April 28, 2024

స్నేహం పెంచుకునే మార్గం – స్నేహం

రచన:-శ్రీసత్య గౌతమి, పి.హెచ్.డి.

సుశీలకు ఇప్పుడు అరవై ఏళ్ళు. ఒక స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగినిగా పనిచేసి ఏభై ఎనిమిదేళ్ళకి పదవీ విరమణ
చేసింది ఉద్యోగంలో ఉన్నప్పుడు చెయ్యాలనుకొని కాలపరిమితి వల్ల చెయ్యలేకపోయినవన్నీ రిటైర్ అయ్యాక చెయ్యాలనుకొనేది. ఉదాహరణకి కన్నవాళ్ళతో కలిసి తీర్ధయాత్రలకెళ్ళాలనో లేక ఏ సుందర ప్రదేశం చూడాలనో.
ఊహు … అసలు వీలే పడలేదు, ఈలోపుల వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. తమ్ముళ్ళ, చెల్లెళ్ళ బాధ్యతలున్నాయని పెళ్ళిని వాయిదా వేసుకుంటూ వెళ్ళేసరికి, ఆ పెళ్ళి వయసు కూడా దాటిపోయింది, పెళ్ళి లేదు. ఇప్పుడు తనలో తానుగా మిగిలిపోయింది. అయినా తానేదో వంటరినని బాధ పడిన సంధర్భాలు తక్కువే ఉన్నాయంటుంది ఎవరైనా అడిగితే. ఆమె గురించి తెలిసిన వాళ్ళకి అది నిజమే అని నమ్ముతారు, తెలియని వాళ్ళు అలా చెప్పుకొని ఊరట పొందుతుందిలే అని తీసిపారేస్తారు. పుర్రెకో బుద్ధి!!
సుశీల ఒక నిండు గోదారి. తొణకదు, బెణకదు ఎవరి ఆలోచనలకి. అటువంటి మనస్థైర్యం సుశీలకు దేవుడిచ్చిన వరం. కానీ సుశీల మాత్రం ఆ క్రెడిట్ తన స్నేహితులకిస్తుంది. ప్రతి ఒక్క దశలో తనకేర్పడిన స్నేహాలే తనకు మార్గదర్శకాలయ్యాయి అంటుంది. తన చెల్లెలు కూతురు ప్రసన్న అడిగింది…
“అందరికీ స్నేహితులు వుంటారు. స్నేహం చెయ్యబోయే ముందు వాళ్ళు మంచి స్నేహితులవుతారా, కాదా అని ఎలా తెలుస్తుంది? మమ్మీ ఎప్పుడు మంచి వాళ్ళతో మాత్రమే స్నేహం చెయ్యాలంటుంది. ముందే ఎలా తెలుస్తుంది? మంచి స్నేహం అంటే ఎలా వుంటుంది పెద్దమ్మా?”
“అమాయకంగా అడిగినా, అది చాలా గొప్ప ప్రశ్న. మమ్మీ దీనికి సమాధానం చెప్పలేదా?” … సుశీల అడిగింది.
“ఉహు..” … ప్రసన్న అడ్డంగా తలూపింది. ప్రసన్న పదోతరగతి పూర్తి చేసింది, ఈ యేడు కాలేజీలోకి అడుగు పెట్టబోతోంది.
సుశీల చిన్నగా నవ్వి పుస్తకాల షెల్ఫ్ లోంచి ఒక డైరీ తీసి ఇచ్చి, చదవమంది.
“ఇది నేను ప్రత్యేకంగా నాకు ఎదురుపడిన స్నేహితుల గురించి వ్రాసుకున్న డైరి. నువ్వు తప్పకుండా చదవాలి. చదివి నీకేమర్ధమయ్యిందో నాకు చెప్పు” … అంటూ సుశీల పుస్తకాన్ని అందించింది.
ప్రసన్న కళ్ళల్లో మెరుపులు మెరిసాయి, అందులో ఏముందో చదవాలని ఒకటే కుతూహలం.
డైరీ తెరవగానే ఉన్న మొదటి పేరాలో ముత్యాల్లాంటి అక్షరాలతో సుశీల వ్రాసుకున్న వాక్యాలు – నా జీవితంలో దేవుని దగ్గిరనుండి నేను పొందిన ఐదు రకాల స్నేహితులు దేవుడు నాకిచ్చిన ఐదు వరాలు. నవ్వుతూ ఆనందపరిచే ఆహ్లాదకరమైన స్నేహితులు, తమ అనుభవాలను, జీవిత పాఠాలను రంగరించి మార్గదర్శకులై నిలిచే స్నేహితులు, తీసుకునే నిర్ణయాలకు ధైర్యమిచ్చే స్నేహితులు, తప్పులు ప్రశ్నించే స్నేహితులు అలాగే నమ్మకమైన స్నేహితులు.
“వీళ్ళందరినీ పొందడం ఎలా అబ్బా?” … ప్రసన్న బుర్రలో పురుగు తొలిచేసింది. మెల్లగా రెండవ పేజీ త్రిప్పింది, అక్కడినుండి కధనంలో పడిపోయింది.

*******************

సుశీల వయస్సు అప్పుడు 18. తండ్రి రిటైర్ అయిపోయారు, తన తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు. మధ్యతరగతి కుటుంబం. పెద్దగా సేవింగ్స్ లేవు. సుశీల టీచర్ ఉద్యోగం చేసి తండ్రికి చేదోడు వాదోడు గా వుండి కుటుంబానికి ఒక పెద్దదిక్కయి, చెల్లెళ్ళిద్దరినీ పైకి లాగాలని నిర్ణయించుకుంది.
టైనింగ్ లో కలిసాడు రవీంద్ర. మంచి కవి, పాటలు బాగా పాడతాడు.
“సుశీల గారూ … ప్రొద్దున్నే క్రొత్త కవిత్వం పుట్టుకొచ్చేసింది. వెంటనే వ్రాసేసాను, మీరు అది ఎలా వుందో చెప్పాలి”…
రవీంద్ర హడావిడిగా వస్తూ చెప్పాడు.
“నేనెప్పుడూ కవితలు వ్రాయలేదు, నన్నడిగితే నేనెమి చెప్పను?” … సుశీల సున్నితం గా ప్రశ్నించింది.
“అమ్మమ్మా .. ఎంత మాట? పోయినసారి కవిత్వానికి మీరిచ్చిన ట్విస్ట్ చాలా బాగుందండీ, అందుకేగా అది మొన్న ప్రచురణకొచ్చిందీ! అక్కడే అర్ధమయిపోయింది మీది ఎంత భావుకత కలిగిన మనసో. కాబట్టి ఇక నుండీ, నా కవితలకి మీరే మార్గదర్శకులు”
“విచిత్రం, కానీ నేనెప్పుడూ కవితలు వ్రాయలేదు. నా భావుకత నాకే తెలియలేదు”… అంది సుశీల నవ్వుతూ.
“స్పందించే మనసు మీకుంది, అది ఎంత మందికుంటుంది చెప్పండి. మన క్లాసులో ఇంతమంది ఉన్నారు. చూడండి వాళ్ళేమయినా ఎప్పుడయినా మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ మాట్లాడుకుంటారేమో. ఎప్పుడూ సినిమాల గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి తప్పా. కానీ మీరు? మాట్లాడితే అందులో ఒక ప్రధానమైన అంశం ఉంటుంది. ముఖ్యం గా నాకు ప్రధానమైనది. అందుకే మీరు నాకు ప్రధానమైన వారు.
అయితే ఒక మాట… నేనేదో నా స్వార్ధానికి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానను కోవడం లేదు కదా?” … రవీంద్ర వర్రీగా ముఖం పెట్టి అడిగాడు.
“హహ .. లేదండీ. మీ కవితలు కొన్ని ఆహ్లాదంగా, కొన్ని అమాయకం గా, మరికొన్ని విషయసూచికం గా ఉంటాయి. నేను కూడా వాటినుండి కొన్ని క్రొత్త విషయాలను తెలుసుకుంటున్నాను. మీ కవితల ద్వారా మీరెంత సున్ని హృదయులో కూడా అర్ధమవుతున్నది” … సుశీల సమాధానం.

“ఇంతవరకూ వీరిద్దరి స్నేహం లో ఒక స్పష్టత కనబడుతోంది” … ప్రసన్న అనుకొన్నది.

***************

ప్రసన్న మూడవ పేజీ త్రిప్పింది ఇంకా కుతూహలంగా తర్వాత ఏమి జరిగిందా … అని. ఆ పేజీ సుశీల క్లాస్ మేట్స్ కొందరు వీళ్ళ స్నేహాన్ని అపార్ధం చేసుకొని అనుమాన దృష్టితో వెనకాతల అనే మాటలు.
“ఊ…” అని తల పంకించి ముందుకు సాగింది ప్రసన్న.
“ఏమ్మా సుశీలమ్మా … రవీంద్రగారి కవితాలహరి ఎంతవరకొచ్చిందేమిటీ?” … వింధ్యారాణి పుల్లవిరుపు.
దానికి సావిత్రి కిలా కిలా రావాలు “బాగా అంటించావ్” అన్నట్లు.
సుశీల ఏమీ రియాక్ట్ అవ్వకుండా … “నువ్వే అడుగు రవీంద్రని. నీకు కూడా అతను తెలుసుగా. అయినా రోజూ మాట్లాడుతూనే ఉంటావుగా? అడగలేదా?”
“హ..య్యో, మమ్మల్ని చూస్తేనే గొంతులో పచ్చి వెలక్కాయ పెట్టుకున్నట్లు కవితా లేదూ, తోటకూరా లేదూ. ముక్తసరిగా మాట్లాడతాడు. మరి నీతో మాత్రం కవితలు కెరటాల్లా కొట్టుకొస్తాయి. ఎందుకంటావ్?” వింధ్య, సావిత్రి విసిగించడం మొదలుపెట్టారు సుశీలని.
మరి అదేదో అతన్నే అడగొచ్చుగా … సుశీల ఇబ్బందిగా సమాధానం చెప్పేసింది.
“దానికి కూడా ఏ సమాధానం రాదమ్మా. నువ్వెలా చెప్తే కవిగారు అలా వింటారు కాబట్టి నువ్వే అడిగి తెలుసుకొని రా”… మనసులోని అక్కసుని కక్కేసారు వింధ్య, సావిత్రి.
“ఇది సుశీలకి మరింత బాధను కలిగిస్తోంది. రవీంద్ర వీళ్ళతో సరదాగా ఉండడానికి తిరస్కరిస్తున్నాడని అహం దెబ్బ తిని ఆ అక్కసునంతా తన మీద చూపిస్తున్నారు. దేవుడా … ఇది నా తప్పెలా అవుతుంది?” …సుశీల కి మనోవేదన.
వింధ్యా, సావిత్రి, పద్మా ఇంకా మరో ఇద్దరు అబ్బాయిలు (రవీంద్రకు స్నేహితులే) రవీంద్రా, సుశీల మధ్య స్నేహాన్ని అపార్ధం చేసుకుంటూ పుల్ల విరుపు మాటలు అందరి చెవిలో వేస్తున్నారు.
సుశీల, రవీంద్రకు చెప్పింది. అంతేకాకుండా వాళ్ళతో కూడా స్నేహం చెయ్యమని అడిగింది.
“లేదు సుశీల. వాళ్ళకి నా మీద స్నేహభావం లేదు. నా కవితలంటే చిన్న చూపు వాటిని గేళి చేస్తున్నారు నా దగ్గిరకొచ్చి. నేను నా కవితల్ని, పాటల్ని నీకు వినిపిస్తున్నాననే ఉక్రోషంతో పుల్లవిరుపుగా మాట్లాడతారు. వాళ్ళతో చేరి రాజు, మాణిక్యం కూడా అదే వరుస, హేళన!”
“ఓకే. అయితే వీళ్ళకి మనమీద కించిత్తు స్నేహభావం కూడా లేదన్న మాట. నీతో స్నేహం చెయ్యడానికి, నేను అడ్డమవుతున్నాననే అభిప్రాయంతో ఉన్నారని నేను అనుకుంటున్నాను” … సుశీల చెప్పింది.

“ఉహు … వాళ్ళకి స్నేహం చెయ్యడమే ఇంకా తెలియదు. వాళ్ళల్లో వాళ్ళు కూడ ఏ రోజయినా ఒక్కళ్ళు లేకపోతే మిగితా అందరూ ఆ ఒక్కళ్ళ గురించి తెగ మాట్లాడుకుంటారు. ఒకరి మీద ఒకరికి అసలు గౌరవమే లేదు” … అని చెప్పాడు రవీంద్ర.
అది విన్నాక సుశీలకు ఎక్కడలేని కోపం, మొండితనం కలిగింది.
“అయితే వీళ్ళకి బుద్ధి చెప్పాలి. అంటే మనం వీళ్ళ మాట అస్సలు వినకూడదు, పట్టించుకోకూడదు. నిశ్శబ్దాన్ని పాటిద్దాం. అది వీళ్ళని ఇరిటేట్ చేసీ, చేసీ పట్టి కుదిపేస్తుంది. వాళ్ళకి మన:శ్శాంతి కరువవుతుంది” … సుశీల ముఖంలో తీవ్రతను మొదటిసారిగా చూసాడు రవీంద్ర.
సుశీలలో మరో కోణం కనబడింది రవీంద్రకు ఆమె ధృఢచిత్తురాలని. స్వచ్చమైన స్నేహం కాపాడడానికి భావం ఉంటే చాలదు, దానికి రెండు చేతులూ అడ్డుపెట్టి రక్షణ కల్పించ గలిగే దృఢచిత్తం కూడా కావాలి, అది తమ స్నేహం లో ఉన్నందుకు రవీంద్రకు సంతోషం కూడా కలిగింది.
పద్మా, సావిత్రి గ్యాంగ్ కి రవీంద్ర, సుశీలలు స్పందించడం మానేసారు. దానితో వాళ్ళకి అహం దెబ్బతిన్నది. సుశీలను మెస్ లో పట్టుకొని అడిగారు “ఈ మధ్య మాతో ఎందుకు మాట్లాడటం లేదు?” అని.
సుశీల ధీటుగా సమాధానమిచ్చింది.
“మీరు ఇంకా అపరిపక్వ దశలో ఉన్నారు” …
“అంటే” … బుర్రగోక్కున్నారు గ్యాంగ్ అంతా.
“అరమరికలు లేని స్నేహం ఎలా చెయ్యాలో మీకింకా తెలియదు. మీలో మీరు చేస్తున్నది మాత్రం నిజమయిన స్నేహమా? ఒకసారి గుండెలమీద చెయ్యేసుకొని చెప్పండి. మొన్న సావిత్రి మెస్ కి రాకపోతే మీరు మెస్ అంతా సావిత్రి మీద ఒకటే జోకులు … ఆమె ఒక పిసినారి అనీ, అబ్బాయిలతో పళ్ళికిలిస్తుంటుందనీ … ఇలా ఎన్నో మాట్లాడారు. మీలో మీకే గౌరవించుకోవడం తెలియదు, మీ స్నేహం మీద మీకే నమ్మకాల్లేవు. ఇక నాకేమి మీరు గౌరవిస్తారు? అందుకే … మీకు రెస్పాండ్ అవ్వడం లేదు. మీరింకా ఎదగాలి. ఈ సమాధానం చాలా ఇంకా కారణాలు చెప్పాలా?” …సుశీల ఠపీ ఠపీ మని చెప్పింది.
అందరికీ మొహాలు జేవురించాయి. ఎందుకంటే సుశీల చెప్పేటప్పుడు సావిత్రి అక్కడే ఉంది. ఇప్పుడు సావిత్రికి తెలిసిపోయింది తనతో ఎప్పుడూ వుండే స్నేహితులు తన వెనుక ఇలా మాట్లాడుకుంటారని.
ఆ తర్వాత మాట్లాడకుండా అందరూ అక్కడినుండి వెళ్ళిపోయారు. పైగా సుశీల హటాత్తుగా ఇలా చెప్పగలదని కూడా వాళ్ళు ఊహించలేకపోయారు. సుశీల చాలా ఖచ్చితమైన మనిషి అని మొదటిసరిగా తెలుసుకున్నారో ఏమో … ఇక అప్పటినుండి సుశీలముందు రవీంద్ర గురించి ఎత్తడం మానేసారు.
ఈలోపు ట్రైనింగ్ కోర్స్ కూడా అయిపోతుంది, ఫేర్ వెల్ ఫంక్షన్. ఆ ఫంక్షన్ లో స్టేజీ మీద ఒక అంశం ఏమిటంటే ఎవరికి వారు వచ్చి తమకు నచ్చిన వాళ్ళ గురించీ వాళ్ళల్లో తమకు నచ్చిన అంశము గురించి చెప్పాలి. అసలు స్టేజీ మీద మాట్లాడే టాపిక్ ఏమిటంటే … ఈ కలిసి ప్రయాణం చేసిన కాలంలో మరుపురానిది ఏమి నేర్చుకున్నాం?.
విద్యార్ధులు సాధారణంగా తమకు నచ్చిన ఉపాధ్యాయుల గురించే చెప్తారు. కానీ వింధ్యా, పద్మా తదితరులు సుశీల గురించి మాట్లాడారు.
“ఈ కలిసి చేసిన ప్రయాణంలో స్నేహమన్నది అనేక రూపాలుగా, అనేక భావాలుగా ఉంటుంది. ఎలా ఉన్నా దాని ప్రధాన ఉద్దేశ్యం మాత్రం ఎటువంటి ఆర్భాటాలు, కుత్సితాలు లేకుండా స్వచ్చంగా, ఆత్మీయంగా, స్వార్ధ రహితంగా ఒకరి భావాలను మరొకరితో పంచుకోవడమే స్నేహం. ఆ “స్నేహాన్ని పెంచే మార్గమే స్పష్టత. స్నేహంలో స్పష్టత, ఆ స్నేహితులిద్దరి మధ్యా ఒక స్పష్టత” ఉండాలని సుశీలా, రవీంద్రలనుండి నేర్చుకున్నాము. ఇది మాకు లోపించబట్టే సావిత్రి మాకు దూరమయ్యింది” అని ఒక్కసారిగా వింధ్య ఏడవడం మొదలు పెట్టింది.
సుశీల ఉలిక్కి పడింది, వింధ్య తన పేరు చెప్పేసరికి, ఏడుస్తూ సావిత్రి గురించి చెప్పేసరికి. అది వినగానే సావిత్రి కూడా కళ్ళు చెమరుస్తూ స్తేజీ మీదకి వెళ్ళి స్నేహితురాళ్ళని దగ్గిర చేసుకొంది. సుశీల కూడా లేచి కళ్ళు తుడుచుకుంటూ వాళ్ళను చేరింది.

******************

ఆఖరి సీన్ కి హృదయభారంతో ప్రసన్న కూడా డైరీ మూసింది. మంచి స్నేహాన్ని పెంచుకొనే మార్గాలు స్పష్టత, ధృఢచిత్తం, ఖచ్చితం ఆ పై స్వచ్చత, నిర్మలత్వం అని చదివిన డైరీని, అందులో సీన్లని మళ్ళీ మళ్ళీ నెమరువేసుకుంటూ నిద్రపోయింది.

విశ్లేషణ: డా. మంథా భానుమతి

కుటుంబం కోసం తన సుఖాన్ని త్యాగం చేశానే అని ఎప్పుడూ చింతించని ఒక స్త్రీ కథ ఇది. తండ్రి రిటైర్ అయిపోతే పెద్ద కూతురిగా బాధ్యతలు స్వీకరించి అందరినీ పైకి తీసుకొచ్చి సుశీల, అంత సంతోషంగా ఎలా ఉంటుందా అనేది పెద్ద ప్రశ్నే అందరికీ.
మనసుని నియంత్రించుకుంటే ఏదీ అసాధ్యం కాదని చిదానందంగా ఉండే సుశీల దగ్గరకి, స్నేహం విలువ తెలుసుకోమనీ, ఎటువంటి వారితో స్నేహం చెయ్యాలో తెలుసుకోవాలంటే పెద్దమ్మ సలహా తీసుకోమనీ తన కూతుర్ని పంపుతుంది సుశీల చెల్లెలు.
అకళంక స్నేహం మనసుకి ఆహ్లాదం కలిగించేదనీ, దానికి ఆడా మగా తేడా లేదనీ.. తన అనుభవాలన్నీ పొందు పరచిన డైరీని చదవమని చెల్లెలి కూతురికి ఇస్తుంది సుశీల.
ఆ డైరీని ఆ అమ్మాయితె పాటుగా చదివిన పాఠకులకి కూడా అర్ధ మవుతుంది.. ఎన్ని విమర్శలు వచ్చినా ఎదుర్కుని నిలుపు కునేదే స్నేహమనీ.. అవసరమైతే ఆ స్నేహాన్ని నిలుపుకోవడానికి కొందరిని బాధ పెట్టినా తప్పులేదనీ .
చివరికి సుశీల, ఆమె స్నేహితుడు రవీంద్రలని మిగిలిన స్నేహితులు అర్ధం చేసుకోవడంతో కథ ముగుస్తుంది.
శ్రీ సత్యగౌతమిగారు సాహిత్యంతో బాగా పరిచయం ఉన్నవారు. అంతర్జాల పత్రికకి కో ఎడిటర్ గా అనేక కథలను చిదువు తుంటారు. ఆ అనుభవంతో, మంచి శైలితో తమ కథలో.. స్నేహానికి చక్కని నిర్వచనం ఇచ్చారు. స్నేహం చేయగానే సరి పోదనీ.. ఆ స్నేహాన్ని నిలుపుకోడానికి స్థిర చిత్తం కావాలనీ, ఎవరో ఏదో అన్నారని వదులుకునేది స్నేహం కాదనీ సుశీల పాత్ర ద్వారా సందేశమిచ్చారు. సుశీల పాత్ర మీద సానుభూతి కాకుండా గౌరవం కలుగుతుంది.
ఒక మంచి కథ చదివామన్న తృప్తి కలుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *