April 28, 2024

‘తరగని సిరి’ – స్నేహం

రచన: వాలి హిరణ్మయిదేవి

పరుగున వచ్చి కదులుతున్న ట్రైన్ ని ఎక్కేసి, తన సీట్ వెదుక్కుని కూర్చున్నాడు ప్రమోద్. వాటర్ బాటిల్ తెరిచి, కొన్ని నీళ్ళు తాగి కాస్త రిలాక్స్ అయ్యాక ఎదుటి సీట్లో కూర్చున్న వారి వంక చూసాడు.
విశాలమైన ఫాలభాగం మీద చిన్న నల్లని స్టికర్ బొట్టుతో, కంటికి ఎడమ వైపు గాయం తాలూకు మచ్చతో ఉన్న యువతి వంక చూసి, ఏదో అనుమానం తోచినట్టుగా మరోసారి ఆమె వైపు దృష్టి సారించాడు ప్రమోద్. ఏదో జ్ఞాపకం లీలగా కదలాడి, సభ్యత కాదనుకొంటూనే మళ్ళీ చూసాడు. ఆమె కూడా, అదే క్షణంలో అతడి వంక పరీక్షగా చూసింది.
“మీరు…అదే… నువ్వు నందూవి కదూ?” అన్నాడు ప్రమోద్ ఆశ్చర్యానందాలతో…
“అవును… నువ్వు ప్రమోద్ వేగా?” అరిచినట్టే అన్నది ఆనందిని.
ఆమె ప్రక్కనే కూర్చుని ఉన్న అపురూప వారిద్దరి వంకా ఆశ్చర్యంగా చూసింది. గడచిన ఇన్నేళ్ళలో తల్లిలో ఏనాడూ ఇంత ఎగ్జయిట్ మెంట్ చూడలేదామె. అది అందాల బాల్యం మాత్రమే మనలో చేయగల ఇంద్రజాలం, ఇవ్వగల గమ్మత్తూనూ…
“అపూ, ఈ ప్రమోద్ అంకుల్ నా చిన్నప్పటి ఫ్రెండ్…” అని కూతురికి పరిచయం చేసింది ఆనందిని.
ఆ తర్వాత పెద్దయిన ఇన్నేళ్ళకి కలుసుకున్న ఆ చిన్నప్పటి మిత్రులిద్దరూ, చిన్న పిల్లలై పోయి పరిసరాలేవీ పట్టించుకోకుండా మాటల్లో మునిగిపోయారు.
ఆనందిని, ప్రమోద్ లు ఎదురెదురిళ్ళలో ఉండేవారు. సుమారు పద్నాలుగేళ్ళ ప్రాయంలో ప్రమోద్ తండ్రికి ట్రాన్స్ఫర్ కావటం తో ఆ చిన్న టౌన్ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇద్దరూ కలిసి ఆడుకున్న ఆటలూ, పాడుకున్న పాటలూ మాత్రం మరపురాని విధంగా ఇద్దరికీ గుర్తుండిపోయాయి… ఎన్నో ఏళ్ళ తరువాత మళ్ళీ కలిసింది ఇప్పుడే…
“సారీ నందూ, మీ వారు…” ఆగిపోయాడు ప్రమోద్.
“థ్రోట్ కాన్సర్ తో పోయారు ప్రమోద్… ఎంత చెప్పినా సిగరెట్ ని వదలలేదు… ఇది అపురూప… దీనికన్నా రెండేళ్ళ ముందు బాబు పుట్టాడు… అయితే… వాడు కూడా టెన్త్ చదువుతుండగా యాక్సిడెంట్ లో…” ఆ తరువాత ఆమె గొంతు రుద్ధమై చెప్పలేకపోయింది ఆనందిని.
“వెంటనే హాస్పిటల్ కి తీసుకు వెళ్లి ఉంటే బ్రతికేవాడేనట… కానీ యాక్సిడెంట్ వల్ల ఎవ్వరూ అందుకు ముందుకు రాకపోవటం వల్లే అన్నయ్య పోయాడు…” బాధగా చెప్పింది అపురూప.
“సరే, నీ సంగతులు చెప్పు ప్రమోద్…” అన్నది ఆనందిని.
“ఏముంది నందూ, సెక్రటేరియట్ లో ఉద్యోగం… పదేళ్ళ క్రితం నా శ్రీమతి రమణి నాకు భౌతికంగా దూరమవటం నా జీవితంలో పెద్ద విషాదం నాకు. ఆమె మా ప్రేమ చిహ్నంగా నాకు మిగిల్చిన ‘అభిషేక్’ ని పెంచి పెద్ద చేసేందుకు మాత్రమే ఇంకా మిగిలి ఉన్న జీవచ్ఛవాన్ని…” అన్నాడు ఆవేదనగా.
‘హు… ఇద్దరిదీ ఇంచుమించుగా ఒక్కటే కథ… మా పేర్లలో తప్ప భగవంతుడు సంతోషాన్ని మా నుదుట రాయలేదేమో…’ అనుకుంది ఆనందిని.
మాటల మధ్య, తాము వనస్థలిపురంలోనే, ఒకే ఫ్లాట్ లో, రెండు మూడు ఫ్లోర్లలో నివాసముండబోతున్నామని తెలిసి విస్మయానికి లోనయ్యారు ఇద్దరూ.
“ట్రాన్స్ పోర్ట్ కంపెనీ నుండి మీ సామాను వచ్చి, అవి సర్దుకునేంతవరకూ మీరిద్దరూ నా గెస్ట్ లే…” అంటూ స్టేషన్ లో దిగగానే తనతో తమ ఫ్లాట్ కే తీసుకువెళ్ళాడు వారిని ప్రమోద్.
“నాకో లిటిల్ సిస్టర్ లేదన్న వెలితి ఇప్పుడు నువ్వు దొరకటంతో తీరిపోయింది అపురూపా…” అని అభిలాష్ అనేసరికి, ఆ ఆప్యాయతకి ఎంతో ముచ్చట పడ్డారు ప్రదీప్, ఆనందిని.
అభిలాష్ బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు. తన కొడుకు రాజా బ్రతికుంటే ఇలాగే ఉండేవాడని అనుకోకుండా ఉండలేకపోయింది ఆనందిని. అభిలాష్ పట్ల చెప్పలేని వాత్సల్యం ఏర్పడింది…
ఆనందిని బాంక్ లో మేనేజర్ గా ఉద్యోగం చేస్తోంది… ఇప్పుడు ప్రమోషన్ మీద బదిలీ అయి, వనస్థలిపురం బ్రాంచ్ మేనేజర్ గా హైదరాబాద్ వచ్చింది.
ఏ బంధువులూ లేని హైదరాబాద్ మహానగరంలో, ఆడపిల్లతో ఎన్నెన్ని పాట్లు పడాలో… అని దిగులు పడే ఆమెకి, లక్కీగా ప్రమోద్ కలవటం, వైజాగ్ లో ఒకప్పటి కొలీగ్ అయిన లలిత తన కుటుంబంతో సహా ఇదే ఫ్లాట్స్ లో ఉండటం ఆనందినికి ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగించాయి. నిజానికి ఈ ఫ్లాట్ కుదిర్చింది కూడా లలితే… ఆమె ప్రమోద్ కుటుంబానికి కూడా సన్నిహితురాలే… అతను తన స్నేహితురాలికి బాల్యస్నేహితుడన్న విషయం తెలిసి లలిత కూడా ఎంతో సంతోషం పొందింది. ఇప్పుడామె భర్త అనారోగ్య కారణంతో వీ ఆర్ తీసుకొని ఇంటిపట్టునే ఉంటోంది.
స్వతహాగా పరోపకారీ, స్నేహశీలీ అయిన ప్రమోద్ అడుగడుగునా చేసే సహాయాల వలన ఆనందిని కి చాలా రిలీఫ్ కలిగింది. చాలా నిశ్చింతగా ‘కత్తి మీద సాము’ వంటి తన బాంక్ ‘మేనేజర్’ ఉద్యోగ నిర్వహణలో మునిగిపోయింది.
అపురూపను రాగింగ్ గొడవలు లేని కాలేజి లో ఇంటర్ లో చేర్పించాడు ప్రమోద్. అభిలాష్ కూడా బుద్ధిమంతుడూ, తన చదువేదో, కెరీర్ ఏదో చూసుకునేట్టు ఉండేవాడు.
***
రోజులు గడుస్తున్నాయి. లలిత, ప్రమోద్, ఆనందిని కుటుంబాలు బాగా కలిసిపోయాయి. ముగ్గురిళ్ళ మధ్యనా రాకపోకలు, ఇచ్చి పుచ్చుకోవడాలు ఎక్కువగా ఉండేవి. అంతా కలిసి పిక్నిక్ లకూ, షికార్లకు తిరుగుతూ, సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. ప్రమోద్ ప్రత్యేకించి ఆనందిని కుటుంబానికి ఆసరాగా ఉండటం అనేది అక్కడివారికి అంత కొత్తగా ఏమీ అనిపించలేదు. ఎందుకంటే, అతడి తత్వమే అది… ఎవరు ఆపదలో ఉన్నా ఆదుకోవటం, తలలో నాలుకగా మెలగటం…పసివారిలో పసివాడుగా, పెద్దవారిలో పెద్దవాడుగా, వృద్ధులకు సహాయపడుతూ, వారికేం సహాయం కావలసి వచ్చినా వెంటనే చేస్తూ ఉండే ప్రమోద్ అక్కడ చాలా మందికి ఇష్టుడే…
అయితే ఆ అపార్ట్మెంట్ లోకి కొత్తగా వచ్చిన వాళ్ళు, ఏ పనీ పాటా లేకుండా తమ పైశాచిక ఆనందం కోసం గాసిప్స్ సృష్టించే కొందరు ప్రబుద్ధులు ప్రమోద్, ఆనందినిల స్నేహానికి రంగులు పులమడం మొదలు పెట్టారు. ఇద్దరి మధ్యా ఏదో ఉందన్నట్టు గాసిప్స్ మాట్లాడసాగారు. అందులో ఇద్దరు ముగ్గురికి ఆనందిని (తగు సెక్యూరిటీలు లేనందున) బాంక్ లోన్స్ రిజెక్ట్ చేయటం ఒక కారణం. వాళ్ళ మాటలనూ, చేష్టలనూ ఏమాత్రం పట్టించుకోకుండా స్థితప్రజ్ఞతతో చక్కగా తమ స్నేహాన్ని కొనసాగించసాగారు ప్రమోద్, ఆనందిని.
ఈ అవాకులూ, చవాకులూ మాట్లాడేవాళ్ళు పిల్లల దగ్గర కూడా వంకరగా మాట్లాడేవారు. మగపిల్లాడు, కాస్త వయసులో పెద్దవాడు కాబట్టి అభిలాష్ ఆ మాటలకు ఏమాత్రం ప్రాముఖ్యతను ఇవ్వలేదు. కానీ తెలిసీ తెలియని వయసులో ఉన్న అపురూపకు ఆ మాటలు, చేష్టలు తట్టుకోవటం కష్టంగా అనిపించేది. తన తల్లి ‘నిప్పు’ అని తెలుసు… అందుకే ఆ మాటలను ఆమెతో చెప్పే సాహసం చేయలేక, ఆ పిచ్చి మాటలకు తట్టుకోలేక లోలోపలే మథన పడటం మొదలు పెట్టింది. ఫలితం – చాలా సున్నిత మనస్కురాలైన అపురూప చదువులో వెనకబడి, ఎప్పుడూ డల్ గా, బెంగగా ఉండసాగింది.
ఎప్పుడూ, డెవలప్మెంట్ అనీ, లోన్ రికవరీలనీ పనితో సతమతమయ్యే ఆనందిని ఉదయం తొమ్మిదికి వెళితే రాత్రి తొమ్మిదికి ఇల్లు చేరేది. భోజనం చేయగానే అలసిపోయిన శరీరం నిద్రను కోరుకునేది… అందువలన కూతురిలో వచ్చిన మార్పును అంత త్వరగా గమనించలేకపోయింది ఆనందిని.
***
ఆనందిని బిజీ షెడ్యూల్ తెలిసిన అభిలాష్ వీలు కుదిరినప్పుడల్లా, కాలేజీ నుండి అపురూపను ఇంటికి తీసుకువెళ్ళే వాడు… ప్రాజెక్ట్ వర్క్ లో సహాయం చేయటం, చదువులో తెలియనివి చెప్పటం వంటివి చేసేవాడు. ఇదంతా చూసిన ‘వాళ్ళు’ తల్లేమో తండ్రితోనూ, కూతురేమో కొడుకుతోనూ ప్రేమాయణం వెలగబెడుతున్నారు…నీతీ జాతీ లేకుండా – అంటూ వక్రంగా మాట్లాడుతూ ఉంటే కన్నీటి పర్యంతం అయ్యేది అపురూప.
“ఏమిటిది అపూ, చిన్నపిల్లవి కాదు కదా… ఏనుగు వెళుతూ ఉంటే వెనకాల ఎన్నో కుక్కలు మొరుగుతాయి… నీకు తెలియదా? వాళ్ళంతా సంస్కారం లేని, స్నేహం విలువ తెలియని మూర్ఖులు…” అని సముదాయించేవాడు అభిలాష్.
“అభి అన్నయ్యా, వాళ్ళు మన గురించి ఎంత చెత్తగా మాట్లాడుతున్నారో చూడు… అమ్మ గురించీ, అంకుల్ గురించీ కూడా…” మాట్లాడలేక అపురూప ఆపేస్తే, “అవన్నీ నిజమా ఏమిటి? చూడు, ఈ విషయాలు నాన్నకి కానీ, ఆంటీకి కానీ తెలిస్తే ఎంత బాధ పడతారు? జస్ట్ నాలుగు నెలల్లోనే ఆంటీ మంచి పేరును సంపాదించుకున్నారు మన కాలనీలో… ఇవన్నీ తెలిస్తే చాలా ఫీల్ అవుతారు… సరేనా, నువ్వు డల్ గా ఉండకు అపూ…” అని చెప్పేవాడు అభిలాష్.
ఓ రోజు అభిలాష్ తన కాలేజీ పిల్లలతో టూర్ కి వెళ్ళినప్పుడు, అపురూపకు కాలేజీ లోనే బాగా ఆలస్యం అయిపోయింది… ఇంటికి వచ్చేసరికే ఏడున్నర దాటింది… లోపలికి వస్తుంటే బయట గార్డెన్ లో ఉన్న బెంచీల మీదనుంచి మళ్ళీ అవాకులూ, చవాకులూ… పిచ్చి నవ్వులూ, పిల్లి కూతలూ…
“అభిలాష్ గాడు అయిపోయాడు, ఇంకెవర్నో పట్టిందోయ్ పోరి… ఆ తల్లీ అంతే… ఏనాడూ తొమ్మిది లోపల ఇల్లు చేరదు… బయట ఎన్ని రాసలీలలో తన దోస్త్ తో…”
“దోస్త్ తోనా, దోస్త్ ల తోనా” మళ్ళీ నవ్వులు…
మనసు కలచి వేయగా ఎలాగో ఫ్లాట్ చేరి, తాళం తెరచుకొని ఇంట్లోకి వచ్చిపడింది అపురూప. ఏడుస్తూ మంచం మీద వాలిపోయింది. అసహాయత… ఆక్రోశం… టేబుల్ మీద స్టాండు లో అమర్చిన తండ్రి ఫోటో వైపు చూస్తూ, ‘ఎందుకు నాన్నా, మధ్యలో మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయావ్? నువ్వుంటే ఇలా ఎవ్వరూ అనేవారు కాదు మమ్మల్ని…’ అని పైకే చెబుతూ భోరున ఏడ్చింది.
ఎనిమిదిన్నరకు డోర్ బెల్ చప్పుడు అయితే లేచి, తలుపు తెరచింది. ఎదురుగా లలిత. “ఏంట్రా ఎంత సేపైంది వచ్చి?” అడుగుతూ లోపలకు వచ్చింది.
“ఇందాకే వచ్చాను ఆంటీ…”
“ఏమిటి రూపా, అలా ఉన్నావేం? హెల్త్ బాగాలేదా?” అనుమానంగా అపురూపను పరికిస్తూ అడిగింది లలిత.
“అవునాంటీ, బాగా అలసిపోయాను… తలనొప్పి…”
“అమ్మెప్పుడు వస్తుంది? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది…”
“అవును ఆంటీ… నేనూ ట్రై చేసాను… ఉండండి మళ్ళీ చేస్తాను…” అని ఫోన్ చేసింది అపురూప. అటువైపు నుంచి ఆనందిని చెప్పే మాటలు వింటూ ఉంటే అపురూప కనుబొమలు ముడుచుకున్నాయి.
“ఇందాక అమ్మ మీటింగ్ లో ఉందట… అందుకే సెల్ స్విచాఫ్ చేసానంటోంది. ఈరోజు వాళ్ళ డీజీయం గారి రిటైర్మెంట్ అట… ఇంకో రెండు గంటల తర్వాత వస్తుంది అట… ఆంటీ, మీలాగా అమ్మ కూడా ఉద్యోగం మానేసి, ఇంటిపట్టునే ఉంటే ఎంత బాగుంటుంది?” అప్రయత్నంగా అనేసింది అపురూప.
“పిచ్చి తల్లి… అలా ఉద్యోగంలో రాణించటం ఒక అదృష్టం… నాకా రాత లేదు… దేవుడు నాకు ఆ భాగ్యాన్ని ఇవ్వలేదు…అదీ గాక, మీ అంకుల్ ని కూడా చూసుకోవాలి కదా… అయినా అమ్మకి ఉద్యోగం లేకపోతే, మీ పరిస్థితి ఏమిటి? మనలాంటి వాళ్ళకు చదువూ, ఉద్యోగాలే కదరా ఆస్థి పాస్తులు! అదీగాక నీ చదువు? అది సరేగానీ అపూ, ఎందుకమ్మా అదోలా ఉన్నావు ఈరోజు?” లాలనగా అడిగింది లలిత.
“ఏమీ లేదాంటీ…” ముక్తసరిగా అంటున్న అపురూపను సాలోచనగా చూసి, వెళ్ళిపోయింది లలిత.
***
భర్త కైలాష్ పుట్టినరోజు ఫంక్షన్ కి భోజనానికి పిలిచింది లలిత. రెండో శనివారం కొత్తగా వచ్చిన సెలవు కావటంతో ఆనందిని ఇంటిపట్టునే ఉంది. ప్రమోద్, అభిలాష్, ఆనందిని కలిసి వెళ్ళారు.
“రండి…అభీ, ప్రమోద్… అమ్మా ఆనందినీ…” ఆనందంగా ఆహ్వానించాడు కైలాష్ వీల్ చెయిర్ లో కూర్చుని. అతనికి కారు ప్రమాదంలో రెండు కాళ్ళూ పోయాయి… కూతురు రమ్యనూ, భర్తనూ ఎంతో అపురూపంగా చూసుకునే లలిత ఆ ఇంటికి ఆలంబన.
ఆయనకి బర్త్ డే విష్ చేసి, తాము తీసుకువచ్చిన ఫ్లవర్ బొకే, గిఫ్ట్ ఆయన చేతిలో పెట్టారు.
“అపూ ఏది? రాలేదా ఆంటీ?” అడిగింది లలిత కూతురు రమ్య.
“తలనొప్పిగా ఉందని పడుకుందిరా… ఎంత బ్రతిమాలినా రాలేదు… లలిత బిర్యానీ అంటే అది చెవి కోసుకుంటుంది… ఎందుకో రమ్యా, అది ఈ మధ్య బాగా డల్ అవుతోంది… చదువులోనూ వెనకబడింది…” బాధగా అంది ఆనందిని…
“అరె, నందూ… నువ్వు నాతో అననే లేదు… నేనూ అంతగా గమనించలేదు… మంచి డాక్టర్ ని కన్సల్ట్ చేసి ఉండేవాళ్ళం కదా…” అన్నాడు ప్రమోద్.
వంటింట్లోంచి వింటూ ఉండిపోయిన లలిత దీర్ఘంగా నిట్టూర్చింది. రమ్య వలన కొంత తెలుసామెకి… పసివయసుకీ, యవ్వనానికీ మధ్యన ఉన్న అపురూప మనసును, ఆ మదిలోని ఘర్షణనూ చక్కగా అర్థం చేసుకుంది.
“లల్లీ, ఏం చేస్తున్నావు? నేను హెల్ప్ చేస్తానే… సారీ లేట్ గా వచ్చాను కదూ? ఉదయం నుంచీ ఇంట్లో పన్లు… ఏవేవో అఫీషియల్ ఫోన్ కాల్స్…” వంటింట్లోకి వచ్చి చెప్పింది ఆనందిని.
“అంతా రెడీ అయింది నందూ… మీరు కూర్చోండి… వడ్డించేస్తాను…” నవ్వుతూ చెప్పింది లలిత.
అందరూ లంచ్ చేసాక, క్యారేజీ లో స్వీట్స్, గారెలూ, బిర్యానీ, ఆలూ కుర్మా, పెరుగు పచ్చడి అపురూప కోసం పెట్టి ఇచ్చింది లలిత. వాళ్ళు వెళ్లేముందు, “ప్రమోద్, నందూ… రేపు ఆదివారమే కదా… నేను సాయంత్రం వస్తాను… నందూ ఇంట్లో కూర్చుందాం… చాలా మాట్లాడుకోవాలి మనం… మీరు ఫ్రీగానే ఉంటారు కదా…” అంది లలిత.
ఆశ్చర్యంగా చూస్తూ, “ఓకే తప్పకుండా లలితా….” అన్నారిద్దరూ ఒకేసారి.
***
ఆ మర్నాడు లలిత వచ్చేసరికే ఎనిమిది అయింది. అంతా కలిసి సరదాగా ఆనందిని ఇంట్లోనే భోజనం చేసారు. తొమ్మిది దాటింది… ఆ కబుర్లలో, నవ్వుల్లో పాలు పంచుకోలేక, నిద్రొస్తోందంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది అపురూప.
“సారీ…” అపాలజిటిగ్గా అంది కూతురి ప్రవర్తనకు కించ పడుతూ ఆనందిని. ఫర్వాలేదన్నట్టు చూసారిద్దరూ…
“లల్లీ, ఏదో మాట్లాడతానని అన్నావు… చెప్పు, మళ్ళీ నీకు లేట్ అవుతుంది…” అంది ఆనందిని.
“మీకిద్దరికీ ఫ్రెండ్ నే కాబట్టి చొరవ చేసి చెబుతున్నాను… ఏమీ ఫీలవ్వరు కదా…” అడిగింది లలిత.
“ఆంటీ, నేను ఉండవచ్చా?” చటుక్కున అడిగాడు, అభిలాష్.
“యస్, నువ్వుండొచ్చు… ఉండాలి కూడా…” గంభీరంగా అంది లలిత. “అభీ, నువ్వు మీ నాన్న గురించి ఏమీ ఆలోచించవా?” అడిగింది ఉపోద్ఘాతంగా…
“అయ్యో, ఆలోచిస్తున్నానాంటీ… నా చదువు పూర్తికాగానే, జాబ్ చూసుకొని, నాన్నతో ఉద్యోగం మానిపించి, ఆయన్ని విశ్రాంతిగా, ప్రశాంతంగా ఉంచాలని నా కోరిక… అందుకేగా రాత్రింబగళ్ళు కష్టపడి చదివేది!” అన్నాడు అభిలాష్ తండ్రి వైపు ప్రేమారాధనలతో చూస్తూ…
“ఆ మాత్రం సరిపోతుందా అభీ? ఆయనకి ఏమాత్రం వయసు మించిపోయిందని? రెండో పెళ్ళి గురించి ఎప్పుడైనా ఆలోచించావా నాన్నా?” సీరియస్ గా అన్నది లలిత మాటలకు శ్రోతలు ముగ్గురూ (నిజానికి నలుగురు) అవాక్కయ్యారు.
“నాన్న మళ్ళీ పెళ్ళి చేసుకునేట్టయితే అందరికన్నా ఎక్కువగా సంతోషపడేది నేనే ఆంటీ…” ఉద్వేగంగా అన్నాడు అభిలాష్.
“సరే, ప్రమోద్, నందూ… మీ ఇద్దరినీ సూటిగా అడుగుతున్నాను… మీరూ సూటిగా జవాబు వెంటనే చెప్పండి.. మీరిద్దరూ మంచి స్నేహితులు… మంచి భార్యాభర్తలుగా కూడా రాణిస్తారని నా అభిప్రాయం… మీరిద్దరూ పెళ్ళెందుకు చేసుకోకూడదు?” అడిగింది లలిత.
“లల్లీ! నీకేమైనా మతిపోయిందా?” అరిచినట్టే గట్టిగా అన్నది ఆనందిని. ఆ అరుపుకి నిద్ర నటిస్తూ వీళ్ళ మాటలు వింటున్న అపురూప తన గది కిటికీ దగ్గరగా వచ్చి మరీ వీరి సంభాషణ వినసాగింది.
“అసలు నీకా భావం ఎందుకు కలిగింది లలితా?” అడిగాడు ప్రమోద్ బాధ నిండిన స్వరంతో.
“మీ ఇద్దరి గురించీ రకరకాలుగా జనం మాట్లాడుకొంటున్న మాటలను మీరు కేర్ చేయటం లేదు కానీ, ఇంకా లోకమంటే ఏమిటో తెలియని పసిపాప లాంటి అపురూప భరించలేకపోతోంది… వాళ్ళ మాటల్ని భరించలేక, వారిపై ఎదురు తిరగలేక సతమతమై పోతూ, తనలో తనే నత్తగుల్లలో నత్త ముడుచుకున్నట్టుగా ముడుచుకుపోతోంది… ఇదంతా ఎందుకు ప్రమోద్? ఆ లోకుల మాటలనే ‘నిజం’ చేసేస్తే పోలా? ఈరోజుల్లో మళ్ళీ పెళ్ళి అన్నది కామనే కదా…” అంది లలిత.
“ఛ! మా ఇద్దరికీ పెళ్ళా?” ఇద్దరూ ఒకేసారి అన్నారు.
“పసితనం నుండీ ‘నందు’ అంటే నాకు అభిమానం. ఆ బంధానికి వరుసలు లేవు… చక్కని చిక్కని స్నేహం మాది…” అన్నాడు ప్రమోద్.
“ఆ లోకుల మాటలు నిజం చేయటానికి, వాళ్ళ నోళ్ళు మూయించటానికీ మాలో లేని భావాలను కొత్తగా తెచ్చుకోవటం నా వల్ల కాదు లల్లీ… అసలు మా ఇద్దరిలోనూ ఆ తలపే లేదు, రాదు కూడా… మా అనుబంధాన్ని అర్థం చేసుకోని మూర్ఖుల కోసం, మా వ్యక్తిత్వాలను చంపేసుకొని, మాటలు మానేయటమో, స్నేహాన్ని తెంపేసుకోవటమో చేయాలా? నిజంగా మేమిద్దరం ఒకరినొకరు కోరుకుంటే మమ్మల్ని ఆపేదెవరు లల్లీ?
స్నేహమన్నది ఎంత అపురూపం? మరెంత అద్భుతం? కేవలం ఇవ్వటమే తెలిసున్నది, స్వార్థమెరుగనిదీ, తన నేస్తం కంట నీటిచుక్క రానీయనిదీ, ప్రాణమైనా పణంగా పెట్టగలిగేదీ ఆ ఒక్క బంధమే… ఆ మాధురికి ఎవ్వరైనా వశం కావలసిందే… ఆ బలంతో ఎన్ని భవసాగరాలైనా ఇట్టే ఈదేయ వచ్చు… ఆ ఆలంబనతో ఎలాంటి అగ్నిగుండాలైనా ఇట్టే దాటేయగలం. నువ్వూ, ప్రమోద్ లేకపోతే ఈ జనారణ్యంలో నేనూ, అపురూపా ఏమైపోయి ఉండే వాళ్ళం? బంధుత్వాన్ని మించిన పెన్నిధి కదా లల్లీ చెలిమి అనే ఈ కలిమి?
మా మధ్య ఉన్న స్నేహాన్ని తోడుగా తీసుకుని కలిసి ఇలా సాగిపోతామే తప్ప, నేను ఎవరినీ కేర్ చేయను. నీకూ నాకూ మధ్య ఉన్న స్నేహాన్ని ఎంతో మెచ్చుకునే ఈ జనం, ప్రమోద్ కూడా నాకలాంటి స్నేహితుడే అని ఎందుకు ఒప్పుకోదు? ఎందుకు నమ్మదు? వక్రంగానే ఎందుకాలోచిస్తుంది? ప్రమోద్ నాకు స్నేహితుడు… అన్నింటినీ మించిన అపురూపమైన బంధం మా స్నేహానిది… మమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు…” దృఢంగా చెప్పింది ఆనందిని.
అపురూపకు తల తిరిగినట్టు అయింది… క్రిందటి నెలలో జరిగిన ఓ సంఘటన మదిలో మెదిలింది.
***
అప్పటికి మూడురోజులుగా కన్ను విప్పనీయని జ్వరం ఆనందినికి. సెలవు పెట్టి, మంచమ్మీద నీరసంగా పడుకుని ఉండిపోయింది. తనకు పరీక్షలు, ప్రాక్టికల్ క్లాసులూ జరగటంతో తప్పనిసరిగా కాలేజీకి వెళ్ళాల్సి వచ్చింది అపురూపకు.
ఓ రోజు తాను ఇంటికి వచ్చేసరికి, తల్లిని లేవదీసి, భుజాలు పట్టుకొని పళ్ళరసం తాగిస్తున్నాడు ప్రమోద్ అంకుల్… ఆమె కూడా నీరసంగా అతని భుజమ్మీద తల వాల్చింది… తాను ప్రవేశించే లలిత ఇంట్లో ఆమె సరికి, కంగారుగా, “ఏం లేదమ్మా, అమ్మకి కళ్ళు తిరుగుతున్నాయి… మందులు వేస్తున్నాను…” అని అతను చెప్పటంతో, తన మనసులో ఏదో అనుమానం ప్రవేశించినట్టు అయింది…
నిజానికి తను అమ్మ ఆరోగ్యం గురించి గాబరా పడుతుందన్న భయంతో గబుక్కున అలా చెప్పాడు, కానీ తన చర్యను సమర్ధించుకోవటానికి కాదని ఇప్పుడు అర్థమవుతోంది… ఆ రాత్రి అమ్మకు కొంచెం తేలికగా ఉండటం తో ప్రమోద్ తన ఫ్లాట్ కి వెళ్ళిపోయాడు… అప్పుడు చెప్పింది అమ్మ, మధ్యాహ్నం బ్రెడ్ తిని పాలు తాగగానే తనకు వాంతి అయిందనీ, ప్రమోద్ పక్కనే ఉండి పట్టుకుని, మొహం, మూతి కడిగి, మందులు వేసి పడుకోబెట్టి, పక్కబట్టలూ, నేల మీదా శుభ్రం చేసి, డెట్టాల్ వేసి కడిగి తుడిచాడని… కూతురైన తాను కూడా అలాంటి సేవ చేయలేదేమో… ఇద్దరి మధ్యా ప్రేమ ఉంటేనే కదా అలా చేయగలరు అనుకుంటూ వాళ్ళ స్నేహబంధాన్ని అనుమానించి, అవమానించింది తాను. అసలు తనను, తన చదువునూ ఏ మాత్రం డిస్టర్బ్ చేయకూడదని, తానే తల్లికి ఒక కొడుకులా మారి, దగ్గరుండి టైం ప్రకారం మందులు వేసి, ఆహారం పెట్టి, సేవలు చేసి, మళ్ళీ మామూలు మనిషిని చేసాడు… అలాంటి ప్రమోద్ అంకుల్ ని తానెంత తప్పుగా అర్థం చేసుకుంది? ఛ!
“సరే, నందూ, మీ అభిప్రాయం తెలిపినందుకు చాలా సంతోషం… నాకూ హాయిగా ఉంది, ఈ సస్పెన్స్ విడిపోయినందుకు… ఇక మనకన్నీ మంచి రోజులే… మైత్రి అనే పూబాటలో హాయిగా సాగిపోదాం…” చిరునవ్వుతో లేచి ఇద్దరికీ చేయి కలిపింది లలిత.
చెంప మీదికి జారిన అశ్రు బిందువును కొనగోటితో తుడిచివేసి, హాయిగా నవ్వుకుంది అపురూప.
***
మర్నాడు ఉదయం కాస్త ఆలస్యంగా నిద్ర లేచింది ఆనందిని. ఆమె పక్కనే బల్ల మీద అరవిరిసిన పసుపుపచ్చని రోజా పువ్వుతో పాటుగా ఓ స్లిప్ – దాని మీద ‘ఐ లవ్ యూ అమ్మా…’ అని అపురూప అక్షరాలు! అపురూపలో వచ్చిన మార్పును ఎంతో అందంగా ఆవిష్కరించింది ఆ దృశ్యం… అలా ఎంతో ప్రశాంతంగా మొదలైంది ఆనందినికి ఆ రోజు…
అవును! సృష్టిలో తీయనిదీ, ఎవ్వరూ తీయలేనిదీ స్నేహమొక్కటే!
***

విశ్లేషణ: డా. మంథా భానుమతి

చిన్ననాటి స్నేహితులు అనుకోకుండా ఎదురైతే.. ఆ ఆనందం అనుభవించిన వారికే తెలుస్తుంది. అదే.. ఒకే దగ్గర కలిసి ఉండబోతున్నామన్నప్పుడు ఆ ఆనందం రెట్టింపవుతుంది.
ఒకరికొకరు సహాయం చేసుకుంటూ తోడునీడగా ఉంటుంటే.. అంతకంటే ఏం కావాలి? తల్లీ తండ్రీ తామే అయి ఒంటరిగా పిల్లలని సాకుతున్న ఆ స్నేహితులు ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకుంటూ కాలం గడుపుతుంటే వారి పిల్లలు కూడా సన్నిహితులవడం మరింత ఆనందం కలిగించక మానదు.
ఆ స్నేహితులిద్దరూ ఆడవాళ్లైనా ఫరవాలేదు.. మగవాళ్లైనా ఫరవాలేదు. ఆడ, మగ అయితేనే వస్తుంది చిక్కంతా.
ఆనందిని, ప్రమోద్ లకి పేరులోనే తప్ప జీవితంలో అంత ఆనందం లేదు. చిన్ననాటి స్నేహాన్ని పురస్కరించుకుని, వారి వారి భాగస్వాముల్ని కోల్పోయి ఒంటరి జీవితాన్ని గడుపుతూ, కష్ట సుఖాలు పంచుకుంటూ ఇరుగు పొరుగై కాలం గడుపుతుంటారు. వారి స్నేహాన్ని అర్ధం చేసుకున్న స్నేహితురాలు లలిత తన సహకారాన్ని అందిస్తూ ఉంటుంది.
ఆడ, మగ స్నేహాన్ని హర్షించలేని చుట్టుపక్కలవారు మాటల తూటాలతో ఆనందిని కూతుర్ని గాయ పరుస్తూ ఉండడంతో సమస్య మొదలయింది. ఆ సమస్యకి లలిత, సూచించిన పరిష్కారం.. ఆ పరిష్కారానికి ప్రమోద్, ఆనందినిలు స్పందించిన విధానం.. స్నేహానికే నిర్వచనం చెప్తుంది.
వాలి హిరణ్మయిగారు చేయి తిరిగిన రచయిత్రి. చక్కని కథనంతో, చదువరిని కథలో లీనం అయేటట్లు చేస్తారు. కథంతా చదివాక అమ్మయ్య అనుకోక మానం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *