April 28, 2024

రా..రా… మా ఇంటి దాకా..

రచన: శ్రీధర మూర్తి

వాన.. వాన….
జగాన దగా పడి కుమిలి కుమిలి ఏడుస్తున్న చెల్లెళ్లందరి కళ్లల్లోనుంచి పెల్లుబికి వస్తున్న కన్నీటి ధారల్లా రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది.
ఆ కాలనీలో అన్నీ అయిదంతస్తుల అధునాతన సుసంపన్నుల నివాసాలే! కానీ ఇప్పుడా మేడలన్నీ నడి సముద్రంలో నిలబడిన ఓడల్లా ఉన్నాయి. చుట్టూ నీళ్లు… అక్కడెక్కడో మొదలైన అల్ప పీడనం… ఇక్కడ వీళ్ళని పట్టి పీడిస్తోంది. కుట్టి కుదిపేస్తోంది.
రెండు రోజుల నుంచి నీళ్ళు లేవు… పాలు లేవు.. స్నాన పానాదులు లేవు… తిండీ తిప్పలు లేవు… మనిషికి ఆహారంకన్నా ప్రాణాధారంగా మారిన కరెంటు లేదు… టీ.వీ. లేదు… నిన్న మొన్నటి ఠీవీ లేదు… సెల్లుకు ఛార్జ్‌ లేదు… సొల్లుకు ఛాన్స్‌ లేదు… లిఫ్ట్‌ లేదు… వానకు షిప్టు లేదు… చెప్పుకోలేని బాధ… డ్రైనేజిలన్నీ ఎగదన్ని టాయిలెట్లు కంపు కొడుతున్నాయి… ఇంట్లో ఉండలేరు, బయటికి పోలేరు… తోటకూర కాడల్లా వాడిపోయి సోఫాల్లో వాలిపోయి యమ యాతన పడుతున్నారు. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
”ఖర్మ చాలక ఈ కాలనీలో వచ్చిపడ్డాం…” అని మొట్టమొదటి సారిగా తమను తాము తిట్టుకుంటూండగా…
ఎట్టకేలకు… మిట్ట మధ్యాహ్నానికి .. కాస్త తెరిపి ఇచ్చింది.
మహానగరంలో నడిరోడ్డున మొద్దు నిద్దర పోయే ‘నిర్దయ’ మాగన్నుగా కన్ను తెరిచింది. అప్పుడెప్పుడో చెన్నైలో తంబీలు చూపిన ఔదార్యం గుర్తొచ్చి మానవత్వం విరబూయగా మేము సైతం అంటూ ఎక్కడెక్కడి కాలనీలవాళ్లో ముందుకీ వెనక్కీ ఊగి చివరికి అక్కడికొచ్చారు. మంచినీళ్ల పాకెట్లు, పాల పాకెట్లు, బిస్కెట్‌ పాకెట్లతోపాటు టీవీ కెమెరా వాళ్ళతో.
వచ్చిన వాళ్లు మోకాళ్ల లోతు నీళ్ళల్లో ఈదుకుంటూ బాల్కనీలో నించున్న వాళ్ళమీదకు పాకెట్లూ విసురుతున్నారు.
అదుగో అలా ఈదుకుంటూ వచ్చిన సుందరం ఫస్ట్‌ఫ్లోర్‌ బాల్కనీలో నిలబడి ముందుకు వంగి అందుకోలేకపోతున్న పాతికేళ్ల అందమైన అమ్మాయికోసం నాలుగు పాకెట్లు విసిరాడు. నీళ్లల్లో పడిపోయాయి.
”అలాక్కాదు… ఓ ప్లాస్టిక్‌ బుట్టకు తాడు కట్టి కిందకు వదలండి..” అన్నాడు.
”బుట్టల్లేవు, తట్టల్లేవు, తాళ్లులేవు, పేళ్ళు లేవు” అన్నదామె.
ఈసారి పాలపాకెట్‌ బలంకొద్దీ విసిరాడు. గోడకు కొట్టుకొని కిందపడి పాలన్నీ బాల్కనీ పాలైనయి.
”ఉండండి…” అంటూ వెనక్కి వెళ్ళి అయిదు నిముషాల తర్వాత ప్యాంటు జేబుల్లో మంచినీళ్ళ పాకెట్లు, టక్‌ చేసి చొక్కాలో పాల పాకెట్లతో వచ్చాడు.
ఆమె బాల్కనీలోనే ఉంది.
కాంపౌండు వాల్‌ ఎక్కాడు. దాని ప్రక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ దిమ్మ మీదకు, ట్రాన్స్‌ఫార్మర్‌ మీదకు, పిట్టగోడమీదకు ఎక్కి, బాల్కనీలోకి దూకాడు.
ప్యాంటు జేబులోనుంచి మంచినీళ్ళు, టక్‌ చేసిన షర్టులోంచి పాల ప్యాకెట్లు తీసి ఆమెకు ఇచ్చాడు.
”థాంక్సండీ… నిజంగా మీరు జగదేకవీరుడనిపించారు…” అన్నదామె మెచ్చుకోలుగా.
”భలేవారే.. మీరింత కష్టపడుతూంటే చూస్తూ ఊరుకుంటామా? మీరేమీ అడవిలో లేరు, స్మార్ట్‌ సిటీలో ఉన్నారు. ఇలాంటప్పుడు సాయం చేయకపోతే ఎందుకండీ ఎదవ బతుకు… పరోపకారార్థం ఎదవ శరీరం అన్నారు గదా… వస్తా .. ” అని వెనుతిరిగాడు.
”ఉండండి.. పాలు తెచ్చారుకదా.. కాఫీ పెట్టిస్తాను…తాగి వెళ్దురుగానీ.. లోపలికి రండి..” అని అపార్ట్‌మెంట్‌లోకి దారి తీసింది.
సుందరం షర్టు జేబులోంచి సెల్‌ఫోన్‌ తీసి చూసుకుంటూ లోపలికి వెళ్ళాడు.
ఆమె కాఫీ పెట్టిచ్చే లోపల మళ్ళీ వర్షం మొదలైంది. సాయం చేయడానికి వచ్చినవాళ్ళంతా గబగబా ఈదుకుంటూ వెళ్ళిపోయారు.
మళ్లీ దడ.. దడ…దడ మని చినుకులు. చూస్తుండగానే కుంభవృష్టిగా మారింది.
”మళ్లీ మొదలైంది..” అన్నదామె కాఫీ ఇస్తూ…
”మరో మూడు రోజులు ఇలాగే ఉంటుంది..” అన్నాడు కప్పు అందుకుంటూ…
”అవునా… చచ్చాం… కరెంటు లేదు.. రాత్రంతా జాగారం…”
”మెయిన్‌ రోడ్డు మీద పెద్ద చెట్టు విరిగి పోల్‌ మీద పడింది. అది వంగిపోయింది. కరెంటు తీగలు తెగిపోయాయి..”
”మరి ఎప్పటికొస్తుంది…”
”వానలు తగ్గాలి కదా.. కనీసం నాలుగు రోజులు పైనే..”
”ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌లో వాటర్‌ కూడా అయిపోయింది. కొద్దిగా టబ్‌లో దాచుకున్నాను.. స్నానం కూడా చెయ్యలేదు…”
”మరి నే వెళతాను”
”ఎలా వెళ్తారు?.. ఇంత వానలో.. జారి పడిపోతారు..”
”మెట్ల మీదినుంచి..”
”సెల్లార్‌లోనుంచి వెళ్ళాలి.. అక్కడ పీకల్లోతు నీళ్ళున్నాయి… డ్రైనేజి నీళ్ళు.. కంపు…”
ఇద్దరూ గుమ్మం దగ్గర నిలబడి చూస్తున్నారు.
”దంచి కొడుతోంది..” అన్నాడు.
”నిలబడి కురుస్తోంది..”
”కూర్చుని కూడా కురుస్తుందా?..” అని అడిగాడు.
ఆమె నవ్వింది..
”మీ పేరు?…”
”నా పేరు సుందరమండీ… అమీర్‌ పేటలో సర్వీసింగ్‌ సెంటర్‌ పెట్టాను. డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌లు రిపేర్‌ చేస్తుంటాను..”
”బాగానే ఉందా బిజినెస్‌?”
”నా కింద ఇద్దరు పనిచేస్తున్నారు… ”
”ఇంకేం బాగానే సంపాదిస్తున్నారన్నమాట…”
”సంపాదించాల్సింది డబ్బు ఒక్కటే కాదండీ.. ఇంకా చాలా వున్నాయి.. రోజూ ఒక చిన్న ప్రశంస.. ఒక చిన్న మెచ్చుకోలు… మన చేత ఎంత కష్టమైన పనిని అయినా చేయిస్తుంది…”
”అందుకు అవకాశాలు కూడా కలిసి రావాలి.” అన్నదామె.
”దేశానికి సరిహద్దులుండొచ్చు.. మనిషి చేసే పనులకు హద్దులుండొచ్చు… కానీ ఆలోచించగల మనసుకు హద్దులుండవు.. ప్రతి ఉదయం సూర్యుడు మనకోసం ఎన్నో అవకాశాలు మోసుకొస్తూనే ఉంటాడు…”
”మీరేం చదువుకున్నారు?..”
”ఉండటానికో బి.టెక్‌ డిగ్రీ ఉంది.. చదువంటే ఏది ఎలా చెయ్యాలో చెప్పేది మాత్రమే కాదు.. ఎప్పుడెలా మసలుకోవాలో నేర్పేది కూడా అయివుండాలి చదువు…” అన్నాడు.
ఆమె నవ్వింది…
”ఇంక వెళతాను.. చీకటి పడితే మరీ కష్టం” అన్నాడు.
”ఎలా వెళతారు.. అలా…”
”నిలబడి కురుస్తుంటేనూ…” అని నవ్వాడు.
ఆమె కూడా నవ్వింది..
”కరెంట్‌ లేదు కదా.. చీకటి పడేలోపు అన్నం వండేస్తాను..” అంటూ ఆమె వంటింట్లోకి వెళ్ళింది.
సుందరం చుట్టూ చూస్తూ కూర్చున్నాడు. సోఫాలో చాలా నోట్‌బుక్స్‌ ఉన్నాయి.
”మీరేం చేస్తుంటారు?”
”నా పేరు సుజాత… స్కూల్‌ టీచర్‌గా పనిచేస్తున్నాను… ఇదిగో ఈ గాడిద చాకిరీ తప్పట్లేదు…” అన్నది నోట్‌బుక్స్‌ చూపిస్తూ…
”మీరొక్కరే ఉంటున్నారా?…”
”మా పేరెంట్స్‌ వైజాగ్‌ వెళ్ళారు…”
”మీరూ వెళ్లి ఉండాల్సింది.. ఈ బాధ తప్పేది..”
”నా పెళ్లి సంబంధం సెటిల్‌ చేయటానికి వెళ్ళారు..” అన్నది సుజాత.
ఆ మాట చెప్పటంలో ఆమె ఆంతర్యం వేరు.. తను ఒంటరిగా ఉంది. ఒకవేళ అతనికేదైనా దుర్భుద్ధి పుట్టినా పెళ్ళి కాబోతున్న అమ్మాయి కనుక సెంటిమెంట్‌ అడ్డుపడ్తుంది కదా అని.. చిన్న అబద్ధం.. చిన్న గరికపోచ ఇద్దరి మధ్యా అడ్డువేసింది.. అశోక వనంలో సీతమ్మవారిని గుర్తు తెచ్చుకొని…
”కంగ్రాచ్యులేషన్స్‌.. మీ కాబోయేవారేం చేస్తుంటారు?”
” పెళ్లికి పిలుస్తాన్లెండి… ఆయన్ని పరిచయం చేస్తాను..” అన్నది.
కబుర్లతో రెండు గంటలు గడిచిపోయాయి. రాత్రి తొమ్మిదైంది.
”భోజనాలు చేద్దాం..” అని లేచింది సుజాత.
సుందరం సెల్‌ఫోన్‌ ఆమెకు ఇచ్చాడు. ఆ వెలుగులో రెండు కంచాల్లో అన్నం వడ్డించి తెచ్చింది.
” ఏమనుకోకండి.. పచ్చడి మెతుకులు..” అన్నది కంచం అందిస్తూ.
”జగమంతా చిత్తడి చిత్తడిగానున్న ఈ కటిక చీకటి వేళ కడుపారగ తినగా దొరికిన పచ్చడి మెతుకులు పరమాన్నము కన్న మిన్న కదా పరమేశా!” అన్నాడు కలుపుకుంటూ…
”చీకట్లో దొంగల్లా తింటున్నాం..” అన్నది.
”దొంగల్లా తినటం అంటే…ఒకటి గుర్తొస్తోంది.. చెప్పనా..”
” తింటూ చెప్పండి.. నోరు ద్విపాత్రాభినయం చేస్తుంది..”
” రతన్‌ టాటా తన కంపెనీ మీటింగ్‌ స్విట్జర్‌లాండ్‌లో పెట్టుకున్నాడు. ఇక్కడ్నించి పాతిక మంది దాకా వెళ్ళారు. ఒక హోటల్‌లో డిన్నర్‌ చేస్తున్నారు… పార్టీ ఎంజాయ్‌ చేయాలని బోల్డన్ని ఐటెమ్స్‌ ఆర్డరిచ్చారు. సగం తినేసి సగం వదిలేశారు.. కొంచెం దూరంలో ఒక ముసలి జంట కూర్చొని ఒకే ఐటం తెప్పించుకొని చెరి సగం పంచుకుని తిన్నారు. వాళ్ళు ఇంత ఫుడ్‌ వేస్ట్‌ చేయటం చూసి భరించలేకపోయారు… వీళ్ళ దగ్గరికి వచ్చి అడిగారు.. బిల్లు పే చేస్తున్నాం కదా.. అన్నారు. అందుకు వాళ్ళేమన్నారంటే.. ఆహారం దేశ సంపద.. దాన్ని వేస్ట్‌ చేయడం దొంగిలించడం కన్నా హీనమైంది… అని చెప్పారట. అప్పుడు రతన్‌ టాటా ఒక పాఠం నేర్చుకున్నాడట…”
”మీరు మాత్రం పారెయ్యరు లేండి.. కొంచెమే పెట్టాను..”
”అన్నదాతా సుఖీభవ..” అన్నాడు సుందరం.
”ఏం సుఖీభవో.. చీకట్లో.. ఆ మూల వాష్‌ బేసినుంది… కంచం అక్కడ పెట్టేయండి..”
మరో గంట కబుర్లతో కాలక్షేపం అయింది.
”నిన్న చీకట్లో ఒకందుకు భయం వేసింది… ఇప్పుడు ఇంకొకందుకు భయం వేస్తోంది..”
”నాకు అర్థమైంది.. మీ మీద మీకు నమ్మకముంది.. నా మీద నాకు నమ్మకముంది…”
”ఇద్దరం కలిసి ఉన్నందుకే భయం…”
”నేనొకటి చెప్పనా? డ్యూటీ వేరు, బ్యూటీ వేరు.. డ్యూటీ ఈజ్‌ వర్షిప్‌.. మా కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ తరపున సేవ చేయటానికి వచ్చాం… నేను ఇదొక డ్యూటీగా భావించి వచ్చాను.. నాకే కాదు.. మా కాలనీకి చెడ్డపేరు రాకూడదు… మీరు నిశ్చింతగా నిద్రపోండి.” అని లేచి నిలబడ్డాడు.
” ఆ రూంలో మీరు పడుకోవచ్చు.. గోడ పట్టుకొని పాకుతూ వెళితే బాత్‌రూం తలుపు తగులుతుంది”
”వాన ఇంకా నిలబడే కురుస్తోంది..”
”అది నిలబడితే నిలబడింది లెండి.. మీరు పడుకోండి..” అన్నది సుజాత.
అతను రూంలోకి వెళ్లబోతుండగా చేతికి ఏదో తగిలి కిందపడింది. దభేల్‌ మని శబ్దం అయింది.
”అయ్యో.. ఈ దుష్ట ధృతరాష్ట్రుడేదో చేసినట్లున్నాడు” అన్నాడు..
”వయొలిన్‌ కిందపడినట్లుంది.. ఫర్లేదు లెండి.. మీరా విధంగా ముందుకెళ్ళండి..”
”తెల్లారేలోపు ఇంకెంత విధ్వంసం జరుగుతుందో… అజ్ఞానాంధకారంలో కన్నుగానక చేసిన వాటిని మీరు క్షమించాలి…” అన్నాడు.
”కేవలం కన్నుగానక అయితే ఫర్వాలేదు.. కన్ను మిన్నుగానక ఏం చేయకండి..”
”ఔనండీ.. మనం కాసేపటికే ఇలా బాధపడుతున్నాం… నిజంగా చూపు లేనివాళ్ళు ఎంత బాధపడతారో కదా..” అని అన్నాడు.
”వాళ్ల గురించి రేపు బాధపడుదురుగానీ… ఇవాళ్టికి ఆ విధంగా ముందుకెళ్లండి..” అన్నది.
కాలమూ ఆగదు, దాని వేగమూ మారదు..
తెల్లారింది…
సుందరం లేచేటప్పటికి సుజాత కాఫీ పెడుతోంది..
”మీ పుణ్యమా అని కాఫీ తాగుతున్నాను..”
”మీ పుణ్యమా అని నేనూ తాగుతున్నాను… రాత్రి దేన్నో తన్నేసినట్లున్నాను..”
” వయొలిన్‌.. తీగ తెగింది… అసలది అమ్మేయాలనుకుంటున్నాను..”
”వద్దండీ నేను బాగు చేయిస్తాను.. నా పనే రిపేర్లు చేయటం…”
సుందరం తమ కాలనీ అసోసియేషన్‌ వాళ్ళకి ఫోన్‌ చేశాడు…
”ఆ కాలనీలో మిలట్రీ దిగింది..” అన్నాడు కాలనీ ప్రెసిడెంట్‌.
”దేనికి సార్‌ మిలట్రీ…వానదేవుడి మీద యుద్ధం చేస్తారా… మాకో నిచ్చెన కావాలి తెప్పించండి..” అని అడిగాడు సుందరం.
మధ్యాహ్నానికి నిచ్చెన వచ్చింది. ఎంతో కష్టం మీద సుజాత నిచ్చెన మీదనుంచి కిందికి దిగింది.
సుందరం ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు.
సుందరం తల్లి అన్నపూర్ణ ఆమెకు ఆహ్వానం పలికింది.
”రోజూ టీవీల్లో పేపర్లల్లో చూస్తున్నాం.. మీ కాలనీవాళ్లెలా ఉంటున్నారా అని అనుకుంటున్నాం… మా ఇంట్లో నీ ఇష్టం వచ్చినన్ని రోజులు ఉండవచ్చు…” అన్నది అన్నపూర్ణ.
”మీ ముఖంలో ఎంతో ప్రశాంతత… మిమ్మల్ని చూస్తుంటే ఎం.ఎస్‌. సుబ్బలక్ష్మిగారు గుర్తొస్తున్నారు..” అన్నది సుజాత.
”నేనెక్కడ.. ఆ మహాతల్లి ఎక్కడ..” అన్నది అన్నపూర్ణ.
సుజాత రెండు రోజుల్లోనే ఆ ఇంట్లో మనిషిలా కలిసిపోయింది. అన్నపూర్ణకు చేదోడు వాదోడు అయింది.
సుందరం వయొలిన్‌ బాగు చేయించి తీసుకు వచ్చాడు.
కాసేపు వాయించి చూసి ‘థ్యాంక్స్‌’ అన్నది.
”ఎంత పాడైపోయినదైనా తెగిన తీగలు బిగించి శృతి చేసుకుంటే అద్భుతంగా పలుకుతుంది… జీవితం కూడా…”
”నేను ఒక తప్పు చేశాను.. మీరు మన్నించాలి” అన్నది సుజాత.
”తప్పులు చేయుట మా వంతు.. మన్నించుటయే మీ వంతు.. అని పాడుతున్నారు కదా…”
”మొన్న అబద్ధం చెప్పాను. మా వాళ్ళు నాకు పెళ్ళి సంబంధం చూడటానికి వెళ్లారని..”
”అది అబద్ధమని నాకు తెలుసు..”
”ఎలా తెలుసు?”
”నిజంగా అన్నీ కుదిరి పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి నోసు, ఫేసు తెలియని వాడితో అంత సేపు అన్ని విషయాలు మాట్లాడదు..”
”నా గురించి కొంచెం చెప్పాలి..”
”చెప్పు”
”మా అమ్మ చనిపోయింది… మా నాన్న మళ్లీ పెళ్లి చేసుకున్నాడు.. వాళ్లిద్దరి మధ్యా పదేళ్ల వయసు తేడా ఉంది.. మా సవతి తల్లికి నేనంటే అంతులేని అసూయ.. కూర్చుంటే తప్పు.. నుంచుంటే తప్పు.. నవ్వితే తప్పు.. నవ్వకపోతే తప్పు… మానసికంగా
కృంగదీస్తోంది. నరకం అనుభవిస్తున్నాను.. మా నాన్న ఆ అపార్ట్‌మెంట్‌ నాకు రాసిస్తాడేమోనని ఆమె భయం..”
”అయితే నేనేం చెయ్యాలి?”
”ఈ సన్నివేశాన్ని కొంచెం రిపేర్‌ చేయాలి.. లవణాబ్ధి లంఖించు పవనాత్మజున కొక పిల్ల కాలువ పూని గెంతు టెంత..? ఇది మీకొక లెఖ్ఖ కాదు..”
”మా ఇంట్లో ఉండడం మీ కిష్టమేనా?”
”అది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను…”
నాలుగు రోజుల తర్వాత సుజాత తల్లిదండ్రులు హైదరాబాద్‌ వచ్చారు. సుజాత వాళ్లింటికి వెళ్లిపోయింది.
నెలరోజుల తర్వాత అన్నపూర్ణ వెళ్లి సుజాతను తన కొడుక్కు ఇవ్వమని అడిగింది.
”పాత గొడుగులు, తాళాలు రిపేరు చేసుకునేవాడికి పిల్లనిచ్చి దాని గొంతు కోయలేం” అన్నది సత్యభామ…
”అంతే.. అంతే..” అన్నాడు రామారావు.
ఓ రోజు సుజాత సుందరం ఇంటికి వెళ్ళిపోయింది వయొలిన్‌తో..
అన్నపూర్ణ ఉన్నంతలో లోటు లేకుండా పెళ్లి జరిపించింది.
ఏడాదికల్లా సుజాతకి కొడుకు పుట్టాడు. కొడుక్కి కన్నకుడి వైద్యనాథన్‌ రామస్వామి శాస్త్రి అని పేరు పెట్టుకుంది.
—-
పదిహేనేళ్ళు గడిచాయి. వైద్యనాథన్‌ వయొలిన్‌ వాయించడంలో ఆరితేరిపోయాడు. పెద్ద పెద్ద వాళ్ళకు పక్క వాయిద్యాలు వాయిస్తున్నాడు. సోలో వయొలిన్‌ కచేరీలు చేస్తున్నాడు.
వాడి చేతిలో ఏం మహత్యముందో కానీ, వాడు వాయించని రాగం లేదు, పలికించని గమకం లేదు.. వాయిద్యం మీద చేతివేళ్లు ఆటాడుకుంటుంటే స్వరం అగరొత్తుల పొగలా అందమైన మెలికలు తిరిగి పోతుంది.
కీర్తనలు వాయిస్తుంటే నాగస్వరానికి పాము పడగ విప్పి తలాడించినట్లు అంతా మంత్ర ముగ్ధులైపోవలసిందే!
గణపతి ఉత్సవాల్లో వాడికి తీరిక లేదు. రోజుకొక కాలనీకి వెళ్ళి అక్కడి వాళ్ళని సమ్మోహన పరుస్తున్నాడు.
ఒకరోజు తల్లితో అన్నాడు.
”అమ్మా ఇవాళ నిజాం పేట దగ్గర ఏదో కాలనీ వాళ్ళుపిలిస్తే వెళ్లాను. కచేరీ అయ్యాక ఒక ముసలి దంపతులు నా దగ్గరకు వచ్చారు. ఆమె పేరు సత్యభామట. ‘దగ్గర్లోనే ఉంది.. రా.. రా.. మా ఇంటిదాకా..’ అని పిలిచింది. వైద్యనాథన్‌ అంటే నేను అరవవాడిననుకుంది. నేను తెలుగు వాడినేనని చెప్పాను..”
”వాళ్లింటికి వెళ్లావా?”
”లేదు.. ఎందుకో వెళ్ళాలనిపించలేదు… ఎందుకమ్మా ఏడుస్తున్నావు?..” అని అడిగాడు వైద్యనాథన్‌.
”ఏం లేదురా కంట్లో ఏదో పడింది…” అన్నది సుజాత తల తిప్పుకుని కన్నీళ్ళు తుడుచుకుంటూ…

*********************

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *