May 5, 2024

విశ్వనాధ నవలల పై ఒక విహంగ వీక్షణం – 2

రచన:-ఇందిరా గుమ్ములూరి, పి.హెచ్.డి.

kavi_samraat
నాస్తికధూమము

పురాణవైర గ్రంధమాలలో ఇది రెండవ నవల. దీని రచనాకాలం 1958. ఈ నవలని కవిసమ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారు ఆశువుగా చెపుతుండగా శ్రీ పాలావజ్జల రామశాస్త్రిగారు లిపిబద్దం చేసేరు.

బృహద్రధవంశీయులు భారతయుద్ధానికి పూర్వం కొన్ని వందల ఏళ్ళుగా మగధని పాలిస్తున్నారు. వైవస్వత మనువునుండి ముప్పైఒకటవ రాజు సంపరుణుడు. అతని కుమారుడే కురు. ఈతని పేరనే కురువంశ స్థాపన జరిగింది. ఈతడు తన రాజధానిని ప్రయాగనుండి కురుక్షేత్రానికి మార్చాడు. ఈతని తర్వాత ఈతని మొదటి కుమారుడు సుధన్వుడు రాజయ్యాడు. ఈతని నుండి ఆరవవాడు వైద్యుడు. ఈ వైద్యునికే ప్రతీపుడనీ, ఉపరిచరవసువు అనే నామాంతరాలున్నాయి. ఈ ఉపరిచరవసువు కుమారుడే మొదటి బృహద్రధుడు.ఈ మొదటి బృహద్రధుడు కలి ప్రారంభానికి 600 ఏళ్ళ క్రింద ఈ మగధసామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈ మొదటి బృహద్రధుడు కలి ప్రారంభానికి 600 ఏళ్ళ క్రింద ఈ మగధ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈ మొదటి బృహద్రధుడు తన రాజధానిని కురుక్షేత్రం నుంచి మగధ సమీపంలో ఉన్న గిరివ్రజానికి మార్చాడు. నాటినుంచి గిరివ్రజం మగధ సామ్రాజ్యంగా వ్యవహృతమయింది అని వీరి వంశచరిత్రను మత్స్యపురాణం, మహాభారత సభాపర్వం తెలుపుతున్నాయి. ఈతని నుండి తొమ్మిదవవాడూ బృహద్రధుడే. ఇతని కుమారుడే జరాసంధుడు. ఈ జరాసంధునికి కూడా బృహద్రధుడనే నామాంతరముంది. జరాసంధుని కుమారుడు సహదేవుడు, సహదేవుని కుమారుడు మార్జారి లేక సోమాధి. ఈతడు ధర్మరాజుకి సమకాలికుడు. కధాకాలం నాటికి మగధని పాలిస్తున్న రిపుంజయుడు ఈ సోమాధి నుండి ఇరవై రెండవ రాజు. ఈతడూ బృహద్రధ వంశీయునిగానే వ్యవహృతుడు.

వింధ్యగిరిస్వామి తీవ్రచండీ దేవతార్చనతో ఈ నవల ప్రారంభమవుతుంది. చేతిలోనున్న కళలో భయంకరాకృతియైన చాముండీ విగ్రహాన్ని తాడిస్తూ, విలయతాండవం చేస్తూ, అమ్మవారిని తీవ్రపదజాలంతో దూషిస్తూ ఈతడు ప్రత్యక్షమౌతాడు. వింధ్యగిరిస్వామి తీవ్ర వామాచారపరాయుణుడు. ఈతని నివాసం శ్రీశైలంకాతార ప్రదేశం. భారతయుద్ధంలో బోర్లించిన రక్తకుంభంవలె సైంధవుని తలమింటికెగిరిపోతున్నపుడు తద్రక్త ధారాపాతంలో అమ్మవారిని దర్శనం చేసినవాడు ఈతడు. “ఇంకెన్నాళీ భారతీయ సంస్కృతి, వైయాసిక నాగరికత, కృష్ణ విరచిత భగవద్గీతాపఠనము, వేదోపనిషత్తుల రాజ్యము సాగనిత్తుము? సాగనీయము! ఎచ్చటిదచ్చట నిర్మూలనము చేయుదును. శీర్ణపరతును. వానికి భ్రష్టత సేకూర్తును” అంటూ భగవద్వైరాన్ని తీవ్రవ్రతంగా చేసుకొన్నవాడీతడు. కొన్ని జన్మలనుండి జయద్రధునిగానే పుడుతూ తన పగను, వ్రతాన్నీ కొనసాగిస్తున్నవాడు. ఈతని ఉపాసనా తీవ్రత అతడొనర్చే కొద్దిపాటి సత్కార్యాల మాటున అణగియున్న కారణంగా దేశదేశాల్లో ఎందరెందరో శిష్యులని సంపాదించుకొన్నాడు.
ఈ దేవీవిగ్రహాన్ని మగధ రాజధానియైన గిరివ్రజపురాన్నుంచి ఎవడో తరలించుకొని వచ్చి, ఈ వింధ్యపర్వతాలలో ప్రతిష్టించాడని, జరాసంధుడీ దేవతనే ఉపాసించేవాడని, బార్హధుల పాలిట ఈ దేవత ధూమకేతువై, అరిష్టధాత్రి అయిన కారణాన జరాసంధుని మనుమడైన సోమాధి రాజధానినుండి ఆ విగ్రహాన్ని పంపివేసేడని, గిరివ్రజపురాన్నుంచి వింధ్యకాంతారానికి ఈ విగ్రహాన్ని తీసికొని రావటానికి ఇరవైరెండు దినాలు పట్టిందనీ, అందుచేత మార్జారినుండి ఇరవై ఇద్దరు రాజులు పాలించిన అనంతరం జరాసంధవంశం నశిస్తుందని దేవ్ శపించిందనీ ప్రతీతి. ఆ ఇరవై రెండవ రాజే నేటి మగధరీజైన రిపుంజయుడు. బార్హద్రధవంశంలోని రాణులందరూ ఈ దేవీ భక్తురాండ్రే. ప్రస్తుత మహారాణి, రిపుంజయుని భార్య అయిన మహేశ్వరి చాముండీ భక్తురాలు, వింధ్యగిరిస్వామి శిష్యురాలు.
మహేశ్వేర గోనంద వంశజ కాశ్మీర రాజైన నలసేనుని సోదరి. కాశ్మీర దేశం మ్లేచ్చదేశాలకి సమెపాన ఉండటం, వెలియోనసనే మ్లేచ్చగురువు సంపర్కం, అన్నింటినీ మించి మ్లేచ్చదేశంలో జన్మించటం మొదలైన కారణాలవల్ల మహేశ్వరికో మ్లేచ్చభావాలు నరనరాలా వ్యాపించాయి. ఈ వెలియోనషు కారణంగానే కాశ్మీరదేశ దుహిత మహేశ్వరికి, మగధరాజైన రిపుంజయునికి వివాహమయింది. ఈమెలో ఉన్న ఈ మ్లేచ్ఛప్రకృతే మగధకు వచ్చిన వింధ్యగిరిస్వామిచేసే చండీ ఉపాసనని అనుమోదించింది. వేదోపనిషన్మూలక మతాన్ని విశధమొనర్చి, అసంప్రదాయ స్వరూపమైన నాస్తికాన్ని వ్యాపింపజేసే లక్ష్యంతోనే చండీభక్తులైన రిపుంజయ మహేశ్వరులను తనకు శిష్యులుగా చేసుకొన్నాడీ వింధ్యగిరిస్వామి. రిపుంజయుని చక్రవర్తిని చేస్తానన్న స్వామి మాట ఎప్పటికీ నిజంకాకపోవటంతో రిపుంజయునికి కాలక్రమంలో స్వామి మీద నమ్మకం సడలసాగింది.
మునీకుడు రిపుంజయుని మంత్రి. నిత్యాటవీ సంచారియై, కొన్ని క్షుద్ర ఆటవికపు కుటిలరాజనీతిలోనూ, క్షుద్ర ఆటవిక విద్యలను నేర్చుకొని, ఆ విద్యలతో రిపుంజయుని తండ్రిని ప్రలోభపరచుకొని మగధసేనాని అయ్యాడు. కుటిల రాజనీతిలోనూ, కుటిలతంత్రంలోనూ అందె వేసిన చెయ్యి. రాజుని తొలగించి రాజ్యాన్ని హస్తగతమొనర్చుకొనే ప్రయత్నంలో ఆటవిక ఔషధాలతో రాజుని వ్యాధిగ్రస్తుని చేసి రాజగృహమంతటా తన సైనికులని నియమించాడు. ఈ మునీకుని కుమారుడే ప్రద్యోతనుడు. రిపుంజయుని కుమార్తె తులసి, ప్రద్యోతనుని కుమార్తె పద్మావతి సహాధ్యాయులు. ప్రద్యోతనుడు వీరిద్దరికీ నాట్యవిద్యలో మెళుకువలను నేర్పే గురువు కాని గురువు. మునీకుని కుమారుడైనప్పటికీ తండ్రి అసద్వర్తనం, కుటిలనీతి ప్రద్యోతనునికి సంక్రమించలేదు. ఈ ప్రద్యోతనునే రాకుమార్తె తులసి ప్రేమించినది.

వింధ్యగిరిస్వామి నెరపే వామాచారంలో సత్కులీనలైన స్త్రీల మానభంగం ప్రాధాన్యం వహిస్తుంది. ఈ విధంగా దేశాన్ని భ్రష్టుపరచి, తన భగవ్ద్వైరాన్ని కొనసాగించాలనేది ఈతని పధకం. అయితే ఆతని మాయావాగురలో తగుల్కొని వీరభక్తులుగా మారిన స్త్రీలు అది పరమేశ్వరి సమర్పణగానే భావిస్తారు. ఈ విధమైన మాయావాగురలో తగులుకొన్న స్త్రీలలో మహారాణి మహేశ్వరి ఒకతె. తన కూతురు తులసిని కూడా ఈ తుచ్చకార్యంలో భాగం చేయనున్న వింధ్యగిరిస్వామి మీద ప్రత్యయం పూర్తిగా నశించిపోగా అతని ఆదేశాన్ని మహేశ్వరి తృణీకరిస్తుంది. స్వామి తన వద్దనున్న క్షుద్రశక్తుల సహాయంతో తులసికి విపరీతమైన శిరోభారాన్ని కలుగజేయగా మగధదేశవాసి, సదాచారశీలి, వైదికమంత్రవేత్త అయిన గంగాధరశర్మ తనవద్దనున్న మహామంత్రం సహాయంతో ఆ శిరోవేదనని దూరం చేస్తాడు.
మునీకుడొనర్చిన విషప్రయోగం కారణంగా రాజా మరణించగా అధికారాన్ని హస్తగతమొనర్చటానికి ప్రయత్నించిన మునీకుని మహారాణి ఎదుర్కొంటుంది. ఈ సంధర్భంలో రాజభక్తిపరుడైన ప్రద్యోతనుడు తన తండ్రి కౌటిల్యాన్ని నిరసించి, అంత:పుర అధికారి గంధవాహుని సహాయంతో కోటలోని అంతర్గతకలహాలని నివారిస్తాడు. సర్వసభ్య సమావేశంలో మునీకుడు దోషిగా నిరూపితుడైన అనంతరం తులసి ప్రద్యోతనుడే తన భర్త అనీ, అతడే భవిష్య రాజ్యాధికారి అనీ, తన తండ్రికి అపరకర్మలు నిర్వహించటానికి అతడే అర్హుడని ప్రకటిస్తుంది. మునీకుడు బంధితుడైనప్పటికీ, కారాగారం నుండి విడుదలపొంది వింధ్య కాంతారాల్లోకి విసర్జితుడవుతాడు.
అరాచకమైన రాజ్యాన్ని భద్రపరచి, ప్రద్యోతనుని చేతిలోపెట్టి, మహేశ్వరి గంధవాహనుని సహాయంతో వింధ్యకాంతారాల్లో ఉన్న మునీక వింధ్యగిరిస్వాములను ఎదుర్కొంటుంది. మునీకుడు గంధవాహుని ఖడ్గానికి ఎరకగా, వింధ్యగిరిస్వామి తనవద్దనున్న హుంకారమనే మంత్రపూరితమైన ఖడ్గప్రయోగంతో మహేశ్వరీ గంధవాహనులని సం హరిస్తాడు. తన ఆశయాలన్నీ విశ్లధంకాగా (జయద్రధుడు) వింధ్యగిరిస్వామి చివరకు చితి పేర్చుకొని, తాను నేర్చిన ఇంధనవిద్య నుపాసించి, అందులో ఆహుతి అయుపోతాడు. ఈతని చితి నుంచి బయల్వెడలిన ధూమం ఆకాసమంతా వ్యాపించి, సముద్రాలను దాటి దేశదేశాంతరాలకు వ్యాపించింది. ఇదే “నాస్తిక ధూమం”.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *