April 28, 2024

“పురుష” పద్యములు

రచన: – జెజ్జాల కృష్ణ మోహన రావు

 

సామాన్యముగా పద్యములకు పేరులు పూలపేరులుగా లేక స్త్రీల పేరులుగా ఉంటాయి. పురుషుల పేరులతో లేక పుంలింగముతో ఉండే పేరులుగల పద్యములను సేకరించి వాటికి ఉదాహరణములను ఇచ్చినాను. ఇందులో మొదటి రెండు పద్యములు, చివరి పద్యము ప్రత్యేకముగా పురుషులపైన వ్రాసినవి. మిగిలిన వాటికి నాకు తోచిన విధముగా ఉదాహరణములను ఇచ్చినాను. అందఱు ఈ నా ప్రయత్నమును ఆదరిస్తారని ఆశిస్తున్నాను. నక్షత్రపు గుర్తుతో (*) చూపబడిన వృత్తములు నా కల్పనలు.

 

*మానవ – మ/మ/న/లగ UU UU U – UI IIIU

11 త్రిష్టుప్పు 961

 

మానమ్మే నాదౌ – మానవుఁడను నేన్

గానమ్మే నాదౌ – కావ్య రవము నేన్

ఆనందాంభోధిన్ – హర్షమణియు నేన్

నేనే యీ ధాత్రిన్ – నిత్యమగు నిధిన్

 

ప్రాసయతితో హరనర్తనము – ర/స/జ/జ/భ/ర UI UII UI UII – UI UII UIU

18 ధృతి 93019

 

తల్లి దండ్రుల కొక్క సూనుఁడఁ – జెల్లె లందఱి యన్న నే

నల్ల నక్కల కూర్మి తమ్ముఁడఁ – గల్ల లాడని స్నేహితుం

డుల్ల మిచ్చిన భర్త భార్యకు – నిల్లు గాచెడు గేస్తు రం-

జిల్లు బిడ్డల మాల్మి తండ్రిని – బల్లిదుండగు జీవుఁడన్

 

సుధీ – ర UIU

3 మధ్య 3

 

దేశమే

వాసమౌ

రోసమే

నాశమౌ

 

మదన – స IIU

3 మధ్య 4

 

మదనా

ముదమే

యుదయ

మ్మెదలో

 

మృగేంద్ర – జ IUI

3 మధ్య 6

 

జగాన

మగండు

మృగేంద్ర-

ము గాదె

 

సుమతి – స/గ IIUU

4 ప్రతిష్ఠ 4

 

కుమతీ పో

సుమతీ రా

అమలమ్మౌ

నమనమ్ముల్

 

శర్మ – భ/లగ – UIIIU

5 సుప్రతిష్ఠ 15

 

శర్మ యొకటే

వర్మ యొకటే

కర్మమునకున్

ధర్మమునకున్

 

శేషరాజ – మ/మ UUU UUU

6 గాయత్రి 1

 

నీవేగా భూషమ్ముల్

నీవేగా నా పాన్పుల్

నీవేగా పాశమ్ముల్

నీవేగా శేషేంద్రా

 

కుమారలలితా – జ/స/గ IUI IIUU

7 ఉష్ణిక్కు 30

 

కుమారలలితా నీ

సమాన మెవరిందున్

నమస్సు లివిగో నా

సుమాంజలులు నీకే

 

నాగరక – భ/ర/లగ UII UIUIU

8 అనుష్టుప్పు 87

 

రాగములందు నీవెగా

భోగములన్ని నీకెగా

నాగరకుండు నీవెగా

వేగముగాఁ గనంగ రా

 

మాణవక – భ/త/లగ – UIIU UIIU

8 అనుష్టుప్పు 103

 

కన్నులతోఁ బల్కుచు రా

వెన్నెలలోఁ గుల్కుచు రా

కన్నియ నా డెందములోఁ

దిన్నఁగ రా దీయఁగ రా

 

బంధు – భ/భ/భ/గగ UII UII – UII UU

11 త్రిష్టుప్పు 439

 

బంధువు భక్తుని – పాలిట నీవే

చందుఁడు సూర్యుఁడు – చాయయు నీవే

సుందర రూపపు – సోయగ మీవే

నందకిశోరుఁడ – నాకెల నీవే

(దోధకమునకు బంధు అని మఱొక పేరు)

 

దమనక – న/న/న/లగ III III – III IU

11 త్రిష్టుప్పు 1024

 

కనఁగ సఖుని – గరటకునిన్

దనరె మదిని – దమనకుఁడున్

జనిరి యొరుల – క్షయమునకై

హనన మయెను – హతుఁ డొకడున్

(మిత్రభేదములో కరటక దమనకులు రెండు నక్కల పేరులు)

 

పుండరీక – మ/భ/ర/య UUU UII – UIUI UU

12 జగతి 689

 

నీదృక్కుల్ జాలును – నీరజాక్ష హారీ

నాదమ్ముల్ నిండెను – నాకు నిన్ను జూడన్

నాదేహ మ్మాడెను – నర్తనమ్ము నీకై

మోదమ్మై డెందము – పుండరీకమయ్యెన్

 

లక్ష్మీధర – ర/ర/ర/ర UIU UIU – UIU UIU

12 జగతి 1171

 

రమ్ము లక్ష్మీధరా – రత్నమాలాధరా

సొమ్ము నీవేగదా – సుందరాగ్రేసరా

చిమ్ము పీయూషమున్ – చిన్మయా శ్రీధరా

నమ్మితిన్ నిన్ను నే – నవ్వులన్ జిల్కరా

(స్రగ్విణికి మఱొక పేరు లక్ష్మీధరా)

 

మత్తమయూరము – మ/త/య/స/గ  UUU UUII – UUII UU

13 అతిజగతి 1633

 

నిండయ్యెన్ నింగిన్ శశి – నేఁడీ నిశి గాంచన్

నిండయ్యెన్ డెంద మ్మిట – నిన్ గానఁగ నెంచన్

నిండయ్యెన్ భావమ్ములు – నిన్ దల్చుచు నుండన్

పండించెన్ గామమ్మును – బంచేషువు మెండై

 

తారక – స/స/స/స/గ IIU IIU – IIU IIUU

13 అతిజగతి 1756

 

ఒక తారక నీ – వొక తారక నేనే

యిఁక వెల్గులతో – నిల నింపఁగ రావా

వికసించునుగా – విరులై మన ప్రేమల్

ప్రకటించుదమా – ప్రణయోత్సవ లేఖల్

 

వసంత – న/న/త/త/గగ IIII IIU – UIU UIUU

14 శక్వరి 2368

 

అలరుచు వనిలో – నా వసంతుండు వచ్చెన్

కలకల పులుఁగుల్ – గమ్మఁగా వాని బిల్చెన్

తెలతెల వెలుఁగుల్ – దిక్కులన్ నిండియుండెన్

వలపుల నొసఁగన్ – వానితోఁ గాముఁడుండెన్

 

సుందర – ర/న/భ/భ/ర UIU IIIU – IIUII UIU

15 అతిశక్వరి 11707

 

సుందరా వనములో – సుమరాశులఁ జూడరా

సుందరా మనసులో – సుధధారను నింపరా

సుందరా తలపులో – సురసమ్మును ముంచరా

సుందరా వలపులన్ – సుగ సంతస మీయరా

 

కాంత – న/య/న/య/స/గ IIIIU UIIII – UUII UU

16 అష్టి 13264

 

నవనవమౌ నృత్యములకు – నాదమ్ములు విచ్చెన్

భువనములే మోహనముగ – మోదమ్ముల మెచ్చెన్

కవనములే కాంతమువలె – గాఢమ్ముగ గ్రుచ్చెన్

యువతర మానందముగఁ బ్ర-యోగమ్ములఁ దెచ్చెన్

 

*హరిహర – ర/య/య/య/జ/గ UIUI UUI – UUI UUI UIU

16 అష్టి 21067

 

పిల్వనా హరా యంచుఁ – బ్రేమార్ద్ర రూపుండవౌ నినున్

దల్వఁగా హరించంగ – ధాత్రిన్ ఘనమ్మైన కష్టముల్

బిల్వనా హరీ యంచుఁ – బ్రీతిన్ మనోజ్ఞుండవౌ నినున్

దల్వఁగా దయన్ జూప – దారిన్ నవమ్మైన కాంతులన్

 

శ్రీధరా – మ/భ/న/త/త/గగ UUUU – IIIIIU – UIU UIUU

17 అత్యష్టి 18929

 

తారాపంక్తుల్ – తమపు నిశిలోఁ – దళ్కులన్ వెల్గు లిచ్చెన్

నీరేజాక్షా – నెనరు విరియన్ – స్నేహ దీపమ్ముతోడన్

రారా నాకై – రసికహృదయా – రాగముల్ రాజిలంగా

శ్రీరాగమ్మున్ – బ్రియతరముగా – శ్రీధరా పాడెదన్రా

(మందాక్రాంతము నాట్యశాస్త్రములో శ్రీధరా అని పిలువబడెను)

 

మాలాధర – న/స/జ/స/య/లగ III IIUI UIII – UIU UIU

17 అత్యష్టి 38752

 

అమలమగు మోము వెల్గులను – హాసమున్ జూపరా

కమల నయనాల కాంతులను – గాంతు నా యాశలన్

విమల హృదయమ్ము నీయదియు – ప్రేమమాలాధరా

రమణ నను జూడ మోదముగ – రమ్ము నా యింటికిన్

 

ఘనమయూరము – న/న/భ/స/ర/లగ IIIIII UII – IIU UIUIU

17 అత్యష్టి 42944

 

కనఁగ ఘనములేగద – గగనమ్మందు దట్టమై

కనఁగ ఘనమయూరము – కదలెన్ నృత్య మాడుచున్

వనము మురిసె నెల్లెడఁ – బడఁగా వాన చారలున్

మనము మురియు నెప్పుడు – మదనుండేయ బాణముల్

 

హరి – న/న/మ/ర/స/లగ IIII IIUU – UUI UII UIU

17 అత్యష్టి 46144

 

హరియన నెదలోనన్ – హర్షమ్ము గల్గెను గంతులన్

హరియన నిట డెంద – మ్మానంద మందెను చిందులన్

హరియన మదిలో స-ప్తాశ్వమ్ము లూఁగెను పర్వులన్

హరియన హృదిలోనన్ – హ్లాదమ్ము వెల్గెను దీపమై

(హరి = కోతి, విష్ణువు, గుఱ్ఱము, సూర్యుడు అనే అర్థములలో వాడబడినది)

 

శంభు – స/త/య/భ/మ/మ/గ IIUU UIIU UUII – UUU UUU U

19 అతిధృతి 3172

 

కొలువంగన్ విశ్వము నా పాదమ్ముల – గుండెల్ మ్రోయంగా నెత్తెన్

మలలందున్ సంద్రములన్ నాట్యమ్ముల – మంజీరమ్ముల్ ఘూర్ణిల్లెన్

విలసిల్లన్ బార్వతియున్ శంభుండును – బ్రేమాశ్లేషమ్మం దెప్డున్

జలియించెన్ సత్వరమై లోకమ్ములు – స్తంభించెన్ సర్వ మ్మప్డున్

 

చంద్రబింబ – మ/త/న/స/త/త/గ UUUUU – IIIIIIU – UUI UUI U

19 అతిధృతి 149473

 

ఆవేదింతున్ ని-న్ననవరతము నే – నాచంద్రబింబమ్ముగా

నీవేగాదా నా – నిఖిలము వెలుఁగన్ – నింగిన్ సహస్రాంశుఁడున్

నీవేగాదా నా – నిధులగు మణులున్ – నింగిన్ నిశాతారకల్

రావా నన్ జూడన్ – రసమయ హృదయా – రాజీవనేత్రా హరీ

 

నందక – భ/భ/భ/భ/ర/స/లగ UII UII UII UII – UI UII UIU

20 కృతి 372151

 

నందక పుత్రుని నవ్వులు పువ్వులు – నన్ను నాకము చేర్చుఁగా

నందక మీధర దుష్టుల నెల్లర – నాశమొందఁగఁ జేయుఁగా

నందకమౌ పలు దృశ్యము లెప్పుడు – నంద మందఱి కిచ్చుఁగా

నందకుమారుని మోహన గానము – నంద రూపము నిక్కమై

(నందక = నందుడు, సుదర్శన చక్రము, ఆనందదాయకము అనే అర్థములలో వాడబడినది)

 

నరేంద్ర – భ/ర/న/న/జ/జ/య UII UIU III – IIII UII UII UU

21 ప్రకృతి 450519

 

వాఁడె నరేంద్రు లందఱికి – వఱలుగ నింద్రునిగా ధరపైనన్

వాఁడె మనమ్ములందుఁగల – ప్రతియొక కోరికఁ దీర్చఁగ నెంచున్

వాఁడె ప్రపంచమందుఁగల – ప్రజలకు గమ్యపు మార్గము సూపున్

వాఁడె నిజమ్ముగా మనకు – వరముల నిచ్చుచు వంతలఁ బాపున్

 

త్రిభంగి – నల/నల – నల/నల – నల/భ/గగ – లల/గగ – భ/గగ

 

వరములఁ బడసిన

పురుషుఁడ జగమున

సరసము లాడెద రావా

కన రావా

సుందర భావా

 

హరుసము చెఱువగు

విరసము మఱుగగు

తరుణము వచ్చెను నాకై

యిది నీకై

పూవుల రేకై

 

విరియఁగఁ జెలువము

మురియఁగఁ బరువము

కరముల నిత్తును పాడన్

గొనియాడన్

నే నిను వీడన్

 

మఱువని క్షణములు

నిరతము ధనములు

వఱలుగ జీవనమందున్

భువియందున్

సౌఖ్యము సిందున్

 

వనమయూరము – భ/జ/స/న/గగ UIII UIII – UIII UU

14 శక్వరి 3823

 

మానవుఁడ భూమిపయి – మంచిగను నుందున్

దానవులఁ జంపెదను – ధర్మముగ నుందున్

దీనులను బ్రోచెదను – దేవుని స్మరింతున్

మానసముతోడ నొక – మానవుఁడ నౌదున్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *