May 7, 2024

స్నేహధర్మము

రచన-బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి

ఆటపాటల్లో స్నేహాలు వేరు. వయసు పెరిగాక, వ్యక్తిత్వం ఏర్పడినాక స్నేహాలు వేరు. బాల్యంలో, మంచి చెడు తెలియని కాలంలో ఆటల మాటల పాటల తోడుగా వచ్చే స్నేహంలో బాధ్యత ఉండదు. బంధం మాత్రమే ఉంటుంది. కానీ విచక్షణా జ్ఞానం తెలిసిన తర్వాత ప్రతి బంధంలోనూ, ప్రతి కర్తవ్యంలోనూ ఒక బాధ్యత ఏర్పడినట్టే, స్నేహబంధంలో కూడా ఒక బాధ్యత ఏర్పడుతుంది. స్నేహ ధర్మమంటే అదే. అంతే కానీ స్నేహితులు చేసిన ప్రతి పనీ, వ్రాసిన ప్రతి రచనా, పట్టిన ప్రతి పంతమూ సరైనవే అని నమ్మడం కానీ, అనుసరించడం కానీ నిజమైన స్నేహధర్మానికి వ్యతిరేకం.

యుక్తము, అయుక్తము /తగినది, తగనిది అని తెలుసుకునే జ్ఞానం వచ్చిన తరువాత స్నేహితులలో ఎవరైనా తప్పుదారిలో వెళుతున్నప్పుడు హెచ్చరించడం చాలా ముఖ్యమైనది. స్నేహితుల్లో ఎవరికి అవసరమైనా సహాయం చేయడానికి ముందుకు వచ్చినట్లే, తప్పు అనిపించినపుడు చెప్పడం మంచిది. ఇందులో ఇంకో సమస్య ఉంది. ఏది తప్పు ఏది ఒప్పు అనే నిర్ణయం ఎట్లా చేయడం? ఒకరికి తప్పు అనిపించినది ఇంకొకరికి ఒప్పు అనిపించవచ్చు కదా? అప్పుడే చర్చ యొక్క పాత్ర వెలుగులోనికి వస్తుంది. తప్పొప్పుల చర్చలో ఎవరూ ‘పెద్ద’ గా ఉండవలసిన అవసరం లేదు. అసలు చర్చంటూ జరిగితే, ఏ విధంగా ఇది సమాజానికి ఉపయోగపడేది లేదా అవతలి వారికి అనవసరంగా హాని కలిగించే పనా అనే అభిప్రాయం బయటికి వచ్చినపుడు ఎవరి మనస్సాక్షికి వారికే ఆ మాట ఒప్పుకో తగినదా, కాదా అన్నది తెలుస్తుంది. కానీ స్వార్థప్రయోజనాలకు, తాత్కాలిక ప్రయోజనాలకు విలువ ఇస్తూ మనం ఒప్పుని ఒప్పుగా స్వీకరించలేని బలహీనతకు లోనవుతుంటాము.

చాలాకాలంగా స్నేహితులైన వారికి ఒకరి బలహీనతలు ఒకరికి తెలుస్తాయి. ఈ విషయంలో తొందరపడి తప్పుచేస్తారేమో అని మనసుకు అనిపించినపుడు చెప్పడం స్నేహధర్మం. పాటించడం, పాటించకపోవడం అవతలివారి ఇష్టమే కానీ, అసలు చెప్పకుండా ఉండిపోవడం ఆ స్నేహితునికి, తనకూ, ఆ స్నేహానికే కాక సమాజానికి కూడా హాని చేయవచ్చు.

పరీక్షలు బాగా వ్రాయలేదనో, ఇంట్లో వాళ్ళో బయటివాళ్ళో ఏమన్నా అన్నారనో ఆత్మహత్యలకు పాల్పడేవారు, ఉద్యమాలకు బలిదానం అనుకొని మృత్యువును వరించేవారు, తీర్చలేని సమస్యల బారిన పడి జీవితం చాలించేవారెందరో ఆ నిముషం దాటితే రక్షింపబడే వారే. విలువైన ఆ నిముషాన్ని దాటించి, తోడుగా నిలబడడం స్నేహధర్మము. అంతే గానీ రెచ్చగొట్టడం, అనవసర సానుభూతి కురిపించి మరింత క్రుంగిపోయేలా చేయడం, అంతా అయిపోయాక ఆత్మహత్యను సమాజం మీద తోసేస్తూ సంతాపాలు వెలిబుచ్చడం కాకుండా, ధైర్యాన్నివ్వడమే స్నేహధర్మము. ఏ మార్గం మూసుకుపోయినా జీవితం ఆగిపోవలసిన అవసరం లేదని, ఇంకో మార్గం అన్వేషిస్తే దొరక్కుండా పోదని ధైర్యం చెప్పాలి. మనకు ఎవరి వల్ల ఏం జరగలేదో చింతించే బదులు, మనవల్ల ఇంకొకరికి ఏ కాస్తైనా జరిగే అవకాశం ఉందా, సమాజమో కుటుంబమో ఏదో ఒకదానికైనా మనం ఏం చేయగలమో ఆలోచిస్తే గొప్ప మేలు జరుగుతుందని చెప్పడము స్నేహధర్మము.

స్నేహధర్మాన్ని చక్కగా నిర్వర్తించినవారు, స్వార్థప్రయోజనం కోసం స్నేహధర్మాన్ని వక్రమార్గంలో నిర్వర్తించినవారు రెండు రకాలవారి స్నేహమూ ప్రసిద్ధికెక్కవచ్చు. వాటిలో ఏది ఆత్మోన్నతికి, ఏది ఆత్మపతనానికి దారితీస్తుందో తెలియచేసే ఉదాహరణలు మనకు భారతంలో కనిపిస్తాయి.

అర్జునుడు యుద్ధ సమయంలో నిర్వీర్యుడైనపుడు, కర్తవ్యోన్ముఖుని చేసి శ్రీకృష్ణుడు తన స్నేహధర్మాన్ని చక్కగా అమలుపరిచాడు. ధర్మరాజుతో పాటు ఆవేశానికి గురియయిన అర్జునుని నివారించినపుడు, వనవాస సమయంలో ఎప్పటికప్పుడు వారు ధర్మమార్గాన్ని బలహీనతలకు గురై వీడకుండా స్నేహితుడై కాపాడాడు. ధర్మప్రియులైనప్పటికీ, కష్టాల కొలిమిలో కొట్టుకుపోతున్నప్పుడు దారి తప్పే సందర్భాలు మానవులకు సహజం. కాబట్టి ధర్మాచరణ చేయాలనుకున్న ఉత్తములకు పరీక్షలవంటి సమయాలలో అండగా నిలిచాడు. ఇందులో శ్రీకృష్ణుని స్వార్థ ప్రయోజనాలేవీ లేవు.

సహనాన్ని, మంచితనాన్ని, ధైర్యాన్ని పెంచడానికే శ్రీకృష్ణుని స్నేహధర్మం ఉపయోగపడింది. తద్వారా అర్జునుని ఆత్మోన్నతికి, సమాజహితానికి ఉపయోగపడింది.
తన స్వార్థప్రయోజనం నెరవేర్చినవాడైన దుర్యోధనుడు ఏ తప్పు చేసినా ఇంకా రెచ్చగొట్టినవాడు కర్ణుడు. స్నేహితులు మదమాత్సర్యాలతో ప్రవర్తిస్తున్నపుడు, వారికి తన బలంతో అండగా రావడం స్నేహధర్మం కాదు. అదే స్నేహధర్మమైతే అది వారిని ఏనాడూ కాపాడలేదు. వారి ఆత్మోన్నతి జరగలేదు సరికదా, సమాజానికి మరింత హాని జరిగింది. ఫలితంగా వారిరువురూ, వారి చుట్టూ ఉన్నవారు ఏనాడూ సహనాన్ని పెంచుకోలేకపోయారు,శాంతి పంచలేకపోయారు. తన కష్టసమయంలో అండగా ఉన్నాడు కాబట్టి స్నేహితుడైన వాడు కర్ణుడు. తన స్వంత యుక్తాయుక్త విచక్షణ ఏనాడూ ఉపయోగించి దుర్యోధనునికి మంచి చెప్పలేకపోయాడు. దుర్యోధనునికి దాసానుదాసునిగా తన ఆత్మను బానిసగా ఉంచి అధికారమదంతో ఏం చేస్తున్నా, అండగా నిలబడ్డాడు. కొండొకచో మరింత రెచ్చగొట్టాడు.

ఇంట్లో తల్లిదండ్రులు గానీ, తోబుట్టువులు గానీ మనం కొండమీది కోతి కావాలంటే తెచ్చిస్తుంటే ఏమౌతుంది? మనం దేనికీ పనికిరాకుండా పోతాము. దీక్ష, పట్టుదల, శ్రమపడే లక్షణం, పోటీపడే స్ఫూర్తి వీటన్నిటినీ పెంచినవారే మన ఉన్నతి కి కారకులు. అలా కాకుండా తానా తందానా అనే వారు చిట్టచివరికి మన పతనానికి కారకులవుతారు.

అదేవిధంగా స్నేహితులు కూడా సమయం, సందర్భం ఏర్పడినపుడు అవసరమైన సలహా ఇవ్వడం ద్వారా మంచి చేయడానికి ప్రయత్నించాలి. అంతే కానీ నాకెందుకనో, స్నేహం చెడిపోతుందనో, స్వార్థప్రయోజనాలు దెబ్బతింటాయనో చూసుకుంటే స్నేహితులకూ శత్రువులకూ తేడా ఏముంది?

ఔను, కాదు అన్న చర్చ కూడా జరగనివ్వనిదైతే అది స్నేహం ఎలా అవుతుంది? ఆపాటి చనువు లేకపోతే ఆ స్నేహానికి అర్థమేముంది?

“ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి నొప్పింపక తిరుగువారు ధన్యులని” చెప్పినది పరిచయంలేని వ్యక్తుల మధ్యలో, ముఖపరిచయం మాత్రమే ఉన్నవారి విషయంలో, తథాకథిత ‘ముఖపుస్తక’ పరిచయం మాత్రం ఉన్నవారి విషయంలో ఉండవచ్చు. అసలైన స్నేహితులకొఱకు ఆ పద్యం చెప్పబడలేదు.
నెయ్యము లోనను మాటలు
తియ్యగ నుండవలెనన్న దృష్టి తగద,దే
‘మయ్యా! మంచి, చెడులివని
కయ్యము కాకుండ చెప్పి ఘనుడవు కావోయ్.

బంధుత్వాల కన్నా ఎప్పుడూ ఒక మెట్టు పైనుండే స్నేహాలకు కాలక్షేపమే కాక ఒక పిసరు బాధ్యత కూడా ఎక్కువేనని గ్రహించాలి. అదీకాక ఇప్పుడు తల్లిదండ్రుల, గురువుల మాటలకన్నా తమ స్నేహితుల మాటైతేనే అర్థంచేసుకునే వాళ్ళెక్కువ. అటువంటప్పుడు స్నేహితులు ఇంకొంచెం బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా?

అమ్మాయిలను/అబ్బాయిలను ఏడిపించే వాళ్ళకు, చిన్నవే కదా ఎవరికి తెలుస్తుందిలే అని దొంగతనాలు చేసేవాళ్ళకు, బండి నడపడంలో నియమాలను గాలికి వదిలివేసి ఇతరులకు ప్రమాదాలు కలిగించేవాళ్ళకు, ప్రతీ ఉద్యమానికి బడులు మూయడాలు, బండ్లను ఆపేయడాలు, బడ్డీకొట్లు మూసేయడాలు చేసే వాళ్ళకు, వ్యసనాల బారిన పడుతున్నవాళ్ళకు స్నేహితులు లేరా? ఉంటే వాళ్ళకు తెలిసిన మంచీ చెడూ చెప్పవలసిన అవసరం లేదా?

తప్పకుండా ఉంది. దయచేసి మన మన సన్నిహిత స్నేహితులు తప్పు చేస్తున్నారనుకుంటే హెచ్చరిద్దాం. వద్దని చెప్దాం. ఇతరులకు ఇబ్బంది కలిగించడం తప్పు, తప్పని చెప్పడం తప్పుకాదు. ఎవరి తప్పులూ వ్యక్తిగతం కాదు. వాటి ప్రభావం ఇతరుల మీద తప్పకుండా పడుతుంది. గృహహింస నివారణలో భాగంగా ఈమధ్య వస్తున్న ప్రకటన గమనిస్తే, “ఎక్కడైనా ఏ ఇంట్లోనుంచైనా పెద్ద గొడవ వినిపిస్తూంటే నిర్లక్ష్యం చేయకండి. ఒక్కసారి తలుపు తట్టండి, పిలవండి” అని సందేశం ఇస్తున్న ఆ ప్రకటన విలువైనది. ఒక్క నిముషం ఆ ఒక్క విలువైన నిముషం ఆపగలిగితే కొంతవరకూ చెడును ఆపగలము. అదేవిధంగా తప్పును తప్పు అని చెప్పడం తప్పుకాదు అని తెలుసుకుందాం.
వీధిలో అందరకూ చెప్పలేము, రౌడీలకు, రాజకీయనాయకులకు చెప్పలేము, మన స్నేహితులకు చెప్పలేమా? ఈ స్నేహితులనుంచే లేఖకులు, విలేఖరులు, దర్శకులు ఎందరో తయారవుతున్నారు. ఈ చెడు లక్షణాలను గ్లోరిఫై చేసే అలవాటును చెప్పి మాన్పిద్దాం. స్నేహధర్మం పాటిద్దాం.

3 thoughts on “స్నేహధర్మము

  1. రాజ్యలక్ష్మి గారూ, గౌతమి గారూ ,
    మీకూ నచ్చింది. సంతోషం.
    కొంతకాలంగా మాలికలో వ్యాఖ్యలు నాకు డిస్ ప్లే అవలేదు. ఈరోజే చూశాను మీ స్పందనలు. ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *