April 27, 2024

ఒక్క మొక్క నాటండి!

రచన: నాగులవంచ వసంతరావు

అన్నలార అక్కలార ఒక్క మొక్క నాటండి
చెట్టు చేసె మేలేమిటొ ఈ జగతికి చాటండి

మొక్క పెట్టి మట్టి వేసి నీరు పోసి కంచె వేసి
చంటిపాప వలెను దాన్ని సతతం కాపాడండి

ఊరు వాడ పట్నమంత ఉప్పెనలా కదలండి
ఉరకలేస్తు మొక్క నాటి ఉత్తేజం పెంచండి

మొక్క నాటినంతనె మన భాద్యత తీరదోయి
పెరిగి పెద్దదయేదాక చక్కగ కాపాడవోయి

దినదినము మొక్క పెరిగి వృక్షమైపోతుంటె
మనకు కలిగె ఆనందం మరువలేము ఈజన్మకు

అందమైన చిగురింపుకు అవని పులకరిస్తుంటె
సృష్టిలోని ప్రతి పాణి పరవశించి పోతుంది

నీ చల్లని గాలికేమొ ఒల్లు జలదరిస్తుంది
నీ మెల్లని పిల్లగాలి మనసు హాయినిస్తుంది

దట్టపు మేఘాలు చేరి దండిగ వర్షిస్తుంటె
ధరణి పులకరిస్తుంది చెరువు అలుగు పోస్తుంది

నీ నీడన పవళిస్తే నిదురబాగ పడుతుంది
నీ పళ్ళను భుజియిస్తే కడుపు నిండిపోతుంది

ఇంటి ముందు నీడనిచ్చి ఇలవేల్పువైతివి
ఆకుపచ్చ చీరకట్టి అందాలొలుకబోస్తివి

పచ్చనైన పైరు చూడ కడుపు నిండిపోతుంది
రైతన్న ముఖంలోన నవ్వు తొంగి చూస్తుంది

దట్టమైన అడవులతో దండిగ వానలు కురియ
దిట్టమైన పంటలతో ధీమాగ బతుకు రైతన్న

బీటలెత్తిన బీడులన్ని బురదమల్లుగా మారి
ధాన్య రాసులతోటి గరిసెలన్ని నిండంగ

రైతన్న కళ్ళలోన ఆనంద భాష్పాలు
అప్పులన్ని తీరునన్న ఆశావహభావాలు

ఆకుపచ్చ తెలంగాణ అందమేదొ చూడర
మొక్క నాటి పెద్ద చేసి జాతికుపకరించర

కాలుష్యం తరిమికొట్టి ఆక్సీజన్ అందిపుచ్చి
పర్యావరణం పదిలమని మనను హెచ్చరిస్తుంది

– 2 –

చెట్టు నరికి కోరి కోరి చెరుపు తెచ్చుకోకుర
చెట్టునరికినోడికి పుట్టగతులు లేవుర

ముఖ్యమం తి కలలుగన్న ముచ్చటేందొ తీర్చర
తెలంగాణ రాష్ట్రాన్ని చెట్లతోటి నింపర

హరిత హారమెల్లప్పుడు ఉద్యమంగ సాగాలి
తెలంగాణ రాష్ట్రంలో చెట్లు బాగ పెంచాలి

ప్రతి ఒక్కరు ఒక మొక్కను పమతో నాటుదాం
తెలంగాణ ఘనతేమిటొ ఈ జగతికి చాటుదాం
***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *