May 4, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 8

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య

malayappaswamiubhayanacchiyars1

మనస్సు అనేది చాలా విచిత్రమైనది. అది చెడుకు లొంగినంత సులభంగా మంచికి లొంగదు. మనస్సే బంధనానికి కాని, ముక్తికి కాని కారణమవుతుంది. మనస్సును నిగ్రహించడం జీవునికి అతిముఖ్యమైన పని. అర్జునుడంతటి స్థితప్రజ్ఞుడే, స్థిరచిత్తుడే, శ్రీకృష్ణునితో కృష్ణా! మనస్సు చాలా చంచలమైనది. అది సమస్త ఇంద్రియాలను క్షోభింపజేస్తుంది. ఇంద్రియ సుఖాలలోనే దృఢంగా ప్రవర్తిస్తుంది. అట్టి మనస్సును నిగ్రహించడం ప్రతికూలమైన వాయువును అడ్డుకోవడమంతటి దుష్కరం అని వాపోవడం గమనార్హం. మనశ్చాంచల్యం చాలా చిత్రమైనది కూడా. అది నిరంతరం అభ్యస్తమైన విషయాలలో కూడా నిలకడగా ఉండదు. అలాంటి మనస్సును భగవంతునియందు నిలపడం అనుకున్నంత సులభమైన పని కాదు. వేపమానును పాలుపోసి పెంచితే చేదు వదలనట్లుగా, కుక్కతోక వంకర వదలనట్లుగా, గొడ్డలిని నీట నానబెడితే మెత్తబడనట్లుగా, తేలుతో స్నేహం చేసినా అది కుట్టక మాననట్లుగా, చిత్తం అనేది ఎన్ని మంచి మాటలువిన్నా, మరల మరల అదే చెడు తలంపులతో పరిభ్రమిస్తూ ఉంటుంది. అదే విషయాన్ని అన్నమయ్య చెప్తున్నాడు ఈ కీర్తనలో అన్నమయ్య.

పల్లవి: భారమైన వేపమాను పాలువోసి పెంచినాను
తీరని చేదేకాక దియ్యనుండీనా

చ.1 పాయదీసి కుక్కతోక బద్దలు వెట్టి బిగిసి
చాయ కెంతగట్టినాను చక్కనుండీనా
కాయపు వికారమిది కలకాలము జెప్పినా
పోయిన పోకలే కాక బుద్ధి వినీనా || భారమైన||

చ.2 ముంచిముంచి నీటిలోన మూల నానబెట్టుకొన్నా
మించిన గొడ్డలి నేడు మెత్తనయ్యి నా
పంచమహాపాతకాల బారి బడ్డచిత్తమిది
దంచి దంచి చెప్పినాను తాకి వంగీనా || భారమైన||

చ.3 కూరిమితో దేలుదెచ్చి కోకలోన బెట్టుకొన్నా
సారె సారె గుట్టుగాక చక్కనుండీనా
వేరు లేని మహిమల వేంకటవిభుని కృప
ఘోరమైన ఆస మేలుకోర సోకీనా || భారమైన||
(ఆ.సం.రాగి రేకు 47 – వ.సం.287)

విశ్లేషణ:
పల్లవి: భారమైన వేపమాను పాలువోసి పెంచినాను
తీరని చేదేకాక దియ్యనుండీనా

ఆ.వె. వేము పాలు వోసి ప్రేమతోఁ బెంచిన / చేదు విఱిగి తీపి చెంద బోదు/ ఓగు నోగేఁగాక యుచితజ్ఞుఁ డెటులౌను
విశ్వదాభిరామ వినురవేమ ! – ఈ వేమన పద్యం అందరికీ విదితమే! వేపచెట్టు కి పాలుపోసి పెంచినా దాని సహజసిద్దమైన చేదు పోయి తీపిదనం రాదు. అదేవిధంగా చెడ్డవాడు చెడ్డవాడే కాని ఎన్ని మంచి మాటలు చెప్పినా చెడ్డవాణ్ణి మంచి వానిగా మార్చలేము అంటూ ఆటవెలదులను ఈటెగా విసిరిన దిట్ట చెప్పిన మాటలు ఎన్నటికీ మరువలేము. అలాగే అన్నమయ్య కూడా చిత్తాన్ని గూర్చిన చిత్రాలు అనేకం అంటూ రకరకాల దృష్టాంతాలు తెలియజేస్తున్నాడు.

జీవునికి మనస్సనేది వేపమాను లాంటిది. నిత్యం చెడు తలంపులే దాని వృత్తి. ఎంత తియ్యటి పాలను అనుదినము పోసినా చేదే తప్ప తీపిరాదు అనగా చెడు తలపులు చిత్తాన్ని వీడడంలేదు అంటున్నాడు అన్నమయ్య. రోజూ ఎన్నో మంచి మాటలను, ఉపదేశాలను వింటాం. దాలి గుంటలోని కుక్కరీతిగా అవన్నీ ఆ క్షణం మాత్రమే. అయ్యో! పాపం చేస్తున్నాం అనుకుంటాం. కానీ వెనువెంటనే అన్నీ మర్చిపోయి దైనందిన జీవితంలో తప్పులనే బురదలో పొర్లుతూ ఆనందిస్తూ ఉంటాము. అర్జునుడు భగవద్గీతలో మనందరి తరఫున భగవానునిని అడిగినది ఏమిటంటే..”చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢం, తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం”. దాని అర్ధం “ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది. బాగా మథించే స్వభావం కలది. దృఢమైనది. మిక్కిలి బలీయమైనది. కనుక దాన్ని నిగ్రహించడం గాలిని ఆపడంలా చాల దుష్కరంగా భావిస్తున్నాను” . అని శ్రీకృష్ణునితో అనగా.. జగద్గురువైన కృష్ణుడు అంటాడు.. “అసంశయం మహాబాహో! మనో దుర్నిగ్రహం చలం,అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే” అనగా…”ఓ మహాబాహూ! నిస్సందేహంగా మనస్సు చంచలమైనదే. దాన్ని వశపరచుకోవడం మహా కష్టం. కాని, అర్జునా! అభ్యాసం మరియూ వైరాగ్యం అనే రెండింటి ద్వారా దాన్ని వశం చేసుకోవడం సాధ్యమే.” అని చెప్పడం జరిగింది. అభ్యాసం అంటే అనుదినం నిరంతరం సాధనకై యత్నించడం, రాగం (రక్తి, అనురాగం) లేకపోవడమే విరాగం. దాని భావమే వైరాగ్యం అని శెలవిస్తాడు భగవానుడు. కనుక అభ్యాసం, వైరాగ్యం నిరంతర సాధనల ద్వారా మనిషి చిత్తాన్ని జయించవచ్చు.

చ.1 పాయదీసి కుక్కతోక బద్దలు వెట్టి బిగిసి
చాయ కెంతగట్టినాను చక్కనుండీనా
కాయపు వికారమిది కలకాలము జెప్పినా
పోయిన పోకలే కాక బుద్ధి వినీనా

సంస్కృతం లో “శ్వాన పుచ్ఛ న్యాయం” అనగా తెలుగులో “కుక్కతోక న్యాయం” అని అర్థం. దానినే మనం “కుక్కతోక వంకర” అని వాడుకలో ఉపయోగిస్తూ ఉంటాము. కుక్క తోకని తిన్నగా చేయాలని ఎంత ప్రయత్నం చేసినా దాని వంకరపోదు.”ఎలుగు తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా, నలుపు నలుపే గాని తెలుపు రాదు” అని వేమన అన్నట్లు, వంకర గుణాలు,వక్ర బుద్ధి ఉన్నవారిలో ఎంత ప్రయత్నించినా మార్పు రాదు. దీనినే అన్నమయ్య ఉదాహరణగా గ్రహిస్తూ… కుక్కతోకను కొయ్య బద్దలు పెట్టి ఎన్నిరోజులు కట్టి మరల విప్పినా వంకరను చక్కగా చేయలేము. అలాగే మనసు కూడా మాట వినినట్టే ఉంటుంది మరలా జారిపోయి పాతవాసనలతో గుభాళిస్తుంది. మన దేహంలోని రకరకాల వికారాలకు మనసుకు ఎన్ని మార్లు ఎన్నివిధాలుగా బుద్ధి చెప్పినప్పటికీ కుక్కతోక వంకర వలె తిరిగి అదే పోకలు పోవడం మరలా అదే స్థితి కొనసాగడం గురించి వాపోతున్నాడు అన్నమయ్య.
ఇంద్రియాలను, బుద్ధిని అదుపులో ఉంచుకోవడమే సంయమనం. ఇంద్రియాలలో ఏ ఒక్కటి చలించినా దానివల్ల చిల్లులున్న పాత్రలోని నీరు దిగజారిపోయినట్లు బుద్ధి దిగజారిపోతుంది. అంతఃకరణాన్ని అదుపు చేయడాన్ని శమము అనీ, ఇంద్రియాలను అదుపుచేయడాన్ని దమము అనీ అంటారు. మోక్షం పొందటానికీ, బంధంలో చిక్కుకుపోవడానికి కానీ ఇంద్రియాలే ప్రధాన కారణాలు అవుతున్నాయి. విషయ భోగాలందే శాంతి, సౌఖ్యాలు లభిస్తాయని భావించడం కేవలం మన భ్రాంతి మాత్రమే అవుతుంది. సహనం కలిగి ఉండడంవల్ల ధైర్యం గాంభీర్యం, వీరత్వం, ఆత్మబలం పెంపొందుతాయి. సహనానికి మూలం క్షమాబుద్ధి. ఎప్పుడు మానవుడు సంతోషదుఃఖాలకు లొంగకుండా ఉంటాడో, మానవుని మనస్సు ఇంద్రియాలతో సంపర్కం పొందినపుడు చిత్తంలో వికారం ఉదయింపకుండా ఉంటుందో అప్పుడే మానవుని జితేంద్రియునిగా లెక్కింపవచ్చు. అలాంటి షోడశవికారములు లేని బుద్ధిని ప్రసాదించమని అన్నముని విజ్ఞాపన!

చ.2 ముంచిముంచి నీటిలోన మూల నానబెట్టుకొన్నా
మించిన గొడ్డలి నేడు మెత్తనయ్యి నా
పంచమహాపాతకాల బారి బడ్డచిత్తమిది
దంచి దంచి చెప్పినాను తాకి వంగీనా

ఇనుప గొడ్డలిని నీటిలో ఎన్నిరోజులు నానబెట్టినా మెత్తబడుతుందా? అలాగే జీవుని చిత్తం సహితం ఎన్ని సార్లు ఎన్ని మంచి విషయాలు చెప్పినా లొంగక లౌకికమైన పాడు విషయ వాంఛల చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. తెలిసో తెలియకనో పంచమహాపాతకాల వంటి పాపాల పొదలో సదా సంచరించే మనసును దారికి తేగలగాలి. స్త్రీ హత్య, శిశు హత్య, గో హత్య, బ్రహ్మ హత్య, గురు హత్యలను పంచ మహాపాతకాలు అంటారు. దైనందిన జీవితంలో కూడా మనం వంట వండేప్పుడు కూరగాయలు తరిగేప్పుడో, అన్నం ఉడికించేప్పుడో మనకు తెలియకుండా కొన్ని సూక్ష్మ జీవులని సంహరిస్తుంటాం. అలా చేసినందుకు మనకు పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయి అంటుంటారు పెద్దలు. అయితే అన్నం మాని వీటిని నివృత్తి చేయలేం కనుక జీవుడు పంచ మహాయజ్ఞాలు చెయ్యాలని అంటారు. అవి దేవతలని ఆరాదించటం, మనకు శరీరం ఇచ్చినందుకు పితృ దేవతలను ఆరాదించటం, మన చుట్టూ ఉండే ప్రాణికోటితో భూతదయతో ప్రవర్తించటం, ధానధర్మాలు చెయ్యటం ఇలా మంచ మహాయజ్ఞాలు చెయ్యాలని అంటారు. ఒక రైతు పంట పండించేందుకు భూమి దున్నిన మొదలుకొని, క్రిమికీటకాదులని సంహారం చేస్తాడు కాబట్టి రైతు తప్పనిసరి పంచ మహాయజ్ఞం చెయ్యాల్సి వస్తుంది. ఇండ్లముందు వివిద ధాన్యాలను చల్లటం, ఇలా తమ వృద్దిని చూపటంతో పాటు లోపల భూత దయ ఇమిడి ఉంది. పంట ఇంటికి తెచ్చేముందు ప్రకృతి దేవతలకు ఆరగింపు చేస్తారు. ఇవన్నీ పంచమహా యజ్ఞాలే! ఇలాంటివన్నీ హరించి కేవలం పాపాలవైపే లాగేస్తున్న మనసును అరికట్టడం ఎలా? శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము అను ఆరింటిని శమాది షట్కసంపత్తి అంటారు. ఈ ఆరు లక్షణములు కలిగి ఉన్నవాడు తప్పనిసరిగా అత్మస్వరూపుడే అయి ఉంటాడు. ఏ పరిస్థితిలోను ఆకార బ్రాంతికి లోనవడు. అయితే.. నిత్యానిత్యవస్తు వివేకము, ఇహాముత్ర ఫలభోగ విరాగమును సంపాదించ కుండా శమాది షట్కసంపత్తిని ఆచరించుట వలన ప్రయోజనము ఏమి ఉండదు. అలాంటి వైరాగ్యాన్ని ప్రసాదిచమని కోరుతున్నాడు అన్నమయ్య.

చ.3 కూరిమితో దేలుదెచ్చి కోకలోన బెట్టుకొన్నా
సారె సారె గుట్టుగాక చక్కనుండీనా
వేరు లేని మహిమల వేంకటవిభుని కృప
ఘోరమైన ఆస మేలుకోర సోకీనా

ఎంతో స్నేహభావంతో తేలును తెచ్చుకొని తమ అంగ వస్త్రం లో పెట్టుకున్నా అది తన నిజ స్వభావం తో మళ్ళీ మళ్ళీ కుడుతూనే ఉంటుంది గానీ స్నేహితత్వం పాటిస్తుందా? అలాగే మనిషి యొక్క చిత్తం ఎన్నిసార్లైనా చెడు తలంపులతోనే ఉంటుంది కానీ బయటపడడానికి ఏమాత్రం ప్రయత్నించదు. బాహ్య వస్తువులను మనం చూసేది, వినేది, కేవలం బాహ్య ఇంద్రియాల సహాయం ద్వారా మాత్రమే. బాహ్యేంద్రియాలు ఎంతవరకు విషయాలను సేకరించి తెలుపగలవో అంతవరకు మాత్రమే మన మనస్సు తెలుసుకోగలదు. అదే భగవంతుని కృప కలిగితే తెర తొలగిపోతుంది. అప్పుడు అంతఃచేతన యొక్క అంతర్నేత్రం విడివడి భగవంతుని ముఖాముఖి స్పష్టంగా చూడగలుగుతుంది. అంతర్నేత్రం యొక్క దివ్యదృష్టి బాహ్యేంద్రియాలను కూడా సచేతనంగా మార్చగలదు. వీటన్నింటికీ ప్రాణాలను కూడా ఇవ్వగలంత ప్రేమ, పరిపూర్ణంగా అతని వద్ద తనని తాను నివేదించుకోగల సమర్పణ భావం కావాలి. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహపరలోక ఫలభోగ వైరాగ్యము, శమాది షట్కసంపత్తి, ముముక్షత్వము అను నాలిగింటిని సాధనా చతుష్టయ సంపత్తి అంటారు. సాధకుడు బ్రహ్మజ్ఞానమును అధ్యయనము చేసి అనుభవమునకు తెచ్చుకొనుటకు ఈ లక్షణములను అలవరచు కొని సంసిద్ధుడు కావలెను. సాధనా చతుష్టయ సంపత్తియే సాధకునికి నిజమైన సంపద. అటువంటి సాధనా బలంతో మహిమగల స్వామి శ్రీవేంకటేశ్వరుని కృపకు పాతృలు కాగలగడం గొప్ప అదృష్టం. కానీ అనేక ఘోరమైన ఆశలతో ఉన్న ఈ మానవులు అలాంటి మేలు కోరనిస్తుందా? అని ప్రశ్నిస్తున్నాడు అన్నమయ్య.

ముఖ్యమైన అర్ధములు: పాయ = రెండుగా చీల్చు; కాయపు = శరీరపు; వికారము = మనసు యొక్క మాఱుపాటు; కోక = వలువ, వస్త్రము; సారె = మాటిమాటికి; మేలుకోర = మేలుకోరే దిశగా.

విశేషాంశములు: షోడశవికారములు = జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, మనో బుద్ధి అహంకారములు 3, రజస్సత్వతమోగుణములు 3 షోడశవికారములు. జ్ఞానేంద్రియములు = కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మము; కర్మేంద్రియములు = కాళ్ళు, చేతులు, వాక్కు, గుదము, గుహ్యేంద్రియము.

*******************

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *