May 8, 2024

వలస

రచన- గంటి సుజల (అనురాధ)

“మా అబ్బాయి అమెరికా వెడుతున్నాడు వదినా” అన్న మాటలు చెవిన పడ్డాయి. నా చిన్నప్పటినించీ ఈ మాట వింటున్నాను. అమెరికా ఏదో భూతల స్వర్గం అని అందరూ అక్కడికే పారిపోతున్నారు.మనిషి వలస వెళ్ళడం అన్నది అనాది నించీ వస్తోంది. ఇందులో కొత్త దనం ఏమీ లేదు.తన ఉన్నతి, స్వార్ధం కూడా మనిషికి అవసరమే.ప్రతిభ ఉన్నవాడు తన ప్రతిభకు గుర్తింపు కోసం వెడితే వెళ్ళిన వాళ్ళు బావుకున్నది తాము కూడా పొందాలని కొంత మంది వెడుతున్నారు.
విదేశాలలో ఉన్నదేమిటీ మన దేశంలో లేనిదేమిటి? అని ఆలోచిస్తే ప్రతిభ ఒక్కటే సరిపోదన్నది నిజం.దేశ రాజకీయాలు పక్కదోవ పట్టడమే. తనవాళ్ళకు పంచాలన్నది కొంత,రిజర్వేషన్ పేరుతో కొంత ప్రతిభకు గుర్తింపు లేకుండా పోతోంది. వడ్డించేవాడు మనవాడైతే కడబంతిలో కూర్చోమన్నట్లు, ఉద్యోగాలకు, వ్యాపారాలకు కాలేజ్ సీట్ లకు అన్నింటా పలుకుబడి, రిజర్వేషన్స్.దీనికి విసిగిన వాళ్ళు గురజాడ వారు చెప్పినట్లు దేశమును ప్రేమించుమన్నా అన్న మాటకు అర్ధం విలువ తెలిసినా ముందు తాము బాగుపడితే దేశాన్నిబాగుపరచవచ్చని నిశ్చయించుకున్నారు. అందుకే 70&80 లో మొదలైన ఈ అమెరికా ప్రయాణం ఈ నాటికీ సాగుతోంది.ప్రతీ ఇంటా ఒకరు అమెరికా లో ఉంటున్నారు. అమ్మాయైనా, అబ్బాయైనా అమెరికా చదువుకు పంపేస్తే చాలన్న ధోరణి. ఇది కాక పోతే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు.మొత్తానికి ఇండియా నించి బైట పడడమే వారి లక్ష్యం.

విదేశాల్లో తమ ప్రతిభను చూపించుకుని తాము పైకి రావడం తో బాటు దేశానికి కూడా పేరు తెస్తున్నారు.ఇండియన్స్ సాధించలేనిదేదీ లేదన్న సంగతి లోకానికి చాటి చెపుతున్నారు.తెలుగు దేశం లో ఉండి తెలుగు మాట్లాడ్డం నామోషీగా పీలవుతున్నవాళ్ళుఇక్కడ ఉంటే అమెరికాలో సిలికానాంధ్రావాళ్ళు చేస్తున్న సేవకు జోహార్లనక తప్పదు. అక్కడికి వెళ్ళినా తమ పిల్లలకు మన భాష మన సంస్కృతిని నేర్పడం ద్వారా మన దేశ గౌరవాన్ని సజీవం చేస్తున్నారనడం లో అతిశయోక్తి ఏ మాత్రం లేదు.

అక్కడ చాలా ఏళ్ళుగా స్థిరపడ్డ వాళ్ళు అక్కడి వారి సంపాదనను ఇక్కడ మన దేశంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దేశ ప్రగతికి తోడ్పడుతున్నారు.ఇక్కడ సేవా కార్యక్రమాల్లో తమవంతు సాయం అందిస్తున్నారు.అయినా సరిపోదు.మనవాడు మన దేశంలో తలెత్తుకు తిరగాలి

ఇవన్నీ బాగానే ఉన్నాయి.ప్రతీ దాంట్లో మంచీ చెడూ ఉంటాయి.అష్టకష్టాలు పడి పెంచిన తల్లితండ్రుల్ని వాళ్ళ మానాన వాళ్ళను వదిలేస్తున్నారు.కొంత మంది అస్సలు పట్టించుకోరు వాళ్ళ స్వార్ధం వాళ్ళను ఆ పని చెయ్యనివ్వదు. ఇంక కొంత మంది డబ్బుతో అన్నీ ఇవ్వగలమనుకుంటారు.డబ్బు ప్రేమను కొనిస్తుందా?అన్న విషయం ఒక్కసారి ఆలోచించాలి.

పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లు అప్పోసప్పో చెసి అమెరికా డిగ్రీ తెచ్చేసుకుంటే బోలెడు డబ్బు సంపాదించవచ్చని కొంత మంది ఆలోచన. దానితో చాలామంది మోసాలకు గురి అయ్యి ఎక్కడా బతకలేక అవస్థలు పడడం కూడా జరుగుతోంది.దీనికి కారణం విదేశీ వ్యామోహం అనుకోవాలా? లేక దూరపు కొండలు నునుపన్న భావనా? ఉన్న ప్రతిభంతా విదేశాలకు వలస వెడితే మన దేశం ఏం కావాలి? మన దేశ ప్రగతికి పాటుపడే యువత ఏది? ఎప్పుడు చూసినా ఏదో ఒక స్ట్రైక్ అనో మరో కారణం తో చదువులు సాగక సరి అయిన సమయానికి డిగ్రీలు రాక తమ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతున్న పరిస్థితి ఎదురైతే వారేం చెయ్యాలి? ఇలా జరగకుండా ఉండడానికి వేరే మార్గం లేదా?

మారుతున్న వ్యవస్థ లేదనే చెపుతోంది ప్రతీ చోటా రికమెండేషన్స్ లేకపొతే లంచాలు. డాక్టర్ సీట్ ఇంజనీరింగ్ సీట్ అన్ని కొనుక్కోవడమే. ఆ కొనుక్కోవడం పరాయి దేశం లో కొనుక్కుంటే ఖర్చుబెట్టిన డబ్బులు రాబట్టుకునే అవకాశం ఉంటుందన్నఆశ.ఈ పరిస్థితే ప్రతీవారినీ విదేశాలకు వలస వెళ్ళడానికి కారణమవుతోంది.రీసెర్చ్ చేద్దామనుకున్న వాళ్ళకు తగిన సౌకర్యాలు ఉండవు.ఉన్నా అక్కడ కూడా ప్రతిభ కన్నా మరేదో కావాలి.ఇవన్నీ లేని చోటు తమ ప్రతిభకు గుర్తింపు దొరికే చోటును వెతుక్కుంటూ వెళ్ళడం లో తప్పేముంది అనుకోక తప్పదు.

ఇక్కడ ఇండస్ట్రీ మొదలు పెట్టాలన్నా వ్యాపారం మొదలు పెట్టాలన్న ముందు లంచాలు, ఆపైన టాక్స్ ల రూపేణా ముట్టచెప్పాల్సినది వెరసి వ్యాపారం దొంగ లెక్కలు చూపిస్తే కానీ బతికి బైట పడడం కష్టం అన్నది అందరికీ తెలిసినదే. మధ్య తరగతి కుటుంబాలన్నీ ఉద్యోగాల మీదా ఆధారపడ్డ వాళ్ళే.ఒకడ్ని కష్టపడి చదివిస్తే వాడు మిగిలిన కుటుంబ సభ్యులకు చేదోడువాదోడుగా మారతాడన్న ఆశ.ఈ ప్రక్రియ లో మన దేశ మేధస్సు ఇంకో దేశ అభ్యున్నతికి దోహదపడుతోంది. అలా కాక మన ఇంటి పంట మనకే ఉపయోగపడితే మన దేశం ఇంతకన్నా అభివృద్ధి పొంది అమెరికాని తలదన్నే దేశం గా భారత దేశం ఎదగలేదా? అప్పుడు అమెరికా వాడు మన రూపాయను నియంత్రించకుండా మనం వాడి డాలర్ ను నియంత్రించగలమేమో!

ఈ ఆలోచన ప్రభుత్వానికి కలగ చేసేది ఎవరు? ఏవో పిచ్చి కారణాలకు ఆత్మాహుతి చేసుకునే విధ్యార్ధులు వ్యవస్థను మార్చడానికి ప్రయత్నించలేరా?మన దేశం లోని ప్రతిభ బైటకు పోకుండా ఉండడానికి మరో గాంధీ,మరో భగత్, మరో చంద్రశేఖర్ ఆజాద్ లు జన్మించాలా? ఆలోచించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *