April 27, 2024

ముదనష్టపు మధుమేహము

రచన: శ్రీనివాస భరద్వాజ్ కిషోర్

Diabetic patient measuring glucose level blood test using ultra mini glucometer and small drop of blood from finger and test strips isolated on a white background. Device shows normal blood-level
Diabetic patient measuring glucose level blood test using ultra mini glucometer and small drop of blood from finger and test strips isolated on a white background. Device shows normal blood-level

ఎక్కువ చపలత్వముతో
చిక్కినవన్నిటిని తినగ జీవితమంతా
చక్కెర చూడగ మెల్లగ
చిక్కును రుధిరమ్మునందు చేదునిజమిదే

బియ్యం ముతకది తిన్నా
తియ్యదనము వైపు ముఖము తిప్పకయున్నా
నెయ్యన్నా వలదన్నా
కయ్యబడుతు ఉడకబెట్టి కాయలె తిన్నా

ముదనష్టపు రోగమ్మది
వదలదు మనలను సుళువుగ వచ్చిందంటే
మదికెంతో క్షోభకలుగు
పదిరకముల మందులుతిను బతుకైపోవున్

పట్టినచో మధుమేహము
పుట్టగనే కర్మగాలి పూరువ జన్మన్
తిట్టుకొనుచు ఇనుసులినును
గట్టిగ గుచ్చేసుకొనుచు గడిపేయవలెన్

తగ్గించవలయు కార్బులు
పగ్గము వేయగవలయును బైటతినుటకున్
నిగ్గడియౌ వ్యాయామపు
అగ్గి కలిగియుండవలయు నది నిజమెరుగన్

మక్కువతో ప్రతిరోజూ
ఎక్కిన నడిపించు యంత్ర మెడతెగకుండా
చక్కబడేనారోగ్యము
తక్కువగయ్యేను బరువు తగ్గును షుగరున్

చక్కని యీ మాటలు మది
కెక్కకపోతే మరియిక యేడువవలయున్
చిక్కితివిక రారాయని
చక్కెర తన మహిమజూపు చంపును మనలన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *