May 2, 2024

మాయానగరం – 29

రచన: భువనచంద్ర

కొన్ని సంఘటనలకి కారణం కనిపించదు. కానీ అవి జరుగుతాయి. కొందరు దాన్నే’ఈశ్వరేఛ్చ’అంటే , మరి కొందరు మరో పేరు పెట్టే ప్రయత్నం చేస్తారు. పరమశివం సడన్ గా తేరుకున్నాడు. జీవితాంతం ’మాటరాని’ మనిషిగా బ్రతకాలని చెప్పిన డాక్టర్. శ్రీధర్ మాట పొల్లుపోయింది. మూగమణి జాలితో పెట్టిన ప్రసాద ’మహిమ’ కావొచ్చు, ఫాదర్ డేవిడ్ దయాపూరితమైన చూపులు కావొచ్చు. లోకంలో అతనికింకా ’నూకలే’గాక ’మాటలు’ కూడా మిగిలివుండటం కావొచ్చు. ఏమైతేనే… పరమశివం మళ్ళీ మనిషయ్యాడు.
చావు అంచులదాకా వెళ్ళొచ్చినవాడు వెనక్కి తిరిగి వస్తే ఏమౌతుంది? సామాన్యంగా అయితే బ్రతుకు మీద దృక్పధం మారుతుంది. కానీ కొందరి పుట్టుకే వేరు. వాళ్ళ జాతి రాక్షస జాతి.
అయ్యా! బియ్యంలో బాస్మతి, రాజనాల, ఐ. ఆర్. 8, స్వర్ణమసూరీ, అక్కళ్ళు, ఇలా రకరకాలు ఉన్నట్టే మనుషుల్లోనూ దేవతలూ, మానవులూ, రాక్షసులు అనే రకాలు వున్నారు.
ఎవరిలో సత్వగుణం వుంటుందో వారిని దేవతలనీ, తమోగుణం వుంటుందో వారిని రాక్షసులనీ , రజోగుణం వుండేవారిని మానవులనీ అంటారు. పరమశివంది తమోగుణం. చిత్రంగా వాడి ’గణం’ కూడా రాక్షస గణమే. అందుకే వాడిలో రాక్షసబలం (మనోబలం) ఉందేమో!
ఫాదర్ డేవిడ్ ఆల్బర్ట్ ఉండే చిన్న వూరి నుంచి వీడు మళ్ళీ’సిటీ’ చేరిన విధం, ఓ విధంగా సినిమా కథే! అసలు వీడికి స్పృహ రావడమే విచిత్రం. వచ్చిన వెంటనే వాడి మనసులో మెదిలింది నందినీ, వెంకటస్వామి, నవనీతం కాక మూగమణి.
దయాదాక్షణ్యం లేని యీ దరిద్రుడు స్నానానికి వెళ్తొన్న మూగమణి మీద కన్నేశాడు.
మూగమణి మూగదే కానీ, తను ఆడదాన్నని ఆ పిల్లకి ఎరుకే. చెవిదుద్దులు తీసి దేవుడి ముందు పెట్టి స్నానానికి పోవడం అలవాటు.
అలవాటుగా చెవి దుద్దులు ఏసుప్రభువు పటం ముందు పెట్టి స్నానానికి పోయింది.
పరమశివం కళ్ళు రెండిటి మీదా పడ్డాయి. ఒకటి మూగమణి మీదా. రెండోది చెవి దుద్దుల మీద. వాడికి ’పూర్వజ్ఞానం’ వచ్చి నాలుగురోజులైనా వాడు ఎవరి ముందూ బయటపడలేదు.’జ్ఞప్తి’ కోల్పోయిన వెర్రివాడివలే నటిస్తూ తన పరిస్థితిని సమీషించుకున్నాడు. తను నవనీతం (మూగమణి) వెంటపడటం, ఆవిడ పడిపోవడం, తనూ ఎదురుదెబ్బ తగిలి పడుతూ వుండగా ఎవరో తల మీద రాయితో మోదడం అన్నీ రంగురంగులుగా మనసనే సెల్యులాయిడ్ మీద సినిమాలా కనిపించాయి. తన మీద జాలితో మూగమణి ముద్దలు తినిపించడం నాలుగు రోజులుగా చూస్తూనే వున్నాడు. వాడి బండ హృదయానికి మూగమణి చూపించే అమాయకపు ప్రేమ కనిపించలా. ఆ పిల్ల శరీరం మాత్రమే కనిపించింది. ఫాదర్ డేవిడ్ బయటకెళ్ళాడు. మూగమణి స్నానాల గదిలోకెళ్ళింది. చుట్టుపక్కల ఎవరూ లేరు. ఇంకేం కావాలి? పరమశివంలాంటి నికృష్టుడికి అదో పండగే.
‘ముందు దుద్దులు’ అని వాడి మనసు చెప్పింది. అంతేగా మరి… మూగమణిని అనుభవించాక అక్కడుండటం ప్రమాదం. ఎక్కడికన్న పారిపోవాలన్నా’సొమ్ములు’ కావాలి. ఫాదర్ డేవిడ్ బీరువా పగలగొడితే కొంత కేష్ దొరుకుతుంది. దుద్దులూ హాట్ కాష్ లాంటివేగా! కొట్టేశాడు.
“ఓయ్.. కిరస్తానీ దేవుడా చూసుకో.. నీ భక్తురాలి చెవి దుద్దులే కాదు… మానాన్ని కూడా కొల్లగొట్టేస్తా. ” మనసులోనే హేళనగా ఏసుని ఉద్దేశించి అంటూ బాత్ రూం వైపు అడుగులేశాడు. నగ్నంగా అటువైపు తిరిగి నీళ్ళు పోసుకుంటోంది మూగమణి.
పిచ్చికోరికతో కంటే, పశువాంఛతో అటువైపు గబగబగా నడిచాడు పరమశివం.
ఒక్క క్షణం… ఒక్క క్షణం విలువా, ఒక్క క్షణపు కాలగమనమూ ఎవరూ వెలకట్టలేనిది.
ఒక్క క్షణం యీ భూమి తిరగడం ఆగిపోతే? జరిగే పరిణామాలని ఊహించడం కంప్యూటర్ బ్రెయిన్ లకి కూడా సాధ్యం కాదు.
ఒక్క క్షణం ప్రాణం తీయచ్చు. ఒక్క క్షణంలో ప్రాణం పోయనూ వచ్చు. అణు విస్ఫోటనం కూడా జరిగేది క్షణం లో వెయ్యోవంతులోనే.
“ఫాదర్’ బయట నుండి పిలుపు. ఠక్కున ఆగాడు పరమశివం. ఆ పిలుపు ఎక్కడో విన్నదే కానీ, ఎవరిదో గుర్తుకు రాలేదు . వెనక్కి తిరిగే లోగానే హాల్లో అడుగుపెట్టాడు డాక్టర్. శ్రీధర్.
“నిన్ను చూద్దామనే వచ్చానోయ్… ఏమిటీ… నువ్వు లేచి నడవగలుగుతున్నావే! ” అంటునే లెఫ్ట్ హాండ్ వైపు నించి వచ్చే నీళ్ళ శబ్ధం విని అటు చూశాడు స్నానం చేస్తున్న స్త్రీ.
“ఆడాళ్లు స్నానం చేస్తుంటే నీకేం పనిరా? ” కోపంగా పరమశివంతో అన్నాడు శ్రీధర్. శ్రీధర్ ది 8 పాక్ బాడీ.
రోజుకి కనీసం ఒక గంటైనా సైకిల్ తొక్కుతారు. మూడు నాలుగొందల బస్కీలు తీస్తారు.
“బే…యే.. వూ.. ” అంటూ ఏదో పిచ్చిపిచ్చిగా శబ్ధం చేసి బయటకి పరిగెత్తాడు పరమశివం. ఆ సమయానికే బయట నుంచి ఆయా ’హాల్లో’ కి వచ్చింది. ఒక్క క్షణంలో ’ఒక బలాత్కారం’ నుండి తప్పించుకోగలిగింది మూగమణి. అసలు తన మీద బలాత్కారం జరుగుతుందనే వూహే ఆ పిల్లకు లేదు. తన రాక వలన బలాత్కారం తప్పిందనే ఆలోచనే డాక్టర్ శ్రీధర్ కీ రాలేదు. నిజం తెలిసిన వాళ్ళిద్దరు లోలోపల పళ్ళు నూరుకుంటున్న పరమశివం , చూపుల్లో కరుణ అనే జలాన్ని మానవాళి మీద కురిపిస్తోన్న ఏసుప్రభు.
“నమస్తే డాక్టర్ గారు! ఫాదర్ బయటకి వెళ్ళారు, పవిత్రజలం ఒకరింట్లో జల్లడానికి. కూర్చోండి ” ఓ కుర్చి లాగింది ఆయా.
“లేదు ఆయమ్మా! ఇటు వైపు వెళ్తూ పేషంట్ ని ఫాదర్ గార్ని కూడా చూసినట్టు వుంటుందని వచ్చాను. పేషంటు బానే వున్నాడు. నన్ను చూసి పరిగెత్తాడు. అసలితను జన్మలో నడవగలడని అనుకోలేదు. సరే… నేను మళ్ళీ వస్తా. వచ్చేవారం మళ్ళీ ఇటు వచ్చే పనుంది. అప్పుడు వస్తానని ఫాదర్ గారికి చెప్పు. ” బయటకు వస్తూ ఆయమ్మతో అన్నారు డాక్టర్ శ్రీధర్. దూరంగా మామిడి చెట్టు పక్కన దొంగలా నక్కిన పరమశివం అతని కంట పడ్డాడు.
“ఆయమ్మ.. పేషంటు బిహేవియర్ ఎలా వుంది? ” అని అదిగారు శ్రీధర్.
“సరిగ్గా నడవడం లేదండి…’బే…బే’అనడం తప్పా మాటలు రావండి ఉత్తి పిచ్చి చూపులండి. పాపం మూగమణే తల్లిలాగా వాడికి ముద్దలు పెడుతోందండి. ” అమాయకంగా అంది ఆయమ్మ.
“ఏదో తేడా వుంది. ఆయమ్మ … ఎడమపక్క బాత్ రూంలో స్నానం చేస్తున్నది ఎవరూ? ” భృకుటి ముడిచి అడిగారు శ్రీధర్.
ఆయమ్మ లోపలికి వెళ్ళి చూసొచ్చి “మూగమణండి.. ఆ డోరు సరిగ్గా పడదు ” అన్నది.
“మరి వీడెందుకున్నాడు అక్కడ? నేనడిగితే బే..బే.. అంటూ నాకు అందకుండా పారిపోయాడు. నడవలేని వాడు పారిపోయాడంటే, వాడి ఆరోగ్యం చాలా చాలా మెరుగుపడి వుండాలి. అంతే కాదు.. చూసి చూడనట్టుగా అటు చూడు. మామిడి చెట్టు దగ్గర నక్కి వున్నాడు. అంటే బ్రెయిన్ కూడా పని చేస్తోందనే అనుకోవాలి ” తనలో తాను అనుకున్నట్టు ఆయమ్మతో అన్నాడు డాక్టర్ శ్రీధర్. అతనికి ఇదంతా ఒక పజిల్ లా వుంది. బయటకెళ్ళేవాడు కాస్తా మళ్ళీ హాల్లోంచి ఫాదర్ గారి ఆఫీస్ రూం వైపు నడుస్తూ “వాడ్ని ఒకసారి చెక్ చేయ్యాలి, రమ్మని చెప్పు” ఆయమ్మతో అన్నాడు.
పదిహేను నిముషాలు గడచినా ఆయమ్మ లోపలకి రాలేదు. విసుగ్గా శ్రీధర్ బయటకొచ్చాడు. అప్పుడు కనిపించింది ఆయమ్మ కంగారుగా, ” ఏమైంది? ” అన్నాడు శ్రీధర్.
“అయ్యా… మీరు రమ్మనారని చెప్పానండి, బే..బే.. అంటా దూరంగా పరిగెత్తాడండీ… ఆడి ఎనకాల నేనెళ్తే ఎనకవైపు పిట్టగోడున్నాది కదండీ… ఒక్క దూకు దూకి పారిపోయాడండీ!
గబగబా అటువైపు నడిచి పిట్టగోడని చూశాడు మహావుంటే రెండున్నర అడుగుల ఎత్తుంటది. ఒక్కదూకులో రెండున్నర అడుగుల పిట్టగోడని దూకి పారిపోయాడంటే వాడి ఆరోగ్య పరిస్థితి ఏమిటి?
జరిగిందంతా మనసులో రీవైండ్ చేసుకుంటే , అతనికి కంగారులో షాకులో చూసిన పరమశివం “కళ్ళు’ జ్ఞప్తిలోకి వచ్చాయి. ఎందుకా కంగారు? అంటే వాడు మూగమణిని నగ్నంగా చూస్తున్నాడా? లేక ఆ పిల్లని చెరచడానికి…??”
మెడికల్ స్టడీలో చాలా విషయాలు బయటపడతాయి. ఒక యాక్సిడెంట్ లో జరిగిన డామేజీ అదే పరిస్థితిలో మరో శారీరిక మార్పుకి కారణం కావొచ్చు. స్టడీ చెయ్యాలి. ఒకటి మాత్రం స్పష్టం, పేషంటు నడవడమూ పరిగెత్తడమే కాదు .. గోడ దూకాడంటే బ్రెయిన్ ఖచ్చితంగా పెర్ ఫెక్ట్ కండీషన్ లో వున్నట్టే!
నడవడం పెరిగెత్తడం వేరు. గోడ దూకాడంటే , దూరాన్ని గోడ ఎత్తునీ ముందు మనసులో ’అంచనా’ వేసినప్పుడు మాత్రమే దూకడం సాధ్యమవుతుంది.
‘అంచనా’ వెయ్యాలంటే మెదడు పెర్ఫెక్ట్ గా పని చేసినప్పుడేగా కుదిరేది. ఇక ’మాట’ రావడం విషయం.. అది పేషంట్ ని పరీక్షించాల్సిందే! బ్రెయిన్ పెర్ఫెక్ట్ గా వుండేవాడు నటించడని ఎలా చెప్పడం? హీ మస్ట్ బీ ఆక్టింగ్!
ఈ నిర్ణయానికొచ్చారు డాక్టర్ శ్రీధర్. ఒకవేళ బ్రెయిన్ పర్ఫెక్ట్ అయితే , కొన్ని పరీస్థితిల్లో అతను ప్రమాదకారిగా మారొచ్చు. మొదట అతన్ని పట్టుకోవాలి. ఆ మాటే ఆయమ్మతో చెప్పాడు. ఆవిడ బయటకు పరిగెత్తి కొందరు అనాధల్ని, పనివాళ్ళనీ పిల్చి విషయం వివరించింది.
గంటన్నర తరవాత ఓ విషయం తెలిసింది. పరమశివం ఓ లారీ ఎక్కాడనీ.. ఆ లారీ సిటీ వైపు వెళ్తోందనీ. డాక్టర్ శ్రీధర్ అవాక్కయ్యాడు.
“సరే ఆయమ్మా… జరిగిన విషయాలన్నీ ఫాదర్ గారితో చెప్పు. ఇప్పుడు నేను సిటీ వైపు వెళ్ళినా ఉపయోగముండదు. గంటన్నర క్రితం అతనెక్కిన లారీ చాలా దూరం వెళ్ళి వుంటుంది. ఆ లారీ నంబర్ కూడా మనకి తెలియదు కదా! ” అంటుండగానే మూగమణి గబగబా వచ్చి ఆయమ్మకి సైగల్తో చెప్పింది. తన దుద్దులు ఏసుప్రభు ముందు పెట్టి మరిచిపోయినట్టూ, ఆ హాల్లో ఏసుప్రభు ముందున్నది ఎవరు దొంగతనం చేస్తారూ?
“ఖచ్చితంగా ఇది పరమశివం పనే అయ్యుంటుంది! ” అన్నాడు శ్రీధర్. చెసేదేమీలేక మరోపది నిమిషాల్లో బయలుదేరాడాయన.
ఏసుప్రభువు దయగా నవ్వుతూనే వున్నాడు.

**********************

బిళహరి రోడ్డు మీద నడుస్తోంది. ఆమె మనసు నిండా ఆలోచనలే. వెర్రి ధైర్యంతో ఓ వెర్రోడి వెంట ఇల్లొదిలి బైటకొచ్చింది. తిరిగి వెళ్ళే ప్రసక్తే లేదు. ఎలాగోలా బతకాలి. కామేశ్వర రావు మంచివాడే. కానీ అతని మంచితనం ఎవరికీ ఉపయోగపడే మంచితనం కాదు. సర్వేశ్వర రావు ఆగడం రోజురోజుకు మితిమీరుతోంది. అతనికి బుద్ధి చెప్పడం కష్టమేమీ కాదు, కానీ అతని ఇల్లు ఖాళీ చేయమంటే ఎక్కడికెళ్ళాలి? ఎక్కడికెళ్ళినా వయసులో వున్న ఆడదానికి మగమృగాల బాధ తప్పుతుందా? ఆలోచిస్తోంది బిళహరి.
ఏ దేశంలో లేక ఎచ్చోట స్త్రీలు పూజింపబడతారో .. అచ్చట దేవతలు నివసిస్తారు ” అన్న శ్లోకం జ్ఞప్తికి వచ్చిందామెకు. విరక్తిగా నవ్వుకుంది. వీధికో ’నిర్భయ’ మగాళ్ళ పాశవికత్యానికి బలి అవుతోందీ దేశంలో. పసిపిల్లలని లేదు, ముసలి వాళ్ళనీ లేదు. అందరీ మీదా అత్యాచారమే!
ఘనత వహించిన రాజకీయనాయకులూ వారి సంతానమూ, వారి పక్కన బాకాలూదే కాకాసురులూ, వారి చిత్రవిచిత్ర ’దుశ్శాసన’ లీలలూ చెప్పతరం కాదు.’డబ్బు’ అనే ఈదురుగాలికి నేరాలనే మేఘాలు కకావికలై మాయమౌతాయి. నిజంగా మనం ఎక్కడున్నాము? యుగయుగాలుగా పరిఢవిల్లుతున్న భారతీయ సంస్కృతి సౌరభాలు ఏమైపోయాయి?
సర్వేశ్వరరావు చూపులూ, మాటలూ గుర్తుకొచ్చి బిళహరి ఒంటి మీద గొంగళీ పురుగులు పాకుతున్నట్టు అనిపించింది. ఇండైరెక్ట్ ఎప్రోచ్ పోయింది వాడిలో…
“ఇదిగో అమ్మాయ్.. నిన్ను’బిళహరి’ అని పిలవడం ఇబ్బందిగా వుంది.’బిల్లూ’అని ముద్దుగా పిలిస్తే పర్వాలేదు కదూ…. ఎంతైనా నీకంటే ఏడాదో, రెండేల్లో పెద్దాడ్ని.
“ఓరి చచ్చినోడా! నాకంటే కనీసం దశబ్దంన్నరో, రెండు దశాబ్దాల పెద్ద వెధవ్వి. రెండేళ్ళా… నిన్ను పిచ్చి కుక్క కరవా, నీ పెళ్ళాం ముండమోసి హాయిగా బ్రతకా ” అని లోపలలోపలే తిట్టుకుంది బిళహరి.
“ఏం జెపుతున్నానూ? ఏదైతేనేమిలే, ఆ కామేషుని నమ్ముకుంటే నిండా మునిగినట్టే. ఉత్త వెన్నుముక్క లేని ’నాప’ వాడు. నువ్వు “ఊ ” అంటే చాలు .. యీ ఇల్లు నీ పేరే రిజిస్ట్రీ చేయిస్తా… ఏడు వారాల నగలూ చేయిస్తా… హాయిగా ఒప్పుకో. కావాలంటే ఓ పక్షమో, నెలో ఆలోచించుకొనే చెప్పు. తొందరేం లేదు. కాదన్నావో… నాది పాము పగ… ఆ! ” డైరెక్ట్ గానే మనసులోని కుళ్ళుని బయటపెట్టాడు. ఏం చెయ్యాలి? ఆలోచిస్తోంది.
ఆమె నడుస్తూ నడుస్తునే ఓ చోట అప్రయత్నంగా ఆగింది. అదో పురాతమైన కోవెల. ప్రాకారాలు చూస్తే చాలా పెద్దవిగా వున్నాయి. చాలా చాలా విశాలమైన గుడి అయ్యుండాలి. దాదాపు పదకొండు అడుగుల పొడుగుండే గోపురద్వారం తెరిచే వుంది. బయట షాపుల్లాంటివి ఏమీ లేవు… మెల్లిగా నడుస్తూ గడపదాటి లోపలికి అడుగుపెట్టింది బిళహరి. ఆమెని తాకుతూ ఓ గాలి కెరటం గుడిలోకి ప్రవేశించింది… చల్లని గాలి కెరటం….!

****************

సుందరీబాయ్ కారు మాధవి ఇంటి ముందు ఆగింది. చరచరా దిగింది సుందరి.’జున్ను ముక్కలా వుండే తనెక్కడా? ఒక్కిపీరులా వుండే మాధవి ఎక్కడ? ఈ మాధవిని ఆ ఆనందరావు గాడు ప్రేమిస్తాడా? ఏదో ఒకటి తేల్చి పారేయ్యాలి. వాడు ఇంతమటుకూ తన ప్రేమ గురించి మాధవికి చెప్పినట్టు లేదు. అది జరక్కముందే వాడంటే దీనికి మండేట్టు చెయ్యాలి. అసలు వాడితో అది మాట్లాడకుండా చెయ్యాలి ” తీవ్రంగా ఆలోచిస్తూ మెట్లెక్కింది సుందరీబాయి. తలుపులే కాదు, తాళం కూడా వేసి వుంది. నిట్టుర్చింది సుందరీ.
‘ఇదీ ఒకందుకు మంచిదే. వీళ్ళిద్దరి మధ్యా చిచ్చు పెట్టడానికీ సమయం పనికొస్తుంది. అయినా ఇదెక్కడకి పోతుంది, మహాపోతే కూరగాయలకి పోయుంటుంది. ఇక్కడే కూర్చుంటా’ అనుకుంటూ మెట్ల మీదే కూర్చుంది సుందరి.
అసలు విషయం ఆవిడకీ తెలీదు. మాధవి గుడిసెల సిటీలో వుంది. ఇరవైమంది దొర్లుతున్నారు…. వాంతులతో, విరోచనాలతో. పరిస్థితి భీకరంగా వుంది. దుమ్మూ..ధూళి.. దుర్వాసన. ఆనందరావూ, శోభారాణి కూడా అక్కడే వున్నారు. గవర్నమెంటు డాక్టర్లెవరూ అక్కడ అడుగుపెట్టలేదు. ప్రైవేట్ డాక్టర్లని భరించే స్తోమత గుడిసెలోళ్ళకి లేదు.
ఏ అంబులెన్సూ లోపలకి రాదు… రాలేదు. ఇక మిగిలింది ఆయూర్వేద వైద్యాలూ.. హోమియో వైద్యాలూ. ఆయుర్వేద వైద్యులు సందేహించారు. అంతేకాదు, పేషంట్ల తాలూకా చుట్టాలు ఆయుర్వేద వైద్యాలనగానే నిరాశతో పెదాలు, నుదురూ విరిచారు. హోమియోకి కొంత పరవాలేదు. ప్రస్తుతం అక్కడి రోగుల్ని పరీక్షిస్తున్నది డాక్టర్ రామలింగం. బి.హెచ్. ఎం. ఎస్. పెద్దవాడు, నిఖార్సైన వైద్యుడు.
“మాధవిగారూ ! వీళ్ళు తాగిన మందులో ఎవరో ప్రమాదకరమైన రసాయనం కలిపారు. అదృష్టవశాత్తు విరుగుడికి ప్రయత్నం చెయ్యవచ్చు. .. ప్రికాషనరీగా ఆల్ రెడీ తలో డోసు వేశాను. అయితే లోపల ఎవరెవరికి ఎంత డామేజీ అయ్యిందో వెంటనే చెప్పలేం. వీళ్ళ మూత్రమూ, స్టూలూ కూడా టెస్టులకి పంపాలి. అలా చెయ్యడం వలన టైం ఆదా అవుతుంది. నాకు తెలిసి డయాగ్నస్టిక్ నంబర్ ఇస్తాను. వాళ్ళకి ఫోన్ చేసి వీలైనంత మందిని ఎక్కువగా స్పాట్ లోకి రమ్మని చెప్పండి. కావల్సిన సరంజామా కూడా తెమ్మని చెప్పండి ” ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు రామలింగంగారు.
బోస్ బాబు స్పాట్ లోకి వచ్చేలోపలే నాలుగు చిన్న కార్లలో వచ్చేశాడు శామ్యూల్ రెడ్డి. ఆ కార్లలోంచి ఆఫీస్ స్టాఫ్ దిగారు. గబగబా పేషంట్లని కార్లల్లో ఎక్కించారు.
“శోభా… వీళ్ళందర్నీ నేను రాయల్ హాస్పటల్ కి తీసుకెళ్తా. కార్లు తిరిగొచ్చాక వారి బంధువులని పంపు. ఖర్చంతా నేనే భరిస్తా. ఆ విషయం రోగుల బంధువులకి చెప్పి వారిని వూరడించు. నేనొచ్చేదాకా మీరిక్కడే వుండండి. ” అని అందరినీ చూస్తూ , స్పెషల్గా శోభకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కారెక్కాడు శామ్యూల్ రెడ్డి . డాక్టర్ రామలింగం అవాక్కయ్యాడు.
“మాధవిగారు! వాళ్ళని కదపకుండా వుంటే బాగుండేది. ప్చ్… మన చేతుల్లో ఏముందీ? ” హోమియో మందుల సూట్ కేస్ మూస్తూ అన్నాడు రామలింగం. అతనికి ఇంగ్లీష్ వైద్యం మీద నమ్మకం లేకపోవడం కాదు. నమ్మకం లేనిది ఓ స్టార్ హోటల్ లాంటి రాయల్ హాస్పటల్ మీద. అక్కడ ’వైద్యం’ పేరుతో జరిగే మోసాల మీద. ఆ హాస్పటల్ ఛైర్మాన్ డాక్టర్ భీమారావ్ సుంకోలే. అతని మీద లెక్కలేనన్ని కేసులున్నా ఏదీ నిలబడదు. కారణం అతని వెనుకున్న హోం మినిస్టర్. ’తలనొప్పి’ అని వెళ్ళినవాడ్ని ఐ.సి.యూ. లో ఆరురోజులు పెట్టి కనీసం ’లక్ష’ ఖర్చుపెట్టించే ఘనత వహించిన ఆస్పత్రి అది.
మరి అంత ఖరీదైన హాస్పటల్ ని దిక్కు దివాణం లేని గుడిసెల వాళ్ళని శామ్యూల్ రెడ్డి ఎందుకు తీసుకెళ్ళాడు?
మూడురోజుల తరవాత : ఇరవై మంది పేషంట్లలో బతికింది పన్నెండుగురు. వాళ్ళందరూ మధ్యవయసు వారూ, వయసైన వాళ్ళూ, మిగిలిన వాళ్ళందరూ ’కోమా’ లో వున్నారు. కొందరి కిడ్నీ లు చెడితే కొందరికి లివర్ ట్రబులిస్తోందిట. కొందరికి ’హార్ట్’ పని చేయనని ’వగలు’ పోతుంటే కొందరికి ఊపిరితిత్తులు చికాకులు పెడుతున్నాయట. వారి సంగతేమవుతుందో దేముడొక్కడే చెప్పగలడు.
ఒకటి మాత్రం నిజం…. శామ్యూల్ రెడ్డి గుడిసెల సిటీకి సరికొత్త దేముడైపోయాడు.

బోసుబాబు సంగతా? నందోరాజాభవిష్యతి!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *