April 27, 2024

ట్రినిడాడ్ నర్సమ్మ కథ…( చరిత్ర చెప్పని కథ )

రచన: పంతుల గోపాలకృష్ణ

ఇది ఇప్పటి ముచ్చట కాదు. నలభై ఏళ్లనాటిది.. అప్పుడతడు మన ఆంధ్ర ప్రదేశ్ లో గవర్నమెంటు డాక్టరుగా పని చేస్తుండే వాడు. ఎనస్థీసియాలో M.D. డిగ్రీ సంపాదించేడు. అప్పట్లో చాలా మంది డాక్టర్లలాగే ఇక్కడ సరైన ప్రోత్సాహం కొరవడి విదేశాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని ప్రయత్నిస్తే Trinidad లో Port of Spain లో యూనివర్శిటీ హాస్పిటల్లో ఉద్యోగం వస్తే వెళ్లి చేరాడు. యూనివర్శిటీ హాస్పిటల్ ఊరి మధ్యలో ఉంది. ఒకవైపు కొండలు, మరొక వైపు సముద్రం…ఊరు దాటగానే చెరుకు తోటలు, పళ్ల చెట్లు-ఊరు చాలా అందంగానూ వాతావరణం చాలా ఆహ్లాదకరంగానూ ఉన్నాయి. హాస్పిటల్లో మన భారతదేశంనుంచి వచ్చి పని చేస్తున్న డాక్టర్లు నర్సులు ఒక పాతికమంది వరకూ ఉన్నారు. వీరు కాక ట్రినిడాడియన్ ఇండియన్స్, యూరోపియన్లు కూడా చాలామంది ఉన్నారు.
అక్కడ ఉన్న భారత సంతతికి చెందిన ట్రినిడాడియన్లలో కొంతమంది మంచి మంచి ఉన్నతోద్యోగాలలోనో. వ్యాపారాల్లోనో కుదురుకున్నవారే. ఈ డాక్టరుగారికి వారిలో చాలామందితో పరిచయం స్నేహం ఒనగూరేయి. అతడికున్న అటువంటి మిత్రుల్లో నర్సాలూ రామయా ఒకరు. అతడు అక్కడి ఇన్ఫర్మేషన్&బ్రాడ్ కాస్టింగ్ డిపార్టుమెంటులో ఉన్నతోద్యోగిగా ఉన్నాడు. అందువల్ల అతడికి ఎంతోమంది ప్రభుత్వోద్యోగులే కాక మినిష్టర్లతో కూడా పరిచయం ఉండేది. ఆ రామయా ఒకసారి ఈ డాక్టరుగారిని వారి ఇంటికి భోజనానికి పిలిచేడు. రామయా గారి ఇల్లు చాలా పెద్దది. అతడికి ముగ్గురూ అమ్మాయిలే. అతడి భార్య పేరు దీదీ.
***
రామయా మన డాక్టరుగారిని ఒక గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ మంచం మీద ఒక పండు ముదుసలి..జుట్టంతా రాలిపోయి సన్నంగా పిట్టలా ముడుచుకుపోయి పడుకుని ఉంది. రామయా డాక్టరు వంక చూస్తూ “ మా యమ్మ” అంటూ వచ్చీ రాని తెలుగులో పరిచయం చేసాడు. వీరు వచ్చిన అలికిడికి ఆవిడ లేస్తే రామయా ఆవిడ దగ్గరకి వెళ్లి గట్టిగా “ ఈయన ఇప్పుడే ఇండియానుండి ఇక్కడకు వచ్చిన డాక్టరు. పేరు…” అంటూ చెప్పేడు. ఆవిడకు చెవుడు లేదట కానీ కొంచెం గట్టిగా మాట్లాడాలిట. కొడుకు చెప్పిన మాటలు విని ఆమె మెల్లగా లేచి నిలబడడానికి ప్రయత్నించింది. కానీ డాక్టరు గారు “ లేవొద్దు.. కూర్చో తల్లీ” అన్నాడు. దానికావిడ “ ఏటిబాబూ ఏటన్నావ్..తల్లీ అనా! మరో పాలి అలా పిల్మీ..ఈ జల్మలో మరి ఎవురూ నన్నలా పిలుస్తారనుకోలేదయ్యా” అంది. కొంచెం సేపు ఆగి “ ఎంత అదురుష్టం నాయినా.. నాను సచ్చిపోయీ లోగా మల్లీ జల్మలో తెలుగు మాటింతాననుకో నేదు నాయినా” అంది. డాక్టరు ఏమీ మాట్లాడకుండా ఆమె పక్కనే కూర్చుని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని నిమరడం ప్రారంభించేడు.
ఆమె తన కథ చెప్పడం ప్రారంభించింది:
అప్పుడు నాకు నిండా పదమూడేల్లు కూడా నేవు బాబూ..మా నాయిన సాలా మంచోడే కాని మా సవిత్తల్లి మా కానిది. నన్ను సాలా ఇంసలు పెడుతుండేది. నా బాదలు సూసి మా వూల్లో ఓ కంసాలాయన కత్తు కలిపి పెల్లి సేసేసుకుందాం. అంటూ నన్ను లేవదీసుకుని పోయి “రంగూనెల్దాం వొస్తావా” అనడిగేడు. అలగడిగీసరికి నా సవిత్తల్లి పెట్టే బాదలు గుర్తుకొచ్చి సరేనన్నాను. అలాగ నన్ను లేపుకొచ్చి ఇజీనారం తీసుకొచ్చేడు బాబూ. అప్పట్లందరూ రంగూనెల్లి బాగా సంపాదించుకుని వొచ్చేవారేమో మేమూ అలాగు సుక పడొచ్చు ననుకున్నాను. నేనూ కసింత గడుసుదాన్నే కాని ఎప్పుడు ఊరి దాటెల్లని దాన్ని కదా నాకేటి తెల్దు. అతగాడేమో అక్కడ నన్ను ఓ యిద్దరి కప్ప జెప్పి ఈల్లు నిన్ను సరిగ జూసుకుంతుంతారు. నేను మనూరోపాలెల్లి ఒచ్చేత్తాను. బేగొచ్చేత్తాన్లే. మరేంటి బయ్యం నేదు అంటూ మాయ మాటలు సెప్పి ఎల్లిపోనాడు బాబూ. ఆడొత్తన్నాడ్లే అని సెప్పి ఆల్లు నన్నోడెక్కించేసారు .ఆడొచ్చిండో సచ్చిండో మరి నాక్కనపడలేదు..” అంది.
“ఓడలో ఎక్కి ఇక్కడికెలావచ్చేవో చెప్పు” అంటూ రామయ తల్లిని ఇంగ్లీషులోనే అడిగేడు.
“ఓర్నాయనో..మరేటి. ఆల్లు మన్ను మోసం సేసీసేరని తెలిసిపోనాది. కానేటి సేద్దును? నా లాటోల్లు సానామంది ఓడలో ఉన్నారు గాని ఆల్లంతా బిహారి వోల్లు, ఇందీ వోల్లే. కొద్దిమంది మలయాలీలు కూడా ఉన్నారు. మద్దిలో ఓడెక్కడైనా ఆగినప్పుడు దిగి పారిపోదామనుకున్నాం గాని దయిర్నం సాల్లేదు. మాం పారి పోకుండా నల్లోళ్లని కాపలా ఎట్టారు.”
“రంగూన్ తోలుకెల్తన్నామని సెప్పినోల్లు ఇదిగిక్కడికి తీసుకొచ్చి ఒడేసారు. మమ్మల్ని తీసుకొచ్చినోల్లంతా తెల్లోళ్ళే.
నల్లోళ్ళ చేత కొరడా దెబ్బలు కొట్టించి మా సేత పని సేయించుకునీ వోల్లు.ఎదురు సెప్పనేక ఆల్లేటిసెప్తే అది సేస్తుండేవోల్లం. కొన్నాల్లు తెలుగోడెవరేన కుదుర్తాడేమోనని సూసీ సూసి ఆకరికి ఓ మలయాలీ ఓడితో సంసారం జేసేను. ఆడు పోయి దగ్గిదగ్గిరి యాభై అరవై ఏల్లవుతాది. ఆడు పోనాక నాను మరెవుర్ని దగ్గిరికి రానియ్యలేదు.”
“రామయ్య మానాయిన పేరు. అదే ఈడికి పెట్టుకున్నాను. మొన్న మొన్నటిదాక ఈడికి ఇండియా అంటే గిట్టేది కాదు. ఇండియాకి సొతంత్రం ఒచ్చింది కాని మాకేటి సెయ్యలేదు గదా?అందుకని మరిక్కడిలాగే ఉండిపోనాం. అద్సరే..మీదేవూరు బాబు?” అని అడిగింది.
“మాది వైజాగు”అన్నాడు డాక్టరు గారు.
“అద్గదే. అక్కడే మేం ఓడెక్కింది. దార్లో వోంతులు ఇరేసనాలు. నాను పోతాననీసేరు బాబు. ఎలగో మెల్లిగ వాటంతటవే తగ్గిపోనాయి బాబు.. నాకిక్కడ నూకలు రాసిపెట్టుంటే అక్కడెందుకు పోతాను. నా నుదుట్రాతిలగుంది. మరేటి సేద్దుం?”
కళ్లనీళ్లు పెట్టుకుంటూ “ నాన్సేసిన తప్పల్లా ఆ కంసాలాయన్ని గుడ్డిదాన్లా నమ్ముకుని ఎలిపోయి వొచ్చీడమే .. నాకిప్పుడు 98 ఏల్లు బాబు. ఇంకెన్నాల్లు బతుకుతాను? సచ్చీలోపుని తెలుగుమాటింతానా అని అనుకునీదాన్ని. నువ్వొచ్చేవు .నిన్ను సూత్తే మావూరు సూసినట్టున్నాది. ఈ జల్మకింతే ప్రాప్తం.” అని కన్నీళ్లు తుడుచుకుంటూ “ మరుంతాను బాబు” అంది.
బరువెక్కిన గుండెతో డాక్టరు బాబు ఆ గదిలోంచి బైటకు నడిచాడు.
***
ఈ కథ చదువుతుంటే మీకు ఏడుతరాల కథ (ఆంగ్లమూలం-అలెక్స్ హైలీ The Roots నవల) లోని కింటాకింటూ కథ గుర్తుకు రావడం లేదూ? అతడ్నీ ఇలాగే ఆఫ్రికా నుంచి అమెరికాకు ఎత్తుకు వస్తారుకదా? మన విజయనగరం నరసమ్మని ఇలాగే 1880 లలో తెల్లవాళ్లు కంసాలాయనకెంతో యిచ్చి ఎత్తుకొచ్చారు. మరో నాలుగు తరాల తర్వాత నర్సమ్మ మనవలో ముని మనవలకో తమ మూలాలు తెలుస్తాయో తెలియవో ?
***
ఈ కథ మనకు తెలియజేసిన కథలోని డాక్టరు నా ప్రియమిత్రుడు Dr.ప్రయాగ మురళీ మోహన కృష్ణ.. అతడు Trinidadలో మూడేళ్ల Contract ముగిసేక లండన్లో FRCS చేసి అక్కడా, ఇర్లండు, డెన్మార్క్ లలోనూ ఆ తర్వాత 20 ఏళ్ల పాటు నార్వేలోనూ పని చేసి తిరిగి మన దేశం వచ్చి వైజాగులో సెటిలయ్యాడు. తన అనుభవాలని అందరితో పంచుకోవాలని “నేలా..నింగీ ..నేనూ.. ఒక ఎన్నారై ఆత్మకథ” అంటూ తన జీవితంలోని ఎన్నో ఆసక్తిదాయకమైన విశేషాలను గ్రంథస్థం చేసాడు. ఆ పుస్తకాన్ని ఎమెస్కోవారు నవంబరు 2011 లో ప్రచురించేరు. ఈ విజయనగరం నరసమ్మ కథ దానిలోదే. కొంచెం ఆసక్తిదాయకంగా చెప్పడానికి నేను ప్రయత్నించాను కానీ కథంతా ఆయన చెప్పినదే. నా కల్పనేమీ లేదు. ఇలాంటి చరిత్ర చెప్పని కథలు. ఎన్నెన్నో కదా?. మరి డా. కృష్ణ లాంటి వారు గ్రంథస్థం చెయ్యక పోతే ఇలాంటివి లోకానికెలా తెలుస్తాయి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *