున్నా అదే పని చేస్తాను ” లోపల్లోపల అనుకున్నాడు చమన్ లాల్.
“నువస్సలు మనిషివేనా? “తినే ప్లేట్లో చెయ్యి కడిగేసుకుని లేచాడు కిషన్ చంద్.
“నేను మనిషినో కాదో తెలియాలంటే నువ్వు మనిషివైతే గదా తెలిసేది? ” నిర్లక్ష్యంగా మాటకి మాట అన్నది సుందరి.
కిషన్ గబగబా బయటకొచ్చి కారు తీశాడు. చమన్ లాల్ మౌనంగా చూస్తూనే వున్నాడు.
‘మనసు ‘ బాధ పడినప్పుడు మనిషి, అంటే పురుషుడు వెతికేది దగ్గరలోనున్న ‘ బార్ ‘ ని. ఇవాళా రేపు ఇది మరీ ‘కామన్ ‘ అయ్యిపోయింది.
కిషన్ చంద్ తాగుబోతు కాదు. అసలు పెద్దగా తాగటాన్ని ఇష్టపడడు. అతను తాగేది మాత్రం సుందరి బలవంతం మీదే.
ఇవాళ్టి విషయం వేరు. ఓ ఫుల్ బాటిల్ వైన్ షాపులో కొనుక్కొని ఆఫీసుకి వెళ్ళిపోయాడు. ఎవర్ని లోపలకి రానివ్వద్దని సెక్రెటరీకి చెప్పి తన ప్రైవేట్ ఛాంబర్లో సెటిలై బాటిల్ ఓపెన్ చేశాడు. రెండు పెగ్గులకే మత్తొచ్చి మంచం మీద పడి నిద్రపోయాడు. లేచేసరికి సాయంత్రం ఐదున్నర అయ్యింది. మరో రెండు పెగ్గులు వేసుకుంటేగానీ ఇంటికి వెళ్ళే ధైర్యం చెయ్యలేకపోయాడు.
అతను ఇంటికి రాడానికి కారణం, భార్య అంటే భయమో, మామగారంటే భక్తో కాదు. తిరిగిరాడానికి ఏకైక కారణం షీతల్. ‘దెబ్బతిన్న ‘ షీతల్ ని ‘ఆ రాక్షసి ‘ ముందర వదిలేసి ఆఫీసుకి పోవడం అతన్ని చాలా బాధించింది. కిషన్ చంద్ పలాయనవాది కాడు. అందుకే అతనిలో ఆ క్షోభ.
ఇంటికొచ్చేసరికి సుందరి లేదు. షీతల్ ఎదురొచ్చింది… నుదిటి మీద గాయంతో.
“ముఝే మాఫ్ కర్ దో షీతల్ ” అన్నాడు సిన్సియర్ గా తలొంచుకొని.
“అన్నం తినలేదు కదూ ” లాలనగా తల నిమిరి అన్నది షీతల్. కంగారు పడుతూ చుట్టూ చూశాడు కిషన్.
“ఎవరూ లేరు. నా దేవతా.. ముందు భోజనం చేద్దువురా. నేనూ ఏమీ తినలేదు. ” చెయ్యి పట్టుకొని డైనింగ్ టేబుల్ ముందు కూర్చోబెట్టింది షీతల్. కిషన్ కళ్ళల్లోంచి ధారగా కన్నీళ్ళు కారాయి.
చాలా యేళ్ళ తరవాత ‘తల్లి ‘ గుర్తుకొచ్చింది. తన కోసం కొవ్వొత్తిలా కరిగిపోయిన తల్లి. తనకోసమే గుండె జబ్బుని దాచుకొని కూలి పనులు చేసిన తల్లి. విడువలేక విడువ లేక ప్రాణాలు తన వొడిలోనే విడిచి ఏలోకాలకో తరలిపోయిన తల్లి…. షీతల్ కిషన్ చంద్ తలని గుండెకి ఆనించుకుంది.
ఆనించుకొని అతని తల నిమురుతోంది. వెక్కెక్కి ఏడుస్తున్నాడు కిషన్… తల్లిలాంటి ప్రేయసి గుండేల్లో తలపెట్టుకొని.
“ఎవరూ లేరు ” అని షీతల్ అన్నది కానీ ఆవిడకీ తెలీదు సేఠ్ చమన్ లాల్ లోపలే వున్నాడనీ… వాళ్ళిద్దరినీ చూసి అవాక్కై నిలిచాడని.
రాత్రి మూడున్నర. ఒంటరిగా తన గదిలో పచార్లు చేస్తున్నాడు కిషన్ చంద్. సాయంకాలం జరిగిన సంభాషణ మరీమరీ అతనికి గుర్తుకొస్తోంది. తలని నిమురుతోన్న షీతల్ సడన్ గా దూరంగా జరగడంతో తుళ్ళిపడ్డాడు కిషన్ చంద్. తల తిప్పి చూస్తే ఎదురుగా చమన్ లాల్. సిగ్గుతో భయంతో షీతల్ లోపలకి పారిపోయింది.
“కూర్చో ” భుజం మీద చెయ్యి వేసి అల్లుడ్ని కుర్చిలో కూర్చోబెట్టాడు చమన్ లాల్. బిడియంతో సైలెంట్ అయ్యాడు కిషన్ చంద్.

“పొద్దున్నుంచి ఏమీ తినలేదనుకుంటా ” ఓ ప్లేట్ పెట్టి టేబుల్ మీద వున్న చపాతీలు, కూరా వొడ్డించి అల్లుడి ముందుకు జరిపాడు చమన్ లాల్. ఇన్నాళ్ళ జీవితంలో చమన్ లాల్ అలా వొడ్డించడం కిషన్ చంద్ చూడలేదు.
“తిను ” గ్లాసులో నీళ్ళు పోసి అన్నాడు. తినాలని అనిపించకపోయినా తప్పని సరై ఓ చపాతీ తుంచాడు కిషన్ చంద్.
“అన్నం వడ్డించాక ఏ విషయమూ, అంటే, సీరియస్ విషయాన్ని చెప్పకూడదంటారు పెద్దలు. అయినా నాకు చెప్పక తప్పడం లేదు. నీ భార్య… అదే నా కూతురు మహామొండిది కిషన్. అది అలా తయ్యారవడానికి కారణం నేనే కావచ్చు. ఏమైనా సుందరి వల్ల నష్టపోతున్నది షీతల్. చాలా చిత్రవధ అనుభవించడం నేను చూస్తూనే వున్నాను. సుందరి శాడిజం రోజురోజుకి పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. ఇవ్వాళ నువ్వు షీతల్ దగ్గర ‘శాంతి ‘ పొందే ప్రయత్నం చేసిన కారణం కూడా సుందరే. ఆ విషయం నాకూ తెలుసు. మీ ముగ్గురు మధ్య రగులుతున్న యీ చిచ్చు చివరికి ఏ విధంగా పరిణమిస్తుందో నా వూహకు కూడా అందడం లేదు. అయితే దీని వల్ల అల్టిమేట్ గా దెబ్బ తినేది మాత్రం అన్నెం పున్నెం ఎరుగని నీ పిల్లలే. దాని సుఖం అది చూసుకుంటుంది, నీ సుఖం నువ్వూ చూసుకుంటావు. మరి పిల్లల సంగతీ? ఆలోచించు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. పిల్లల భవిషత్తు నాశనం కాని వుపాయమేదైనా ఉందేమో నిదానంగా ఆలోచించు. ఇంతే నేను చెప్పేది.
” షీతల్… బయటికొచ్చి కిషన్ భోజనం పూర్తయ్యెదాక దగ్గరుండి వడ్డించు! ” కిషన్ భుజం తట్టి మెల్లగా నడుచుకుంటూ మెట్లక్కసాగాడు చమన్ లాల్. సడన్ గా అతనికి పదేళ్ళు పైబడ్డట్టు అనిపించి నిస్సత్తువ ఆవహించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *