May 9, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 11

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య.

balaji

రాగబంధాలు ఆత్మజ్ఞానానికి, మోక్షానికీ అడ్డంకులు. వస్తుభ్రమలకు, తాత్కాలిక సుఖాలకు బానిసలైన మానవులు రాగబంధాలతో మళ్ళీ అనేక పాపకార్యాలాచరిస్తూ..మళ్ళీ మళ్ళీ ఈ చక్రంలో పడి తిరుగుతునే ఉన్నారు. వాటిని వదలించుకోవాలని చూసేకొద్దీ మళ్ళీ అవే సంసార బంధాలు మాకు తగిలిస్తున్నావు ఎందుకు? అని అన్నమయ్య శ్రీవేంకటేశ్వరుని నారాయణా.. అని ఈ కీర్తనలో దీనంగా వేడుకుంటున్నాడు.

పల్లవి: నిగమనిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజ ధరుడ శ్రీనారాయణ ||నిగమ||

చ.1. దీపించు వైరాగ్యదివ్య సౌఖ్యంబియ్య
నోపకరా నన్ను నొడబరపుచు
పై పై నె సంసారబంధముల గట్టేవు
నాపలుకు చెల్లునా నారాయణా ||నిగమ||

చ.2. చికాకు పడిన నా చిత్త శాంతము సేయ
లేకకా నీవు బహులీలనన్ను
కాకుసేసెదవు బహుకర్మల బడువారు
నాకొలదివారలా నారాయణా ||నిగమ||

చ.3. వివిధ నిర్బంధముల వెడలద్రోయక నన్ను
భవసాగరముల దడ బడ జేతురా
దివిజేంద్రవంద్య శ్రీ తిరువేంకటాద్రీశ
నవనీత చోర శ్రీ నారాయణా ||నిగమ||
(ఆ.సం.1- 40వ రేకు. కీ.సం.243)
విశ్లేషణ:

పల్లవి: నిగమనిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజ ధరుడ శ్రీనారాయణ…
వేదాలలో..ఉపనిషత్తులలో నిత్యం విహరిస్తూ.. వాటిచే అతిగొప్పగా వర్ణించబడే స్వామీ! దివ్యసుందర రూపా!…శ్రీవేంకటేశ్వరా! గోవర్ధనగిరినే ధరించిన…శ్రీ నారాయణా..నా మొర ఆలకించరావయ్యా!

చ.1. దీపించు వైరాగ్యదివ్య సౌఖ్యంబియ్య
నోపకరా నన్ను నొడబరపుచు
పై పై నె సంసారబంధముల గట్టేవు
నాపలుకు చెల్లునా నారాయణా …

నాకు వైరాగ్యబిక్ష పెట్టి నన్ను కరుణించడంలేదు. దానికి బదులుగా నా తప్పులను ఎత్తి చూపుతూ వాటిని ఒప్పించడంతో బాటూ..నన్ను ఈ సంసార బంధంలో కట్టిపడేయాలని మళ్ళీ ఈ మాయా చక్రంలో బంధించాలనీ…చూస్తున్నావు. నా పలుకూ.. నామాట నీకు వినబడుతున్నాయా స్వామీ..నా మాట చెల్లుతుందా ఈవిషయంలో…అని దీనంగా ప్రార్ధిస్తున్నాడు.

చ.2. చికాకు పడిన నా చిత్త శాంతము సేయ
లేకకా నీవు బహులీలనన్ను
కాకుసేసెదవు బహుకర్మల బడువారు
నాకొలదివారలా నారాయణా….

చీకాకూ..బాధలతో గూడిన నా మనస్సుకు శాంతినివ్వకపోగా చిత్ర విచిత్రమైన పరీక్షలకు గురి చేస్తున్నావు. బహు కర్మములలో బడి తేలేవారికీ నాకు అసలు తేడా లేదా స్వామీ…మనసా..వాచా..కర్మణా నిన్నే నమ్ముకున్న నన్ను పరాయి వాడుగా భావించడం తగునా..స్వామీ చెప్పండి.

చ.3. వివిధ నిర్బంధముల వెడలద్రోయక నన్ను
భవసాగరముల దడ బడ జేతురా
దివిజేంద్రవంద్య శ్రీ తిరువేంకటాద్రీశ
నవనీత చోర శ్రీ నారాయణా…

పలురకాలుగా నన్ను ఈ సంసార మురికికూపంలో తోసినవాడివి చేయూత నిచ్చి పైకి తీయాలి కదా! ఇంకా ఈ భవ భయ సాగరంలో నేను కొట్టుమిట్టాడవలసిందేనా స్వామీ! దేవగణ పూజితా.. ఓ వెన్నదొంగా…శ్రీమన్నారాయణా…నన్ను ఈ కర్మ బంధమ్నుంచీ కాపాడి జన్మ రాహిత్యాన్ని ప్రసాదించు స్వామీ.. అని ఆర్తిగా ప్రార్ధిస్తూనే అనేక విధాల ప్రశ్నిస్తున్నాడు అన్నమయ్య.

ముఖ్యమైన అర్ధములు :
నిగమ నిగమాంతములు = వేదములు, ఉపనిషత్తులు; నగరాజ ధరుడు = గోవర్ధనగిరిని చిటికిన వేలిపై ధరించిన వాడు; దీపించు = ప్రకాశించు; ఓపక = సహించక; ఒడబరపుచు = ఒప్పించు; చెల్లునా = సాగునా?, అంగీకారయోగ్యమేనా?; కాకు = చికాకు, అణచు, తిరస్కరించు; కొలదివారు = తక్కువ వారు; దడబడ = తొందరపాటు; భవ = పుట్టుక సంబంధమైన, సంస్కృతంలో ఈ పదానికి పుట్టుక, ఉనికి మొదలైన అర్థాలు ఉన్నాయి. బహుశ: బౌద్ధ సంబంధమైన పదమై ఉండవచ్చు. పాళి భాషలో కామభవం, రూపభవం, అరూపభవం అని మూడు విధాలు గా ఉన్నాయి (చూడుము: పొత్తూరి వెంకటేశ్వరరావు నిఘంటువు); దివిజ+ఇంద్ర+వంద్య = దేవతలు, దేవేంద్రుడు మొదలైన వారిచే స్తుతింపఁదగినవాఁడు; నమస్కరింపఁదగినవాఁడు; నవనీత చోర = వెన్నను దొంగిలించిన వాడు (ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *