May 6, 2024

సంస్కరణ (కథ )

రచన : జీడిగుంట నరసింహ మూర్తి

“బాబూ మీ హోటల్లో కాఫీ ఒక్కటే ఆర్డర్ ఇస్తే తీసుకు రారా ?” అంటూ కొద్దిగా కోపంగానే మొహం పెట్టి అడిగాడు గోపాలం సర్వర్ వైపు చూస్తూ. తను సంధించిన ప్రశ్న ప్రొప్రయిటర్ కూడా విన్నాడా లేదా అని అటువైపు కూడా చూసాడు. ప్రొప్రయిటర్ నిర్లక్ష్యంగా డబ్బులు లెక్కెట్టుకునే పనిలో బిజీగా వున్నాడు. . అప్పటికే గోపాలం ఆ హోటల్ కి వచ్చి అరగంటకు పైగా అయ్యింది.
“అవతల పెద్ద పెద్ద ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళు చాలా సేపట్నుంచి ఎదురు చూస్తున్నారు “ అంటూ సర్వర్ గోపాలం మొహాన్ని ఎగాదిగా చూసుకుంటూ లోపలికి వెళ్లి పోయాడు. అతని చూపుల్లో “ నీ ఒక్క బోడి కాఫీ కోసం సీటు ఆఫర్ చేసిందే గొప్ప “ అన్న అర్ధం గోచరిస్తోంది..
“సరే పెద్ద పెద్ద ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళ విషయమే నువ్వూ, నీ ప్రొప్రయిటర్ చూసుకోండి నేను వెళుతున్నాను “ అంటూ కోపంగా బయటకు వచ్చేసాడు. గోపాలం..
మరో రోజు అక్కడేదో కొత్త హోటల్లా కనిపిస్తే పొద్దున్నే వాకింగ్ చేసి వస్తూండే సరికి బాగా నీరసం ఆవరించి లోపలికి వెళ్లి అతని ఫేవరేట్ ఐటెం ఇడ్లీ, సాంబార్ ఆర్డర్ ఇచ్చాడు. అయితే ఆ హోటల్లో సాంబార్ చల్లగా ఉండటం దాంట్లో ఏదో రంపపు పొట్టు లాంటి పదార్ధం కలిపినట్టుగా అనుమానం రావడం, వెంటనే వాంతి చేసుకోబోయి తమాయించుకుని ఒక రెండు నిమిషాల తర్వాత సరాసరి హోటల్ ప్రొప్రయిటర్ దగ్గరకు వెళ్లి
“ బాబూ ఈ హోటల్ బహుశా ఈ మధ్యే పెట్టి ఉంటారు. పదార్ధాల మీద అంత శ్రద్ద లేకపోతే ఎలాగండి ? ఆ ఇడ్లీ తిని చూడండి వేడిగా లేకపోతే మానె కనీసం సాంబారైనా వేడిగా ఉంచాలని మీకనిపించదా ? పైగా దాని రుచి చూస్తేనే వికారం వచ్చేస్తోంది. ఇక కాఫీ చూస్తే సరే సరి. చూసే వాళ్లకు అది కాఫీనా కూల్ డ్రింకా అన్న అనుమానం రాక మానదు. దానితో పాటు మీ సర్వర్ను ఒక స్ట్రా కూడా ఇమ్మని చెపితే బాగుంటుంది. . చూస్తూ చూస్తూ హోటళ్ళను తగలేస్తున్నారండీ !” అంటూ అప్పటివరకు బిగపెట్టుకున్న ఆవేశాన్ని ఒక్కసారిగా ప్రొప్రయిటర్ మొహంమీద వెళ్ళగక్కేసాడు..
పొద్దున్నే అనుకోకుండా ఇలాంటి ప్రతిఘటన ఎదురయ్యేసరికి ప్రొప్రయిటర్ ఒక నిమిషం సేపు విభ్రమ చెంది అంతలోనే తేరుకుని సాధ్యమైనంతవరకు గొంతు తగ్గించి “మాస్టారూ పది గంటల కొచ్చి సాంబారు వేడిగా కావాలంటే ఏ హోటల్లోను ఇవ్వరు. ఉదయం ఎనిమిది లోపు వచ్చి అప్పుడు అడగండి “ అన్నాడు . మామూలుగా అన్నా అతని గొంతులో రవ్వంత హేళన తొంగిచూసింది..
మర్నాడు గోపాలం పనిగట్టుకుని ఏడు గంటలకే నిన్న వెళ్ళిన హోటలకి వెళ్ళాడు. ఆ రోజు సాంబారు ముట్టుకోగానే చెయ్యి కాలినంత పనయ్యింది.. .
గోపాలం ప్రొప్రయిటర్ కేబిన్ దగ్గరికి వెళ్ళాడు
“ బాబూ అన్న మాట ప్రకారం ఈరోజు సాంబారు చెయ్యి కాలేటట్టు పెట్టారయ్యా !” అన్నాడు.
ప్రొప్రయిటర్ ముఖం జేవురించి నట్టయ్యింది.
“తెలిసింది కదా ఇక నుండి తొందరపడి అనవసరంగా కామెంట్లు చెయ్యకండి.“ అన్నాడు అతను పూర్తిగా గోపాలం మొహంలోకి చూడకుండానే.. అతని మాటల్లో మృదుత్వం ఏ కోశానా కనిపించడం లేదు.
గోపాలం బలవంతంగా నిగ్రహించుకున్నాడు. అతని ముఖం అప్రసన్నంగా మారింది.
“ బాబూ నన్ను మీరేమనా అనుకోండి . మీరింకా ఈ హోటల్ ఎంతో కాలం నడపగలరన్న నమ్మకం నాకు లేదు. ఇందాక నేను చెప్పింది మీ హోటల్లో సాంబారు వేడిగా ఉండి చెయ్యి కాలిందని చెప్పలేదు. ఐసు గడ్డలా ఉండి చెయ్యి కాలిందని చెప్పబోతున్నాను. మీరెప్పుడైనా మీ కస్టమర్లు చేసిన కంప్లైంట్స్ స్వయంగా అటెండ్ అయ్యారా ? హోటళ్ళలో కస్టమర్ల కంప్లైంట్స్ నుండి దూరంగా ఉండాలంటే హోటల్ యజమాని రోజుకొకసారైనా పరిసరాలు పర్యవేక్షిస్తూ ఉండాలి. మీరేమీ డబ్బులు తీసుకోకుండా ఊరికే పెట్టడం లేదు కదా ? కనీసం అన్న మాటమీద నిలబడటం నేర్చుకోండి .అర్ధం చేసుకోకుండా మా మీద ఆగ్రహపడితే ఏం ఉపయోగం ? వ్యాపారస్తులకు ఇది తగదు “ అంటూ ఘాటుగానే చురక వేసాడు గోపాలం.. అతని మాటల్లో కోపం ఉంది. క్రోధం ఉంది. ఇంకా ఆవేదన కూడా ఉంది.
మంచైనా, చెడైనా మొహమ్మీద చెప్పేయడం గోపాలానికి అతని వృత్తిలో అలవాటైన విద్య. దానివల్ల అతనికి చాలామంది శత్రువులు తయారయ్యారు. కాని నిజాన్ని నిర్భయంగా చెప్పగలుగు తున్నందుకు అతనికి గర్వంగా ఉంటుంది.
రోజూ వాకింగ్ కని అటువైపే వెళుతూ ఉండడంతో కాకతాళీయంగా అతను తను దెబ్బలాట పెట్టుకున్న హోటల్ వైపు చూసాడు. అక్కడ మనుషుల అలికిడి లేదు. . అలా వరసగా వారం రోజులు హోటల్ మూసే ఉండటంతో ఉండబట్టలేక ప్రక్కనున్న కిళ్ళీ బడ్డి అతన్ని అడిగేసాడు గోపాలం…
“ ఏమో సారూ జనాలు ఎవ్వరూ రావటం లేదంట. హోటల్లో పదార్ధాలు ఏవీ బాగుండవు అంటూ కస్టమర్లు చెప్పుకుంటూ వుంటారు. హోటల్ అమ్మేసాడంటారు కొంతమంది ” అంటూ అతను తన పనిలో పడి పోయాడు.
గోపాలం మనస్సు చివుక్కుమన్నా “ నా హెచ్చరికను పెడచెవిన పెట్టడం వల్లనే అతను హోటల్ మూసుకుని వెళ్ళిపోయాడు. ఆవేశం, ఉద్వేగం, ఉద్రేకం, ఏ వృత్తిలో ఉన్న వాళ్ళనైనా శక్తి యుక్తులను చంపేస్తుంది. ఆ హోటల్ వాడి విషయంలో అదే జరిగింది “ అనుకున్నాడు గోపాలం..
సరిగ్గా వారం రోజులకు ఆ హోటల్ షట్టర్ తెరిచి ఉంది. “ వీడి దుంప తెగిపోనూ మళ్ళీ తెరిచాడూ ? “ అనుకుంటూ లోపలి కెళ్ళి చూసాడు గోపాలం.
“ఏం కావాలి సార్ ?” అంటూ లోపల కూర్చున్న వ్యక్తి ఒకతను పలకరించాడు.
“ ఇంతకు ముందు ఈ హోటల్ వేరే వాళ్ళ కింద ఉండేదనుకుంటా ఎవరో కొత్త వాళ్ళు కనపడితే పలకరిద్దామని వచ్చాను “ అన్నాడు గోపాలం అసలు విషయం కూపీ లాగాలని చూస్తూ.
“ ఇంతకు ముందు వాళ్ళు నష్టం వచ్చిందని మాకు అమ్మేసారు లెండి “ అన్నాడతను తాపీగా.
“ చూడు బాబూ మీరు ఏమీ అనుకోకపోతే ఒక మాట. నేనో పెద్ద కంపనీలో మార్కెటింగ్ ఆఫీసర్ గా చేసి రిటైరయ్యాను.ఇక్కడ ఒక కిలో మీటర్ దూరంలో మా సొంత ఇల్లు ఉంది. అంటే స్ధానికుడి నన్న మాట. అడిగినా అడగక పోయినా నాకు సలహాలు ఇవ్వడం అలవాటై పోయింది.. . ఎవరైనా పొరపాటు పనులు చేస్తూంటే వాటిని నాకు చేతనయినంత వరకు సరిచెయ్యడానికి ప్రయత్నం.. . ఈ విషయంలో ఎవ్వరి నుండి ఒక్క పైసా ఆశించే వాడిని కాదు. ఇంతకు ముందు ఈ హోటల్ నడిపిన వాడికి చిలక్కి చెప్పినట్టు చెప్పాను పొరపాట్లు చేస్తున్నావని . అతనికి కళ్ళు నెత్తికెక్కి నా మాట పెడచెవిన పెట్టి నాశనం కొని తెచ్చుకున్నాడు. ఇదే చోట ఇప్పుడు మీరు హోటల్ తెరవాలని చూస్తున్నారు మరి. మీకు కొన్ని సలహాలు ఇవ్వొచ్చునా? “ అంటూ అడిగాడు గోపాలం. తనగురించి చెప్పుకోవడంలో అతని ఛాతి ఉప్పొంగింది.
“అయ్యో దానిదేముందండీ పెద్దవాళ్ళు. మీకన్నా శ్రేయోభిలాషులు ఎవరుంటారు ?“ అంటూ కూర్చోండి అంటూ కుర్చీ చూపించాడు అతను..
పైగా గోపాలం పైసా ఆశించే వాడిని కాదనడంతో అతనికి ధైర్యం వచ్చింది.
“ చూడు బాబూ కక్కుర్తి పడకుండా పూరీలు స్వచమైన గోధుమ పిండి తోనే చెయ్యండి . మైదా పొరపాటున కూడా కలపద్దు. అది అనారోగ్యానికి హేతువు. నూనె ఏ రోజుది ఆ రోజు ఉపయోగించండి. దాంట్లో వేరే నూనెలు కలపద్దు. చాలామంది నూనె మార్చకుండా వారం పది రోజులు పాత నూనెకు కొత్త నూనె జోడిస్తూ కస్టమర్స్ ఆరోగ్యం పట్టించుకోవడం మానేస్తున్నారు . ఇలా కాని చేస్తే కామెర్ల రోగం , కాన్సర్ లాంటి పెద్ద జబ్బులు కూడా రావడం కాయం. ఇంకా చాలామంది దోశలకు ప్రత్యేకంగా నూనె ఉపయోగించకుండా పక్కనే పూరీలు వేయిస్తున్న మరుగుతున్న నూనె వేస్తున్నారే తప్ప వాటికంటూ వేరే నూనె ఉపయోగించడం లేదు. ఇదీ చాలా ప్రమాదం. కొద్దిగా రేట్ ఎక్కువున్నా కస్టమర్స్ పట్టించుకోరు కాని ఇలాంటి ప్రమాదకరమైన పనులు మాత్రం చెయ్యకండి. ఇక తాగే నీళ్ళ విషయంలో రాజీ పడకండి. స్వచ్చమైన మంచినీరు అందివ్వండి. వాష్ బేసిన్ దగ్గర ఎప్పుడూ ఒక సబ్బు పెట్టండి. సర్వర్స్ ఎప్పుడూ నీటుగా వుండేటట్టు చూడండి . కింద పడ్డ ఐటమ్స్ పొరపాటున కూడా సర్వ్ చెయ్యకుండా చూడండి.. . . . మీరు కొత్తగా హోటల్ తెరిచారు కాబట్టి కాస్త రేట్లు ఎక్కువైనా కొన్ని ఆధునిక పద్దతులు పాటించండి. చాలా హోటళ్ళలో పదార్ధాలు తయారుచేసే రూమ్కు నో ఎంట్రీ పెడతారు. అంటే అక్కడ జరుగుతున్న ఘాతుకాలు ఎవరూ చూడకూడదనే కదా ! కాని మీరు అలా కాకుండా కొత్త పద్దతిలో అటువంటి బోర్డులు పెట్టకుండా కస్టమర్లకు మీ మీద విశ్వాసం కలిపించండి. అప్పుడప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవడం వల్ల అది మీ అభివృద్దికి ఎంతో బాగా దోహదపడుతుంది. అదే మీకు శ్రీ రామ రక్ష” అంటూ సలహా ఇచ్చి అక్కడనుండి వెళ్ళబోయాడు గోపాలం..
“అలాగే మాస్టారూ మీరు చెప్పింది తప్పకుండా అమలు చేస్తాం. ఇందులో మాకు పోయిందంటూ ఏమీ లేదు. కస్టమర్ల సంతృప్తి కన్నా మించింది మాకు వేరే లేదు. మాకు ఈ ఒక్క చోటే కాకుండా ఈ ఊళ్ళో నాలుగైదు చోట్ల హోటళ్ళు ఉన్నాయి. ఎక్కడా నో కంప్లయింట్.” అన్నాడు గర్వంగా చూస్తూ. తన మాటకు విలువ ఇచ్చినందుకు అతనికి కృతజ్ఞతలు చెప్పి అక్కడనుండి కదిలాడు గోపాలం..
ఒక నెల రోజుల తర్వాత గోపాలం వియ్యంకుడు ఊళ్ళోకి రావడంతో పిచ్చా పాటి తను రిటైరయ్యాక ఎలా కాలక్షేపం చేస్తున్నాడో చెపుతూ ప్రముఖంగా హోటళ్ళను ఉద్దరించే కార్యక్రమాన్ని గూర్చి వివరించాడు. పనిలో పనిగా వియ్యంకుడిని ఈ మద్యే పునరుద్దరించిన హోటలికి తీసుకుని వెళ్ళాడు. అటూ ఇటూ తిరుగుతున్న వాహనాలు రేపుతున్న దుమ్మూ, ధూళీ పొగా కాలుష్యాల మధ్య బయటే పూరీలు, దోశలు వగైరా తయారు చేస్తూ వుండడటం గోపాలం కంట పడింది. . తను అంతగా చెవిలో ఇల్లు కట్టుకుని పోరినా పక్కనే మరుగుతున్న పూరీలు వేయిస్తున్న నూనెనే దోశల మీద వేస్తూ ఉండటం చూసాక గోపాలానికి అక్కడున్న వాతావరణం అసహ్యంగా,
భరించలేనట్టుగా అనిపించింది. ఇంకో పక్క పూరీ కూరమీద మూత లేక పోవడంతో భయంకరంగా పెద్ద పెద్ద ఈగలు వాలి వున్నాయి. కళ్ళ ఎదుటే ఘోరం జరుగుతున్నా ప్రేక్షకుడిలా కళ్ళప్పగించి చూడాల్సిన దుస్థితి వచ్చింది.
గోపాలం ఎదుర్కుంటున్న గందరగోళ పరిస్థితి చూసి అతని వియ్యంకుడు “ మీరు దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి బావగారూ ! ఈ సమాజంలో ఎవ్వరు ఎవ్వరిని మార్చాలనే ప్రయత్నం చేసినా అది వృధా ప్రయాసే అవుతుంది. కుక్క తోక వంకర అన్నట్లు వాళ్లకు నచ్చినట్టు, తోచినట్లు వాళ్ళు చేసుకుని పోతారు. అయినా అసలు ఏ వ్యవస్థ నైనా ప్రక్షాళన చెయ్యాలనుకోవడం, సంస్కరించాలనుకోవడం మన పనా చెప్పండి ? మనం పోయే దారిలో ఒక పెద్ద కొండ అవరోధంగా నిలిస్తే మనలో నిజంగా శక్తి ఉంటే దాన్ని పిండి చేసి దారికడ్డం తొలగించుకోగలగాలి. లేదా ఆ కొండ పక్కనుండి తప్పుకుని వెళ్లిపోవడం ఉత్తమం. పదండి బయటకొచ్చి చాలా సేపయ్యింది. ఇంట్లో వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ వుంటారు” అంటూ ఈ వ్యవస్తను ప్రక్షాళన చెయ్యాలనుకుని విఫల ప్రయత్నం చేస్తూ వికల మనస్కుడైన గోపాలాన్ని మనసు మళ్ళించే పనిలో పడ్డాడు ఆయన వియ్యంకుడు. .

xxxx సమాప్తం xxxx

6 thoughts on “సంస్కరణ (కథ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *