May 2, 2024

సస్పెన్స్ కథలు – 1. పొరుగిల్లు

రచన: మధు అద్ధంకి

సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చిన రాహుల్ కి అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో సామాన్లతో నిండిన లారీ కనిపించింది.. కొత్తగా ఎవరో వచ్చుంటారు అనుకుని లిఫ్ట్ లో రెండో ఫ్లోర్ కి వెళ్ళాడు. అక్కడ తన పక్క అపార్టుమెంట్లో హడావుడిగా తిరుగుతున్న మనుషులను చూసి “ఓహో” ఈ అపార్ట్మెంట్లోకి వచ్చారా?” అనుకుని లోపలికి నడిచాడు.
బట్టలు మార్చుకుని రిలాక్స్ అయ్యి కాఫీ తాగుతూ టీ.వీ చూస్తున్నాడు.
“ఆపు నీ నస. ఇంత పని ఉన్నప్పుడు నన్ను ఇరిటేట్ చెయ్యకు. నీ వల్ల ఒక్క పని కాదు. నన్ను చెయ్యనియ్యవు” అంటూ ఒక మొరటు గొంతు వినపడింది. ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. ఎక్కడివీ మాటలు అనుకుంటూ మళ్ళా టీ.వీ చూడటంలో మునిగిపోయాడు.
“ఛీ పనికిమాలిన దద్దమ్మా. నేను చెప్పిందేమిటి నువ్వు చేసిందేమిటి? ఇలా అయితే ఈ ఇల్లు ఇంకా సర్దినట్టే..నీ వల్ల ఒక్క పని కాదు ఫో అవతలికి” అన్న అరుపులతో పాటు ఎవ్వరో దబ్బున పడిన శబ్దం విని ఉలిక్కిపడ్డాడు రాహుల్. కారిడార్ లో ఎవరన్నా అరుచుకుంటున్నారేమోనని డోర్ తెరిచి చూశాడు..ఎవ్వరూ లేరు. గడియ పెట్టి లోపలికి వచ్చి టీ.వీ చూస్తుండగా ఎవ్వరో సన్నగా ఏడుస్తున్న శబ్దం వినపడింది..శబ్దం వచ్చిన దిక్కుగా వెళ్ళగా అది గోడ అవతలనుండి వస్తుందని గ్రహించాడు.. కొత్తగా వచ్చిన పక్కింటి వాళ్ళు ఏదో గొడవ పడుతున్నారని తెలుసుకుని తల విదిలించి మళ్లీ వెళ్లి సోఫాలో కూర్చుని టీ.వీ చూడసాగాడు.
మరునాడు సాయంత్రం యధావిధిగా ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన రాహుల్ రిలాక్స్ అవుతుండగా ఎవరో ధభీ ధభీమని బాదిన చప్పుడు వినిపించింది. వెనువెంటనే ఎవరో రోదిస్తున్న శబ్దం కూడా వినపడింది.. పక్కింటి పురుషుడు ఆ ఇల్లాలిని ఎందుకిలా బాదుతున్నాడో అర్ధం కాలేదు.. వెళ్ళి అడుగుదామా అనుకుని, సంస్కారం అడ్డొచ్చి ఆగిపోయాడు.
ఆ తర్వాత అడపా దడపా వినిపించే పోట్లాటలు రోజూ వినపడసాగాయి.. తిట్లు, శాపనార్ధాలు, గిన్నెల మోతలు, ఏడ్పులు, వెక్కిళ్ళు లాంటివి వినపడుతుండేవి..మొదట్లో బాధపడ్డాడు, తరువాత జాలిపడ్డాడు ఆ తరువాత భరించలేకపోయాడు, ఆపైన మనశ్శాంతి కోల్పోయాడు. మనిషిని గొడ్డిని బాదినట్టు బాదుతుంటే ఆ మనిషి చేసే ఆర్తనాదాలు వినీ వినీ విసుగెత్తిపోయాడు రాహుల్.
అతనికి పక్కింటి భర్త మీద చాల కోపం వచ్చింది ఒక ఆడకూతురిని అలా హింసిస్తున్నందుకు.. అదీ కాక వీరి గొడవల వల్ల అతనికి ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది..
తమ అపార్ట్మెంట్స్లో ఉన్న మిగితా వారిని కలిసి సంగతి చెప్పి తనకు మనశ్శాంతి లేకుండా పోయిందని, వీళ్ళ గొడవల వల్ల ఇంటికి రావాలంటే భయంగా ఉందని వివరించాడు.. అప్పుడు వాళ్ళు, సెక్రటరీని కలువమని సలహా ఇచ్చారు.
ఇక లాభం లేదనుకుని అపార్టుమెంట్ సెక్రెటరీని కలిసాడు..
“సెక్రెటరీగారు మా పక్కింటివాళ్ళ గొడవలతో చచ్చిపోతున్నాను. ప్రశాంతత అన్నది లేకుండా పోయింది.. అతనేమో గొడ్డుని బాదినట్టు భార్యని బాదుతున్నాడు.. అది భరించలేక ఆవిడ ఏడ్చే ఏడ్పులకి నా తల వాచిపోతోంది.. మీరు కల్పించుకుని ఏదో ఒకటి చెయ్యాలి లేకుంటే నేనే కల్పించుకోవాల్సొస్తుంది” అని అన్నాడు రాహుల్.
“రాహుల్ తొందరపడకు.. భార్యా భర్తల మధ్య వివాదంలో బయటవాళ్ళు కల్పించుకోకూడదు.. అయినా నీ బాధ అర్ధం చేసుకున్నాను కాబట్టి కమిటీ అంతా కూర్చుని ఒక నిర్ణయం తీసుకుంటాం” అని చెప్పాడు సెక్రెటరీ.
ఒక రోజున సెక్రెటరీ ఆ భర్తని పిలిచి “ఇంటి వ్యవహారాలు బయటకు తెలియకుండా చూసుకోండి, మీ వ్యవహారాలు ఇంకొకరికి తలనొప్పి అయ్యేలా ఉండకూడదని చెప్పి , వారి మీద కంప్లైంటు వచ్చిందని సరిగ్గా ఉండమని సలహా ఇచ్చాడు.
ఒకరోజు అర్ధరాత్రి సమయంలో “కుయ్యో, మొర్రో “అన్న శబ్దానికి ఉలిక్కిపడి లేచాడు రాహుల్. పక్కింటి వాళ్ళ కుక్క బాధగా మొరుగుతున్నది.. అలా కొంతసేపు మొరిగి మొరిగి ఊరకుండిపోయింది. రాహుల్ నిద్ర చెడిపోయింది. రాత్రంతా నిద్రపట్టక జాగారం చేశాడు పక్కింటివాళ్ళని తిట్టుకుంటూ.
మరునాడు పొద్దున్నా ఆఫీస్ కు వెళ్తున్నప్పుడు రక్తం ఓడుతున్న కుక్క శవాన్ని పక్కింటి భర్త తీసుకువెళ్ళడం చూశాడు రాహుల్. ఖచ్చితంగా ఆ భర్తే చంపేశాడు ఇంక ఆ ఇల్లాలు ఏమవుతుందో అనుకున్నాడు..
ఉన్నట్టుండి ఒకరోజు “కెవ్వు”మనే కేక విన్నాడు రాహుల్.. ఇక తట్టుకోలేక పక్కింటికి పరిగెత్తి దబదబ మని వాళ్ళ తలుపు బాదాడు. భర్త వచ్చి తలుపు తీసాడు.. తీసిన తలుపులోనుండి తొంగి చూసిన రాహుల్ కి కింద పడి ఉన్న భార్య కనిపించింది..
ఇంక ఆపుకోలేని కోపంతో భర్తని ” నువ్వు మనిషివా, పశువ్వా? ఒక ఆడకూతురిని అలా కొట్టడానికి సిగ్గు లేదు? మీ గొడవలు రోజూ వింటున్నాను, నాకు మనశ్శాంతి లేకుండా పోయింది ఇంట్లో..ఇంక మీరీ గొడవలు ఆపకపోతే నేను పోలీసు కంప్లయింటు ఇవ్వాల్సి ఉంటుంది “అని హెచ్చరించి వచ్చేశాడు.
మర్నాడు అతన్ని ఆశ్చర్యపరిచే వార్త విన్నాడు. అదేమిటంటే పక్కింటాయిన రాత్రి పోయాడని.. ఆ ఇల్లాలికి ఇకనుండైనా ముక్తి అనుకుని పలకరించడానికి పక్కింటికి వెళ్ళాడు..
పక్కింటావిడ నెత్తి మీద ముసుగేసుకుని కూర్చుంది ఒక పక్కగా.. రాహుల్ వెళ్ళి ” సారీ అండీ మీవారు పోయారు.. మీరు ధైర్యంగా ఉండండి” అని సానుభూతి వాక్యాలు పలికాడు. అందుకావిడ తల ఎత్తి ” థాంక్ యూ” అన్నది మొరటు గొంతుతో..
అవాక్కయిపోయి నోరెళ్ళబెట్టాడు రాహుల్..

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *