May 8, 2024

పిచ్చుకల్లేని ఇల్లు

రచన: గవిడి శ్రీనివాస్

p-358-figure-346-house-sparrow-mom-feeding-babies-cpjune2511_0137

ఇంటిలో వరికంకులు
దూలానికి రెక్కలు చాచుకు వేలాడినపుడు
చెంగు చెంగున
ఎగురుతూ తేలివచ్చిన పిచ్చుకలు
మనసు లోయల్లో ఊయలలూగేవి .

వరిచేను కోసిన దగ్గరనుంచీ
కుప్పలు నూర్చే వరకూ
కదులుతున్న నేస్తాలుగా ఉండేవి .

పిచ్చుకలల్లిన గూళ్ళు
ఇప్పటికీ మనసు పొరల్లో
జ్ఞాపకాల ఊటలు గా
సంచరిస్తూనే వున్నాయి .

పిచ్చుకల కిచకిచలు
ఇంటిలో మర్మోగుతుంటే
ఆప్యాయతలు బంధువల్లే నడిచొచ్చినట్టు
గుండె లోతుల్లోంచి అభిమానం
తీగలై లాగుతున్నట్లు
తెలియని పరవశం
పరిచయమయ్యేది .

ఎండుతున్న వొడియాల చుట్టూ
పిచ్చికలు
వాటి చుట్టూ పిల్లలు
ఓ పసందైన ఆటలా ఉండేది .

ఇప్పుడు పిచ్చుకల్లేని ఇంటిలో
ఆ శబ్ద పరిమళమేదీ .

కృత్రిమ ప్రపంచపు అంచుల్లో
విషపు ఎరువుల లోకం లో
కలుషిత వనాల్లో
ఎగరాల్సిన పిచ్చుకలు
సందడి చేయాల్సిన కిచకిచలు
అలా రాలిపోతున్నాయి .

గుండెను తడుముతూ
కాల శిల్పం మీద
కొన్ని కొన్ని జ్ఞాపకాలుగా
వాలిపోతున్నాయి .

1 thought on “పిచ్చుకల్లేని ఇల్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *