May 7, 2024

మట్టైనా..మనిషైనా..

రచన: అశోక్ అవారి

ఇనుప నాగళ్ళేసి
ఇష్టంగా భూమి దున్నినప్పుడు
మట్టి రేణువులన్నీ..
ఎగుడు దిగుడుగా
చిన్నచిన్న పెళ్లలుగా
మరిన్ని మట్టి బెడ్డలుగా
మాధుర్య మట్టి పరిమళాన్ని..
పుప్పొడిలా వెదజల్లుతూ.

నీరుపారితే కుంగుతూ చదునవుతుంటుంది
విత్తు విత్తితే చిగురు మొలకై మొలుస్తుంది
పాడి పంటై కర్షకుల పాలిట వరమవుతుంది
ఫలితం అందాలంటే పనిచేయాల్సిందే మిత్రమా !

మొక్క చెట్టై నిలిచేదీ..
వేరు బలంగా దిగినప్పుడే కదా !
గోడలు మేడలయ్యేదీ..
పునాది దృఢమై నిలిచినప్పుడే కదా!
స్వేదం చిందిస్తే కానిదేదీ లేనే లేదు నేస్తమా !

దేహ స్థలాన్ని
శ్రమ హలంతో దున్నినపుడే కదా!
ఘర్మజల పంట పండేది.
మనసు పొరల్ని
లక్ష్య కలంతో తొలిచినప్పుడే కదా!
చైతన్య మంట మండేది.

మట్టైనా….
మనిషైనా..
సాగు చేస్తేనే సస్య శ్యామలం.
సాధన చేస్తేనే కరతలామలకం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *